రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:ఉదయ రవి చంద్రిక
ఎక్కడిదా వైభోగం ఏడు కొండలరాయ
మాయమ్మ శ్రీ రాగాన నీ ఎడదను తాను వెలయ
అలవికానిదీ నీ వైభవం అచ్యుతానందమయ
తిరుచానూరున పద్మావతిని ప్రతిరేయీ నువు కలయ
గోవింద గోవింద హరే ముకుంద మురారి మాధవ పరమానంద
1.కాంతుల కాంచన శిఖరం కాంచిన నయనానందకరం
బంగారు వాకిళ్ళ నీ మందిరం భావించినను ప్రియకరం
జగన్మోహనకరమైన నీ దివ్య దర్శనం జన్మసాఫల్యకరం
పరమపావన నీ పదతీర్థ సేవనం సర్వదా ఆరోగ్యకరం
గోవింద గోవింద హరే ముకుంద మురారి మాధవ పరమానంద
2.తల నీలాలొసగినంతనే తొలగును మా తల బిరుసు
కోనేటిలొ మే మునిగినంతనే కరుగును మాలో దురుసు
లడ్డూప్రసాద మహిమను గూర్చి ఎందరికని ఇల తెలుసు
ఇడుములనడ్డెడి ఆపద్బాంధవ ఎన్నలేనిదే నీదొడ్డ మనసు
గోవింద గోవింద హరే ముకుంద మురారి మాధవ పరమానంద
No comments:
Post a Comment