Sunday, June 19, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భీంపలాస్


ఎంతకూ తీరకుంది నా దాహం గంగాధరా

ఏమిటో ఆరకుంది నా మోహం చంద్రశేఖరా

నా గళముకు నిగళమేల గరళకంధరా

నా కలముకు తపనలేల శూలధరా

వర్షించరా నీ దయ సహృదయా 

నమఃశివాయ ఓం నమఃశివాయ


1.వారాశిగా భావాలనే తలపోసితి

రాశిగా నే కవితలెన్నో వ్రాసి పోసితి

చిత్తశుద్ధిగా శివా నీ పూజనే చేసితి

ఆత్మతృప్తి లేకనే భవా అల్లలాడితి

మెప్పించలేకపాయే నా కావ్యాలు సాహిత్య కారులను

కదిలించ లేకపాయె నా గేయాలు సామాన్య శ్రోతలను

వర్షించరా నీ దయ సహృదయా 

నమఃశివాయ ఓం నమఃశివాయ


2.మార్ధవాన్ని గాత్రంలో కూర్చవైతివి

సంగీతాన్ని శాస్త్రంగా  నేర్పవైతివి

ఊటలాగ కఫమెంతో ఊరజేస్తివి

కంఠనాళాలనే కపర్దీ కరకుజేస్తివి

గొంతు జీరబోవునాయే ఎలుగెత్తి పాడితే

తాళమెచటొ తప్పునాయే ఊపుగా ఊగితే

వర్షించరా నీ దయ సహృదయా 

నమఃశివాయ ఓం నమఃశివాయ

No comments: