Saturday, September 28, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సాకి:ప్రపంచాధినేతైనా నీకడ తల వంచాల్సిందే
తలకట్టున్నోళ్ళంతా నీమాట వినాల్సిందే

పల్లవి:మెత్తగా వాడుతావు కత్తిని సైతం
శిల్పిలా చెక్కుతావు జుత్తును మొత్తం
వికృతమౌ వికాసాన్ని సంస్కరిస్తావు
నిబిడీకృత అందాలు వెలికితీస్తావు
క్షరకర్మ కార్మికా విశ్వకర్మ రూపుడవు
అవిశ్రాంత ఓర్మికా మయబ్రహ్మ వారసుడవు

1.వినియోగదారుల స్వాగతిస్తావు
ప్రేమమీర పలకరించి ఆసీనులజేస్తావు
జాప్యమున్నగానీ జారుకోనీయవు
కుశలోపరులడుగుతూ ఆకట్టుకుంటావు
నాయీ బ్రాహ్మణుడా నీపలుకే ఒకవేదం
శిరోజాలంకృతుడా మానవతే నీ వాదం

2.కర్మసిద్ధాంతాన్ని నిష్ఠగా నమ్ముతావు
వృత్తిమీద నిశితంగా దృష్టినిపెడతావు
ఖాతాదారు తృప్తిని కొలతగ భావిస్తావు
రాజుపేద ఎవరైనా సమతకు స్ఫూర్తినీవు
మంగళదాయకా నీకు వేనవందనాలు
శుభాశుభైక పాలకా నిత్యనీరాజనాలు

3.చీదరించు బొచ్చునైన ఆదరంగచూస్తావు
వెలిసిన సొగసులను పునరుద్ధరిస్తావు
మారణాయుధాలకైన మమతను నేర్పేవు
కేశాలదోషాలను పరిహరించివేస్తావు
బడుగువర్గ సోదరా భవ్యరీతి వర్ధిల్లు
నీవులేక బ్రతుకేదిర అనవరతము శోభిల్లు

No comments: