Saturday, November 28, 2020

 (నేడు క్షీరాబ్ధి ద్వాదశి-సందర్భంగా)


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మథించనీ నా మానస సాగరాన్ని

శోధించనీ నా అంతరంగ అగాధాన్ని

సచేతనాయోచన సురులొకవైపు

వికృతాలోచనాన్విత అసురులింకోవైపు

చిలుకనీ నా పలుకుల మురిపాలనీ

గాలించనీ నాచిత్తపు అంధకారాలనీ


1.అజ్ఞానమే ఘన మంధర పర్వతమై

సంకల్పమే తెగని వాసనల వాసుకియై

విచక్షణే ప్రణాళికల ఓరిమి కూర్మమై

గుణపాఠమే దిగమ్రింగు కాలకూటమై

చిలుకనీ నా పలుకుల మురిపాలనీ

గాలించనీ నాచిత్తపు అంధకారాలనీ


2.పథసూచిక కామధేనువేకాగా

ప్రేరణయే కల్పవృక్షమై అలరగా

శశి సిరి ప్రోద్బల ప్రోత్సాహకాలై వరలగా

ఫలితామృతమే సంతృప్తినీయగా

చిలుకనీ నా పలుకుల మురిపాలనీ

గాలించనీ నాచిత్తపు అంధకారాలనీ

No comments: