Wednesday, November 4, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


వివరించి చెప్పాలా -విరించినీ కన్నవాడికి

చాటింపు వేయాలా-జగముల జనకునికి

మన వెత తెలపాలా నన్ను నిన్ను -నిన్ను నిన్ను

కన్నతండ్రికి

మన కత చెప్పాలా అంతర్యామికి

సర్వాంతర్యామికి


1.మనకేల ఆరాటం మనుగడకోసం

నారుపోసిన దైవం నీరూ పోయడా

మనకెందుకు ఉబలాటం రేపటికోసం

విదియన లేనిశశి తదియన తా కనరాడా

సూర్యుని రథచక్రపు శీలకాదుగా మనం

మన వినా ఆగదెపుడు ఈ కాలగమనం

నిమిత్తమాత్రులం విచిత్ర ఆత్రులం 

జగన్నాటకానికి ప్రేక్షక పాత్రులం


2.నాతల్లి  నాఆలి  నాపిల్లల వికాసం

నాఇల్లు నాఆస్తి అనుకునే మన అయువు నిముసం

వేల సుఖాలనే పొందిన మన మానసం

ఒక్క దుఃఖానికే చేయనేల దైవదూషణం

పుట్టుకపోషణ కారణభూతమైన భగవంతుడు

ఎరుగడా అడుగడుగున మనను నడుపుడు

ఆశించుట మానినపుడు ఏదైనా స్వర్గం

 స్వీకరించి ఆచరించు దైవదత్తమే సర్వం

No comments: