రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
పోతపోసిన తెలుగు కవిత నీవు
హృద్యమైన తెలుగు వెలుగు పద్యమె నీవు
అమృత భాష అమ్మభాష తెనుగుకే సొంతము
అష్టావధానమై అలరించు నీ అందము
నీలోని అణువణువు ఒక ప్రబంధమే
నీ ప్రతి కదలిక సైతం అపురూప కావ్యమే
1.వసుచరిత్ర యే స్ఫురించు నీ వదనంలో
శృంగారనైషధాలు నీ కనుసదనంలో
యయాతి చరిత్రయే నీ నీలి కురులలో
స్వారోచిషమను సంభవాలు నీ మేనులో
నీలోని అణువణువు ఒక ప్రబంధమే
నీ ప్రతి కదలిక సైతం అపురూప కావ్యమే
2.పారిజాతాపహరణం నీ ముక్కు చక్కదనంలో
కళాపూర్ణోదమే నీ నొక్కుల చెక్కిళ్ళలో
రాజశేఖర చరిత్రమే నీ పలుకుల చతురతలో
ఆముక్తమాల్యదే నీ బాహుబంధనంలో
నీలోని అణువణువు ఒక ప్రబంధమే
నీ ప్రతి కదలిక సైతం అపురూప కావ్యమే
(మాతృభాషా దినోత్సవం సందర్భంగా)
No comments:
Post a Comment