రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ఏముని వాకిటనో తారాడే వనకన్యవో
రాముని పదతాడన వరమైన మునిపత్నివో
దేవతలకె మతిచలించు సౌందర్యవతి దమయంతివో
శృంగార రంగాన అంగాంగ ప్రేరకమౌ దేవత రతివో
కవులు నిన్ను పోల్చంగ చవులూరుదురే
లోకాన ఏ పోలిక నీతో సరితూగ బలాదూరే
1.చందమామలోని తునక శ్రీచందన తరువు ముక్క
సింధుభైరవి రాగ రసగుళిక సుధామాధురీ కలయిక
మయబ్రహ్మ హొయలెన్ని ఏర్చికూర్చెనో నీకు లతిక
విశ్వకర్మ అవయవాల మర్మమెంత పేర్చెనో గీతిక
కవులు నిన్ను పోల్చంగ చవులూరుదురే
లోకాన ఏ పోలిక నీతో సరితూగ బలాదూరే
2. చిలుక పలుకు పలుకులనే అందించిరి నీ నోటికి
హంసకున్న వయ్యారాన్ని అమరించిరి నీ కటికి
దృష్టి లాగు అయస్కాంతమతికించిరి నీ నాభికి
కనికట్టుతొ మత్తుచిమ్ము మైమ నిచ్చిరి నీ కంటికి
కవులు నిన్ను పోల్చంగ చవులూరుదురే
లోకాన ఏ పోలిక నీతో సరితూగ బలాదూరే
No comments:
Post a Comment