Tuesday, April 15, 2025

 నా కనుకొలుకుల పారేను గంగా యమునలు

నా హృదయమునందేలా తీరని ఈ తపనలు

అధిపత్య పోరులో నాపై నిప్పు నీరుల ఆగడాలు 

సతమతమై పోతున్నా తీర్చ లేక వైరుల జగడాలు


1.చిన్ననాడు ఒంటరిగా దిగులుతో కంట నీటిఊటలు 

ఉన్నవాడు అణగ ద్రొక్కితే ఎడదలో రేగెను పెనుమంటలు

సాటివారు చెలిమిపేర గేలిచేస్తే నయనాలాయే చెలమెలు

పోటీల్లో అన్యాయంగా నను ఓడిస్తే గుండెలో జ్వాలలు


2.తొలి ప్రేమలో నమ్మించీ చెలి నను వంచిస్తే అశ్రుధారలు

 నా... నోటి ముందరి ముద్దనూ కక్షగా లాగేస్తే అగ్ని జ్వాలలు

మారేనా ఈ జన్మకు నా బ్రతుకే...... నే చితిలో కాలే దాకా

అరేనో దుఃఖపు కీలలు ఆగేనో అలజడులు నే కడతేరాకా


 కఠిన పరీక్షనే..... నిరీక్షణ 

ప్రేమిస్తే ఇంతటి శిక్షనా...

అనురాగం పంచితే అది నేరమా 

హతవిధీ, నీ హృది మరీ క్రూరమా 


1.రేపంటూ మాపంటూ వాయిదాలు 

ప్రేమలేఖలు రాస్తుంటే ఎన్ని కాయిదాలు(కాగితాలు)

ఏడాదులే గడుస్తున్నా తీరదాయే చెలి ఎడబాటు 

అంతుపట్టకుంది ఎంతకూ ఏమిటో కలి గ్రహపాటు 


2.ఔనని అంటే చాలు అంతటితో కథ కంచికి

కాదని విదిలిస్తే ముగిసేను ఈ బ్రతుకిక కాటికి 

ఆటుపోటుల సయ్యాటలో కెరటాల ఆగని ఆ పోరాటం 

చేరుకునే తీరమవునో తీరలేని కోరికవునో నా ఆరాటం

Monday, April 14, 2025

 

https://youtu.be/EePsuhnjn68?si=oK8JHolOaJX4OcU5

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం: మోహన

వాస్తవికతను ప్రతిబింబిస్తుంది-గీతలోని షోడష యోగము
తృణీకృతమేదో తెలుపుతుంది-దైవాసుర సంపాద్విభాగము
యుగళమవు మనస్తత్వమే  జన్మతః నరులనైజమూ
ఉచితా నుచితము లెరిగి మసలితే ఉత్తమగతులకు బీజము

1.సాత్వికమైనవి దైవీ గుణములు-సాధించగలగాలి
రజస్తమో తత్వలే దుర్గుణములు -వదిలించు కోవాలి
ప్రక్షాళనకావించాలి మనసులోని పలు మలినాలను
దీక్షగా పాటించాలి శాస్త్ర సమ్మతమగు విషయాలను

2.కబళిస్తాయి అరిషడ్వర్గాలు అసురీగుణాల ఆకృతిగా
ఓడిస్తాయి పంచేద్రియాలు చిత్తము చెరచగ విస్మృతిగా
ఆధ్యాత్మిక చింతననే భగవత్ ప్రాప్తికి ఆధార భూతంగా
సత్ప్రవర్తనతో ఇహపర సౌఖ్యమందును ఆత్మ నిత్యంగా

Sunday, April 13, 2025

 https://youtu.be/Lf1QiVFPqBQ?si=SNxLwEwDvh0ssSaL


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఒక్కటైనా చక్కనైన కల గనవే నయనమా 

దిక్కులేని పక్షిలాగా ఎడారిలో పయనమా 

వాస్తవంలో కాస్తయినా సంతోషమే మరీచికనా 

స్వప్నాల స్వర్గమందైనా సుధల గ్రోల నోచనా 


1.ఊహలకూ ఉంటే ఎలా అకటా అవధులు 

కల్పనకూ కల్పిస్తావా కట్టడిచేస్తూ పరిధులు 

కన్నీటి కోసమేనా నాకంటూ కళ్ళంటూ ఉంటే గింటే 

నువ్వూ నిస్సహాయవే మిత్రమా నా నేత్రమా వేదనే వెంటాడుతుంటే 


2.రాతిరైనా చీకటైనా ఎందుకిలా అతలాకుతలం

రెప్పలైనా మూసుకొంటే కునుకుకైనా సానుకూలం 

నిదుర నేను పోతేనెకదా పీడకలలకైనా ఆలవాలం 

పగటి కలలు కనడానికైనా దాపురించదాయే కాలం

Friday, March 21, 2025

 https://youtu.be/exoBlLWMOro?si=mSyZxqyTSP_hZZGa


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:శంకరాభరణం


సర్వోత్కృష్టం పరమ ప్రత్యేకం 

పురుషోత్తమ ప్రాప్తియోగం 

జన్మల ముక్తియోగం పరమాత్మ సంప్రాప్తి యోగం 

అశ్వత్థ వృక్షము సోదాహరణగా భగవానుడు నుడివిన

ఆత్మ యోగం ఆత్మపరమాత్మల సంధానయోగం


1.తరువును తలపోయ తలక్రిందులుగా 

ఆత్మ జ్ఞాన మర్మము బోధపడునుగా

విషయ వాంఛల ఇంద్రియములే శాఖోప శాఖలుగా 

కొట్టుమిట్టాడును జీవి జనన మరణ ప్రక్రియ వలయంగా

కొట్టివేయాలి చెట్టు కొమ్మలని వైరాగ్యమే పరశువుగా 

మూలవేరును వెతకాలి అదియే పరమాత్మ రూపమనగా


2.దివ్యమైనదే జీవాత్మ ఐనా మాయకు లోబడి 

ఇంద్రియ వశమై, అరిషడ్వర్గపు బానిస కాబడి

క్షరమయే దేహమే తానని ఐహిక మైకములోబడి

విస్మరించును సర్వంతర్యామిని అజ్ఞాన తిమి బడి

సర్వస్య శరణాగతి కోరగ స్వామి పదములపైబడి

సాధించగా మనసా సుసాధ్యమే అక్షరమౌ పురుషోత్తమ ప్రాప్తి

Tuesday, March 18, 2025

 


https://youtu.be/Y8OJANxtD9Q?si=5m2GfidPhcSyeajL

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:ఖరహర ప్రియ

హరుడవు నీవు నరహరీ
భయ హరుడవు నీవు ధర్మపురిహరీ
భవభయ హరుడవు నీవు ధర్మపురి నరహరీ
శరణాగత వరదుడ వీవు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరహరీ

1.సారథి వీవు స్వామి నరకేసరీ
  రథ సారథివే నీవు దుష్ట సంహారీ
  పార్థ సారథివైనావు గీతాచార్యా శౌరీ
  నా మనోరథ సారథివీ నీవే ప్రహ్లాద హృది విహారీ

2.ఈశుడ వీవు ధర నరసింహా
   జగదీశుడ వీవు లక్ష్మీ నరసింహా
   శేషప్ప పోషకుడవు ధర్మపురీ శ్రీ నరసింహా
   జన్మ నిశ్శేషకుడవు ధర్మపురీ యోగనారసింహా
   రాఖీ  జన్మనిశ్శేషకుడవు ధర్మపురీ యోగనారసింహా
  

Carnatic music,devotional,male singer,classical music,fast melody,dholak,flute, veena,dhol,tabla,mrudangam,kerala drums

Thursday, March 6, 2025

 https://youtu.be/woAOrOsFLGs?si=UhrmbY3vtZQOL7oG


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం :తోడి 


భక్తి యోగము భక్తే ఒక యోగము 

భగవంతుని యెడల అనురక్తి యోగము 

నవవిధములుగా భక్తి ఆత్మ పరమాత్మల సంయోగము 

అనవరతం తన భక్తుడనినా దైవనికీ అమితానురాగము 


1.భక్తి అనునది ఒక అలౌకిక అవ్యక్తానుభవము 

భక్తి ప్రగాఢ విశ్వాసముతోనే సంభవము 

భక్తి అయిహికా ముష్మికాలపై ప్రభావము 

భక్తికి సర్వస్య శరణాగతితో పరమ శివము 


2.సదా సేవించి తరించారు భక్త శిఖామణులు 

సాకార రూపమో నిరాకార బ్రహ్మమో ఆ ధన్యులు 

అభ్యాసం-ఆత్మసమర్పణం-ఆత్మజ్ఞానం-భక్తి మార్గాలు 

సకల జీవులందు ప్రేమ-మానవీయ భావన-భక్తికి సూత్రాలు 


3.జయాపజయాలు మానావమానాలు సమమని ఎంచి 

లాభ నష్టాలలో ధనమును తృణముగా తలంచి 

దైహిక మొహాలను క్షణికాలుగా నిరతము భావించి 

దైవదత్తమే బ్రతుకని ముక్తులవుదురు భక్తులు సర్వం త్యజించి

Thursday, February 27, 2025

 కళ్యాణం నేడేగా రమణీయం చూడగా 

కమనీయం పాడగా వరదాయం వేడగా 

శివ పార్వతుల దివ్య కళ్యాణం నేడేగా 

మంగళకరమౌ లోక కళ్యాణం చూడగా 

శివనామ గానమే కమనీయం పాడగా 

శివరాత్రి పావన సమయం ఇహపర దాయం వేడగా-హరుని వేడగా 


1.భవభయహరుడు నిజశుభకరుడు శంకరుడు మన వరుడు 

  హిమగిరినందిని మునిజన వందిని నిత్యానందిని మన వధువు 

ముల్లోకాల సకల దేవతలు దనుజులు మనుజులు మురియగా 

నాక లోకమే పారిజాతముల పుష్ప వర్షమును కురియగా 


2.పరమ భక్తులు శివశక్తులు జీవన్ముక్తులు సాదర ఆహ్వానితులై 

ప్రకృతి ప్రేమికులు భగవతి పార్వతి దీక్షా దక్షులు పెండ్లి పెద్దలై

ద్రవ్య శక్తి నిత్యత్వ సూత్రమే విశ్వ మనుగడకు మూలభూతమౌ 

ఆది దంపతుల ఆశీర్వాదమె మానవాళి కిల ప్రగతి ఊతమౌ 




 మహాలింగోద్భవ తరుణమే ఆహా పరమాద్భుతం  

మహాదేవ ఆద్యంతశోధనలో హరి బ్రహ్మల పరాజయం 

మహా శివరాత్రివేళయే మహా మహిమాన్వితం

మహాలింగార్చన చేసిన చూసిన జీవితమే కదా ధన్యం-సదా

ధన్యం 


1.ఇసుకైనా మట్టైనా కర్రైనా రాయైనా శివస్వరూపం  

శ్రద్ధాశక్తులతో భక్తి ప్రపత్తులతో వెలిగించు హరునికి నీ ఆత్మదీపం 

ఉపవాసం జాగారం అంతరార్థమే పరమేశ్వరుని సాన్నిధ్యం

నామరూప రహితుడా భవుని యెడల భావనయే ప్రాధాన్యం


2.మహాన్యాస పూర్వకమౌ ఏకాదశ మహా రుద్రాభిషేకాలు 

ఫలహార నిరాహార నిర్జల ఉపవాసదీక్షలతో శివ దర్శనాలు 

పార్వతీ పరమేశ్వర పరిణయ వైభవ అపురూప దృశ్యాలు 

జన్మకో శివరాత్రిగ తలపించే అనుభూతులతో మది పారవశ్యాలు 


Thursday, February 13, 2025

 ttps://youtu.be/Euz2OeNkAD8?si=yuOV5NVqRa_pxCoV

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:భీంపలాస్

ప్రేమికులందరికి సర్వదా ప్రేమే సర్వం
ప్రేమికులరోజుకిప్పుడు సప్తాహ పర్వం
అన్నపానాదులన్నీ విస్మరిస్తూ
నిదురలేని రాత్రులెన్నో గడిపేస్తూ
ప్రియతముల కోసం పలవరిస్తూ
తమదైన ఊహల లోకంలో విహారిస్తూ

1.రోజా పూల రోజుగా ఎంతో మోజుగా తొలిరోజు
   ప్రేమను ప్రతిపాదించేదిగా మరుసటి రోజు
   చాక్లేట్తో తీపి కబురందిస్తూ మూడో రోజు
   ప్రేమకానుకలిచ్చేస్తూ టెడ్డిడేగా నాల్గోరోజు
   పండగ చేసుకుంటారు ప్రణయారాధకులు
   పరవశించిపోతారు ఇలలో  ప్రతి ప్రేమికులు

2.బాసలదివసంగా బంధంముడివేస్తూ ఐదోనాడు
ముద్దు మురిపాలు చిందిస్తూ మురిసేరు ఆరోనాడు
కౌగిలింతల్లో చింతలువీడి కరిగిపోతారు ఏడోనాడు
తోడును వలచి జతగా మలచి ప్రేమను గెలిచేరు
ప్రేమికుల రోజుగా హాయిగా వేడుక చేసుకొంటారు
ప్రేమికులంతా ఫిబ్రవరి పదునాల్గో తేదీ నాడు

Monday, February 10, 2025

https://youtu.be/yj5YnD7-4yc

నా మనసు మాధుర్యం lovely lovely chocolate లా 
నీ స్నేహ సహచర్యం yummy yummy taste లా 
మన అభిరుచులే cocoa,sugar,milk mixture paste లా 
మన అలవాట్లే నాకోసం నీవు నీకోసం నేను మార్చు కునేట్లుగా 
నా హృదయపు chocolate నీకు బహుమతిగా 
నా భవితన నను మురిపించు నా ప్రియ శ్రీమతి గా 

1.నోరూరిస్తుంది shiny shiny నీ మేని అందం 
మైమరిపిస్తుంది crunchy crunchy నీ పరువం 
చప్పరించాలనిపిస్తుంది నీతో యుగాల సమయం 
నీతో ఉన్నప్పుడల్లా ఆ రోజంతా ఎంతో రసమయం 
నా హృదయపు chocolate నీకు బహుమతిగా 
నా భవితన వెలుగులు పంచు నా ప్రియ శ్రీమతి గా 

2.కాస్త కాస్త అనుభవిద్దాం జీవితం chocolet నమిలినట్లుగా 
కొసరి కొసరి అనుభూతిద్దాం ఇద్దరం పరస్పరం వదలనట్లుగా 
స్వీట్ నథింగ్స్ ఎన్నెన్నో పంచుకుందాం differences లేనట్లుగా 
డెడికేటెడ్ గా మసులుకుందాం Ego ల shade మనపై పడనట్లుగా 
నా హృదయపు chocolate నీకు బహుమతిగా 
నా భవితన delight నందించు నా ప్రియ శ్రీమతి గా 

OK

Saturday, February 8, 2025

 https://youtu.be/nfWkAkDOnN0


రాగం :కళావతి 


నీవు నేను ఒకటిగా నిత్యం చేరువలో మసలేదాకా 

ఒకరికి ఒకరంగా నిరంతరం మనుగడ సాగించేదాకా 

మెత్తగా ఎదకు హత్తుకో ప్రియతమా హాయిహాయిగా

కానుకగా నేనిచ్చే ఈ ట్రెండీ టెడ్డీని నాకు మారుగా 

నీ ప్రేమకోసమే నే జీవిస్తా ఓ నా నేస్తమా 

నీ వెంటే కడదాకా నేనొస్తా నా ప్రాణమా 


1.నా తలపులు నిను ముంచేత్తే సమయాన 

నా విరహం నిను వేధించే ఆ తరుణానా 

మనం కలువలేక దిక్కుతోచని వేళల్లో తోడుగా 

ముద్దాడుకో నేనిచ్చే ట్రెండీ టెడ్డీని నాకు మారుగా 

నీ ప్రేమకోసమే నే జీవిస్తా ఓ నా నేస్తమా 

నీ వెంటే కడదాకా నేనొస్తా నా ప్రాణమా 


2.ముహూర్తాలు కుదిరే దాకా ఓపిక పడదాం 

ముద్దు ముచట్లతోనే ఏ పొద్దు సరిపెడదాం 

సృష్టిలోని దేది సైతం సరిపుచ్చదు నీ వెలితి 

మనం మనువాడే వరకు టెడ్డీలే మనకు గతి 

నీ ప్రేమకోసమే నే జీవిస్తా ఓ నా నేస్తమా 

నీ వెంటే కడదాకా నేనొస్తా నా ప్రాణమా


OK 


Tuesday, January 28, 2025

 https://youtu.be/PCYlb2t6AJ8


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం :శివరంజని 


కుంభమేళా పూర్ణ కుంభమేళా 

మహత్తరమౌ మహా పూర్ణ కుంభమేళా 

జన్మ జన్మల తపములు ఫలియించిన వేళ

తపముల తపములకే అరుదెంచే అరుదైన వేళ 

త్రివేణి సంగమాన పరమ పావనతీర్థ దివ్య లీల 

విన్నవారు విస్తుపోయే విశేషాల నిలయం 

కన్నవారు అబ్బురపడు కమనీయ దృశ్యం 

అపార అనుభూతుల సారం అనుభవైక వేద్యం 


1.అలహాబాదులో ప్రయాగ రాజ్ లో అద్భుతం 

గంగా యమునా సరస్వతీ నదీ త్రయ సంగమం 

అమృత బిందువులిల కురిసిన పుణ్య ప్రదేశం 

మహిమాన్విత మాధవేశ్వేరి స్థిత అష్టాదశ శక్తి పీఠం  

విన్నవారు విస్తుపోయే విశేషాల నిలయం 

కన్నవారు అబ్బురపడు కమనీయ దృశ్యం 

అపార అనుభూతుల సారం అనుభవైక వేద్యం 


2.వృషభ రాశిలో బృహస్పతి సంచార సమయం 

శతకోటి భక్తులు తరించే పవిత్ర పుష్కర కాలం 

అశేషమౌ అఘోరాలు అగుపించడం అశ్చర్యకరం 

అనూహ్యమౌ నాగ సాధువులేతెంచడం విడ్డూరం 

విన్నవారు విస్తుపోయే విశేషాల నిలయం 

కన్నవారు అబ్బురపడు కమనీయ దృశ్యం 

అపార అనుభూతుల సారం అనుభవైక వేద్యం


3.పితృదేవతలంతా ఉత్తమగతులందగా తర్పణాలు 

పితృదోషాలు తొలగేలా ఆసక్తిగ ఆచరించు శ్రాద్ద కర్మలు 

ముత్తదువ లొనరించగ ప్రత్యేకతగల వేణీ దానాలు 

మహా సంకల్ప మంత్రోక్తయుత పాప ప్రక్షాళన స్నానాలు 

విన్నవారు విస్తుపోయే విశేషాల నిలయం 

కన్నవారు అబ్బురపడు కమనీయ దృశ్యం 

అపార అనుభూతుల సారం అనుభవైక వేద్యం

Saturday, January 18, 2025

 https://youtu.be/WHuhON84IOM


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం దర్బార్ కానడ


శ్రీ త్యాగరాజ మహాశయా నీకు అభివందనం 

వాగ్గేయకార యశోభూషణా సాష్టాంగవందనం

శ్రీ రామ సంసేవితా నాదోపాసన విరాజితా 

రాగ రసామృత ప్రసాదితా అందుకో స్వర నీరాజనం 


1.తిరువాయూరున జన్మించి 

అమ్మవలన భక్తిని అనుసరించి 

చిరుతప్రాయమున రాముని తలంచి 

అనుపమాన రాగాల కృతుల రచించి

విఖ్యాతినొందితివి సంగీత విరించి


2.రాగ రసాంబుది సదా మధించి 

కర్ణాటక సంగీతసుధ పిపాసులకందించి  

కొన ఊపిరులకు స్వరములతో ఊపిరినిచ్చి 

బయకార మహిమను జగతికి ఎరిగించి 

తరతరాలు జీవించేవు మా ఎదల నిలిచి 


OK

Friday, January 3, 2025

 https://youtu.be/6VszfsKGay4?si=85eBdeoN_qBES6q8


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం :మధ్యమావతి 


జయ జయ రామా జగదభిరామా నినుగన నీ వాకిట నిలిచాను 

దయార్ద్ర హృదయా భద్రాద్రిరామా దర్శనార్థినై నీముంగిట చేరాను 

ఉత్తరద్వారము తెరచు వరకు నా చిత్తము ఇక నీ పరము 

తలుపులు తీసిన తక్షణము-నీ దివ్య విగ్రహ వీక్షణ వరము 

నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినము కోరితి వైకుంఠ ద్వార దర్శనము 

జన్మ జన్మల మా పుణ్య విశేషము-నీ కరుణా కటాక్షమే నిదర్శనము 


1.గుహడను నేను-నీ పదములు కడిగితి నాడు 

శబరిని నేను నీకు ఫలములు తినిపించినాను 

రెక్కలు తెగిన పక్షిని నేను- జానకీ మాత జాడ తెలిపినాను 

నిను వదలక ఎదలో నిలిపిన నీ దాసుడను నీ హనుమను

నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినము కోరితి వైకుంఠ ద్వార దర్శనము 

జన్మ జన్మల మా పుణ్య విశేషము-నీ కరుణా కటాక్షమే నిదర్శనము 


2.పరమ పావని గోదావరి పారుతు చేరేను నీ దరి 

భద్రుని వినతిని విని ఇట స్థిర వాస మొందితివి సరి 

రామదాసుని భవ చెఱ విడిపించితివి ఉంచగా నీపై గురి 

*నీ దాసానుదాసుని ఈ రాఖీని బ్రోవగ మరవకు ఏమరి 

నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినము కోరితి వైకుంఠ ద్వార దర్శనము 

జన్మ జన్మల మా పుణ్యం విశేషము-నీ కరుణా కటాక్షమే నిదర్శనము