Thursday, August 23, 2012

ప్రేమ పట్టకం(ప్రిజం)


ప్రేమ పట్టకం(ప్రిజం)

వర్ణాలు రెండే ఈ ప్రేమకు
వర్ణాలు మెండే ఈ ప్రేమకు
తెల్లగా కనిపిస్తుంది-మెల్లగా కబళిస్తుంది
చల్లనీ బ్రతుకులనెన్నో నలిపి నలుపు చేసేస్తుంది

1ఊదా రంగు ఊహల్లో విహరింప జేస్తుంది
నేరేడువన్నెయే   ఆశలు కలిపింప జేస్తుంది
నీలిరంగు మేఘాల్లో తేలియాడ జేస్తుంది
ఆకుపచ్చ కలలెన్నో కనుల కలగజేస్తుస్తుంది
మంత్రాలు వేస్తుంది-మాయలెన్నొ చేస్తుంది
కన్నుమూసి తెరిచే లోగా పంజరాన బంధిస్తుంది

2.పసుపు పచ్చ  బంధాలే పెనవేస్తుంది
బంగారు భవితను చూపి మురిపిస్తుంది
సంజె కేంజాయిలోనా ..రంజింపజేస్తుంది
రక్తానురక్తిగా జీవితాన్ని మార్చేస్తుంది
మత్తు కలుగ జేస్తుంది-మైకాన్ని కమ్మేస్తుంది
ఏడేడు జన్మలదాకా వెంటాడి వేధిస్తుంది



Thursday, July 26, 2012

స్వయం’భు’వన మోహిని



స్వయంభు’వన మోహిని

వర్ణించలేదు ఎవరూ..కావ్యాలలో...- 
తిలకించలేదు ఎపుడూ...స్వప్నాలలో...
సాక్షాత్కరించినావు....రెప్పవేయనీయనట్లుగ- ప్రత్యక్షమైనావు  .....సాగిలపడునట్లుగా
        ప్రసాదించవే చెలి... క్రీగంటి వీక్షణం.
       కై౦కర్యమైపోతానే.నా.జీవితాంతం

1. సుందరాంగులెందరో...చేస్తారు వందనాలు..
అందగత్తెలె౦దరో....దాసోహమంటారు
ముజ్జగాల ముదితలు సైతం చేష్టలుడిగి చూస్తారు
బ్రహ్మ కూడ నిన్ను చూసి బిత్తర పడిపోతాడు      
అతిలోక సుందరీ..అన్న పేరు నీదేనేమో.
నీ దర్శన భాగ్యమే నా పూర్వ పుణ్యమేమో

2. దేవతవు నీవనను..మాయమైపోదు వేమో..
అప్సరసవు నీవనను...అందకుండా పోదువేమో..
నీ దరహాసం కురిసే  శరత్కాల జ్యోత్స్న లు
నీ నయనాల మెరిసే నక్షత్ర జ్యోతులు
ఏమందు నే నిన్ను కుందనాల బొమ్మా..
తనివిదీర నిన్నుగనగ  సరిపోదు ఒక జన్మ

3.  పెద్దన నిను చూసి ఉంటే..ఉన్మత్తుడయ్యే వాడేమో..
శ్రీనాథుడు నిన్ను గాంచి ఉన్మదితుడుఅయ్యేనేమో
వర్ణాలు  సరిపోవే..నిన్ను వెలయించ
పదములకు..పాటు గాదే..నిను ప్రస్తుతించ
మతిభ్రమించకముందే..నన్ను కాస్త దయగనవే
వెర్రి శ్రుతి మించక ముందే..నన్నిక గైకొనవే..




Tuesday, July 24, 2012


అమ్మా శ్రీ లలితా శివాత్మికా - నివాళి నీకిదే నిర్మల చరిత
కాత్యాయిని కాదంబరి కమలలోచని- సహస్ర నామాంకిత సకల లోకజనని
1.    అతివలంత జేరి నిను ధ్యానించిరి- అలివేణులందరూ ఆసన మందించిరి
అ౦గనలంత కలిసి అర్ఘ్యాదులనిచ్చిరి- పడతులంత గూడి పాదపూజ జేసిరి
                                                          ||అమ్మా శ్రీ లలితా ||
2.     అంబుజాక్షులందరూ అభ్యంజన మొనరించిరి- వనితలంత నీకు పట్టు వస్త్ర మిచ్చిరి
గరిత లంత జేరి గంధమ్ము బెట్టిరి -తెరవ లంత నీకు తిలకమ్ము దిద్దిరి
                                                          ||అమ్మా శ్రీ లలితా ||
3.     పూబోడులంత నీకు పూమాలలు వేసిరి- సుదతులంత నీ సహస్ర నామాలు చదివిరి
తరుణులంత తపన పడి ధూపమ్ము వేసిరి- ప్రమదలంత భక్తితొ ప్రమిదలు వెలిగించిరి
                                                          ||అమ్మా శ్రీ లలితా ||
4.     నెలతలంత నీకు నైవేద్యము నొసగిరి- ముదితలంత ముదమార తాంబూల మిచ్చిరి
హేమలంత ప్రియమారగ హారతులిచ్చిరి- కాంతల౦త ముక్తకంఠ గీతమాలపించిరి
                                                          ||అమ్మా శ్రీ లలితా ||
5.    భామలంత కలిసి నీ భజనలు జేసిరి- నారీమణులందరూ నాట్యాలు జేసిరి
మగువలంత నీకు మనసారా మ్రొక్కిరి- రమణులంత నీ ముందర సాగిల పడిరీ
                                                         ||అమ్మా శ్రీ లలితా ||
                                                                                  

Monday, July 23, 2012

తిప్పల రెప్పలు


చెప్పిన మాట వినవు-కనురెప్పలదెంత హఠము
వద్దని వారిస్తున్నా -నిద్దుర కొరకే..తగవు
కలనైనా..కననీవు-తలపులసలు రానీవు
మూయాలనుకొంటే..మూతలు పడవు
తెరవాలనుకొంటే..ఎ౦తకు విడివడవు

1. భువిభారం మోయునట్లుగా.. ధనగారం..దాయు నట్లుగా
కను స్వేచ్ఛను కాయునట్లుగా...తము ధర్మం తప్పనట్లుగా
సైనికులై పహారాలే..వేస్తుంటాయి..పాలకులై. కట్టడులే చేస్తుంటాయి
కలనైనా..కననీవు-తలపులసలు రానీవు
తెరవాలనుకొంటే..ఎ౦తకు విడివడవు||

2. అలసిన *కుడి సేదదీరగా..విచలిత మది విశ్రమించగా
వేదనలలో ఊరడిల్లగా..ఇహపరముల కతీతమ్ముగా
కోరుకున్న వారినీ..లేక్కచేయవు –వేడుకున్నా ఏమాత్రం చెవిని పెట్టవు
కలనైనా..కననీవు-తలపులసలు రానీవు
మూయాలనుకొంటే..మూతలు పడవు||

3. ప్రేమికులతొ పగలే బూను ..రోగులకూ..వైరుల తీరు
విద్యార్థుల కిల విరోధులే..రసికుల పాలిటి రిపులే
విద్యుక్త ధర్మాన్నీ విస్మరించ లేవు...సందర్భ సహితంగా ప్రవర్తించలేవు
కలనైనా..కననీవు-తలపులసలు రానీవు
మూయాలనుకొంటే..మూతలు పడవు
తెరవాలనుకొంటే..ఎ౦తకు విడివడవు

*కుడి = శరీరం..దేహము..

Saturday, July 21, 2012


https://youtu.be/xo3XIJuBlVU


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ "సరస్వతీ నమస్తుభ్యం.!!"

రాగం :మోహన 

వరవీణా మృదు పాణీ-నమోస్తుతే పారాయణీ
సంగీతామృత తరంగిణీ-సారస్వతపుర సామ్రాజ్ఞి
మంద్రస్వర వీణ గాన ప్రియే-మంజుల చరణ శింజినీ నాదమయే
పాలయమాం..పరిపాలయమాం.. పాలయమాం..పరిపాలయమాం...

1.అక్షర రూపిణి-అక్షర దాయిని-భాషా లక్ష్మీ భావమయి
అగణిత పదయుత- అద్భుత పదనుత- విద్యాదేవీ వాక్య మయి
అతులిత జ్ఞాన -ప్రదాయిని భారతి –మేధావిని హే వేద మయి
పాలయమాం..పరిపాలయమాం.. పాలయమాం..పరిపాలయమాం...

2. సుస్వర మార్దవ –మాధుర్యాన్విత –గాత్రప్రదాయిని గానమయి
శ్రుతిలయ పూరిత –భావగర్భిత-నాదవినోదిని మోదమయి
రాగ తాళ సమ్మేళన గీతా-వాణీ మహదను రాగమయి
పాలయమాం..పరిపాలయమాం.. పాలయమాం..పరిపాలయమాం...

Thursday, July 19, 2012


అనుభూతి

నీ తలపే..మైమరపు..
నీ తలపే..హాయి గొలుపు
నీ తలపే.. నను మేలుకొలుపు
నీ తలపే.. ముందుకు..నడుపు

1.       స్ఫురణకు రాగానె మదితేలియాడు
స్మృతిలో..మెదలగనె కలతలు వీడు
జ్ఞప్తికి రాగానె చిరునవ్వు కదలాడు
గుర్తుకు రాగానె నా చేష్టలుడుగు

2.       కోవెల జనినంత దేవిగ నీవే
పూవుల గనినంత తావిగ నీవే
విరిసే హరివిల్లు వర్ణాల్లొ నీవే
కురిసే చిరుజల్లు వర్షాల్లొ నీవే

3.       చిలుక పలుకగ నీ తేనె మాటలు
కోయిల కూయగ నువు పాడుపాటలు
శాకుంతలానా నీ పోలికలు
బృందావనానా నీ అడుగుజాడలు..

Sunday, July 8, 2012

https://youtu.be/q3gKM4G4cOI

గళమునందు గరళమున్నా...హృదయమెంత అమృతమో..
నేత్రమగ్నిహోత్రమైనా....చూపులెంత శీతలమో...
నమో నీలకంధరా...నమో భోళా శంకరా....

1.    ఒంటి నిండ నాగులున్నా ...నవ్వులు నవనీతమే..
పులిచర్మ ధారియైన..పలుకులు  మకరందమే..
మేనంత భస్మమైన శ్మశానమే నివాసమైన..
ఈయగలవీవే   ఈశ్వర... ఐశ్వర్యము..

2.    జన్మవైరులేగాని..జగడమెరుగవెన్నడైన..
ఎద్దు పులి ఎలుక పాము నెమలి కైలాసాన..
నీ భక్తులు అసురులైన అల్పులు అజ్ఞానులైన
 కరుణించి క తేర్తువు భవసాగరమ్మున-భవా వేగిరమ్మున..

Saturday, July 7, 2012


భళా రామపాదం - భజే రామ పాదం.
ప్రమోదాలు కూర్చే రామ పాదం
పరమ పదము చేర్చే రామ పాదం       

1.    శాపాలను తీర్చిన పాదం-పాపాలను కడిగిన పాదం
పతితుల కిల పవిత్ర ధామం-పరితాపుల జీవన వేదం
సురల మునుల కేవ్వరికైనా..అపురూపం రామపాదం

2.    గుహుడి ఆర్తి తీర్చిన పాదం –భరతుడు తల దాల్చిన పాదం
జటాయువున్గాచిన పాదం-శబరీ తావుకేగిన పాదం
వనములెల్ల పావనమవగా-సంచారము చేసిన పాదం

3.    హనుమకుబహు-ప్రియమగు పాదం- చెలిమికిఇల సరియగుపాదం
గంగానది పుట్టిన పాదం-బ్రహ్మరోజు కడిగెడి పాదం
త్యాగరాజు రామదాసుల-తరియింపగ జేసిన పాదం


Sunday, July 1, 2012


సాకార సంగీతం

నింగిలోన తొంగి చూసే –నక్షత్రం నీవే
నేలదిగిన గంధర్వ –గాత్రం నీవే
సృష్టిలోని సంగీత –శాస్త్రం నీవే
స్నేహానికె చెలిమి నేర్పే –సూత్రం నీవే...ఓంకార మంత్రం నీవే..
అందుకో నీకివే జన్మదిన అభినందనలు..!
శతమాన ఆనందానికి ఎనలేని దీవెనలు..!!

1.       గాలితాకితె మేను మరచే మేఘమాలవు నీవు
దైవ సన్నిధి కొరకే విరిసే –పూలబాలవు నీవు
మచ్చలేని జాబిలి నీవు-స్వచ్ఛమైన స్ఫటికము నీవు
పసివారి మోమున మెరిసే –బోసి నవ్వు నీవు
ప్రతివారికి నీడనిచ్చే పచ్చని తరువే నీవు
అందుకో నీకివే జన్మదిన అభినందనలు..!
శతమాన ఆనందానికి ఎనలేని దీవెనలు..!!

2.       కలుషితముల పాలబడని-సురగంగవే నీవు
అపశ్రుతులే పాడబడని-స్వరగంగవే నీవు
కల్మషాలు లేనేలేవు- కపటాలు అసలే తెలియవు
పవిత్రతకు ప్రతిరూపం కృష్ణ గీతవే నీవు
తిమిరాలను పరిమార్చే పరంజ్యోతివే నీవు
అందుకో నీకివే జన్మదిన అభినందనలు..!
శతమాన ఆనందానికి ఎనలేని దీవెనలు..!!



Monday, June 18, 2012

గుండె తావే ఔదార్యం –గొంతు తావే  మాధుర్యం..
అనునాదం బహు సౌందర్యం –నీ గాత్రం పాటకు ఆహార్యం 

ఓ రూపు దాల్చిన గీతమా- పాదాభివందనం
ఓ చెలిమి పంచిన నేస్తమా-స్నేహాభినందనం

1.    వెదక బోయిన తీగలాగా తారసిల్లినావే
ఎదుట నిలిచి స్వరనిధివీవై వరములిచ్చినావే
గమకాలు సంగతులన్నీ – అలవోకగ పలికించావే
అనుభూతులు భావాలన్నీ – పన్నీరుగ చిలికించావే

ఓ సంగీత శారదా –శిరసు వంచేను సదా
ఓ ప్రత్యక్ష భారతీ –నీ భక్తుడనైతి కదా

2.   అక్షర సుమ మాలికతో అలరించెద నిన్ను
పదముల మధు ఫలములనే నివేదింతు నీకు
కవితల గేయాల హారతులందించెద నీకు
కృతులూ కీర్తనలెన్నో ఆర్తిగ వినిపించెద నీకు

ఓ అపర వాణీ –నీకు గీతాంజలి
అభినవ గీర్వాణీ-ముకుళిత హస్తాంజలి

OK

Sunday, June 17, 2012




పరుల మాటలు పట్టించు కొనుచు
పలుచన సేయకు నను ప్రాణనాథా..
నీవేరుగనిదా నా మది- నీకది ఏడేడు జన్మాల ఖైదీ

1.     ప్రీతిగా చేకొన్న సీతను సైతం-
అడవుల పాల్జేసే అలనాడు రాముడు
సాధ్విగ పేరున్న రేణుక నైనా
దండించె జమదగ్ని మునివర్యుడు
ఘనులకైనా తప్పనిదే విధి-అనితర సాధ్యము మీ ప్రేమ పెన్నిధి

2.     ఒరుల మెప్పుకు బలిసేయవలేనా
నరుల దృష్టికి మసి బారవలెనా
పచ్చనైన కాపురాన -చిచ్చు రేపుట న్యాయమా
సాగుతున్న సంసార నావను -సుడిలొ ముంచుట భావ్యమా
          నీవేరుగనిదా నా మది- నీకది ఏడేడు జన్మాల ఖైదీ



Saturday, May 19, 2012


ఆమని అరుదెంచినా-మామిడి చిగురించినా
పాడవేల  కోయిలా-మూగవైతివే ఎలా?
ప్రేమగ నిను పిలిచినా-ఎంతగ కవ్వించినా
ఉలకవైతివే పికమా!అలక ఏల ప్రియతమా !!

1.  1.    గ్రీష్మం భీష్మించినా -వర్షం వారించినా
శరత్తే చకోరాల-మత్తులోన మునిగినా
హేమంతం పంతంగా-ముఖం చాటేసినా
శిశిరం కలవరపడి -మాట దాటవేసినా
వసంతం తనుసాంతం-నీకు సొంతమయ్యెగా
నీ గీతం అమృతమని-నీకు బానిసయ్యెగా

పాడవేల  కోయిలా- మూగవైతివే ఎలా?
ఉలకవైతివే పికమా!అలక ఏల ప్రియతమ!!

2.   2.   గాలి కూడ కలుషితమై-ఊపిరాడకున్నదా
నిర్మలమగు నీరు లేక-దప్పి దీరకున్నదా
నిప్పులకొలిమిలాగా-ఎండెంత బాధించెనా
ప్రశాంతతే కరువైన-ప్రకృతియే వేధించెనా
తోడెవరూ లేరనుకొని-ముభావంగ ఉన్నావో
కోవెలలో దేవతగా-కొలిచే నను మరిచావో

పాడవేల  కోయిలా-మూగవైతివే ఎలా?
ఉలకవైతివే పికమా...!అలక ఏల ప్రియతమా..!!

OK

Thursday, May 17, 2012

OK


జర పైలం బిడ్డో..!!
పరువమా..పాడకే..వలపుపాట..
ఏ క్షణం..జవదాటకే..మనసు మాట..
వయసు నిను..ఉడికిస్తుంది..- సొగసు నిను ఊరిస్తుంది....
తెలిసి తెలియనితనమే.నిన్ను.ఉక్కిరిబిక్కిరి..చేసేస్తుంది.

1.        ఎంతగా ఉదహరించినా..దృష్టి పెట్టవెందుకు..నేస్తం..
సాటివారి..భంగపాట్లను..పట్టించుకోని తత్వం..
మృగతృష్ణ కై పరుగెడితే..మూర్ఛ వచ్చు నీకు తథ్యం..
స్థాయి మరచి ఉట్టి కెగిరితే..దెబ్బతినుట..నీకు ఖాయం..

వయసు నిను..ఉడికిస్తుంది..- సొగసు నిను ఊరిస్తుంది....
తెలిసి తెలియనితనమే.నిన్ను.ఉక్కిరిబిక్కిరి..చేసేస్తుంది.

2.       తప్పు నీది కాకున్నా....శిక్ష నీకె..పడుతుంది..
సృష్టి సహజమైనా..గాని..నష్టం వాటిల్లుతుంది..
ఆకు ముల్లు సామెత..నీకు..అతికినట్టు సరిపోతుంది..
ఆకతాయి పనులకు..మూల్యం..జీవితమే..అవుతుంది..

వయసు నిను..ఉడికిస్తుంది..- సొగసు నిను ఊరిస్తుంది....
తెలిసి తెలియనితనమే.నిన్ను.ఉక్కిరిబిక్కిరి..చేసేస్తుంది.






Friday, April 13, 2012

సంగీత లహరి

సంగీత లహరి

ఆశయాలు కావాలి-హిమవన్నగ శిఖరాలు
నీ శ్రద్ధా సాధనలిక- అనన్య సాధ్యాలు
అనుక్షణం శ్రమించాలి-ప్రతిరోజూ పరీక్షగా
సడలని సంకల్పమే-శ్రీరామ రక్షగా

1. సరిగమ పదనిసలే-పాడాలి సరిగా
శ్రుతీ లయ అమరాలి-పాటకు ‘సిరి-హరి’ గా
వర్ణాలూ పదాలూ-సాగాలి భావ’లహరి’గా
రాగంతానంపల్లవి-మారాలి బిలహరిగా

2. అవాంతరాల అపస్వరాలు-అధిగమించాలి
రణగొణ ధ్వనులున్నా-లయలయమై పోవాలి
నాభినుండి భావమెపుడు-ఉబికి ఉబికి రావాలి
తన్మయముగ పాటనెపుడు-నీకొరకే పాడాలి

3. అక్షరాలు స్పష్టంగా ఇష్టంగా పలకాలి
ప్రతి పదార్థ తత్వమెరిగి ప్రతి స్పందించాలి
పల్లవాల రుచిమరిగిన కోకిల కుహు కుహులే
పల్లవించి తీరాలి పల్లవెత్తుకొనగనే..