Wednesday, July 15, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:ఉదయ రవిచంద్రిక

చిదిమి దీపం పెట్టుకోవచ్చు బహు చక్కని రూపం
మదిని చిత్రం నిలుపుకోవచ్చు సంశయించక ఏమాత్రం
అందానికే నీవు అసలైన కొలమానం
ఏ కవీ ఉపయోగించని అపురూప ఉపమానం

1.కళ్ళలో ఏదో అద్భుత దివ్యత్వం
చూపుల్లో జింకపిల్లలా  అమాయకత్వం
చెంపలింక సిగ్గులొలికే మంకెన మొగ్గలు
కురులైతే కారుకొనే పట్టుకుచ్చులు
దొండ పళ్ళు మరిపించే నీ పెదవులు
కౌముదే కలత చెందే నీ నగవులు

2.తలని నిమురాలనిపించే ముగ్ధత్వము
తెలవారువేళలో విరుల స్నిగ్ధత్వవము
ముట్టుకుంటె మాసిపోయే సౌందర్యము
పట్టుకుంటె కందిపోయే సౌకుమార్యము
అపరంజి బొమ్మవు నీవు లేలేత కొమ్మవు నీవు
ఆహ్లాదం కురిపించే ఏడురంగుల నింగి విల్లువు


No comments: