Monday, September 21, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆసన్నమైనది స్వామీ నిను చేరే తరుణం

ప్రసాదించవయ్యా అనాయాసమౌ మరణం

బ్రతకడానికొక్కటైనా కనిపించదు కారణం

కడతేర్చు వేగమె నన్ను నీ చరణమె నాకిక శరణం


1.మెండుగా లేదునాకు కీర్తి ఎడల కండూతి

దండిగా లేనే లేదు ధనమంటే నాకు ప్రీతి

కోర్కెలేవి లేవు నువు తీర్చకున్నవి

ఆశలేవి లేవు నాకు నెరవేర్చకున్నవి

వచ్చిన పని పూర్తైంది జాగుదేనికయ్యా

మెచ్చుకోళ్ళ వాంఛలేదు వెరపుఏలనయ్యా


2.గతించారు ఘనులైనా గుర్తు లిప్తమాత్రమే

లిఖించారు చరితలెన్నో కలిసె కాల గర్భంలో

చావుపుట్టుకలన్నవీ సహజమే సర్వులకూ

రౌరవాది నరకాలైనా సౌఖ్యమే ఇల యాతనకూ

సర్వాంతర్యామివిగానా కనెదనునిను పరలోకానా

ఆత్మగా మనుసమయాన నను వీడకు ఏమరుపాటున

No comments: