Sunday, November 15, 2020

 (నేడు కార్తీక తొలి సోమవారం)


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ ఆనతిలేక జగతి పరుగెట్టునా

నీ ఆజ్ఞలేకనే చీమైనా కుట్టునా

నీ సంకల్పముతో సృష్టి స్థితి లయములు

నీ అభీష్టమే జన సృజన మరణ పాలయములు

ఈశ్వరా నటేశ్వరా విశ్వేశ్వరా పరమేశ్వరా

హరహరా పరాత్పరా శశిధరా నీలకంధరా


1.మా నడతకు మా నడకకు హేతువునీవే

మాలో మానవతకు దానవతకు కారణమీవే

మేమొనరించెడి నేరములు దోషములు నీవే

చేసే పచ్చిమోసాలు వేసే పిచ్చి వేషాలు నీవే 

పరీక్షలు మాకేల అక్షరరూపా శివా విరూపాక్షా

శిక్షలు వేయేల వేయనేల వ్యోమకేశా త్ర్యక్షా


2.ఆకలిదప్పులు నిద్రాభయములు నీ వరాలు

వ్యాధులు బాధలు నలతలు నొప్పులు గ్రహచారాలు

నిగ్రహ శూన్యులము పరిగ్రహించు మా అపచారాలు

ఆగ్రహమేలనయ్య అనుగ్రహించు నీవైన ఇహపరాలు

ఈశ్వరా నటేశ్వరా విశ్వేశ్వరా పరమేశ్వరా

హరహరా పరాత్పరా శశిధరా నీలకంధరా

No comments: