Tuesday, October 20, 2020

https://youtu.be/aLropqJLumM

 నీ పాటగా సాగనీ జీవితమే 

నీ పదముగా చెలఁగనీ నా కవితయే

అన్యమేల రాయగ గాయాలౌ గేయాలే

ధన్యమవని నిను నుడువగ నా గీతాలే

శ్రీ సరస్వతీ మాతా సకలలోక జననీ

కర్త కర్మ క్రియలెపుడు నాకు నీవె వేదాగ్రణి


1. సరసమౌ నవరసాలు నాలో కనుమరుగవనీ

ఐహికమౌ విషయాలిక అంతరించిపోనీ

అవకాశాలే అందగజేయకు అరవిందలోచనీ

నాచిత్తము మరలనీకు నినువినా నిరంజని

శ్రీ సరస్వతీ మాతా సకలలోక జననీ

కర్త కర్మ క్రియలెపుడు నాకు నీవె వేదాగ్రణి



2.చావు పుటుకలేవైనా   దుఃఖాన్వితాలు

కరుణరసం ఒక్కటే ప్రతి మనసుకు చేవ్రాలు

ఆర్ద్రత పూరితమౌ భక్తియే సాహిత్యపు ఆనవాలు

నా అక్షరసూనాలికపై సదా నీ చరణాల వ్రాలు

శ్రీ సరస్వతీ మాతా సకలలోక జననీ

కర్త కర్మ క్రియలెపుడు నాకు నీవె వేదాగ్రణి



3.నే లిఖించు ప్రతివర్ణం నీ బీజాక్షరమవనీ

వెలయించెడి ప్రతివాక్యం దివ్యమంత్రమవనీ

మనోవాక్కర్మలన్ని నీపై కేంద్రీకృతమైపోనీ

చరణాలే శరణుకోరి  నీవైపే సాగనీ

శ్రీ సరస్వతీ మాతా సకలలోక జననీ

కర్త కర్మ క్రియలెపుడు నాకు నీవె వేదాగ్రణి







No comments: