రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
ప్రతి గీతానికీ.. నీవే శ్రుతిలా
నా గాత్రానికి నీవే ఊపిరిలా
నా స్వప్నాలకు సాకారంగా
నా స్వర్గాలకు ప్రాకారంగా
అలజడిరేగే ఎద లయ సైతం నీలా మంజులమై
చంచలమైన చిత్తమంతా నీవే కేంద్రకమై
అంకితమైతేనె కదా జీవితం
పంచుకుంటేనె కదా స్నేహితం
1.మది తేలిపోతుంది నీ ఊసు మెదలగనే
కైత వాలిపోతుంది నీ ఊహకలగగనే
నను నడిపించే చోదక శక్తిని
నను కదిలించే నా అనురక్తివి
తట్టిలేపుతుంటావు నిద్రాణమైనపుడు
మార్గదర్శివౌతావు దారితప్పినప్పుడు
నాలో కవికి స్ఫూర్తివి నీవై ప్రేరణ నిస్తావు
నాలో రగిలే ఆర్తే తీరగ కారణమౌతావు
2.వరదవై ముంచెత్తావు చినుకులా రాలి
శరత్తుతో జతకట్టావు చకోరిలా వాలి
మనసునే అల్లుకున్నావ్ మల్లెతీగలా
వయసునే గిల్లుతున్నావ్ కందిరీగలా
మూడునాళ్ళు చాలవా మూడుముళ్ళరాగానికి
ఏడు జన్మలెత్తాలా ఏడడుగుల యోగానికి
కల్పనలకు ఇక స్వస్తి కనులెదుట కనిపించు
కనీవినీ ఎరుగని రీతి అనుభూతులందించు
No comments:
Post a Comment