ఎత్తిన పిడికిలి సుత్తికొడవలి
చక్రం బాడిస కత్తి గొడ్డలి
సమస్త కార్మిక సహస్ర రీతుల ఎత్తళి
ఘర్మజలాన్నే కందెనచేసి
యంత్రపుకోఱలు శ్రద్ధగతోమి
మానవ జీవన సౌకర్యానికి
లోకుల విలాస సౌలభ్యానికి
రక్తమునంతా చెమటగ వడిపే
శ్రమైక కృషితో ఫ్యాక్టరి నడిపే
ప్రపంచ కార్మికులారా మీకు సలాం
అహరహ శ్రామికులారా మీకు జయం
1.గనిలో పనిలో కార్ఖానాలో
క్రీకర భీకర రణగొణ ధ్వనిలో
కనీస వసతులు కొఱవడుతున్నా
భరించలేని వేడికి వెఱవక
సహించలేని చలికీ జడవక
విషవాయువులనె శ్వాసగ పీల్చే
దుర్గంధముతో రుచులను మరచి
ప్రమాదాలతో చెలిమే చేసే
మరణపు అంచులు నిత్యం చూసే
ప్రపంచ కార్మికులారా మీకు సలాం
అహరహ శ్రామికులారా మీకు జయం
2.చెల్లాచెదురౌ కార్మిక జాతిని
వివిధ వర్గాల శ్రామిక తతిని
ఒక్కతాటిపై నడువగ జేసి
సంఘటితంగా ముందుకి నడిపి
కార్మిక హక్కుల పోరే సలుపగ
ప్రపంచ కార్మిక ఐక్యత నెరుపగ
కార్మికోద్యమం క్రమతగ జరిపి
బలిదానాలకు వెనకడుగేయక
ఎగురెను నేడే మేడే అరుణ పతాక
రెపరెపలాడేను నేడే విజయ పతాక
ప్రపంచ కార్మికులారా మీకు సలాం
అహరహ శ్రామికులారా మీకు జయం
No comments:
Post a Comment