Friday, December 31, 2021



https://youtu.be/vfoXvtQUvkQ?si=AxHsCaCTixsL1JRP

మూలాలు వదలకుండా కాలాలు దాటుదాము

తత్వాన్ని వీడకుండా మానవత చాటుదాము

ఆరారు ఋతువులున్నా వెన్నెలల నవ్వులిద్దాము

వైరుధ్యమెంత ఉన్నా వసుధైకభావమై వసిద్దాము


1.అలుపాట విడుపుకోసం అన్వేషణ సాగిద్దాము

పండగంటు ఏదొచ్చినా సంబరాల మునిగేద్దాము

జీవితానికి పరమార్థం ఆనంద మందడ మొకటేగా

కలుపుకుంటు పోయామంటే కలిగేదిక సుఖమేగా


2.సంకుచితమైన భావనలు వింతవింత వాదనలు

తొలగించవు ఏ మాత్రమైనా ఎద దాగిన వేదనలు

ఏడాదికొకసారైనా ఎదురైన ఏదో ఒక హేతువుతోనైనా

ప్రతిరోజూ సంతోషిద్దాం ప్రమోదాలనే పంచుకుందాం


3.ఏ దినమూ అమ్మను కానక మాతృదినం ఎందుకంటాం

తెలుగుదనం ఊసేలేక ఆంగ్లవత్సరాదిని నిరసిస్తాం

జన్మదిన వినోదాలనూ రసాభాసగా రచ్చరచ్చచేసేస్తాం

భారతీయ విలువల మాటలు వలువలందూ విస్మరిస్తాం


Wednesday, December 29, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కథ కార్తీకదీపమైంది

కరోనా తిరిగి పుంజుకుంది

పెంచిపోషించినంత కాలం

దీపపు జ్వాలలొ మనమే శలభాలం

సమసి పోయేవరకు తప్పని సరి తగు జాగ్రత్తలు

అనివార్యం జీవితకాలం మన ముక్కున మాస్కులు


1.కొత్తకొత్త మలుపులతో చిర్రెత్తే మజిలీలతో

సాగే సాలీడు జిగురులా  ఎడతెగనిదా వైనం

వింతవింత రూపాంతరాలతో వికృత దాడులతో

డెల్టా ఒమిక్రాన్ డెల్మిక్రాన్  కరోనా నామాలనేకం

సమసి పోయేవరకు తప్పని సరి తగు జాగ్రత్తలు

అనివార్యం జీవితకాలం మన ముక్కున మాస్కులు


2.మనుగడ కోసం ఇరువురి  తీవ్ర పోరాటం

మనిషినే శాసించే కరోనాతో ఏల చెలగాటం

దొంగదెబ్బ తీయడానికి కాపుకాసింది కౄర కరోనా

ఏమరుపాటెపుడైనా చెల్లించాలి బ్రతుకనే జరిమానా

సమసి పోయేవరకు తప్పని సరి తగు జాగ్రత్తలు

అనివార్యం జీవితకాలం మన ముక్కున మాస్కులు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక నేను ఒకే నేను

ఎన్నో నేనులుగా అన్నీ నేనను నేనులుగా

తెలిసిన నేనులు కొన్ని తెలియని నేనులు ఎన్నలేనన్ని

అంతులేని యానంలో అహంకారిగా నేను

అహం త్వమేవాహమై ఏకైక సోహం గానేను


1.నేను గా మొదలై నేనూ గా కదలాడి

నేనే అన్న స్థాయికి ఎదిగీ ఎగిరీ కూలబడి

నేనేమో ఎరుగని ఎవరు చెప్పినా వినని నా నడవడి

నాదైన వాదనతోనే అందరితోనూ కలబడి

అంతులేని యానంలో అహంకారిగా నేను

అహం త్వమేవాహమై ఏకైక సోహం గానేను


2.తెలుసనుకొనే నేను సైతం అజ్ఞానమేనని

తెలిసీ తెలియని నేను కాసింత తెలుసుకొని

తెలుసుకొన్న సంగతి ఒకటే ఏ మాత్రం తెలియదని

నన్ను నేను తెలుసుకొనే జిజ్ఞాసే గమ్యమని

అంతులేని యానంలో అహంకారిగా నేను

అహం త్వమేవాహమై ఏకైక సోహం గానేను

Tuesday, December 28, 2021



 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


https://youtu.be/4nu5E3oqUJY?si=4zbJi2qLqH2XQyZh


నిద్రలేమి నీవల్లే ఎంతటి మోక్షగామికైనా

జాగృతమౌతాయి కాంక్షలు ముదిమి కైనా

వ్రతభంగమౌతుంది అస్కలిత బ్రహ్మచారికైనా

కోర్కె మేలుకుంంటుంది వింతగ సాటినారికైనా


1.పురివిప్పిన నినుగాంచి మబ్బునాట్యమాడుతుంది

నీ గాత్ర మధరిమ కోరి ఆమని అరుదెంచుతుంది

ఆపాదమస్తకం మదనరంగమే నీ అందాల అంగాంగం

వాత్సాయన శాస్త్ర రూపమై పొంగిపొరలె నీ శృంగారం


2.ప్రతి పుటలో ప్రస్ఫుటమే నీమేని గ్రంథాన రతికేళి విన్యాసం

వీణియలా వేణువులా తబలాలా ఎట మీటినా రస సంగీతం

తారాస్థాయిచేరుతుంది అనుభూతి సారమంతా సారవంతమై

తీరా తీరం చేరినంతనే తిరిగి మొదలౌతుంది పయనం పంతమై

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సజీవంగ ఉండాలి మనిషెప్పుడు

చోటునార్జించాలి జనుల మదిలొ గుప్పెడు

కీర్తిని గడించాలి లోకోపకారియై

మన్నన పొందాలి మహనీయుడై

మహత్మా గాంధీలా మదర్ థెరిసాలా అబ్దుల్ కలాం లా


1.ప్రవర్తించాలి అనునిత్యం దయామయుడై

ఆచరించి చూపాలి నడత ఆదర్శప్రాయుడై

ఆదరించగలగాలి అందరిని స్నేహశీలుడై

అసామాన్యుడైనా మెలగాలి నిస్వార్థుడై

వివేకానందునిలా నెల్సన్ మండేలాల బిస్మిల్లా ఖాన్లా


2.అడుగులేయాలి సగటు మనిషి దిశగా

ఆవిష్కరించాలి సకల మానవ హితైషిగా

కొలువుండాలి గుండెల్లో బడుగుల ఆశగా

జాగృత పరచాలి జాతిని తను మార్గదర్శిగా

రతన్ టాటాలా ఐన్ స్టీన్ లా అంబేడ్కర్ లా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాటి మనిషి ఎదుగుదలను సైచలేని గుణం

నిలువెల్లా నిండినది మనుషుల్లో ఓర్వలేనితనం

తనకున్నా లేకున్నా ఒరుల ఎడల అసూయే

తలవంచుక చనలేక మాటలు చేతలు విషమాయే


1.గొడ్డలి కామాయే చెట్టుకు చేటాయే

తనజాతి వారెపుడు జనులకు కడు హానియే

పొందేదేది ఉండదు ఈర్ష్య వల్ల పైశాచికత్వం మినహా

కోల్పోయేదీ ఉండదు కుళ్ళుబోతు ఆంబోతు తరహా


2.అరిషడ్వర్గాలలో అయితేనేం అది ఆఖరిది

అర్థరహితమే అది వ్యర్థమైనది అనర్థమైనది

వ్యక్తిత్వానికి మానవత్వానికి మాయని మచ్చఅది

అకారణంగా విరోధాన్ని పెంచునది మత్సరమన్నది

Saturday, December 25, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చలికాలమే నచ్చదు నాకు

చెలి సరసన నేనసలే లేనందుకు

హేమంతమంటే పంతమే నాకు

చెలికూపిరాడకుండ చేసినందుకు

ఎంతగర్వమో ఈ శీతాకాలనికీ

వెన్నులోంచి వణుకే కనుక ఎంతటి మహాబలులకీ


1.చెలి వలపులె  నాలో సెగలు రేప

తోకముడుచుకుంటుంది చలి పులి

చెలి తలపులె  నాలో వగపు నింప

జ్వలించదా విరహాన వయసు ఆకలి

దూరలేక పోరలేక పారిపోవు పిరికి చలి

ఒళ్ళే నెగళ్ళుకాగ కాగదా వేడదా బ్రతకనీయ బ్రతిమాలి


2.ఆయుధాలె నా నెచ్చెలి అధరాలు

చెలరేగే చలి బారిని రక్షించగా

కంచుకోట జవరాలి బిగికౌగిలి

చొరబడితే చలికి మతి చలించదా

దూరలేక పోరలేక పారిపోవు పిరికి చలి

ఒళ్ళే నెగళ్ళుకాగ కాగదా వేడదా బ్రతకనీయ బ్రతిమాలి


https://youtu.be/X0vVq4mhkmY?si=ejh3uyJlF2uCGo38

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ 


అని నడుమన నుడివినావు గీతా మకరందము

అనుభవాల పరాభవాల సంసార సార చందము

పార్థుని సారథిగా తెలిపావు జీవన సన్మార్గము

బహుముఖాలుగా వర్ధిల్లగా వ్యక్తిత్వ వికాసము

కార్యోన్ముఖుల జేయుచు శాంతించగ తాపత్రయము


1.నవనీతాలు సరసాలు మాత్రమే కాదు నీ జీవితం

అది అడుగడుగున ఒడిదుడుకుల నవరస సమ్మిళితం

కారణమేదైనా మారణమిక తప్పదని తేటతెల్లమైనా

మానక పోతివి మానిని వలదన్నా రాజీ రాయభారాలు

ఎత్తుకు పైయ్యెత్తులు మాయోపాయాలు రాజకీయాలు


2. బంధాలకు బాంధవ్యాలకు ఇప్పించావు తిలోదకాలు

బీరువులా పాఱి వెనకడుగేయనీక అడ్డావు నీ మోకాలు

వ్యూహాలు ద్రోహాలు రణమందున సాధారణమే ఐనా

యుద్ధనీతి గెలుపు రీతి ఆపద్ధర్మయుక్తి నెరిగించావు

మనుగడకై పోరమని ఫలాపేక్షవలదని ప్రవచించావు

Friday, December 24, 2021

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కనుల కురిసేను చంద్రికాపాతాలు

అధరాల ఒలికేను సుధామధురాలు

నీ మాయలో బడని మనిషేడి మహిలోన

నినుగని అనిమేషులమే వీక్షించిన తక్షణాన


1.ఉదయించును నీ నుదుట ప్రత్యూష భానుడు

ప్రభవించును ముక్కెరగా పంచమితిథి చంద్రుడు

కృష్ణవేణి నదీ ప్రవాహం నీ నీలి కురుల సమూహం

రేగేను పరమేశునికి నీ చెంతన మరులు అహరహం


2.నీ ప్రతి రూపమే ఇలలో ప్రతి స్త్రీ మూర్తి

సౌందర్యలహరివి నీవే తీర్చవేల మా ఆర్తి

అడుగడుగున మామనుగడకు నీవేగా స్ఫూర్తి

నీ సన్నిధి చేరినపుడే నా మనసుకు సంతృప్తి

……………………………………… జన్మలకిక పరిపూర్తి


https://youtu.be/FGqrL_LKF6c?si=yVwAqWNoWZ5Kvkhn

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఆది అంతము లేనివాడు

చావు పుట్టుక లేనివాడు

నీలోను నాలోను కొలువైనవాడు

లోకములనేలేటి లోకేశుడు

పరమశివుడు సదా శివుడు సాంబ శివుడు

నమః శివాయ నమఃశివాయ నమఃశివాయ


1.అక్షిత్రయముతో అలరారు వాడు

కుక్షిలో విశ్వాన్ని కూర్చుకొన్నాడు

పక్షివైరుల ఒడలంత దాల్చువాడు

దక్షిణామూర్తిగా ప్రథమ గురువైన వాడు

పరమశివుడు సదా శివుడు సాంబ శివుడు

నమః శివాయ నమఃశివాయ నమఃశివాయ


2.భిక్షమెత్తును గాని ఐశ్వర్యమిస్తాడు

పరీక్షించితేనేమి మోక్షమే ఇస్తాడు

ప్రతిఫలాపేక్ష లేకుండ పనిచేయమంటాడు

దక్షాధ్వరధ్వంసి జగతికి ఏకైక లక్ష్యమేవాడు

పరమశివుడు సదా శివుడు సాంబ శివుడు

నమః శివాయ నమఃశివాయ నమఃశివాయ

 

https://youtu.be/Md4If263fAs?si=uxRSvKNmbA1u65fq

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ధనుర్మాసమంటేనే గోదా రంగనాథులకు ప్రీతి

మాసానం మార్గశీర్షోహం అని కదా గీతన ప్రతీతి

భక్తులకు వైష్ణవానురక్తులకు హరిపదమే శరణాగతి

బ్రహ్మీ ముహూర్తాననే స్వామికి అభిషేకార్చన హారతి


1.గజగజ వణికే వేకువ ఝామున  జాగృతమొంది

గజరాజ వరదుని నిజ మనమున ఆరాధించి

తులసీదళ మాలల గోవిందుని గళమున వైచి

తిరునామాలు తిరువాభణాలు అలంకరించి

తరించెదము ఇహపరముల నరహరి కనుగాంచి


2.శేషశయనుడు పద్మనాభుడు సిరి వల్లభుడు

క్షీరాబ్ది నిలయుడు భక్తసులభుడు ఆండాళ్ విభుడు

వైకుంఠ వాసుడు  వైజయంతి మాలాలంకృతుడు

శంఖచక్ర కర ధరుడు కౌస్తుభమణి వక్షాంకితుడు

గరుడ గమన సంచరుడు సాక్షాన్మోక్ష ప్రదాయకుడు

 

https://youtu.be/ZXh7pjWupFQ?si=xwC3JpCLKA1yBSCx

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా ఊహల మంజరిని ఇస్తున్నా కానుకగా

మానస మంజూషను అర్పించా బహుమతిగా

అనవరతం నా కలమొలికే కృతి ఆకృతి గా

ఎన్నెన్ని జన్మలెత్తినా గీతా నీవే నా శ్రీమతిగా

నా దేహం హృదయం ప్రాణం సర్వం నీకోసమేగా


1.బలమైన తరుణం లో పరిచయమైనావుగా

అలవోకగ నను బుట్టలో వేసుకున్నావుగా

ఆత్మీయ మైత్రితో నేస్తమై  అలరిస్తున్నావుగా

అపూర్వమై అపురూప బంధమై పెనవేసినావుగా

నా దేహం హృదయం ప్రాణం సర్వం నీకోసమేగా


2.అనుక్షణం పరితపించి నను తలిచే నెచ్చెలిగా

ప్రణయంలో ముంచెత్తే నా ప్రియురాలిగా

నాతో కలిసి కడదాకా అడుగులేయు ఇల్లాలిగా

నన్నల్లుకపోయావే అభేదమై సిరిమల్లి వల్లిగా

నా దేహం హృదయం ప్రాణం సర్వం నీకోసమేగా

Thursday, December 23, 2021

 

https://youtu.be/6MwtG_XmcNs

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హంసానంది


నీ విభాస వక్త్రము విస్ఫులింగ నేత్రము 

నీ తీక్ష్ణ ఆలోకము నీ భీకర లోలము

రక్తవర్ణ చేలము  రుధిర తప్త శూలము 

వాహనమే శార్దూలము మహిషాసుర మర్దనము

దుర్గా భవాని జననీ శర్వాణీ నమోస్తుతే శ్రీ మాత్రేనమః


1.భవతాపహారిణి దుష్కర్మ వారిణి  శివాని

దుర్జన భంజని నిర్గుణి నిరంజనీ శాంభవి

అరివీర భయంకరి నిజ కృపాకరీ శాంకరి

జపించెద భజించెద ఆత్మలో నిను దర్శించెద

దుర్గా భవాని జననీ శర్వాణీ నమోస్తుతే శ్రీ మాత్రేనమః


2.బ్రహ్మాచ్యుత శంకర వందిని గౌరి బ్రాహ్మిణి

శ్రీ వాణీ గిరిజా స్వస్వరూపిణి మారి రుద్రాణి

సకల భువన పాలిని కార్య కారణకారిణి ఆర్యాణి

 కీర్తించెద ప్రార్థించెద నిరతము నిను సేవించెద

దుర్గా భవాని జననీ శర్వాణీ నమోస్తుతే శ్రీ మాత్రేనమః

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎక్కడో ఉన్నాడు నా సద్గురుడు

నా కొరకే వస్తాడు నా నిజ గురుడు

రానైనా వస్తాడు తను నా కడకు

నన్నైనా పిలుస్తాడు రమ్మని కడకు

జీవాత్మ పరమాత్మల బంధం మాది

నన్నుధ్ధరించే కర్తవ్యం గురు స్వామిది


1.వెలుతురున్నా అంధకారం మదికి మాత్రం

చూడకుంది తెరుచుకోని నా మనోనేత్రం

గురుని ఎరుకకు ఎంత ఆత్రం ఎంత ఆత్రం

మార్జాల కిషోర న్యాయం నేనెరిగిన సూత్రం

జీవాత్మ పరమాత్మల బంధం మాది

నన్నుధ్ధరించే కర్తవ్యం గురుస్వామిది


2.అష్ఖాంగ యోగాన్ని   నేర్పుతాడు నేర్పుగా

కుండలినీ శక్తినుద్ధీపనజేస్తాడు ఎంతో ఓర్పుగా

యోగవాశిస్టాన్ని బోధిస్తాడు నాకు సుస్పష్టంగా

గురు కృప దొరకడమే నా జన్మకు అదృష్టంగా

జీవాత్మ పరమాత్మల బంధం మాది

నన్నుధ్ధరించే కర్తవ్యం గురు స్వామిది

Wednesday, December 22, 2021

 

https://youtu.be/GWTispMy4Hk?si=9E3nLk5qO76QxM-j

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నేనే …నువ్వై… ప్రేమైనాము

దేహం నీవై జీవం నేనై ఒకటైనాము

ఊహల్లో చేస్తున్నాను నీతో నే కాపురం

కలలకే పరిమితమైంది మన ప్రణయం

ఏకైక ఆదర్శ ప్రేమికుణ్ణే నేను

నీకోసం ప్రాణాలైదు అంకిత మిస్తాను


1.తూకం వేసాను లోకాన్నంతా

సరితూగలేకుంది నీపై నా ప్రేమంత

జల్లెడ పట్టాను ఈ జగమంతా

సాటిరాదేది నీ సౌందర్యమంత

ఏకైక ఆదర్శ ప్రేమికుణ్ణే నేను

నీకోసం ప్రాణాలైదు అంకిత మిస్తాను


2.సూర్య చంద్రులు చూడలేదులే

నా వంటి ఆరాధకుణ్ణి ఇలలో ఏనాడు

సృష్టి మొత్తంగా  జాడనే దొరకదులే

నా తీరుగ నీ కోసం తపించే తాపసెవ్వడు

ఏకైక ఆదర్శ ప్రేమికుణ్ణే నేను

నీకోసం ప్రాణాలైదు అంకిత మిస్తాను

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండె చెమ్మగిల్లితే కన్ను ఊరకుంటుందా

మనసు నలిగిపోతుంటే నరకమింక ఉంటుందా

మతి లేని ఓ విధీ చేసితివి బ్రతుకు సమాధి

జీవశ్చవాలుగా ఇలా ఎన్నాళ్ళని జీవించేది


1.పుండు మీద పుట్రలాగా కష్టాల పరంపర

గాయాలు మానకుండా ఎదమీద శరంపర

అదిరిపాటుగా వెన్నుపోటుగా  అనుక్షణం ఎన్ని దెబ్బలు

నిలువెల్లా తగులబెడితివే మానేనా ఈ కాలిన బొబ్బలు


2.పరిష్కారమే లేనివి సృష్టించిన సమస్యలన్నీ

సమాధానమే దొరకవు  సంధించిన ప్రశ్నలన్నీ

ఎదిరించే మార్గంలేదు  దీనంగా మౌనంగా భరించడమే

తీర్చగలుగు  దేవుడే లేడు  పంటి బిగువు సైచడమే

Tuesday, December 21, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్ని కుంభకోణాలు పచ్చిదగామోసాలు

మాయోపాయాలు  పలికితె హేయాలు

మనుగడకై రగడలతో విలువలకే తిలోదకాలు 

కుట్రలు కుతంత్రాలు వెరసి నేటి నీచరాజకీయాలు


1.డబ్బుంటే రాజకీయాలు డబ్బుతో గబ్బు రాజకీయాలు

అబ్బోయని తబ్బిబ్బగు డబ్బు కొరకు రాజకీయాలు

పదవి కొరకు రాజకీయాలు పవరు కొరకు రాజకీయాలు

నోట్లు ఫీట్లు ఓట్లు వెరసి నేటి నీచరాజకీయాలు


2.కార్పొరేట్ల  రాజకీయాలు బ్యూరోక్రాట్ల రాజకీయాలు

గుడులు బడులు ఆసుపత్రుల భ్రష్టు పట్టించిన రాజకీయాలు

గల్లీనుండి ఢిల్లీదాక లొల్లిలొల్లి చిల్లర చిల్లర రాజకీయాలు

ఎంతకైన తెగింపులు వ్యవస్థకే తలొంపులు  వెరసి నేటి నీచరాజకీయాలు


3.

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎక్కేస్తుంటారు ఎక్కేటివాళ్ళు

దిగిపోతుంటారు తావొచ్చినవాళ్ళు

ఎక్కడిదాకో ఈ బ్రతుకు బండి పయనం

మలుపులెన్నో మజలీలెన్నో చేరే లోగా గమ్యం


1.ఉండబట్టలేకా ఎందుకో ఆగడాలు

తమకే సొంతమంటు అందరితో జగడాలు

ఉన్నంతసేపే కద గొప్పలకై తిప్పలు

ఊరువచ్చినాక తొవ ముళ్ళ తుప్పలు


2.హాయగ గడపలేక ఎరనబడే చేపలు

పరిధే దాటక తిరిగే బావిలొ కప్పలు

సాలీడు గూటిలొ చిక్కే ఆశపోతు ఈగలు

భూగోళం కబళింపజూచు మూర్ఖపు డేగలు


3.చిరునవ్వుతొ పలకరించె పరిచయస్తులు

పరస్పరం తోడుండే నిజమైన దోస్తులు

బంధాలతొ బంధింపజూసె ధారాపుత్రులు

కడిచాక వెంటరానివి నీ ఆస్తిపాస్తులు

 https://youtu.be/27KKGz9YY3M?si=34ovFneMXuYaYkTS

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హిందోళ వసంతం

ఎవరన్నారు నిన్ను శివా
సర్వసంగ పరిత్యాగివని
నమ్మడమెటుల ఉమాధవా
సంసారం పట్టని యోగివని
నమఃశివాయ ఓం నమఃశివాయ
నమఃశివాయ ఓం నమఃశివాయ

1.సతికై పరితపిస్తివి వాడ వాడల
పార్వతికి వసతిస్తివి  నీ సగము  ఒడల
మోహ మొందితివి మోహిని ఎడల
తనయ తనయుల నొదలవైతివి చిక్కడి ముడుల
నమఃశివాయ ఓం నమఃశివాయ
నమఃశివాయ ఓం నమఃశివాయ

2. ధరియిస్తివి నెలవంకను నీ తలను
భరియిస్తివి ఇల భక్తజనుల వెతలను
అందిస్తివి  జగతికి సంగీత శాస్త్రమును
చిందులేస్తివి ఆనందమందును ఆగ్రహమందును
నమఃశివాయ ఓం నమఃశివాయ
నమఃశివాయ ఓం నమఃశివాయ


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ ఎద కుముదము కోరుకొనే

తుమ్మెదనై పొందెద మోదమునే

గ్రోలెద ప్రణయ మరందమునే

పెదవుల పొరలెడి మాధవినే

నీవే నెచ్చెలి నా మది మెచ్చెడి ఆమనివే


1. వన్నెల చిన్నెల విరుల మంజరి

మత్తిలు వలపుల అత్తరు కస్తురి

తాకిన జినుగుల హాయిడు సుదృతి

తరగక తొరగెడి మధుర సుధాఝరి

నీవే నెచ్చెలి నా మది మెచ్చెడి శర్వరి


2. కన్నుల కురియును కైరవిపాతం

గళమున వరలును సుస్వరపాతం

మనసంతా  మమతాన్వితమౌ నవనీతం

మేను వేణువే ఒలికించు సరసరమ్యగీతం

నీవే నెచ్చెలి నా మది మెచ్చెడి సంగీతం

 

https://youtu.be/czFSiBSX1po?si=G5_kbmv6vRJZMwae

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లోక కళ్యాణకారకం శ్రీ శ్రీనివాస కళ్యాణం

జగదుద్ధార ఉద్దీపనం పద్మావతితొ స్వామి వివాహం

వేలకన్నులు చాలవు తిలకించగా ఆ వైభవం

భాషలేవీ తూగవు కీర్తించగా ఆ దివ్య ప్రాభవం

కమనీయమై రమణీయమై మది పులకాంకితమాయెగా

అమందానందకందళిత హృదయారవిందమాయెగా


1.బ్రహ్మ రుద్రులే పెండ్లి పెద్దలుగ

సకల దేవతలు పెండ్లికతిథులుగ

షణ్ముఖుడే ఆహ్వానము పలుకగ

వకుళమాత మానస తనయుడు

మహా లక్ష్మి ప్రియమైన  వల్లభుడు

వేంకటేశ్వరుడె  వరునిగ వరలగ


2.అశ్వత్థ వృక్షమే సాక్షిగ మారగ

ఉత్తర దిక్పతి అప్పును కూర్చగ

ఆకాశరాజుకు అనుంగు పుత్రిక

పద్మావతీ దేవి  నవ వధువవగ

అంగరంగ వైభోగంగా స్వామి పరిణయం 

కనివిని ఎరుగనిరీతిగా పాణిగ్రహణం

Ok

https://youtu.be/4S77nPSvlpI?si=SjIpwysMTvwPhvK0

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : దర్బార్ కానడ

వాడిన మాల లేల నచ్చితివో
గోదాదేవి ఇచ్ఛగించి మెడనదాల్చి ఇచ్చినప్పుడు
ఎంగిలి పళ్ళనేల మెచ్చితివో
శబరిమాత వగరుతీపి రుచిచూసి ఇచ్చినప్పుడు
భక్తిభావనే నీకు కడు ప్రీతికరము భౌతికపరమైన చర్యకన్నా
ముక్తినొసగ తగనా కనికరించి బ్రోవగనను తిరుపతి వెంకన్నా

1.పక్షిదెంత ఆయమో అందుకొనగ మోక్షము
ఉడతదెంత సాయమో  కీర్తిగొనగ అక్షరము
మార్గమేది ఎంచుకున్నా చేర్చును నీ సన్నిధానము
చిత్తశుద్దితో అర్చన చేయగ ఏదైనా సరె విధానము
భక్తిభావనే నీకు కడు ప్రీతికరము భౌతికపరమైన చర్యకన్నా
ముక్తినొసగ తగనా కనికరించి బ్రోవగనను తిరుపతి వెంకన్నా

2.తులసీదళమెంత బరువని తూచింది నిన్ను సైతం
అటుకులు పిడికెడు ఐతేనేమి తెలిపాయి గాఢ స్నేహం
శేషప్ప కొలిచాడు పద్యశతముల పొగిడీ తెగిడీ
అన్నమయ్య కీర్తించాడు వేలకృతుల పాడీ వేడీ
భక్తిభావనే నీకు కడు ప్రీతికరము భౌతికపరమైన చర్యకన్నా
ముక్తినొసగ తగనా కనికరించి బ్రోవగనను తిరుపతి వెంకన్నా


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఊరూరా నీ ఊసాయే-మదిమదిలో నీ ధ్యాసాయే

షిరిడీ చనగ నిను దర్శించగ సాయీమాకు మనసాయే

పరమదయాళా నువు దయగనగ బ్రతుకంతా కులాసాయే

అక్కునజేర్చి చక్కని దెసకు నడిపించమనిమా కాసాయే


1.సాటి మనిషిని ఆదరించని ప్రతివారూ కసాయే

ఆత్మస్తుతి పరనిందలతో ఎప్పుడు ఒకటే నసాయే

విద్వత్తున్నా విజ్ఞతలేకా సంస్కారమంతా మసాయే

అభిశంసలకు ఆక్షేపణలకే వృధా పరిచెడి మా పసాయే

అక్కునజేర్చి చక్కని దెసకు నడిపించమనీ మా కాసాయే


2.స్థాయికి తగని వారైనా ఎదలొ ఎందుకొ జెలసాయే

అనుభవజ్ఞతే ముదిరిన గాని ఎదగని ఒదగని వయసాయే

ఔచిత్యం ఔన్నత్యం లేని వాదమే గురివిందా పూసాయే

మార్మిక పదముల అక్కసుకక్కే తింగరి తింగరి బాసాయే

అక్కునజేర్చి చక్కని దెసకు నడిపించమనిమా కాసాయే

Wednesday, December 15, 2021

https://youtu.be/njTtSbPMiGY

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


తెల్లామద్ది కొమ్మవే - పిల్లా ముద్దుగుమ్మవే

హద్దుపద్దూలేకుండా అందాలద్దబడినపూరెమ్మవే

వద్దనలేనే నీ చూపు సుద్దగు పిలుపులను

వద్దకు తేవే నీ కైపు ముద్దగు పెదవులను


1. మావితోట మరుగు కాడ 

మాటువేసినావే కన్నుగీటినావే

ఏటిగట్టున పొదల కాడ 

 కాపు కాసినావే నాచేయి పట్టినావే


పరువాలను మూటగట్టి మాగబెట్టి నావే

ఏండ్లకేండ్లు నిదుర సైచి ఎదిరి చూసినావే


2.హంపి శిల్పపు వంపులెన్నో 

నింపుకొంటివి ఒంటినిండా

ఖజురహోజాణల భంగిమలెన్నో 

వంపుచుంటివి వలపే పండ


నీకై నేనుంటా బ్రతుకంతా అండదండ

నీతో ప్రతి కలయకా కమ్మని కలకండ


OK

 

https://youtu.be/tnGZwBbqPE8?si=fOL6Ll-FSc097eN2

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాము నీకు తల్పము పక్షి నీ విమానము

పాలకడలిలో నీ నివాసము-నీ ఎదన నీ ఎదుట శ్రీనివాసము

చెప్పనలవి కాదు నీ వైభోగము-శ్రీ వేంకటేశ నీ వైభవము

నను బ్రోవగ ఇవియేనా నాపాలిట ఆటంకము


1.కోటానుకోట్లుగా నీకుండిరి భక్తజనము

నీ కృపకై వేచేరు నీ వాకిట అనుదినము

కన్నుమూసి తెరిచేంతలొ మాయమయే నీ వైనం

పడిగాపులు పడితేనేం భాగ్యమె నీ దర్శనం

చెప్పనలవి కాదు నీ వైభోగము శ్రీ వేంకటేశ నీ వైభవము

నను బ్రోవగ ఇవియేనా నాపాలిట ఆటంకము


2.మొక్కులు ముడుపులు లెక్కలేని కానుకలు

పలురకాల సేవలుగొన పగలురేయి తలమునకలు

నిత్యోత్సవ బ్రహ్మోత్సవ దివ్యోత్సవ వేడుకలు

తిలకించెడి నయనాలకు అదృష్ట దీపికలు

చెప్పనలవి కాదు నీ వైభోగము శ్రీ వేంకటేశ నీ వైభవము

నను బ్రోవగ ఇవియేనా నాపాలిట ఆటంకము

Monday, December 13, 2021


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నీగమ్యం నా గమ్యం ఒకటే ప్రేమ

నీధ్యేయం నా లక్ష్యం ఒకటే ప్రేమ

కడు భవ్యం రసరమ్యం మనదైన ప్రేమ

కమనీయం రమణీయం మనసైన ప్రేమ


1.నీ పయనం ఉత్తరమాయే వింతగా

నా గమనం దక్షిణమాయే చింతగా

వ్యతిరేక దిశలో వెళితే ఎప్పటికౌనో మన కల ఇక  కలయిక

దిక్కులను ముక్కలుచేసైనా కానీయను కలయిక కల ఇక


2.అందరాని ఆకసమైతివి చెలియా చిత్రంగా

అందుకొనగ సంద్రపు కరనైతిని నేనాత్రంగా

నా తీరు మార్చుకొని నేనావిరై మబ్బునై నిన్ను చేరెద

గాలి నను వానగ నేలని చేర్చినా వారాశి అలనై కరిగెద

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నవ్వులు జళ్ళో మల్లెలైనాయి

కన్నులు కరమున కమలాలైనాయి

చూపులు మధువున కైపులైనాయి

తిలకపు చెమకులు  తూరుపు వెలుగుల రేఖలైనాయి

చెలీ ప్రేమాంకురమైంది చూడగనే నీ చిత్రం 

చెలీ నీ చేయినొదలను ఏడుజన్మలు మాత్రం


1.అందమంతా పరచుకుంది నీ అంగాగం

అంతకుమించింకేదో ఉంది నీలో వైభోగం

కదలాడుతోంది వదనాన ఏదో వలపు కవ్వింపు 

ఉసిగొలుపుతోంది ఉల్లాన్నికాస్త చిలిపి ఊరింపు

చెలీ ప్రేమాంకురమైంది చూడగనే నీ చిత్రం 

చెలీ నీ చేయినొదలను ఏడుజన్మలు మాత్రం


2.తలతిప్పనీకుంది పొందికైన నీపొంకం

రెప్పవాల్చనీకుంది ముద్దుగొలుపు నీ మురిపెం

తిప్పలెన్ని పడితేనేమి చేసుకొనగ నినునా సొంతం

ముప్పు వస్తె ముంచుక రానీ అంకితమిస్తా నాజీవితం

చెలీ ప్రేమాంకురమైంది చూడగనే నీ చిత్రం 

చెలీ నీ చేయినొదలను ఏడుజన్మలు మాత్రం

Thursday, December 9, 2021


https://youtu.be/Qz_WvRZftYU

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:యమన్


అదేం గమ్మత్తో -పలుకులు పంచదార చిలుకలవుతూ

అదేం మత్తో-చూపులు పారిజాత చినుకులవుతూ

తలపులు వలపు తలుపులు తడితే

తలగడలు తమకాల పడగలవుతూ…

మనసులు పరస్పరం రమిస్తే

యుగాలే ఫఠేల్మనే బుడగలవుతూ…


1.ఎదిరిచూపులు- ఎదను చీల్చే తూపులవుతూ

రేపులు మాపులు- మునిమాపునకు సైతం రిపులవుతూ

ప్రాపుకోసం దాపుకోసం ప్రాయపుతాపపు తహతహలవుతూ

మనసాకలికి ప్రతీకలవుతూ కనే ప్రతీకల హాయిగొలుపు నెమలీకలవుతూ

అంతలోనే కడువింతగా తనువంతా చింతరేపు మరీచికలవుతూ


2. గంధర్వఅందాలు- మేను మేనంతా మకరందాలే

ప్రవరుణ్ణీ మునివర్యుణ్ణీ రెచ్చగొట్టే ఇందుకళిక గంధాలే

వదనారవిందము పాదారవిందము నయనారవిందాలే

డెందమరవిందచందమై మరుల భ్రమరాలకు రసవిందులే

మధురోహలే ప్రణయ వీణియ మీటగా జీవితమే పసందులే

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:మధ్యమావతి


నాకు కీర్తి నిను కీర్తన చేసినప్పుడే

నాకు తృప్తి నువ్వు  ప్రాప్తించినప్పుడే

నా ఆర్తి నీ పదములు చేరుటొక్కటే

తల్లీ భారతీనను చప్పున బ్రోవుమిప్పుడే


1.తుచ్ఛమైన ఇచ్ఛల ఎడ నా మది మళ్ళించకు

స్వఛ్ఛమైన యోచనలను సమకూర్చవె నా మేధకు

అచ్చెరమొందెడి అచ్చరమవనీ తిరముగ నను జగతీ

మచ్చరమే లేకుండగ మెచ్చనీ సహకవులిల సరస్వతీ


2.రామకృష్ణ కవిని నాడు కనికరించినావటా

రామకృష్ణ పరమహంస ఎదన నిలిచినావటా

రామకృష్ణ నామముతో వరలుచుంటి నీ ఎదుటా

పరమతృష్ణ నిను చేరుట మన్నించవె వాణీ నా మాటా

Tuesday, December 7, 2021

 రచన,స్వరకల్పన&గానం: డా.రాఖీ


ప్రేమ పుట్టి తీరుతుంది నిన్ను చూసి చూడగానే

కన్నుకుట్టి తీరుతుంది అందగత్తెకైనా నీవెదురు పడగానే

తప్పుకానే కాదులే ఎవరికైన నిన్ను తేరిపారచూడగ మనసైతే

తప్పైనా తయారే ఎంతటి శిక్షకైనా పద్మినీ జాతిది నీ సొగసైతే


1.తొంగితొంగి చూస్తాయి భ్రమరాలై నీ ముంగురులు

నీ ముఖారవింద మందు మకరంద మందడానికే ఆ తొందరలు

పందాలు కాస్తాయి నీ జళ్ళోని తెల్లని సిరిసిరి మల్లియలు

నీ మేని మెరుపుల తళుకుల సరితూగవనీ తెలిసీ ఆ హొయలు


2.నీ వాలుచూపులకు వాలిపోదురు ఘనులు మునులు 

నీ కొఱ నగవుకు దాసులౌదురు ఋషులు ఘోటక పురుషులు

చూస్తుండి పోవడానికే  సరిపోదు నాకొక జీవితకాలము

నీ గుండెగ మారడానికి జన్మలెన్ని  ఎత్తాలో లెక్క తేలము

Sunday, December 5, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పులకరించిపోతావు చిరుగాలికైనా

పరవశించిపోతావు చిరుస్పర్శకైనా

మనసా నీవెంతటి బేలవే-మనసా నీవెప్పటికీ బాలవే

పొంగిపోతుంటావు పొగడ్తకు

కృంగిపోతుంటావు తెగడ్తకు

మనసా నీవో పసికూనవే-మనసా నీవో రసవీణవే


1.పట్ట పగ్గాలుండవు నీ ఆనందానికి

భుజంతట్టి ప్రోత్సహించె అభిమానానికి

చెలియలి కట్టే ఆగదు నీ ఉద్వేగాలకి

వెన్నుతట్టి ప్రశంసించు అభినందనలకి

మనసా నువు బలహీన రివటవే నిజంగా

మనసా బహురూపుల నటివే సహజంగా


2.నీరింకి పోని కొలనులు నీ కనుగవలు

అంతులేని అగాథాలు నీ ఎదలోతులు

సంతోషం ఉప్పెనైతే ఆనందభాష్పాలుగా

ఆవేదన గుప్పెడైనా దుఃఖ భాష్పాలుగా

మనసా ఎలావ్యక్త పరచను నీ స్ఫూర్తిని

మనసా ఎలా ఓదార్చను నీ ఆర్తిని

 https://youtu.be/jfciM6p0qxM


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రూపు సంతరించుకొని-అమ్మ కడుపుచించుకొని

అవనిపై అవతరిస్తుంది ప్రతి జీవం

అర్ణాలు సంకలించుకొని-గళమును పెకలించుకొని

పదమై విస్తరిస్తుంది అలాగే భావం

గండాలెన్ని దాటాలో -అండం పిండమయ్యేలోగా

అడ్డంకులెన్ని కడపాలో -మనసు మాటయే లోగా


1.అంతరంగమందు -ఎంతగా వేయనీ చిందు

పెదవి దాటునంత వరకే -ఆలోచన మనకు చెందు

ఆచితూచి అడుగేయాలి-తు.చ.తప్పక నుడుగేయాలి

తడబాటు ఉన్నచోటు-మన మనుగడకు చేటు


2.ప్రయోగిస్తె అక్షరం-చెడు ఎడల అక్షరమౌతుంద (అక్షరం=కత్తి)

ప్రక్షాళణ చేయగ అక్షరం-మంత్రాక్షరమౌతుంది (అక్షరం=జలం)

రక్షణే లక్ష్యంగా అక్షరం-ప్రత్యక్ష అక్షరమౌతుంది (అక్షరం=పరమాత్మ)

ప్రజల నోటనానిన అక్షరం-శాశ్వతమై అక్షరమౌతుంది (అక్షరం=మోక్షం)


OK

Saturday, December 4, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బ్రతుకు నీది భవిత నీది

ఆశ నీది శ్వాస నీది

ఆశయాల పాట నీది

ఒడిదుకుల బాట నీది

గమనం అప్రతిహతంగా

గమ్యం అనితర సాధ్యంగా


1.ఒకడిగా విస్ఫోటమై సమాజంగ మారడం

సమాజపు జాడనొదిలి నీ లోలోకి చేరడం

ఒంటరిగా …మౌనంగా…దైన్యంగా… శూన్యంగా

అవమానం… సన్మానం…  సమంగా…ఆనందంగా

గమనం విలాసంగా గమ్యం కైలాసమే విలాసంగా


2.ఆటంకాలు సంకటాలు సంకల్పానికి కంటకాలు

ఆవేశాలు విద్వేషాలు ఉద్దేశ్యాలకు విఘాతాలు

కప్పదాటుగా వెన్నపోటుగా చాటుమాటుగా వేటువేయగా

సహనంగా… సాధనగా…సులభంగా… సుసాధ్యమవగా

గమనం వినోదంగా పదాల గమ్యమే పరమపదంగా

 https://youtu.be/bWfepbBJ6Hg


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


తిరుమలేశ కేశవా నమో

వేంకట నారాయణా నమో

రమాధవా మాధవా నమో

కోనేటిరాయా గోవిందా ప్రభో

పాహిపాహి పద్మావతి ప్రియ విభో


1.విష్ణవే నమో మధుసూధనా

శ్రీధరా త్రివిక్రమా నమో వామనా 

హృషీకేశ పద్మనాభ నమో సంకర్షణా

దామోదర వాసుదేవ నమో ప్రద్యుమ్నా

కొండల రాయా గోవిందా ప్రభో

దేహిదేహి అలమేలు మంగా విభో


2.అనిరుద్ధా పురుషోత్తమ నమో అధోక్షజా

నారసింహ అచ్యుతా నమో హే జనార్ధనా

ఉపేంద్రాయ హరయే నమో నమో శ్రీ కృష్ణా

శరణాగత వత్సలా శ్రీనివాస నమో దీనావనా

కొంగుబంగార మీవె గోవిందా ప్రభో

పరి పాలయమాం స్వామీ  శ్రీ విభో

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాటవమున్న పాట మీరు

పరిమళాలు గుప్పెడి పూదోటమీరు

వర్ధమాన కవులకు రాచబాట మీరు

ఏనాటికైనా మేము చేరాలనుకొనే ఎత్తైన చోటు మీరు

చేంబోలు సీతారామశాస్త్రిగారు సిరివెన్నెల అయింది మీ ఇంటిపేరు


1.మీదైన అరుదైన ముద్ర మీ సినీగీతాలది

రాజీ పడని హుందా చెడని చక్కని శైలిమీది

విషయమెంత వైవిధ్యవంతమైనా రాసారు హృద్యంగా

మీకలం మీ కవనం మీదయా గుణం అనితర సాధ్యంగా

ఏనాటికైనా మేము చేరాలనుకొనే ఎత్తైన చోటు మీరు

సిరివెన్నల సీతారామ శాస్త్రిగారు అంతలోనె మమ్మెలా వీడినారు


2.సమకాలీనులకు మీరే పరమాద్భుతంగ

 అందుకున్న పద్మశ్రీ బిరుదుకే వన్నెలు తేగ

సముచితమైన సుస్థిర స్థానం మీది సినీ జగత్తులో

తరతరాలు ఓలలాడేరు పిపాసులు మీ కవన మత్తులో

ఏనాటికైనా మేము చేరాలనుకొనే ఎత్తైన చోటు మీరు

సిరివెన్నల సీతారామ శాస్త్రిగారు ధన్యులు మీరీశునిలో ఐక్యమొందినారు౹