మా ఊరు ధర్మపురి- మాదైవం నరహరి-గలగలా పారే -గోదావరి మాకు సిరి-జగతిలోనలేనె లేదు దీనికేదీ సరి-కళలకు కాణాచి- వేదాలకు పుట్టిల్లు-విద్వఛ్ఛికామణుల కాలవాలమైనది
gamanika:
నా టివి ప్రోగ్రాం మరియు రికార్డ్ అయిన పాటలకోసం(naa recorded songs and TV show-plz click the links)
- -కొత్త పాటలు -UPDATED ON 13-11-2012RAKI-SRI MANIKANTHA MAHIMA
- కొత్త పాటలు -UPDATED ON 13-11-2012-RAKI-SRI MANIKANTHA GEETHARCHANAM
- కొత్త పాటలు -UPDATED ON 13-11-2012 RAKI-OM GAM GANAPATHAYE NAMAHA
- DHARMAPURI NRUSIMHAA-27-02-2012 VIDUDALA UPLOADED ON 28-02-2012
- VEMULADA RAJANNA MANASU VENNA SHIVARATRI-2012 VIDUDALA UP LOADED ON 28-02-2012
- e link nundi kuda "DAYAMRUTHA VARSHINI"AUDIO SONGSdownload chesukovacchu
- FREE DOWNLOAD AVAILABLE/ PLZ PUT A COMMENT REGARDING LYRICS TUNES MUSIC AND SINGERS @ naa geethaalu(my recorded audio songs
- ***NEW ONE/RAKI-DAYAMRUTHAVARSHINI RELEASED ON 25-09-11-updated on 22-10-2011)
- my elder son short film
- naa videos ayyappa,maa tv,dharmapuri utsavalu pandugalu.godavari
- కవితల కలకలం(వచన కవితలు)
- నిత్యం-నానే-సత్యం(నానీలు)
Thursday, July 30, 2009
నా ప్రేమనే కాదన్నది
మనసేమిటో మనిషేమిటొ
ప్రేమేమిటొ మనువేమిటొ
అసలే ఎరుగని ఆ చిన్నది-నన్నే కాదన్నది
1. ఏ తోటలోనున్నా నీ పాటపాడేను
ఏ చోట నేనున్నా నీ రూపు కంటాను
దయలేని ఓ చెలీ అందాల కోమలీ
నిన్నే తలచి నిన్నే వలచిన నాపై కోపమా
2. నీ కొఱకె నా వలపు-తెఱిచాను ఎద తలుపు
మనసైతె నీ పలుకు-ఏనాటికైనా తెలుపు
ఎన్నాళ్ళు అయినాగాని-ఎన్నేళ్ళు అయినాగాని
నీకై చూచే యుగాలు వేచే నన్నే మరువకే
3. చెలికోసమే నా ప్రాణము-చెలిమీదనే నాధ్యానము
చెలి లేని నా జీవితం-వలదన్న దుర్దినం
మల్లెలు విరియని-కోయిల కూయని
తిమిర వసంతం
వయ్యారాల రాజ హంస నీవేలె ఊర్వశీ
కరుణించి రావేల దరిజేరగా
కౌగిళ్ళలో నన్ను కరిగించగా
1. నీలి మేఘమాల జాలిజాలిగ నేడు బేల చూపులు చూసె నెందుకో
గాలి తాకని మేను తేలితేలి ఆడు అనుభూతి లేనందుకో
విరహాల ఈగోల తరహాల మధురాలు నీవెరిగినవేలే
పరువాల ప్రాయాల ప్రణయాల కలహాలు అత్యంత సహజాలే
2. కలలోన నీవేలె ఇలలోన నీవేలె కనులు మూసి తెరచిన నీవేలే
పాటల్లొనీవేలె మాటల్లొ నీవేలెతీయని తేనె విరుల తోటల్లొ నీవేలే
క్షణమైన నువులేక యుగమైన చందాన మోడాయెనే జీవితం
నింగి జాబిలి కోసం నీటి స్నేహం వీడి కలువ అవుతుందిగా అంకితం
OK
చేసుకున్నవారికి పుణ్యం చేసుకున్నంత స్వామి
నోరారా పిలిచితె పలుకడా మణికంఠుడు
దోసిలొగ్గి అడిగితే వరమీయడ అయ్యప్పా
తులసిదళంతోనే స్వామిని తూచింది రుక్మిణి
ఎంగిలి పళ్ళతోనె స్వామిని మెప్పించెనుగా శబరి
పిడికెడు అటుకులకే స్వామి వశమాయెను కుచేలునికి
ఒక్క మెతుకు తోనే స్వామి కడుపు నింపె ద్రౌపది
జోలెనింపే స్వామికి కానుకలను వేయతరమా
సర్వాంతర్యామి స్వామికి శరణుఘోషనే ప్రియమా
కొండంత అయ్యప్పకు గోరంత దీపం పెట్టి
వరములిచ్చే స్వామికి కరములు జోడించగలం
చేసుకున్నవారికి పుణ్యం చేసుకున్నంత స్వామి
నోరారా పిలిచితె పలుకడా మణికంఠుడు
దోసిలొగ్గి అడిగితే వరమీయడ అయ్యప్పా
దేహబలము నాలోన పెంచవేమయ్య స్వామి
ఓపికా ఒద్దికా నేర్పించవయ్యా స్వామి
పరోపకారబుద్ది ప్రసాదించవయ్య స్వామి
చేసుకున్నవారికి పుణ్యం చేసుకున్నంత స్వామి
నోరారా పిలిచితె పలుకడా మణికంఠుడు
దోసిలొగ్గి అడిగితే వరమీయడ అయ్యప్పా
ముక్తి మార్గమే జూపవా
హారతిదే గొనుమా
1. నీవే వేరని నాలోలేవని భ్రమ పడినాను
నీవే నేనని నేనే నీవని తెలుసుకున్నాను
నీవే నేనైతే నేనే నీవైతె ఎందులకీ తేడాలు
తండ్రి బాధించు తనయుని గావగ
దితిసుతు దునుముటకై
స్తంభము నుండి దిక్కులదరగా
వెలసిన దేవా మహానుభావా
2. గోదావరిలో మునిగి నంతనే
తొలగి పోవును శాపాలు
నీదరి(ధర్మపురి) జేరగ కరుణతొ జూడగ
చేయను నేనే పాపాలు
శిష్ట రక్షకా దయాసాగరా
దుష్ట శిక్షకా ధర్మపురీశా
నా ప్రాణదీపమే హారతిజేసి
అర్పించెద బ్రతుకు నైవేద్యంగా
నీకిది న్యాయమేనా
నామీద నీకింత పంతమా
రఘురాముడికే తామసమా
తన దాసులంటే నిర్లక్ష్యమా
1. త్యాగరాజులా రాగాలు తీయ గొంతునీయలేదు
రామదాసులా కోవెల కట్ట పదవినీయలేదు
గుహుడిలాగా పూజించుదామంటే నన్ను చేరలేదు
హనుమలాగా సేవించుదామంటే నాకు కనరావు
2. వెదకి వెదకి నేను వేసారినాను
ఆశవదలక మరిమరీ అడుగుతున్నాను
ఎదీ ఇవ్వకున్నా నిన్నే వేడుతున్నా
ఇంకా రావేలరా రాఘవా నీకీ జాగేలరా.
Wednesday, July 29, 2009
అసలు ప్రేమంటేనే ఓడడం
నువు ప్రేమిస్తే ఖాయం చావడం
1. ప్రేమ పొందడమె ఒక వరము
ప్రేమించడమే సహజం
ఆ ప్రేమే ఫలించకుంటే బ్రతుకే ఒక శాపం
ప్రేమే కలరా-ప్రేమే ఓ భ్రమరా
2. ఎన్ని చరితలో ముగిసాయి
ప్రేమ కొఱకు బలియై
ప్రేమించడమే నేరమని-ప్రతిసారీ ఋజువై
ప్రేమే మండు వేసవి-ప్రేమే ఓ ఎండమావి
3. మనసే ప్రేమకు నిలయం
ప్రేమే ఓ విషవలయం
ఎన్నటికైనా చేరే గమ్యం-నరకం నరకం నరకం
ప్రేమే వడగాలి-ప్రేమే హిమజ్వాల
OK
పూచింది నీకై
వయసు చక్రవాకమై
వేచింది నీకై
1. జన్మాంతరాలదీ మనప్రేమ బంధం
జగదేక మోహనం మనజంట అందం
సాగిపోని జీవితం-జలపాతమై
2. నా హృదయ మందిరం నీవల్ల సుందరం
కరుణించవేమే నా ప్రణయదేవి
జరిగిపోని సంగమం-రసగీతమై
OK
ఎంతవింతదైనదయ్య స్వామి ఆ మాట
మాయలోడివయ్య నీవు మణికంఠా
నిన్నె నమ్ముకొంటినయ్య ఎట్టాఎట్టా
ఎంతవింతదైనదయ్య స్వామి ఆ మాట
మాయలోడివయ్య నీవు మణికంఠా
నిన్నె నమ్ముకొంటినయ్య ఎట్టాఎట్టా
శబరీ కొండలపైన ఎక్కడో దూరాన
ఎక్కికూర్చొన్నావు అందనంత ఎత్తున
సంసార సాగరమున మునకలు వేస్తూనేను
చిక్కుబడి ఉన్నాను చిత్రమైన మత్తున
బ్రతుకు నావ నడిపేటి ఓదిట్టా
నెయ్యమైతె చెయ్యవు నాతో-నెయ్యేమో కోరుతావు
ఇడుములనెడబాపవుగాని-ఇరుముడిని అడుగుతావు
దీపమేది చూసినా నీ రూపే తోచాలి కదా
నాదమేది చేసినా ఓం కారమవ్వాలి కదా
మనోరథం తోలేటి ఓ సారథి
నా ఇంద్రియ పగ్గాలు నీకే కద ఇచ్చితి
ఎంతవింతదైనదయ్య స్వామి ఆ మాట
మాయలోడివయ్య నీవు మణికంఠా
నిన్నె నమ్ముకొంటినయ్య ఎట్టాఎట్టా
బూడిదనువు పూసుకొని-చలికి తట్టుకొంటావు
శ్రీ గంధం రాసుకొని- వేడినధిగమిస్తావు
కింకిణొడ్యానమే ఇంపుగ ధరియించుతావు
అభయ ముద్రనైతె స్వామి-డాబుగ నువు దాల్చుతావు
ఈ సంగతి కేమి గాని అయ్యప్పా-నా సంగతి చూసినపుడె నీ గొప్ప
ఎంతవింతదైనదయ్య స్వామి ఆ మాట
మాయలోడివయ్య నీవు మణికంఠా
నిన్నె నమ్ముకొంటినయ్య ఎట్టాఎట్టా
నోరార పిలిచినా పలుకవేమి రఘువరా
1. శివుని విల్లు విఱిచి సీతమ్మను మనువాడిన కళ్యాణరామా
రక్కసులను సంహరించి లోకార్తిని బాపిన కోదండరామా
శతకోటినామా నిన్నేమని పిలిచేదిరా
కారుణ్యధామా నిన్నేవిధి కొలిచేదిరా
2. ఎన్నిపూవులెన్నిమాలలెన్నిపరిమళాలనర్పించేనో
ఎన్నిపూజలెన్ని భజనలెన్ని గీతాలకీర్తించేనో
నోరొక్కటిచ్చావ్ నువు మౌనం దాల్చావు
అఱచి మొత్తుకున్నగాని అసలే వినకున్నావు
3. త్యాగరాజు రామదాసు నీభక్తులు అని అందరు అంటారు
ఆంజనేయుడెప్పుడు నీ చరణదాసుడంటారు
పక్షపాతమంటె నీకు పరమ ఇష్టమా రామా
రాఖీని బ్రోవగ నీకింకా సందేహమా
Tuesday, July 28, 2009
ప్రేమే మనిషికీ సర్వము
ఆ ప్రేమే చెదరిన నాడు-ఆ మనసే రగిలిన నాడు
జీవితమే ఒక శాపము- బ్రతుకే సంతాపము
1. ప్రేమించేది ప్రేమను పొందేదీ మనిషి యనీ
స్పందించేది స్పందింపజేసేది మనసని
తెలుసుకొనే మనసు నర్పించావు
ప్రేమకు మూలం ఎద స్పందననీ
మనసుకు అందం అనురాగమనీ
మనిషిగా ప్రేమను అందించావు
ప్రేమే నీకు ధర్మమని మనిషే నీకు సర్వమని
తెలుసుకొనే మనిషికై తపియించావు
2. ఓడడం జీవిత సత్యమని
చావడం మనిషికి నిత్యమని
తెలుసుకొనే తలవంచావు
మనిషికి గమ్యం శూన్యమనీ
ప్రేమకు త్యాగం తథ్యమనీ
తెలుసుకొనే మనసును బంధించావు
బ్రతుకే ఇక సన్యాసమనీ
త్యాగమే నీకు శరణ్యమని
ఆఖరికీ చేదు నిజం గ్రహించావు
3. ప్రేమకు ముందు బ్రతుకు సుఖవంతం
మనిషికి శాశ్వతమే వేదాంతం
ప్రేమకథలు నిత్య వ్యధలు అనంతం
ప్రేమ ఊబిలో దిగితే బ్రతుకే అంతం
నాహృదయమే నీకంకితం
నీవులేని ఈలోకం
చెలీ అంతా శూన్యమే
1. ఏది చూసినా నీరూపమే
ఏమి పాడినా నీ గానమే
ఎపుడు తలచినా నీతలపే
ఎవరుపిలిచినా నీ పిలుపే-చెలీ
2. నీవుంటె యుగమే క్షణము
లేకుంటె క్షణమొక యుగము
నీవే ప్రేమకు అర్థము
నీతోటి బ్రతుకే ధన్యము-చెలీ
3. సంసార రథమున సారథి నీవే
మనసార కొలిచే దేవత నీవే
నేను కోరేది నీ అనురాగం
అందుకేనా ఆరాధనం -చెలీ
ఆర్థుల గను ప్రార్థన విను సంకట హరణ
నోరారా పిలిచినా పలుకవ దేవా
మనసారా కొలిచినా పరుగున రావా
1. ప్రాపంచిక చింతనలో పాపుల మైనాము
అరిషడ్వర్గాలతొపరి తాపులమైనాము
మా కన్నుల మాయ పొరలు తప్పింపగ రావా
మా ఎద చీకటుల తెఱలు తొలగించర దేవా
2. పరమార్థము మేమెరుగక అర్థము కోరేము
నీ పదసన్నిధి సుఖమెరుగక నిధులను అడిగేము
మదిలోపల నీ నామము మరువనీకుమా
కలనైనా మా తలపుల నిలిచియుండుమా
సంకలోనా పిలాజెల్లా
కూడిమేము నీ కాడికొస్తిమి ఓ నరుసయ్యా
కనికరించి కాపాడుమంటిమి దరంపూరి నర్సయ్య
1. పట్టెనామాలు కోఱమీసాలు పట్టుకొస్తిమి ఓ నరుసయ్యా
దీటుగా సింగారించవో దరంపూరి నర్సయ్య
పప్పుబెల్లాలు కుడుకలు పండ్లు నీకు ఫలారం ఓనర్సయ్యా
ఆరగించి నీ దయ ఉంచు దరంపూరి నర్సయ్య
2. పాడిపంటా పిల్లామేకా సల్లంగ సూడవో నరుసయ్యా
పాపాలనన్ని పోగొట్టె తండ్రీ దరంపూరి నర్సయ్యా
గంగలొ మునిగి తడిబట్టతోనే నీ గుడిచేరేము నర్సయ్యా
సంసార కూపం బహుజన్మ పాపం దరిజేర్చుకొ నర్సయ్యా
OK
Sunday, July 26, 2009
వదిలిపోయెనా ప్రేమ మైకం
చెఱిపి వేయరా చెలియ రూపం
గతమే నీకొక శాపం
1. ఇలను విడిచి నిజము మరచి
ఊహలలోనా అలసి సొలసి
నింగి నుండి నేలబడిన
ప్రణయ జీవీ తెలుసుకోర
2. ఎదుటి మనసు తెలుసుకోక
కన్నుమిన్ను కానరాక
నీకు నీవే మోసపోతివి
తపన వీడి సాగిపోరా
3. జరిగిపోయినది ఒకపీడ కలగ
ప్రేమాయణమే కలలోని కథగ
చేదు బ్రతుకే పచ్చినిజమని
సగటు మనిషీ ఎరుగవేర
అవుతుంది ఏ జలమైనా తీర్థము-ఈ మాయ లోకంలో
మర్మమెరిగితేనే పరమార్థము
1. కాషాయం కట్టి చూడు కాళ్ళకు మొక్కేస్తారు
విభూతినే పెట్టిచూడు విప్రవర్యుడంటారు
వేషాలకున్న విలువ వాస్తవాని కెక్కడిది
అషాఢభూతులకే అందలం దక్కెడిది
2. వెనక నుండి వెయ్యి పోయినా లెక్కచేయరు
కళ్ళముందు కాసు పోయినా కలవర పడతారు
కుళ్ళి కంపు కొడుతున్నా అత్తరు చల్లేస్తె చాలు
అంతరంగ మేదైనా నవ్వులు చిందిస్తె మేలు
3. మౌనాన్ని ఆశ్రయించి మునిలా ముసుగేయవచ్చు
మాటకారి తనముంటే ప్రవక్తలా బోధించవచ్చు
ఏ ఎండకా గొడుగు పట్టగలుగుడేనా లౌక్యం
మోసమో విశ్వాసమో తేల్చుకో ఏదో ముఖ్యం
OK
కళల తల్లీ వినతి జేసెద
బుద్దినీ యభివృద్ధినీ సమృద్ధిగా దయసేయవే
1. జిహ్వపైనా జనులు వహ్వా యన వసింపవె భారతీ
గొంతులోనా మేధ లోనా కొలువుదీరవె భగవతి
వేడగానే వేడ్కదీర్చే వేల్పువేనీవు
నీ పదములందున హృదయముంచెద
పదముల సంపదల నీయవె
2. భవములో అనుభవమునే అందించవేమమ్మా
రాగమందను రాగమే చిందించ వేమమ్మా
మరపునే మరపింప జేసే శారదాంబవు నీవె కావే
నీ చరణములనే శరణమందును
చరణముల సద్గతిని నడపవె
OK
వందనమ్మిదె నంది వాహన –వందనమ్మిదె గొను దిగంబర
1. అపరకైలాస మా హిమగిరిని వసియించు కేదారీశ్వర వందనం
జాలువారిన గంగ కడకొంగు విడవని విశ్వనాథా వందనం
ప్రణవ నాద స్వరూప మాంధతృ పురవాస ఓంకారేశ్వర వందనం
ప్రళయ తాండవ రుద్ర రూపా హర హర మహాకాలా వందనం
2. మూడు నేత్రాల రూపుతో నెలకొన్న త్రయంబకేశ్వర వందనం
భూతనాథా నమో ఢాకిన్యేశ్వరా శివ భీమ శంకర వందనం
దారుకావన వాస లింగ గౌరీశ శంభో నాగేశ్వరా వందనం
బాధనెరిగి బదులు పలికే పరలి పురవాస వైద్యనాథా వందనం
3. అర్ధ దేహము అమ్మకొసగిన సోమనాథా వందనం
పాశుపతము పార్థు కొసగిన మల్లికార్జున వందనం
మా కాముణ్ణి గాల్చినా ఎల్లోరావాస గృష్ణేశ్వర వందనం
శ్రీ రాముణ్ణి బ్రోచిన సేతుతటవాస రామేశ్వరా వందనం
ఈ రాఖీని కాచేటి ధర్మపురివాస గౌతమితటనివాస
శ్రీరామ లింగేశ్వరా వందనం వందనం వందనం
Saturday, July 25, 2009
మయూరమా సరేనని నీ గాత్రం నచ్చారా
రాయంచా కాదుకదా నీ పలుకే రమణీయం
రాచిలుకా కానేరదు నీ నాట్యం కమనీయం
అందమో గాత్రమో నడకో నాట్యమో
ఆటలో పాటలో తెలివి తేటలో
అందరికీ ఉంటుంది ఏదో నైపుణ్యము
ఎరిగిమెలిగితేనె కదా ప్రతి జన్మ సార్థకము
1. టెండుల్కర్ ఎపుడైనా గ్రాండ్ మాస్టరయ్యేనా
విశ్వనాథనానంద్ వింబుల్డన్ గెలిచేనా
కమలహాసన్ ఓలంపిక్ పథకాలు తెచ్చేనా
సానియామీర్జాకు అస్కారవార్డ్ వచ్చేనా
అందరికీ ఉంటుంది ఏదో నైపుణ్యము
ఎరిగిమెలిగితేనె కదా చేరేరు శిఖరాగ్రము
2. అబ్దుల్ కలాం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలడ
బచెంద్రిపాల్ ఇంగ్లీష్ ఛానల్ని ఈదగలద
మెహర్సేన్ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడా
గాంధీజీ అణుబాంబును కనిపెట్ట గలిగాడా
ప్రతి వారికి ఉంటుంది ఏదో నైపుణ్యము
తనలోని ప్రతిభ నెరిగి మెరుగుపెడితె ధన్యము
3. ఐశ్వర్యారాయ్ కి సంగీతం ఎంతతెలుసు
ఏఆర్రెహమాన్ బాపులా కుంచెనెలా కదిలించు
ఐన్ స్టైన్ గొంతెత్తి రాగాలు తీయగలడ
జేసుదాసు జనులు మెచ్చు నాట్యాలు చేయగలడ
ఎవరైనా వారివారి రంగాల్లోనె నిష్ణాతులు
సాధనతో సాధించి అయినారు పరిపూర్ణులు
నా డెందము నందున చిందరవందర
మందమతిని నేనరవిందానన
వందనమందును హరిహర నందన
1. ఎందులకు స్వామి ఈ ఏడు రంగులు
జ్యోతి స్వరూపా నిను గననీయవు
దేనికి స్వామి ఈ సప్త స్వరములు
ఓంకార రూపా నిను విననీయవు
2. ఇంద్రియ నిగ్రహము ఇలలోన బూటకము
అరిషడ్వర్గమును గెలుచుటయె నాటకము
స్థిరచిత్తమను మాట నిజమగు నీటి మూట
నీ నామ స్మరణయె చక్కనైన దగ్గరి బాట
3. పలుమార్లు నేనతి యత్నమ్ము తోడను
ఈ పాప కూపము నధిరోహణము జేయ
నా పట్టు తప్పించి నిర్దయగ పడద్రోయ
తగనేరదయ్యప్పా నే పసివాడను
4. తెలియదను కొంటివా నీ మోహగాలము
ఎరుగననుకొంటివా నీ మాయ జాలము
నాగతివి నీవే శరణాగతివి నీవే
పతిత పావన సద్గతినీవె పాహిమాం
OK
సిగన యుంచుకొంటివా
గిరిజమ్మ దేజాతి రా
సగభాగము నిస్తివా
1. శీలమే లేదన్న శశాంకుడినీ నీవు
శిరము నెక్కించు కొంటివా
తీరికే లేనట్టు కోరికే లేనట్టు
నీ జుట్టు జడలు కట్టేనేమిరా
2. జగములను కాల్చేటి బడబాగ్నినీ నీవు
కంటి యందుననుంచు కొంటివా
ప్రాణాలు తీసేటి కాలకూటమును నీవు
కంఠమందున నుంచు కొంటివా
3. చూపులోనా భయము గొలిపెడి
పాములా నీకు కంఠహారాలు
తలపులోనా వొళ్ళు జలదరించేటి
శార్దూలచర్మమా నీదు వస్త్రమ్ము
4. చోటెచట లేనట్టు అది తోటయైనట్టు
శవవాటిలో తిరిగేవురా-కాటితో పనియేమిరా
వేడినసలోపలేనట్టు-అది వేడుకైనట్టు
మంచుకొండన ఉందువేరా-చలి ఇంచుకైనా వేయదారా
5. నంది నీ వాహనమ్మా
భృంగి నీ సేవకుండా
రక్కసులె నీ భక్తులా
భూతగణములె నీకు సేనలా
6. గజముఖుడే సుతుడు
షణ్ముఖుడె ఆత్మజుడు
ఆంజనేయుడు నీ అవతారమా
ఈ రాఖీని బ్రోవగా భారమా
7. లక్ష్యమే లేని భిక్షగాడివి నీవు
మోక్షమ్ము నిచ్చేటి జంగమ దేవరవు
ఆది అంతము లేని అంతరంగము నీది
ఉండిలేనీ స్ఫటిక లింగరూపము నీది
8. రూపు చూస్తే భోలా శంకరుడవు
పిలువగనె పలికేటి దేవుడవు నీవు
కోపమొస్తే ప్రళయ కాల హరుడవు
లయ తాండవము జేయు రుద్రుండవు
https://youtu.be/7pofGbxOmNY?si=qSL_6oHGoL1xVkfK
రచన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
*రాగ మాలిక స్వర కల్పన:*
*శ్రీ కొంటికర్ల రామయ్యగారు(వేములవాడ దేవాలయ ఆస్థాన సంగీత విద్వాంసుడు)*
శ్రీ జ్ఞాన సరస్వతి
సర్వ కళా భారతి- పరాత్పరి
(కామవర్ధిని/పంతువరాళి)
1.ఓంకార సంభవి గాయత్రి దేవి
శ్రీకార రూపిణి శారదామణి
జగముల గాచే జగదీశ్వరీ
శుభముల కూర్చే పరమేశ్వరి-----------(రేవతి)
2. ఏమని పాడను గానవాహినివీవైతే
ఏమని పలుకను వాగ్దేవివీవైతే
ఏ పాటకైనా ఏ మాటకైనా
నీదయలేనిది విలువేమున్నది----------- (చంద్ర కౌస్)
3. బాసర పురమున వెలసిన దేవి
మామానసమందున నిలువవేమి
( సింహేంద్ర మధ్యమం)
నీ గానములో నీ ధ్యానములో
సర్వము మరచితి నిన్నే తలచితి (సరస్వతి)
Friday, July 24, 2009
వెన్నెల కాస్తే దోషం
మల్లిక పూస్తే పాపం
వింత లోకం
1. వానకారు జోరుగానే-సాగుతున్నా మూగవోవా
వేళకాని వేళలోనే-తీపిరాగం తీయనేల
పికజాతి ధర్మాన్ని భేదించనేల-గీసిన గిరి గీత ఛేదించనేల
ఏ స్నేహ యోగం ఇకనీకు లేదు-ఒక మౌన యాగం నువు చేస్తె చాలు
2. కార్తీక మాసం కానైన కాదు-పున్నమి దివసం ప్రతి రోజు రాదు
అమవాస్య నాడేల అమృతాల జల్లు-మేఘాల తెరలున్న వెలుగేలరాజిల్లు
ఓచకోరికోరిక తీర్చాలనా-ఈ కాలచక్రాన్ని మార్చాలనా
విధి రాత కెపుడు ఎదురీదబోకు-మితి మీరకెపుడు అది మేలు నీకు
3. గుండె మండే ఎండకాలం-కానే కాదు ఇది చైత్రమాసం
తోటమాలి నాటలేదు –ప్రేమ తోటి పెంచ లేదు
అడవైన గాని పూస్తే ఎలా-పందిళ్లు లేకున్న పాకేవెలా
ఈ తొందరేల సౌందర్య బాల-ఆరారు ఋతువుల్లొ అందేవెలా
హృదయాలను రగిలించకు కౄరుడా
చీకటి ఎదలో బాకులు దూర్చే హంతకుడా
తిమిరాంతకుడా
1. ఏమందం ఏడ్చిందని అంతగా చూస్తావు
గుండ్రాయిని శిల్పంగా ఎందుకు భావిస్తావు
ఆశలు కలిపిస్తావు వేదన రగిలిస్తావు
కన్నుమూసి తెఱిచేంతలొ కనుమరుగైపోతావు
2. ఉన్నచోట ఉండూ అదో సుఖం
అనుకున్నది సాధించు అమర సుఖం
పిందెను వదిలేయకా-ఫలముగ మార్చేయక
రెండింటిని చెడగొడితే- రేవడివై పోతావు
3. కిరణాలున్నాయని-కాల్చేయడమేనా
సయ్యాటే అనుకొని తొంగి తొంగి చూడడమా
ప్రతియేడు గ్రహణమెందుకూ-ప్రతినిత్యం మరణమెందుకు
తగదు నీకు ఈ రీతి బ్రతుకు-తగవులేని వేరు దారి వెతుకు
భ్రమరాన్ని లేపే కుసుమానివా
సమరాన నిలిచే వీరనారివా
ఎవరివో తెలుపవే నా స్వప్న సుందరి
1. ఎన్ని మార్లు పాడినా విసుగురానిదీగీతం
ఎన్నినాళ్లు చూసినా తనివితీరని నీరూపం
నాగీతానికి నీ జీవితమే సంగీతం
నీరూపానికి నా భావనయే ప్రతిరూపం
2. నీ దరహాసమె మలయ మారుతం
నీ మధురగాత్రమె కోయిల గానం
నీకోమల దేహం నవపారిజాతం
నీవే నీవే నా ఆరవ ప్రాణం
3. నేనిర్మించలేను తాజ్ మహలు
నేనంపలేను మేఘధూతికలు
నాలో ఉన్నది ప్రణయావేశం
చేయవే నీ హృదయం నావశం
OK
మహిషాసుర మర్ధినీ
మహిమ జూపవే మరియొక సారి
నీదునామము జపియించు దేశమును
నీ ఆలయాలు గల ప్రదేశమును
నీ మహోత్సవ శుభ సమయాన
నీ దివ్య ధామమును ఈ దీనజనులను
1. మహిషులెందరో కైటభులెందరొ
శుంభనిశుంభుల వారసులెందరొ
మదము మీరి విర్రవీగి దీనజనుల నణగద్రొక్కి
పైశాచిక నృత్యము చేయువేళ||మరచితివే||
2. అజ్ఞానమున అల్లాడుజనులు
వివేచన లేని నిరక్షరాస్యులు
నీ కృప గనని విద్యాసక్తులు
ఆదరణలేని కళాకారులు
ఎందరెందరో ఉందురందువే శరదిందు వదనే భారతీ
మరచితివే మము వాగ్దేవి
వీణా పుస్తక ధారిణీ
మహిమజూపవే మరియొకసారి
3. దారిద్ర్యము తాండవమాడే
చోరత్వము శివమెత్తిపాడే
ఋణము’లే దా’రుణములాయె
ౠక’లే కా’రణములాయే
ఎందుకీరీతి జరిగెనో మరి
నీకు తెలియదే రమా సుందరి
మరచితివే మము శ్రీ దేవి
మా నరసింహుని హృదయేశ్వరి
మహిమజూపవే మరియొక సారి
Thursday, July 23, 2009
అది పూవులు పూచేదా
ఆ పూలతేనె చేదా
నా ఊసే నీకు బాధా ,నారాధా
1. అనురాగ ధారా-కురిపించ రాదా
నానేరమేదో ఎరిగించరాదా
ఎంతకాలమనియీ రీతి సాగాలి
ఆకులన్ని రాలి ఆశలన్ని కాలి మోడై నిలవాలి
2. నీ వసంతం నాకు సొంతం
చేయాలంటే ఏల పంతం
నాలో లేనిదేదో ఏదో అదిఏదో
నేనంటే నీకు పగనా నేనసలే నీకు తగనా చెప్పరాదా
3. పాలముంచ నమ్మించేవు
నీటముంచి వంచించేవు
మనసంటేనే నీకో క్రీడనా
బ్రతుకుతోటి ఆడి నట్టేట్లో నను వీడి నవ్వేవా
ఎంత పిలిచిన పలుకవా
మాధవా భావ్యమా-నీకిది న్యాయమా
1. నల్లనయ్యా రాకకోసం ఎదురుచూసే కనులు పాపం
కపటమెరుగని కన్నెపిల్లను ఎందుకయ్యా ఇంత కోపం
రాసలీలను మరచినావా- రాధతోనే అలసినావా
అలుక మానర మాధవా-నాదు ప్రార్థన ఆలకించవ
2. మబ్బుచాటుగ చందమామా తొంగితొంగి చూసినప్పుడు
గునమావి కొమ్మమీద కోయిలమ్మ కూసినప్పుడు
మదిలొ రేగే వింత తాపం-ఓపలేనీ మధుర విరహం
నాలొనీవే నిలిచిపోవా-నన్ను నీలో కలుపుకోవా
పలుకుపలుకున స్వామి శరణం-స్వామిశరణం స్వామిశరణం
మనిషి మనిషికీ స్వామి శరణం-స్వామిశరణం స్వామిశరణం
మనసులోపల స్వామి శరణం-స్వామిశరణం స్వామిశరణం
1. నిద్రలేవగనె స్వామి శరణం-స్నానమాడినా స్వామి శరణం
పూజచేసినా స్వామి శరణం-హారతిచ్చినా స్వామి శరణం
2. గుడికివెళ్ళినా స్వామి శరణం-వృత్తిజేసినా స్వామి శరణం
భిక్షజేసినా స్వామి శరణం-లక్ష్యమొక్కటే స్వామి శరణం
3. కనులజూసినా స్వామి శరణం-వీనులవిన్నా స్వామి శరణం
గొంతు పాడినా స్వామి శరణం-గుండె ఆడినా స్వామి శరణం
4. కనులు మూసినా స్వామి శరణం-కలలు కన్ననూ స్వామి శరణం
కలతలున్ననూ స్వామి శరణం-కరిమలవాసుడు స్వామి శరణం
సాయీ నువ్వే దిగి రావాలోయి
ఏమాయెనో సాయి నీ మాయలో పడితి
చేయూత నందించి చేదుకొనగ సాయమడిగితి
1. కనులు ఉన్నాయిగాని-అహముతో మూసుక పొయినయ్
చెవులు వింటాయి గాని-నీచరితమెరుగము అంటయ్
నాలుకైనా సరే నీ నామమసలె పలుకక ఉంది
కాలుకైనా మరీ నీ గుడిదారే తెలియదు అంది
ఏమాయెనో సాయి నీ మాయలో పడితి
చేయూత నందించి చేదుకొనగ సాయమడిగితి
2. కామమే లేక నీ –నామం జపియించనైతి
ఓపికేలేక నేను కోపగుణము గెలువకపోయితి
నీవిచ్చిన ధనమే ఐనా దానమన్న చేయక పోయితి
కాలమహిమ తెలియకనే గాలిలోన మేడలు కడితి
ఏమాయెనో సాయి నీ మాయలో పడితి
చేయూత నందించి చేదుకొనగ సాయమడిగితి
కన్నెర సేయకో ప్రియ నేస్తమా-నే కొక్కెర కాననీ ఎరుగుమా
1. క్షణానికో రూపు దాల్చి-పలు వన్నెలు మార్చకు
అన్నిటిలో నేనేనని చిన్న తలను దూర్చకు
ఏడురంగులుంచు కొన్న ఇంద్రధనువునే నేను
మూడడుగుల విశ్వవ్యాప్త త్రివిక్రముణ్ణి నేను
అడ్డుపుల్ల లేయకుమా నేస్తమా-విఘ్నేశుడ నేననీ గ్రహించుమా
2. నవ్వించలని బోయి-నవ్వుల పాలుగాకు
నమ్మించి నన్నెపుడూ-వంచన చేయబోకు
నవరసాలు కురిపించే-ముఖ్యపాత్రధారి నేను
ఈ జగన్నాటకంలొ నటన సూత్రధారి నేను
కుప్పి గంతులేయకుమా నేస్తమా
హనుమంతుడనేనని గ్రహించుమా
3. అరచేతిలొ నాకెపుడూ –స్వర్గంచూపించబోకు
చిటికెవేసి నాకెపుడూ –తాళం నేర్పించ బోకు
చతుర్వేద సారమైన-సర్వాంతర్యామి నేను
ప్రణవ నాద రూపమైన-పరమ శివుడనే నేను
అహమింక మానుమో నేస్తమా-త్వమేవాహమనే నిజమెరుగుమా
Wednesday, July 22, 2009
నీవులేక నేను జీవించలేను
1. నిన్నుచూడకుంటే నాకు నిదురైన రాదు
నిన్ను తలచకుంటే నా ఎద ఊరుకోదు
నీవులేక నన్నునేను ఊహించుకేలేను
ఏ క్షణము చూసానో ఎదలోన నిలిచావు
నీవులేక నేను జీవించలేను
2. నీ ప్రేమలోనా ఎంతెంత మధురం
ఇంకెంతకాలం నీకునాకు ఈవిరహం
ఒకసారి పలుకవె చెలియా నీప్రేమ నాకొఱకేయని
నీ పిలుపుకై నేను పరితపిస్తున్నాను
నీవులేక నేను జీవించలేను
3. నీ గురించి చెడుగా అంటే నే సహించలేను
ఎవరు నిన్ను చూసినగాని నే భరించలేను
నా బాధలన్ని నీకు ఎలా తెలుపగలను
ఎన్నాళ్ళనీ ఇలా నేనెదిరి చూడను
నీవు లేక క్షణమైనా జీవించలేను
ఎంత మనోల్లాసము నీ సుందర దర హాసము
ఎంత సుధామధురము నీ తారకనామం
ఎంతగ్రోలినా గాని తనిదీరదు సాయిరాం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం
1. నీ దర్శన భాగ్యమైతె బాధలన్ని తొలగేను
చిరునవ్వుల వరమిస్తే చింతలు ఎడబాసేను
నీ సన్నిధిలో నిలిస్తె మనశ్శాంతి దొరికేను
నీ కరుణే లభియిస్తే బుద్దివిమలమయ్యేను
2. నీ నామం స్మరియిస్తే సంపదలే కలిగేను
నీ ధ్యానం వహియిస్తే ఆపదలే తొలగేను
నీ మహిమలు కీర్తిస్తే సచ్చిదానందమే
బ్రతుకే నీకర్పిస్తే మనిషి జన్మ ధన్యమే
నాజన్మ ధన్యమే
చేయవె హరినామ సంకీర్తన
1. నేను నాదను భ్రమలలోనా గడిచేను జీవితమంతా
ఒట్టొట్టిమాటల కట్టుకథలతో కరిగేను కాలమంతా
ఈ మోహాలు ఈస్నేహాలు ఈ వింత దాహాలు ఈ కర్మ బంధాలు
అన్నీ బూటకాలే క్షణకాల నాటకాలే
2. చీమూ నెత్తుటి ఎముకల గూడు ఈ నీ దేహం
రెక్కలు సాచిన స్వేఛ్ఛా విహంగం నీ ప్రాణం
ఈ అందాలు ఈ చందాలు పైపైమెరుగులు పరువపు తొడుగులు
పగిలే నీటి బుడగలే మిగులు కన్నీటి మడుగులే
3. ఆశల వలలో అసలే పడకు-కోర్కెలరక్కసి కోఱల చిక్కకు
కనబడిన ప్రతిమకు సాగిల పడకు-జిత్తులమారి మహిమల నమ్మకు
కైవల్యపదమే నీకు గమ్యం-శ్రీ హరి చరణమే నీకు శరణం
Tuesday, July 21, 2009
వేధించకు వేధించకు నన్నిలా
అడియాస చేయకే వెన్నెలా
ఎడారిలో ఎండమావిలా
1. వసంత ఋతువులో మల్లెలా
మనసంతా దోచావే వెన్నెలా
చారెడేసి నీలాల కన్నులా
సిగ్గుముంచుకొచ్చిందా వెన్నెలా
2. ఆనందం పంచవే వెన్నెలా
అనుబంధం పెంచవే వెన్నెలా
నీ కోసం వేచితినే చకోరిలా
నీ కంకితమై పోయానే కలువలా
3. ఎదవాకిలి తెఱిచానే కడలిలా
ఎదిరిచూసి అలిసానే వెన్నెలా
ఎందులకీ జాగు నీకు వెన్నెలా
పదపడిరావే గోదారిలా
ప్రేమతోనే శాంతిరా-ప్రేమలోనే తృప్తిరా
1. ప్రేమ పొందడమె ఒక వరము
ప్రేమించడమే సహజం
ప్రేమ ఉంటేనె బ్రతుకంతా నిత్య వసంతం
ప్రేమే సత్యము-ప్రేమే సర్వము
2. మొదటి చూపుకే ఎద స్పందిస్తే
అదే అదే ప్రేమ
ఏదిఏమైన ఎవ్వరేమన్న నిలిచేదే ప్రేమ
ప్రేమే తపస్సు-ప్రేమే ఒయాసిస్సు
3. మనసే ప్రేమకు ఆలయము
ప్రేమే మనిషికి దైవము
ప్రేమపరీక్షలొ నెగ్గితివా-భువికేతెంచునురా స్వర్గం
ప్రేమే చిరుగాలి-ప్రేమే జీవన జ్యోతి
OK
కాపాడుట నీవంతు షిర్డీ సాయి
వేడుట నావంతు సాయి
నా వేదన తీర్చగ రావోయి
1. నీవే ఇచ్చిన ఈ గొంతున -మాధుర్య మడిగితె మరియాదనా
నీవే మలచిన నా బ్రతుకున-అంతే దొరకని ఆవేదనా
శరణంటువేడుదు సాయి-కరుణిచేవాడవు నీవేనోయి
2. గుండెను గుడిగా తలపిస్తే మరి షిర్డీ యాత్రయె ఒక వరమా
అందరిలో నువు కనిపిస్తేసరి-మందిరమేగుట అవసరమా
పరీక్షలిక చాలు సాయి- ప్రార్థన విని ఆదుకోవోయి
3. తెలిసీతెలియక ఏవో వాగీ-నిను విసిగించితి ఓ యోగి
మిడిమిడి జ్ఞానంతొ మిడిసిపడీ-నిను మరిచానా నే మూర్ఖుడిని
పలుకుట నావంతు సాయి-పలికించేవాడవు నీవేనోయి
తీరదులే నా దాహం
తీర్చదు ఏ ప్రవాహం
1. మండే వేసవి కాదు
ఇది ఎండమావే కాదు
పారే ఈ ఏరు –తీయని ఈ నీరు
తీర్చదులే నాదాహం-తీరనిదీ సందేహమ్
గుండెల మంటలు ఆర్పే కోసం
కురియదేల ఈ వర్షం
కాదా ఇది శ్రావణ మాసం
2. దాహంతోనే పయనం-ఈ జన్మకిదే శరణం
ఆశల నణిచేసి –ఊహల నలిపేసి
జీవశ్చవమై పోవే- మనసా శిలవై పోవే
కలిమీ లేముల కయ్యములోన
కట్టుబాట్ల సంఘర్షణ లోనా
ఎక్కడున్నదీ ప్రగతీ –మనసా నీ కింకేగతి
ఓ మనసా నీ కింతే గతి
నీకన్న అందాల మోము గలది నాచెలి
1. తారకలకోసము తడబడుతు పరుగిడుతు
మధ్యమధ్యన మబ్బు చాటుగా దాగేవు
ఎందుకో దొంగాట ఎందుకీ సయ్యాట
పిలిచి పిలువకముందె వలచి వచ్చు నా చెలియంట
2. దూరాన దూరాన మినుకు మనే తారకలు
ఎందుకోయి ఎందుకు అవి వేనవేలు
నిన్ను మించి అన్ని మరపించు
నాచెలియ ఒకతె చాలయ్య చాలు నాకు
3. ఎందుకోయి నీ కింతటెక్కు
నెలలొ తరుగుతు కళలు కరుగుతు
చేతులు ముడుచుక కూర్చోవోయి
నాచెలియ అంద చందాలు పొగడుతు
’గురు’వారమ్మని పిలిచితి ’గురువా’! రమ్మనీ
ఓం సాయిరాం షిర్డీ సాయిరాం
ఓంసాయిరాం ద్వారక మాయిరాం
మాయలు చేసి భ్రాంతిలొ ముంచీ
నీ నుంచి దూరముంచుతావేమయా
1. చపలమైన చిత్తము-చేయనీదు ధ్యానము
వగలమారి నేత్రము-కనదు నిన్ను మాత్రము
పూర్వ జన్మ పుణ్యము-ఎరుగనంది ప్రాణము
చేతనైన సాయము-చేయకుంది దేహము
నా మాటే వినకుంది- నాప్రతి ఇంద్రియము
నీ దీవెన లేకుంటే -పొందను ఏ జయము
కరుణాంతరంగ పాహి పాహిమాం
2. నిన్ను నమ్ముకుంటిని-నడవలేని కుంటిని
చేయిపట్టినడిపించమని- నిన్ను వేడుకుంటిని
దారులన్ని మరిచాను-బేజారై నిలిచాను
అంధకార మార్గమంతా-ఆతృతగా వెదికాను
నీవే పరంజ్యోతివని-సత్యము నెరిగితిని
దారే చూపించమని నిత్యము కోరితిని
శరణాగతావన రావేవేగమే వేవేగమే
తప్పులు చేయించకు
పదిమందిలో నన్నెపుడు ప్రభూ
పలుచన చేయించకు
1. నా లోని అణువణువున ఆవరించి ఉన్న
అహంకారమంతటినీ అణచివేయవయ్యా
నే బట్టిన కుందేటికి కాలే లేదనువాదన
కరుణతోడ నానుండి తొలగించవయ్యా
2. మతిమరపును నాలో మరీ మరీ పెంచకు
ఆత్మ విశ్వాసాన్ని అసలే సడలించకు
తొందరపాటే నాకొక శాపంగా మార్చకు
మానవతను నాలో మరుగున పడనీయకు
Sunday, July 19, 2009
ఏదైన గాని నీకు సాటిరాదులే సుమా
1. నాజూకు నడుము నీకు- సన్నజాజి కానుకా
ఇంపైన నాసిక నీది- సంపెంగ పోలికా
దొండపండు నీ పెదవితో- పోటీకై నిలిచేనా
దబ్బపండు నీమేని ఛాయతో- పందెం లో నెగ్గేనా
2. మీనాలే నీ నయనాలై- మిలమిలమిల మెరిసేనా
కెంపులన్ని నీ చెంపల్లో- తళుకులెన్నొ ఒలికేనా
చక్కనైన నీ పలువరుసల్లో- దానిమ్మలు దాగున్నాయా
గాలికి చెలరేగే కురులే- మేఘాలను తలపించేనా
3. ఊర్వశీ మేనకలు- దిగదుడుపే నీ ముందు
వరూధినీ వర్ణన సైతం- సరిపోదని నేనందు
జగన్మోహినైనా నీవే- భువన సుందరైనా నీవే
కనీ వినీ ఎన్నడెరుగనీ- సౌందర్య దేవత నీవే
4. నీ నవ్వులోనా -నందివర్దనాలు
నీ నడకలో కాళీయ మర్దనాలు
నీ చూపులేనా ప్రేమప్రవర్దనాలు
నీ తలపులే నాకానందవర్దనాలు
వేడినవారికి అభయ ప్రదాత
జ్ఞానదాయిని గాయత్రి మాత
అందుకోవమ్మ మా చేజోత
1. సావిత్రి సరస్వతి యుత నామత్రయి
ప్రాతరపరాహ్ణసంధ్యా కాలత్రయి
సత్వరజస్తమో గుణత్రయి
అకార ఉకార మకార మాత్రత్రయి
2. చతుర్వింశతి వర్ణ స్వరూపిణి
పంచ భూత సంజాత బ్రాహ్మిణి(ప్రథమ సప్త మాతృక )
అరిషడ్వర్గ నిశ్శేష సంహారిణి
సప్త వ్యసన సమూల నివారిణి
3. అష్టకష్ట విశిష్ట వినాశిని
నవగ్రహ దోష పీడా హారిణి
దశభుజి దశవిధ ఆయుధ ధారిణి
సచ్చిదానంద దాయిని మోక్ష ప్రదాయిని
మానవత్వ విలువెరిగితె వదలలేమురా
దానగుణం అలవడితే చింతదూరమగునురా
ప్రేమైక జీవనమే సచ్చిదానందమురా
గెలుపు గుఱ్ఱమెక్కితే మడమతిప్పలేమురా
పనిలో తలమునకలైతె పరవశాలె సోదరా
నీడనిచ్చు గూడును కాపాడుకోవాలిరా
కన్నతల్లి ఋణము కాస్తైన తీర్చుకోవాలిర
ఎదుటివారి మనసునెరిగి మసలుకోవాలిర
నాణానికి అటువైపును లెక్కతీసుకోవాలిర
నీవు కోరుకునే ప్రతిది ఇతరులు ఆశించేరుర
వారిస్థానమందు నిలిచి నిన్నూహించుకోర
లోటుపాట్లు అగచాట్లు అన్నిట ఉంటాయిరా
పొరపాట్లు గ్రహపాట్లు ఎదురౌతుంటాయిరా
అధిగమించి సాగు నీవు ఆత్మవిశ్వాసముతొ
చేరగలవు ఒకనాటికి మహితాత్ముల మధ్యలో
నట్టడవిలోనే నిన్నొదిలి వెళతారు
బేలగా దిక్కులు చూస్తున్నా
తాబేలులా అడుగులు వేస్తున్నా
తొలగిపోబోదు నీ దైన్యము
నువు చేరలేవు ఏ గమ్యము
1. లోకమే పాఠశాలగా లౌక్యాన్ని నేర్చుకో
అనుభవాల గుణపాఠాలతొ భవిత తీర్చి దిద్దుకో
అతిగా నువు ఆశిస్తే దొరికేది ఆశాభంగం
ప్రతి ఫలితం స్వీకరిస్తే బ్రతుకంతా ఆనందం
2. నీతోటి ఎప్పుడూ ఉండేది నీవు మాత్రమే
బంధువులు స్నేహితులు రంగస్థల పాత్రలే
తామరాకుపై నీటిబొట్టు కావాలి నీ నైజం
శాంతి సంతోషాలతో సాగాలీ జీవితం
Saturday, July 18, 2009
పారిపోతె వదిలేసే పాశం కాదు
స్నేహ పాశము-అనురాగ బంధము
1. తెరవేస్తే మరుగయ్యే దృశ్యం కాదు
తెలివొస్తే కరిగేటి స్వప్నం కాదు
జీవ చిత్రము-ఇది నగ్న సత్యము
2. మందువేస్తె మానేటి గాయం కాదు
పంచుకుంటె తీరేటి వేదన కాదు
నా మనోవేదనా- ఈ నరక యాతన
3. నా మార్గమెన్నటికీ పూలబాట కాదు
నా పయనానికి గమ్యంలేదు
అంతులేని పయనం-ఆగిపోని గమనం
తుమ్మెద పాడే ఆ పాటలలో
వినిపించును ఈ రాగం- కనిపించును ఈ భావం
అందాలొలికే విరి తావులలో
తుమ్మెదవాలే పువ్వుల ఎదలో
నినదించును ఈ భావం-కనిపించునులే జీవం
1. పొదల మాటున దాగిఉన్న నిన్ను చూసింది నేనే
ఎడద చాటున దాచుకొంటావనుకున్నానే
నే మొదటవాలింది నీపైనే-మధువు గ్రోలింది ఆపైనే
2. ఇటువంటి మాటలు విన్నవారు మోసపోయారు
అందుకేలే నేను కూడ ఆశ వీడాను
నే పూవుగ మారింది ఈ పూటనే-మొదటవిన్నది నీ పాటనే
3. ఆకతాయి తుమ్మెదనసలే కానునేను
ఎవ్వరు చూడని నిన్ను నేను చూసి వలచాను
రంగులువద్దు-అందం వద్దు-ఆమాటకొస్తే మకరందం వద్దు
4. నిన్ను నమ్మి నీ మాట నమ్మి నీదాననైనాను
నావారనువారందరినీ వీడి నీసొంతమైనాను
నాసొగసులన్నీ నీకోసము-దాచి ఉంచాను మకరందము
5. నేను నీవాడనైతే చాలు-నువ్వు ఊ( అంటె పదివేలు
ఆదర్శనీయము మనబంధము-మనజంట జగతికె ఒక అందము
స్వామి అభిషేక ఆజ్యమె ఘన ఔషధం
దీక్షాను భూతియె ఒక అద్భుతం
జ్యోతి దర్శనం పరమాద్భుతం
1. కరములు మోడ్చెద అవకరము తొలగించు
శిరమును వంచెద అవసరములీడేర్చు
సాష్టాంగ ప్రణతులు ఇష్టంగజేసెద
కష్టాలు నష్టాలు కడతేర్చ మనెద
2. పాదములొత్తెద వ్యాధులు మాన్పించు
ప్రార్థనజేసెద బాధలు పరిమార్చు
స్వామియే శరణమని మనసార పలికెద
నీవే నాకిక దిక్కని మ్రొక్కెద
మనసించుకైనా కరుగదా
సాయినీవే నాకు దిక్కని
విలపించు నామొర నాలకించవ
1. సాయి నీ హృదయమే
దయా సాగరమ్మని జనులందురే
నేను చేసిన నేరమేదో
ఎరిగించరాదా ప్రేమ మూర్తీ
2. జపములెరుగను తపములెరుగను
పూజలూ ఏ భజనలెరుగను
సాయిరాం శ్రీ సాయిరామను
దివ్య నామము మదిని మరువను
3. వేదమెరుగని వెర్రివాడను
మోదముగ కరుణించరావా
రాగమౌ రసయోగమౌ పరభోగమౌ
నీ పాదమును దయసేయవా
ఎన్నెన్ని మణిపూసలు చేయి జారి పోయాయో
ప్రభూ! ఒక్కటైన నీ పూజకు దక్కలేదు స్వామీ
ఒక్కటైన ఈ రోజుకు చిక్కలేదు స్వామీ
1. సూరీడు రాకమునుపె కలువలు కోద్దామని
కొలనుగట్టు కేసి నే తొరతొరగా తరలితిని
ప్రభూ!ఒక్క కలువ పూవైనా కనకపోతినే స్వామీ
చుక్కబొట్టు నీళ్ళైనా చూడనైతినే స్వామీ
2. తోటమాలి లేకమునుపె మల్లెలు తెద్దామని
తోటలోకి ఇందాకనె పొంచిపొంచి వెళ్ళితిని
ప్రభూ!మల్లెపొదలు ఎన్నెన్నో మాడిపోయినయి స్వామీ
మల్లెపూవులెన్నెన్నో వాడిపోయినవి స్వామీ
3. గుండెలోన నీకే గుడి ఒక్కటి కట్టినాను
అందులోన నిన్నే కూర్చుండబెట్టినాను
ప్రభూ! నాకన్నుల కలువపూల మాలలివిగొ స్వామీ
నా నవ్వుల మల్లెపూల జల్లులివిగొ స్వామీ
4. ఎన్నెన్ని రోజులిలా నిరుపయోగ మైనాయో
ఎన్నెన్ని క్షణాలిలా వృధాగ కరిగి పోయాయో
ప్రభూ!ఇకనైనా నీలో నను కలుపుకో స్వామీ
ఇపుడైనా నాలో నువు నిలిచిపోస్వామీ
Thursday, July 16, 2009
అవమానం నీ అభినందనం
ఇన్నినాళ్ల మన స్నేహం ముక్కలైపోయింది
అనుభూతుల మన సౌధం నేలకూలి పోయింది
1. వేదనా చీకటీ నన్నవరించాయి
ఆనందం వెలుతురు అంతరించి పోయాయి
నూరేళ్ల జీవితం శిథిలమై పోయింది
పండంటి ఈ బ్రతుకు శిశిరమై మిగిలింది
2. కలిసి చేసె రైలు పయనమంతమై పోయింది
మూడునాళ్ళ ముచ్చటగా పరిసమాప్త మయ్యింది
ఈ అనంత పయనానికి గమ్యమనే దెక్కడో
ఈ ఒంటరి బికారికి భవితవ్యం ఏమిటో
క్షణమే వెలిగే మెరుపుతీగలా గలగలపారే కొండవాగులా
ఉరకలు వేసే భావము నీవే-నా ప్రాణము నీవే
1. అందరాని ఆకసానా చందమామలా నీవూ
ఉట్టికైనా ఎగురలేకా పట్టువదలని నేను
నువు అందానివి ఆనందానివి
నా అంతరంగాన వెలుగులు నింపే జ్యోతివి –ఆశాజ్యోతివి
ప్రేమబంధాన వలపులు కురిసే వర్షానివి-నా హర్షానివి
2. చిలుకలకే పలుకులు నేర్పే రాచిలుకవీ
హంసలకే కులుకులు నేర్పే కలహంసవీ
నీ గొంతున కోకిల గానం-నీ నడకే మయూర నాట్యం
కాచివడబోసి కలిపి నినుజేసి ధన్యుడాయెనా బ్రహ్మా-పరబ్రహ్మా
చూచి నినుజేరి వలచి నినుకోరి తరించెనా జన్మ-తరించె నా జన్మ
3. నా కన్నులలోకి ఒకసారి చూడు –కనిపిస్తుంది నీరూపం
నా హృదయం చేసే సవ్వడినీ విను-తపిస్తున్నది నీ కోసం
నే కన్న కలలే నిజమై-నాలో నీవే సగమై
నీవూనేనే జగమై బ్రతుకే సాగనీ-కొనసాగనీ
ఈ యుగమే క్షణమై కాలం ఆగనీ-ఇక ఆగనీ
OK
పరమేశా మాం పాహి ప్రభో
దక్షుని మదమణిచి వేసిన
గిరిరాజ తనయ విభో
1. నయనాలు కల్గినా అంధుల మయ్యా మేము
విద్యలెన్నొ నేర్చినా మూర్ఖులమేనయ్యా మేము
మా జ్ఞాన చక్షులను తెరిపించవేమయ్యా
విజ్ఞాన జ్యోతులను వెలిగించ రావయ్యా
2. నీ జగన్నాటకంలో నటియించు పాత్రలం
తోలుబొమ్మలాటలొనీవు ఆడించే బొమ్మలం
నీ ఆజ్ఞ లేనిదే చీమైనా చావదు
నీ కరుణలేనిదే క్షణమైనా సాగదు
3. ఆశామోహాలతోటి అలమటించు జీవులం
గీయబడిన గిరిలో తిరిగే చదరంగపు పావులం
ఇహలోక చింతననిక తొలగించవేమయ్యా
కైవల్య పథములొ మమ్ము నడిపించవేమయ్యా
Wednesday, July 15, 2009
మందులతో కాదు నయం
శిశిరమైన నాహృదయం
పొందదులే వాసంతం
1. కరిగిన కల కావేరై
నా కన్నీరే గోదారై
వరదల పాలాయే జీవితం
సుడిలోపల చిక్కే భవితవ్యం
2. వెలిగే రవి కొడిగట్టే
చందురుడే మసిబట్టే
జగమంతా నిండే అంధకారం
వేదనతో కృంగే నా శరీరం
3. శిథిలంగా మారిన బ్రతుకే
తరలేదిక మండే చితికే
ఆశలన్ని బూడిదైతే
అంతరించు ఈ పయనం
అవరించు అనంత శూన్యం
సారథి నీవేలే- స్వామి నాగతి నీవేలే-శరణాగతినీవేలే
1. ఈ జగమే కురు క్షేత్రం-జీవనమే సంగ్రామం
నా అస్త్రము నీవేలే-స్వామి శస్త్రము నీవేలే
2. అరిషడ్వర్గాలే స్వామి నాకిలలో శత్రువులు
ధైర్యము నీవేలే-మనస్థైర్యము నీవేలే
3. చేసే నరుడవు నీవే-చేయించే హరియూ నీవే
కార్యము నీవేలే స్వామి-కైవల్యము నీవేలే
పాడుము వేడుము ప్రతిదినము
సందేహమెందుకు చింతలుదీరగ
పావనమగు నీ జీవనము
1. గౌతమితీరాన షిర్డీ పురమున
విలిసిల్లు చున్నాడు శ్రీసాయి
అపర వైకుంఠం –శాంతికి అది నిలయం
శ్రీ సాయి సమాధి మందిరము
ప్రశాంతి నిలయమీ మందిరము
2. కోరుకున్నవారికిల కొంగు బంగారము
ప్రత్యక్ష దైవము శ్రీసాయి
తృణమో పణమో-దినమో క్షణమో
చేసుకుంటే సేవ హాయి-కరుణించు షిర్డీ సాయి
3. పనిపాటలలో సాయిని తలపోసి
సర్వం సాయి సమర్పణ జేసి
సాయీ నిను వినా-శరణం నాస్తియని
శరణాగతి పొందవోయి-కైవల్య గతి సాగవోయి
హరి గుణ గానము అమృతపానము-
హరిపద సేవయే-పరమానందము
1. అలనాడు కరిరాజు-ఎలుగెత్తి మొరవెట్ట
వేవేగ అరుదెంచి –రక్షించలేదా
నడి సభలొ ద్రౌపది- నోరార పిలువగ
ఉడుపుల నందించి –కాపాడలేదా
మరి మరి ప్రార్థింప-పరుగున రాడా
మనసార యర్థింప-వరముల నీడా
2. రాగాల క్షీరాల అభిషేకములు జేయ
త్యాగయ్య కిచ్చాడు సాయుజ్యము
కవితల కుసుమాల అర్చింపగాజేయ
పోతన్న కిచ్చాడు పరసౌఖ్యము
మైమరచి కీర్తింప కైవసము కాడా
త్వమేవ శరణన్న కైవల్యము నీడ
Tuesday, July 14, 2009
ఒలికి ఒలికి కన్నీరు ఏరయ్యింది
కరుగని నీ హృదయం శిలగా మారింది
వీడని నా పట్టుదలే ఉలిగా నిను తొలిచింది
1. మూడునాళ్ళ అందానికి మురిసి పోకులే
వయసుమీరి నీ కది ఒక శాపమగునులే
ఎన్నటికీ చెదరనిదీ మనసొకటేలే
ఏనాటికి నా ఎదనీకై మూయబడదులే
2. అద్దం నిన్నెప్పుడు వెక్కిరించునో
జనమెప్పుడు నీ నీడను తప్పుకొందురో
మరువకు నేనింకా బ్రతికి ఉన్న విషయం
మదిలోపల తలచినంత వాలుదు నీ కోసం-నీ ముందు తక్షణం
3. తోడెవరూ లేక నీవు ఒంటరివైతే
పలికేందుకు నీకంటూ మనిషేలేకుంటే
నిను దేవతగా కొలిచేందుకు నేనున్నాను
4. ఓ చిరునవ్వే వరముగా ప్రసాదించమంటాను
బ్రతుకంత హాయి హాయి
నిను కొలుచుకుంటే సాయి
కొదవన్నదే లేదోయి
సాయి రామయ్యా-సౌఖ్యమీవయ్యా
సాయి రామయ్యా-శాంతినీవయ్యా
1. దత్తావతారము నీవేనులే
మాణిక్యప్రభువన్న నీవేనులే
పండరిపురి లోని విఠలుడవీవేలె
పుట్టపర్తిలోని సత్యసాయి నీవేలె
సాయి రామయ్యా-దారి చూపయ్యా
సాయి రామయ్యా-దరికి జేర్చవయా
2. శ్రద్ధ-ఓరిమి నీ సూక్తులు
శాంతి ప్రేమలు నీబోధలు
దీనులు ఆర్తులు నీ భక్తులు
మహిమాన్వితములు నీ గాధలు
సాయి రామయ్యా-జ్ఞాన మీయవయా
సాయి రామయ్యా-ధ్యానము నీయవయా
ఈ నశ్వర దేహానికి
1. పాలు మీగడల పోసిపెంచేవు
పంచ భక్ష్యాల ఆరగించేవు
జిట్టెడు పొట్టకు పట్టెడు చాలుర
పుట్టేడు నీకేలరా
2. మిద్దెలు మేడలు కట్టించేవు
ఆస్తులు జాస్తిగ కూడబెట్టేవు
ఆరడుగుల అవనియె చాలుర
జగమంతా ఏలరా
3. వేసవిలోనా ఖద్దరు గుడ్డలు
శీతాకాలం ఉన్ని దుస్తులు
రగిలే చితిలో రక్షించదేదీ
దేహచింతేలరా
4. శాశ్వతమంటే హరిపాదసేవే
సౌఖ్యమంటే హరి నామగానమె
క్షణభంగురమీ ఇహలోక చింతన
కైవల్య గతి సాగరా ఓ నరుడా
నీ కష్టాలు కడతేరురా
Monday, July 13, 2009
కనులు కలతచెందెనే
తనువులోని అణువణువు నీకై తపియించెనే-పరితపించెనే
1. గున్నమావి చిగురించెనే
సన్నజాజి విరిసెనే
తోటలోని పరిమళాలు
నిన్నుజేర పరువెట్టెనే
2. సంధ్య కాస్తా కనుమరుగాయే
చుక్కలొక టొకటొచ్చి జేరే
నింగిలోనా చందమామా
తొంగి తొంగి చూసెనే
3. కోయిలపాడుతు రమ్మనెనే
కాలము ఆగను పొమ్మనెనే
కొండవాగు నిన్ను వెదక
వడివడిగా సాగెనే
OK
హే చంద్ర మౌళీ , హే శూలపాణీ
హరహరహర శంభో శివ శంకరా
మొరవిని రావేరా భక్త వశంకరా
హే చంద్ర మౌళీ , హే శూలపాణీ
హరహరహర శంభో శివ శంకరా
మొరవిని రావేరా భక్త వశంకరా
దక్షిణోరువు మీద గణపతి స్వామీ
కొలువుండగ విఘ్నాలు హరియించవా
వామాంకస్థితమైన గౌరీదేవీ
దరినుండగ విజయాలు వరియించవా
త్రిపురాసుర సంహారా పురహర పాహీ
రతిపతినే దహియించిన త్రినేత్ర దేహీ
హే చంద్ర మౌళీ , హే శూలపాణీ
హరహరహర శంభో శివ శంకరా
మొరవిని రావేరా భక్త వశంకరా
పార్థుడికిల పాశుపతము నీయలేదా
వీరభద్రుడివై రుద్ర నర్తన జేసీ
దక్షయజ్ఞము భగ్నము చేయలేదా
కరుణతోడ వరములిచ్చే భోలా శంకరా దేహీ
క్రమత నడిపి మోక్షమిచ్చే ప్రణవ శంకరా పాహీ
త్వమేవ శరణం సాయీరాం సాయీరాం
సర్వాంతర్యామి సాయీరాం
కరుణాంతరంగా సాయీరాం
1. క్షణమైన నీ మీద మది నిలుపకున్నాను
ఇహలోక చింతన నే వదలకున్నాను
నీ యోగ సాధన సాధింపకున్నాను
నా భారమంతా నీదేనన్నాను
2. కలియుగమిది సాయి తపమెరుగలేను
కల్లా కపటము మానగ లేను
పరోపకారినని బొంకగలేను
నీ నామ జపమొకటె ఎరిగితి నేను
3. ధ్రువుడిని బ్రోవగ శ్రీహరి వైనావు
ప్రహ్లాదునిగావగా నరహరి వైనావు
పిలిచిన పలికే హే షిర్డీశా
నను దయగనవేల శ్రీ సాయినాథా
Sunday, July 12, 2009
OK
OK
జీవకోటిపై ప్రేమాదరణలె బాబా సూత్రాలు
మానవత్వము స్నేహతత్వము ముక్తికి మార్గాలు
దయకురిపించే మంచి మనసులే భువిలో స్వర్గాలు
నిండాలీ ఈ బావనలే ఎదఎద నిండా
ఉండాలీ బాబా దీవెన బ్రతుకులు పండ
షిర్డీశునీ దివ్య చరణాలే శరణమంటా
1. స్వార్థం ఎంతనర్థం-పతనమగునీ జీవితం
అర్థం ఎంత వ్యర్థం-కాదు నీకు శాశ్వతం
ద్వేషం పెంచుకోకు-పెంచుకోకు పంతము
మోసం చేసుకోకు –నిన్ను నీవే నేస్తము
వెలిగించుకో ప్రేమ దీపాలు నీ ముంగిట
చిత్రించుకో సాయి రూపాలు నీ గుండెన
2. మోహం వింత దాహం-తీరి పోదు ఎప్పుడు
రాగం దీర్ఘ రోగం- మానిపోదు ఎన్నడు
కామం బ్రతుకు క్షామం-చేసిపోయే గ్రీష్మము
కోపం నీకు శాపం-తెలుసుకో ఈ సూక్ష్మము
చే జార్చకు అతి విలువైందిలే కాలము
కడతేర్చులే సాయీ శరణంటె భవసాగరం
శ్రీ రామ పాదమె శరణు నీ కెపుడు తెలుసా
1. శివ ధనస్సును చిటికెలో విరిచేసినా రఘురాముడు
తల్లిజానకి తనువులో సగమైన సీతా రాముడు
తండ్రిమాటను తలపునైన జవదాటనీ గుణధాముడు
ఇహములోనా సౌఖ్యమిచ్చే-పరములో సాయుజ్యమిచ్చే ||రామ భజనము||
2. త్యాగరాజుకు రాగమిచ్చిన సంగీతరాజ్య లోలుడు
రామదాసుకు యోగమిచ్చిన భద్రగిరి శ్రీ రాముడు
కొంగుసాచిన చింతదీర్చే ఆర్తజన పరిపాలుడు
అన్నకొద్దీ అఘము బాపే-విన్నకొద్దీ శుభములొసగే ||రామ భజనము||
Saturday, July 11, 2009
నల్లనివన్నీ నీళ్ళనుకొన్నాను
వంచనకే నిలయమైన ఈ లోకంలో
ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది మంచితనం
1. తోడేళ్ళను నమ్ముకున్న మేకపిల్లనయ్యాను
పులినోట్లో తల దూర్చిన ఆవుదూడనయ్యాను
కసాయి మాటలకే పరవశించిపోయాను
కత్తుల కౌగిళ్ళలో పులకరించి పోయాను
2. అపకారం అసలెరుగని అమాయకుడనే
నిజాయితిని ఆశ్రయించె సగటు మనిషినే
మంచితనం మనసుల్లో ఇంత కుళ్ళిపోయిందా
నీతిగుణం మనుషుల్లో వ్యభిచారిగ మారిందా
నాఎద పులకించి పాడింది ఈ వేళలో
1. అంతరాలలో దాగిన పాట
నా అనుభూతులు నిండిన పాట
వెల్లువలా పెల్లుబికీ-ఉప్పెనలా ఉప్పొంగీ
చెలియలి కట్ట దాటింది ఈ గీతమూ
2. మనసూ మనసూ కలిసిన వేళా
మమతల మల్లెలు విరిసినవేళా
అందమే ఆనందమై-ఆనందమే ఆవేశమై
ఉరకలు వేసింది ఈనాడు మది ఎందుకో
3. ఆశలు అవనిని విడిచిన వేళా
కోరిక నింగిలొ నిలిచిన వేళా
గగనమే గమ్యమై-గమ్యమే రమ్యమై
పరుగులు తీసింది ఈనాడు మది ఎందుకో
నేరములెంచకు బాబా-సన్మార్గము చూపగ రావా
1. మా వూరే షిర్డీ పురమవగా
ఈ మందిరమే ద్వారకగా
కొలువైతివిగా ఇలవేలుపుగా
చింతలు దీర్చే చింతామణిగా
కనిపించే దైవం నీవే బాబా
కరుణించే తండ్రివీవె బాబా
2. నీవే గురువని నమ్మినవారం
నీ గుడికొస్తిమి ప్రతి గురువారం
మోసితిమిఛ్ఛతొ పల్లకి భారం
ధన్యులె కారా నీ పరివారం
నీ కన్నుల వెన్నెల హాయి
నీ నవ్వులె మధురం సాయి
3. కోపానికి కోరిక మూలం
అర్థానికి ఆశాంతి అర్థం
ఇల జనులందరు నీ ప్రతి రూపం
మానవతే నీ బోధల సారం
శరణం సాయి నీ చరణం
నీ చరణం భవ పాప హరణం
మొలచిన మొలకను పెరకుట న్యాయమా
1. మోళ్ళైన పూవులు పూచేను రామా
రాళ్ళైన రాగాలు పలికేను రామా
ఎడారి దారుల సెలయేరు పారినా
ఎంతకు కరుగని నీ ఎడద మారునా
2. ఆశలు చూపి ఆర్తిని రేపి
చింతలేని నా చిత్తము చెఱచి
నడిసంద్రములో నన్నొదిలివేసి
ఆనందించుట అభినందనీయమా
3. కన్నుల మాయను కప్పేస్తావు
రంగుల కలలే రప్పిస్తావు
కలలు కల్లలై కలవర పడితే
తెరలు తెరలుగా నవ్వేస్తావు
Friday, July 10, 2009
తలపెండి పోయింది
బ్రతుకంత బాధల్లోనే
అణగారి పోయింది-శిథిలంగ మారింది
1. కలలాగ కరిగింది
కన్నీరు మిగిలింది
రేయంత ఊహల్లోనే
తెల్లారి పోయింది-చల్లారి పోయింది
2. మనసు మసి బారింది
భవిత తెర జారింది
వాసంత మాసంలోనే
చిగురాకు రాలింది-శీతాగ్ని రగిలింది
3. రేవతి నా రాగం కాగా
వేదన నా వేదం కాగా
నీ జీవన వేణువు మీద
విషాదమే ఒలికింది-విరాగమే పలికింది
యమునా నదినై ఎదురు చూసేనురా
రారా కృష్ణా- రారా కృష్ణా రారా రారా రావేర కృష్ణయ్యా
ఈ జాగేలరా కృష్ణయ్యా
1. నెమలి పింఛమునై నీ శిఖలో నిలవాలని
కస్తూరి తిలకమునై నీ నుదుట మెరవాలని
నీలి వర్ణమునై నీ దేహాన్ని నిమరాలని
నేకన్న తీపి కలలు కల్లలు చేయకురా ||రారా కృష్ణా||
2. ఒక రాధ ఎదలో కొలువై యున్నావు
ఒక మీరా మదిలో నెలకొని యున్నావు
ఒక కుబ్జ పాలిటి వరము నీవైనావు
ఈ దీనురాలి మొరనే వినకున్నావు
3. చిరుగాలికెరుకా నావిరహ వేదన
మరుమల్లికే తెలుసు నావయసు తపన
వెన్నెలకే ఎరుకా నా నిట్టూర్పుల వేడిమి
సర్వాంతర్యామి నను నీవెరుగకున్నావా
OK
https://youtu.be/hvo_uKqcEaQ?si=ASxe4UtDg0CuHuUJ
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:తోడి
రావేరా షిరిడీ సాయినాథా-హే దీనబాంధవా
మా ఆర్తిబాపవేరా-ఓ ప్రేమ సింధువా –దేవా
1. తిరుగలితో గోధుమలు విసిరి-మహమ్మారిని మాపితివి
బూడిదతో కోరిన దొసగి-నీ మహిమలు చూపితివి
2. శిథిలమ్మగు మసీదె కాదా- నీ నివాస మందిరము
దయామృతం కురిసే నీ- నయనమ్ములె సుందరము
3. దీనులె కద నీ బంధువులు-ఆర్తులె కద నీకతి ప్రియులు
మనసారా నిను నమ్మితిమి-మముగాచే దైవం నీవని
4. కన్నీళ్ళతొ నీ పాదములే-నే కడిగితి షిర్డీశా
కరుణించగ జాగేలా-ద్వారకామయివాసా
మొరవిని రావేరా-పరాత్పరా
వరములనీవేరా
1. సాటి మనిషి పైన మనిషికెందుకింత కక్ష
దీనజనులకేనాటికి నీవేకద రక్ష
గెలవలేరు ఎవ్వరు నీ వింత పరీక్ష
కరుణతోడ ప్రసాదించు విజ్ఞాన భిక్ష
2. ఆవేశం మా పాలిటి అతి ఘోర శాపం
కోపం మే చేసుకొన్న గతజన్మ పాపం
విశ్వజనీనమైన ప్రేమ నీ స్వరూపం
దర్శింతుము వెలిగించుము సుజ్ఞాన దీపం
Thursday, July 9, 2009
OK
పాడుకోవాలి ప్రతి ఒక్కరం
జీవితం వేదనా సాగరం
నవ్వుతూ చేరవలె తీరము
జీవితం మధుర స్వప్నము
దాచుకోవాలి ప్రతి హృదయము
జీవితం తీరని దాహము
తీర్చు’నది’ ఒకటె అది స్నేహము
పాడుకోవాలి ప్రతి ఒక్కరం
జీవితం వేదనా సాగరం
నవ్వుతూ చేరవలె తీరము
జీవితం ఒక చదరంగము
ఆడిగెలవాలి ఆసాంతము
జీవితం అద్భుత పుస్తకం
చదివి తీరాలి ప్రతి అక్షరం
పాడుకోవాలి ప్రతి ఒక్కరం
జీవితం వేదనా సాగరం
నవ్వుతూ చేరవలె తీరము
జీవితం ముద్ద మందారము
గ్రోలితీరాలి మకరందము
జీవితం సాహస భరితము
పొందితీరాలి ప్రతి అనుభవం
పాడుకోవాలి ప్రతి ఒక్కరం
జీవితం వేదనా సాగరం
నవ్వుతూ చేరవలె తీరము
జీవితం ఒక సందేహము
దొరకదెపుడూ సమాధానము
జీవితం ఒక విద్యాలయం
నేర్చుకోవాలి ప్రతి పాఠము-గుణపాఠము
పాడుకోవాలి ప్రతి ఒక్కరం
జీవితం వేదనా సాగరం
నవ్వుతూ చేరవలె తీరము
OK
https://youtu.be/voCKY24dR_E?si=Hr6LWgGc3xCETYWC
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం : భీంపలాస్
అమృతంబే సాయి నీ పాదతీర్థం
ఔషదంబే సాయినీ దివ్య ప్రసాదం
మంత్రముగ్ధమె సాయి నీ భవ్య వీక్షణం
ముగ్ధమోహనమె సాయి నీ మందహాసం
1. షిర్డీ పురమే అపర వైకుంఠం
శ్రీ సాయినాథ నీవే పరమాత్మ రూపం
శిథిల ద్వారక మాయి భూలోక స్వర్గం
నీ పాద సేవయె కైవల్య మార్గం
2. నిను స్మరియిస్తే జన్మ చరితార్థం
నిను దర్శిస్తే జన్మ రాహిత్యం
నిన్ను కీర్తిస్తే సాయి సచ్చిదానందం
ప్రార్థిస్తె చాలు సాయి నువు సాక్షాత్కారం
నే బ్రతికీ ఏమిలాభం
నా మనసే తెగిన పతంగం
ఇక భవితే నాకు శూన్యం
1. చీకటిలో నీ దారి కొరకు
వెలిగించా నాదు హృదయం
నువు గమ్యం చేరు వరకు
అర్పించా నీకు సకలం
నువు లేక వృధా ఈ లోకం
ఇక ఎన్నున్నా ఏమి లాభం
2. అందరాని చందమామా
కనులముందు ఉంటె నరకం
పొందలేని అందమంతా
చేజారె సదవకాశం
ఇక వగచీ ఏమి లాభం
మల్లెలు నీ నవ్వులలో మనుగడ సాగించునా
సంపెంగా మురిపెంగా నాసికగా మారెనా
జగతిలోని ప్రతి అందం నీ రూపున నిలిచెనా
1. నా ఊహకు నీవే ఊపిరివైనావు
నా ఆశకు నీవే ప్రాణం పోశావు
నా హృదయపు కోవెలలో దేవతవైనావు
అనురాగ సామ్రాజ్యపు మహరాణివి నీవు
2. కనులముందు నీవుంటే కవిత పారదా
పెదవివిప్పి పలికితే పికము పాటఅవదా
నీవలపే నూరేళ్ళూ నను బ్రతికించు
నీ తలపే పదిజన్మల కనుభూతిగ మిగులు
OK
నిను మది తలతునో లేదో
భవసాగరమున మునకలు వేయుచు
భవ బంధమ్ముల పెనుగులాడుచు
1. నా ఆత్మ లింగమై దేహాన నిలిచి
నిత్యాభిషేకాలు చేయించుకో
నాహృదయ నాదమై నూరేళ్ళు పలికి
ఢమరుకా రావాలు మ్రోయించుకో
2. అంతర్మధనలొ ఆవేదనలో
హాలాహలమ్మును దిగమింగుకో
చిరుచిరు హర్షాల సిరిసిరి మువ్వల
ఆనంద నాట్యాల నర్తించుకో
3. పలికే పలుకుల సద్వాగ్రూపమై
వేదాంత సారాల వచియించుకో
తలచే తలపుల నీ స్మృతి చిహ్నమై
విజ్ఞాన దీపాల వెలిగించుకో
Wednesday, July 8, 2009
ఆనంద మతిశయిల్లు సంతోషము
అనురాగ సమ్మోహ సంయోగము
ఏదీ నాఎడద సంగీతము
నా మావితోపున వసంతము
మైమరచిపాడుకోయిలగానము
1. ఎటుచూసినా గాని చితి మంటలు
ఎడబాటు బలిగొన్న యువజంటలు
కన్నీరు ఇంకినట్టి కనుల కొలనులు
వసివాడిపోయిన ప్రణయ కలువలు
2. తల పండి పోయిన పసికూనలు
వలపన్నదే లేని జనఘోషలు
జీవిత పరమార్థం వ్యర్థమైతే
లేదు మనిషి జన్మకే సార్థకత
స్వామితింతక తోంతోమని-మేనుమరచి ఆడుదాం
1. మొద్దు నిద్దుర వదిలేద్దాం-పొద్దుపొద్దున నేలేద్దాం
చన్నీటితో స్నానం-సరదాపడి చేసేద్దాం
2. నల్లబట్టలనే కడదాం-ఒళ్ళంతా విభూతి పూద్దాం
నుదురు గంధం కుంకుమతో-అందంగా అలంకరిద్దాం
3. ఇరు సంధ్యల్లో స్వామిని-మనసారా పూజిద్దాం
పలుమార్లు శరణుఘోష-నోరారా చేసేద్దాం
4. ఒక్కపూటనే తిందాం-రుచి సంగతి వదిలేద్దాం
భుక్తాయాసమన్న మాట-మనకెందుకు వదిలేద్దాం
5. నేలపైనే నిద్దుర పోదాం-పాదరక్షలే వదిలేద్దాం
మాలవున్న మండలకాలం-నియమాలకు బంధీలవుదాం
6. ఎదురైన ప్రతి స్వామిని-స్వామి శరణని పలుకరిద్దాం
గురుస్వాములందరికి-చేతనైన సేవలు చేద్దాం
7. ఐదు పూజలైనా చూద్దాం-ఐదు భిక్షలైనా చేద్దాం
స్వాములైదుగురికైనా-భిక్షను ఏర్పాటుచేద్దాం
దీక్షను పరిపూర్తి చేద్దాం
నా గుండెకాయ మీద కూర్చుండవోయీ
ద్వారకామాయి ఏల సాయీ
నాహృదయమూ శిథిలమైనదేనోయి
1. ఆడుకొన నీకు నేను పసివాడనేనోయి
మేన దాల్చుకఫ్నీగ నా చిత్తముందోయి
నా ఇంద్రియాలతొ కొలువుదీరు బోధించడానికి
నా శత్రువులార్గురితో చేయి పోరు జయించడానికి
2. నా జీవిత పాత్ర నీకిస్తా బిచ్చమెత్తడానికి
నా ఆశలజోలె నీకిస్తా నిండిపోదు ఎన్నటికీ
నీటికింక కరువు లేదు కన్నీటి చెరువులున్నయ్
నిదురించ బెదురు లేదు వేదనల పరుపులున్నయ్
చేతులెత్తిమొక్కి మనసార నిన్నే వేడుకోవాలి
సాయి గణపతి నీపై మనసాయే గణపతి
హాయి గణపతి నీనామం నీవే నాగతి
1. గుండెగుండెలో నీ దివ్య రూపం నిలుపుకోవాలి
గొంతుగొంతూ నీనామగానం వంత పాడాలి
వాడవాడలో నీభక్తి గీతాలు మారుమ్రోగాలి
జగమంత నీ చవితి సంబరాలే జరుపుకోవాలి
2. సంసారకూపం బహుజన్మపాపం సంగతి మరిచేము
మిడిమిడిజ్ఞానం మెట్టవేదాంతం పాఠాలు నేర్చేము
విభూతి గంధం కాషాయ వస్త్రం వేషాలు వేసేము
నిజమైన తత్వం నీ పరమార్థం తెలియకున్నాము
Saturday, July 4, 2009
మరునిమిషం మరణం
రెంటిమధ్య నలిగే ఏమిటి ఈజీవితం
ఏమిటీ జీవితం
1. వేసిన ఆ స్వర్గానికి పలు నిచ్చెనలు
కూలిన ఈ అనుభవాల సౌధములు
ఆశల అడియాసల ఈ గారడిలో
ఏమిటి ఈజీవితం- ఏమిటీ జీవితం
2. మనుషుల మాటవినని మనసులు
మనసులతో పనిలేని మనువులు
ఇరుమనసుల ఈ మనువుల రాపిడిలో
ఏమిటి ఈజీవితం -ఏమిటీ జీవితం
3. మెరిసిన ఆనందపు చంద్రికలు
ముసిరిన ఆవేదన తిమిరములు
ఈ చీకటి వెలుగుల దీపావళిలో
ఏమిటి ఈజీవితం -ఏమిటీ జీవితం
OK
నాచిన్న చిన్న చిక్కులన్ని తీర్చిపోరో
ఒక్కగానొక్క నా దిక్కు నీవేరో
చక్కనైన అయ్యప్పా బిరబిర రారో
శరణమయ్య శరణమయ్య శరణ మయ్యప్పా
స్వామి కరుణజూపి కావుమయ్య శరణమయ్యప్పా
1. ఏబ్రాసిగ తిరుగునాకు గురువైనావు
నియమనిష్ఠలన్ని తెలిపి మాలవేసినావు
విఘ్నమొందకుండ దీక్ష సాగించావు
ఎగరేసిన నాశిరమున ఇరుముడినుంచావు
2. బెదరిన నాకెరుమేలిలొ ఎదురొచ్చావు
దారితప్పకుండ నాకు తోడైనావు
వెన్నుతట్టి చేయిపట్టి నడిపించావు
కఠినమైన కరిమలనే ఎక్కించావు
3. పద్దెనిమిది పసిడిమెట్ల నెక్కించావు
కన్నులార నీ మూర్తిని చూపించావు
నేనలసిపోగ అయ్యప్పా ఆతిథ్యమిచ్చావు
మహిమ గల మకరజ్యోతి చూపించావు
4. అప్పుడే నన్నిట్టా మరచిపోతె ఎట్టారా
ననుగన్నతండ్రినీవని- నమ్మితి మనసారా
ఆదరించు మారాజా-పిలిచితి నోరారా
ఆలస్యము జేయక-వేగమె రావేరా
అట వెలసెను-బాబా మందిరము
షిర్డీ యాత్రయె-మనకొక వరము
సాయి దర్శనం సంపత్కరము
1. సాయి బాబా పాదస్పర్శతో-పావన మాయెను అణువణువు
సాయిరాముని సాంగత్యముతో-పరవశమాయెను ప్రతి హృదయం
ద్వారక మాయియే భువిలో వెలసిన స్వర్గము
సాయిబోధనయె కైవల్య మొసగెడి మార్గము
2. గురుస్థానము ధునిలో ధూపము- దర్శనమాత్రము తొలగు పాపము
పల్లకి సేవలు సాయి హారతులు-వర్ణించతరమా ఆ అనుభూతులు
బాబా కృపలేనివారు-ఎవరూ షిర్డీ పోలేరు
సాయి కరుణిస్తె చాలు-కలుగును సుఖ సంతోషాలు
బొజ్జనిండదినుమురా-ఉండ్రాళ్ళు దండిగ
1. మా కలలు పండగ-వచ్చె చవితి పండగ
వేడగానె గుండెలో-వరములిచ్చు మెండుగ
కొండంత అండగ –వక్రతుండనీవుండగ
ఉండనే ఉండవుగా-గండాలు మొండిగ
2. తండోప తండాలే-భక్తజన సందోహాలే
ఊరువాడ జగము నిండా-నవరాత్రి సంబరాలే
దినమంత పూజలే-రేయంత భజనలే
గణపతి అనుక్షణం-శరణుమాకు నీ చరణాలే
Friday, July 3, 2009
నను ఓదార్చగ రావే ఓ ముద్దుల చెల్లీ
1. జీవితాన నేనెంతో అలసిసొలసి నిలిచితిని
పదేపదే పరుగిడి నే పలుమార్లు విసిగితిని
సహనమనేది నాలో సమూలంగ చచ్చినది
కరుణించి నీ ఒడిలో సేదదీర్చుకోనీవే
2. తపము చేసి నీకై నే కోరితి ఈ చిరువరం
నా వంటి వారంటే నీకెందుకు ఈ వైరం
శయనించవె కనుపాపల తల్పముపైన
ఎక్కించవె నన్నొకపరి కలల పల్లకీ మీద
3. లయకారుడి సిరిమువ్వవి నీవే కాదా
యమరాజుకు ప్రియసఖివి నీవే కాదా
మృత్యుదూతనెచ్చెలీ-మరణ ఢమరుకధ్వనీ
శాశ్వతముగ నాచెంతకు ఇకనైనా రారాదా
దరహాసమునై-నీ పెదవులపై నిలిచా
ఆతృతగా నా ఎదవాకిలి తెఱిచా
అర్పణగా నా బ్రతుకే నీకై పరిచా
1. రాతిరినై నీ కురులలోన కలిసా
ఉదయమునై నీ వదనముపై వెలిసా
రంగుల హరివిల్లును నేనై
తనువంతా ప్రభవింపజేసా-పరవశింపజేసా
2. మరుమల్లికనై నీ జడలో మెరిసా
మందారమునై నీ చెక్కిలిపై విరిసా
సుగంధాల ప్రబంధ నాయికగా
నిన్నే పరిమళింపజేసా-ప్రస్తుతింపజేసా
3. అనురాగమునేనై మనసారా వలచా
ఆనందమునై నను నేనే మరిచా
తగనివాడనని తప్పుకొంటివని
తలచితలచి నే వగచా-జీవశ్చవమై నిలిచా
OK
శరణాగత త్రాణ -శరణం అయ్యప్ప
శ్రీ శబరి గిరివాస- శరణం అయ్యప్ప
ఓంకార రూపా- శరణం అయ్యప్ప
బ్రహ్మాండనాయక- శరణం అయ్యప్ప
మోహినిపుత్రా- శరణం అయ్యప్ప
జగదేక మోహన- శరణం అయ్యప్ప
హరిహర నందన- శరణం అయ్యప్ప
ఆపద్భాందవ- శరణం అయ్యప్ప
భవబంధమోచక- శరణం అయ్యప్ప
మోక్షప్రదాయక- శరణం అయ్యప్ప
విష్ణుకుమారా- శరణం అయ్యప్ప
శంకరాత్మజా- శరణం అయ్యప్ప
పార్వతిపుత్రా- శరణం అయ్యప్ప
పరమ పవిత్రా- శరణం అయ్యప్ప
గణపతి అనుజా- శరణం అయ్యప్ప
షణ్ముఖ సోదర- శరణం అయ్యప్ప
కైలాసవాసా- శరణం అయ్యప్ప
కైవల్యదాయక- శరణం అయ్యప్ప
దత్తావతారా- శరణం అయ్యప్ప
సాయిస్వరూపా- శరణం అయ్యప్ప
సద్గురునాథా- శరణం అయ్యప్ప
సద్గుణ మూర్తీ- శరణం అయ్యప్ప
పందళరాజా- శరణం అయ్యప్ప
పాండు కుమారా- శరణం అయ్యప్ప
విల్లాలివీరా- శరణం అయ్యప్ప
వీరమణికంఠా- శరణం అయ్యప్ప
గురుదక్షిణ ఇచ్చావు- శరణం అయ్యప్ప
పులిపాలు తెచ్చావు- శరణం అయ్యప్ప
తల్లికోర్కె తీర్చావు- శరణం అయ్యప్ప
దీక్షాభీష్టుడా- శరణం అయ్యప్ప
మాలధారణాతుష్టుడ- శరణం అయ్యప్ప
కన్నెస్వామి ఇష్టుడ- శరణం అయ్యప్ప
మండలనిష్ఠుడా- శరణం అయ్యప్ప
ఇరుముడి ప్రియుడా- శరణం అయ్యప్ప
ఎరుమేలివాసుడ- శరణం అయ్యప్ప
పేటతుళ్ళి నృత్యుడా- శరణం అయ్యప్ప
వావరు మిత్రుడా- శరణం అయ్యప్ప
అళుదామేడవాస- శరణం అయ్యప్ప
మహిషీ మర్ధన- శరణం అయ్యప్ప
మదగజ వాహన- శరణం అయ్యప్ప
కరిమల నిలయ- శరణం అయ్యప్ప
పంపావాసా- శరణం అయ్యప్ప
నీలిమల నిలయ- శరణం అయ్యప్ప
అప్పాచిమేడువాస- శరణం అయ్యప్ప
శబరిపీఠవాస- శరణం అయ్యప్ప
శరంగుత్తి ప్రియుడా- శరణం అయ్యప్ప
శబరీమలనిలయ- శరణం అయ్యప్ప
పదునెట్టాంబడియె- శరణం అయ్యప్ప
స్వామిసన్నిధానమే- శరణం అయ్యప్ప
స్వామిసాక్షాత్కారమె- శరణం అయ్యప్ప
స్వామిదివ్యరూపమె- శరణం అయ్యప్ప
స్వాముదరహాసమె- శరణం అయ్యప్ప
శ్రీ ధర్మశాస్తా- శరణం అయ్యప్ప
హే భూతనాథా- శరణం అయ్యప్ప
మణికంఠస్వామి- శరణం అయ్యప్ప
తారకప్రభువే- శరణం అయ్యప్ప
నెయ్యాభిషేకమె- శరణం అయ్యప్ప
కర్పూరజ్యోతియె- శరణం అయ్యప్ప
మాలికాపురోత్తమ- శరణం అయ్యప్ప
ఉత్తరా నక్షత్రం- శరణం అయ్యప్ప
కాంతిమలవాసా- శరణం అయ్యప్ప
జ్యోతిస్వరూపా- శరణం అయ్యప్ప
కన్నవారి ప్రియనే- శరణం అయ్యప్ప
దీనజన్ రక్షకనే- శరణం అయ్యప్ప
పరమ దయాళా- శరణం అయ్యప్ప
నిత్యబ్రహ్మచారియే- శరణం అయ్యప్ప
శరణుఘోష ప్రియనే- శరణం అయ్యప్ప
సచ్చిదానందమూర్తియె- శరణం అయ్యప్ప
మౌనం ఏలయ్య-మార్గంచూపవయ్య
1. మందువునీవే మాకువు నీవే
వ్యాధులు మాన్పే ఔషధమీవే
మంత్రము నీవే తంత్రము నీవే
పీడల బాపే యంత్రము నీవే
వైద్యడవీవే-సిద్ధుడవీవే
సరగున బ్రోచే సద్గురువీవే
2. అన్నము నీవే-పానము నీవే
మాలో వెలిగే ప్రాణము నీవే
గానము నీవే ధ్యానము నీవే
శాంతినొసగు సన్ని ధానము నీవె
భాగ్యము నీవే భోగము నీవే
కడకు చేరే పర సౌఖ్యము నీవే
https://youtu.be/CyQlkWT5evE?si=gMShUWKlRbAHI-FK
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:మధ్యమావతి
దండాలయా శతకోటి దండాలయా
లంబోదరా నీ దయ ఉండాలయా
1. కష్టమొచ్చినా నిన్ను మ్రొక్కలేదా
కలిమి వచ్చినా నీవె దిక్కుకాదా
ఎన్నడూనిన్ను మేమూ ఏకదంత మరువం
గిరిజాతనయా శ్రీ గణనాయక
ఆనందనిలయా సిద్ధివినాయక
2. పేరుపేరునా నిన్ను తలవ లేదా
ఏటేటనిన్ను మేము నిలిపేము కాదా
నవరాత్రులూనీభజనలూ-ఇలాచేసేము వెంకయ్యా
శ్రీ విఘ్నేశ్వర నమో నమో
పాప సంహార నమోనమో
Thursday, July 2, 2009
స్నేహ నది నను ముంచేసింది
నమ్మకాల ఈ జగన్నాటకంలో
నా నీడే నను నిలదీసింది
నాతోడే నను బలిచేసింది
1. సృష్టిలొ మధురం స్నేహమేనని-మనసావాచాకర్మలనమ్మితి
తీరనిజీవిదాహమునంతా-స్నేహమె తీర్చెడి నదియని ఎంచితి
హితులూ నను పరిహసించారు-సన్నిహితులూ నట్టేటముంచారు
2. మనసులలోనా-విషములదాచి-కాటువేసిరి దొంగచాటుగా
మాటలోలనా మధువులు చిలికి-కత్తులు దింపిరి వెన్నుపోటుగా
నేస్తాలు మసిలిరి మర్యాదగా-నవ్వుతుచేసిరి దగా దగా
OK
నీ నామ భజన నేనుదప్ప
స్వామి శరణ మయ్యప్ప
దిక్కెవరూ నాకు నీవుదప్ప
తులసిమాల వేసినాను-కల్లు బీడి వ్యసనాలు వీడినాను
ఉదయం లేచింది మొదలు-రేయి నిదురించు వరకు
నీ నామ భజన నేనుదప్పా- స్వామి శరణ మయ్యప్ప
గురుస్వామి సేవచేసినాను-గుండెలొ నిను నింపినాను
దీక్షగైకొన్నదిమొదలు-మోక్షము దొరికేటివరకు
దిక్కెవరూ నాకు నీవుదప్ప- స్వామి శరణ మయ్యప్ప
నీ నామ భజన నేనుదప్ప
స్వామి శరణ మయ్యప్ప
దిక్కెవరూ నాకు నీవుదప్ప
నెయ్యాభిషేకమే- కన్నులార గాంచితి
మకరజ్యోతినే స్వామి మైమరచి నే జూసితి
నేలపై జీవించింది మొదలు-హాయిగ నీ సన్నిధి చేరువరకు
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్పా-స్వామి శరణ మయ్యప్ప
నీ నామ భజన నేనుదప్ప
స్వామి శరణ మయ్యప్ప
దిక్కెవరూ నాకు నీవుదప్ప
నా హృదయం ద్వారక మాయీ
నా పలుకే సాయి లీలామృతము
నా బ్రతుకే సాయి నీకంకితము
1. నీ నామగానమే నాకు సుప్రభాతము
నే చేయు స్నానమె నీ దివ్యాభిషేకము
నే పాడే కీర్తనలే నీ కైదు హారతులు
నను వేధించే వేదనలే నీకై నివేదనలు
2. జనుల తోటి నాచర్చలే నీ భజనలు
వాదనల సారమే సాయి నీ బోధనలు
నే చేసే కర్మల ఫలము నీకే సమర్పయామి
మనసావాచాకర్మణా సాయి నమో నమామి
ఘన కవులకే తరము గాదది గౌరీకుమారా
1. మణిమయ మకుటము-కర్ణకుండలములు
అందాల గజవదన మా ఏకదంతము
భస్మము తిలకము గల ఫాల భాగము
కలుగిన ముఖబింబము-సదానందము-సచ్చిదానందము
2. ఒకచేత పాశము- ఒక చేత అంకుశము
ఒకచేత ఫలపాత్ర-ఒకచేత చిన్ముద్ర
ఆయుధ ధర హస్తాలు- కంఠహారములు
విఘ్నహరములు-భక్త వరములు
3. మౌంజిలు యజ్ఞోపవీతం-పట్టుపీతాంబరం
నడుము నాగా భరణ శోభితం
విరజిల్లెడు ముంగాలి కంకణం
మూషికారూఢ-మహా మహా దివ్య తేజం
4. ఒకవంక సిద్ధితో-ఒకవంక బుద్దితో
ఇరువురు సతుల జ్ఞానమూర్తివి
నిన్ను దర్శించగానే కలిగేను పుణ్యము
లేకున్న మిగిలేది మాకింక శూన్యము
Wednesday, July 1, 2009
ఈ మోడు గుండెలో-వాసంతం చిలుకునా
నాలో చెలరేగే దావానలమిక ఆగునా
ఆగని కన్నీరే ఇల గోదారిగ పారునా
1. చేసిన ఆబాసలు-రేపెను పలు ఆశలు
ఆ బాసలు నా బ్రతుకును బలిపశువుగ చేసెనా
ఆ ఆశలు మరునిమిషము అడియాసగ మారెగా
మనసులు ఎడబాసెగా
2. ఇది ఎంగిలి విస్తరాకు-
చితికే ఇది చేరు తుదకు
కలువవిరాజితం నీ నేత్రం
ఆరాధన పూరితం ఈ స్తోత్రం
అనురాగ నిగూఢితం ఈ పత్రం
1. నా కవితకు నీవే కాదా చెలి ప్రేరణ
నీ గీతికి నేనే కానా ఆలాపన
ఓపలేను నేనింకా ఈ విరహ వేదన
ఆలకించి వేవేగ దరిజేర ప్రార్థన
2. నీ కనులకు నేనే కానా చెలి కాటుక
నీ కురులలొ నిలిచేందుకు అయిపోనా మల్లిక
మధురమైన ఈ క్షణము మళ్ళీ మరి రాదిక
రావేలా నా మానస బృందావన రాధిక
OK
ఎన్నడైనగాని నిన్ను మరువను
సచ్చిదానంద రూపా హే సాయిబాబా
రాజాధిరాజ హే యోగి మహారాజా
1. మోదములో ఖేదములో అశ్రువులే వర్షిస్తాయి
జననంలో మరణంలో రోదనలే వినిపిస్తాయి
అశ్రుధారలేవైనా చేసేను నీ అభిషేకం
నాదరీతులేవైనా అదియె నీ సంకీర్తనం
సచ్చిదానంద రూపా హే సాయిబాబా
రాజాధిరాజ హే యోగి మహారాజా
2. నిద్దురలో మెలకువలో నినదించును నాహృదయం
ఆశలలో అడియాసలలో స్పందించును నాచిత్తం
ఎదకెప్పుడు నీదే ధ్యాస-చిత్తములో నీదే ధ్యానం
కోరికదిక ఒకటే కోరిక- నాలో తను లేకపోవుట
సచ్చిదానంద రూపా హే సాయిబాబా
రాజాధిరాజ హే యోగి మహారాజా
నీ భక్తుల మొర వినిరావా
హారతి గొనుమా గజవదనా
శుభములనిడుమా
1. విద్యను కోరేము వినాయకా
మంగళహారతి గొను మంగళదాయకా
పాపులము మేము పరితాపులము
పాపలము మేము నీ దాసులము
2. కలిమిని కోరేము ఓ ఏకదంతా
కర్పూర హారతిదే కామరూప ధారీ
ప్రతియేటా ఈపాటా ప్రతిపూటా మానోట
నవరాత్రులూ నిను భజియింతుమూ విను