Saturday, October 10, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గేలిచేయకు ఆలినీ నీ ప్రియురాలిని

కించపరచకు ఇల్లాలిని గయ్యాళని

సహానుభూతి చెందితే సైచలేమొక లిప్తపాటు

అర్ధాంగిని తూలనాడితే ఎంతటి పొరపాటు


1.షట్కర్మలానాడు శతకోటి కర్మలతో ఇంతి ఈనాడు

మబ్బునలేచింది మొదలు అర్ధరాతిరి వరకు

ఇంటిల్లిపాదికీ వేళకవసరాలు తీర్చి

బండెడు చాకిరితో గుండెబండబారుతుంటె

హద్దులు దాటదా ఓపిక-ఒద్దికగా మెలగకుంటె

అంతరించదా ఓరిమి-వద్దన్నవి చేస్తుంటే


2.ఊడిగమే చేయగా బానిస కాదు ఊఢ

ఉన్నదా మనకడ చిరుసాయపు జాడ

హితైషిగా సతియన్నది సదా మగని నీడ

ఇంటిని తీర్చిదిద్దు కళాతపస్వి కళత్రము

సవరించకున్నమానె ఇంటిని చెఱపకే మాత్రము

మౌనమొకటె సజావైన సంసారపు మంత్రము

No comments: