Saturday, October 10, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


యమన్ కళ్యాణి


అపార విశ్వాసమే సాయీ నీ భక్తులకు

ఎంతటి అంకితభావమో నీ అనురక్తులకు

నీ దాసుల పారవశ్యమేమనవచ్చు

నీ సేవలొ తరించగా బ్రతుకులు వెచ్చించు

సాయీ సహృదయా జగమంతా నీదయ

సాయీ షిరిడీ నిలయా నాపై కురిపించునీ దయ


1.పేరుకు ముందో  పేరుకు వెనకో-సాయి యని జతచేసుకొంటారు

పలకరించు  వీడిపోవు వేళల్లోను-సాయిరాం సాయిరాం అంటుంటారు

గుడికిపోను కుదరకున్నా నీపటంముందు ధూపమేసి మొక్కుతారు

ఆపద సంపదలందునూ అనవరతం సాయీ యని స్మరిస్తారు

సాయీ సహృదయా జగమంతా నీదయ

సాయీ షిరిడీ నిలయా నాపై కురిపించునీ దయ


2.ఎదురైన ప్రతివారిని నీవుగానె  భావిస్తారు

జీవరాశులన్నిటిలో నిండారా నీరూపమె దర్శిస్తారు

యోగక్షేమాలు నీవే చూసెదవని నిశ్చింతగ ఉంటారు

నీ సర్వస్యశరణాగతినే ఎల్లరూ సతతం వేడుకుంటారు

సాయీ సహృదయా జగమంతా నీదయ

సాయీ షిరిడీ నిలయా నాపై కురిపించునీ దయ

No comments: