పైన పటారం లోన లొటారం కాదయ్యా నువు శంకరా
ఎంత పటాలం నీకున్నదో మము కాచుటలో లేదు శంక రా
కైలాసం వదిలేసి గణములనాయత్త పరచి మా వంకరా
పిలిచీ పిలువగనే భక్తుల బ్రోచుటలో నీకు లేదు వంక రా
1.శివునాజ్ఞలేనిదే చీమైనా కుట్టదని మేమెరుగమా
నీ ఆనతిలేనిదే యముడైనా కదలడని అనుభవమేగా
మృత్యుంజయా ఆపరా సత్వరమే కరోనా కరాళ నృత్యం
జీవేశ్వరా ఛేదించరా కరోనా వ్యాప్తి వెనుక దాగిన సత్యం
2.నర జాతియే నాశనమొందువేళ ఏల తాత్సారం
మనుషుల మధ్యన మతమొకగీతగా దేనికి మత్సరం
అధికార దాహాలు రాజ్యాధిపత్యాలు ఎంత కుత్సితం
మానవ సమాజాన మచ్చగమారనీకు శార్వరి వత్సరం