Friday, November 12, 2021

https://youtu.be/V7c7ylOKtfg?si=_-W0OP5xpo6Pqm3B

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:నాట

గీటురాయి కెరుక పసిడి చొక్కదనమెంతో
కలహంసకే ఎరుక పాల చిక్కదనమెంతో
గులకరాయి కెరుక గరగ గట్టిదనమెంతో
నాకు మాత్రమే ఎరుక -చెలీ మిక్కిలైన నీ చక్కదనమెంతో

1.కొలవడానికేదో కొలమానముంటుంది
తూచడానికైతేనో తూనికరాళ్ళుంటాయి
విశ్వవ్యాప్తి ఎంతటిదో కాలానికే ఎరుక
శ్రీకృష్ణుని బరువెంతో తులసిదళానికే ఎరుక
నీ చక్కదనం ఎక్కడుందొ నాకు మాత్రమే ఎరుక  

2.చీరకున్న మన్నికను చేతపట్టి చూడాలి
తేనెలోని నాణ్యతను నిప్పు పెట్టి చూడాలి
కాపురం నిబద్ధత సర్దుబాటు కెరుక
ప్రేమలోని స్వచ్ఛత త్యాగానికే ఎరుక
నీ చక్కదనం ఎక్కడుందొ నాకు మాత్రమే ఎరుక

* గరగ= మట్టి కుండ


Thursday, November 11, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పరిచయాన పరిమళాలు-వెదజల్లినావె

స్నేహితాన సౌరభాలు-విరజిమ్మినావె

మైత్రీ మధురిమలే-కురిపించినావె

నా లోన ఊహలొన్నొ మొలిపించినావే


 1.మధురోహల రోదసిలో-విహరింపజేసావె

అనుభూతుల మరుమల్లెలు-వికసింపజేసావె

మంత్రమేదొ వేసి నన్ను –మాయజేసినావె

నన్ను నేనె మఱచులాగ-మైకంలో ముంచావే


2.నువ్విచ్చిన వరమెకటే –తీయనైన ఈ విరహం ....

నామదికిక పని ఒకటె-నిను తలచుట అహరహం...

నువ్వు కలవని కాలం-వర్షమాయె

నిను చూడక నా కనుల-వర్షమాయె

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాగనంపు వేళసైతం 

కనులనుండి పారెడిది నదే అలనాడు సాంతం

వల్లకాటిలో చితి కాలితేనేం 

తడి జాడ మదిలోనూ కనిపించని నేటి వైనం

స్పందనే మరచిన గుండె స్థాణువై పోయింది

బ్రతకడానికే అన్నట్టు మొక్కుడిగ ఆడుతోంది


1.కడుపు చించుక కన్నారు తల్లులంత ఆనాడు

కడుపు చించడం మినహా కనుట కుదరదీనాడు

చనుబాలు అమృతమై బొజ్జనింపె శిశువులకు

బలవర్ధక పోషక పాలే గతి నేటి పసికూనలకు

గోరుముద్ద చందమామ బువ్వలో వినోదమే

అమ్మ బుక్క నాన్నబుక్క దొంగబుక్క ఆనందమే


2.బాగోగుల పరామర్శలు  ప్రేమచిలకరింపులు

పరిచయం లేకున్నా చిరునవ్వుల పలకరింపులు

అవసరాలు గుర్తెరిగీ అందజేయు చిరుసాయాలు

ఎవరికి వారైన ఈ తరుణాన వెదకినా మృగ్యాలు

ఒలకదు కన్నీటి చుక్క నవ్వులైతె అతికిన లెక్క

మానవత్వం మనుషుల్లో తానో ఎడారి మొక్క

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పట్టరాని సంతోషం పసిడి గాజులకు

పట్టుకుంది అదృష్టం మట్టి గాజులకు

ఏ పుణ్య ఫలమో చెలీ  నీ పాణిగ్రహణం

ధన్యమైంది గాజు జీవనం నీచేయి చేరిన మరుక్షణం


1.మంజుల స్వని చేస్తాయి నీకదలికల కచ్ఛేరికి

అందంగా మ్రోగుతాయి పదపడు నీ చిందులాటకు

మంత్రముగ్ధులౌతాయి నీ మృదువైన కరస్పర్శకు

తెగనొచ్చుకుంటాయి పడకన సడిచేసినందుకు


2.మెరుపులరువు గొంటాయి నీమేని చక్కదనానికి

ఆవురావురంటాయి పోటీగా నీ చేతినెక్కడానికి

ఏ రంగు కోకోయని బెంగపడతాయి తమరంగు వంతుకై

గుండెప్పుడు పగులునోయని గుబులే తమ బ్రతుకై

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆచితూచి అందుకే మాటలాడ మన్నది

మాట ఇచ్చి ఎప్పుడూ తప్పకూడదన్నది

చేయగలిగితేనే ఏదైనా చెప్పాలి 

ఒకసారి చెప్పామా తప్పక చేసి తీరాలి

మనమీద మనకైన లేకపోతె ఏమాత్రం అదుపు

మన మాట గడ్డిపోచకైనా తూగక తలవంపు 


పోతే మాత్రమేమి మన ప్రాణం

తప్పకూడదెప్పటికీ చేస్తే వాగ్దానం

మదిలో ఎందుకు అపరాధ భావనం

ఆది నిష్టూరమే అత్యంత సుగుణం


వీథులపాలైనారు ఇచ్చిన మాటకొరకు

ఆలినైన అమ్మినారు ఆలాపమని నందులకు 

రాజ్యాన్నీ వీడారు వారాడిన నుడుగు కొరకు

పోరినారు తనవారని ఎరిగినా అని చివరి వరకు


పోతే మాత్రమేమి మన ప్రాణం

తప్పకూడదెప్పటికీ చేస్తే వాగ్దానం

మదిలో ఎందుకు అపరాధ భావనం

ఆది నిష్టూరమే అత్యంత సుగుణం


వెసులుబాటు చూసుకొనే ఇవ్వాలి మాట

మన మాట నమ్మిన వారికి కలగాలా ఆరట

తప్పెడి మాటకై పదే పదే వాయిదాలొకటా

సాకులనే  సాకుతూంటె ఎంతకూ ఒడవదట


పోతే మాత్రమేమి మన ప్రాణం

తప్పకూడదెప్పటికీ చేస్తే వాగ్దానం

మదిలో ఎందుకు అపరాధ భావనం

ఆది నిష్టూరమే అత్యంత సుగుణం


ఆచితూచి అందుకే మాటలాడ మన్నది

మాట ఇచ్చి ఎప్పుడూ తప్పకూడదన్నది

చేయగలిగితేనే ఏదైనా చెప్పాలి 

ఒకసారి చెప్పామా తప్పక చేసి తీరాలి

మనమీద మనకైన లేకపోతె ఏమాత్రం అదుపు

మన మాట గడ్డిపోచకైనా తూగక తలవంపు


పోతే మాత్రమేమి మన ప్రాణం

తప్పకూడదెప్పటికీ చేస్తే వాగ్దానం

మదిలో ఎందుకు అపరాధ భావనం

ఆది నిష్టూరమే అత్యంత సుగుణం

Tuesday, November 9, 2021

 

అంగడిలో దొరకని దొకటే -అమ్మ పంచే అనురాగం

సాధించగ అసాధ్యమే-గడిచిన కాలం పోయిన ప్రాణం

విలువ తెలుసుకోవాలి  కాస్తైనా ఇక  నేస్తం

ఒడిసి పట్టుకోవాలి  చేయిజారనీక జీవితం

 

1. కనుమరుగై పోవడమే క్షణం లక్షణం

అనూహ్యమే మనిషికెప్పుడూ మరణ కారణం

చక్కదిద్దుకోవాలి వెలిగినంతలోనే ఆశాదీపం

మసకబారి పోకముందే మనదైన ప్రతిరూపం

 

2 అక్షరమై నిలవాలి  కవితల్లో ప్రతీ అక్షరం

హృదయాలను గెలవాలి  కదిలించగ  పదం పదం

పాటనై... నడిచేందుకు బాటనై...  చేరుస్తా  గమ్యం  

మాటనై పసిడి పలుకుల మూటనై పంచేస్తాఆనందం

Sunday, November 7, 2021

 https://youtu.be/U53WSGnxj3E?si=sFjXB4SojMYDd755

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:రేవతి

ఈశ్వరా పరమేశ్వరా విశ్వేశ్వరా

నశ్వరమౌ ఈ దేహము పై నాకెందుల కింతటి వ్యామోహం

రామేశ్వరా రాజేశ్వరా భీమేశ్వరా

విశ్వసిస్తినిను  త్రికరణశుద్ధిగ భస్మము చేయర నాలో అహం


1.కాలకాల హే కామారి కామేశ్వరా

నలిపేయర హర బలీయమై నను కబళించే కామాన్ని

ఫాలనేత్ర ప్రభు గరళకంఠ గంగాధరా

కట్టడి సేయర అట్టుడుకుతు నా విజ్ఞత చెరిచే క్రోధాన్ని


2.మహాదేవ నమో భోలాశంకర మహేశ్వరా

నాదీ అన్నది  ఏదీలేదిట వదిలించర నా లోభాన్ని

జటాఝూట జంగమదేవర చoద్రమౌళీశ్వరా

భవబంధాలలొ బంధీనైతిని సడలించర నా మోహాన్ని


3.సాంబ సదాశివ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరా

విర్రవీగి నేగర్వించగ అణిచివేయరా నామదిలోని మదాన్ని

వైద్యనాథ జయ మల్లికార్జున త్రయంబకేశ్వరా

పరుల ఉన్నతిని భరించలేను హరించు నాలో మత్సరాన్ని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండెలోన గుచ్చుకుంది గులాబి ముల్లు

మనసు నిండిపోయేలా కురిసింది ప్రేమ జల్లు

లేలేత పెదాలే రెక్కలుగా నవ్వు పువ్వు విచ్చుకుంది

అప్సరసల అందాలను అంగాంగం పుణికి పుచ్చుకుంది


1.వసంత వన్నెలనే వలపన్నింది

కోయిల తానై పాటే వలపనింది

మనసునే మల్లెమాలగా మార్చి నా ఎద నలరించింది

పలుకుల తేనెలనే వడ్డించి పసందైన విందుల నిచ్చింది


2.పంజరాన్ని వదిలేసి ముంగిట వాలింది

మంజుల గానాలతో రంజిలజేసింది

తాను నేను చెరిసగమౌ రంగుల చిత్రమొకటి గీసింది

మా ఇరువురి కాపురపు లోకానికి తలుపు మూసింది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలల వాకిట వేచి ఉంటా

తరలిరా నా నేస్తమా

మరులనెన్నో దాచి ఉంచా

జాగు సేయకు ప్రియతమా


1.తెరిపి లేని ఒరిపిడాయెను

పగలు మదిలో సెగలు రేపెను

వగరు వయసున వగపు లేల

వలపు పిలుపుకు బదులు పలుక


2.తలుపు తట్టెను తలపులన్ని

గెలుచుకొమ్మని ముద్దుగుమ్మని

ఊహలే ఊరించ సంగమ హాయిని

ఉల్లమేల చెలియకై  ఊపిరే ఇమ్మని

 రచన్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:అమృత వర్షిణి


నను నడిపించరా నా అడుగులు తడబడె

చేయందించరా బ్రతుకు కడలి సుడిబడె

ఎందరిలోనో నేనొకడినని సందియమెంతో ఉండెడిది

అందరిలోను నినుగనినంత నా డెందమానంద మొందినది


1. కలివిడిగా నీవిచ్చినవే స్వామి నా కష్టసుఖాలు

ఇబ్బడిముబ్బడిగా ఎందుకు అందులొ కష్టం పాలు

నా లోపాలు పాపాలు కోపాలే కారణాలై ఈ శాపాలు

తాళజాలనీ పరితాపాలు తీర్చరా ప్రభూ భవతాపాలు


2.అన్నీ ప్రసాదించావు స్వామీ నాకు ఆఒక్కటి దప్ప

పరమదయాళా ప్రభో ఇదియేనా  నీదైన గొప్ప

దయచేయి దయచేసి నాకినైన  మనశ్శాంతి

నా హృదయాన దయచేసి వరమీయి నివృత్తి

Saturday, November 6, 2021

OK


కన్ను చెదిరేనే సన్నజాజి తీగవంటి నీ ఒంటి వంపులే చూసి

రెప్పలార్చనైతినే  మెరుపుతీగ తెన్ను మేను జిలుగుకే భ్రమిసి

జీడితీగలోని తీపి నీ పెదాల సుధా మాధురి

సంతూర్ తీగలమ్రోగు తీపి నీ పలుకుల మాదిరి


1.కాంచనగంగా ప్రవాహంగ నీ తనువు తోచే

నీ అంగాంగం మోహనంగ సారంగమై పూచే

మదన కదనరంగాన శృంగార శృంగజమై వేచే

కందవాహనమే ఆవాహనమై నా మనమే నర్తించే


2.మితిమీరే రతి పదాల నిఘంటువులు  నీ బిగువులు

మతి కోరే సమ్మతి తెలిపెడి చాటువులు నీ నగవులు

ప్రతినాయకి గతిసాగెడి కవ్వింపుల నీపయ్యెద పొతవులు

శ్రీమతిగా నిను గొనమని తథాస్తు దేవతల హితవులు

OK


చెప్పారు ఎందరో-స్నేహితానికి నిర్వచనం 

అనుభూతి చెందారు మైత్రిలోని మాధుర్యం

సృష్టిలోనే తీయనిది స్నేహమన్నది

చెలిమిని మించి ఏమున్నది పెన్నిధి


1.నీకు తెలియని కోణాలెన్నో నీలో లోలో

నీవు చూడని పార్శ్వాలెన్నో నీ వ్యక్తిత్వంలో

ఏ అద్దమైనా-చూపలేని నీ ప్రతిరూపం-చూపే దీపం సౌరభం

దిద్దుబాటుకోసం-నీలోని ప్రతి లోపం-తెలిపే కటకం నేస్తము


2. పరకాయ ప్రవేశం చేస్తుంది నీలోకి నేర్పుగా

పరసువేదితో పసిడిని చేస్తుంది నిన్ను ఓర్పుగా

నీ నుండి విడివడిన-ఆ రెండో నీవే-నీ మిత్రుడు చిత్రంగా

శ్రేయస్సును కూర్చే-ఏకైక లక్ష్యమే-మైత్రికి తగు సూత్రంగా

Friday, November 5, 2021



అక్షరాలతోనే సచ్చిదానందాలు

పదాల పోహణింపులో ఆహ్లాదాలు

భావాలు కవితలైతే తనివి దీరి మోదాలు

కల్పనాలోకంలోనే పండుగలు పర్వదినాలు


1.విడివడుతూ ఉన్నాయి ఇలలోని ముడులన్నీ

సడలుతూ ఉన్నాయీ సంసార బంధాలన్నీ

కర్తవ్య పాలన కొరకే కాలాన్ని కరిగించేది

విద్యుక్త ధర్మానికే కట్టుబడుతు జీవించేది


2.మురిసి పోవడానికీ గతమించుక మిగిలుంది

సేద దీరడానికి గీతమక్కున జేర్చుకుంది

సాంత్వననే పొందడానికి మిథ్యాజగత్తొకటుంది

చేదు నిజం మరిపించేలా గమ్మత్తులొ ముంచుతుంది


https://youtu.be/hqe2Rb3k0WA?si=vRlF_Xw4SDvGxByI


కనకమహాలక్ష్మి కాలి అందియల లయ

జ్ఞానభారతి కఛ్ఛపి వీణియ శ్రుతి కలయ

ఆదిపరాశక్తి ఖడ్గ కాంతులు వెలయ

కావాలి మీ గృహమే కోటి కాంతుల నిలయ

బంధు మిత్రులారా అందుకోండి దీపావళి శుభాకాంక్షలు

కీర్తీ సుఖ సంపదలే  వరమీయాలి 'మా' 'క్షేమ' భాషా లక్ష్ములు


1.ప్రియమగు వాక్కులే  రసనలు పలికేలా

హితమగు యోచనలే  మేధలు చిలికేలా

జనరంజకమౌ సాహితీ సంగీతములొలికేలా

వర్షించాలి శ్రీవాణి కరుణాదృక్కులే నిలువెల్లా

బంధు మిత్రులారా అందుకోండి దీపావళి శుభాకాంక్షలు

కీర్తీ సుఖ సంపదలే  వరమీయాలి 'మా' 'క్షేమ' భాషా లక్ష్ములు


2.నరదృష్టి దోషాలనన్నటినీ పరిమార్చగా

శత్రు పీడ నీడ కూడ సమూలంగ తీర్చగా

ఆయురారోగ్యాలే సర్వదా సమకూర్చగా

రక్షించాలి భగవతి నిత్య శోకాల నోకార్చగా

బంధు మిత్రులారా అందుకోండి దీపావళి శుభాకాంక్షలు

కీర్తీ సుఖ సంపదలే  వరమీయాలి 'మా' 'క్షేమ' భాషా లక్ష్ములు


3.పరుల నడుగ చేయిసాచు గతి ద్రోయక

ఋణము కోరు తరుణమెపుడు రానీయక

అవసరాలు తీరునటుల సొమ్ముల నొసగగ

అనుగ్రహించాలి సిరియే సంతృప్తి మీరగ

బంధు మిత్రులారా అందుకోండి దీపావళి శుభాకాంక్షలు

కీర్తీ సుఖ సంపదలే  వరమీయాలి 'మా' 'క్షేమ' భాషా లక్ష్ములు


https://youtu.be/mUD-pKKx5us?si=NqEA22i3ftJZaoOa

కనుల ప్రమిదల కరుణ దీప్తుల వెలిగించు

హృదయమందున మమత చమురును నించు

మనిషి మనిషిలొ బాంధవ్య కాంతులను కాంచు

పరిసరాలలొ పరికించి చూచి పరవశించు

అనుదినం ఈ లోకమంతా దీపావళి భాసించు


1.బోసినవ్వుల పాపలు

విరజిమ్ము రుచులు మతాబులు

పసిడి పసి పలుకులందు

చిటచిటల పేలు టపాసులు

పరిసరాలలొ పరికించి చూచి పరవశించు

అనుదినం ఈ లోకమంతా దీపావళి భాసించు


2.అర్ధాంగి శ్రమని గుర్తిస్తె చాలు

ఆలి ఎద ఎగసేను చిచ్చుబుడ్డీగా

పత్నికందిస్తేనో కాసిన్ని ప్రశంసలు

ఇల్లాలి కన్నుల్లో పూసేను వెన్నెల తీగలు

పరిసరాలలొ పరికించి చూచి పరవశించు

అనుదినం ఈ లోకమంతా దీపావళి భాసించు

https://youtu.be/RaBtjtsSI-4?si=hTtX54J7uX-YdNvl

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:మాండు

ప్రతి నిత్యం దీపావళే నా ఇంట నువ్వుంటే
బ్రతుకంతా సౌదామినే నాకంట కొలువుంటే
నీ కన్నులు మతాబులు నీ నవ్వులు తారాజువ్వలు
మిసమిసలతొ తిరుగాడితే వెలుగు వెన్నెల తీగలు
రుసరుసగా మాటలు రువ్వితె అవ్వే  సీమటపాసులు

1.దుబారా నరకుని దునుమాడె సత్యభామవే
గుట్టుగ ఖర్చులు నెట్టుకవచ్చే విజయలక్ష్మి వే
నీ నడకలు భూచక్రాలు నీ ఆజ్ఞలు లక్ష్మీ బాంబులు
చెరగని నవ్వుల సంపదలొసగే ధనలక్ష్మి నీవే
పండుగ సందడి నిండుగ నిలిపే వైభవలక్ష్మివే

2.ఆనందాల అతిథుల కళ్ళే వెలిగే దివ్వెలు
తృప్తితొ  అభ్యాగతులిచ్చే దీవెనలే  రవ్వలు
మువ్వల సవ్వడి వాద్యాలు గాజుల సడి మంత్రాలు
తీరగు రుచులతొ కమ్మని విందిడు ధాన్యలక్ష్మివే
గుండెలొ దండిగ కొలువై ఉండెడి నా గృహలక్ష్మివే


తెల్లారిందా లేచామా-పళ్ళుతోముకున్నామా

చాయో కాఫో తాగామా-ఇడ్లీ ఉప్మా తిన్నామా

ఆఫీసుకి బయలెళ్ళామా-సాయంత్రం తిరిగొచ్చామా

ఇంతేగా జీవితమంటే ఎలా-ఇంతేగా కారణమంటే సరా


1బ్రేక్ ఫాస్ట్ మెనూ ఏమిటో-లంచ్ లోకి స్పెషల్ ఏమిటో

నోరూరించుకొంటూ చాట్ చేసుకుందామా

జోకుల్ని నంజుకుంటూ కబురులాడుకుందామా

ఇంతేగా జీవితమంటే ఎలా-ఇంతేగా కారణమంటే సరా


2.గ్యాసిప్పులనే సిప్ చేస్తూ-గోల్డెన్ డ్రీమ్స్ నెమరువేస్తూ

ఊకదంపుడు సోది పంచుకుందామా

ఉత్తుత్తి అనుబంధాలే పెంచుకుందామా

ఇంతేగా జీవితమంటే ఎలా-ఇంతేగా కారణమంటే సరా


3.సామాజిక మాధ్యమం వేదికగా-ఆచరణకు సాధ్యంకాని ప్రణాళికగా

ఉల్లిపొరలు విప్పడమే  ప్రహేళికగా-ఊహల్లో కాపురముందాం సరదాగా

ఇంతేగా జీవితమంటే ఎలా-ఇంతేగా కారణమంటే సరా

Wednesday, November 3, 2021



దీపాలు వెలిగించినావు సాయి

పేలికలే వత్తులయి నీరే చమురయి

గాలిలో శయనించినావు బహువిచిత్రమై

చెక్కబల్ల తల్పమయి ఇటుకనీకు తలగడయి

నీ మహిమలనన్యము నీ లీలలు కడురమ్యము

సచ్ఛరిత్ర పారాయణ పుణ్యము బ్రతుకు ధన్యము


1.పిల్లలతో గోళీల ఆటలాడినావు

బల్లి భాషలోని మర్మమెరిగినావు

పిండి జల్లి మశూచిని పారద్రోలినావు

లెండీ వనములో పూమొక్కలు పెంచినావు

నీ మహిమలనన్యము నీ లీలలు కడురమ్యము

సచ్ఛరిత్ర పారాయణ పుణ్యము బ్రతుకు ధన్యము


2.మహల్సాపతితో మైత్రిని సలిపినావు

హేమాద్పంతుతో స్నేహము చేసినావు

తాత్యాని నీవు మేనఅల్లుడని ఎంచినావు

ధునిమంటలొ చేయుంచి పసిబిడ్డని  కాచినావు

నీ మహిమలనన్యము నీ లీలలు కడురమ్యము

సచ్ఛరిత్ర పారాయణ పుణ్యము బ్రతుకు ధన్యము


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ప్రణతులు నీకివే ప్రభో ధన్వంతరి

వినతులు గైకొనుమా సాక్షాత్తు శ్రీహరి

వైద్యశాస్త్రానికే ఆది మూల పురుషుడవు

వైద్యలోకమంతా కొలిచే భగవంతుడవు

మా రుగ్మతలోకార్చు మా రుజలనెడబాపు


1.పాలకడలి చిలికినపుడు పుట్టినావు

విష్ణుమూర్తి అంశతోటి జన్మించినావు

గౌతమినది తీరాన స్థిరముగా వెలసినావు

చింతలూరు గ్రామాన కొలువుదీరి యున్నావు

మా రుగ్మతలోకార్చు మా రుజలనెడబాపు


2.సుందర మూర్తిగా ప్రత్యక్షమౌతావు

చతుర్భుజాకారునిగా దర్శనమిస్తావు

శంఖ చక్రాలను  హస్తాల  ధరించినావు

అమృతకలశము జలగను పూనినావు

మా రుగ్మతలోకార్చు మా రుజలనెడబాపు


3.ఆయుర్వేదమును ఆవిష్కరించినావు

శుశ్రుత చరకాదులకు గురుదేవుని వైనావు

వేపా పసుపుల నొసగిన దివ్య వైద్య శ్రేష్టుడవు

మొండి వ్యాధులన్నింటిని  తొలగించే ఘనుడవు

మా రుగ్మతలోకార్చు మా రుజలనెడబాపు




https://youtu.be/BinWDG-rZIM

 https://youtu.be/0pZYrI5U0nU

ప్రత్యూష తొలి కిరణం 

నునువెచ్చగ నను తాకిన వైనం

పూరెక్కల పైని  తుషారం

నా కన్నుల మెరిసే ప్రతిబింబం

నిన్ను తలపిస్తుంటే మేను రోమాంచితం

నువు గుర్తుకొస్తుంటే హాయి వర్ణనాతీతం


1.పడమటి సంధ్యారాగం పలకరింపులు

గోదావరి ఇసుక తిన్నెల పరామర్శలు

మబ్బుచాటు జాబిలి దోబూచులాటలు

తళుకు తారలు మేలిముసుగుతొ వలపు పిలుపులు

నిన్ను తలపిస్తుంటే మేను రోమాంచితం

నువు గుర్తుకొస్తుంటే హాయి వర్ణనాతీతం


2.కోనేటి మెట్ల సాక్షిగా మధురానుభూతులు

నీటి అలలు నీ పదాల ముద్దాడిన స్మృతులు

ధ్వజస్తంభపు జేగంటల మంజుల శ్రుతులు

గోపురాన పావురాల జత పాడే ప్రేమకృతులు

నిన్ను తలపిస్తుంటే మేను రోమాంచితం

నువు గుర్తుకొస్తుంటే హాయి వర్ణనాతీతం

Friday, October 29, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మారిపోని మరో ఉదయం పేలవంగా

నిదుర చెదిరి ప్రతి రేయీ కలవరంగా

దినమంతా నిస్సారంగా బ్రతుకంతా నిర్వేదంగా

మరణానికి ఆహ్వానంగా నరకమే బహుమానంగా


1.టీ కప్పులొ సైతం చెలరేగును ఓ తుఫాను

  పైకప్పు ఎగిరేలా మ్రోగేను అరుపుల సైరను

ఉన్నదానికి లేనిదానికి తడవ తడవకు ఓ గొడవ

ఐనదానికి కానిదానికి తలమునకల వెతల పడవ


2.అందుబాటులో ఉన్నామంటే అదో కంటగింపు 

తప్పుకొని పోతుంటే వెంటాడుతు వేధింపు

నరనరాల అసహనం ఒక్కుమ్మడి కుమ్మరింపు

విధిలేక తోడుగ సాగుతూ అక్కసుగా ఏవగింపు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నాదైన లోకంలో

చేదైన నాకంలో

అదోలాంటి మైకంలో

ఎదలోన శోకంతో

అలా అలా అలా

తీరాన్ని చేరని అలలా


1.ప్రాపకం లేని తీగలా

మాటలొచ్చీ నే మూగలా

ఐనవారికీ నేనో పగలా

వేసవిలో పగటి సెగలా

మల మల మల మాడేలా

కంటి కంటిలో నేనంటే మంటలా


2.చెక్కబోతె విరిగిన శిలలా

ఎప్పుడూ ఫలించని కలలా

చిక్కితి నే చిక్కుల వలన

ఎక్కువ ఆశించుట వలన

విల విల విలపించుతూ

వల వల భాష్పించుతూ

Thursday, October 28, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్ని చిత్రాలో -సాయి నీవి - కనడానికి

ఎన్ని చిత్రాలో -నువు దైవమని -నమ్మడానికి

ఎన్ని హావభావాలో -నీ విగ్రహానికి

ఎంతటి వైభవమో -సమాధిమందిరానికి

తరించేము నినుగాంచి- స్మరించేము మైమరచి


1.బండరాయి మీద కూర్చున్న దొక్కటి

లెండీవనాన మొక్కకు నీరు పోసేటిది

షిరిడీవీథుల్లో భిక్షను స్వీకరించునదొకటి

అన్నము వండే గుండీలో చేయితిప్పేదొకటి

తరించేము నినుగాంచి స్మరించేము మైమరచి


2.ద్వారకమాయిలో బోధలు చేయుచూ

తిరుగలి రాయితో గోధుమలను విసురుతూ

పసిబాలల తోటి కూడి పలు ఆటలాడుచూ

చావడి ఉత్సవాన భక్తులతో ఊరేగుతూ

తరించేము నినుగాంచి స్మరించేము మైమరచి

Tuesday, October 26, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పసిడి వన్నెల చినదానా

పసిడి పలుకుల నా మైనా

పసిడి నగలే అణువణువున  నీ మేన

పసడివిలువే సున్నా నీకన్నా


1.తూరుపింటి ఆ పసిడి అరుణిమే

నీ బుగ్గల నునుసిగ్గు

పొద్దుగ్రుంకు సంజె కెంజాయే

నీ మోవికి తల ఒగ్గు

చుక్కల చెమ్కీల నిశి చీర 

ఆర్తిగా నిన్ను పొదువుకున్నది

చక్కని శశిబాల నీఅందంతో

తన మోమును పోల్చుకున్నది


2.కొలనులొ కాంతులీను కలువభామ 

కలతచెందె నీ కనులు గాంచి

కడలి చెలగు మెరుగుల అలల నురుగు 

మిన్నకుంది నీ నగవుల వీక్షించి

దోచుకుంది ఒకింత పారిజాతమే

నీ తనువు తావిని పులకించి

సంతరించుకుంది ప్రకృతి చిత్రమే

నీ సొగసుల శోభ కాస్తైనా అనుకరించి

https://youtu.be/t7Py3N8J2Po?si=2LvL8V7ZlVMmy-7J

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : శహనా

నాకోసం స్పందించే ఒక గుండె ఉన్నది
నా స్నేహం ఆశించే ఒక మనసు ఉన్నది
నా కోసం కారేటి అశ్రువొక్కటున్నది
నా కంటి చెమ్మను తుడిచే చేయి ఒక్కటున్నది

1.అందరున్న అనాథగా బ్రతుకు సాగుతున్నది
ఆదరణే నోచుకోక  దినమేదో గడుస్తున్నది
ఒయాసిస్సు ఎదురైనట్టు ఓదార్పు తానిచ్చింది
ఎడతెగని నా రాతిరికి ఉషస్సుగా వెలుగిచ్చింది

2.లోకమంత పగబూనినా నాతోడుగ నిలిచింది
శోకం నా దరి రానీకుండా ఆనందం పంచింది
నవ్వులెన్నొ రువ్వుతూ సాంత్వన కలిగించింది
నీకోసం నేనున్నానని భరోసా కలిపించింది


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏ పూవు చూసినా నీ మోమే కనిపిపిస్తోంది

చిరుగాలి తాకినా నీ స్పర్శే  అనిపిస్తోంది

ఎంతగా నిండిపోయావే నా గుండెలోనా

వింతగా ఉండిపోయావే నా మెదడులోనా


1.చంద్రవంక వంక చూస్తే చిరునగవు నీదనిపించె

వాగు వంక ఏదెరొస్తే నీ నడుము వంపుగా తోచె

ఏ వంకా లేని పొంకమా  నా వంక రావింకేలా

శంకలింక మొత్తం వదలి నా అంకము చేరవేలా


2.గుంభనంగ ఉంటావెందుకు తెలుపవే నీ గుట్టు 

సంబురమా నన్నుడికించగ ఎందుకే నీకా బెట్టు

తిరుగుతూనే ఉంటానూ సూర్యకాంతినై నీ చుట్టూ

నిన్నంటి పెట్టుకునేలా  నేనౌతా నీ నుదుటన బొట్టు

Friday, October 22, 2021

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:శివరంజని

తిరుమలేశ శరణాగతి నీ దివ్య చరణాలే
మరువలేని అనుభూతి నిన్నుగన్న క్షణాలే
పరసౌఖ్యము నీ సన్నిధి లోనున్న తరుణాలే
వరమీయర హరించగ నాకు జరా మరణాలే
గోవింద గోవింద గోవింద పాహిమాం 
గోవింద గోవింద గోవింద రక్షమాం

1.నీకు తెలుసు నాకు తెలుసు నే చేసిన దోషాలు
ఎరిగెదము ఇరువురము నే వేసిన వేషాలు
మరీచికలు కోరికలు తీర్చుకొనట కెన్నెన్ని మోసాలు
సరిపోవడమిక ఉంటుందా సంపదలు సరసాలు
నా కళ్ళు తెరిపించు గోవింద పాహిమాం
నాదారి మళ్ళించు గోవింద రక్షమాం

2.అవగతమైనట్టే ఉంటుంది నీ జగన్నాటకం
బోధపడినట్టే ఉంటుంది సృష్టే ఒక బూటకం
భలేగా తగిలిస్తావు స్వామి బంధాల పితలాటకం
రుచులకు మరిగేలా వండేవు బ్రతుకు వంటకం
నీ మాయలు చాలించు గోవింద పాహిమాం
నీ మత్తులొ నను ముంచు గోవింద రక్షమాం


https://youtu.be/XZjxq0qVqgY

 "అంకిత గీతం"


మొండికేసే గుండె ఏనుగుల మావాటి

దిక్కుతోచని నెత్తురు ధారకు మార్గదర్శి

మూసుకున్న  నాడుల తెరిచే నైపుణ్య శిల్పి

పెదవుల మీద నిరతము పారే నవ్వుల జీవఝరి

హృదయపు భాషనెరిగిన డాక్టర్ మన శ్రీధర్ కస్తూరి


1.ఇంటి పేరులోనే కస్తూరి పరిమళం

డాక్టర్ శ్రీధరంటేనే ఆత్మీయ ప్రతిరూపం

వృత్తిలో ప్రవృత్తిలో మానవీయ దృక్పథం

వాణిజ్య కోణమెలేని నిలువెత్తు నిజ వైద్యం

పెదవుల మీద నిరతము పారే నవ్వుల జీవఝరి

హృదయపు భాషనెరిగిన డాక్టర్ మన శ్రీధర్ కస్తూరి


2.వృత్తినే దైవంగా భావించే నిబద్ధత

పేషంట్లే బంధువులనుకొను హృదయవైశాల్యత

సవాళ్ళనే అలవోకగ గైకొనే కార్యదక్షత

వ్యక్తిగా వైద్యునిగా జీవన సాఫల్యత

పెదవుల మీద నిరతము పారే నవ్వుల జీవఝరి

హృదయపు భాషనెరిగిన డాక్టర్ మన శ్రీధర్ కస్తూరి


3.తలిదండ్రుల పుణ్యాల పంటగా జన్మించాడు

దశదిశలా ధర్మపురి కీర్తి నినుమడించినాడు

కుటుంబ బాధ్యతలన్ని బహుచక్కగ నెరవేర్చాడు

హృద్రోగనిపుణుడిగా విశ్వవిఖ్యాతి నొందినాడు

పెదవుల మీద నిరతము పారే నవ్వుల జీవఝరి

హృదయపు భాషనెరిగిన డాక్టర్ మన శ్రీధర్ కస్తూరి

Thursday, October 21, 2021

 


వైద్యుడా అనితరసాధ్యుడా

దైవసమానుడా నిత్య ఆరాధ్యుడా

పరుల కొరకె అంకితమౌ త్యాగధనుడా

ప్రాణ దానంచేసే పరమ పవిత్రుడా ఘనుడా

వందనాలు నీకివే అందుకో

అభినందన చందనాలివే అందుకో


1.మాకు వైద్యో నారాయణో హరిః

మాకు వైద్యుడే అపర ధన్వంతరి

వైద్యుడే మా పాలిటి ఆరోగ్యసిరి

వైద్యుడా నీకెవరు లేరిలలోన సరి

వందనాలు నీకివే అందుకో

అభినందన చందనాలివే అందుకో


2.శిశువు పుట్టుకలో నీ సాయం గణనీయం

మనిషి మనుగడలో నీ ప్రమేయం ప్రశంసనీయం

అడుగడుగున మా జీవన సారథి నీవు

నరుల ప్రాణానికి దేహానికి వారధినీవు

వందనాలు నీకివే అందుకో

అభినందన చందనాలివే అందుకో


3.రేయనకా పగలనకా సేవలనందిస్తావు

మేము కోలుకుంటుంటే నీవానందిస్తావు

గుండెకు మారుగా గుండెనే అమర్చేవు

తీరే మా ఆయువుకు ఊపిరి కూర్చేవు

వందనాలు నీకివే అందుకో

అభినందన చందనాలివే అందుకో


4.రాయబోతే నీ చరిత రామాయణమంతటిది

తెలుపగపూనితే నీ కథ భాగవతం ఔతుంది

ప్రాణాలకు తెగించి రోగాలు పారద్రోలినారు

కరోనావంటి వాటి నుండి మనుజాళిని కాచినారు

వందనాలు నీకివే అందుకో

అభినందన చందనాలివే అందుకో


https://youtu.be/xapGtvSRRf0

 రచన,స్వరకల్పన&డా.రాఖీ

పువ్వుల్లో పువ్వుగా ఒదిగావే
నవ్వుల్నే సింగిడిగా మలిచావే
చిత్తమే దోచావే మత్తేదో నాపై చల్లి
మనసునాక్రమించావే ఓ పాలవెల్లి
1.వసంతమే నీవైతే వికసించవా ఆ విరులెన్నో
ప్రభాతమే నీవైతే విభవించవా పసిరుచులెన్నో
అందమే నీముందు బేలగా తలవంచదా
వలపులే పండించి నా తనివి తీర్చదా
2.నీడగా నేనడిచానే ఏడడుగులు అవలేదా
తోడుగా నిలిచానే బంధమే ముడివడలేదా
చేసానులే చెలీ నా హృదయం నీకు మందిరం
నా దేవినీవని తలచి నిర్మించా ప్రేమ గోపురం
Shankar Suraram, Kiran Kumar and 2 others

Like
Comment
Share

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తెల్లారదు నిను కలగనక
పొద్దేపోదు నీ ఊహరాక
మనసాగదు నీ ఊసువినక
నా ప్రాణం నీదే నీదే గనక
1.అక్షరానికారాటం నీభావం వ్రాయగ
గాత్రానికెంతో ఆత్రం నీ గీతం పాడగ
వేలికొసలకుబలాటం నిను తాకాలని
పదాలు సమాయత్తం నీతో సప్తపది కని
2.చీరకింక వీరవాంఛ నిన్నలరించ
నగలకు ఒకటే ఇఛ్ఛ నీమేనునాక్రమించ
మరుమల్లికి ప్రతీక్ష నీకురుల మాలై కడతేర
చిరునవ్వుకు సార్థకత నీ పెదవుల తనుచేర
Laxmi Padigela, Kandur Chandra Prakash Gupta and 4 others
3 comments
Like
Comment
Share

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నా కోసం నువు ఉన్నా లేకున్నా
నీకోసం నా ఎద తలుపులు తీసున్నా
నేనంటే నీకు లెక్కే లేకున్నా
బ్రతుకు దారబోయగా సిద్ధంగా నేనున్నా
జాలంటూ లేనేలేదా జాబిలంటి మోముదానా
నిను గుండెలోనైనా ఇక నేను దాచుకోనా
1.గతము గూర్చి వగచేకన్నా ఈ క్షణం పదిలపర్చుకో
ఊరడించ నేనున్నా నీ అక్కున నను జేర్చుకో
మనదైన లోకం ఒకటి ఇపుడే నిర్మించుకుందాం
అనునిత్యం ఆనందాలే మనమింక పంచుకుందాం
జాలంటూ లేనేలేదా జాబిలంటి మోముదానా
నిను గుండెలోనైనా ఇక నేను దాచుకోనా
2.దైవమిచ్చిన జీవితాన్ని వృధాపరతువేల
ఆరాధించ నేనున్నా నను దూరముంచనేల
గాలితో కబురంపు నీ ముందు వాలుతాను
నువు సంతసమొందేల బ్రతుకంతా ఏలుతాను
జాలంటూ లేనేలేదా జాబిలంటి మోముదానా
నిను గుండెలోనైనా ఇక నేను దాచుకోనా
May be an image of 1 person and outdoors
Panuganti Ravi Patel, Lakshmi Dvdn and 4 others
2 comments
Like
Comment
Share