Tuesday, August 31, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఓ తపస్విని-నమో తేజస్విని

నిజ సుమనస్విని-మహా యశస్విని

మార్గదర్శి నీవై భవజలధి దాటించు

సద్గురువు నీవై పరమపదం చేర్పించు


1.చంచలమౌ మానసాన్ని-నిలకడగా నిలిపించు

చెలఁగే నా చిత్తానికి-ఏకాగ్రత కలిగించు

శ్వాసమీద ధ్యాస ఉంచే-మెళకువలు బోధించు

ధ్యానసిద్ధి సమకూరే-మౌనముద్ర నేర్పించు


సిద్ధ యోగినివే-మమతానురాగిణివే

మాయా మోహినే-జగదుద్ధారిణివే

మార్గదర్శి నీవై భవజలధి దాటించు

సద్గురువు నీవై పరమపదం చేర్పించు


2.అష్టాంగ యోగాన్ని-ఇష్టంగా మార్పించు

అష్ట సిద్దులన్నీ నాకు-అవలీలగ అందించు

నాలోని చక్రాలేడు-జాగృతం కావించు

సహస్రారం ఛేదనమవగ-కైవల్యం అనుగ్రహించు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పింక్ చీర కట్టుకున్న పంకజాక్షి

వంకలేని జాబిలివే వనజాక్షి

శంకలే పెట్టుకోకు నా ప్రేమపై

నావంక జాలిగొని అందీయి నీచేయి


1.దబ్బపండు మేనిఛాయ- అబ్బో అనిపించెనే

మబ్బులంటి కురులేమో-మదిని దెబ్బకొట్టెనే

డబ్బుదస్కమెందుకే-పబ్బమంటి నీవుంటే

సుబ్బరంగజేరరావె-నిబ్బరంగ నన్నుంచగ


2.ఒక్కసారి నను తాకితే-ఓరుగల్లె వశమౌను

చిన్ననవ్వు నువు విసిరితే-చెప్పలేని హాయౌను

నీవున్న తావులో లోకమంత నాకమౌను

నీవే ఇక ఆనతిస్తే మన ఆత్మలు ఏకమౌను

 

https://youtu.be/DRVmkPcKdc8

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చక్కదనాల రాశివే

చుక్కలరేని రూపసివే

చిక్కగ మిక్కిలి చంచలవే

చక్రి హృదయ వాసినివే


1.సిరుల వారాసివే

నరుల అవసరానివే

దొరగ దొంగగ మార్చేవే

దొరకగ నువు దుర్లభమే


2.మరుని జనని నీవేగా

మహా మాయవీవేగా

నీకు లోబడని దెవ్వరు

నీదాసులె లోకులందరు

Monday, August 30, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏడేడు పదునాల్గు భువనాలు

అద్వితీయ తేజోమయ నయనాలు

నవరసాల నొలికించే ఆ నేత్రాలు

తిలకించ నా మనసుకు ఆత్రాలు


1.ప్రేమను దయను వర్షించే ఆ కళ్ళు 

ఆనందమయమైన వాకిళ్ళు

తీర్చేను లోకాన దీనుల ఆకళ్ళు

కనినంతనే మదిలోన పరవళ్ళు


2.దివ్యమౌ భవ్యమౌ ఆలోచనాలు

పూయించును అధ్యాత్మికాలోచనలు

విధాతనే విస్తుబోయే విశ్వంకరాలు

విశ్వానికంతటికి నిత్య శుభంకరాలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువు తాజా పుస్తకానివి

నువు అద్భుత సౌధానివి

నువు తాత్విక దర్పణానివి

నువు నా వాస్తవ స్వప్నానివి


1.ముఖపత్రం వద్దనే మునకలేస్తున్నాను

సాంతం నేనిక ఎప్పుడు చదవను

గుమ్మంలోనే చతికిలపడ్డాను 

మొత్తం భవనం ఎప్పుడు చూడను


2.పవిత్ర వేదం నువ్వు గంధర్వనాదం నువ్వు

నా ఎదచేసే మంజుల రావం నీవు

నాలో కదలడే జీవం భావం నువ్వు

ఆరాధ్యదైవం నువ్వు అనుభవైకవేద్యం నువ్వు


3.అమరులు గ్రోలే అమృతం నువ్వు

రాగాలు రంజిల్లే వాద్యం నువ్వు

నువ్వు కానిదంటూ ఏవీ లేనే లేవు

నీఊసు లేనిదంటూ ఇక రోజులు రావు


https://youtu.be/7Wsdbu_qs4E?si=ulZ-79RGsrOyD7wc


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:శివరంజని 


కొంచం కొంచంగా నను చంపకే-పీక లోతులో ననుముంచకే

అందరిలా నన్నెంచకే-నీ ప్రేమను పరులకు పంచకే

గ్రహించలేవా నా మనసును

అనుగ్రహించలేవా నీ అనురాగమును


1.ఒడ్డున పడ్డ చేపలా గిలగిలలాడేను

చిల్లులు పడ్డ నావలా కడలిలొ మునిగేను

ఉగ్గబట్టుకుంటాను ప్రాణాలను సైతం

ఊపిరాపుకుంటాను నీ ఆనతి కోసం

ఔననలేవా అడియాస చేయక

నే మనలేనే నువు బాసచేయక


1.ప్రతిసారీ నీతో నాకు ఒక పరీక్షనే

కలవాలను కున్నపుడల్లా కడు నిరీక్షణే

తిరుమలేశు దర్శనమే సులభసాధ్యం

నీ వీక్షిణ భాగ్యమే గగన సదృశం

తపస్సులే చేస్తున్నా కనికరించవే

నీకొరకే జీవిస్తున్నా నను స్వీకరించవే


https://youtu.be/J7XsIdp8jhc?si=x14QVZAKj8-r7JjN

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:ఆనందభైరవి

వస్తానయ్యా కుస్తాపూరు రామలింగయ్యా
ఇస్తేమేలయ్యా మస్తకానికి స్వస్థత చాలయ్యా
తోచినట్టు వచ్చినట్టు నీ పూజచేతునయ్య
సంతృప్తిని కలిగించి నను సాగనంపవయ్య

1.గంగనీళ్ళు మోసుకొచ్చి నీకు తానంబోతునయ్యా
తుమ్మిపూలు ఏరుకొచ్చి నీమీద పోసెదనయ్య
మారేడు పత్తిరిదెచ్చి లింగంపైన పెడుదునయ్యా
గంగయ్య లింగయ్య సాంబయ్య అంటూ వేడెదనయ్యా

2.మంత్రాలు కొలుపులు నాకెరుకలేవయ్యా
పాటలు భజనలైతే నే చేయగ లేనయ్యా
తెల్సింది ఒక్కటే శివా శివా శివా శివా అనుడే
ఎప్పుడు తప్పక కాచేవంటూ గుడ్డిగ నిన్నూ  నమ్ముడే


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అరుణ కలువ నీవు

కరుణ నొలుకు తావు

నీ మోము అనందాల తావు

నీ మోవి చిరునవ్వుల రేవు

మాతా శ్రీ లలితా పరాంబికవీవు 


1.సౌందర్య లహరి నీవు

శివానంద లహరివౌతావు

భవరోగ తిమిర దీపికవు

మాధవ హృదయ రాధికవు


2.సకల విశ్వవేషిణివి 

నవరస పోషణివి

నిత్య సంతోషిణివి

మృదుమంజుల భాషిణివి



Saturday, August 28, 2021

 https://youtu.be/q1NfaSUqxBc?si=-dgEAIsKaRSlHAb3

*తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు*

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హంసధ్వని

అడ్డుపెట్టలేరా  ఆపన్నహస్తాలు
గడ్డుకాలం దాటించగ తెలుగుకు తెలుగులు
పెను తుఫాను వీస్తోంది ఆంగ్లభాషగా
కొడిగట్టబోతోంది మనభాష దైన్యంగా
తెలుగు నాదని తెగువ చూపరా
తెలుగు ఖ్యాతిని జగతి చాటరా

1.పాల్కురికి సోమనతో పొందింది ప్రాభవం
నన్నయ్య కవనంతో చేకొంది వైభవం
రాయల ఆస్థానంలో సంతరించె రాజసం
పోతన భాగవతాన చిలికించె మాధుర్యం
తెలుగు నాదని తెగువ చూపరా
తెలుగు ఖ్యాతిని జగతి చాటరా

2.గిడుగువారి నుడుగుల్లో వాడుకమాట కైతైంది
గురజాడ అడుగుల్లో సామాన్యుల చేరువైంది
కాళోజీ కలం బలంతో బడుగులకు గొడుగైంది
మహాకవుల సేద్యంతో మహిలో మహితమైంది
తెలుగు నాదని తెగువ చూపరా
తెలుగు ఖ్యాతిని జగతి చాటరా


https://youtu.be/co_MJcHO41M


 *శ్రీ కృష్ణ జన్మాష్టమి/గోకులాష్టమి ముందస్తు శుభకామనలు*


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం: మోహన


మా నవ మోహన కృష్ణా-మానవ మోహన కృష్ణా

మన్మోహన కృష్ణా జగన్మోహన కృష్ణా

నీవే నీవే నా ఏకైక తృష్ణ-తీర్చరా నా బ్రతుకే ప్రశ్న


1.లేత పెదవులతొ-పూతననే-హతమార్చిన-బాలకృష్ణా

వెన్నను మన్నును- సమమని తిన్న -చిన్నారి-చిన్నికృష్ణా

కాళింది మడుగున-కాళీయుపడగల-చిందాడిన-తాండవ కృష్ణా.

గోటితొ కొండను-మేటిగ ఎత్తి-లీలను చాటిన-గిరిధర కృష్ణా

నీవే నీవే నా ఏకైక తృష్ణ -తీర్చరా నా బ్రతుకే ప్రశ్న


2.గొల్లభామల-యమునా స్నానాల-కోకలు దాచిన- తుంటరి కృష్ణా

బృందావనాన-మురళీరవాన-రాధతొ మురిసిన=సారస కృష్ణా

భక్త హృదయాల-సుస్థిర చిత్తాల-మనుగడ సాగించు- మీరా కృష్ణా

అనిమధ్యంబున -జీవన సారం-నరునికై నుడివిన-గీతా కృష్ణా

నీవే నీవే నా ఏకైక తృష్ణ తీర్చరా నా బ్రతుకే ప్రశ్న

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లాలించే కన్నులు

ఊరించే పెదవులు

నీ తనువున అణువణువున

అమర మధువులు ఇంద్ర ధనువులు


1.నగవుల కురిసేను వసంతాలు

నడకల విరిసేను పారిజాతాలు

నీ మేని కదలికల్లో జలపాతాలు

నీ క్రీగంటి చూపుతో తరియించు జీవితాలు


2.ఘనములై ఒప్పారు జఘనాలు

సగర్వంగ అలరారు పయోధరాలు

నడుము మడతల్లో నను ముంచకే తల్లో

ఎంతగా బంధించను నీ అందాలు కైతల్లో

https://youtu.be/wAOREZdUDZQ


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కమ్మగ పాడే తెల్లని కోయిలవే

ఏడాదంతా నవ్వై విరిసే ఆమనివే

స్వఛ్ఛని స్ఫటికపు నిర్మల మానసవే

ఉషోదయాన మెరిసే తుషార బిందువువే


1. పావన గంగా సమమే నీ గళము

నీ హృదయము మమతకు దేవళము

అందానికి నీవే ఇలాతలాన  తరళము

క్షీరనీర న్యాయమందు నీవే మరాళము


2.లతగా అల్లుకోని మన పరిచయము

కవితగా పరిణమించనీ మన స్నేహితము

మంజులమై నినదించనీ ఇక జీవితము

జనరంజకమై అలరించనీ మనగీతము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలంకారమే అదనపు సొబగు అతివకు

ఆభరణాలే ఆకర్షణలు సుదతి సొగసుకు

నిండైన రూపుతొ రెప్పవాల నీయదు

దబ్బపండు ఛాయతో చూపు తిప్పనీయదు

భారతీయ దీప్తి  వనిత 

చెప్పనలవి కానిది తన ఘనత


1.పాపిట సిందూరం నుదుట తిలకం

సిగలో జాజులు చెవుల జూకాలు

ముక్కున ముక్కెర చెంపసరాలు

మెడలో పచ్చలహారం కటి వడ్డాణం

భారతీయ దీప్తి  వనిత 

చెప్పనలవి కానిది తన ఘనత


2. దండన కేణా  చేతికి గాజులు 

వ్రేళ్ళకుంగరాలు సింగారాలు

జడగంటలు కాళ్ళకు మంజీరాలు

కోకా రైకా కోమలి మేనుకు అందాలు

భారతీయ దీప్తి  వనిత 

చెప్పనలవికానిది తన  ఘనత

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సింధుభైరవి


కొలువై ఉన్నాడు ఏడుకొండలపైన

నెలకొనియున్నాడు మనగుండెలలోన

కడచి చూడవొ ఏడు ద్వారాల

ఎరుక నరయవొ సప్త చక్రాల

దర్శింతువదే వేంకటాచలపతిని

ఛేదింతువికనీ దేహాత్మ భావనని


1.బాహ్యమగు దృష్టి నేత్రానందమే

అంతఛ్ఛక్షు వీక్షణ పరమానందమే

తొలగించినంతనే మనోనిర్మాల్యము

ప్రకటమౌనిక పరమాత్మ రూపము

దర్శింతువదే వేంకటాచలపతిని

ఛేదింతువికనీ దేహాత్మ భావనని


2.సంశయమే వలదు స్వామిని గనుటకు

సాక్షాత్కరించును నిశ్చయమిక నీకు

మనసా వచసా ధ్యానించి నిలువగ

ఏకాగ్ర చిత్తము హరి మీద నిలుపగ

దర్శింతువదే వేంకటాచలపతిని

ఛేదింతువికనీ దేహాత్మ భావనని

Friday, August 27, 2021

https://youtu.be/gnybnXDspOQ

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: కళ్యాణి


గోవింద ఒకటే తారకమంత్రం

గోవింద ఒకటే సులువైన సూత్రం

గోవింద ఒకటే దరి చేర్చుమార్గం

గోవింద గోవింద గోవింద శరణం

గోవింద గోవింద గోవింద శరణం


1.చీకటిలో వెలుగు గోవింద నామం

చింతల సాంత్వన గోవింద నామం

శ్రవణాల మాధురి గోవిందనామం

రసనకు మాధవి గోవింద నామం

గోవింద గోవింద గోవింద శరణం


2.అష్టాక్షరి సమ గోవింద నామం

ద్వాదశాక్షరి తుల గోవింద నామం

చతుర్వేద సారం గోవింద నామం

కైవల్య తీరం గోవింద నామం

గోవింద గోవింద గోవింద శరణం


https://youtu.be/YZc25Jj9npQ?si=nfPhtPxZus4MC-xe

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ముమ్మూర్తులకు మూలం అమ్మ

ముజ్జగాలకూ ఏలిక అమ్మ

ముగ్గురమ్మలను కన్నమ్మ

అపారమైన దయగల అమ్మ

పూజలందుకొంటోంది మా ఇంట

శోభాయమానమై మా కంట


1.ఇంటింటి లక్ష్మిగా గృహలక్ష్మిగా

నవమాసాలు మోసి కన్నతల్లిగా

అనురాగం కురిపించే అక్కగా చెల్లిగా

అర్ధభాగమై పతికి తోడునీడగా

ఆదరించబడుతోంది ఆదిలక్ష్మిగా

ప్రస్తుతించబడుతోంది ప్రత్యక్ష దైవంగా


2.చిరునవ్వులు చిందిస్తూ శుభలక్ష్మిగా

పొదుపుగా నడిపిస్తూ ధనలక్ష్మిగా

అవసరాలు నెరవేర్చే వరలక్ష్మిగా

సొబగులతొ మురిపిస్తూ సౌభాగ్య లక్ష్మిగా

వెలుగు నింపుతోంది దీపకాంతిగా

జీవితమానందమయమౌ మనశ్శాంతిగా

Thursday, August 26, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాస్తూనే ఉన్నా కరగని గుండెకోసం కవితలెన్నో

తెలుపుతూనే ఉన్నా ప్రతినిమిషం విరహపు వెతలెన్నో

ఇంతకన్న నరకం వేరే ఉంటుందా

చింతలేని నాకం నీ చెంతన లేకుందా

మనసెరిగీ  మౌనం ఏలనే

మది తెలుపగ జాప్యం ఏలనే


1.మాటల్లో చెప్పాను నర్మగర్భంగా

చేతల్లో చూపానే ప్రతి సందర్భంగా

ప్రతిపదార్థతాత్పర్యం విప్పిచెప్పలేను

విడమరచి వివరంగా ఎరుకపరుచలేను

మనసెరిగీ  మౌనం ఏలనే

మది తెలుపగ జాప్యం ఏలనే


2.పరికించమన్నాను చిలకా గోరింకల

తిలకించమన్నాను జంట పావురాల

అంతరార్థమేదో ఆమాత్రం గ్రహించలేదా

ప్రేమ సూత్రమదియేదో సంగ్రహించలేదా

మనసెరిగీ  మౌనం ఏలనే

మది తెలుపగ జాప్యం ఏలనే


నీ పరం చేసేసా నా హృదయం

వరంగా అందించు నీ ప్రణయం

మెడలో నే వేయనా అక్షర నక్షత్ర హారం

నా కవితగ మలచనా నిను జీవన పర్యంతం


1. వల వేసినావే వలపు నెరగవేసి

ఎద దోచినావే వాలుచూపు చూసి

నే మనలేను నినువీడి మరణించినా

ఏమనలేను నన్నే ఉపేక్షించినా


2. కన్నులలో  సాదర ఆహ్వానం

మాటలలో మాత్రం తిరస్కారం

ఊరించనేల ఉత్తుత్తిగానే ప్రతిసారి

నను చేరరావేల నాదానిగా మారి



జీవితం కడు బరువు-

కాలమే నిజ గురువు

ఆత్మస్థైర్యమే నీకు ఆప్తబంధువు

అల్లంత దూరమే ఆనందపు రేవు

ఉల్లాసం నింపుకో భావ కవితగా 

ఆహ్లాదం పంచుతూ స్నేహిత గా


1. బదిలీ చేయి నీ వేదన నాకు

ఆనందించు నా ప్రమోదాలకు

రేయి పగలు ఏ సమయమైనా

నేడు రేపు ఏన్నడు నీకేమైనా

ఉంటాను నేను నీకు చేయూతగా 

నీ చింత దూరంచేసే  భరోసాగా 


2.మనసులో ఉన్నదేది నావద్ద దాచుకోకు

చేరువగా లేనని అసలు నొచ్చుకోకు

తలుచుకున్న తరుణంలోనే

వచ్చి నీ ముందు వాలుతా

కోరుకున్న నీ అక్కఱను

ప్రేమ మీర  నే నెరవేరుస్తా

Tuesday, August 24, 2021

మనసుడికిపోతోంది గాలి నిను తాకినా

మంటెక్కిపోతోంది సూర్యరశ్మి సోకినా

సామ్రాజ్యం నాదెవరో ఆక్రమించినట్టుగా

నాదైన నిధినెవరో దోచుకున్నట్టుగా

నువ్వు నా సొంతమే జీవితాంతం

నిన్ను వదిలి మనలేను లిప్తపాటు కాలం


1.స్వార్థపరుడనైతే అవనీ నీపై ఈగ వాలనివ్వను

సంకుచితుడనైతేనేమి నీ ముసుగు జార నివ్వను

అపురూపమైన అతివ నీవని- 

బహుమతిచ్చాడు నాకు బ్రహ్మదేవుడు

అనిర్వచనీయమైన ప్రేమ నాదని-

 దారపోసాడు నిన్ను కమలాసనుడు

నువ్వు నా సొంతమే జీవితాంతం

నిన్ను వదిలి మనలేను లిప్తపాటు కాలం


2.నేను కాక పరులెవరు నిన్ను ముట్టకూడదు

నాపై దప్ప ఇతరులపై నీ దృష్టి పెట్టకూడదు

ప్రాణంకన్నా మిన్నగా దైవంకన్న భక్తిగా

నిన్ను చూసుకుంటాను ఎన్నిజన్మలైనా

కంటికి రెప్పలాగ కాలికి చెప్పులాగ

నిన్ను కాచుకుంటాను నమ్మవే ఇకనైనా

నువ్వు నా సొంతమే జీవితాంతం

నిన్ను వదిలి మనలేను లిప్తపాటు కాలం




Monday, August 23, 2021

 

https://youtu.be/gGaf7KRbj0w

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దేశ్


జాబిలి తలమానికము-జాలి కడలి మానసము

జాగరణయె నీ వ్రతము-జాగెరుగని కనికరము

జాడగనము జగమందున- శివా నీవంటి దైవము


1.చిరు చిరు సేవలకే సురతిని పొందేవు

తరతమ భేదాలు లేక వరములనొసగేవు

భక్తి ఒక్కటే ముఖ్యము మూఢమైనదే గానిమ్ము

చిత్తము నీపరమైతెచాలు జగడమూ జరుగనిమ్ము

శ్రీ కాళ హస్తి గాథ తెలిపెను గద ఈ సత్యమ్ము

సామాన్యులకైన శివా  కాగలవు కైవసమ్ము


2.నెగ్గజాలనయ్యా శివా పట్టుబట్టి పరికించ

ఒగ్గజాల నీపదాలు నన్నిలా ఉడికించ

అందరినీ ఆదుకొనే ఆప్తబంధువని నమ్మితి

అక్కున ననుగొన అక్కెఱనా అమ్మ సమ్మతి

మంజునాథ మహాదేవ నీవే శరణాగతి

సాంబశివా సదానంద నా కీవే సదాగతి

Saturday, August 21, 2021

https://youtu.be/CCEBxd9AfmA

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:మోహన

"యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః 
తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల"

అనురాగం విరిసే వేళ-అనుబంధం మురిసే వేళ/
వచ్చింది నేడే రాఖీ పండగ-శ్రావణ పౌర్ణమి వెన్నెల్లు నిండగ

1.తోబుట్టువుల మమతల వారధి/
సోదరి సోదర ప్రేమకు నెలవిది/
రక్షాబంధన పర్వదినమిది/
సంతోషాలే కొలువు దీరినది

2.ఇందిర బలికి కట్టిన రక్షకు గురుతిది/
ద్రౌపది కృష్ణుల ఆత్మీయ చిహ్నమిది/
లాభ క్షేముల ఆకాంక్షమేరకు/
సంతోషిమాత పుట్టిన దినమిది

3.గాయత్రి మాతను మది కొలిచేది/
నూతన యజ్ఞోపవీత ధారణచేసేది/
నిత్యకర్మానుష్ఠాన అనుజ్ఞను పొందేది/
ప్రాయశ్చిత్త పంచగవ్యం సేవించే రోజిది



వేనోళ్ళ స్తుతించేను శేషుడు

నిరంతరం నుతించేను నారదుడు

వేదోక్త స్తోత్రాల సర్వదా గణుతింతురు సప్త మహా ఋషులు

వేల కీర్తనలతో కొనియాడిరి నిను  త్యాగయ్యా అన్నమయలు

ఏరీతి మెప్పింతును ఏడుకొండలవాడా

ఉడతనైన బ్రోచితివి జాలిగుండె రేడా


1.మనసులోనె తలచేను ఇపుడో అపుడో

ఇంటిలొ పూజింతును వీలున్నపుడెపుడో

గుడిలోనిను దర్శింతును ఏ పండగ పబ్బానికో

తిరుమల కరయడము ఎన్నాళ్ళకొ ఎన్నేళ్ళకో

ఏరీతి మెప్పింతును ఏడుకొండలవాడా

ఉడతనైన బ్రోచితివి జాలిగుండె రేడా


2.నిర్మించలేను స్వామి నీ సుందర మందిరాలు

ఈయగలేను ప్రభూ ఏ ఘనమైన కానుకలు

చేయగలేను నేను విరివిగా దానాలు ధర్మాలు

మోయలేను గోవిందా నిస్సార సంసార భారాలు

ఏరీతి మెప్పింతును ఏడుకొండలవాడా

ఉడతనైన బ్రోచితివి జాలిగుండె రేడా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నీలాంబరి


జోలపాటనై నిను బజ్జోబెడతా

లాలిపాటనై నిను జో కొడతా

హాయిగా నిదురించు ఈ నాన్న ఎదమీద

రేయంతా ఆదమరచి సేదదీరు నిశ్చింతగా 

జో అచ్యుతానంద జోజో ముకుందా

లాలి పరమానంద రామగోవిందా జో జో


1.ఉలికి పడకు నీకే తెలియని బూచిని తలచి

కలత చెందకు కడుపులోని నలతకు వగచి

నీ జుత్తులొ వేళ్ళు జొనిపి సున్నితంగ రాస్తా తలను

నీ వెన్నుంతా నిమురుతూ హత్తుకుంటా ప్రేమతోను

జో అచ్యుతానంద జోజో ముకుందా

లాలి పరమానంద రామగోవిందా జో జో


2.కథలెన్నో చెపుతాను ఊకొడుతు నువ్వుంటే

నెమరువేస్తాను నీ అల్లరిని మైమరచి నువువింటే

నువు చేసిన మారాము నే చేసిన  గారాలు

నిదురలోకి నీవుజారితె నే ఊపిరి తీసుకుంటా

జో అచ్యుతానంద జోజో ముకుందా

లాలి పరమానంద రామగోవిందా జో జో

Friday, August 20, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏ దివ్య లోకాలనుండి ఏతెంచినావో ఇలకు

ఏడేడు భువనాలలోనూ సాటిలేనే లేరు నీకు

విరించి సైతం సృజించలేదు నీలా సృష్ట్యాదిగా

తరించిపోతాడు నిను గాంచి ప్రవరాఖ్యుడైనా


1.స్థాణువులౌతారు ఎవరైనా నీవెదురైతే

అనిమేషులౌతారు నీచూపు తమపైన వాలితే

ఇంద్రధనుసే నేలపై దిగినట్టుగా కనికట్టుకాగా

పూలవనమే నడిచొచ్చినట్టుగా ఆకట్టుకోగా


2.ఖంగుతింటారు కవులంతా నిన్ను వర్ణించగా 

విస్తుపోతారులే చిత్రకారులైనా నిను దించగా

చతికిలపడతారు శిల్పులు నిను శిల్పీకరించగా

తికమక పడతారు అందగత్తెలే నిన్ననుకరించగా

Thursday, August 19, 2021

 

https://youtu.be/LCvtbFpw4ps

*శ్రావణమాస  వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు*


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రావమ్మా వరలక్ష్మీ  క్షీరాబ్ధి ప్రియ పుత్రి

అందెలు ఘల్లనగా అడుగిడవే అంబుజనేత్రి

కరుణజూడవమ్మా వరమహాలక్ష్మి

శుక్రవార శుభవేళ అమ్మా సౌభాగ్యలక్ష్మి


1.నీ చలవనే తల్లీ సిరిసంపదలన్నీ

నీ వరములే జనని హోదాలు పదవులన్నీ

ఇచ్చినట్టె ఇచ్చినవన్నీ దూరం చేయకమ్మా

ఉన్నంతలొ పరమానందం ప్రసాదించవమ్మా


2.కలతలు రాకుండా సాగనీయి కాపురం

వెతలేవి కలగకుండా గడపనీ జీవితం

నలతలు సలపకుండా కాపాడు ఆరోగ్యం

నగవులు నిండేలా చెలఁగనీ మా గృహం


https://youtu.be/0lUyQcmUuQo?si=do-JmE0SBuJt98M7

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం : మధువంతి


స్వాగతం ప్రియతమా కలల లోకంలోకి

హాయిగా తీయగా మాయగా అచట మన ఉనికి

దైహిక బాధలు మరచి ఐహిక కాంక్షలు విడిచి

ఆత్మలుగ ఏకమవగా సంగమిద్దాం కాలాలు కడచి


1.తెల్లారిలేస్తూనే చుట్టు ముట్టు జంజాటాలు

మెడకుబడిన పామల్లే బరువులు బాధ్యతలు

తప్పించుకోలేని మూణ్ణాళ్ళ భవబంధాలు

వెంటాడి వేధించే దుర్భరమౌ దుర్గంధాలు


2.ఆకలీ దప్పులమాట లేనె లేదు ఇచ్చోట

ఆంక్షలు కట్టుబాట్లకు అవకాశం ఉండదిట

నాకు నీవు మహరాణి నీకు నేను రారాజు

నిదురించిన సమయమంతా స్వర్గమే మనకేరోజు

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీకోసం నేనున్నాను

నీకోసమే నేనున్నాను

ఊపిరిలో ఊపిరిగా

ఎద చేసే సవ్వడిగా

కన్నీరు తుడిచే ఆప్తుడిగా

నీ నలతను తీర్చే వైద్యుడిగా


1.కబురంపే పనిలేదు ఏకాకితోనో

వ్యధ చెందే పనిలేదు ఏకాకివీవనో

అడగాల్సిన పనిలేదు బాధ్యతే నాదంటాను

తలుచుకోనక్కఱలేదు తెలుసుకొంటాను

నిరంధిగా నీవుండు భారమంత నాకొదిలేసి

నిశ్చింతగా నువు బజ్జుండు భరోసా నాపైనవేసి 


2.ఏపనిలో నేనున్నా ఆలోచన నీగురించే

ఎంత నిదురలోనైనా మదినిన్నే కలవరించే

నీకెలా ఉందోగాని నీవు నేను వేరేకాదు

నీవులేక ఏనిమిషం బ్రతుకు నాకు చిరుచేదు

దేహమైతె నీదైనా ప్రాణంలో ప్రాణంనేను

నేనంటు లేనేలేను నీవుగా ఎపుడో మారాను

https://youtu.be/XkGwNwc8sdc?si=TqE1cMnoo4uvy8హాఫ్

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:నట భైరవి

అందంగా తగిలించుకుంటారు
ముందో వెనకో సాయీ నీ పేరు
నీవంటే ఎంతటి భక్తి తమకుందో
లోకానికంతటికీ ఆసక్తితో తెలిపేరు
ఒకసారి నిన్ను నమ్మితే నీకుదాసులౌతారు
సాయీ సాయీ బాబా బాబా అని స్మరించుతారు

1.ఏ పని చేసినా బాబా దయ అంటుంటారు
ఫలితం ఏదైనా సాయి దయే అని వాపోతారు
లీనమైపోతారు బాబా నీ మైకంలో 
మునిగితేలుతుంటారు సాయీ నీ లోకంలో
ఒకసారి నిన్ను నమ్మితే నీకుదాసులౌతారు
సాయీ సాయీ బాబా బాబా అని స్మరించుతారు

2.సాయిరాం అంటూ మాటలు మొదలెడతారు
చీటికి మాటికి బాబా అంటూ కదలాడుతారు
ఎప్పుడు చూడు నీదే ధ్యాసగ ధ్యానం చేస్తారు
తప్పనిసరిగా పలికే దైవం నీవని భావిస్తారు
ఒకసారి నిన్ను నమ్మితే నీకుదాసులౌతారు
సాయీ సాయీ బాబా బాబా అని స్మరించుతారు


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉలుకూలేదు పలుకూలేదు 

కులుకూలేదు అలకా లేదు

మతలబు  ఏంటో నాకు చెప్పమ్మో

మందహాసం కాస్తైనా గుప్పమ్మో

ఎరిగించవే ప్రియా ఓ నా చెలియా

చూపించవేలనే  నామీద నీదయా


1.ముల్లుగుచ్చుకున్నదా గులాబీలు త్రెంచుతుంటే

వేలుకోసుకున్నదా  వెన్నకోయబోతుంటే

వేడిసెగ తాకిందా దీపంవత్తి ఎగదోస్తుంటే

నడుంపట్టివేసిందా దిండు సవరిస్తుంటే

ఎరిగించవే ప్రియా ఓ నా చెలియా

చూపించవేలనే  నామీద నీదయా


2.లాఘవంగ తీయనా నొవ్వకుండ ముల్లుని

మలాంనే పూయనా వేలికైన గాయానికి

నవనీతం రాయనా కాలిన వేళ్ళ కొసలకు 

నూనె మర్ధన చేయనా నాజూకు నడుముకు

ఎరిగించవే ప్రియా ఓ నా చెలియా

చూపించవేలనే  నామీద నీదయా

 2422 పాటల వరకే ముద్రణ కోసం సంగ్రహించడమైనది

వీటిలో అత్యుత్తమమైనవి 108X11= 1188 పాటలు ప్రచురించడం జరుగుతుంది

Tuesday, August 17, 2021


మాయచేసావు నాకళ్ళను-తొలిచూపులోనే

గాలమేసావు నాగుండెకు-మైమరపు లోనే

కళ్ళు దాటి గుండె మీటి-

దాడిచేసావు నా మనసుమీదే

ఆక్రమించావిక బ్రతుకంత నీదే


1.పారిజాత పరిమళ సహితం

నీ ఆగమనం కమ్మేనేదొ మైకం

నిన్ను చూస్తూ చూస్తూ చూస్తూ

మరిచాను చూట్టూ ఉన్న లోకం

ఊపిరే ఆగింది నీతో ఉన్నంత సేపు

తాగకముందే నిను చూస్తుంటే

ఎక్కింది మొత్తంగ గమ్మత్తు కైపు


2.దూరమైనాయి నా అన్నపానాలు

భారమైనాయి నా పంచ ప్రాణాలు

 ఒట్టేసి చెప్తున్నా  అమ్మతోడు

ఏ జన్మలోను ఇక నువ్వే నాతోడు

నువులేక గడిపే ప్రతినిమిషం నరకం

తెలిసీ నువ్వు మది తెలుపలేకుంటె

గూడు కడుతుంది నీలో మౌనశోకం

OK


దాచుకున్నావు కన్నుల్లొ 

దోచుకొచ్చి వెన్నెల్ని 

పొదువుకున్నావు పెదవుల్లొ

అందమైన నవ్వుల్ని

ఫిదా బన్ గయా తెరే మై జానెమన్

దిల్ తొ కభీదియా అబ్ లేలో మెరే జాన్


1.వాయించకుండ ఉండలేను

నీ మోవి పిల్లనగ్రోవి

ఆఘ్రాణించకుండ మనలేను

నీ మేని కమ్మనితావి

ఒదిగిపో నా కౌగిలింతలో

ఏ చింతలేక జీవితాంతం

ఉంచుకో నీ తోడు నీడగా

చెలికానిగా నే నీకే సొంతం


2. జయించనా మరణాన్ని

అమృత కలశాల నాస్వాదించి

రమించనా నీ సజీవ శిల్పాన్ని

అమర సౌఖ్యాల ననుభూతించి

చెలీ నీ పొందు  పొందడం

మరు జన్మలేని కైవల్యం

నీతో క్షణమైన గడపడం

సచ్చిదానంద సమతుల్యం

Sunday, August 15, 2021

https://youtu.be/KFhgeMrOS-0?si=IAY1C3qLw9jk5vyn

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:షణ్ముఖ ప్రియ

పరునిగ తోచవు పరమశివా
నాకిహము పరము నీవే కావా
తండ్రివి నీవు నా తల్లి గౌరి
దండంబులు మీకివే మల్లారి మారి

1.గణపతీ దేవసేనాపతీ
అయ్యప్పా మా కగ్రజ భాతి
ఇందఱి మీ అండ నాకున్నది
ఈశ్వరా ఇక కలగదు వెఱపన్నది

2.బంధుమిత్రులే నీ ప్రమధ గణం 
అంతకుమించింది  దైవబలం
దేవుళ్ళే ఆప్తులైన మనోబలం
సర్వకార్యసిద్ధికి ఆలవాలం


Saturday, August 14, 2021

 నా దేశమా నా భారత దేశమా

జగతికి తెలిపెడి మానవతా సందేశమా

చెదరని ఆకృతి చెరగని సంస్కృతి 

మువ్వన్నెల పతాకతో నింగికి పట్టగ హారతి

జోహార్ జోహార్ జోహార్ నీకిదె భారత భారతి


1.సున్నా అన్నది కనుగొని 

శూన్యం గణితాధారమని

వేదవిజ్ఞాన విశ్లేషణలో వికాసమెంతో సాధించి

శాస్త్రవిజ్ఞాన రంగంలో ఆవిష్కరణలుగావించి

ప్రపంచానికే తలమానికమై వరలే నా దేశమా

మేధావులనే విశ్వవ్యాప్తి గావించిన నా దేశమా


2.తాత్విక దర్శనమందించి

యోగ అన్నది అనుగ్రహించి

పారమార్థక సాధనమ్ములో సార్థకతనే బోధించి

మానవసేవయే మాధవసేవగ లోకానికి ప్రవచించి

ప్రపంచానికే తలమానికమై వరలే నా దేశమా

తత్వవేత్తలే విశ్వవ్యాప్తమై వెలిగే నా దేశమా





కదలవు మెదలవు-ఉలకవు పలకవు

పొగడినా పొంగవు-తెగడినా కృంగవు

ఎలా నీవు వశమయ్యేది-శ్రీహరి

ఏ మంత్రానికి లొంగేది తిరుపతి శ్రీపతి


1.గోవింద యనుచు నామాలు పఠించనా

కాలినడకతో నీ సప్తగిరుల నెక్కనా

తలబిరుసుని వదిలేసి నీలాలొసగనా

నీ కోనేటిలొ మునకలేసి పునీతమవనా


2.నీ మంగళ విగ్రహాన్ని దర్శించనా

పలు విధాల సేవలతో అర్చించనా

ముడుపులు కానుకలను సమర్పించనా

మనసావాచా కర్మణా నన్నే నివేదించనా

నీ పాదపద్మాల నా కవి తలనుంచనా

Friday, August 13, 2021



ఎవరిమోవి పైననో  చిరునవ్వుగా
ఏ హృదయ వేదనో తీర్చ నువ్వుగా
ఆనందమై జీవితం హాయిగా
ఆరుబయట పున్నమి రేయిగా

1.డబ్బుకు కొదవేమో నిరుపేదగా
సంపన్నలమే ఎంతైనా ప్రేమపంచగా
ప్రేమిస్తే కోల్పోయేదేముంది మనిషిగా
పోతే సమయం పొందితె ప్రేమమయం

2.వచ్చాము ఒంటరిగా పుడమికి
పోతాము ఒంటిగానే పైకి దివిపైకి
నడుమనే స్నేహితులు బంధువులు
పరులెవ్వరు ఆప్తులవగ నరులందరు

'కిసీకి ముస్కురాహటోంపె-'హిందీ పాటకు నా స్వేఛ్ఛానువాదం)



మనసువిప్పి చెప్పలేరు మగువలంతా

చూపులు ఎక్స్ రేలుగా చేసి 

ఎరగాలి గుండెలోని చింత

ఏదడిగినా కాదది కాదంటారు

కనుగొనడం మీకు చేతకానే కాదంటారు

వేగడం కష్టమే ఇల్లాలితో

కనులనే చెలిమెగా మార్చే చెలితో


1.టిఫినేమి చేయాలంటూ అడిగేరు తీయగా

ఇడ్లీ ఉప్మాలెందుకంటూ మాటల్తో మాయగా

పూరీ వడలైతే గుండెకి చేటంటూ గోలగా

బజ్జీలు దోసెలైతే గ్యాస్ ట్రబులంటూ ప్రేలగా

ఉన్నదేదొ పెట్టమంటే అసలు పట్టించుకోరు

కాలికేస్తె మెడకేసి ఖంగునే తినిపిస్తారు


2. చీర సెలక్ట్ చేయమంటూ షాపింగ్కి తీస్కెళ్తారు

షాపుకో వందచూసి వంద షాపుల్దిప్పుతారు

డైలీయూజ్ కేనంటూ పట్టుచీర పనిపడతారు

రంగంటే అంచంటూ పేచీలు పెడుతుంటారు

నాకు నప్పేదేదో మీకే బాగా తెలుసంటారు

తనికి నచ్చినదాన్నే మనతొ ఔననిపిస్తారు



ప్రియా నీ కోసమే కలవరం

నీ బాధతో ఎద సతమతం

జివ్వునలాగేనా కండరాల సలపరం

నీ వెతను తీర్చలేకుంటే ఎవరికెవరం


1.ఎలా చేయగలిగేవో నీవైన పనులన్ని

ఎంతగా మూల్గేవో గత్యంరంలేక నా చిన్ని

కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగేనో

నొప్పితో ఒళ్ళుకుప్పకూలేనో


2.తైలంతో మర్ధన చేస్తే ఉపశమించేనో

లేహ్యాన్ని పూస్తే కాస్త తెరిపి వచ్చేనో

మాత్రలేసుకుంటే ఇంచుక నయమౌతుందే

నా పాట మంత్రమై అనునయమౌతుందే

Thursday, August 12, 2021


పది అవతారాల పిదప పదకొండోది

సద్గురువుకు స్వరూపమౌ అవధూతది

సాయీ తత్వమాయె వివాదాస్పదము

వితండవాదనలా విశ్వాసమంటె హాస్యాస్పదము

సచ్చిదానంద సద్గురు సాయినాథ జయహో

అవధూత చింతన గురుదేవదత్త జయహో


1.రంధ్రాన్వేషకులకు తమ జన్మన్నా సందేహమే

నాస్తిక శ్రేష్టులకు తమ తండ్రి ఎడలసైతం సంశయమే

నమ్మకాన్ని నిర్వచించే వారెవరు  సృష్టిలో

అనుభూతులన్ని అనుభవైకవేద్యాలే నా దృష్టిలో

సచ్చిదానంద సద్గురు సాయినాథ జయహో

అవధూత చింతన గురుదేవదత్త జయహో


2.గాలి కంటికి ఆనదు నిప్పు రుచికి అందదు

నీరు గంధమెరుగదు శూన్యాకాశం స్పృశించదు

సాధించే దిశలోనే మన శోధన సాగాలి

యోగించునంతవరకు యోగిని సేవించాలి

సచ్చిదానంద సద్గురు సాయినాథ జయహో

అవధూత చింతన గురుదేవదత్త జయహో

https://youtu.be/rxh5OBp_Peg?si=k-yOLWgeiVN3L5kT

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:వాగధీశ్వరి

నను తరించనీ నీ సేవలో శ్రీ వాణి
నను గమించనీ నీ త్రోవలో కమలాసను రాణి
అవతరించినావే నను ఉద్ధరించగా
నా కవన వధూటివై ఆలంబననీయగా
నేటి మూలా నక్షత్రమందు నీ జన్మదినము
అందుకో భారతీ నీకివే శుభాభివందనలు
నాపై దయతో కురిపించు చల్లని దీవెనలు

1.కలిగించు యోగ లబ్ధి-చేకూర్చు భవరస సిద్ధి
ఓలలాడనీ నీ తన్మయాబ్ధి-వికసించనీ మంద బుద్ధి
పథనిర్దేశమునిపుడే కావించవే-సద్గతిని నాకందించవే
అందుకో భారతీ నీకివే శుభాభివందనలు
నాపై దయతో కురిపించు చల్లని దీవెనలు

2.ఉద్ధీపించు మూలాధారం-ఛేదించు నా సహస్రారం
చెలగనీ నాలోఒక్కో చక్రం-ఐక్యమై లోకాల కాలచక్రం
మరుజన్మేలేని పరమీయవే-నన్నిక వీడనని వరమీయవే
అందుకో భారతీ నీకివే శుభాభివందనలు
నాపై దయతో కురిపించు చల్లని దీవెనలు


Wednesday, August 11, 2021


 https://youtu.be/SPCCz7GsP8E?si=Ht0ydHO2lI4eZzNb

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ

రాగం : కాపి 


నామ్ కే వాస్తేనా దోస్తానాలు

పేరుకు మాత్రమేన ఫ్రెండ్ షిప్పులు

కష్టంలో సుఖంలో  కలిసిరాని స్నేహాలు

మోదాన్నీ ఖేదాన్నీ పంచుకోని నేస్తాలు

ఎడారిలో ఎండమావులే అజాగళస్తనాలే


1.సూక్తులెన్నొ ఉంటాయి స్నేహితమంటే

సుద్దుల వరకే సాగుతుంది సోపతంటే

అరమరికలె లేనిది అలనాటి బాల్యమైత్రి

కల్మషాలనెరుగనిది చిన్ననాటి చెలిమి


2.ఆశించి చేసేది కాదెప్పుడు మిత్రుత్వం

హృదయమెరిగి మెలగుటయే ప్రియత్వం

గాయం నీదయీ బాధ నాదవడమే నెయ్యము

విజయం నాదయీ  సంబరం నీదైతే సఖ్యము


3.ఫేక్ లే చాలా మటుకు ఫేస్బుక్ స్నేహాలు

టైంపాస్ లే ఈనాటి వాట్సప్ దోస్తీలు

నీకొరకే నేనంటూ నిలిచేదే నిజ స్నేహం

స్నేహానికి నేనెపుడూ మనసారా దాసోహం

https://youtu.be/2sBL4mwzHbw?si=SMruA65Iezua3dCn

వంకర తొండపు దేవర శంకర కుమారా

దీవించరమా వంకర టింకర సంకర బుద్ధులు మార

మొక్కెదనిన్నిదె చక్కని విగ్రహా ప్రియమారా

గ్రక్కున బ్రోవర  చిత్తము నీదిగ చేకొను నే నేమార


1.మరచితివేమో నను నువు స్వామి ఓ బొజ్జగణపయ్యా

అడగకముందే అక్కఱ దీర్చిన అద్భుత దైవం నీవయ్యా

నిద్దుర సమయానా సిద్దివినాయకా అనే కదా నే తలచేది

పొద్దున లేస్తూనే సిద్దివినాయకా  నీ చిత్రపటమునే చూసేది


2.కినుక వహించావు నా ఎడ ఎందుకో నా దోషమేమనో

అలక బూనినావు నావైపు నీచూపు ప్రసరించవైతివేలనో

తెలిసీతెలియకా చేసిన తప్పులకు గుంజీలు తీసెదను సంకటనాశా

తొందరపాటుగనో  నా పొరపాటుగనో చేసిననా ఐపుసైపు విఘ్నేశా

Tuesday, August 10, 2021


https://youtu.be/KfrI79vEgiE?si=c2jTr2xPpu7byu2H


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:పంతువరాళి (కామవర్థిని )


దివ్య రూపిణి,విద్వన్మణి

తేజో వాహిని,మన్మోహిని

జనని  జగదానందిని

వందనమందుకో పావని


1.చిరుత ప్రాయమునాడె-జీవిత సత్యము తెలిపితివి 

బుద్బుద ప్రాయమిదియని ఎరుక పరిచితివి 

ఆత్మశోధనలోనా అమ్మా నేను అద్వైతినైతిని 

సిద్ధినిపొందగోరి నీ శ్రీరూపమునే మదినిలిపితిని 


2.నా ఆనందానికి నీవే స్వస్వరూపమైతివి

నన్నుద్ధురించ పూనుకొని దయతో సిద్ధమైతివి

అక్కున నను చేర్చి తల్లీ నిక్కముగా బ్రోవవే 

నిరతము నీ సన్నిధిలో నిలువగ వరమీయవే 


https://youtu.be/C--0Ua10sqg?si=O_7EPVL8GLez6lY6

ప్రస్తుతించనేల మానవ కాంతలను

కొనితెచ్చుకోనేల కోరికోరి వెతలను

నీ తలపులు నిలుపనైతి నా తలను

నీ తపనలొ రాయనైతి కవితలను

సౌందర్యలహరి ప్రణతోస్మి భువనసుందరి

సచ్చిదానందిని నమోస్తుతే జగన్మోహిని


1.అందమే నీవైతే నిన్నుమించి ఏముంటుంది

ప్రకృతే నీవైతే ప్రతితావున తెఱగుంటుంది

రాజరాజేశ్వరి అంబా బాలా త్రిపుర సుందరి

శారదాంబా శ్యామలాదేవి అతిలోకసుందరి

సౌందర్యలహరి ప్రణతోస్మి భువనసుందరి

సచ్చిదానందిని నమోస్తుతే జగన్మోహిని


2.ఐహికమౌ సుఖములకై వెంపర్లాడ నీయకే

మూణ్ణాళ్ళ మురిపెంకోసం నన్ను ముంచేయకే

అతివలందరిలోను నీరూపే నా మతి తోచనీవే

శాశ్వత పరసౌఖ్యము నొసగి నన్నుద్ధరించవే

సౌందర్యలహరి ప్రణతోస్మి భువనసుందరి

సచ్చిదానందిని నమోస్తుతే జగన్మోహిని

https://youtu.be/u7K-Rloj6K0


మంగళగౌరి జనని 

కామిత ఫలదాయిని

శుభ శ్రావణ మంగళ వారమున

వ్రతముజేతుమమ్మా కనవెమమ్ము కనికకరమున


1.పాలకడలి చిలుకువేళ కాలకూటమెగియగా

సర్వమంగళ పార్వతీవు హరుని కానతీయగా

గరళము గళమున నిలిపిన చంద్రకళాధరు లీల

మంగళ గౌరీ  కొల్తుము నిను మాంగల్యము కాచేల


2.సోదరి ద్రౌపదికి శ్రీకృష్ణుడు తెలిపినది

నోమునోచుకున్నంత ఐదోతనము నిలిపేది

ఆయురారోగ్యాలు  భోగభాగ్యాలనీయ

మంగళగౌరీ స్తుతించేము సంతతిని బ్రోచేలా  

Monday, August 9, 2021


నా తనువే వేణువు శృతిచేయరా మురళీధరా

నా మనసే స్థాణువు కరిగించరా కరుణాకరా

ఎన్నో జన్మలుగా వేచివేచిచూస్తున్నా 

రాగాలు మరచిపోయి రాటుదేలి నేనున్నా


1.వెన్నలాంటి నాహృదయమాయె పాషాణం

కొడిగట్టిపోతోంది నీ స్మరణలొ నా ప్రాణం

జాలిమాని మనకురా జాగుసేయబోకురా

మరుభూమిగ మారింది మరుల బృందావని

కన్నీరు మున్నీరాయే కన్నయ్య కోసమని


2.పశువును నా మతిజూడ  పాలించు గోపతి

వశపడకున్నది ఉడికించకు నను యదుపతి

శరణుజొచ్చినానురా శకటాసుర సంహారా

అక్కున జేర్చుకో  అమరేంద్ర వినుతా

గ్రక్కున బ్రోవర నను గజేంద్ర సన్నుతా


శిరోజాలకే  పోలిక  మేఘమాలిక

నక్షత్రమయ్యింది నీకు ముక్కుపుడక 

మీనాలు నయనాలై వదన సరోవరాన

నోరూరే చెర్రీలే నీ మధుర అధరాన

స్థాణువులై పోయాయి నినుగని నా కనులు

చేష్టలుడిగి పోయాయి నెచ్చెలి నా చూపులు


1.సిగ్గులు నిగ్గుదేల కెంపులాయే నీ చెంపలు

సమీరాలు సయ్యాడగ చెలగే నీ ముంగురులు

ముద్దరాల ముద్దాడగ నా తపనలే పరితపించు

జవరాల నిను స్పృశించ నా తనువే పరవశించు

స్థాణువులై పోయాయి నినుగని నా కనులు

చేష్టలుడిగి పోయాయి నెచ్చెలి నా చూపులు


2.ఏన్ని జన్మలెత్తినా  నీ కొరకే పుట్టాలి

తపస్సు చేసైనా తప్పక నీచేయిపట్టాలి

మూడుముళ్ళు వేసిమరీ నీ జత కట్టాలి

నీఅడుగు కందిపోకుండా అరచేతులు పెట్టాలి

స్థాణువులై పోయాయి నినుగని నా కనులు

చేష్టలుడిగి పోయాయి నెచ్చెలి నా చూపులు

Sunday, August 8, 2021


https://youtu.be/I3D3sRB7E2w?si=lH_SlNgZ1PEz5M3a


నరజన్మ కోరానా పరమేశ్వరా

నరకమే మేలేమొ హరహరా

ఉత్కృష్ట మనుమాట ఉత్తుత్తదే ఉమేశ్వరా

నికృష్టమన్నది నగ్నసత్యమే నటేశ్వరా

శంభో శివశంకరా వందే గంగాధరా


1.నీవైపు ఒక అడుగు నే వేస్తే

ఆమడ దూరం నువు తోస్తే

ఎలా దాటను ఈ వైతరణి

ఎలా ఈదను భవ జలధి

దుఃఖభరితమె ప్రతినిమిషం

ఏమిటి స్వామి నా దోషం

శంభో శివశంకరా వందే గంగాధరా


2.కష్టాల కొలిమిలొ నను కాల్చి

దేహపు మకిలిని పోకార్చి

ఆత్మైకభావన సానబట్టి

పరమాత్మనే ఇక చేరునట్టి

బాటలోన నను నడిపించి

కడతేర్తువా  నా చేయిపట్టి

శంభోశివశంకరా వందే గంగాధరా


మనసుకు పరవశం మనిషిలొ కలవరం

నిన్ను చూసినంత

నను నేను మరచితి హృదయాన్ని పరిచితి 

నీ పాదాల చెంత

నమ్మవే నా చెలీ సృష్టిలో నీఅందం

అదే అదే ఒక వింత పులకింత


1.లేలేత రవికిరణం ఇచ్చే హాయంత

 మొగలిపొదలు గుప్పే తావంత

మరులుగొలుపు పున్నమి రేయంత

నమ్మవే నా చెలీ సృష్టిలో నీ అందం

అదే అదే ఒక వింత పులకింత


2.గులాబీల సుకుమారమె నీ  ఒళ్ళంతా

కలువల నయగారమే  నీ రెండు కళ్ళంతా

పికగాత్ర మాధుర్యమే నీ మార్ధవ గళమంతా

నమ్మవే నా చెలీ సృష్టిలో నీ అందం

అదే అదే ఒక వింత పులకింత

Saturday, August 7, 2021

OK



నవ్వుతాయి నీ కన్నులు  

పలుకుతాయి నీ చూపులు 

పెదవులు చదువుతాయి మైత్రీవేదాలు

గొంతులొ ఒలుకుతాయి మంజులనాదాలు


1.కళలు చెలఁగుతుంటాయి తనువులోన

కలలు మెలుగుతుంటాయి మనసులోన

తేజస్సే ప్రజ్వలించు నీ మేధలో

విజయాలే ప్రస్ఫుటించు నీ గాధలో


2.నిజ మహీజవే ఈ మహిలో నిప్పువై

ఎలా ముడిచినా అందగించు కొప్పుపై

ఆరని పోరాటపు బాటలో

తీరని ఆరాటపు వేటలో



https://youtu.be/erysnsPhO7A

అల్లనేరేడు పళ్ళు నీకళ్ళు

కాజూకత్లీలు  చెవి తమ్మెలు

పొంగిన పూరీలు నీ బుగ్గలు

అల్లన పనసతొనలు పెదవులు

నోరూరిపోతోంది నినుగని నెచ్చెలి

నకనకలాడుతోంది వగల సెగల ఆకలి


1.కొరుకుమనే భక్ష్యాలు నమలమనే భోజ్యాలు

నీ దేహపులిహోరలే తమకాగ్నికి ఆజ్యాలు

మెడవంపున లేహ్యాలు చుబుకాన చోష్యాలు

తనువిందు భోజనానికే సరిక్రొత్త భాష్యాలు

నోరూరిపోతోంది నిను గని నెచ్చెలి

నకనకలాడుతోంది వగల సెగల ఆకలి


2.మధురం మాటలో క్షారం చూపులో

కారం వయారంలో పులుపు వలపులో

వగరు నీ వయసులో చేదు నీ చీదఱ లో

రుచులారు  మక్కువే మనసుకు సరసములో

నోరూరిపోతోంది నినుగని నెచ్చెలి

నకనకలాడుతోంది వగల సెగల ఆకలి


OK



వేంకటేశ వేంకటేశ వేంకటేశ పాహిమాం

శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస పాలయమాం

తిరుమలగిరిరాయ ఈప్సిత ఫలప్రద

భావయామి తం సతతం గోవిందం నమామ్యహం

దర్శయామి భవరూపం హృదయాంతరమహరహం


1.ఇంద్రాది దేవ సంపూజితం-ఇందిర మందిర మానసం

కలియుగ వరదం గోవిందం దీనావన బిరుదాంకితం

భావయామి తం సతతం గోవిందం నమామ్యహం

దర్శయామి భవరూపం హృదయాంతరమహరహం


2.సప్తగిరివాసినం నిరంజనం  సప్త ఋషి సేవితం 

సకలలోక వందితం భవభంజనం జనార్దనం

భావయామి తం సతతం గోవిందం నమామ్యహం

దర్శయామి భవరూపం హృదయాంతరమహరహం

Friday, August 6, 2021

https://youtu.be/cdeB40KIQQ0?si=Gox9XgDN_I9yBZhS

నీ యాదిల నే బతుకుతున్న నా బంగరు బావా

మనాది పెట్టబోకురా మేనత్తకొడుకా శివా శివశివా

ఏటేటా ఊరొస్తనంటివి నన్నుజూడ మరిచావా

ఎదిరిసూసి ఏష్టకొచ్చెరా రోజూ నాకిదే చావా


1.కొలువు కుదిరికుదురంగనె తోల్కపోతనంటివి

గాలిమోటరెక్కంగనె గట్లటెట్ల నువు మారిపోతివి

అమాసలెన్నొవాయే పున్నాలు వచ్చిపాయే

జాతర్లెన్నొ జరిగిపాయే పండుగులింక పండిపాయే

నీ జాడపత్తలేదాయే మాటా మంచి కరువాయే

ఫోనుగన్కలేకపాయే నీ పానమెట్లుందొ ఎర్గనాయే


2.పట్టుచీరనైతె పట్టుబట్టి పంపుతానంటివే

పట్టగొల్సులింక పడిపడి చేయిస్తనంటివే

మనువాడి   మస్కటింక చూపిస్తనంటివే

గుండెల్లొ వెట్టుకొని చూసుకొంట నంటివే

అవ్వేవి నాకొద్దు నువ్వైతే జల్దిరా పడిగాపులు పడ్తిరా

బతుకింక నీకే ముడుపు కడ్తిరా వలపు దాచిపెడ్తిరా


OK

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


స్పందించని ప్రతి గుండె పాషాణం

పులకించని దేహం ఎముకల భోషాణం

మనసంటూ ఉండాలి నవనీతమైతేనే

మనిషంటూ మనగలిగితే మదిలోనూ మాటలోనూ తేనే


1.చిగురాకు పరవశించదా చిరుగాలి స్పర్శకు

చినుకు పలకరించదా నేలతల్లి ఎదురుచూపుకు

మునగదీసుకోవాలా పట్టువిడుపులే లేక

మూతిముడుచుకోవాలా చిరునవ్వైన రువ్వక


2. కడలి నదిని కౌగిలించదా అలల చేతులు సాచి

వేకువ వెలుతురుకూతమీయదా రవిని రమ్మని పిలిచి

ప్రేమగా మీటలేరా ఎదుటివారి హృదయవీణను

ఒడుపుగా నాటలేరా కరడు ఎదలలొ కాస్త కరుణను


నిదుర పారిపోయింది-నిన్నుచూసాక

గుండె జారిపోయింది-నువుకన్ను వేసాక

ఎలా గడపనే నా చెలీ ఈ రాతిరి

ఎలా ఓపనే నెచ్చలి తనువు తిమ్మిరి


1.ప్రేమ ఒకవైపు తడుతూ-దోమలొకవైపు కుడుతూ

రెప్పవేయలేకున్నా  తిప్పలెన్నొ పడుతున్నా

వయసు గిల్లుడే పడతూ-నల్లులకు నెత్తురు నిస్తూ

కనుకు తీయలేకున్నా -తపన మోయలేకున్నా


2.హంసతూలికా తల్పం- సుతిమెత్తని నీ అంకం

స్వర్గసౌఖ్యమే అల్పం- అనంగరంగం నీ అంగాంగం

ఊహల్లొ విహరిస్తూ ఉద్విగ్నతనాపుకొస్తున్నా

మన కలయిక తలపోస్తూ మరులు నెమరువేస్తున్నా

Thursday, August 5, 2021

OK


నీకేమో నవ్వులాట నా కేమో ప్రేమపాట

రైలుపట్టాలయ్యేనా మన బాట

కలవడం సాధ్యమా ఏదో ఒకచోట

ఎపుడో ఒకపూట

ఎన్నాళ్ళిలా మూగవేదన-నరకయాతన


1.మనసులో అనురాగంగా బయటేమో బింకంగా

నీలోనీకే తెలియని వింత మథనంగా

మనలేవు మౌనంగా తెలుపలేవు ఎద భావంగా

పట్టలేని విడువలేని సందిగ్ధంగా

ఎన్నాళ్ళిలా మూగవేదన-నరకయాతన


2.ముట్టబోతే అత్తిపత్తివి-తలచకుంటే అగరుబత్తివి

ఎలా వేగనేనీతో నాచెలీ ఎలనాగ

నిశ్చయంగా నీది ప్రేమే నీ గుండె మండే కొలిమే

మదిముళ్ళు విప్పక  మునిగేది మనమే

ఎన్నాళ్ళిలా మూగవేదన-నరకయాతన

Wednesday, August 4, 2021

https://youtu.be/Lw1ZPdZtFLo?si=Qv43UYeqFNabi0Et

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నమ్మేకద రాసాను సాయి నీపై వందల పాటలు
మమ్మేలెడి వాడవనే బాబా చేసాము నీకు పూజలు
వమ్ముచేయగా నీ మహిమలాయె ఒట్టి గాలి మాటలు
సొమ్మసిల్లెగా నా మది నీ బోధలవగ నీటిమూటలు
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

1.సాయిరాం అంటూ సదా నీ నామమె పలుకుదునే
ఆర్తితో దీనంగా నిను చిత్రపటములందు కాంచెదనే
వెతికి వెతికిమరీ నీవున్న మందిరముకు చనుదునే
గురువారము ఉపవసించి నీ ధ్యానమె చేయుదునే
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం

2.మామూలు నరుడవో సద్గురుడవో అది మాకేల
మాయల మరాఠీవొ గారడి వాడివో చూపునీ లీల
ఆశలెన్నొ ఉన్నవి నీఎడ అవి  అడియాసలు కావాలా?
నెరవేరక మా కోర్కెలు కడదాకా నేనిలాగే చావాలా
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం



నీ సిగలో నను మందారమవనీ

నీ నుదుట సిందూరమై మనని 

నీ పాదాల పాంజేబునై పరవశించనీ

నీ ఎదపై తాళినై ఎపుడూ నివసించనీ

ప్రియా ప్రియతమా నా జీవన మధురిమ

సదా నినదించే నా హృదయ గీతమా


1.నీ పెదవుల ఎల్లపుడు అల్లలాడె పేరు నాదిగా

నీ తలపుల  అల్లరిగా కదలాడుతు నే మనాదిగా

నీ బడలిక పోకార్చే నినుసేదదీర్చే అమృత ఔషదిగా

నిను లాలించి పాలించి మురిపించగ నే అమ్మ ఒడిగా

ప్రియా ప్రియతమా నా జీవన మధురిమ

సదా నినదించే నా హృదయ గీతమా


2.అడగకనే వసతుల నమరించే నీ వరునిగా

పరకాంతల కలనైనా కాంచబోని ప్రవరునిగా

పడకటింట పరిమళాలు ప్రసరించే మరునిగా

నా తనువున నువు సగమను అపర శంకరునిగా

ప్రియా ప్రియతమా నా జీవన మధురిమ

సదా నినదించే నా హృదయ గీతమా

https://youtu.be/mPxyCoC9hAs?si=1kM1f7qbK9nzJtb5

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


నల్లంచు తెల్లచీర నవమోహిని

కురులలో నెలకొంది కృష్ణయామిని

పలుక పరవశింపజేయు రసరాగిణి

గాలం వేసావు నా గుండెకు భామామణి


1.క్రీగంటి చూపులో ఊరించే కొంటెదనం

మందార పెదాలలో ఉడికించే జాణతనం

చెప్పకనే చెబుతోంది ప్రేమకు సుస్వాగతం

తెలుపుతోంది ప్రణయానికి ప్రియమారగ ఆహ్వానం


2.మత్తెక్కి పోతోంది మల్లెమాలతో సాంతం

కైపు నింక పెంచుతోంది బిగుతైన అంగాంగం

ఊహలు తూనీగలై సెగలు రేపు సంగమం

కౌగిలిలో కడతేరగ స్వర్గమే పాదాక్రాంతం



మది మెచ్చింది నీ పెదవిమీది పుట్టుమచ్చ

ఎద వేగం హెచ్చింది ఎలా ఎరుకపరుచను నా ఇచ్ఛ

అందానికి విలాసం నీవే నీవేనని మనసిచ్చా

కనికరించగా ప్రేయసీ నా మీద నీకెందుకంతటి కచ్చ


1.కన్నులతో చేసావు నను కట్టడి కనికట్టుగా

పెదవులలో దాచావు పుట్టతేనె పట్టు గుట్టుగా

నవ్వుల్లో కురిసావు ఆణిముత్యాలనే గుట్టగా

నడుమొంపులొ దించావు హరివిల్లును బెట్టుగా


2.జాబిలి జాలిగొంది చంద్రిక నీవుగా విరియగా

మల్లిక తల్లడిల్లె  నెత్తావి తననువీడి నిన్ను చేరగా

గులాబీ గునిసింది సుకుమారం నీ మేనిగ మారగా

సెలయేరు తడబడె నీ నడకలు అనుసరించగా

Tuesday, August 3, 2021

https://youtu.be/x7dkyBBzNZ8?si=KIl82xwOUhRdGC3o

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

పుట్టినరోజంటే అందరికీ సంబరమే
ఎదలోని ఉద్వేగం తాకుతుంది అంబరమే
దీవెనలీయమని ప్రతివారికి విన్నపాలు
ఆనందం పంచుకోగ ఎల్లరకు వేడుకోలు
అందుకోండి మీకివే  జన్మదిన శుభాకాంక్షలు
చిన్నవారు మీరైతే నా శుభాశీస్సులు
హాప్పీ బర్త్ డే టూయూ,విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

1.తలస్నానం చేసి కొత్తదుస్తులే వేసి
దైవదర్శనం చేసి అమ్మచేత హారతి గైకొని
 పెద్దలందరికీ పాదాభివందనం చేసి
పేదసాదలెందరికో తోచిన సాయం చేసి
జన్మదినం జరుపుకునే ఉదాత్తులెందరో
అందుకోండి మీకివే  జన్మదిన శుభాకాంక్షలు
చిన్నవారు మీరైతే నా శుభాశీస్సులు
హాప్పీ బర్త్ డే టూయూ,విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

2.షవర్ బాత్ చేసేసి ఫాషన్ డ్రెస్ వేసి
కొవ్వత్తులార్పేసి, కేక్ నే కోసాక
మొకాలకే పూసేసి గందరగోళంచేసి
బర్త్ డే పర్సన్ కి చుక్కలు చూపించే
ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొనే వారెందరో
అందుకోండి మీకివే  జన్మదిన శుభాకాంక్షలు
చిన్నవారు మీరైతే నా శుభాశీస్సులు
హాప్పీ బర్త్ డే టూయూ,విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ



అరువు తెచ్చుకున్న ప్రతి అందం

ఔతుందా ఎపుడైనా నీ సొంతం

సొంతమొహం చూపలేని వింత తత్వం

జలతారు ముసుగేసి చూపే యత్నం

నువ్వు నువ్వుగా ఉంటేనే ఔచిత్యం

లోపలొకటి బయటొకటి ఎందుకీ అగత్యం


1.దొరికినదల్లా నీదికాదన్నదే పరమార్థం

తేరగ ప్రాప్తించినదైనా మనదేయను స్వార్థం

ఉచితంగా పొందినా పరులకు పంచలేని నైజం

అయాచితంగ వచ్చినా హక్కుగ ఎంచడమే చిత్రం

నువ్వు నువ్వుగా ఉంటేనే ఔచిత్యం

లోపలొకటి బయటొకటి ఎందుకీ అగత్యం


2.నీకున్నవన్నీ పునీతమౌ శృంగార భావనలు

ఎదుటి వారివేమో మదమెక్కిన రసికతలు

మహిళవై రతికేళి ప్రస్తావన నీదైతే సాహసం

పురుష కవుల సౌందర్య ఉపాసనేమొ పరిహాసం

నువ్వు నువ్వుగా ఉంటేనే ఔచిత్యం

లోపలొకటి బయటొకటి ఎందుకీ అగత్యం



Monday, August 2, 2021


చూడాలని ఉన్నా చూడలేకపోతున్నా

పాడాలని ఉన్నా పాడలేకపోతున్నా

ఒకేవైపు ప్రేమతో తన్లాడుతున్నా

నీ హృదయసీమలోకి చేరలేకపోతున్నా


1.పిలవనైన పిలవవన్నది నా అభియోగం

తలవనైన తలవవన్నది నా అభిప్రాయం

కలవనైన కలవవన్నది నాకున్న ఆరాటం

తెలుపనైన తెలుపవేలనో నీ మనోభీష్టం


2.గుదిబండనైనానేమోనని నా అనుమానం

ఇబ్బందిపెడుతున్నానేమోనని నా భావనం

తప్పొప్పులేమోగాని తప్పనిసరి నాకనురాగం

నీ మదిలొ చోటీయడమే నా జీవన ఘనయోగం


ఎక్కడ ఆపాలో చూపులు

ఎంతగ గ్రోలాలో వంపులు

కళ్ళతోనే ముగ్గులు వేస్తా ఒళ్ళంతా

తలపుల్లో వలపులు పూస్తా నీ చెంత

రమణీ అలివేణీ పూబోణీ కౌస్తుభమణీ

భామిని గజగామిని నిజ ఆమని రసయామిని


1.ముని మారిపోడా కామునిగా నినుగని

ముదుసలి సైతం సైగచేయడా నిన్ను రమ్మని

అస్ఖలిత బ్రహ్మచారీ గుటకలు మ్రింగడా నీ సోకుకి

విస్మయ నీ విలాసమే మహాహాని మా నిగ్రహానికి

రమణీ అలివేణీ పూబోణీ కౌస్తుభమణీ

భామిని గజగామిని నిజ ఆమని రసయామిని


2.దోబూచులాడెనే దోర సవురు దాచవైతివే

దొంగాటలాడెనే అంగపు హొరంగు అడచవైతివే

ఊరించి ముంచేవు ఉత్తినే ఉడికించి చంపేవు

ఉక్కిరిబిక్కిరి చేసి ఉల్లమునంతా డొల్లగమార్చేవు

రమణీ అలివేణీ పూబోణీ కౌస్తుభమణీ

భామిని గజగామిని నిజ ఆమని రసయామిని

https://youtu.be/BqIbCKUmIJg

శివుడంటే మంగళకరుడు

హరుడంటే మనోహరుడు

అనాథనాథుడే విశ్వనాథుడు

అఖిలాండేశ్వరుడు భోళాశంకరుడు

ప్రణామాలు ప్రణామాలు ప్రణవస్వరూపునికి

సాష్టాంగ వందనాలు సదానంద రూపునికి


1.ఆది మధ్యాంత రహితుడు వేదవేద్యుడు

 దక్షిణామూర్తిగా భవుడు  పరమ పూజ్యుడు

అనాలంబి ఢమరుక వాద్య సంగీత లోలుడు

కుముదము పూరించే ఖట్వాంగధరుడు శర్వుడు

ప్రణామాలు ప్రణామాలు ప్రణవస్వరూపునికి

సాష్టాంగ వందనాలు సదానంద రూపునికి


2.సతికోసం హతాశుడైన అర్ధనారీశ్వరుడు

దక్షాధ్వరధ్వంసి  ఉగ్రాక్షుడు రౌద్రవీరభద్రుడు

మదనారి జటధారి నిటలాక్షుడు నీలకంఠుడు

ఋతంబరుడు వృషపర్వుడు రామలింగేశ్వరుడు

ప్రణామాలు ప్రణామాలు ప్రణవస్వరూపునికి

సాష్టాంగ వందనాలు సదానంద రూపునికి

https://youtu.be/0uJr7H6oK_s

మా తల్లీ ముత్యాలమ్మా-మమ్మేలగ రావమ్మా

మా కుస్తాపూరు భక్తులకెల్లా-ఖుషీలనే ఈయవమ్మా

మమ్ములనే చల్లగ చూడ-మా ఊళ్ళో వెలిసావమ్మా

వరాలనే కురిపించుటకై-గుళ్ళోనువు నిలిచావమ్మా


1.గంగనీటి తానాలు-సంబరంగ చేయిస్తాము

తీరొక్కపూవులు తెచ్చి-నిన్ను తీర్చిదిద్దుతాము

పట్టూబట్టలనే కట్టి నీ సుందర రూపం చూస్తాం

పంచభక్ష్యాలను పెట్టి నీకు మేము  నివేదిస్తాం


2.ఆషాఢ మాసంలో-బోనాల నర్పిస్తాం

ఆదివారాలలో సైతం-నిన్ను మేము అర్చిస్తాం

జగాలకే తల్లివి నీవు-ఆరోగ్యాలనీయవే

పరమేశ్వరి నీవేనమ్మా-పాడిపంటలీయవే

శబరిలాగ నేను రేగుపళ్ళ నీయనా

సుధామనై అటుకుల ముళ్ళెనీయనా

హనుమలాగ నీకు సేవచేయనా

కుబ్జలాగ నీకై దారి కాయనా

ఎలా మెప్పించను నిన్ను నల్లనయ్యా

మనసారా నిన్నే నిన్నే నమ్మితినయ్యా


1.పుండరీకునిలా కొలువనా తల్లిదండ్రుల

శ్రవణకుమారునిలా తలదాల్చనా జననీజనకుల

విభీషణుడిలా శరణాగతి పొందనా నీ పదముల

విబుధ విదురునిలా అర్చించనా పలువిధముల

ఎలా మెప్పించను నిన్ను నల్లనయ్యా

మనసారా నిన్నే నిన్నే నమ్మితినయ్యా


2.రాధలాగ నేను విరహబాధ నొందనా

మీరాలాగ కీర్తించి తన్మయమొందనా

తులసీదాసును నేనై నిన్నే స్మరించనా

సూరదాసు ధ్యాసనై జగతి విస్మరించనా

ఎలా మెప్పించను నిన్ను నల్లనయ్యా

మనసారా నిన్నే నిన్నే నమ్మితినయ్యా


ఎక్కడ ఆపాలో చూపులు

ఎంతగ గ్రోలాలో వంపులు

కళ్ళతోనే ముగ్గులు వేస్తా ఒళ్ళంతా

తలపుల్లో వలపులు పూస్తా నీ చెంత

రమణీ అలివేణీ పూబోణీ కౌస్తుభమణీ

భామిని గజగామిని నిజ ఆమని రసయామిని


1.ముని మారిపోడా కామునిగా నినుగని

ముదుసలి సైతం సైగచేయడా నిన్ను రమ్మని

అస్ఖలిత బ్రహ్మచారీ గుటకలు మ్రింగడా నీ సోకుకి

విస్మయ నీ విలాసమే మహాహాని మా నిగ్రహానికి

రమణీ అలివేణీ పూబోణీ కౌస్తుభమణీ

భామిని గజగామిని నిజ ఆమని రసయామిని


2.దోబూచులాడెనే దోర సవురు దాచవైతివే

దొంగాటలాడెనే అంగపు హొరంగు అడచవైతివే

ఊరించి ముంచేవు ఉత్తినే ఉడికించి చంపేవు

ఉక్కిరిబిక్కిరి చేసి ఉల్లమునంతా డొల్లగమార్చేవు

రమణీ అలివేణీ పూబోణీ కౌస్తుభమణీ

భామిని గజగామిని నిజ ఆమని రసయామిని

Sunday, August 1, 2021

 ఎన్ని నేర్చుకున్నానో జీవితాన పాఠాలు

కాలమెన్ని నేర్పిందో అనుభవ గుణపాఠాలు

ప్రేక్షకునిలా చూడడమే ఏ ప్రమేయమూలేక

నదివాలుకు సాగడమే ఎప్పుడూ  ఎదురీదక


1.ఆశించిన ప్రతిసారి ఆడియాసగ మారడమే

ఊహించిన దేదైనా నెరవేరకపోవడమే

జీవితమంటేనే ఇలాగే ఉంటుందని ఎంచడమే

పొందినదల్లా ఆనందంగా అంగీకరించడమే


2.మిన్నుసైతం విగిరి పడింది నా వెన్నుమీద

కనీవినీ ఎరుగునట్టి విధి వైపరీత్యం కదా

అన్నమైనా మన్నుగ మారింది నోరుచేరులోగా

దొరికిందే వరమనుకొనుడే నగ్నసత్యంగా


మరచిపోయిన మధువనాన

మరల ఎందుకు మరులవాన

చితికి పోయిన నా జీవనాన

చిగురులెందుకీ  మోడున


1.నిను కొసరెడి కోరిక కొఱవే,

నెరవేరక నా కన్నుల చెఱువే

తపనల తమకాన నిద్ర కరువే

ఫలించని ప్రతి కల ఇక బరువే 


2.ఏకాంతమే నాది ఏకాకిగా ఉన్నా 

ఒంటరినే కాను ఏ కాంత లేకున్నా

గతం విస్మరించి నాతోనే రమిస్తున్నా

నీవేలేని లోకంనుండి విరమిస్తున్నా

OK


అరెరే ఎంతటి వైచిత్రి మన మైత్రి

ఎంతగానొ పావనము మన స్నేహము

చినుకులా కురిసింది కడలిగా మారింది

ఆది అంతమే తెలియకుంది వింతగా

నీవు నేను  వేరంటేనే అది ఒక చింతగా


1. కాంతినిచ్చు దీపమైనా ఆరిపోతుంది

తావినొసగు ఏ పూవైనా వాడిపోతుంది

అందం తరుగుతుంది గంధం ఇగురుతుంది

చెక్కుచెదరదేనాటికి మన చెలిమి

ఖర్చెంతచేసినా ఒడవనిదీ ఈ కలిమి


2.దోస్తంటే నినదించే హృదయము

నేస్తం  పరాయికాదు మన సమస్తము

అనురాగ ప్రతాపము త్యాగపు నిజరూపము 

కలహించదు కుదురుకున్న మన చిక్కని సోపతి

కలనైనా విరహించదు మన అపూర్వ సంసక్తి