Sunday, September 29, 2019


శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్‌!,
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్‌!!..

నవరాతిరి శుభఘడియల్లో
నవరీతుల దుర్గారూపాలు
తొలినాటి అవతారిణి శైలపుత్రి
సకలలోక సంరక్షిణి జగద్ధాత్రి
నమస్కృతులు నీకివే కమలనేత్రి
నాకృతులనందుకో కోమలగాత్రి

1.వృషభ వాహిని త్రిభువన మోహిని
శూలధారిణి దుష్కర్మ వారిణి
మందహాసినీ మధుర భాషిణీ
సుందరవదనారవింద వింధ్యావాసినీ
నమస్కృతులు నీకివే కమలనేత్రి
నాకృతులనందుకో కోమలగాత్రి

2.శివప్రియే శ్రీగిరినిలయే భ్రమరాంబికే
సౌపర్ణికాతీర సంస్థిత మూకాంబికే
శృంగేరి పీఠాన్విత శారదాంబికే
శుంభనిశుంభ ఢంభనాశికే సుకేశికే
నమస్కృతులు నీకివే కమలనేత్రి
నాకృతులనందుకో కోమలగాత్రి


రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:అమృత వర్షిణి

నేలవు నీవు నింగిని నేను
వర్షించనీ నను వానను
పులకించిపోయేను నీమేను
నిన్ను తడిపి నేసేద తీరేను

1.విరివి నీవు భ్రమరం నేను
మకరందము గ్రోలగ నే వాలేను
పరవశించిపోయేవు తనువర్పించి
ప్రహ్లాదమునొందేను నినుమెప్పించి

2.కలువవు నీవు కైరవిశశినేను
కలువగ తపియింతువీవు
కళలు సుధలు నే కురిపించేను
కలలొ ఇలలో నినుమురిపించేను
తండ్రిగా నిన్ను తలపోసేను
కొడుకువని నీకు ప్రేమపంచేను
అండగావుండవయా వెండికొండ దేవరా
అండపిండబ్రహ్మాండమంతా నీవేనురా
శ్రీశైల మల్లన్నా నీ పావురాన్ని కానీరా
వేములాడ రాజన్నా ననుకోడెగ మననీరా

1.త్రిశూలధారీ అహమును అణిచేయరా
త్రినేత్ర నాలో కర్మలు మసిచేయరా
త్రికాలరూపా జన్మసఫలము సేయరా
త్రిభువనపాలకా నన్నుద్ధరించరా
గురువుగ నిన్ను భావించేను
శిశ్యుడినై నేనూ సేవిస్తాను
కాళహస్తీశ్వరా పరసౌఖ్యమునీయరా
కాళేశ్వరముక్తీశ్వర ముక్తినిదయసేయరా

2.ఆనందభాష్పాలు అభిషేకించనీ
నా నయన కమలాల పూజించనీ
నమకచమక స్తోత్రాల నినుకీర్తించనీ
నమఃశివాయ పంచాక్షరి నను జపియించనీ
మిత్రునిగా నిన్ను స్వీకరిస్తాను
నా హితునిగ సర్వదా అభిమానిస్తాను
శ్రీరామలింగేశ్వర సాయుజ్యము నీయర
కాశీ విశ్వేశ్వరా కైవల్యము నీయరా

Saturday, September 28, 2019

https://youtu.be/94MmT8hdzdY

రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

సాకి:ప్రపంచాధినేతైనా నీకడ తల వంచాల్సిందే
తలకట్టున్నోళ్ళంతా నీమాట వినాల్సిందే

పల్లవి:మెత్తగా వాడుతావు కత్తిని సైతం
శిల్పిలా చెక్కుతావు జుత్తును మొత్తం
వికృతమౌ వికాసాన్ని సంస్కరిస్తావు
నిబిడీకృత అందాలు వెలికితీస్తావు

క్షురకర్మ కార్మికా విశ్వకర్మ రూపుడవు
అవిశ్రాంత ఓర్మికా మయబ్రహ్మ వారసుడవు

1.వినియోగదారుల స్వాగతిస్తావు
ప్రేమమీర పలకరించి ఆసీనులజేస్తావు
జాప్యమున్నగానీ జారుకోనీయవు
కుశలోపరులడుగుతూ ఆకట్టుకుంటావు
నాయీ బ్రాహ్మణుడా నీపలుకే ఒకవేదం
శిరోజాలంకృతుడా మానవతే నీ వాదం

2.కర్మసిద్ధాంతాన్ని నిష్ఠగా నమ్ముతావు
వృత్తిమీద నిశితంగా దృష్టినిపెడతావు
ఖాతాదారు తృప్తిని కొలతగ భావిస్తావు
రాజుపేద ఎవరైనా సమతకు స్ఫూర్తినీవు
మంగళదాయకా నీకు వేనవందనాలు
శుభాశుభైక పాలకా నిత్యనీరాజనాలు

3.చీదరించు బొచ్చునైన ఆదరంగచూస్తావు
వెలిసిన సొగసులను పునరుద్ధరిస్తావు
మారణాయుధాలకైన మమతను నేర్పేవు
కేశాలదోషాలను పరిహరించివేస్తావు
బడుగువర్గ సోదరా భవ్యరీతి వర్ధిల్లు
నీవులేక బ్రతుకేదిర అనవరతము శోభిల్లు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఒక శోకం శ్లోకమైంది,రఘువంశమైంది
ఒక మైకం మౌనమైంది,అనుభవైకమైంది
ఒక భావం కవనమైంది,బృందావనమైంది
అనురాగం యోగమైంది,సహయోగమైంది

1.నిదురెలావస్తుంది ఎద నీవె నిండిపోతె
తనువెలా మోస్తుంది తలపులన్ని దండివైతె
ఎదురుగానీవుంటే ఎనలేని స్వప్నాలు
కుదురుగా ఉండక మనలేని జీవనాలు

2.భావనలు నీవైనా స్పందనలు నావి
ప్రతిపాదనలు నావైనా  అనుభూతులు నీవీ
నిజమేమిటంటే నీవీ నావీ వేరేలేవు
నాతో పాటేనీవు నీతో బాటేనేనూ

3.కాలమూ లోకమూ అన్నీ మనవి
మనవిని విని మననంచేయగ నేనే కవిని
పదేపదే లయమౌదాం నిరంతరం బాహ్యంగా
కొత్త చరిత మనమూ రాద్దాం అనూహ్యంగా
శవాలపైని పేలాలు"

అవినీతికి అదునైన మూలాలెన్నో
అవకాశ పదవికి వేలాలెన్నో
గీతానికి ఎగబడే తోడేళ్ళెన్నో
డబ్బుకు గడ్డి కఱచు ఇంద్ర జాలాలెన్నో

1.లంచం జన్మహక్కైన శాఖలెన్నో
ఆమ్యామ్యాకాశపడే గుంటనక్క లెన్నో
అధికారం ముసుగులో ఆరితేరిరెందరో
దర్జాగల దొంగలనక వీరినేమందురో

2.మందుపార్టీలకు మోజుపడే దొకరకం
పొందుచిందు కోరుకునేదింకోరకం
కానుకలను ఆశించేదొక అవినీతి
పలుకుబడికి తలవంచేదొక అవినీతి

3.శ్రమకు మించి లభించితే అక్రమార్జనే
తేరగా దొరికితే అదీ పరుల సొమ్మే
జీతందొబ్బితింటు పీడించడమెందుకు
విధిలేక కక్కిన వాంతి నాకుడెందుకు

Ok

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

పాపాలను తొలగించే శ్రీ వేంకటేశ
ఐశ్వర్యమునొసగేటి శ్రీశ్రీనివాసా
నరులను పరిపాలించే శ్రీ తిరుమలేశా
ఏమని నినుకోరను నన్నెరుగనివాడవా
అడిగిపొందలేనప్పుడు మదిసుమాలు వాడవా
జయ జయ జయ అలమేలు మంగా విభో
జయ జయ జయ పద్మావతీ సతిప్రభో

1.నిత్య కైంకర్యాలు బ్రహ్మోత్సవాలు
కనుల పండగే స్వామీ నీ వైభవాలు
తండోప తండాల భక్త సందోహాలు
మెండైన సేవలు నిండుగుండు నీలాలు
ఇంతటి ఈ సందడిలో నా సంగతి మరచెదవా
కొండలు కోవెల విడిచి నా గుండెన నిలిచెదవా
జయ జయ జయ అలమేలు మంగా విభో
జయ జయ జయ పద్మావతీ సతిప్రభో

2.వైకుంఠం వదలి వచ్చి తిరుపతిలో నిలిచావు
ఏడుకొండలెక్కిమరీ వేడ్కతోడ వెలిసావు
నను రమ్మని పిలునీకు రాగమే కనరాదు
నీకై మొహంవాచినా చూచుయోగమేలేదు
కనులుమూసుకుంటాను కనికరించి కనిపించు
ఉఛ్వాసనిశ్వాసలొ నీ నామమె తలిపించు
జయ జయ జయ అలమేలు మంగా విభో
జయ జయ జయ పద్మావతీ సతిప్రభో

Friday, September 27, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:చంద్రకౌఁస్

నీ నడక చూసి హంస ఎంతొ నేర్చుకున్నది
నీ నడుముకు నెమలెపుడో సలామన్నది
కిన్నెరసానె విస్తుపోయెనీ వయ్యారానికీ
అలకనంద అలకచెందె చెలీ నీవొలికే వగలుకీ
మోము తిప్పకున్నమానె మోహించవచ్చునిన్ను
నీ హొయలుగని రెప్పలార్పలేకున్నది నా కన్ను

1.బిగుతైన రవికె వల్ల ఊపిరాగిపోవునేమొ
కట్టుకున్న కోకా ఎద తట్టుకోకపోవునేమొ
నీవే పూవని వాలే సీతాకోక చిలుకలు
నీ మేని స్వేదమే మధువుగా గ్రోలె తేనెటీగలు
గుభాళించు నీతనువుకు గులాబే గులాము
గాయపడిన హృదయానికి నీరూపే మలాము

2.మల్లియలే మనసుపడే నీ జడను చేర
పారిజాతాలె రాలె నీ అడుగుజాడలా
మందారవర్ణాలే  అందాలు చిందాయి నీ నఖాలనతికి
మువ్వల పట్టీలే గర్వంగా నవ్వాయి నీ పదాల ఒదిగి
నీ దేహ సౌష్ఠవమే  మునివరులకు శాపము
నీ అంగాంగము అంగనలకె పెంచేను తాపము
అనివార్యం మరణం-అనిశ్చితం జీవితం
ఎందుకు ఆరాటం-ముగియించగ అర్ధాంతర పయనం
భరించు ఏమీ ఆశించక-ఎదిరించు నీదైనతీరుగ
ఆత్మహత్య అర్థరహితము
మనుగడ సాగించడమే హితము మహితము

1.పరికించిచూడు ప్రకృతిని-పరిసరాలలోని జీవరాశిని
పిపీలికాది పర్యంతం-సలిపేను జీవన పోరాటం
ప్రమాదాల్లో చిక్కుబడినా-బ్రతుక ప్రయత్నిస్తాయి
చావు తావచ్చే వరకు-చచ్చుకుంటు బ్రతికేస్తాయి
బుద్దితెచ్చుకోవాలి అల్పమైన ప్రాణుల చూసి
సర్దుకోలేనపుడు సాగు తెగతెంపులు చేసి

2.కష్టాలు లేనివారు-ఇలలోన లేనెలేరు
పీతకష్టం పీతది-సీతకష్టం సీతది
చూసావా ఎప్పుడైనా-జలధి జల రుచిని
కన్నీటి వల్లనే-మారిందది లవణ స్థితిని
అవకరాలనధిగమించే ధీరులే ఆదర్శం
విధివంచితులైనాసరే వీడబోరు ఆత్మస్థైర్యం

Thursday, September 26, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:దర్బార్ కానడ

కొఱవడుతున్నవి అనుబంధాలు
దిగజారుతున్నవి ప్రేమానురాగాలు
నేనూనాదను పరుగులాటలో
ఎండమావుల వెతుకులాటలో
గుండెలు బండబారుతున్నవి
బ్రతుకులు తెల్లవారుతున్నవి

1.విత్తిన చెట్టే మొలుచుట సహజం
గంజాయి మత్తులొ తూలుటే నైజం
కాళ్ళక్రింది నేలనొదిలితే రాలిపడడమే ఖాయం
విలువలనే గాలికొదిలితే మానవతే మటుమాయం
అత్యున్నత ఉత్తీర్ణతకై అనుభూతులు కర్పూరం
విదేశాల మోజులో కన్నవారు కడు దయనీయం

2.పసినాటి  వసతిగృహాలే పరిణమించి వృద్ధాశ్రమాలు
మితిమీరిన గారాబాలే తలకెక్కిన నిర్లక్ష్యాలు
తలిదండ్రులె ఆదర్శం బామ్మా తాతలనాదరించగా
ప్రభావమే ప్రాధాన్యం ప్రాప్తించినదే ప్రసాదించగా
వికాసం అభిలషణీయమే సర్వతోముఖవగా
విపరీతం అవనేకూడదు విడిపోయే దుర్దశగా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సహజమైన అందం-నిజమైన సౌందర్యం
పరుగెత్తే లేగదూడలా-బెదిరేటి లేడికూనలా
ఎగురుతున్న తూనీగలా-సీతాకోక చిలుకమ్మలా
తిలకించిన ప్రతి నయనం-చెప్పినారెప్పలే అల్లార్చదుగా
పులకించిన ప్రతి హృదయం-ఆనందడోలికల్లో తేలియాడుగా

1ఉషోదయ తుషార బిందువై
ఆహ్లాద పరచునులే
పడమటి సంధ్యారాగంలా
మోదాన్ని చేకూర్చునులే
సిరిమల్లెలా-చిరునవ్వులా
అనుభూతినొసగునులే సొగసు

2.ఎడారిలోని సరస్సులా
దాహాన్ని తీర్చును లే
చిరుజల్లుకు హరివిల్లులా
నింగికి వన్నెలు చేర్చునులే
ఎగిరే కొంగల జట్టులా-అందిన తేనె పట్టులా
పరవశింప జేస్తుంది సోయగం

3.ఊరికే ఉరికే కొండవాగులా
వయ్యారాలు పోతుంది
నోరూరించే పాలమీగడలా
లొట్టలేయజేస్తుంది
కోడి పిల్లలా-చిన్ని మేకలా
చిక్కీచిక్కకుంటుందీ చక్కదనం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:భీంపలాసి

ఏమున్నది సాయినీలొ అంతటి ఆకర్షణ
ఎందుకయా జనులకు నీవంటే ఆదరణ
వేలంవెర్రిగా షిరిడీ పయనాలు
తామర తంపరగా ఎగబడి నీ దర్శనాలు

1.నీవేమో ఫకీరువు నివాసమో మసీదు
నిత్యబిచ్చగాడివి నీవే ఓ గరీబు
ఇవ్వడానికేముంది నీకడ ధునిబూడిది
ఆత్రమెంతనో పాపం అడిగేవాడిది
రెండురూకలడుగుతావు నీవొసగడమేమొగాని
గుండెలోన దూరుతావు మొండిగా తిష్ఠవేయ

2. చిరిగిన కఫిని పెరిగిన గడ్డము
మాసిన తలరుమాలు-చేతిలో సటకా
'అల్లాహ్ మాలిక్' అన్నదొకటె నీజపము
అందమా చందమా అతులిత నీ రూపము
కోట్లమంది కోరికలూ తీర్చావని ప్రతీతి
నాకొకటే కోరిక - కోరికనే చేయి నిహతి
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం: యమన్ కళ్యాణి

భావాలు పావురాలై ఎగిరేను స్వేఛ్ఛగా
అనుభవాలు పంజరాలై బంధీలు చేయునుగా
కలమెంత సహకరించినా
కాగితమే కదలనీదుగా
గొంతుతో చెలిమి కలుపుతూ
పాటగా పరిణమించుగా

1.కోయిలకు కూయాలని ఉన్నా
మావి చివురు కరువైతేనో
వెన్నెలకు కాయాలని ఉన్నా
రాహువే కమ్మేస్తేనో
ఎంతటి చైతన్యమైనా
ప్రకృతికి లోబడి ఉంటుంది
చాతుర్యమెంతటిదైనా
కాలానికి  కట్టుబడుతుంది

2.ఎన్నిముళ్ళు వేస్తే ఏమి
మనసులే ముడివడకుంటే
ఏడడుగులు వేస్తేఏమి
అడుగేసినా అడుగుతు ఉంటే
నమ్మకమే ఆయువుపట్టు
బ్రతుకునావ సాగడానికి
సర్దుబాటు బాటపట్టు
సుఖకరమౌ కాపురానికి

Tuesday, September 24, 2019

https://youtu.be/k5H641TCxPg?si=9qhu__hwaQZk2M8W

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:సారమతి


నా కలమున కలవు నీవు
నా స్వరముకు వరము నీవు
పల్లవించు పల్లవిగా నా పాటన నీవు
పదపదమున సుధ చిలుకవె మాతా శారదా
చరణములను అందించవె వరదా పరదేవతా

1.కథనో కవితనో గేయమో పద్యమో అన్నీ నీ రూపాలే
చిత్రమో శిల్పమో పాటనో నాట్యమో నీగుడి దీపాలే
తరియించనీ నను కవనగంగలో మునిగీ
వెలయించనీ నను నీ ప్రతీకలే చెలఁగీ
అనితర సాధ్యమై నా సాహితి వెలగనీ
కాలమున్నంతవరకు జనహృదయం గెలవనీ

2.చిత్తమంత నీవే ఆక్రమించినావు
ప్రతియోచన నీదిగా మలచినావు
నీటిబిందువవనీ నను తామరాకు పైని
భవబంధము తొలగగ నీదెస పయనించనీ
అక్షరమే లక్ష్యమై నా దీక్ష కొనసాగని
మోక్షమె సాకారమై  నను నీలో లయమవనీ
అందానికెన్నెన్నో భిన్నమైన కోణాలు
ఆన్నీ ఎదలోన గుచ్చుకునే బాణాలు
రూపలావణ్యం కొందరిది-మేని సౌష్ఠవం కొందరిది
నిండైన స్త్రీత్వం కొందరిది-మెండైన మనస్తత్వం కొందరిది
ఏదో ఒక ప్రత్యేకతవినా సృష్టించడు చతుర్ముఖ బ్రహ్మ
మననిమనం ఎరిగితేనె సార్థకం మానవ జన్మ

1.తొలిచూపులోనె తలతిప్పుకోనివ్వదు సుందర వదనం
అమరిన ప్రతిఅంగం మన్మథరంగంలా మోహం పెంచేను దేహం
ఎదురైనవెంటనే దేవతలాతోచును శుభాంగి కట్టుబొట్టు లక్షణం
ఆదరించినంతనే ఆత్మీయత కురిపించును సుదతి స్నేహితం
ఏదో ఒక ప్రత్యేకతవినా సృష్టించడు చతుర్ముఖ బ్రహ్మ
మననిమనం ఎరిగితేనె సార్థకం మానవ జన్మ

1.కృష్ణవర్ణమైతెనేమి ఆకట్టుకుంటుంది అన్నులమిన్న
పొట్టిపొడుగు ఏదైనా అల్లుకపోతుంది అల్లరి కూచి
చెరగని నవ్వుతొ ప్రసన్న దృక్కులతో మనసు చూరగొంటుంది ముదిత
అరమరికలు లేకుండా బింకానికి పోకుండా కలిసిపోతుంది కలికి
ఏదో ఒక ప్రత్యేకతవినా సృష్టించడు చతుర్ముఖ బ్రహ్మ
మననిమనం ఎరిగితేనె సార్థకం మానవ జన్మ

Monday, September 23, 2019

ఇది వింతలున్న ప్రపంచం
ఇది చింతలున్న ప్రపంచం
ఎంతగా ఆరాట పడినా
మరెంతగా ఉబలాట పడినా
ఎవరికెంతనో అంతే ప్రాప్తం
అదే కదా లలాట లిఖితం

1.ప్రయత్నిస్తేనే సాంతం... ఫలితం 
ఫలితమేదైనా అది  నీకు సొంతం
గెలుపుకు ఓటమికీ తేడా ఇసుమంతమాత్రం
కృషిఉంటేనే తీరుతుంది ఆత్రం

2.నీకోసం వెతకదెపుడు అవకాశం
అందిపుచ్చుకోవాలి దొరికిన నిమిషం
పట్టామా వదల వలదు పట్టుదల
గుప్పిటి లక్ష్యాన్ని చేయబోకు విడుదల

3.విశ్వాసమె ఒక చాకు
వాడడం తెలియాలి నీకు
పండునూ కోయవచ్చు సులువుగా
గుండెలో దించవచ్చు మాయగా

4.ఉన్నతి నిచ్చేది వేదాంతం
అధోగతి చేర్చేది వైరాగ్యం
కర్తవ్యపాలనే గీతా సారం
యథాతథ జీవితం ఆనందయోగం

https://youtu.be/4e2KATEm9wA

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

వెదురుకు గాయమైతె వేణువౌతుంది
వెన్నకు సెగ తగిలితే ఆజ్యమౌతుంది
రాలిపడిన పింఛమూ మకుటమౌతుంది
ప్రభూనీదయ ఉంటే రాయి రత్నమౌతుంది

1.అవకరమును కరముతాక కుబ్జ స్నిగ్ధ అయ్యింది
కనికరమున కాలు తాక రాతి నాతి అయ్యింది
వానరమే సేవించి నిను ఉరమున నిలిపింది
ప్రభూ నువు దయతలిస్తే ఉడుత ఖ్యాతినొందింది

2.డింభకుడిని బ్రోవగా స్తంభమె నెలవైనది
కాకాసురు కూల్చగా పరకే శరమైనది
బలిమదమదమగా పదమాయుధమైనది
ప్రభూ నీవను గ్రహించ నా బ్రతుకేనీదైనది

ఒక మిథున కథనం
ఒక మథన హృదయం
నలిగేనెన్నొ విలువలు
కమిలే కన్నె కలువలు

1.పన్నేరు మాయ వలలు
దోచేరు పసిడి కలలు
విధివింత నాటకంలో
బలియైన బ్రతుకులు

2.గొంతులోని గరళాలు
గుండెచాటు మర్మాలు
కక్కలేని మ్రింగలేని
గతకాల దారుణాలు

3.తప్పనిసరి మూడుముళ్ళు
విప్పలేని చిక్కుముళ్ళు
కూలనీక కాపురాలు
నేలరాలె స్నేహితాలు

బతుకమ్మా బతుకమ్మా ఉయ్యాలా
భామలంత ఆటలాడే పండగే ఇయ్యాల
ఇంటింటా ఆనందాలు విరిసే వరమే ఇయ్యాల
పాడిపంటా పిల్లాజెల్లాఎదిగేలా నీ దయ మాపై కురియాల

1.బంగారు వన్నెలున్నా తంగేడు పూలు
గుత్తూలు గత్తులుగా మెత్తాని గున్గూవూలు
ఎర్రాని పచ్చాని ముద్దా బంతీ పూలు
కనికట్టు చేసేటి కలువాలు కట్లపూలు
రాణీగులాబీలు రాచా గుమ్మాడీ పూలు
తీరొక్క పూలుకూర్చి తీర్చీ దిద్దేము నిన్ను

2.తొల్తననువ్వు ఎంగిలిపూల బతుకమ్మవే
ఆటెన్కనాడైతె అట్కూల బత్కమ్మవే
మూడోనాడు ముద్దాపప్పు బతుకమ్మవేనూ
నాల్గోనాడూ నానబియ్యం బతుకమ్మవేనూ
అట్ల బత్కమ్మ ఐదోనాడు అల్గిన బత్కమ్మ ఆరోనాడు
వేపకాయల వెన్నముద్దల సద్దుల బత్కమ్మరూపులు

3.ముత్తైదువలంతా కలిసి మూకుమ్మడిగానూ
పదహారుప్రాయాపు పడ్చూల తోడుగాను
నీ పాటలెన్నో పాడి నీచుట్టూ తిరుగుతుఆడి
నీరాజనాలే నీకూపడతాం నివేదనలెన్నొ నీకూపెడతాం
ఏడాదికొక్కమారు ఎదురేగి మోసుకొస్తాం
తొమ్మిదోనాడూనిన్నూ ఊరేగి అనిపివేస్తాం

Sunday, September 22, 2019

పుడమి చీల్చుక పుడుతుంది గడ్డి పరక..
తన జన్మకూ సార్థకత కోసం
పాదాల క్రింద నలిగుతున్నా..
మనుగడ సాగిస్తుంది కిక్కురు మనక..
ప్రకృతే పాఠశాల ప్రతి మనిషికి
పాఠాలు వల్లెవేయి వికాసానికి

1.మూడునాళ్ళ ముచ్చటగా
వికసించును ప్రతికుసుమం
చేరుతుంది గుడినో జడనో
మార్చుకోక తన నైజం
అందాలు చిమ్ముతుంది
వసివాడునంతదాకా
సుగంధాలు రువ్వుతుంది
గాలి మోసినంతదాక
ప్రకృతే పాఠశాల ప్రతి మనిషికి
పాఠాలు వల్లెవేయి వికాసానికి


2.చినుకుగా తాను మొదలయ్యి
కలిసిపోతుంది తోటి వాటితోటి
ఒక్కొక్కటిగా చేరి
వాగులూ ఝరులౌతుంది
అడ్డుగా కొండలున్నా
ఆపదు నది తన ధాటి
నేలదూప తీర్చుతూ 
చేరుతుంది ఆనందంగా కడలి కౌగిలి
ప్రకృతే పాఠశాల ప్రతి మనిషికి
పాఠాలు వల్లెవేయి వికాసానికి

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:చిత్తరంజని

నిన్ను ప్రేమించలేను-చెట్టపట్టాలువేసుకొంటూ
నీ వెంటపడలేను-బంధనాలు తెంచుకుంటూ
నా మదినే కోవెల చేసి నిన్ను ప్రతిష్ఠిస్తాను
దేవతగా ఆరాధిస్తూ బ్రతుకిలా గడిపేస్తాను

1.నీ అందం తరిగిపోయినా నా దృష్టిమారిపోదు
నీ వయసు ఉడిగిపోయినా అనురాగం మూగవోదు
మనసుల మధ్యన ప్రబలిన బంధం మనది
మరణం సైతం విడదీయని మిథునం మనది

2.దేహైక ప్రణయాలే ప్రేమకు పరమార్థమా
స్వప్నలోకాలలో మనమే మనలేమా
కోరుకున్న తక్షణమే నన్ను చేరుకుంటావు
పెదవి విప్పకుండగానే  నాలో లయమౌతావు

Saturday, September 21, 2019

"వీడరా దైన్యం-నీవె ఒక సైన్యం"

మ్రోగే బంధూకులు మూగవోయినాయి
ప్రశ్నించే కలాలన్ని విరిచివేయబడినాయి
నినదించే గళాలన్ని నొక్కివేయబడినాయి
అడవితల్లి ఒడిలోనే సమాధులైపొయినాయి
అడిగేవాడెవ్వడు అణచివేయబడినప్పుడు
దిక్కూదెస ఎవ్వరు హక్కుకాలరాచినపుడు

1.నీకు నీవె తోడై నీవే ఒక దండువై
అండదండవై అన్యాయంగుండెలొ నిదురోవాలి
చట్టాలను తెలుసుకొని బాధ్యతగా మసలుకొని
నిఖార్సైన పౌరుడిగా రూపొందాలి
అవినీతి మూలాలను పెకిలించివేయాలి
ప్రజలే ప్రభుతయని ఋజువే చేయాలి

2.కులమతాల మాయలోన ముంచేసే
నేతల తలరాతలు మార్చగ భరతం పట్టాలి
ఓటు నీకు ఆయుధమని నీవే యోధుడవని
గుర్తెరిగి ప్రలోభాల గురికాక పట్టంకట్టాలి
రాజ్యాంగమే దైవంగా భావించాలి
దేశ సమైక్యతె వేదంగా తలపోయాలి
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మోహన

కనురెప్పవేయనీయవు
తలనైన తిప్పనీయవు
చూపేమో సూదంటురాయి
నీఅందం అందానికె గీటురాయి

1.మడిగట్టుక కూర్చుంటే మననీయవు
మనసు నిగ్రహించుకుంటె పడనీయవు
తప్పుకొని పోతుంటే  కవ్విస్తావు
అందీఅందకుండ బులిపిస్తావు
నీ పరువం మదనుడి బాణం
నిను కన్నా కనకున్నా పోతుంది ప్రాణం

2.నీ మేని వంపులే హంపిలోశిల్పాలు
అంగాంగ హంగులే అజంతా చిత్రాలు
నువుకదిలే కదలికలే ఖజురహో భంగిమలు
నీ తనువు వర్ణనలే ప్రబంధకావ్యాలు
నీ వలపే  మోహన రాగం
నీ పొందే ఈ జన్మకు  ఓ రసయోగం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:వసంత భైరవి

కళాకారుల జీవితం
కళామతల్లికె అంకితం
చతుషష్టి కళల నైపుణ్యం
జన్మాంతరాల పుణ్యం
విశ్వకర్మ ఒసగిన వరము
మయబ్రహ్మ అనుగ్రహము

1.ఎక్కడ దాగుందో అంతటి కౌశలం
ఎవ్వరు నేర్పారో జన్మతః చాతుర్యం
సృజనలో బ్రహ్మనే మించిపోయారు
ప్రతిభలో ప్రకృతినే అధిగమించారు
భారతీ దేవీ ఆశీస్సులే అవి
సరస్వతీ మాత ఇచ్చిన దీవెనలే అవి

2.ఊహకైన అందనిది ఆ వైవిధ్యము
చూపుతిప్పుకోనీదా దృశ్యమే హృద్యము
అవకరమేమున్నా అది అడ్డుకానేకాదు
అందలాలు ఎక్కకున్నా చైతన్యమాగిపోదు
సృష్టికి ప్రతిసృష్టి చేసే విశ్వామిత్రులు
రసిక ప్రేక్షక జనులకు అభిమాన పాత్రులు

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:హనుమత్తోడి

కపివరా మాకు ధైర్యమునీవేరా
కొండగట్టు దేవరా ఆత్మ స్థైర్యము నీవేరా
సంజీవరాయా సరగున మము బ్రోవరా
అంజనానందనా మమ్ము అక్కునజేర్చుకోరా 
భజింతురానిను రామభక్త హనుమా
నుతింతురా పవనసుతా మము దయతో గనుమా

1.వాగధీశ పలుకులందు తేనె చిలుకనీయరా
జితేంద్రియా చిత్తమునే కట్టడి సేయరా
సింధూర వర్ణాంగా సుందరకాండ నాయకా
జానకి శోకనాశకా దానవాంతకా
భజింతురానిను రామభక్త హనుమా
నుతింతురా పవనసుతా మము దయతో గనుమా

2.చిరంజీవ పీడించే రగ్మతలను మాన్పరా
మారుతీ మానసిక శాంతిని చేకూర్చరా
లక్ష్మణప్రాణదాత ఆపదనెడ బాపరా
ప్రసన్నాంజనేయ మాకండగ నీవుండరా
భజింతురానిను రామభక్త హనుమా
నుతింతురా పవనసుతా మము దయతో గనుమా
పెదవి మీది పుట్టుమచ్చ పెంచె దాహము
చేతిమీది పచ్చబొట్టు తెలిపె మోహము
కనుకలమే రాసెనెన్నొ ప్రేమలేఖలు
మూగసైగలే తెలిపే మనసు ఊసులు

1.ముంగురులే పంపసాగె మేఘసందేశము
బొటనవేలు నేలరాయు అభినివేశము
చీరకొంగు వ్రేలుచుట్టు తీపిబిడియము
తలవంచి మెలిచూపుల ఆహ్వానము

2.మూతివిరుపు ఎఱుకపరిచె మది ఆత్రము
అధరమదుర మధురమాయే మదన శాస్త్రము
గాలిమోసుకొచ్చింది నిట్టూర్పుల ఊష్ణము
ఓపలేని విరహానికి ఇంకేల సాక్ష్యము

Friday, September 20, 2019


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఎద ఏనాడో -శృతికలిపింది
పదమే లయలో కొనసాగింది
మన అనుబంధమే యుగళగీతం
మన సావాసమే సత్యం నిత్యం  శాశ్వతం

స్నేహానికి మోహమెంతో చేరువ
అహముకు తావీయని తీరుగ
పరస్పరం పరకాయప్రవేశమే
ఒకరికొరకు ఇంకొకరం అంకితమే
మనమైత్రి మంచి గంధమే
మన చెలిమి నెంచగా  మకరందమే

ఊపిరి నీపేరే పలవరిస్తుంది
మది నీఊసులనే తలపోస్తుంది
నీ కంటికి రెప్పనై కాపుంటా
నీ వెంటనీడలా తోడుంటా
కలిసిసాగుదాం కాలం అంచులదాకా
కలలో ఇలలో కలతలజోలిలేక
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

బియ్యము మెతుకయ్యే క్షణమది ఏదో
పాలుతోడి పెరుగయ్యే ఆ నిమిషమేదో
కణసంయోగమెపుడు శిశువయ్యేనో
జీవుడెపుడు వీడితనువు శవమయ్యేనో
అంతుపట్టలేనిదా దైవ రహస్యం
అంతరార్థమేమిటో అగమ్య గోచరం

1.గొంగళిపురుగు సీతాకోక చిలుకయ్యే వైనమేమిటో
రంగుల ఇంద్రధనుసు సృజన చాతుర్యమేమిటో
గిజిగాడి గూటి నిర్మాణ నైపుణ్యమెవరు నేర్పిరో
ఊసరవెల్లికి వర్ణ వితరణెవరు చేతురో
అంతుపట్టలేనిదా దైవ రహస్యం
అంతరార్థమేమిటో అగమ్య గోచరం

2.ఆహార నిద్రా భయ మైథునాలనేర్పచిన దెవ్వరో
 చేపలకు పక్షులకు ఈదనెగుర శిక్షణ నెవరిచ్చిరో
ఖగనాగుల నడుమన పగనెవ్వరు కలిపించిరో
వేటాడగ మృగరాజుకు పాటవమును కూర్చిరెవరొ
అంతుపట్టలేనిదా దైవ రహస్యం
అంతరార్థమేమిటో అగమ్య గోచరం

Thursday, September 19, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:ఆందోళికా

ఉసిగొలిపే నయనాలు-కౌముది వైనాలు
ఊరించే అధరాలు మధురాతి మధురాలు
అలరేగిన నీ కురులు రేపేనెన్నెన్నో మరులు
చెవులకున్న జూకాలు కలిగించె మైకాలు
అణువణువున నీ అందం  చెలీ అమృతభాడం
నిగ్రహించుకొనడమ్మిక నాకు దినదిన గండం

1.నీ కాటుక సోయగమే కిటుకులెరిగి ఉన్నది
నీ నుదుటన తిలకమే అయస్కాంతమైనది
కనుబొమలే ఎక్కిడిన మదనుడి ధనువైనవి
నిగారింపు నీ చెంపలు కెంపుల కింపైనవి
అణువణువున నీ అందం చెలీ అమృతభాడం
నిగ్రహించుకొనడమ్మిక నాకు దినదిన గండం

2.రతీదేవి నిన్నుచూసి అసూయనే గొన్నది
రంభనే తను నీతో  పందానికి తగనన్నది
రవివర్మ కుంచె సైతం నినుదించ తలవంచింది
జక్కన చెక్కిన శిల్పం నీగొప్పను ఒప్పుకుంది
అణువణువున నీ అందం చెలీ అమృతభాడం
నిగ్రహించుకొనడమ్మిక నాకు దినదిన గండం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:హరికాంభోజి

బ్రతుకెంత నరకం
నువు వినా అనుక్షణం
నీ ప్రతీక్షలో ప్రతినిమిషం
మనలేను ఈ విరహం

1.అరచేతిలో స్వర్గంచూపించినావు
ఊహల పల్లకీ నెక్కించినావు
గాలిలో మేడలెన్నో కట్టింపజేసావు
నీటిపై రాతలెన్నో రాసేసినావు
నాదానివేనంటు బాసలే చేసావు
తృటిలోనే మటుమాయమై పోయినావు

2.ప్రేమకు మారు పేరే నమ్మిక
వంచించబోకే నను నీవిక
అంకితమైనాను నీకే ప్రేమిక
శూన్యమయ్యింది నా జీవిక
పిచ్చెక్కిపోతోంది నువులేక నాకు
గోదారె దారాయె కడకు
https://youtu.be/M63dtQ0MHhE?si=5xaH2hErd0uMnzh5

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:ముఖారి

నీ చూపుల వలచిక్కని చేపలు ఏవి
నీ కైపులొ తడిసిపోని తాపసి ఏడి
చెప్పడానికెన్నైనా చెప్పగలరు లోకాన
వనిత వలపు కోరుకోని వారెవ్వరు జగాన
నేనెంతటివాడనే కాంతా దాసోహమనక
కామిగాకమోక్షగామి కాడనునది వాడుక

1.మేనక వెనక బడి చెడె విశ్వామిత్రుడు
ఊర్వశి వశమయ్యీ మురిసె పురూరవుడు
వరూధినీ మోహమున మోసగించె గంధర్వుడు
మోహిని అందానికి మేను మరిచె మహాదేవుడు
నేనెంతటివాడనే కాంతా దాసోహమనక
కామిగాకమోక్షగామి కాడనునది వాడుక

2.హరి ఉరమున ప్రతిష్ఠించె సిరిని ప్రేమ మీరగ
సగమేనునర్పించె హరుడు గౌరి కోరగ
విరించి తరించె వాణి రసనకొల్వుదీరగ
దేవేంద్రుడహల్యకై కుక్కుటముగ మారెగా
నేనెంతటివాడనే కాంతా దాసోహమనక
కామిగాకమోక్షగామి కాడనునది వాడుక

Wednesday, September 18, 2019

పోరుగడ్డ తెలంగాణ తిరగబడ్డది
విముక్తి కోసమే దేనికైన తెగబడ్డది
బలిదానాలసాక్షిగా సాధించిన ప్రతిబిడ్డదిది
త్యాగనిరతికేనాడూ బహుదొడ్డది
జై తెలంగాణ జయహో తెలంగాణ

1.రజాకార్ల ఊచకోత రక్తపాత మాయెగా
నిజాం నిరంకుశత్వమే బడుగుల తుడిచేయగా
దొరలగడీ చెఱలోన నలిగీ బాంచన్ కాల్మొక్తగా
భూస్వాముల పాలబడి వెట్టిచాకిరితో అశక్తగా

2.నగ్నంగా పడుచులతో బతుకమ్మలాడించగ
కడజాతివారికి శిక్షగ మూత్రాలు త్రాగించగ
నోటికాడి కూడుకూడ ముష్కరమూక కొల్లగొట్ట
కన్యత్వాన్ని తొల్తగ చెఱచి దాసీలుగ మార్చగ

3.కొమురంభీం రాంజీల ఆదివాసి పోరాటం
కాళోజి దాశరథిల అక్షర పోరాటం
దొడ్డికొమ్రయ్య సూరి వంటివారి సాయుధపోరాటం
ముక్కోటి తెలంగాణ ప్రజల నెరవేరిన ఆరాటం
జై తెలంగాణ జయహో తెలంగాణ

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:ధాని

గర్భస్థ శిశువుకూ గ్రాసాన్ని కూర్చుతావు
ఏక కణ జీవినీ లోకానికి తెస్తావు
కాలచక్రమెప్పటికీ ఆగకుండతిప్పుతావు
నీవుండేదేతావు నిఖిలము నిండుతావు
శ్రీలలితే మాతరం భజామ్యహం నిరంతరం
హే భగవతి దేహిమే తవ పాదసన్నిధిం

1.నీడగ తోడుంటావు నిత్యసంతోషిణి
రెప్పగ కాపుంటావు నిర్మలకాత్యాయిని
చరాచర జగత్తునంత నియతిన నడిపిస్తావు
ఏదో పరమార్థము సృజనకు ముడిపెడతావు
శ్రీలలితే మాతరం భజామ్యహం నిరంతరం
హే భగవతి దేహిమే తవ పాదసన్నిధిం

2.సత్వరజస్తమో గుణాతీతవు మాతా గాయత్రి
సత్యసుందర శివంకరివి జగన్మాతా రాజేశ్వరి
నిన్ను తెలియగోరితిని నిరంజని పావని
నీ బాలుడనే జనని అనుగ్రహించు యోగిని
శ్రీలలితే మాతరం భజామ్యహం నిరంతరం
హే భగవతి దేహిమే తవ పాదసన్నిధిం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:శహన

ఎలుకతోలుతెచ్చి ఏడాది తోమినా
ఏమాత్రమైనా అదిమారునా
బోధలెన్నొ చేసి సన్మార్గము చూపినా
ఆత్మ ఏనాటికైనా నిను చేరునా
సాయీ నువు మళ్ళీ అవతరించవోయి
బాబా నువ్వే మము తరింపజేయి

1.రెండురూకలీయగలిగితే చాలన్నావు
దండిగా ఆర్జించి దాచుకొంటున్నాము
సాటి మనిషికించుకైన సాయపడుమన్నావు
అసూయతో మరింత హానిచేయుచున్నాము
సాయీ కాసింత కనికరించవోయీ
బాబా ప్రేమనేర్పి  ఉద్ధరించవోయి

2.మనసారా నిన్నే నమ్ముకోమన్నావు
తటపటాయిస్తూ శరణుకోరకున్నాము
గుండెలోన నిన్ను నిలుపమన్నావు
గుళ్ళూగోపురాలు నిర్మించుతున్నాము
సాయీ మమ్మల్నిక సమూలంగ మార్చివేయి
బాబా మాచేయిపట్టి నీచెంతకు చేర్చవోయి

Sunday, September 15, 2019

నిత్యము నీవే సత్యము నీవే
విశ్వాధిపత్యము నీదే
ఆదియు నీవే అంత్యము నీవే
కాలచోదనము నీదే
దేహమునీదే జీవమునీదే
నా ఆత్మ రూపము నీవే నీవే
మహాలింగ భూతేశ్వరా ప్రణుతింతురా
మహాదేవ పరమేశ్వరా అభినుతింతురా

1.ఎరుకనీయరా ఎరుకల వేషా
ఎదగ మ్రోగరా ఢమరుక భూషా
దర్పము మాన్పర దిగంబర
అహమును కూల్చర ఋతంబర
మహాలింగ భూతేశ్వరా భజియింతురా
మహాదేవ పరమేశ్వరా స్మరియింతురా

2.పృథివ్యాపస్తేజోవాయురాకాశలింగా
పరితాపము నెరవేర్చరా
ద్వాదశ జ్యోతిర్లింగా అభవా భస్మాంగా
భవజలధిని కడతేర్చరా
మహాలింగ భూతేశ్వరా అర్చింతురా
మహాదేవ పరమేశ్వరా కీర్తింతురా

Saturday, September 14, 2019

అడుసు తొక్కుడెందుకు-కడుగ మిడుకుడెందుకు
ఆదిలోనె అణిచేయ్యక-సోది నియతులెందుకు
దారి గుంతలెందుకు-వీథి చీకటెందుకు
మన మొకమే బాగులేక అద్దముననుడెందుకు

1.ఫాక్టరీలె మూసేస్తే-ప్లాస్టిక్కు చిక్కదుగా
నిషేధమే విధిస్తే-మద్యపానముండదుగా
అంగట్లో అమ్మనిచ్చి-ఆంక్షల ఆరాటమేల
అతిక్రమించారని-దండుగులే దండుకొనుడ?

2.ఉన్ననాడు వృధాచేసి-లేనినాడు ఏడ్వడమా
దుబారాను చేరదీసి-ఋణగ్రస్తులవ్వడమా
ముందుచూపు లేనివాడు-ఎందులకూ కొఱగాడు
గ్లోబల్ వార్మింగ్ పేర-గోలగోల చెయ్యడు

3.తయారీలొ మితి బిగిస్తె-నియంత్రించ సులువెగా
అతివేగం అవలీలగ-కట్టడి చేయొచ్చు కదా
ఖజానాకు ఋజుమార్గం-జరిమానా ఐతె ఎలా
రాయితీల పేరుతో-సోమరులను చేస్తె ఎలా

4.కొంటె పన్ను ఉంటె పన్ను-నడిపితె అడుగడుగు పన్ను
రోడ్డు పన్ను టోలు పన్ను-సరిలేని సిగ్నళ్ళు దాటితేను పన్ను
వాహనమే గుదిబండగ-పళ్ళనూడగొట్టు పన్ను
పన్నులపై పన్నులేగ-ప్రభుతకెపుడు వెన్నుదన్ను
రాగం:మేఘ మల్హార్

కురిసిన వానకెంత పరవశం
తడిసిన మట్టికెంత పరిమళం
బీడైన పుడమికది ఓ వరం
మోడైన మానుకెంత సంబరం

1.రైతన్న పొలములో గంగావతరణం
ఊటలేని బావులలో జలనిదర్శనం
వాగులు వంకలకూ చైతన్య సలిలం
నదులే వరదలవగ  ఉద్విగ్న వీక్షణం

2.గొడుగులే అడుగులేయు చిత్రం
ఎటుచూడూ నీటిమడుగులే విచిత్రం
ఏరువాక జరిపే సుముహూర్తం
ఏడాది గ్రాసానికి ఎనలేని ఆత్రం

రచన.స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:పీలూ

నను గనవే జనని
మననే నీ దయమాని
తెరిపి లేక కురియనీ
నాపై నీ కనికరముని
వాగ్దేవీ వారిజలోచనీ
నీ ధ్యాసలో నను కడతేరనీ

1.విదిలించుకున్నాగాని
బంధములలొ తోతువే
విధిలిఖితము ఇదెయని
నను ఎడబాతువే
నినువినా ఒరుల విన
నను ఏదరి నువు జేర్చినా

2.నా వెతనే గీతి జేతు
చిత్తము నిటు నిలుపవే
నా కథనే కవిత రాతు
చిత్తగించ తలచవే
అక్షరాల నర్చించెద
నా లక్ష్యము నెరవేర్చవే

Thursday, September 12, 2019


గూడు లేని కోయిలకు మావి తోడు దొరికింది
పాటలోని మాధురికే తాను ఫిదా అయ్యింది
కచ్చేరి పెట్టడానికి వనముకంతా తెలిపింది
వసంతాన్ని మోసుకొచ్చి తనసొంతం చేసింది

1.పికమేదో కాకమేదో కనిపెట్టగలిగింది
రూపమెలా ఉన్నా గళమునకే విలువిచ్చింది
నీదీ నాదీ ఓ కథే అంటూ గీతాన్ని నేర్పింది
ఆ గానమాధుర్యానికి జగమంతా తలవూచింది

2.చెక్కగలుగు శిల్పుంటే శిల శిల్పమౌతుంది
సాన పెట్టునేర్పుంటే రాయి రత్నమౌతుంది
భక్తిదృష్టి ఉన్నపుడే సర్వమూ దైవమయం
ఆదరణ నోచినపుడే కళలౌను కమనీయం

Wednesday, September 11, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:తిలాంగ్

అందనిదానికోసం అర్రులు సాచడం
అరిచేతిలొ ఉన్నదేదో జార్చుకోవడం
ఎందుకీ పరుగులవేట ఎండమావుల వెంట
దేనికీ వెంపర్లాట ఇంద్ర ధనుసు భ్రాంతే కంట

1.సుందరాంగుల పొంగులన్నీ-సబ్బునీటి బుడగలంటా
అందంగా బులిపిస్తాయి-అందుబాటుకొస్తాయి
పట్టుకోబోతే ఎగిరి పోతాయి
ముట్టుకోబోతే పగిలిపోతాయి
ప్రకృతి సౌందర్యమంతా నయనానందకరమే
స్త్రీఆకృతి రహస్యమంతా చిదంబర శంకరమే

2.గతము తలచి వగపు-భవితకెంతొ ఎదిరిచూపు
వర్తమానమే మటమాయం-కన్నమూసి తెఱిచే లోపు
బ్రతుకు దారబోసి మితిమీరి ఆర్జించేవు
తేనెటీగలాగా శ్రమతొ పోగుచేసేవు
అనుభవించడానికి జీవితమే కరువౌతుంది
జ్ఞానోదయమయ్యే సరికి చావుచేరువౌతుంది
కదిలిస్తే కవిత్వం
స్పందిస్తే సంగీతం
నీ సహవాసం అనునిత్యం
నువు నవ్వితే రసరమ్యం
ఆనందమే నా గమ్యం

1.మది ఆడుతోంది మయూరమై
నీ మధుర గానానికి
సడిరేగుతోంది అలారమై
నీ మేని గంధానికి
బృందామనమైంది జీవనం
నీ పాదం మోపినంత మేరకు
నందనవనమౌతుంది ప్రతిదినం
నీతో గడిపినంత వరకు
సాగనీ మనమైత్రి కడదాకా
చేరనీ స్నేహగంగ కడలిదాకా

2.గుండెకొట్టుకుంటుంది అందరికీ
లబ్ డబ్బనీ
నా హృదయమేమొ పలవరిస్తుంది
నీ పేరుని
సమయమాగకుంటుంది ప్రతివారికి
టిక్ టిక్కనీ
క్షణం కదలనంటుంది గడిపేదెలా
నువువినా ప్రతిరోజుని
కలవలేని నేస్తమా కలనైనా చేరవా
కునుకైనా లేనినాకు అదికూడ సాధ్యమా

Monday, September 9, 2019

OK

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:రేవతి

కీర్తన నాది నర్తన నీది
సాగనీ నటరాజా-కళామతల్లి పూజ
చెలరేగనీ చిదంబరేశ-నా హృదయ ఘోష

1.భూ నభోంతరాలు దద్దరిల్లగా
పదునాల్గు భువనాలు పిక్కటిల్లగా
సప్తసముద్రాలు ఉవ్వెత్తున ఎగసిపడగ
ప్రకృతి సమస్తం ప్రకంపించునట్లుగా
సాగనీ నటరాజా నీ తాండవ లీల
ప్రకటించనీ చిందంబరేశ  నా ఆత్మ భాష

2.జలపాతాలే తంబూరాలై సుశ్రుతీయగా
ఎదనాదాలే మృదంగ జతులై లయకూర్చగా
సెలయేటి అలలే జలతరంగిణులై మ్రోగగా
ఆకుల గలగలలే సంతూర్ ధ్వనులై రవళించగా
సాగనీ నటరాజా నీ నాట్య కేళీ
పాడనీ చిదంబరేశ నా జీవన సరళీ

3.పంచభూతాలే ప్రేక్షకులవగా
పంచప్రాణాలే సమీక్షకులవగా
పంచాననా ప్రపంచ పరిరక్షకా
నీ పంచన చేరితిరా నను పెంచిపోషించగ
సాగనీ నటరాజ ఆనంద నృత్య హేల
చల్లారనీ చిదంబరేశ నా బ్రతుకున వెతలకీల

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఉత్తీర్ణత కలుగుటకు కృషి ఒకటేనా
విజయం సాధించుటకు రాచబాటేనా
నరాలు తెంచుకున్నా మిగిలేది కంఠ శోషే
అస్మదీయుడైతె సరి వడ్డించేవాడికెపుడు మనధ్యాసే

1.బలి దానాలతో కలనెరవేరింది
శోకాలే కాకులకు,గ్రద్దలకే ముద్ద దక్కింది
రంగులగొడుగుంటె చాలు ఏ ఎండైనా సమ్మతమే
సమీకరణ రణాల్లో పక్షమేదైనా పక్షపాతమే

2.స్వార్థమనే యజ్ఞానికి సామాన్యులె సమిధలు
రాజకీయ రంగంలో  ప్రజలేగా వంచితులు
అధికారం నేతలకు అనివార్యమైనదేగ
అంధకారం పౌరులకు  అలవాటైనదేగ

3.ఏకఛత్రాధి పత్యమే పాలన ఏలికలకు
గతమెంత వెతికినా దొరకదు పోలికలకు
కనీవినీ ఎరుగని అవకాశం నాయకత్వాలకు
జనసంక్షేమం మరవొద్దు జారిచేయు ఫత్వాలకు

https://youtu.be/BPKA9lxXjh4?si=za0BIeuVB5MJCb20

రచన.స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:అఠాణా

గణనాథుడు త్రిగుణాతీతుడు
అగణిత గుణగణ మహిమాన్వితుడు
కరుణాభరణుడు శరణాగత వత్సలుడు
సరగున బ్రోచెడి ప్రథమ పూజితుడు

1. కరిముఖవిలసితుడు కారణ జన్ముడు
కిన్నర కింపురుషాది దేవగణ సేవితుడు
కీర్తన మోహితుడు కుడుముల కూరిమివాడు
కృష్ణదేహ శోభితుడు కౄరకర్మ నాశకుడు
సరగున బ్రోచెడి ప్రథమ పూజితుడు

2.కెడయాడగ మూషిక వాహనుడు
కేలుమోడ్చి వేడగ అడిగినదొసగువాడు
కైలాసవాసుడు కొండంతఅండవాడు
మందార కోడిగనే మది కోరెడివాడు
కౌముదీపతివైరి కంకణకర వరదుడు


https://youtu.be/UKys-vNCK9o?si=RXSRdm2LgGIhhYSh

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:మాయామాళవ గౌళ

వెళ్ళిరావయ్యా గణపయ్యా నేటికి
మళ్ళిరావయ్యా మరుసటి ఏటికి
మరలిరావయ్యా మండపాల చోటికి
తరలిరావయ్యా ముమ్మాటికి

వీడోకోలు నీకిదే ఈ ఏటికి
సాగనంపేము నిన్ను పొలిమేర ఏటికి
నేటికి కోనేటికి నీటికి గంగాతటికి
 చేసెదమిదె నిమజ్జనం  ఎదనీకు నీరాజనం

1.కన్నుమూసి తెరిచేంతలొ గడవనీ ఏడాది
నిలువుమయ్య నిరతము కదలక మామది
నిందలు రానీకు మోముని చూసినా చందమామది
వందనాలు నీకివే వక్రతుండ విఘ్నపతి
 చేసెదమిదె నిమజ్జనం  ఎదనీకు నీరాజనం

2.తెలిసో తెలియకో చేసేము తప్పులెన్నో
 ఆడుతు పాడుతూ దాటేము గీతలెన్నొ
గుంజీలు దీసేము ఏకదంత పరితపించి
మన్నింప వేడెదము మా చెంపలువేసుకొని
  చేసెదమిదె నిమజ్జనం  ఎదనీకు నీరాజనం

వెన్నెలే ఎంతో వేడి అమ్మ చూపు కన్నా
తేనియే కడు చేదు అమ్మ పిలుపు కన్నా
కన్నా అని పిలిచినంత కడుపునిండి పోవులే
నానీ అని తలనిమిరిన మనసుకెంతొ హాయిలే

1.కమ్మనైన రుచి ఏది అమ్మగోరుముద్ద కన్న
మధురమైన గీతమేది అమ్మజోల పాటకన్న
అనురాగం అమృతము కలుపుతు కుడిపిస్తుంది
అరిచేతిలొ పాదముంచి నను నడిపిస్తుంది

2.నీరెండ కన్నా వెచ్చనిది అమ్మ ఒడి
మోదానికి ఖేదానికి నా కోసమే అమ్మ కంటతడి
చాదస్తం  అమ్మదంటూ అశ్రద్ధనే నే చేసినా
సర్వస్వం నేనేనంటు అమ్మకు ఆరాటమే ఎపుడు చూసినా

3.అన్నమయ్య రాసాడు వెంకన్నను కీర్తిస్తూ
అతులితమౌ పదాలు ముప్పది రెండు వేలు
ఏ కవీ రాయలేడు అమ్మప్రేగు బంధాన్ని వివరిస్తూ
అలతి అలతి పదాలలోనైనా బ్రతికినన్నాళ్ళూ



Sunday, September 8, 2019


అల్లన పిల్లన గ్రోవే మోహనము
నల్లని అల్లరి మోమే మోహనము
గోపబాలుని లీలలు మోహనము
వేణుగానమే గోకుల సమ్మోహనము

1.ఆలమందలకు మురళీనాదమె వినోదము
రేపల్లె పడుచులకు వంశీవాదనె మైకము
తాండవకృష్ణుణి నాట్యకేళియె నయనానందము
యమునావిహారి రాసలీలయే హృదయంగమము

2.శిఖిపింఛధరుడు రాధా మనోహరుడు
నందకిశోరుడు మీరా ప్రియవరుడు
శ్యామ సుందరుడు కుబ్జాభీష్ట వరదుడు
నవనీత చోరుడు కుచేల దారిద్ర్యహరుడు


నీ పదములె వేదములు
నీ కరమురలె అభయకరములు
నీ కన్నులు సూర్యచంద్రులు
నీ వదనమె నిఖిల సదనము
శ్రీ వేంకట నారాయణా
దాసపోష సంకట హరణా
శరణం శరణం శరణం శరణం
శరణం శరణం మాం పాహి శరణం

1.నీ హృదయము శ్రీనివాసము
భక్త మానసమే నీనివాసము
నీ నామస్మరణయే నిశ్రేయసము
నీ యశోగానమే మనోల్లాసము
శ్రీ తిరుపతి వేంకట రమణా
దాసపోష సంకట హరణా
శరణం శరణం శరణం శరణం
శరణం శరణం మాం పాహి శరణం

2.నా ఊపిరి నీ గోపురము
నా జీవమె నీ భావనము
నా కాయమె నీకాలయము
నా జీవితమే స్వామి నీకంకితము
శ్రీ తిరుమల బాలాజీ కరుణాభరణా
దాసపోష సంకట హరణా
శరణం శరణం శరణం శరణం
శరణం శరణం మాం పాహి శరణం

Friday, September 6, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం: ద్విజావంతి

నీ రాధ పిలిచింది రారామ్మని
మాధవా జాగేల ఏలగ రాధమ్మని
ఊదరా వేణువుని శ్రవణపేయముగ
సేదదీరుతు నా ఒడిని తన్మయముగ

1.నవనీతమెంతో నీకు ప్రియం
మిసిమిని మించును నాహృదయం
విరహాగ్నిలో మదివెన్న  ఆజ్యం
ఘృతము తోడవగ ఉధృత ఆవహనీయం
నీలమేఘశ్యామ వర్షించు ప్రణయం
నీతో ఉన్నంత సమయం రసమయం-సరసమయం

2.ఏ నిధి ఉన్నది నా సన్నిధి నీది కానిది
ఏ విధి కాదన్నను  నీవేకద  నా పెన్నధి
నా పిచ్చిగాని నీవూనేనని వేరే ఏమున్నది
నీమాయయే ఇది ఇహము పరమన్నది
ఆత్మనే నీపరమైతే ఈ దేహానిదేమున్నది
పరమాత్మలో ఐక్యమైతే  ఇక మోహమేమున్నది-వ్యామోహమేమున్నది






Thursday, September 5, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:నీలాంబరి

నల్లకలువ బాలా
చెలీ నీ అందమెలా పొగడాలా
జాతి వజ్రమేదైనా
జన్మతః తనుకూడా నీలా
నీలా నీలాల కన్నులూ
నీలా నీలాల కురులూ
వన్నెలెన్నొ చిలుకుతాయి
సోయగాలనొలుకుతాయి

1.అంతరాళ మంతా కృష్ణవర్ణమేగా
అంతరంగమందు కృష్ణతత్వమేగా
నలుపంటే రంగులన్ని దాచుకున్నాదేగా
నలుపంటే గోపెమ్మల మదిదోచుకున్నదేగ

2.మెరుపు వెనుక మేఘము నీలిమయే గమనించు
రమ్యమైన రాగము నీలాంబరి అలరించు
నీలమేఘ శ్యాముడు ఆ రఘురాముడు
ఘన శ్యామసుందరుడు-సమ్మోహనాంగుడు
శ్రేయోభిలాషి ముసుగులో ఈర్ష్యా ద్వేషులు
పులుముకున్న నవ్వుమాటున వికృతమౌ మనుషులు
ఎదుటివారిని నిందించడమే పుట్టుకతో ఉన్నబుద్ధి
సాటివారిని బాధించి ఆనందించ పైశాచిక లబ్ది
స్నేహితులను మాటకే మాయని మచ్చ
ఉత్తపుణ్యానికే ఎందుకో అంతటి కచ్చ

1.వెన్నంటి ఉన్నామంటూ వెన్నుపోటు పొడిచేస్తారు
పరాచికాలాడుతూ నగుబాటు చేస్తుంటారు
ఎందుకో ఇటువంటి వారు భూమికే ఒక బరువు
పక్కలోబల్లెమల్లె అదనుచూసి తీతురు పరువు
అన్నా బావా తమ్మీ మావా వరుసలెన్నొ కలిపేరు
నమ్మించి గొంతుకోసి నిండా ముంచేస్తారు

2.తమ ప్రాపకానికై మనల నెపుడు బలిచేస్తారు
మనముందు పొగిడేస్తూ వెనక వెక్కిరిస్తారు
విశ్వసించడానికి ఏమాత్రం సరిపోరు
ఏ ఎండకాగొడుగు వెనువెంటనె మార్చేస్తారు
జుట్టు జుట్టు ముడిబెట్టి వేడుక తిలకిస్తారు
లౌక్యమన్నభ్రమలోనే ఆత్మవంచన కొడిగడతారు

Wednesday, September 4, 2019

https://youtu.be/bRadpeWtUQg

దశవిధ అవతార దనుజ వైరి
నిజభక్త పాలా నిర్గుణాకారా
నిను కీర్తి పొగడగ శేషుడె అలసే
నిరతము నుతియించ నారదుడే మైమరచె

1.వేదనిధిని సంరక్షింప సోమకు దునిమిన
మత్స్యావతార ప్రణమామ్యహం
సుధకై మధింప మంధర గిరినిల్పిన
కూర్మావతార ముకుళిత కరవందనం
దానవాగ్రణి బలి పీచమణిచిన
వామన స్వరూపా వినమ్ర నమసము
బ్రహ్మవరదర్పి హిరణ్యాక్షుగూల్చిన
వరాహమూర్తి అభివందనం
ప్రహ్లాదుగావగ హిరణ్య కశిపుని
సంహరించిన నరసింహా నమోవాకము

2.పరశువునే చేబూని క్షత్రియులను ఖండించిన
భార్గవరామానీకు బహువిధముల వందనం
రావణాంతక రఘుకుల తిలక సీతాపతీ
శ్రీరామచంద్ర నీకు శిరసావందనం
జీవనసారమైన గీతను బోధించిన
కృష్ణా జనార్ధనా సాష్టాంగ వందనం
ధర్మము సంఘము శరణమ్మని చాటినా
బుద్ధావతార నీకు పాదాభివందనం
అశ్వారూఢుడవై ఖడ్గధారుడవై ఆకలి
నెడబాపెడి కల్క్యావతార నీకు కైలాటము
https://youtu.be/rQi-DtZyRuI

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:చంద్రకౌఁస్

ప్రణతులు నీకివే ప్రమథ గణపతి
నమస్కృతులు గొనవే -నిను నమ్మితి సరస్వతి
మదినీకే అర్పించితి కొండగట్టు మారుతి
వేడుకొంటినయ్యా వేంకటా చలపతి
నిలిపితి నా తలపున నిన్నేకైలాస పతి
మీ దివ్యచరణాలే నాకిక శరణాగతి

1.దయగనవయ్య నన్ను శ్రీ గురుదత్తమూర్తి
దారిచూపించునాకు దేవసేనాపతి
భారమింక నీదేలే భద్రగిరి రఘుపతి
దరిజేర్చుకోర ధర్మపురి నరసింహ మూర్తి
ఆదరించవయ్యా అన్నవరం సత్యమూర్తి
మీ దివ్యచరణాలే నాకిక శరణాగతి

2.గీతను బోధించరా గురువాయూర్ కృష్ణమూర్తి
ప్రార్థన మన్నించరా వారాణసి పురపతి
జనహితమే కూర్చరా పూరీ జగత్పతి
ఇంద్రియముల నరికట్టర శ్రీశబరీ గిరిపతి
మానవతను వెలిగించర షిరిడీ శ్రీపతి
మీ దివ్యచరణాలే నాకిక శరణాగతి
https://youtu.be/KD9JB88NyKU?si=xGGFpRnf54hQHaDN

కను తెరవగ తొలిగురువు మా అమ్మ వేంకటలక్ష్మి కి  వందనం
నను నడిపిన ఉపదేశ గురువు మా నాన్న అంజయ్యకు వందనం
అ ఆ లు దిద్దించిన లింబగిరి పంతులుకు ఇదె వందనం
నా కవిత నాదరించె అభినవపోతన వరదన్నకు వందనం పాదాభివందనం

1.తెలుగును వెలిగించిన విశ్వనాథశాస్త్రి సారుకు వందనం
గణితపు మర్మాల తెలిపె ప్రభాకర రావుకు వందనం
భౌతికశాస్త్రాన్ని బోధించిన రాజమౌళి సారుకు వందనం
రసాయన శాస్త్రం  నేర్పిన ఆనందం సారుకు వందనం

2.బోధనవిధి తెల్పిన మంగతాయారమ్మకు మనసారా వందనం
ఆంగ్లాన్ని అందించిన డియార్కే రంగారావ్ సారుకు వందనం
చిత్రకళను మేల్కొలిపిన ఆగాచార్య సారుకిదే నా వందనం
నను కవిగా గుర్తించిన తొలి హితుడు రామకిష్టయ్య సారుకు వందనం

ఏమరుపాటుగా నేమరిచిన గురుతతికి త్రికరణ శుద్దిగా సాష్టాంగ వందనం


Tuesday, September 3, 2019


https://youtu.be/HI09qH38wpI

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:వసంత

వికట రూప విఘ్న పతి
విజ్ఞాన దీప విశ్వపతి
సుగుణ నిధి గణపతి
నిలువుమెపుడు నా మతి

1.నీఆకారం ఓంకారం
నీ వీక్షణలో మమకారం
ప్రతిపని నీతో శ్రీకారం
నీకే మాతొలి నమస్కారం

2.చిత్రమె నీ ద్వయతత్వము
అతులితమే నీదయా పరత్వము
ప్రాప్తమెనీ వరదాతృత్వము
నీఆకృతే ప్రకృతి నిత్యత్వము

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఏకాకిగా నా పయనము
శోకాల నదిలో సాగెనే
స్వర్గానికెగరగ లక్ష్యము
ఆకాశ నిచ్చెన విరిగెనే

1.ఏ మున్నదో నా లోపము
ఏనాటిదో ఈశాపము
నే కన్న కలలే కరిగెనే
మనసెంతగానో మరిగెనే

2.కృషికిలేనే లేదులోటు
ఎరుగనైతి తొందరపాటు
బ్రతుకునాకో ప్రహేళిక
నాకు నేనే  తోడిక

Monday, September 2, 2019

https://youtu.be/BctzII6_IyQ

రచన:రాఖీ

చిందేసి ఆడరా సిద్ధీ గణేశుడా
అందాల దేవుడా అంబా తనయుడా
నాట్యాలు మీఇంట కొత్త కాదురా
నటరాజే మీ నాన్న తాండవాలె చేయురా
గణపతి బప్పా మోరయా
నినువిన గతియెవరు లేరయా

1.హైందవానికండగా నువ్వుండగా
అన్యమతమేదైన చిచ్చుబెట్టగల్గునా
నవరాత్రి పండగ జరుపుతుండగా
మతసామరస్యము వెల్లివిరియుగా
భారతీయ సంస్కృతి బాటచూపగా
లోకమంత ఏకమై ప్రగతి సాగదా
గణపతి బప్పా మోరయా
నినువిన గతియెవరు లేరయా


2.అక్రమార్కులనే ఒక్కతొక్కు తొక్కరా 
అవినీతి పరుల పీచమణిచి వేయరా
ఆడపడుచులందరికి తోడునీడవై
అబలకాదు సబలగా ఋరుజువు పర్చరా
రకరకాల మత్తుల్లొ జోగుతున్న యువతను
రాదారిలోకి మార్చి గమ్యాన్ని చేర్చరా
గణపతి బప్పా మోరయా
నినువిన గతియెవరు లేరయా

Sunday, September 1, 2019

OK

https://youtu.be/k6HICIGtyKs

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:ఆనంద భైరవి

కన్నిమూల గణపతి-నిను కన్నులార గాంచితి
కాణిపాక గణపతి-నిను వేనోళ్ళ పొగిడితి
రత్నగర్భ గణపతి- నీ మహిమలెన్నొ పాడితి
అష్టసిద్ధి గణపతి-నిన్నదే పనిగ వేడితి

1.నాహృదయ పీఠమెప్పుడు అధీష్ఠించి నిలువగా
నామనో నేత్రమెప్పుడు నిన్నే దర్శించగా
కనికరముతొ వరమీయి వరసిద్ధి వినాయకా
నా కరమును వీడకుమా కరిముఖ గణనాయకా

2.ఐహికమౌ వాంఛలన్ని అంకుశముతొ అణిచివేయి
ఇంద్రియ  విశృంఖలతను పాశముతో కట్టివేయి
నిన్నే నమ్ముకుంటిని-మది నాక్రమించువక్రతుండ
నీ పదమును విడువకుంటి ఏకదంత నీవెఅండ


కలలో నైనా ఊహకైనా ఉత్తుత్తిగానైనా
కలిసే భాగ్యం  మృగ్యమేనా కలతనిద్దురేనా
ఏ వేళ కలిసాయొ కళ్ళు వేసాయిలే చిక్కు ముళ్ళు

1.పదహారు ప్రాయాన  ప్రణయం
ఈనాటికీ అందాల స్వప్నం
ముదిమి పొలిమేరలోనా
ఆలంబనేగా అనురాగం
నువ్వుా నేనూ మనమన్నదీ
ఆహ్లాదకరమైన ఒక కల్పన

2.చేరువయ్యే లోగానే కాలం
పెంచింది ఎనలేని దూరం
మన భాష మౌన ప్రవాహం
తుదిలేనిదీ మన ప్రయాణం
మృతులు చితులు మననాపలేవు
స్మృతులు మతులు గతితప్పలేవు
https://youtu.be/0mG4cJCezQ0

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:నళినకాంతి

నళిన కాంతి నయన నగుమోము శ్రీపతి
ననుగొనిపోవా నీ తిరుమల తిరుపతి
పరమపదమె కాదా నీ పద సన్నిధి
పదిలముగా చేకొనరా ఓ పరమదయానిధి

1.తహతహలాడెడి చకోరి కోరు రీతిగా
తపనలనొందెడి చాతకమ్ము తీరుగా
ఆకలిగొనియున్న అన్నార్తి మాదిరిగా
నీకడ నిలవాలనీ నే కడతేరాలనీ
నిను నెర నమ్మితిరా రమాధవా మాధవా

2.తొక్కుడు బండలాగ ఓపిక నాకు లేదు
ప్రతీక్షణం ప్రతీక్షలో బ్రతుకగ నేనోపలేను
కఠోరమౌ నియమాల పాటించగా లేను
బలీయమౌ సంకల్పమె నా ఏకైక సాధన
నా ప్రార్థన మన్నించర కనికరముతొ కరివరద
https://youtu.be/SXK8f3l18KY

ఎందుకో దయమానినావు
ఏల మొకంచాటేసినావు
ఎలుక వాహనా నవ మోహనా
గజాననా నా ప్రియదైవమా
కినుకనొదిలి ననుబ్రోవరా
తాళజాల నిర్దయ మన్నించరా

1.నిను తలవని క్షణమేదొ చెప్పవయ్యా
నిను మొక్కని ఘటనేదో తెలుపవయ్యా
నిను పూజించని దినమొకటున్నదా
నిను ప్రార్థించక పని మొదలిడితినా
నా దోషమేదో ఎరిగించవయ్యా
నా నేరమేదో ప్రకటించవయ్యా

2.త్రికరణ శుద్ధిగా  నమ్మినది నిన్నేగా
త్రిగుణాతీతుడవని నిన్నే కొలిచితిగా
చవితినాడు ఎప్పుడైన చందురునణ్ణి చూసానా
నీ దర్శించక నీ  గుడిని దాటవేసానా
గుంజీలు తీసెదనిక తప్పులు క్షమియించరా
ఉండ్రాళ్ళు పెట్టెదనిక అలకనింక వీడరా
ఆరోగ్యమే మహాభాగ్యము
అన్న ఆర్యోక్తి అక్షర సత్యము
జబ్బుపడితెగాని ప్రతివారికి
 ఆ సంగతి అనుభవైకవేద్యము
నిర్లక్ష్యపు ఫలితానికి ఎప్పుడో
చెల్లించక తప్పదు మూల్యము
దీపమున్నప్పుడె కాచుకోవాలి
మన దేహదారుఢ్యము
జయహో దృఢభారత్
జయ జయహో ఆరోగ్య భారత్
జయహో జయహో సౌభాగ్య భారత్

1.ఎంత చులకన మేని పట్ల లోకాన
 పూసే రంగులకే విలువ మనిషి మొకాన
లోన లొటార ముంటేనో  పెరుమాళ్ళకెరుక
పైన పటారానికే జనం పట్టంకట్టే  వేడుక
చిన్ననాటినుండే తగిన ఆటలాడాలి
వ్యాయామపాఠాలు విధిగబోధించాలి
జయహో దృఢభారత్
జయ జయహో ఆరోగ్య భారత్
జయహో జయహో సౌభాగ్య భారత్

2.తెలతెలవారగనే మేలుకొని తీరాలి
పిల్లగాలుల స్వచ్ఛదనం ఆస్వాదించాలి
పచ్చదనం పరికిస్తూ నడక సాగించాలి
ప్రకృతి అందాలు పరవశంతొ చూడాలి
వీనులకింపైన సంగీతం వినాలి
తనువంతా తుళ్ళిపడగ సిగ్గుపడక నవ్వాలి
జయహో దృఢభారత్
జయ జయహో ఆరోగ్య భారత్
జయహో జయహో సౌభాగ్య భారత్

https://youtu.be/jdUzmrawUhs?si=Y7mSkWQZIwXiGu7L

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:చెంచురుట్టి


జగన్నాటక సూత్రధారి
అర్ధనిమీలిత నేత్ర మురారి
భక్తజన హృదయ విహారి
భావయామి భజియించెద నిను శౌరి

1.అంతరంగాన చూపావు అఖిలాండ విశ్వాన్ని
యుద్ధరంగాన ఆవిష్కరించావు ఆ విశ్వరూపాన్ని
మామూలు మనిషిలాగ కొంటెపనులు చేస్తావు
మాయతెరలు కప్పేస్తూ భ్రమలో ముంచేస్తావు
లీలామానుష వేషధారి శ్రీ హరి
చిత్తములో నిను నిలిపెద శిఖిపింఛమౌళి

2.నడిపేదినీవే ప్రతిఅడుగు భుక్తి కుడిపేది నీవే
గడిపేదినీతోనె అనుక్షణము అంతరాత్మగానే
కర్తవునీవని కర్మవూనీవని  గీతన బోధిస్తావు
కర్తవ్యపాలనకై మము ఉద్యుక్తులచేస్తావు
జయ జనార్ధనా గోవర్ధన గిరిధారి
నా జీవన సారథీ వనమాలీ చక్రధారి










https://youtu.be/nJ5K_qbTWUQ

కదలిరార గణపతి
ఎలుకనెక్కి ఉధృతి
ఈనాడే నువు పుట్టిన భాద్రపద శుద్ధ చవితి
అందుకొనగ వేంచేయి మా పూజలూ హారతి
జై గణేశ జై గణేశ జైగణేశ దేవా
చేయిపట్టి నడిపించు మము సద్గతి త్రోవ

1.వేనవేల మండపాలు సిద్ధముగా ఉన్నాయి
నిన్ను ఎదుర్కొనుటకై తయారు డోలూ సన్నాయి
కొలుతుమయ్య వినాయకా నిను పగలూ రేయి
నవరాత్రులు నీ భజనలు ఎంతెంతో హాయి
జై గణేశ జై గణేశ జైగణేశ దేవా
చేయిపట్టి నడిపించు మము సద్గతి త్రోవ

2.తీరొక్క పూలతో  అలంకరించేమయా
అందాల మాలలెన్నొ నీ మెడలో వేతుమయా
షడ్రుచుల నైవేద్యాలు నివేదించేమయా
చల్లగ మము చూడుమని నిన్నువేడుకొనెదమయ్య
జై గణేశ జై గణేశ జైగణేశ దేవా
చేయిపట్టి నడిపించు మము సద్గతి త్రోవ