సిత్రమే కవి బతుకు శివుడా
ఆత్రమేలా తనకు భావాలు కక్కంగ భవుడా
పట్టమంటే కప్ప ఒప్పుకోదాయే
విడవమంటే పాము తప్పుకోదాయే
కత్తిమీదిసాము తీరాయే కలమునకు
స్వేఛ్ఛలేకా రాయు కవితలవి ఎందులకు
1.అనుభూతి చెందికద చేయాలి రచనలు
శబ్దరస స్పర్శరూపగంధాలె స్పందనలు
నవరసాలొలికించ తగినదే గద సాహితి
రవిగాంచడేమొగాని కవికేది పరిమితి
కట్టడితొ పుట్టునా కమనీయ కావ్యాలు
ఆంక్షలతొ తీర్చునా అక్షరాలు లక్ష్యాలు
2.శృంగారం నిశిద్ధమే సభ్యసమాజానికి
అభ్యుదయం కంటగింపు ప్రతి ప్రభుత్వానికి
కరుణరసం పెడసరం నిత్యానందులకు
భీభత్సం భయానకం రౌద్రాలు ఎందులకు
శాంత హాస్య అద్భుతాలు తయారే విందులకు
దశమరసమె మౌనం దాల్చాలి సుఖమందులకు