Tuesday, February 4, 2020

https://youtu.be/MRgXo2qx5S8

బుంగమూతి ఎందుకే నంగనాచి
సంగతేంటొ చెప్పవే దయతలచి
కయ్యానికి కాలుదువ్వే వగలాడి
వేధించీ సాధించే మాయలేడి
తప్పదేమొ ఎప్పటికీ మొగుడికి ఈ ఆగడం
ఆలిని బ్రతిమాలడం కాళ్ళబేరానికి దిగడం

1.పాంజేబులు చేయిస్తా నీ లేత పాదాలకి
పాపిట బిళ్ళకొనిపెడతా అందాల నీ మోముకి
 పచ్చలహారం కొని వేసేస్తాను నీ మెళ్ళోకి
వడ్డాణం దిగబెడతాను నాజూకైన నీ నడుముకి
చెవులకు జూకాలు ఇంపగు మాటీలు
బంగారు గాజులే మోజుమీర కొనిపెడతా

2.కంచిపట్టు చీరలెన్నొ ఎంచి ఎంచి నీకు తెస్తా
కాలుకింద పెట్టకుండా తివాచీలనే పరుస్తా
సింగారించడానికెన్నో అలంకరణలందజేస్తా
ఘుమఘుమలాడేటి అత్తరులను గుత్తగ ఇస్తా
మల్లెపూల బారెడుదండ మాపటేలతల్లో పెడతా
కమ్మనైన మిఠాయిలెన్నో కడుపారా తినపెడతా

OK
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:దర్భార్ కానడ

కరుణను మించినా రసమున్నదా
ఆదరణను  ఆశించని మనసున్నదా
కారుణ్యమె లోకాన అనుభవైకవేద్యము
దాక్షిణ్యమే దైవానికి ప్రియకర నైవేద్యము

1.ఏకో రసః కరుణ ఏవ యనివచించే భవభూతి
ఎరుగనివారెరు సృష్టిలో దుఃఖరసానుభూతి
జనన మరణ సమయాల రోదన సాధారణమే
మనుగడకై ప్రతి జీవికి అనునిత్యమూ రణమే

2.అవకరమును గనినంత పొంగదా జాలి
దీనజనుల ఆర్తికి కనుగవలే చెమ్మగిల్లి
చేయూతనీయదా మానవతే మోకరిల్లి
కటాక్షవీక్షణాల పరిమళాలు వెదజల్లి
https://youtu.be/gjkcdda8PEs?si=phc0Z6bWZ4FdyaN9

పరాకు సేయకు నను పరమశివా
పరాచికములా నాతో మహాదేవా
పరమ దయాళా  పరమేశ్వరా
పరీక్షించకు నను అపరకైలాస వేములాడ రాజేశ్వరా

1.పరిసర ధ్యానమో పరధ్యానమో
పరా ధ్యానమో పరంధామధ్యానమో
పరిపరి విధముల నిను ప్రార్థించిననూ
పరిమార్చవేలరా  భవపాప పరితాపములను

2.పంచానన ఫణిభూషా ప్రపంచాధీశా
పంచభూతాత్మక పంచప్రాణప్రదా
పంచబాణధర దహన పంచామృత ప్రియ
పంచనజేరితినను ఇంచుక బ్రోవర ఆలసించక

Monday, February 3, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:బేగడ

నీ సుందర వదన దర్శనం-నాకు సుప్రభాతం
నీ మందస్మిత అధరం నాకు- మకరంద మందారం
నీ పలుకుల ప్రవాహం-నా జలకములకు జలపాతం
నీ స్నిగ్ధ కుసుమ దేహ స్పర్శం-అపరిమితానంద పారవశ్యం

1.రసమంజరీ మంజులమీ మంజీర నాదం
నవమోహినీ ఆ సవ్వడే నను నడిపెడి జీవనవేదం
నాకోసమే దిగివచ్చిన ఇంద్రచాపమే నీవు
ముంచెత్తే  మత్తుజల్లే  శరశ్చంద్రరూపమె నీవు

2. నీ కనులు నాపాలిటి ఇంద్రనీలమణులు
నాభి మంజూషయై దాచుకొంది నవనిధులు
ఉరోజాలు మేరుగిరులు జఘనాలు హిమనగాలు
నడుము కిన్నెరసానిగ ఒలికేను నయగారాలు

OK
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:దేశ్

అనుభవించడం నేర్చుకో ప్రతీ క్షణాన్నీ
పుణికిపుచ్చుకో నేస్తం ఆస్వాదించు లక్షణాన్ని
రోజూ వండేదైనా రుచీ రుచీ భిన్నమే
రోజూ ఉండేదైనా ఏ అభిరుచీ నూత్నమే

1.కొత్తగా పుట్టుకరావు కొంగ్రత్త జీవితాలు
నిత్య నవీనమై ఉండబోవు అనుభూతులు
మార్చుకుంటె చాలు మనదృక్పథాలు
అగుపించితీరుతాయి ఊహించని కోణాలు

2.అక్షరాన్ని లక్ష్యపెట్టు మంత్రమై ఫలియిస్తుంది
ప్రజ్ఞ మీద దృష్టిపెట్టు  ప్రగతిదారిపడుతుంది
పరిసరాలలోనే స్వర్గం దీక్షతొ నిర్మించుకో
పరస్పరం సహకారం మైత్రితో ఇచ్చిపుచ్చుకో
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:తిలాంగ్

పూబాలవే అలివేణీ
అపురూప అందాలరాణీ
వదలదు నీ రూపు ఏకవిని
వర్ణించగ వరమీయి, నా మనవిని విని

1.ఎన్నిమార్లు అడగాలో సై యని అనడానికి
ఎంత బతిమిలాడాలో ఒప్పుకోవడానికి
నన్ను కలచివేస్తోంది  తీరని కలవొకటి
పాటగా నిన్ను మలచని నా ప్రతిభ ఏపాటి

2.కనికట్టు ఏదోచేసి ఆకట్టుకున్నావే
మంత్రమేదొవేసినన్ను లోబరచుకున్నావే
కల్పనలోనే  చిత్రిస్తాను ఇక నిన్ను
ఆపతరమా నీకు ఏకమైనా మన్ను మిన్ను
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:ముఖారి

మల్లెలేరి మాలకడతా రాలి పడగ.. నీ నవ్వుల్లో
మరులుగొని మాలపెడతా నీలికురుల నీ తల్లో
కాసింత చూడవె నాకేసి చేపకళ్ళ తల్లో
నీతోటి స్నేహం చేస్తా ఇలలో కుదరకుంటే కల్లో

1.మకరందం గ్రోలుతా నీ మాటల్లో
తన్మయమే చెందుతా నీ పాటల్లో
బ్రతుకంతా విహరిస్తా నీ వలపుతోటల్లో
నీ వెంటే నడుస్తా ఆనందపు బాటల్లో

2.నిను నాయకి చేస్తా నా కవితల్లో
నీ సాంత్వన కోరుకుంట నా వెతల్లో
నిను దేవత చేస్తా నా గుండె గుళ్ళో
నే సేదతీరుతా నీ ఊహల ఒళ్ళో

Sunday, February 2, 2020

రచన,స్వరకల్ప&గానం:రాఖీ

ఇల్లే స్వర్గం-ఇల్లాలే దైవం
కాదని వాదిస్తే అభినవ నరకం
పెళ్ళే జైలు బ్రతుకు ఊడిగాలు
చచ్చేవరకూ తప్పదు జీవిత ఖైదు
రంభా ఊర్వశీ మేనక..
మనలేవు అలినే అలా భావించక..
ఇంద్రుడివైనా చంద్రుడివైనా నీవే గనక

1.బెదరగొట్టి మేల్కొలిపే సుప్రభాతాలు
అదరగొట్టి అందించే ఉప్మా చాయ్ నీళ్ళూ
చేస్తే చేయాలి చన్నీళ్ళ స్నానాలు
కుదరదంటు మొండికేస్తే ఆరోగ్యపాఠాలు
లొంగినట్టు ఉన్నామంటే ఫుడ్డైనా బెడ్డైనా
బెట్టుకాస్త చేస్తేగతి మఠమైనా రోడ్డైనా

2.చేదోడు వాదోడంటూ చేయదగని పనులెన్నో
అర్దనారీశ్వరుడంటూ మూతివిరుపు కథలెన్నో
అమ్మగారి షికారుకు డ్రైవరై కారుకు
మగనాలి పోరుకు అడుగడుక్కి బజారుకు
మూసుకొని ఉన్నామంటే అన్యోన్య దాపత్యం
సంసారం చెరిసగమంటే అర్థాంగిదె ఆధిపత్యం

Saturday, February 1, 2020

https://youtu.be/95kCzgko7kY

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:చక్రవాకం 

మృత్యుంజయా అపమృత్యువునరికట్టరా
శ్రీవైద్యనాథా పెడసర వ్యాధులనిక మట్టుబెట్టరా
నిన్ను శరణు వేడడం  వినా ఏమందును నీ వాడను
నీ నామజపం మినహా ఏ మందును వాడనే వాడను 
శంభోహరా శివశంకరా గంగాధరా అభయంకరా

1.తాళలేను ఏళ్ళకేళ్ళు ఈ వ్యాధిబాధలను
సైచలేను దినందినం వింత యాతనలను
జగత్పితవు నీవుకదా కావవేల తనయులను
కన్నతండ్రివీవె కదా మన్నన సేయవేల సుతులను
శంభోహరా శివశంకరా గంగాధరా అభయంకరా

2.కథలు కథలుగా నీ మహిమల విన్నాను
పరమదయాళుడ వని నమ్ముకున్నాను
ఇసుమంతయు లేదునాకు నీ ఎడల సంశయము
మనసావాచాకర్మణ నీ మీదనె నా ధ్యానము
శంభోహరా శివశంకరా గంగాధరా అభయంకరా


పిల్లకి చెలగాటం -ప్రియునికి ఉబలాటం
గిల్లీకజ్జాలతో అల్లరి బులపాటం
మల్లెల మొహమాటం-వెన్నెల ఆరాటం
తెల్లారిపోకుండా తపనల పోరాటం

1.తాకీ ఉడికించడం ఆపై ఊరించడం
అందీఅందకా ఎంత సతాయించడం
ఎంతో బ్రతిమాలడం ఇంకా బామాలడం
సతిమది మచ్చికకై వసుదేవుడు కావడం
మగనికెంత ఒప్పని పని పడతితో పడక
తప్పనిసరి  మగసిరి స్త్రీ గుప్పిటి చిలుక

2.నారిని సారించడం వద్దని వారించడం
యుద్ధభూమి చేరాకా శాంతిని బోధించడం
ముద్దులు కురిపించడం కౌగిట బంధించడం
సమ్మోహనాస్త్రాలనే గురిగా సంధించడం
మగువ తెగువ చూపితే యోధులకూ ఓటమే
మనసెరిగీ మసలుకొంటె ఉభయులకూ వాటమే

Friday, January 31, 2020

మూగవోయెనేలా నా మానసవీణ
రాగాలు మరిచిందేమో తన జీవితాన
మౌన భావాలే మదికి చేరేలా
కనులైన ఈవేళ ఎరుకపరచవేలా

1.మూలనే పడిఉందో తీగలే తెగిఉందో
శ్రుతులనే మరిచిందో ఒంటిగా వగచిందో
మధుర నాదాలే మాయమైపోయే
రసమయమౌ రావాలే దూరమైపోయే

2.అందలేని స్వర్గాలూ నిజంకాని స్వప్నాలూ
చెదిరిన తన ఊహలూ కరిగిపొయ్న కల్పనలూ
కలతలన్ని నలతలుగా యాతనపడుతోందో
కదలలేక మెదలలేక చతికిలపడిపోయిందో
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

విశాల గగనంలో  నీవూ
సాహితీరంగంలో నేనూ
రవివి నీవూ కవిని నేనూ
వెలుగులు పంచుతూ
మానవత పెంచుతూ

1.తరువుల ఎదగుదలకు నీవే ఊతమై
పశుపక్ష్యాదులకు జీవన దాతవై
నరజాతి మనుగడకే అపర విధాతవై
జగానికంతటికీ నీవే అధినేతవై
సూర్యనారాయణా వరలుతున్నావు
నిత్యపారాయణా చెలఁగుతున్నావు

2.నవరసాల మురిపించు నేస్తమై
సమసమాజ నిర్మాణాసక్తమై
వర్ణాభివర్ణిత యుక్త ప్రయుక్తమై
నిత్యకర్మానురక్త వాఙ్మయవేత్తనై
వాగ్గేయకారుడిగా మనగలుగేవాడనూ
సారస్వతవనమందున విరినైనాడనూ

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అతను: నా గాన కోకిలా గారాలు పోకిలా
రాగాల పల్లకిలో ఊరేగని నన్నిలా
ఆమె: నా వెండి వెన్నెలా  ఆమబ్బుల చాటేలా
కురియవే బ్రతుకంతా ప్రేమరుచిని చాటేలా

అతను:1.కిసలయాల మిసమిసలు నీ కోసం దాచా
ఆరారుకారులూ నిన్ను మాత్రమే తలచా
ఎడారిలో వరదల్లే నీ గానం అలరించు
ఏడాది పాటూ... అది నిన్నే తలపించు

ఆమె: కలువనై ఎన్నటికైనా నిను కలువగ జూచా
గ్రహణాలూ అమాసలెన్నో ఆర్తితో సహించా
నీ అమృతకిరణాలే నా పంచప్రాణాలు
కార్తీక పున్నమలెపుడూ నాకు వేణుగానాలు

అతను2.పట్టుబట్టి పాడమంటే బెట్టుచేతువేలనో
ప్రాధేయపడుతున్నా కనికరించవేలనో
గీతాలకు నేనెపుడూ ముగ్ధుడనై పోతాను
సంగీతమంటే చెలీ చెవికోసుకుంటాను

ఆమె:కోయిలకూ జాబిలికీ పొత్తుకుదురుతుందా
గీతమే నాకు ఊతం అందమే నాకు శాపం
అతను:చంద్రికకు గీతికకూ లక్ష్యం ఆహ్లాదమె కాదా
అభిమానమె కొలమానం అనుభూతియె బహుమానం

Ok

ఏం తింటున్నావో ఏం నంజుకుంటున్నావో
ఏం జుర్రు కుంటున్నావో ఏమాస్వాదిస్తున్నావో
మరులు మాగబెట్టి ఉంచా విందుకోసం
పరువమే పలావు చేసా ఇందుకోసం
సొగసులన్ని వండివార్చా నీకోసం
వలపులన్ని వడ్డిస్తా ఈ మధుమాసం

1.గోముగా చూసేచూపు గోంగూర పచ్చడి
ప్రేమగా నవ్వే నవ్వు ఉల్లి పెరుగు పచ్చడి
అలకనంత ఊరబెట్టి ఆవకాయ పచ్చడి పెట్టా
బిడియాన్ని పక్కనపెట్టి బిరియాని చేసిపెట్టా
సొగసులన్ని వండివార్చా నీకోసం
వలపులన్ని వడ్డిస్తా ఈ మధుమాసం

2.నిండు మనసుతో నేను బెండకాయ వేపుడు చేసా
మిసమిస నా వన్నెలతో సొరకాయ కూర చేసా
వంపు సొంపులన్ని కూర్చి గుత్తివంకాయ వండా
కరకర మని నమిలేలా మిరపకాయ బజ్జీ వేసా
సొగసులన్ని వండివార్చా నీకోసం
వలపులన్ని వడ్డిస్తా ఈ మధుమాసం

Thursday, January 30, 2020

పున్నమి నిశిలో నీవే శశివి
ఎన్నగ మేధకు నీవే నిశితవి
అన్నుల మిన్నా నీ మనసు వెన్న
కన్నుల దాచుకో సఖీ ననునీవెన్న

1.నీ ప్రతి ఉదయాన రవి నేనౌతా
నీ రస హృదయాన కవి నైఉంటా
పరసువేది నీవై నన్ను మార్చుకోరాదా
పరకాయవిద్యతో నాలొ చేరిపోరాదా

2.అలమటించు వేళలో ఆసరానౌతా
పలవరించువేళలో కమ్మని కలనౌతా
మూడుతో ముడివడి ఏడుగ తోడౌతా
ఏడేడు జన్మలకూ నీవాడిగ నేనుంటా
అతిసామాన్యమే నీ అందం అతివా
రతిదేవిలాగా నా మతిపోగొట్టితివా
గతిగానను నిను వినా ననుగను లలనా
తగనివానినా నను చేకొనవీవెందువలన

1.నిను ప్రేమించే నీ చెలికాడను
ఆరాధించే నీ ప్రియ భక్తుడను
నీ క్రీగంటి చూపుకైన నోచని వాడను
బ్రతుకంతా ధారపోయు నీ దాసుడను
గతిగానను నిను వినా నను గను లలనా
జవదాటను నీ మాటను నమ్మి చేయందుకొనుమ

2.ఎందరో నీకై పడిగాపులు పడెదరు
ఇంకెందరొ నీకు బ్రహ్మరథం పడుదురు
అనురాగం ఆలపించు వారెవరో ఎరుగవా
ఎదరాణిగా నీస్థానం ఎచటగలదొ గ్రహింపవా
గతిగానను నినువినా నను గను లలనా
ప్రతినిమిషమునీదిగా నా మనుగడ సాగుగా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నమ్మకుంటే నువ్వే ఓ పిచ్చి ఫకీరు
విశ్వసిస్తే సద్గురు దత్తుడికి నువ్వే మారుపేరు
అవధూతవు నీవూ షిరిడీ సాయిబాబా
అనాథనాథుడవు ద్వారకామాయివాసా

1.షిరిడీలో అడుగిడితే కష్టాలు దూరమౌను
మసీదు మెట్లెక్కితె సంతోషము చేరువౌను
భౌతికంగ లేకున్నా బాబా నీ ఉనికిని ఎరిగేము
సమాధినుండీ సమస్యలకు సమాధానమొందేము
పటమైనా శిలయైనా బాబా నీప్రతిరూపమే
పిలిచిన పలికేటి సాయి నువు ప్రత్యక్ష దైవమే

2.బాబా నిను శరణంటే ఆదుకొనుట సత్యము
బాబా నిను తలచుకొంటె నిబ్బరమే తథ్యము
మా వ్యాధులన్నిటికీ నీనామమె ఔషధము
నీపై భారం వేసిన చేర్చగలవు భవతీరము
నవనిధులను ప్రసాదించు కల్పవృక్షమే నీవు
శ్రద్ధ ఓర్మిల మాత్రం దక్షిణగా కోరుదువు
కలవడం అన్నది కలైతే ఖేదం
తొలగునా ఎప్పటికైనా మన మధ్య భేదం
కలిసినట్టె ఉంటుంది మన ఇద్దరి మనోగతం
కలతలేల తలపులలో కలగనీ ఆ మోదం

నాలోని లోపమేదో ఎరిగించమంటాను
పునర్నిమించి తత్త్వం సవరించుకొంటాను
ఎదలోన కాసింత చోటుకోరుకుంటాను
నేనంటూ మిగలకుండా నీవై పోతాను

చేరువగా  రావడానికి అంతజంకు ఏలనో
దూరమై మనలేకా చింత ఇంక ఏలనో
వద్దనీ అనలేవూ నా వద్దకూ రాలేవూ
లోలకమై అటూఇటూ ఊగిసలే ఆడేవూ

జలతారు ముసగుల్లో వెతలెన్నొ దాచేవు
చిరునవ్వు మాటున నొప్పినంత కప్పేస్తావు
గాయాలకు పూసే మలాం ఉంది నా కవితల్లో
గుండెమంట చల్లార్చే జల్లుంది నా గీతాల్లో
వేనోళ్ళ పొగడినా వేంకటేశ్వరా
విలాసాలు నీవెన్నో వివరించ తరమా
లక్షల పుటలతో  నీ కృతి లిఖియియించినా
నీ లీలలన్నీ కూర్చగ నా వశమా
సుందర వదనారవింద ఫణిపతి శయన
వందనమిదె మందార మకరంద మాధురీ వచన

1.వాల్మీకీ వ్యాసులు నారదాది మునివర్యులు
త్యాగయ్య అన్నమయ్య పురందరాది కవివర్యులు
పురాణాల నుడివినా పదముల నుతియించినా
ఒడవలేదు స్వామీ అతులితమౌ నీ మహిమలు
సుందర వదనారవింద ఫణిపతి శయన
వందనమిదె మందార మకరంద మాధురీ వచన

2.నేనెరిగినదెంత యనీ నీ చరితను వ్రాయనూ
నీ వరముల అనుభవాలు పొందలేదేనాడును
విన్నవీ చదివినవీ పుకారులై చెలఁగినవీ
ఎన్నుతు మన్నన జేతు దోషాలను మన్నించు
సుందర వదనారవింద ఫణిపతి శయన
వందనమిదె మందార మకరంద మాధురీ వచన

Wednesday, January 29, 2020

నువ్వొస్తే కవితలొస్తయ్
కవ్విస్తే వలపులొస్తయ్
అనురక్తినంతా రంగరిస్తాను
సరికొత్త రాగంతో ఆలపిస్తాను

1.హృదయానిదేముంది
ప్రాణమే ధార పోస్తా
ఏడడుగలు మాత్రమేనా
జన్మలేడు తోడొస్తా
నువ్వడిగితె ఏదైనా కాదంటానా
ఇవ్వ మనసు నీకెపుడు లేదంటానా

2.సరదాలతో సదా
సాగిపోనీ జీవితం
సరసాలు జాలువారి
తరించనీ ఏ క్షణం
మూడునాళ్ళైతేనేమి మన అనుబంధం
చిక్కుముళ్ళగామారి విప్పలేని చందం
https://youtu.be/MekAAxrMVzw

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఏనాడు అడగలేదు మా అమ్మని ఇదినాకిమ్మని
నోరు తెఱిచి కోరలేదు నా తల్లిని తీర్చగ అవసరాలని
ఆకలి నెరిగి వేళకు కొసరి తినిపించింది
నలతను తను గుర్తించి సేవలు చేసింది
జగన్మాతవే నీవు నా సతి సుతులూ నీబిడ్డలే
నాకేల ఆరాటం గతిగానగ మా మంచిచెడ్డలే

1.నిజముగ మే రుజలబడి కడదేరమందువా
యాతన మాపేటి చికిత్సలో నీవే మందువా
సంతోషము దుఃఖము అన్నీ నీకంకితము
వేదనలో మోదములో నీతోనే జీవితము
జగన్మాతవే నీవు నా సతి సుతులూ నీబిడ్డలే
నాకేల ఆరాటం గతిగానగ మా మంచిచెడ్డలే

2.నువు చేసే కర్తవ్యం నేను గుర్తుచేయాలా
నీ చర్యల ఆంతర్యం నేను రచ్చ చేయాలా
అనుభవమూ వ్యక్తీ కర్మఫలము వేరుగా తోయగా
సర్వం నీవను సత్యం మరువ మాయలో తోయగా
జగన్మాతవే నీవు నా సతి సుతులూ నీబిడ్డలే
నాకేల ఆరాటం గతిగానగ మా మంచిచెడ్డలే

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:చంద్రకౌఁస్

ఓనమాలు ఆనాడే వేలుపట్టి నేర్పితివి
మంచి చెడ్డలేవో ఎంచగ బోధించితివి
వసంత పంచమినాడుదయించిన విద్యాదేవి
విరించి నెచ్చెలీ నమోస్తుతే విపంచి వాదన వినోదిని

1.బాసరలో వెలిసావు జ్ఞాన సరస్వతిగా
కాశ్మీరున నెలకొన్నావు ధ్యాన సరస్వతిగా
అనంతసాగర గిరిపై  నిలిచావు వేద సరస్వతిగా
వర్గల్ లో వరలుతున్నావు విద్యా సరస్వతిగా
శృంగేరి పీఠాన వెలుగొందే శారదామణీ
విరించి నెచ్చెలీ నమోస్తుతే విపంచి వాదన వినోదిని

2.తెలివి తేటలన్నీ నీ  ప్రసాదమ్ములే
కళానైపుణ్యాలు  నీ కరుణా దృక్కులే
వాక్చాతుర్య పటిమ జననీ నీ వరమేలే
సాహితీ ప్రావీణ్యత నీ చల్లని చూపువల్లే
హంసవాహినీ పరమానంద దాయినీ
విరించి నెచ్చెలీ నమోస్తుతే విపంచి వాదన వినోదిని

Tuesday, January 28, 2020

OK

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఎందరో ఉంటారు అందగత్తెలు
ఇంకెందరో ఉంటారు సుందరాంగులు
ఇందువదన నిను పోల్చగ లేరెవరూ ఇలలోన
గజగమన నిజము తెలుప నీకు నీవె తులన

1.నీ కళ్ళలోన కనిపించును ఇంద్రనీల మణులు
నీ గొంతులొ వినిపించును గంధర్వ వీణలు
నీ రూపలావణ్యం మునులకైనా  మైకం
నీ హాస సౌహార్ద్రం అనితర సాధ్యం

2.కనుసైగతొ నిర్వహించె నీ విన్యాసం
తేనెల పలుకులతో నీ వాక్చాతుర్యం
పడిపోని వాడెవడే నీ మాయలోన
దాసులు కానిదెవరు నీకు ఈ జగాన
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీ అలక కూడ మరులు గొలుపు చిలుకల కొలికి
నీ తలపులన్ని తపన రేపు నా వగరు వలపుకి
బుంగ మూతి సైతం అందమొలుకుతోంది
కంటి జీర తోనూ కాంక్ష ప్రబలుతోంది
లలనా మనగలనా నువు చెంతలేకా
చెంగల్వ కనులదానా నీ ఒడిని చేరుకోనా

1.తిరుగాడుతూనె ఉంటా నీ నీడ వెంట వెంట
చుబుకాన్ని పుచ్చుకుంటూ బ్రతిమాలుతూనె ఉంటా
నీ మనసు నొచ్చుకుంటే నే లెంపలేసుకుంటా
 కాదుపొమ్మన్నంటెనీ జడకురిబోసుకుంటా
మగువా ఇంతబిగువా పట్టువిడుపులేదా
మరుడే  ఉసిగొలిపే నా జట్టుకట్టలేవా

2.ఎదురు చెప్పినానా నీ మాటకెన్నడైనా
తీర్చినాను కాదే గొంతెమ్మకోర్కె నైనా
సరదాలు నేరమౌనా సరసాలు భారమౌనా
మారాము మాన్పజేయనాకిక కాళ్ళబేరమేనా
తరుణీ నన్నే  కరుణించు తరుణమేదో
రమణీ నీ మదినే గెలిచేటి కిటుకు ఏదో

Thursday, January 23, 2020

https://youtu.be/PYJj0bTCNlQ

స్ఫురించనీ చప్పున నీ నామం
నీ మెప్పునొందనీ  గొప్పగ నా గానం
హరహర హరహర మహదేవా
శంభోశంకర సదాశివా
నమః పార్వతీ పతయే ఈశా
గంగాధరహే సాంబశివా


1.సతీదేవినే వరియించి ప్రేమకు అర్థం తెలిపితివి
అవమానముతో ఆహుతికాగా ధర్మపత్నికై విలపించితివి
యజ్ఞశాలనే భగ్నముజేసి వీరభద్రుని నర్తించితివి
ఆగ్రహమ్ముతో రుద్రరూపమున దక్షుని తలనే త్రుంచితివి
ఎరిగించరా  నీతత్వము ఎరుకగలిగినా పరమశివా
రాగద్వేషము నీకూ కలవా నీవూ మా వలె మనిషివా

2.గౌరీసంకల్పమూర్తినీ ప్రియమౌ మానస పుత్రుని
బాలకుడని నీవెంచకనే తొందరపాటున దునుమాడితివి
విగతజీవునకు గజశిరమతికి ప్రాణంపోస్తివి గణపతికి
తారక సంహార కుమరునికై ఏమార్చిన మరుడిని కాల్చితివి
ఎరిగించరా  నీతత్వము ఎరుకగలిగినా పరమశివా
రాగద్వేషము నీకూ కలవా నీవూ మా వలె మనిషివా

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

మరువని జ్ఞాపకమా
వరమైన శాపమా
దినదినమొక నూరేళ్ళుగా
గడుపుతున్న నా జీవితమా

1.గుడిలోని ధ్వజస్తంభ
చిరుగంటల సాక్షిగా
సనసన్నని నీ నీవ్వులు
నా వీనుల మ్రోయునే

కూలిన ఆ గడిగోడల
ప్రాభవాల మాటుగా
మనకలయిక కుడ్యమై
ఎప్పటికీ నిలుచులే

జారిన అశ్రుకణమా
విగతమైన ప్రాణమా
కొడిగట్టిన దీపికగా
మలిగే భవితవ్యమా

2.గోదావరి అలలునేడు
మన గురుతులనే పాడు
గున్నమావి గుబురుతోట
మన గాథలనే తెలుపు

కోనేటి మెట్లుకూడ
అనుభూతులనెన్నొ పంచు
విధి వింత గారడితో
బ్రతుకులేలనో త్రుంచు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

నీటి బుడగ జీవితము
పాము పడగ ప్రతి నిమిషము
నీ సాయము లేనిదే సాయీ
మనుగడయే గగన గండము
అండదండనీవే అఖిలాండనాయకా
సాష్టాంగ దండము నీకు బ్రహ్మాండ పాలకా

1.ముంచెత్తే కెరటాలు-ఆటంకాలు
మ్రింగజూచే తిమింగలాలు జరామరణాలు
ఈతరాని నాకు చేయూతనీవె సాయీ
చతికిలపడు నాకు విశ్వాసమీవె సాయీ
అండదండనీవే అఖిలాండనాయకా
సాష్టాంగ దండము నీకు బ్రహ్మాండ పాలకా

2.భవ జలధిని దాటించే సరంగునీవే
అనుభవ గుణపాఠాల గురువు నీవే
కడదాకా తోడుండే మిత్రుడ వీవే సాయీ
కన్నీళ్ళను తుడిచేటి ఆప్తుడవీవే సాయీ
అండదండనీవే అఖిలాండనాయకా
సాష్టాంగ దండము నీకు బ్రహ్మాండ పాలకా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అచూకి చెప్పండి మిత్రులారా
కనుమరుగైపోయిన మానవత్వానిది
వెదకి కాస్త కనిపెట్టండి నేస్తాల్లారా
మిగిలుందేమో ఆర్ద్రత హృదయాల్లోనా
నరులుగ ముసుగేసుకున్న పైశాచిక మూకలు
మనుషులుగా పిలువబడే నరరూప రాక్షసులు

1.ఎవరికి వారైనతీరు అత్యంత హేయమై
కన్నవారినొదిలేయగ కడుదయనీయమై
ఎక్కడికక్కడ బ్రతుకులు స్వార్థపూరితమై
అనుబంధాలన్నవే పూర్తిగా  అర్థరహితమై
మాయమైపోయింది మనుషుల్లో మానవతా
అడుగంటిపోయింది గుండెల్లో ఆర్ద్రతా

2.స్త్రీ అన్నది కేవలం ఒక భోగ వస్తువై
విచ్చలవిడి తత్వమే జనులకు అనురక్తియై
వావి వరస వయసెంచని మృగత్వకృత్యమై
ఆకాశంలో సగమన్నది ఊహకు పరిమితమై
తప్పిపోయెనెక్కడో లోకంలో మానవత
ఇంకిపోయిందీ మనసుల్లో ఆర్ద్రతా

3.కులం మతం కత్తెరలై బంధాలను కత్తిరిస్తు
భాషలూ  ప్రాంతాలూ సరిహద్దుల గీతగీస్తు
జాతీయభావననే అనుక్షణం గేలిచేస్తు
సమైక్యతా రాగాల పీకలు నులిమేస్తూ
చరిత్రగా మారింది ప్రపంచాన మానవత
ధరిత్రలో కరువైంది చెమరించగ ఆర్ద్రత

OK
రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:భూపాలం

వేకువ జామాయే వేంకటేశ్వరా
వేగిరమే మేలుకొనీ మాకు మేలుకూర్చరా
అలమేలు మంగమ్మ అపుడే లేచిందీ
ఇల జనులకు సిరులనొసగ తలమునకలుగానుంది

1.నారదాది మునులంతా బారులు తీరారు
ఇంద్రాది దేవతలూ ఆత్రుతతో నిలిచారు
వాగ్గేయకారులంత గీతాలతొ పొగిడేరు
నీ భక్తవరులూ గోవింద ధ్వానాల మునిగారు

2.అభిషేకమొనరించ గంగమ్మ వేచింది
పట్టుపీతాంబరాల పద్మావతి పట్టుకొంది
పారిజాత పుష్పాలను శచీదేవి తెచ్చింది
హారతినీకీయగా భారతియూ వచ్చింది

3.శుభములనొనగూర్చరా జగమునకెప్పుడు
కలతల పరిమార్చరా కలివరదా ఇప్పుడు
మాపై కురిపించరా నీ కరుణను గుప్పెడు
మానవతే నినదించనీ మా గుండె చప్పుడు

Thursday, January 16, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

స్పందన లేదు-అభినందన లేదు
డెందములో అనుబంధం లేదు
వ్యక్తిగా  ఏ నియంత్రణ లేదు
మనిషిగా మనిషిపై మమకారం లేదు
ఏదీ లేక బ్రతికే బ్రతుకు ఎంతటి చేదు

1.ఇంతకు మించినదేదో జీవితమన్నది ఒకటుంది
అప్పచ్చులకే ఆశపడ్తె విందుభోజనం అందకుంది
వాట్సప్పొక మహమ్మారి ఫేస్బుక్కొక మాయలాడి
సోషల్ మీడియానే ఓ పనిలేని సోంబేరి
బాంధవ్యాలు భారమాయే స్నేహితాలు దూరమాయే
మిథ్యా ప్రపంచమే వదలలేని వ్యసనమ్మాయే

2.ప్రాధాన్యతలు మారిపోయే ఆప్యాయతలు కరువాయే
పక్కనున్నా పలుకలేక సంక్షిప్త సందేశమాయే
భాషకాస్త కురచనాయే వింత మూగ సంఙ్ఞలాయే
వద్దుపొమ్మని మొత్తుకున్నా చెత్తంతా భరించుడాయే
తక్షణమే ఉన్నఫళంగా ఉపహరించుకొంటే మేలు
మనదైన వాస్తవలోకం అనుభవించితే ఆనందాలు


Wednesday, January 15, 2020


ఇల్లిల్లు బిచ్చమెత్తు శివుడవు నీవు
పాదాల గంగ పుట్ట శ్రీ హరి నీవు
కప్నీ ధరించిన దత్తాత్రేయుడవు
సకల దేవతా స్వరూపుడవు
సాయీ నీవు ఇలలోన ప్రత్యక్షదేవుడవు
కోరినదొసగే కల్పవృక్షమే నీవు

1.దుర్గుణాల పరిమార్చే లయకారుడవు
సదమలవృత్తిని పోషించే జగములనేతవు
పరమపదము నందించే జగద్గురుడవు
సకల దేవతా స్వరూపుడవు
సాయీ నీవు ఇలలోన ప్రత్యక్షదేవుడవు
ఇడుములనెడబాపే చింతామణి నీవు

2.కల్లాకపటమెరుగని భోళాశంకరుడవు
అల్లాహ్ మాలిక్ అని నుడివే ఆత్మానందుడవు
చనిపోయీ బ్రతికొచ్చిన ఏసుక్రీస్తు వైకల్పుడవు
సకల దేవతా స్వరూపుడవు
సాయీ నీవు ఇలలోన ప్రత్యక్షదేవుడవు
కామితార్థమందించే కామధేనువే నీవు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:రేవతి

పయనించు పయనించు ఏకాగ్ర చిత్తుడవై
నీ పయనం సాగించూ అంతర్ముఖుడవై
నీ లోకి లోలోకి లోలోకి పయనించు
అలుపెరుగని నదిలా మదిలోకి ప్రవహించు

1..కోల్పోతున్నదేది అప్పుడు గ్రహించము
చేజార్చున్నదాన్ని ఏమిచ్చీ పొందలేము
ఒంటరివే ఎప్పటికీ ఏకాంతమె నీ వాసము
క్షణికమైన వాటికొరకు వెచ్చించకు సమయము

2.గమ్యం ఒకవైపు నీ గమనం ఒకవైపు
ఎంతగా నడచినా చేరవు లక్ష్యం వైపు
నీతో నీవే సంభాషించు నీలో నీవే సంగమించు
తరించు అంతరించు నేనే గా అవతరించు

OK



తొలిసారి చూసింది నిన్ను
లక్ష్మీనరసింహస్వామి మందిరాన
అచేతనమైపోయింది నా కన్ను
సిరిలా నువు ఎదురైన ఆక్షణాన
తక్షణ వీక్షణలోనే నిను మనసా వలచితి
హరిణేక్షణ నీసరి వివరాలెరుగనైతి
అలరించినావే లలిత లావణ్య లలనా
గీతవై జీవనదాతవై నను నడిపే నేతవై

వికసిత అరవిందాననము
చెంగల్వరేకు నయనద్వయము
చెక్కళ్ళ సొట్ట సొబగు బాగుబాగు
అరవిరిసిన చిరునగవు అందాలుపోగు
నాకొరకే జన్మించిన సౌందర్యలహరి
అర్ధాంగిగ చేకొను వరమందితినే కోరి
ననుచేరినావే లలిత లావణ్య లలనా
గీతవై జీవనదాతవై నను నడిపే నేతవై

కాలుమోపావు మదిలో అమాయకంగా
ఆక్రమించావు నా జీవితమే నీదనేంతగా
అణకువ ఐనవారిఎడల ఆప్యాయత
సంతరించుకున్నావు ఎనలేని ఆదరణ
సఫలీకృతవైనావు షట్కర్మయుక్తగా
సామాజిక బంధాలకు సంధానకర్తగా
పెనవేసినావే లలిత లావణ్య లలనా
గీతవై జీవనదాతవై నను నడిపే నేతవై

తొలిసారి చూసింది నిన్ను
లక్ష్మీనరసింహస్వామి మందిరాన
అచేతనమైపోయింది నా కన్ను
సిరిలా నువు ఎదురైన ఆక్షణాన
తక్షణ వీక్షణలోనే నిను మనసా వలచితి
హరిణేక్షణ నీసరి వివరాలెరుగనైతి
అలరించినావే లలిత లావణ్య లలనా
గీతవై జీవనదాతవై నను నడిపే నేతవై

Tuesday, January 14, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఈ సాయం సమయమున
నీ సాయం కోరితి ఓ యమున
ఓపలేని విరహమాయే నా హృదయమున
విహరించనీ రాసవిహారితో అనునయమున

1.గోకులమున కూడబోవ గోపికలతొ గొడవాయే
మథురలోన కలవబోగ కులకాంతల కలహమాయె
బృందావని కాంచబోవ రాధమ్మే తయారాయే
గోవిందుని పొందగ రాయంచ నావయే త్రోవాయే

2.నీ అలల తేలియాడ ఊయల సుఖమాయే
నీ మంద చలనమున డెందమొందు రతిహాయే
సాగనీకు గమనము పదపడి కడు రయమున
కాలమాగిపోని జగమే కదలక ఇదే ప్రాయమున
పలకరిస్తే పులకరిస్తా -కనికరిస్తే కలలోనూ కలవరిస్తా
చిరు నవ్వులు చిలకరిస్తే-మనసారా నే మురుస్తా
కినుక ఉన్నచోట-వినిపించదా ప్రేమ పాట
కోపాల ముళ్ళు దాటితె-గులాబీల పూదోట

1.అలిగినా కూడ అతివ అందమే
ముడిచినా కూడ మూతి చిత్రమే
రోజంతా మజా మజాయే గిల్లికజ్జాలతో
రేయంతా జాగరణయే వేడి నిట్టూర్పులతో
నిశ్శబ్దం బద్దలు కొడదాం
ఏకాంతపు హద్దులు తడదాం
ఊహలతో స్నేహంచేసి మొహమాటం ఆవల నెడదాం

2.తప్పుకొని పోగలవా తలలోనే తిష్ఠవేశా
కాదుపొమ్మనగలవా ఎదనెదతో ముడివేశా
నిజమైన స్వర్గమన్నది నీ సన్నధిలోనే
జీవితాన సౌఖ్యమున్నది నీ బంధం లోనే
సమయాన్ని వేడుకుందాం
ప్రాయాన్ని బతిమాలుకుందాం
కలయికలో ఆగిపొమ్మని విరహములో కరిగిపొమ్మని

Saturday, January 11, 2020

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

చతురానన అతులిత సృజన
శ్రీనాథ కవిసార్వభౌమ కల్పన
గంధర్వ  లోక అపూర్వ స్వప్న గీతిక
రవివర్మ లేఖనీ అనూహ్య దివ్య చిత్రిక
నీ సావాసమే చెలీ అపురూప అనుభవం
నీ సహచర్యమే సఖీ అద్వైత సంభవం

1.నిను వర్ణించలేక నా కలమే తడబడింది
ఉపమానమె కరువై ఉన్మత్త అయ్యింది
పదములు కొరవడి నిఘంటువే తలొంచెలే
గత సారస్వతమే నిను గని విభ్రమించెలే
నీ సావాసమే చెలీ అపురూప అనుభవం
నీ సహచర్యమే సఖీ అద్వైత సంభవం

2.మేలి ముసుగు జారనీకు భూభ్రమణ మాగునేమొ
క్రీగంట చూడబోకు జాగరణే మునులకూ
చిరునవ్వూ రువ్వకూ చిత్తాలే చిత్తవునూ
మేని విరుపు మెరుపుల్లో ఊపిరులిక ఏమవునూ
నీ సావాసమే చెలీ అపురూప అనుభవం
నీ సహచర్యమే సఖీ అద్వైత సంభవం

Friday, January 10, 2020

నిరాశేగా నాకు ప్రాప్తం-నిరామయం ఇక జీవితం
ఊహలన్ని పాతిపెట్టి-గాలిమేడలు కూలగొట్టి
 బ్రతకలేక జీవశ్చవమై-చావలేకా నిత్యం హతమై
నెట్టుకెళ్ళాలి చచ్చేవరకు-వేచిచూడాలి చావొచ్చేవరకు


1.నా రచనలన్నీ నిన్నుటంకించేవే
నా గీతాలన్నీ నిను ప్రతిఫలింప జేసేవే
చిన్నగానైనా వెన్నుతట్టలేదెపుడు
మాటవరసకైనా నన్నుమెచ్చలేదెపుడు
నాది కవితే కాదన్నావు-నాకు భవితే  లేదన్నావు
ఎందుకే నాచెలీ చులకనగా చూస్తావు
గడ్డిపోచలాగా జమకట్టివేస్తావు

2.నిన్ను వర్ణించుటలో నేనోడిపోయాను
ఆకట్టుకొనడంలో విఫలమై పోయాను
ఆర్భాటలకే నువులొంగిపోయావు
అట్టహాసాలకే కట్టుబడిపోయావు
భావుకతకు చోటేలేదు-సృజనకైతే విలువే లేదు
పైపైమెరుగులకే పట్టం కడతావు
నను నన్నుగా ఎప్పుడు చేపడతావు

ఎలా నిను మెప్పించనూ -ఏమని నేనొప్పించనూ
అన్నీ తెలుసుననుకోనా-ఏదీ ఎరుగవని నేర్పనా
మనసు మనసు తో పలికే భాష ఏదో
కనులు కనులతో తెలిపే భావమేదో


1.అమాయకం అనుకోలేను గడసరివి నీవైతే
అయోమయం అనిఅనలేను లౌక్యమెంతొ నీకుంటే
నటనలందు నీవు ఘటికురాలివే
నాట్యమందు నీవు వనమయూరివే
నన్నేమార్చ చూస్తావు నా ఏమరుపాటులో
కొమ్మలుచాటు చేస్తావు నీ కమ్మని పాటల్లో
చాలించవే నీ సయ్యాటలు
ఆపేయవే నీ దొంగాటలు

2.జలతారు మేలి ముసుగులో అందాలు కననీవు
నీ కిలకిల నవ్వులతో ఎద సవ్వడి విననీవు
ఎక్కడో గిల్లుతావు ఎరుగనట్టె ఉంటావు
వలపునెంతొ చల్లుతావు మౌనంగ ఉంటావు
గుండెల్లోన పగలే రేగే దహించగానన్ను
రేయంతా కలలై సాగి స్మరించే నిన్ను
చెప్పబోకు నాకు నమ్మలేను కథనాలు
విప్పిచూపు నాకు మదిలోని మర్మాలు
ఎద కదులు కారణం నువ్వు-నా కవిత తోరణం నువ్వు
ఉండబోకు గుండెకు దవ్వు-దండిగా నవ్వులు రువ్వు
నీ సావాసమే పారిజాత పరిమళము
నీ సాన్నిధ్యమే ఉత్పేరక సుమశరము
కనుమరుగై పోకుమా నా నేస్తమా
నిను వీడి మనలేనూ నా మిత్రమా

1.కౌముదిని కనలేకా  కలువలకు మనుగడ యేది
జాబిలిని కోరలేకా చకోరాల బ్రతుకేదీ
నింగికాస్త మెరవాలంటే మబ్బు మబ్బు తాకాలి
మబ్బుమురిసి కురవాలంటే పవనమల్లుకోవాలి
తెలుసుకో నేస్తమా ప్రకృతి సత్యం
ఎరిగి మెలుగు మిత్రమా మన స్నేహితత్వం

2.కిసలయాల రుచిగనక పికమునకు సుఖమేది
మృణాళికల గ్రోలకనే కలహంసకు గతియేది
నెమలి నాట్యమాడాలంటే మేఘావృతమవ్వాలి
రామచిలుక పలకాలంటే మెత్తగా దువ్వాలి
తెలుసుకో నేస్తమా ప్రకృతి సత్యం
ఎరిగి మెలుగు మిత్రమా మన స్నేహితత్వం

Thursday, January 9, 2020

భరతమాత బిడ్డగా గర్వకారణం
భరతజాతి జగతికే మకరతోరణం
నా దేశమే ఓ సందేశము
విశ్వశాంతే ఉద్దేశ్యము
నాగరికత మూలము వేదాలకాలవాలము
తులతూగదు ఏ దేశము ప్రపంచవ్యాప్తము

1.సున్నాను అందించెను నాదేశ గణితము
అనాదిగా ఎదిగెనునా ఖగోళశాస్త్రము
ఆయుర్వేదములో మిన్నే నా వైద్యరంగము
లోకమునే మేల్కొలిపెను నా దేశ విజ్ఞానము
నాగరికత మూలము వేదాలకాలవాలము
తులతూగదు ఏ దేశము ప్రపంచవ్యాప్తము

2.సంస్కృతి సభ్యత నాదేశపు ఆనవాళ్ళు
కళకు పట్టుగొమ్మలే నా దేశపు లోగిళ్ళు
గీతా ఆధ్యాత్మికతా బోధించిరి  నావాళ్ళు
ఐక్యతతో ఎదుర్కొంది ఎన్నెన్నో సవాళ్ళు
నాగరికత మూలము వేదాలకాలవాలము
తులతూగదు ఏ దేశము ప్రపంచవ్యాప్తము
https://youtu.be/VRdIxjXul9Q

ఆనందమీయకుంటె మానె
ఏ సంపద నొసగకున్ననూ సరే
జీవితాన అంతరంగ రంగశాయీ
అనాయాస మరణమె దయసేయీ
వేంకటేశ్వరా నీకు జయము జయము జయము
వేదవేద్యా గొనుము హృదయనీరాజనము

1.నే నాచరించు స్నానం నీ అభిషేకం
నే పలికే ప్రతి వచనం నీ నామ సహస్రం
నేనారగించు సాధు భోజనం నీ నైవేద్యం
నా ఎదచేసే నాదం నీ మంగళ గానం
వేంకటేశ్వరా నీకు జయము జయము జయము
వేదవేద్యా గొనుము హృదయనీరాజనము

2.అజామీరుడవనీ నను అవసానమందు
అన్నమయ్యనవనీ నీ పదకవనాలందు
శేషప్పనవనీ నిను చేరి కొలుచుటకొరకు
తొండమానుడనవనీ దండిగా సేవించుటకు
వేంకటేశ్వరా నీకు జయము జయము జయము
వేదవేద్యా గొనుము హృదయనీరాజనము

OK




రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం: ఆనంద భైరవి

పొగిడితేనొ పొంగిపోవూ
తెగడితె పట్టించుకోవూ
ఎలానిన్ను మెప్పించనూ సాయీ
నీ దృష్టినెలామరలించను నాపై
సమర్థ సద్గురునాథా యోగిరాజ షిరిడీనాథా

1.ప్రతిరోజు నీ పటముకు మ్రొక్కుతుంటాను
గురువారం మాత్రం నీగుడికెడతాను
వాకిలి నుండైనా వరుసతప్పివేసైనా
చక్కనైన నీరూపం దర్శించుకొంటాను
విభూతి నానుదుటన కాస్తైన పూస్తాను
తీర్థమూ ప్రసాదము తప్పక గైకొంటాను
ఎలానిన్ను పూజించను సాయీ
నీ దృష్టినెలామరలించను నాపై
సమర్థ సద్గురునాథా యోగిరాజ షిరిడీనాథా

2.నీ పేరుమీద నేను సేవలెన్నొ చేస్తాను
అన్నసంతర్పణలో పాలుపంచుకొంటాను
చిల్లెరనాణాలనూ దానం చేస్తాను
నూరో యాభయో చందాగ రాస్తాను
రూపాయి పెట్టుబడితొ కోట్లుకోరుకుంటాను
అయురారోగ్యాలు ప్రసాదించమంటాము
 ఎలానిన్ను సేవించనూ సాయీ
నీ దృష్టినెలామరలించను నాపై
సమర్థ సద్గురునాథా యోగిరాజ షిరిడీనాథా
నమ్మవే నా ముద్దుగుమ్మా
నీవేలే బాపూకుంచె మలిచే సొగసుల కొమ్మ
అతిశయమే కాదులే అన్నుమిన్నా
నీవేలే అల్లసాని కావ్యనాయకివమ్మా

1.చెలరేగే ముంగురులే చిలుకుతాయి సింగారాలు
కుప్పెలతో ఒప్పుజడే ఒలుకుతుంది నయగారాలు
తురుముకున్న మల్లెమాలే రేపుతుంది మరులెన్నో
నుదుటన మెరిసే పాపిటబిళ్ళే చెపుతుంది ఊసులెన్నో

2.వెన్నెలంటి మేనిఛాయ కన్నుతిప్పనీకుంది
నాగావళి వంపులున్న నడుము మదిని తడుతోంది
తమలపాకు పాద సొబగు తలవంచగ చేస్తోంది
అణువణువూ నీ తనువూ నన్ను పరవశింపజేస్తోంది

Wednesday, January 8, 2020

https://youtu.be/ouYQAUC3oUs

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మోహన

పాతకాలుచేసితినో-తెలిసి తెలియకా
ఘాతుకాల నొడగట్టితినో
దోషములొనరించితినో నీ ఎడల
దూషణలే నుడివితినో
పరమశివా హే పరమ దయాళా
ఐనను మన్నించరా నను మన్నన సేయరా

1.అధముడనో నేను ఘోర దురాత్ముడనో
గతజన్మలలోనూ ఈ జన్మయందునను
ఉచితానుచితముల యోచించకుంటినో
మితిమీరిన గర్వము వ్యవహరించుచుంటినో
శివునాజ్ఞలేకా చీమైనా కదలదందురే
జగమంతా నీ ఆటకు రంగస్థలమందురే
నటరాజేశ్వరా రాజరాజేశ్వరా
అందుకు మన్నించరా నను మన్నన సేయరా

2.విషసర్పమైనను గరిమ హస్తియైనను
కీటక భక్షి ఆ సాలెపురుగు నైనను
నిర్దయగా వేటాడే తిన్నడినైనను
క్రూరకర్మలొనరించే దైత్యులనైనను
కనికరముతొ వరములనిడి కరుణించితివి
ఆదుకొని ఆదరించి నీ అక్కునజేర్చితివి
కాళహస్తీశ్వరా హేభోళా శంకరా
ఆ విధి మన్నించరా నను మన్నన సేయరా
కానేరదు మన కలయిక నమ్మశక్యము
నా ఊసే నీ మనసున కాదు ముఖ్యము
నీ పాటి లేనెలేదు నాకు లౌక్యము
ఎండమావె నా బ్రతుకున ఎప్పటికీ సౌఖ్యము

1.ఉడికించడం నీకు పరిపాటే
ఊరించడం నీ కలవాటే
ఆశాభంగమవగ నా గ్రహపాటే
నెగ్గించుకుంటావు నీమాటే

2.ప్రేమంటే నీకుతోలుబొమ్మలాట
నా గుండెతోటి ఆడేవు బంతాట
చేయబోకు మనబంధం నవ్వులాట
భగ్నహృదయమెప్పటికీ ఆరనిమంట

Tuesday, January 7, 2020

అందియగా అందించితి నీపాదానికి
నా గుండియని
తివాచీగ పరిచితిని నీ మార్గానికి
నా హృదయాన్ని
పట్టించుకోవేల ఓ ప్రియతమా
నిను ఆరాధించడమే నా నేరమా

1.ఏ రీతిగ నీ ప్రేమను నే పొందగలనూ
నా నియతిని ఏ విధముగ నిరూపించగలనూ
మనసుపెట్టిచూడూ
నా మనసుతొ మాటాడూ
గ్రహించగలవు నా ఎదలోని సొదలు

2.కీలుగుర్రమెక్కించి వినువీథుల తిప్పనా
ఉద్యానవనాలలో విహరింప జేయనా
కలలో  వచ్చిచూడు
మన కలలన్ని పండేనూ
కలకాలం కలిసుండగ నినుకోరేనూ

పేరుకు భద్రకాళివి-రూపుకు మహాకాళివి
జగములనేలు తల్లివి-వరముల కల్పవల్లివి
వందనాలు నీకివే కంజదళాయతాక్షి
శరణాగతినీయవే శాంభవి నారాయణీ

1.అష్టభుజాలున్నవికద మమ్మాదుకొనగా
దుష్టశక్తులన్నిటిని దునుమాడగా
తాత్సారము వలదమ్మా త్రైలోక్య పావని
వెతల ద్రుంచి వేడ్క దీర్చు చిదానందిని సదానందిని
వందనాలు నీకివే కంజదళాయతాక్షి
శరణాగతినీయవే శాంభవి నారాయణీ

2.అడ్డు అదుపులేదా మా కష్టాలకూ
గడ్డుకాలమెందాకా మా బ్రతుకులకు
దొడ్డమనసు నీకుందని మరిచితివా రుద్రాణీ
బిడ్డలమే గద జననీ మము బ్రోవవె దాక్షాయణి
వందనాలు నీకివే కంజదళాయతాక్షి
శరణాగతినీయవే శాంభవి నారాయణీ





కారని కన్నీటి చుక్క నాన్న
ఆరని గుండె మంట నాన్న
గాంభీర్యం పులుముకున్న నాన్న
ఔదార్యం వంపుకున్న నాన్న
నాన్నంటే తీరాన్ని చేర్చే నావ
నాన్నంటే ముళ్ళను ఏరేసిన త్రోవ

1.ఇంటిల్లి పాదిలో ఒంటరితానై
క్రమశిక్షణ పేరిట అందరిలో వేరై
అణగద్రొక్కుకున్న అనురాగమై
అలకలవెనకన  తను త్యాగమై
నాన్నంటే  నచ్చనీ మందలింపురా
నాన్నంటే గుచ్చుకునే అదిలింపురా

2.అవసరాన్నిడిగితే అది ఒక వరమై
అదుపుతప్పునేమోయను కలవరమై
ఎండకూవానకూ తడిసిన గొడుగై
బంగారుభవితకు తానే ముందడుగై
నాన్నంటే కుటుంబం వెన్నెముకేరా
నాన్నంటే నాటికకూ తెరవెనుకేరా



రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అమ్మ మొదటి దేవత
ఆవు మహిని పునీత
ఇల్లేకద ఇలలోన స్వర్గసీమ
ఈశ్వరుని దీవెనలు అందుకొనుమా

1.ఉడతాభక్తిగా దానమీయుమా
ఉన్నదాంతొ తృప్తిపడీ జీవించుమా
ఊగిసలాడకూ ఊహల ఊయలలూగకూ
ఋణముల పాలబడక ఋషిలా మనగలుగూ

అమ్మని గౌరవించు అది ధర్మార్థం
ఆవుని పెంచుకో అది పురుషార్థం
ఇల్లును నిర్మించుకో నీ కామ్యార్థం
ఈశ్వరునీ ధ్యానించుకో మోక్షార్థం

2.ఎవరు ఏది చెప్పినా వినుట నేర్చుకో
ఐశ్వర్యమె నశ్వరమని  ఎరిగి మసలుకో
ఒదిగి ఉండు ఎప్పటికీ ఎంత ఎదిగినప్పటికీ
ఓరిమి చేకూర్చునూ ఔన్నత్యము మనిషికీ

అమ్మను ఆదరించు ముదిమిలో
ఆవుని పూజించు అవనిలో
ఇల్లాలిని పిల్లలను కళ్ళల్లొ పెట్టి చూసుకో
ఈశ్వరునీ దర్శించుకొ నీ ఆత్మలో

"తెలుగింటి సంక్రాంతి"

సకినాల పండగ సంకురాతిరి పండగ
పంటలన్ని పండగ గాదెలెన్నొ నిండగ
తెలుగునాట ఆనందాలు పండగ
రవి చిమ్మును కొత్తకాంతి దండిగ

1.కళ్ళాపి జల్లిన పచ్చనైన వాకిళ్ళు
ఇంటింటి ముంగిట ముగ్గులు గొబ్బిళ్ళు
కుంకుడుకాయలతో తల అంటుళ్ళు
భోగి మంటలతో ఉదయాలు రాత్రుళ్ళు

2.ఆట పట్టించే అల్లరి మరదళ్ళు
జడపట్టుక లాగే అక్కల మొగుళ్ళు
నోరూరే అరిసెలు తీరొక్క  పిండి వంటలు
సరదాలు సందళ్ళు సంతోషం పరవళ్ళు

3.పరికిణీ వోణీలు కంచి పట్టు కోకలు
నోములూ వ్రతాలు ఇంతుల పేరంటాలు
బొడబొడరేణివళ్ళు చిన్నారుల కేరింతలు
పతంగులతొ నింగిలోన రంగుల హరివిల్లు

4.కోన సీమలోన కోడి పందాలు
రాయల సీమలో గిత్తల పందాలు
వాడావాడలో జూదాలు దందాలు
మునిమాపే మరులుగొలుపు అందచందాలు
https://youtu.be/IVBIU5KPelM

జెండా పట్టుకొంటె మనసుకి ఒక ఊపు
జేబుకు జండా పెట్టుకుంటె దేశభక్తిని రేపు
గుండెలనిండా జాతీయత నింపుకొంటు విభేదాలు రూపుమాపు
సమైక్యతా రాగం తీస్తూ భారతీయను మేలుకొలుపు

1.కాషాయం తెలుపు త్యాగాల సైనికుని
ధర్మచక్రముతొ తెలుపు తెలుపును కార్మికుని
హరితం తెలుపును అన్నదాతయగు కర్షకుని
మూడుసింహాల చిహ్నం చట్టం న్యాయం ధర్మాన్ని

2.నైసర్గికరూపం భిన్నం ఐనా ఒకటే భారతదేశం
వేష భాషలూ వేర్వేరూ ఐనా ఒకటే హిందూస్తాన్
కుల మతాలు ఎన్నో ఎన్నెన్నో ఐనా ఒకటే ఇండియా
భిన్నత్వంలో ఐకమత్యం మేరా భారత్ సదా మహాన్

ఎముకలు కొరికే చలిలో హిమగిరి చరియల కొనలో
నరమానవుడి జాడేలేని మంచుగడ్డలలో
వడగాలలు చెలరేగే వేసవి ఎడారుల్లో
పహారాయే కర్తవ్యంగా సరిహద్దు రక్షణే ధ్యేయంగా
బ్రతుకేధారపోసే సైనికులారా మీకు సలాం
ప్రాణం ఫణంగపెట్టే ప్రియ సిపాయిలారా మీకు గులాం

దుప్పటిమాటున ఒదిగి చెలి కౌగిలిలోన కరిగి
నేను నాదను వాదనతో సుఖాలనెన్నొ మరిగి
నీ త్యాగం విలువనెరుగక పౌరులమంత చెలఁగి
నీ సేవానిరతిని  గుర్తించలేక స్వార్థంతో మేమే ఎదిగి
విర్రవీగిపోతున్నాము నిన్ను మరచి పోతున్నాము
బ్రతుకేధారపోసే సైనికులారా మీకు సలాం
ప్రాణం ఫణంగపెట్టే ప్రియ సిపాయిలారా మీకు గులాం

ఎండనకా వాననకా రేయనకా పగలనకా
నేలతల్లి ప్రాణంగా నింగి తండ్రి దేహంగా
కరువూ కాటకాలకెన్నడూ వెన్నిడక
పంటలెన్నొ పండించి ధాన్యమునే అందించి
పదిమంది కడుపు నింప పాటు పడే రైతులార మీకు సలాం
అభినవ కర్ణులార మా అన్నదాతలార మీకు గులాం

కాలికి ధూళంట నీక మట్టిమాటనే గిట్టక
డబ్బులుంటె కడుపునిండు ననే భ్రమలు వీడక
కిసానంటె ఎప్పటికి చిన్నచూపుతో పలుక
పల్లెపట్టు రైతునెపుడు పట్టించుకోక
నగరాలలో మేము నాగరికతనొదిలేము
పదిమంది కడుపు నింప పాటు పడే రైతులార మీకు సలాం
అభినవ కర్ణులార మా అన్నదాతలార మీకు గులాం






Monday, January 6, 2020

సూదంటి చూపులే నీ కన్నులగుండా
సూదంటు రాయిలాంటి నవ్వులు పండ
సూత్తేనే గుండాగిపోతోందే నా అడవి మల్లి
బతికినంత సేపునిన్ను సూడనీ మల్లీ మల్లీ

సూదంటి చూపులే నీ కన్నులగుండా
సూదంటు రాయిలాంటి నవ్వులు పండ
సూత్తేనే గుండాగిపోతోందే నా అడవి మల్లి
బతికినంత సేపునిన్ను సూడనీ మల్లీ మల్లీ

నడుములొన కొంగును దోపేస్తూ
వంగతోటలోన వంగి వంకాయలు కోస్తూ
నంగనాచిలాగ నన్ను ఓరకంట చూస్తూ
ఖంగుతినేలా నన్ను కంగారు పెట్టేస్తూ

సూదంటి చూపులే నీ కన్నులగుండా
సూదంటు రాయిలాంటి నవ్వులు పండ
సూత్తేనే గుండాగిపోతోందే నా అడవి మల్లి
బతికినంత సేపునిన్ను సూడనీ మల్లీ మల్లీ

నా తలతిప్పనీదు నీ బంతిపూల కొప్పు
నీ కాలి కడియాలు కూడ సుడులు రేపు
నీ మత్తులొ పడిపోతే ఆగలేను మాపు రేపు
నీకు నా మీద మనసు పడగ చేయాలి వేలుపు

సూదంటి చూపులే నీ కన్నులగుండా
సూదంటు రాయిలాంటి నవ్వులు పండ
సూత్తేనే గుండాగిపోతోందే నా అడవి మల్లి
బతికినంత సేపునిన్ను సూడనీ మల్లీ మల్లీ

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:యమన్ కళ్యాణి

ఎంతటి వైభోగము ఏమా వైభవము
ముక్కోటి ఏకాదశి దర్శనానుభవము
ధర్మపురీ నరసింహుని దివ్య విగ్రహం
ఉత్తర ద్వారము ద్వారా భవ్య వీక్షణం

1.అపరవైకుంఠమాయే ధర్మపురియె నేడు
 కన్నుల పండువగా భక్త జనసందోహాలు
గోదావరి స్నానాలతొ పునీతులైజనాలు
ఇహపరమై నెరవేరగ యాత్రా ప్రయోజనాలు

2.కన్నులు వేయున్ననూ ఇంద్రునికే తనితీరదు
నాల్కలువేయైననూ శేషుడే పొగడలేడు
మనోనేత్రమొక్కటే అనుభూతిని నోచును
గోవింద నామ ఘోషె భవతిమి కడతేర్చును
https://youtu.be/Quc8sgq2LHg


బాణీమారదు భావం మారదు
బాట మారదు బావుటా మారదు
గగనవీథికే గర్వకారణం మువ్వన్నెలఝండా
అవని తలాన భారతమాత వెలుగులు నిండ
జైహింద్ జైహింద్ జైహింద్ జైహింద్

1.ఇదే తల్లికి పుట్టాము ఇదే నేలకై బ్రతికేము
ఊపిరి ఆగిపోయేదాక దేశం మాదిగ తలచేము
మేమంతా హిందువులం ముస్లింలం క్రైస్తవులం
మనుముందుగా ప్రతి ఒక్కరం భారతీయులం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం

2.దేశం కోసమె మా తనువు దేశం మీదనె మామనసు
దేశరక్షణకు ప్రాణ త్యాగం  ఉగ్గుపాలతోనే తెలుసు
మేమంతా కర్షకులం కార్మికులం సైనికులం
కులాలనే సమూలంగ వెలివేసిన మానవులం
జై జవాన్ జయహో కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్


Saturday, January 4, 2020

పరాకునే పరిమార్చి బ్రోవరా
పరమేశ్వరా ఈ పామరుని
దహించి వేసినటుల హరహరా
సుమశరుడా చిత్తహరుని మరుని

1.కోరికలే నెరవేరగ
కోరి కలను గాంచనీకు
తుఛ్ఛమైన ఇఛ్ఛ ఎడల పిచ్చిపిచ్చిగా
వాంఛనింక మించనీకు
వైరాగ్యమె పంచునాకు

2.ధ్యాస శ్వాస పైకి మలిపి
 ధ్యానమందు నిను నిలిపి
అద్వైత తత్వమే ఆసాంత మెరిగి
పొందనీ నను ఆత్మానందమే
ఛేదించనీ ఈ భవబంధమే


పొలమారుతుంటుంది నాకు పలుమారులు
యాది చేసుకుంటావేమో నన్ను అన్నిసార్లూ
నువ్వేమో అక్కడ నేనేమో ఇక్కడ
మన కలయిక కుదురుటన్నది మరి ఎక్కడ
సంక్లిష్టమైపోయాయి నేస్తమా జీవితాలు
మరలిరాలేకున్నవి  మనవైన ఆ గతాలు

1.ఇరుగు పొరుగు ఇళ్ళలోని చిననాటి స్నేహితులం
పరువాన వీడేవరకు మనం బాల్యమిత్రులం
ఆటలాడుకున్నాం కొట్లాడుకున్నాం
చీటికీ మాటికీ చాడీలు చెప్పుకున్నాం
రోజుగడిచి గడవకముందే పరస్పరం కోరుకున్నాం
సంక్లిష్టమైపోయాయి నేస్తమా జీవితాలు
మరలిరాలేకున్నవి  మనవైన ఆ గతాలు

2.నీ మీద ఈగవాలినా ఎన్నడూరుకోలేదు
ఎవరైనా అల్లరిపెడితే గొడవచేసి బెదిరించాను
ఎంతకష్టమైనదైనా  నువ్వడిగింది అందించాను
దుర్దినమది ఆ నాడు నీ ఆచూకి కోల్పోయాను
విధివింతనాటకంలో నేనే కద బలియైనాను
సంక్లిష్టమైపోయాయి నేస్తమా జీవితాలు
మరలిరాలేకున్నవి  మనవైన ఆ గతాలు

Friday, January 3, 2020

https://youtu.be/NUWgB3UFuZE

సన్నజాజి తీగకూడ చిన్నబుచ్చుకున్నది
నీ ఒంటిలోవంపు చూసి
మేఘాల్లో విద్యుల్లత సిగ్గుతెచ్చుకున్నది
నీ మేనిలో మెరుపు చూసి
దారితప్పి వచ్చావే  దేవీ ఇలాతలానికి
అను'పమాన వరమిచ్చావే ఇలా స్నేహానికి

 1.కనికట్టేదో ఉన్నది నీ కనుకట్టులో
వింత అయస్కాంతముంది నీ వీక్షణలో
కట్టిపడేసే మంత్రమున్నదీ నీచిరునవ్వులో
తేనెపట్టు గుట్టున్నదీ నీ ఊరించే పెదాలలో
లొంగిపోనివాడెవ్వడు ఈ జగాన నీకు
దాసోహమనక పోడు నీ లాస జఘనాలకు

 2.కాంచనమే వన్నె తగ్గు నీదేహకాంతి ముందు
నవనీతమె స్ఫురణకొచ్చు నీశరీర స్పర్శయందు
కిన్నెరసానియే నీ హొయలును అనుకరించు
ఉన్నతమౌ నీ ఎడద హిమనగమును అధిగమించు
రతీదేవికైనా మతిపోవును నీ సొగసు గాంచ
ఏ కవి కలమైనా చతికిల పడిపోవును నిను  వర్ణించి

OK
https://youtu.be/HwHvcq0AM_s

పదవులంటే స్వామీ నీ పాదాల తావులే
ప్రాశస్త్యపు అర్థం నీ దాసుడనను ఎరుకలే
సత్కారము ఈజన్మకు నీ సన్నిధి లభ్యతయే
చరితార్థము బ్రతుకునకు నీ ఆదరణయే
తిరుమలేశ చిదానంద పాహిపాహి పాహిమాం
శ్రీనివాస గోవిందా మనసా వచసా  నమామ్యహం

1.నీ నామం స్మరించకా కానేరదు అది రసన
నిను పొగడనిదేదైనా ఔతుందా ఘన రచన
పూర్వ జన్మ పుణ్యమేమొ కవనము సిద్దించెగా
సత్కర్మల ఫలమేమో నీ తత్వము రుచియించెగా
తిరుమలేశ చిదానంద పాహిపాహి పాహిమాం
శ్రీనివాస గోవిందా మనసా వచసా  నమామ్యహం

2.ఎందరు గణుతించిరో ఒడవదు నీ కీర్తనం
పలురీతుల నుతించినా తరగదు ఆ మధురం
అందుకో శ్రీ వేంకటేశ్వరా నా అక్షర లక్షలు
దరిజేర్చుకో సత్వరమే చాలించి పరీక్షలు
తిరుమలేశ చిదానంద పాహిపాహి పాహిమాం
శ్రీనివాస గోవిందా మనసా వచసా  నమామ్యహం

Thursday, January 2, 2020

కళ్ళతోనే ఆహ్వానం
చూపుతోనే ఆతిథ్యం
వలపులన్నీ వండివార్చి సిద్ధపరచు కంచం
అందించవే చెలీ పసందౌ విందుభోజనం

మనసుగదిలో పక్కసదిరా
సోయగాల మల్లెలు జల్లా
వేచి ఉన్నా వేగరారా వేగలేకపోతున్నా
ప్రియా విరహంతో కాగి కాగిపోతున్నా

1.తాంబూలం తాకకున్నా -అధరాలు అరుణిమలే
శ్రీగంధం పూయకున్నా-కపోలాలు మధురిమలే
జామురాతిరి గడిచిపాయే-జాగేలా నాసఖా జాగరణకు
ఆగలేని ఆత్రముంది - ఎదురుతెన్నులేల నా కలలకు
వేచి ఉన్నా వేగరారా వేగలేకపోతున్నా
ప్రియా విరహంతో కాగి కాగిపోతున్నా


2.నీ స్పర్శలోనా -విద్యుల్లత దాగుంది
తాకీ తాకగనే నా -ఒళ్ళుఝల్లుమంది
ఊహలోకి నువు రాగానే-చెలీ  చెలరేగుతోంది చలి
నెగడులోని సెగలాగా - ననుకాచుతోంది నీకౌగిలి
వలపులన్నీ వండివార్చి సిద్ధపరచు కంచం
అందించవే చెలీ పసందౌ విందుభోజనం


దైవోపహతులం -మండేటి చితులం
బంధువులందరున్న అనాథలం
ఎంతకు ఒడవనీ విషాధ గాథలం

1.సంపద ఉండికూడ దరిద్రులం
సంతతి కలిగియున్న వంధ్యులం
దైవభక్తి ఓలలాడె నాస్తికులం
బాహుబలితొ తులతూగు బలహీనులం

2.కన్నీరు కొలువున్న సంద్రాలం
చిరునవ్వు జలతారు పరదాలం
ఓటిమినెరిగిన పోరాట యోధులం
మనసుల్ని కప్పెట్టిన సమాధులం
ఏంచేస్తున్నావో వేంచేయమంటుంటే
ఓపలేకపోతున్నా తాత్సారం చేస్తుంటే
ఎంతగనం బంధించనూ నా తలపులనూ
మూసివేసినావేలా నీ మదిగది తలుపులను
రమ్మంటె రావూ రమ్మనీ అననే అనవు
ఎలావేగనే నీతో లలనామణీ
ఎలాసాగనే నీతో కలహంసగామినీ

1.పొద్దుపొద్దంతా వద్దు వద్దు అంటుంటావు
అద్దరాతిరయ్యాక నిద్దుర చెడగొడతావు
కలనైనా నోచనీవే ముద్దూ ముచ్చట
కల్పనలో జతకావేమే ముద్దుగుమ్మ ఏపూట
ఎలావేగనే నీతో నా ప్రణయ లతిక
ఎలాసాగనే నీతో నా మధుర గీతిక

2.గాలి మోసుకొస్తుంది జాలితో నీ పరిమళం
వాన తీసుకొస్తుంది నీ స్పర్శా పరవశం
నీరెండ తలపిస్తుంది నీ కౌగిటి వెచ్చదనం
సింగిడే చిత్రిస్తుంది నీ వర్ణ సౌందర్యం
ఎలావేగనే నీతో నవ మోహనాంగీ
ఎలాసాగనే నీతో ఎదలోన కృంగీ

Wednesday, January 1, 2020

నువ్వు పెదవి విప్పితే ఒక పాటే
నువ్వు మూగవోతేనో  నాగ్రహపాటే
మౌనాలు తీర్చలేవు సందేహాలు
హృదయాల కలయికలో మటుమాయం దేహాలు

1.రెండు భావాలదే ఈ స్నేహం
ఆత్మద్వయానిదే ఈమోహం
సంగమించనీయీ అనుభూతులన్నీ
అధిగమించనీయీ భవసాగరాలన్నీ

2.ఛేదించు పంజరాలు స్వేఛ్ఛగా విహరించ
తొలగించు బిడియాలు నిర్లజ్జగా రమించ
చిత్తాన్ని మొత్తంగా పరస్పరం మార్చుకుందాం
గుత్తాధిపత్యంతో మనని మనం ఏలుకుందాం
కదిలించే కలికి ఉంటే ఉరకదా కవిత జలపాతమై
పురికొలిపే పడతి ఎదురైతే ఒలకదా గానం రసగీతమై
అనుభూతి చెందేలా స్ఫూర్తినొసగాలి సంఘటన
పారదర్శకంగా వెలువడాలి భావాలు ప్రతి పాటలోన

1. సుప్రభాత పలుకరింపే కలిగించు ఉత్తేజం
కురిపించే ప్రశంసలే మేల్కొలుపు నా ప్రావీణ్యం
మా కలయిన ప్రతిక్షణం మధురతర కావ్యం
ఎన్నిసార్లు ఎదమీటినా ప్రతిసారీ నవ్యాతినవ్యం

విరహాలు రేగేలా మటుమాయమౌతుంది
ఊహించని వేళలోనా అమనిలా అలరిస్తుంది
గిల్లికజ్జాలతో అల్లరెంతొ చేసేస్తుంది
నవ్వులెన్నొ కురిపించి నవనీతం పూస్తుంది
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఓనమాలు రాకున్నా కవనాలు పండిస్తారు
సరిగమలు నేర్వకున్నా గానాలు కురిపిస్తారు
నిన్నుచూడగానే అన్నులమిన్నా నిలువజాలకుంటారు
మదిర తాగకున్నా మత్తెక్కి పోతారు
చిత్తచాంచల్యమై చిత్తవుతు ఉంటారు

1.కుంచె పట్టరాకున్నా చిత్రాలు గీస్తారు
నిన్ను మెప్పించబూని చిత్రాలు చేస్తారు
నువ్వు ఎదురవ్వగానే ఇందీవరాననా నిశ్చేష్టులౌతారు
అయోమయమైపోయి గుండెజార్చుకుంటారు
ప్రయత్నమే లేకున్నా ప్రేమ నేర్చుకుంటారు

2.బ్రహ్మ చర్య వ్రతమైనా వదిలేసుకుంటారు
సన్యాసదీక్షను సైతం త్యజియించివేస్తారు
నీ క్రీగంటి చూపుకోసం నీరజాక్షీ పడిగాపులు పడతారు
నీ తపనల తమకంలోనే లోకాన్ని మరిచేరు
నీ వలపుల తలపులందే తలమునకలౌతారు
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

చెప్పుడు మాటలు విననూ
కాకమ్మ కథలూ నమ్మనూ
లేనిపోనివేవీ కల్పించి చెప్పను
షిరిడీసాయీ నీ లీలలెలా వివరించనూ
అనుభూతిచెందనపుడు పదిమందికెలా పంచనూ

1.లెక్కచూపగలవా నీవు ఇడుములెన్ని బాపావో
నొక్కిచెప్పగలవా సాయీ కోర్కెలెన్ని తీర్చావో
చిలువలు పలువలుగా నిన్ను చిత్రించలేను
ఆహా అంటే ఓహో అంటూ  వంత పాడలేనూ
కల్పనలే కాకపోతే నన్ను దయచూడవెందుకు
దండిగా మహిమలుంటే కొండంత వెతలెందుకు నాకు

2.చిన్ననాటి నుండి కష్టాలతొ కలిసే పెరిగా
కనికరించువాడవనే నీపైన భక్తి మరిగా
చరమాంకం చేరుకున్నా సుఖం దాఖలా లేదు
మకరందం తాగుతున్నా బ్రతుకంతా చేదు చేదు
గుడ్డిగా కొలిచేవారు కోట్లమంది నీకున్నారు
వెర్రిగా వేడగా నీవు గాక నాకెవరున్నారు

Tuesday, December 31, 2019

https://youtu.be/0q5DKlHRo-Y?si=P0RC63zj6EDPX9lI

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:కీరవాణి

ఆంధ్ర వాఙ్మయభారతి జననీ
తెలుగు సాహితి అజరామరమవనీ
తెలంగాణ నేలపై కైత సింగిడై పొడవనీ
ఈ అవని ఉన్నంతకాలం అజేయమై మననీ
చే జోతలు నీకివే వీణాపాణీ
వినతులందుకొనవే విధాతరాణీ

1.ఎంతటి దయ ఉన్నదో చదువులమ్మా నాపై
నీ ప్రాపకమే పొందితిని కళామతల్లీ నీ దాపై
ఊపిరున్నంతవరకు కొనసాగనీ నా కలము
పాఠకాభిమానుల నలరించనీ నా కవనము
చే జోతలు నీకివే వీణాపాణీ
వినతులందుకొనవే విధాతరాణీ

2.కవిగాయక చిత్ర శిల్పకారులు యశమొందనీ
సంగీత సాహిత్య యుగముగ వర్ధిల్లనీ
కళలను ఇల జనులంతా సదా ఆదరించనీ
ప్రభుత పెద్దమనసుతోడ ఘనముగ సత్కరించనీ
చే జోతలు నీకివే వీణాపాణీ
వినతులందుకొనవే విధాతరాణీ


అనునిత్యం ఒక కొత్తదనం
నిన్నకు నేటికి వ్యక్తివికాసం
ఋతుచక్రపు భ్రమణం గతస్మృతుల స్మరణం
మనిషి మనుగడకు ఏదైతేనేం అవలోకనం
ప్రతి దినం తొలికిరణం పునశ్చరణం
Happy New Year !  ఆంగ్లవత్సరాది శుభకామనలు!!

1.పుట్టిన నాడే పుడమిని చూడగ హ్యాప్పీ ఆరంభం
మెట్టినింటిలో కాలు మోపెడి కొత్త కోడలికి హ్యాప్పీ ఆరంభం
పండిన పంటల రైతుల కంటిలొ హ్యాప్పీ ఆరంభం
పరీక్ష నెగ్గగ బ్రతుకు తెరువుకై ఉద్యోగికి హ్యాప్పీ ఆరంభం
Happy New Year!  ఆంగ్లవత్సరాది శుభకామనలు!!

2.మళయాలీలకు విషు నాడే వత్సరాది వైభోగం
మహరాష్ట్ర గుడిపాడ్వా తమిళనాట పుత్తాండు
సిక్కులందరికి వైశాఖీ బెంగాలీలకు పొయ్ లా బైశాఖీ
తెలుగువారికి కన్నడిగులకు ఉగాదియే సంవత్సరాది
Happy New Year!  ఆంగ్లవత్సరాది శుభకామనలు!!

3.దురలవాట్లను దూరముంచెడి నిర్ణయాలకు ఆహ్వానం
మంచిని కూర్చే సంకల్పాలకు ఎప్పటికైనా స్వాగతం
మానవత్వపు తత్వం నేర్వగ జగానికే జాగృతి గీతం
ఆనందాలు వెల్లివిరియగా  మిత్రులకిదియే సుప్రభాతం
Wish you Happy New Year!  ఆంగ్లవత్సరాది శుభకామనలు!!






Monday, December 30, 2019

పెదాలపై ఆనందం
హృదయాలలో విషాదం
దాచుకున్న మర్మాలన్నీ చూపులే చెబుతాయి
గుండెచాటు గుట్టులన్నీ  కళ్ళు రట్టుచేస్తాయి

1.మాటకెంత చక్కెర పూసినా
కన్నీట ఉప్పు గాఢత తగ్గేనా
భావాలకెన్ని  ముసుగులేసినా
గొంతులోన పలుకు జీర తొలగేనా
వదనాన పున్నమి వెన్నెలే
ఎదలోన కటిక చీకటులే

2.పంటికింద నొక్కిపట్టిన వేదన
చెలియలి కట్టదాటు కడలిలా
అంతరాల భరించగ యాతన
మోవిపై పులుముకునే నవ్వులా
ఆటుపోటులల్లే బ్రతుకులే
ఆత్మచంపుకుంటూ నటనలే
రచన,స్వరకలఅపన&గానం:రాఖీ

ప్రేమా ప్రేమా నీవే ఒక శాపమా
ప్రేమాప్రేమా  తీరని పరితాపమా
నీ చెంత చేరాక చింతేలే బ్రతుకంతా
నీ వంత పాడాక వింతేలే భవితంతా

1.నీ మాయలోబడి నను నేనె కోల్పోయా
నీ మత్తుకు లోబడి వెర్రివాడినైపోయా
అనుభవజ్ఞులెంత చెప్పినా పెడచెవిన పెట్టినాను
కాకులై లోకులు కూసినా పిచ్చోళ్ళుగ జమకట్టాను
ప్రేమా ప్రేమా నీ పేరే మోసమా
ప్రేమా ప్రేమా నీ నైజం ద్వేషమా

2.ఆరిపోని గుండెమంటలే బహుమానాలా
ఇంకిపోని కంటిచెలమలే చెలిమికి ఫలితాలా
మరణమింతకంటే వేరుగా ఉంటుందా
నరకమింతకంటే ఘోరంగా ఉంటుందా
ప్రేమా ప్రేమా నీవే యమపాశమా
ప్రేమా ప్రేమా నీవే గ్రహదోషమా
మోము చూస్తే అమాయకం
మాటసైతం మకరందం
నమ్మరాదు నటనలెరిగిన నారీమణులను
వలపుపేరిట వలలు వేసే నెరజాణలను

1. లేడికన్నుల కదలికలు
వాడిచూపుల కవళికలు
క్రీగంటిబాసల చిలిపి లిపితో
పలుకుతారు స్వాగతాలు
పంటినొక్కుల వింతసైగతో
తెలుపుతారు మనోభావాలు
మత్తునే  చల్లుతారు కోమలాంగులు
మాయలో ముంచుతారు నీరజాక్షులు

2.లొంగినట్టే వాపోతారు
బేలగానే అగుపిస్తారు
మెల్లమెల్లగ అల్లుకుంటూ
హృదయమాక్రమిస్తారు
లాఘవంతొ కమ్ముకుంటూ
బ్రతుకు కొల్లగొడతారు
దృక్కులతో తృప్తిపడు ఓ నేస్తమా
దూరముండి హాయినొందు ఓ మిత్రమా

Saturday, December 28, 2019


రంగనాథుడు-మంజునాథుడు
జగన్నాథుడు-విశ్వనాథుడు
శ్రీనాథుడు-గౌరీనాథుడు
దైవమనే నాణానికీ
బొమ్మ ఒకరు బొరుసింకొకరు
అద్వైతమూర్తి తానైన హరిహరనాథుడు
కొలవరొ నరులారా నిత్యం శివకేశవ భేదం మరచి
తలవరొ జనులారా మాధవ మహాదేవ తత్వం తెలిసి

1.నిలువు బొట్టని కొందరు అడ్డంబొట్టని కొందరు
పీతాంబరమని కొందరు గజచర్మాంబరమని కొందరు
హరినే సతతం స్మరించు హరుడు
శివుడిని పూజించు సర్వదా గోవిందుడు
కొలవరొ నరులారా నిత్యం శివకేశవ భేదం మరచి
తలవరొ జనులారా మాధవ మహాదేవ తత్వం తెలిసి

2.హృదయాన  సతికే స్థానమిచ్చెను వైకుంఠపతి
దేహాన సగభాగము పార్వతికిచ్చెను పశుపతి
మోహిని ఎడల మోహమెంతో సదాశివునకు
కపర్ది పై అనురాగమే సదా పద్మనాభునకు
కొలవరొ నరులారా నిత్యం శివకేశవ భేదం మరచి
తలవరొ జనులారా మాధవ మహాదేవ తత్వం తెలిసి
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

భారత భారతీ-బ్రతుకే హారతీ
దేశభక్తి భావనలో జాతీయతా యోచనలో
రాజ్యాంగం పరిధిలో త్రివర్ణ పతాక ఛాయలో
వందే మాతరం వందేమాతరం వందేమాతం వందేమాతరం

1.చట్టం ధర్మం న్యాయాలకు  నిబద్దులం
సంస్కృతీ సాంప్రదాయాలకు వారసులం
పరులసొమ్ముకై ఎన్నడైననూ ఆశపడం
ఇరుగుపొరుగు దోపిడికొస్తే ఊరుకొనం
వందే మాతరం వందేమాతరం వందేమాతం వందేమాతరం

2.పరమతసహనం తరతరాలుగా మానైజం
మతములమార్పిడి ధోరణులకు వ్యతిరేకం
భిన్నత్వంలో ఏకత్వం నాడూనేడూ మాతత్వం
దేశద్రోహపు వంచనను కలలోనైనా సహించం
వందే మాతరం వందేమాతరం వందేమాతం వందేమాతరం

Friday, December 27, 2019

https://youtu.be/STSEFR6web0?si=Y8k2ETfnj4Y-bhxJ

మంజుల చరణా గరుడాధిరోహణా
రత్నఖచిత కాంచన కంకణధారణా
తిరువేంకట రమణా గోదా మనోహరణా
త్రిదశ పాశర యుత పారాయణా,
నమోస్తుతే మార్గళి నారాయణా

1.భవతాప నివారణా భక్త పోషణా
ఆశ్రితజన సంరక్షణా ఆళ్వార్ సేవితా
ఆండాళ్ సతి కళ్యాణ పెరుమాళ్ సమ్మోహనా
దీనావనా దీనజనోధ్ధారణ దీక్షా విశేషణా
త్రిదశ పాశర యుత పారాయణా,
నమోస్తుతే మార్గళి నారాయణా

2.బ్రహ్మీముహూర్త సుప్రభాత అర్చితా
పంచోపనిషత్ ఘోషిత  క్షీరాభిషేక పూజితా
కస్తూరీ శ్రీ చందన పరిమళభూషితా
తులసీదళమాలాలంకృత భాసితా
త్రిదశ పాశర యుత పారాయణా,
నమోస్తుతే మార్గళి నారాయణా

3.కర్పూర తిరునామాంకిత సుందర వదనా
అరవింద నయనా ఆర్తత్రాణ పరాయణా
మాధురీ మందహాస  చంద్రికా వితరణా
అభయముద్రాన్విత చింత నివారణా
త్రిదశ పాశర యుత పారాయణా,
నమోస్తుతే మార్గళి నారాయణా

OK

Thursday, December 26, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వైరికి కొమ్ముకాచినంత కాలం
తల్లి రొమ్ముగుద్దుతున్నంత కాలం
ఇంటిదొంగలే వంచనతో దోపిడి సాగించినంతకాలం
పరాయివాడిని పంచన చేర్చుకున్నంత కాలం
భరతమాత అందరున్నా అనాథా
భరతజాతి ఇంకానా శాపగ్రస్తా

1.మంచితనం మన బలహీనతగా మారింది
గుంటనక్కజిత్తులకే తల్లడిల్లిపోయింది
ఆపన్నులనాదుకొనగ వెసులుబాటిచ్చింది
చొరబడి ఆక్రమించు ముష్కరుల మరిచింది
మనుగడకే ఎసరొచ్చే దాష్టీకం పెట్రేగింది
జాతీయ వ్యతిరేకుల దమనకాండ ప్రబలింది

2.తురుష్కులు మొగలులు విర్రవీగిపోయారు
ఆంగ్లేయపాలకులు సంస్కృతినే చెరిచారు
స్వాతంత్ర్య ఫలం కాకూడదు ఇకపై విఫలం
అంతర్గత సరిహద్దు భద్రతే మనకు బలం
విఛ్ఛిన్నకారుల నణాచాలి కడు నిర్దాక్షిణ్యంగా
స్వేఛ్ఛాగగనాన ఎగురుతూనె ఉండాలి భారతీయ తిరంగా

Wednesday, December 25, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:కానడ భైరవి

పిలిచి పిలిచి విసిగాను వినబడలేదా
అరచిఅరచి అలిసాను దయగనవేలా
షిరిడీ సాయిబాబా పండరీ పుర విఠోబా
కాకమ్మ కథలేనా నీ లీలలు
పుక్కిటి పురాణాలా నీ మహిమలు

1.ఆసక్తిలేదా సాయీ- నీపై- నాకు భక్తిలేదా
నా ఓర్పుకే పరీక్షా సాయీ-నా కింతటి శిక్షా
ఎదిరిచూపుకైనా కాలపరిమితేలేదా
ఓపికకంటూ ఒక హద్దులేనే లేదా
నిన్ను నమ్ముకోవడమే నే చేసిన పొరబాటా
ఇంతకఠినమైనదా  నిన్ను చేరుకొనుబాట

2.నీ పలుకులన్నీ ఒట్టి నీటి మూటలు
నీ బోధలన్నీ ఉత్త గాలిమాటలు
నిరాశనే దక్కుతుంది నిన్ను కోరుకుంటే
అడియాసె మిగులుతుంది నిన్ను వేడుకుంటే
నిరూపించుకోక తప్పదు నీ ఉనికి ఇలలోన
నన్నాదుకొనడం మినహా మరిలేదు ఇకపైన
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ఎదురు దెబ్బలెన్నితాకినా
ఎంతమంది ఈసడించినా
స్నేహం ముసుగులో పరాన్నబుక్కులు
వంచన పంచనజేరిన పరమ మూర్ఖులు
దేవుడైనా బాగుచేయలేడు ఇటువంటి నరులను
ఇచ్చిన మాటనిలుపుకోలేని ఈ మనుషులను

1.ప్రతిభ ఎంత ఉంటేమి నియతిని పాటించకుంటే
ఎంతనేర్పరైతేమి నిబద్ధతకు విలువీయకుంటే
అరచేతిలొ వైకుంఠం చూపుతామంటారు
చెప్పులరిగినా పనిపూర్తికి రేపుమాపంటారు
చేజేతులారా భవిత చంపుకొంటారు
తెలిసిమరీ ఊబిలోకి దిగుతుంటారు

2.మోసమంటే తమతత్వం కాదంటారు
ప్రతిసారీ కొత్తకథలు అల్లుతుంటారు
అందరినీ అన్నిసార్లు నమ్మించ బూనుతారు
బోల్తా కొట్టించబోయి బోల్తాపడుతుంటారు
జాలిపడుట వినా ఎవరేమి చేయగలరు
నొప్పింపక తానొవ్వక తప్పించుకతిరుగుతారు
మదికి హత్తుకుంటే ఒక మధురగీతం
గుండెకే గుచ్చుకుంటే అది విరహగీతం
ఎడదనొచ్చుకుంటే విషాద గీతం అభ్యుదయగీతం
మనసు మదనపడితేనో ఇక భక్తిగీతం ఒక తత్వగీతం

1.అందమైనా ఆనందమైనా
అనుభూతికి లోనైనప్పుడు
ప్రణయ భావన సౌందర్యోపాసన
కోరుకున్నది చెంతకు చేరుకోక
దొరకనిదైనా వదులుకోలేక
వేదనాగీతిక వెతలకది వేదిక

2.సమాజాన ప్రబలే రుగ్మతలు
దీనులపై జరిగే దాష్టీకాలు
పాలకుల కనువిప్పుకు గేయాలు
మానవీయ విలువలు సమసి
భ్రష్టత్వం జగతిన వ్యాపించ
 దైవానికి వినతులు ఆధ్యాత్మిక కీర్తనలు

Monday, December 23, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

ముద్దబంతి పూవులాంటి ముగ్ధత్వం
ముద్దమందారమంటి మృదుత్వం
గులాబీరేకువంటి స్నిగ్ధత్వం
తంగేడు పూవులాంటి నిర్మలత్వం
ఎంతముద్దుగున్నావే మనవరాలా
ఎత్తుకొని ముద్దాడుదు మమతమీర

1.మీ అమ్మలోని సునిశితత్వం
అమ్మమ్మలోని అతులిత లౌక్యం
మీ నాన్నలోని ధీరత్వం
తాతయ్య లోని బోళాతత్వం
పుణికిపుచ్చుకున్నావే చిన్నారి
వృద్ధిలోకిరావాలి మాకోరిక నెరవేరి

2.ముక్కోటి దేవతలు దీవించగా
ఇలవేల్పు దయనీపై వర్షించగా
నువు ఆటపాటలతో అలరించగా
నీముద్దు మురిపాలు మురిపించగా
నిత్యసంతోషిణివై వర్ధిల్లవే
నిండునూరేళ్ళూ వెలుగొందవే
https://youtu.be/FjEGaDM--BA


పుట్టింది మట్టిలో కలిసేది మట్టిలో
మట్టిమనిషివంటారు నిను రైతన్నా
నీ జట్టుపట్టదంటారు వినరోరన్నా
హలం నీది కలం నాది మనిద్దరిదీ వ్యవసాయం
నీకు నేను నాకు నీవు మనకు మనమె సాయం
జోహారు నీకన్నా జేజేలు నీకన్నా

1.జిట్టెడంత పొట్టకొరకు పట్టెడంత పండించి
పూటగడుపనెంచవేల వెర్రెన్నా
కట్టమంత దారవోసి మట్టినే ధాన్యంచేసి
పుట్లకొద్ది పండించ పట్టునీకేల రైతన్నా
నిను పట్టించుకోని జనం సాపాటు కోసం
పాట్లు పడెదవేల అగచాట్లుపడెదవేల

2.ప్రభుత్వాలు మారినా ఏపార్టీ పాలించినా
నువు మోడుగ మారినా నీగోడు వినకుండె
కరువులుకాటకాలు వరదలు తుఫానులు
నిను కబళించగా దిక్కుతోచక నీగుండె మండె
దైవోపహతుడైనా  ధైర్యదాన కర్ణుడవే నీవు
ప్రకృతి పద్మవ్యూహాన అభినవ అభిమన్యుడవీవు

3.జీతబత్యాలులేవు  ఏ పింఛను లెరుగవు
బుద్దెరిగిన నాటినుండి శ్రమనె నమ్ముకొన్నావు
నేలనే తల్లినీకు పైరు పెంచిపోషించగ నీ తండ్రి నీరు
సమయాసమయాలూ లేవు పదవి విరమణలు
ప్రపంచం కడుపు నింపు అపర అన్నపూర్ణవు
ఒడుదుడుకుల వెరవని సమరయోధుడవు
https://youtu.be/lhIQCBee1ec?si=_V7nH7Qwv8qHzcBe

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

జగమేలు శక్తివమ్మా
సుగుణాలరాశివమ్మా
దయగల్ల తల్లివమ్మా
ప్రియమార చూడవమ్మా
నీరాజనాలు జనని
నీ కృపతొ మమ్ము మనని

1.గతినీవెగాదె మాకు
మతినింక వీడబోకు
రుజకీవె మందుమాకు
చేయి నెపుడూ  వదలకు
నీరాజనాలు జనని
నీ కృపతొ మమ్ము మనని

2.ఎదనీకు కోవెలమ్మా
మా కన్నులె దివ్వెలమ్మా
చిరునవ్వులె పువ్వులమ్మా
ప్రాణజ్యోతు లారతులమ్మా
నీరాజనాలు జనని
నీ కృపతొ మమ్ము మనని

Sunday, December 22, 2019

https://youtu.be/qK7Fqw-FkV8?si=F-NZHDZiAMkhv10L

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తేట తెలుగులొ మాటలాడితె హాయి
తల్లి మమతను తలచుకొంటే హాయి
గోరుముద్దల రుచులు ఎంతటి హాయ
నాన్న ప్రేమే గురుతుకొస్తే హాయి

1.బాల్యమిత్రులు కలుసుకొంటే హాయి
సహాధ్యాయులు కీర్తికొస్తే హాయి
తొలినాటి ప్రేయసి పలకరిస్తే హాయి
తెలిసితెలియని చిలిపిచేష్టలె హాయి

2.కృషికి ఫలితం పొందినప్పుడు హాయి
గెలుపు తృప్తిని పంచుకొంటే హాయి
గుండెతడి పొంగి కనులే చెమరించ హాయి
ఆపన్నుల ఆర్తిదీర్చగ చేయూతనిస్తే హాయి

3. నవ్వుపువ్వుల తోట మనతోటిఉంటే హాయి
దుఃఖమెప్పుడు దాచుకొనక బావురంటే హాయి
తామరాకున నీటిబొట్టై మసలుకొంటే హాయి
రేపుచేదని నేటి మధువుని జుర్రుకుంటే హాయీ

OK
https://youtu.be/fTgxMhQoFJw

బ్రహ్మ రసనా పరివేష్ఠినీం బాసరపుర నిజ వాసిని
మాతరం ప్రణమామ్యహం నిరంతరం భజామ్యహం

1.కవిగాయక వరదాయిని కామితార్థ దాయిని
భవభంజని నిరంజని విశ్వైకజనని పాహిమాం

2.జాడ్యాంతకీం జాగృత చిత్త సాధినీం మేధావినీం
అగణిత ప్రజ్ఞాం ప్రసాదినీ పరాదేవీం నమామ్యహం

3.రాఖీ లేఖనీ మయూఖ విద్యుల్లతా భాసిని
కవన మోహిని మనోరంజని పాలయమాం

Saturday, December 21, 2019

https://youtu.be/zfyNDP3PKeo

మహా విద్యా మహా మాయా
మహా జ్ఞాన సరస్వతీ
శృంగేరీపీఠవాసిని హే బాసర భారతీ
శరణు తవ దివ్య చరణం  భవతాప హరణం
స్మరణ మాత్రేన జన్మ పావనం
శ్రీ మాత్రే తవ నామ మననం

మహా విద్యా మహా మాయా
మహా జ్ఞాన సరస్వతీ
శృంగేరీపీఠవాసిని హే బాసర భారతీ
శరణు తవ దివ్య చరణం  భవతాప హరణం
స్మరణ మాత్రేన జన్మ పావనం
శ్రీ మాత్రే తవ నామ మననం

శుక పుస్తక హస్త శోభితం-స్వర్ణ కలశ కర ప్రభాసితం
రక్తవర్ణ చేలోపరి విరాజితం-హరితచోలి ప్రఛ్ఛాదితం
ధన్యోహం తవ భవ్య దర్శనం
వీక్షణ మాత్రేన జన్మ పావనం
శ్రీమాత్రే తవ రూప చింతనం

మహా విద్యా మహా మాయా
మహా జ్ఞాన సరస్వతీ
శృంగేరీపీఠవాసిని హే బాసర భారతీ
శరణు తవ దివ్య చరణం  భవతాప హరణం
స్మరణ మాత్రేన జన్మ పావనం
శ్రీ మాత్రే తవ నామ మననం

శంకరాచార్యార్చితం-వ్యాస వాల్మీకి సంసేవితం
నారదాది మునిజన వందితం-కాళిదాస కవి నుతం
భావయామి తవ పాద పంకజం
ధ్యానమాత్రేన జన్మ పావనం
శ్రీమాత్రే తవ గుణగాయనం

మహా విద్యా మహా మాయా
మహా జ్ఞాన సరస్వతీ
శృంగేరీపీఠవాసిని హే బాసర భారతీ
శరణు తవ దివ్య చరణం  భవతాప హరణం
స్మరణ మాత్రేన జన్మ పావనం
శ్రీ మాత్రే తవ నామ మననం


https://youtu.be/2Q-c3cJSsug

భావ వైరుధ్యమే భవా నీ తావు
జన్మ వైరులైనా మైత్రిగానే మనగలవు
భిన్నమైనతత్వాలే శివా నీ కొలువు
ఐక్యతగా సఖ్యతగా మసలుకోగలవు
మనుజుల మనసుల ద్వేషాన్ని హరించు
మానవతను మమతను విశ్వమంత విస్తరించు
శివానీ భవా నమోనమామి-భవానీ శివా సదాస్మరామి

1.నిప్పూ నీరూ ఒప్పనే ఒప్పవు
అట జటాఝూటము ఇట జ్వలిత నేత్రము
అమృతము గరళము పొసగనే పొసగవు
అట సుధాకర భూషణ  ఇట కాలకూటధారణ
మనుజుల మనసుల ద్వేషాన్ని హరించు
మానవతను మమతను విశ్వమంత విస్తరించు
శివానీ భవా నమోనమామి-భవానీ శివా సదాస్మరామి

2.భోళా శంకరుడవే మహంకాళీ సమేతుడవే
రౌద్ర వీరభద్రుడవే అన్నపూర్ణా సంస్థితుడవే
వృషభానికి మృగరాజుకి ఎలా కుదిరె స్నేహము
కైలాసము స్మశానము అదీ ఇదీ నీ గృహము
మనుజుల మనసుల ద్వేషాన్ని హరించు
మానవతను మమతను విశ్వమంత విస్తరించు
శివానీ భవా నమోనమామి-భవానీ శివా సదాస్మరామి


మరలిరాని గతమేదో బావురుమంది
మనసైన నెచ్చెలి చేరువయింది
అలనాటి అనుభూతుల్లో అలరించింది
నన్ను నేను మరిచేలాగా మదినాక్రమింది

1.పెచ్చులూడిన నా భవంతికి వెల్లెవేసింది
దుమ్ముబట్టిన నాముంగిలిలో రంగవల్లి తానయ్యింది
మసకబారిన ఆశాదీపపు మలినాలు కడిగింది
కొడిగట్టి ఆరే వత్తిని వెలిగేలా చేసింది

2.ఎడారైనా దారిలో వసంతమై ఎదురయ్యింది
ఏకాకి నా బ్రతుకులో కోయిలగా కూసింది
తడారే నా గొంతులో అమృతవర్షిణయ్యింది
తనువు మనసు అంకితమిచ్చి తానె నేనుగ మారింది
జ్ఞాపకాలన్నీ గుండె కెలుకుతున్నాయి
తీపిగురుతులన్నీ గొంతునులుముతున్నాయి
నువ్వెలా తట్టుకుంటున్నావో చెలీ
రోజులెలా నెట్టుకొస్తునావో ప్రియా
మరల మరల రానీ మరులుగొలుపు ఆ క్షణాలు
ఆ తరుణం జారకముందే రాలనీయి జీవితాలు

1సుఖాలన్ని రంగరించి సరసరసం అందించావు
హాయినంత మూటగట్టి నాకు ధారపోసావు
బొందితోనె స్వర్గమంటే నీ పొందే ప్రియతమా
అమృతాల విందంటే నీ చుంబనమే భామా
మరలమరల రానీ మరులుగొలుపు ఆక్షణాలు
ఆ తరుణం జారకముందే రాలనీయి జీవితాలు

2.వాత్సాయన సూత్రాలన్నీ మనవల్లనె వెలిసాయి
శృంగార భంగిమలెన్నొ అనంగుడికే తెలిసాయి
కామశాస్త్ర పాఠాలకూ మన కలయికే మూలం
ఖజురహో శిల్పులకూ మన రసికతె ఆధారం
మరల మరల రానీ మరులుగొలుపు ఆ క్షణాలు
ఆ తరుణం జారకముందే రాలనీయి జీవితాలు

Friday, December 20, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:కల్యాణి

నీ పదముల నా మది కొలిచేను
నా పదముల నీ కృతి మలిచేను
తిరుపతి పుర గోవింద హరీ
శరణు శరణు సప్తగిరీ  ముకుంద మురారీ

1.అక్షర లక్షలు నీకర్పించెద
కవితల కోటి నీకందించెద
గీతమాలికల అలరించెద
కావ్యశతముల కానుకలిచ్చెద
తిరుపతి పుర గోవింద హరీ
శరణు శరణు సప్తగిరీ  ముకుంద మురారీ

2.నిత్య నరకము ఈ నరలోకము
నీ సన్నిధియే భూతల నాకము
తొలగించర నా అవిరళ శోకము
కావించర  కర్మల పరిపాకము
తిరుపతి పుర గోవింద హరీ
శరణు శరణు సప్తగిరీ  ముకుంద మురారీ
విచ్చుకోనీ విరిలా మోవి
విరజిమ్మనీ పలుకుల తావి

దైవాన్ని నమ్మితే మానవుడే మాధవుడు
మనిషినే నమ్మితే మనిషి దైవమౌతాడు

రాగానిదేముంది అనురాగం పంచితే
ఇష్టపదులు వింతకాదు కోయిలనే మించితే

సాగర వైశాల్యం ఎంతుంటే ఏమిటి
నావ  దరిని చేర్చదా ఆటుపోట్లు దాటి

కన్నెంత కార్చినా కన్నీరు దోసిట
గుండె చెలమె తోడితే ఒడవదు ఊట

చిమ్మచీకటైతెనేమి చిరుదివ్వెతొ తొలగదా
కఠిన హృదయమైతేమి రాఖీ చిరునవ్వుతొ కరుగదా
భావనంతా నీదే భాష మాత్రం  నాది
ఊహలన్నీ నీవే అక్షరాకృతి నాది
మనసు మనసుతొ మాటలాడితె
ఉప్పొంగవా మధురానుభూతులు
తత్వమొకటిగ సాగిపోతే
రవళించవా మన స్నేహగీతులు

1.కనురెప్ప మాటున ఒదిగిపోతా
నిదుర చాటున  కలగమారుతా
ఉదయింతునే పెదవిపై చంద్ర హాసమునై
అలరింతునే హృదయమ్మునే ఇంద్రచాపమునై
నేస్తమా నీ జ్ఞాపకాలే చెఱకు గడలు
ప్రియతమా నీతో క్షణాలే పాలమీగడలు

2.అభిరుచుల మాధురి ఒకటిచేసే
అభివ్యక్తులె అనుబంధమై పెనవేసే
ఇవ్వలేనిది ఏదిలేదు ప్రాణమే నీపరం చేసా
కోరగలిగిదేది లేదు నీ ప్రేమనే చవిచూసా
నేస్తమా నీ జ్ఞాపకాలే చెఱకు గడలు
ప్రియతమా నీతో క్షణాలే పాలమీగడలు

Thursday, December 19, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మోహనం

చిరునవ్వుకు చిరునామా
ప్రతిస్పందనకే తగు ధీమా
స్నేహానికి  నిలువెత్తు రూపం
మానవతకు తానొక ఊతం
మోహనమే సదా మురళీ రవం
మురళీ మోహనుడే మా వరం

1.వినతులు విను కడు సహనం
పదవిని తలవని ఆ వినయం
ఓపిక కలిగిన అనునయం
ఆదరించెటి దయాహృదయం
మోహనమే సదా మురళీ రవం
మురళీ మోహనుడే మా వరం

2.క్రమశిక్షణకే ఒక నిదర్శనం
నిజాయితీకే ఇల తార్కాణం
విద్యుక్త ధర్మ నిర్వహణం
మన్ననలందే అంకితభావం
మోహనమే సదా మురళీ రవం
మురళీ మోహనుడే మా వరం
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

కన్నులు కన్నులతో కలిపి
రాస్తున్నాయీ ప్రేమలిపి
చదివితె భావం ఎంతో చిలిపి
మిన్నకున్నాయేం మనసే తెలిపి

1.పెదవులకెందుకు మాటలు
వలపులు పాడితె పాటలు
బ్రతుకున పువ్వుల తోటలు
భవితన తేనెల తేటలు

2.ఫలించేనులే కలలన్ని
కురిపించునులే వెన్నెల్ని
వినిపించగా సరాగాల్ని
పెంచును అనురాగాల్ని

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

జంట పావురాలే  కంటికింపుగా ఎగిరే
మనజంట కన్నుకుట్టి కంటగింపుగామారే
ఎదిరించుదాం లోకాన్ని-మళ్ళించుదాం కాలాన్ని
ఒకసారి ప్రియా రావేలా-వేచితినే అభిసారికలా

1.కలువనైతిని జాబిలి నీవని
కలువవైతివి నీవెందుకని
కలయిక కలకే పరిమితమా
కలతల నెలవే  జీవితమా
ఒకసారి ప్రియా రావేలా
వేచితినే అభిసారికలా

2.మనసారా నిను వరించితిని
రేయీపవలు కలవరించితిని
నే బ్రతికినట్టు కనిపించే మృతిని
నీవే లేక ఎన్నడు ఆరని చితిని
ఒకసారి ప్రియా రావేలా
వేచితినే అభిసారికలా

PIC COURTESY:P.AGACHARYA sir.

Wednesday, December 18, 2019

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఆటలాడినా నీతోనే-పాట పాడినా నీతోనే
సయ్యాటలాడినా నీతోనే-సాపాటు చేసినా నీతోనే
నేస్తమా నా సమస్తమా-స్నేహమా తీరని దాహమా
పున్నమి నెప్పుడొ మరిచానే-నిత్యం వెన్నెల నీమేనే

1.ఎన్నో నా కలవరాలే-నిను చూడగ వరాలాయే
కల్లోల మహా సాగరాలే  -ప్రశాంత సరోవరాలాయే
దివ్యత్వం నీ మోములో-నవ్యత్వం నీ మోవిలో
వలపులు చిలికే చిలుకవో-తలపుల నిలిచే పలుకువో

2.నిజం చెప్పినా నమ్మవులే-ముదములొ చిప్పిలు చెమ్మవులే
మోహనాంగి ముద్దుగమ్మవులే-మిఠాయిదాగిన చిటారు కొమ్మవులే
ప్రేమ తత్వం నీలోలోలోలో-రాగబంధం ఊగిసలాడే ఉయ్యాలో
మౌన వీణను నేనే మీటాలో-స్నేహమొలకను నేనే నాటాలో
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మస్తుగున్నవె పోరీ-జబర్దస్తుగున్నవీసారీ
సూపుల్తోనే కాపేస్తూ-నవ్వుల్తోనే కైపిస్తూ
మాయేదో చేస్తూ-మదినేదోచేస్తూ-మరిమరి మురిపిస్తూ

1. బుంగమూతి నంగనాచి-సింగిరాలు పోనేల
రంగురంగు పెదాలలో-వలపు రంగరించనేల
అంతలోనె నీవే భద్రకాళి-వింతగా నా ఎదలో కాలి
లేదో ఇసుమంత జాలి-చెలీనువు లేక బ్రతుకే ఖాళి

2.కాటుక కళ్ళరూపు-నాటుకుంది వాడి తూపు
అట్టాఅసలు నవ్వబాకు-గుచ్చుతోంది సోకు బాకు
నిన్నుగన్నతల్లి కోదండం-నువే నా యమగండం
సంకకైన ఎక్కవు ఎక్కీ దించనీవు-వంకలేవొ సెప్పవు సాధించుతావు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మనసు మయూర మౌతుంది నీవు పలకరిస్తే
స్వరము పికమై పాడుతుంది ప్రేమ చిలకరిస్తే
హరివిల్లు దిగివస్తుంది నీవలంకరిస్తే
వయసు పసిగమారుతుంది నన్ను స్వీకరిస్తే..
ఆత్రంగా నీ కరమిస్తే నేస్తంగా అంగీకరిస్తే

1.మలయమారుతాలే నీవు సమీపిస్తే
మార్గమంతా నందనవనమే నీతో నడిస్తే
అష్టావధానమే నీతో స్పష్టంగా వాదిస్తే
ఇష్టానుసారమే కాలం కర్మం సహకరిస్తే
అనుభూతులెన్నో జీవితాన్ని ఆస్వాదిస్తే

2.నాతప్పుకాదు  బంధం మామూలుగ తోస్తే
బోధపడిపోతుంది లోతుగా ఆలోచిస్తే
హృదయాంతరాలలో కనగలవు చూస్తే
కలలన్ని నిజమౌతాయా జన్మలెన్నొ దాటొస్తే
కవి'తలలోనైనా మనగలవు విధి కరుణిస్తే
నీ సేవలో ననుతరించనీయీ సాయీ
నీ ప్రేమలో పరవశించనీయవోయీ
నీ ధ్యానములో తన్మయ మొందనీయీ
నీ సన్నధిలో నను కడతేరనీయ వోయి
సాయీ సాయీ షిరిడీ సాయీ సాయీసాయీ దయగనవోయీ

1.గురువారం ఉపవసించ పూనేరు శరణార్థులు
నీ మందిరాన్ని శుద్ధిచేయ తపించేరు సేవకులు
నీ దర్శన భాగ్యానికి బారులు తీరేరెందరో దీనులు
సాయిరామా పాలతొ నిన్నభిషేకించేరు పూజారులు
పూజలు సేయగా హారతులీయగా ధన్యతనొందేరు జనులు

పంచహారతులీయగా ఆనందమొందేరు అర్చకులు
పల్యంకిక మోయగా ఆరాట పడెదరు ఔత్సాహికులు
షిరిడీశా నీకు జేజేలు పలికేరు వందిమాగధులు
నిను కీర్తించగా గొంతెత్తుతాడు గాయకుడు
బాబా నిను భజించగా వంతపాడుతారు నీ భక్తులు

Tuesday, December 17, 2019

నీవుంటె పాటల తోటే సరి
నీ వెంట తేనెల తోటే మరి
నీ ఊసులన్ని కమ్మని బాసలె
నీ ఊహలన్నీ రమ్మను పిలుపులె

1.నీ భావనలో మధురిమలెన్నో
నీ చెలిమిలోనా సరిగమలెన్నో
ప్రతి కలయిక యిక ఒక గీతమాలిక
శ్రుతిలయ తప్పని రసరాగ గీతిక

 2.కాలమె ఆగి విస్తుపోతుంది
ప్రకృతియే  ఆసక్తిగ చూస్తుంది
కనివిని ఎరుగని వింత బంధం
కవిగాయకుల మధుర సుగంధం
సంపదా  యశస్సూ  ఒకలాంటివె నిజానికి
శ్రమకోర్చుకోక తప్పదు అవి పొందడానికి
ఓపిక నేర్పు కావాలి పెంచిపోషించడానికి
సంకల్పబలం కావాలి సాధించడానికి

1.అడ్డంకులు ఎన్నెన్నో దారిపొడుగునా
దొడ్డమనసు కావాలీ అడుగు అడుగునా
వనరులు ఎన్నో చుట్టూ పరికించి చూడు
ఇసుక నుండి తైలం తీసే నిపుణత వాడు

2.పరుగెత్తి ఎన్నడు పాలకొరకు యత్నించకు
ఉన్న చెమట సైతం ఉరుకులాడి కోల్పోకు
సూక్ష్మం లో మోక్షంలా తెలివిగా వ్యవహరించు
లక్ష్యం ఏదైనా జడవక అలవోకగ ఛేదించు

Monday, December 16, 2019

https://youtu.be/1iNILGXxMeE

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కానడ

నీ తలపే తొలగించును ఆటంకం
నీ స్మరణే దాటించును సంకటం
సిద్ది వినాయకా అన్ననీ ఏకైక నామం
చేర్చగలదు భక్తులనూ ముక్తిధామం
జై సిద్ది వినాయకా మోక్షదాయకా
జయహో గణనాయక ఆరోగ్య దాయకా

1.ఊపిరి పీల్చినా నిట్టూర్చినా
హృదయ స్పందనలో నాడీకణములలో
తనువులో మనసులో నాలోని అణువణువులొ
సిద్దివినాయకా నీ ధ్యానమే మెలకువలో నిద్దురలో
జై సిద్ది వినాయకా మోక్షదాయకా
జయహో గణనాయక ఆరోగ్య దాయకా

2.నా క్షేమము నీ బాధ్యత నా తండ్రీ వినాయకా
నా మనుగడ నీ చలవే నా స్వామీ వినాయకా
ఏ జన్మలోనైనా నీ పాదం విడనీయకు వినాయకా
జన్మరాహిత్యమొసగి నీ సన్నధి దయసేయి వినాయకా
జై సిద్ది వినాయకా మోక్షదాయకా
జయహో గణనాయక ఆరోగ్య దాయకా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హాయి అంటె తెలిసింది చెలీనీ వల్లనే
అనురాగపు జాడలన్నీ నీ ఎదలోనే
నీ జ్ఞాపకాలన్నీ మధురానుభూతులే
నీ సన్నిధిలో క్షణాలు ఆహ్లాద హేతువులే

1.కవితలేల జవరాలా కావ్యాలు రాయనా
నువునడిచే దారిలోనా పూబాట వేయనా
పున్నమికై ప్రతీక్ష ఏల నీ కన్నుల కనుగొననా
మల్లెలకై వెతకగ నేల నీ నవ్వుల ఏరుకొననా

2.ఏనాడు కలిసావో అదియే సుముహూర్తము
ఏ చోట ఎదురైనావో అది పవిత్ర ధామము
మనసులే వేసుకున్నాయీ విడివడని మూడు ముళ్ళు
చినుకులే రాలి అయినాయి మనకు తలంబ్రాలు

OK

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నువు పాడే ఒకే రాగం అనురాగం
నువు చేసే ఒకే లాస్యం పారవశ్యం
నీ ప్రతి పలుకూ త్యాగరాజ కీర్తనం
నీ ప్రతి కదలిక  కూచిపూడి నర్తనం
కోమలీ కోయిల తుల గాయనీ శ్రవణానందినీ
భామినీ కేసరి సరి గామినీ నయనవినోదినీ

1.సామాన్యులు సైతం నిన్ను చూసి కవులౌతారు
గీతనైన గీయనివారు చిత్రకారులౌతారు
సృష్టిలోని  అద్భుతమంటే నీవే నంటాను
రెప్పవేయలేని మిషతో నే అనిమేషుడనౌతాను
నభూతోన భవిష్యతి నీకు సాటి తరుణీ నీలవేణీ
సుందరనారీ వివిధవర్ణ విరి మంజరీ రసరాగిణీ

2.ఎక్కడ మొదలెట్టాలో నీ అందాలు వర్ణించగా
ఏ రంగులొ ముంచాలో కుంచె నిను దించగా
ప్రకృతికే ప్రతిరూపం ఆరాధకుల కపురూపం
రసిక ఎదల పరితాపం నీ తనువే ఇంద్రచాపం
అంగరంగవైభోగం లలనా నీ సహయోగం
ఓపగలేనే క్షణమైనా యుగం మనగలనా నీ వియోగం

Sunday, December 15, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సదా నీ లోకం అదేదో మైకం
నీ సావాసం నిత్యం మధుమాసం
నీగాత్రం ఓ పికమాత్రం-నాకాత్రం లేదోపికమాత్రం
వినిపించవే అభినవ కోయిలా
వికసించ నా మది పున్నమి రేయిలా

1.నా దారి మారింది నువే లేక ఎడారిగా
ఎద తోడు కోరింది దప్పిక తీర్చే సరస్సునీవుగా
ఎడతెగని నిశీధికీ నీవే ఒక ఉషస్సుగా
ఎలమావి తోటలో  కిసలయ రుచులు గ్రోలగా
వినిపించవే అభినవ కోయిలా
వికసించ నా మది పున్నమి రేయిలా

2.నీ గానామృతమే జలపాతమై తడిపేయగా
నీ ప్రణయ గంగలో నే మునకలు వేయగా
కడతేరనీ జన్మజన్మలు నీ కమ్మని ఒడిలో
నను తరించనీ యుగయుగాలూ ఇదే ఒరవడిలో
వినిపించవే అభినవ కోయిలా
వికసించ నా మది పున్నమి రేయిలా

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మా పొదరింటికినీవే సింహద్వారం
మా మనసులకీవే అపూర్వ మణిహారం
ఎన్నటికీ చెరగని చిరుదరహాసం
ఆరారు ఋతువులకూ నీవే మధుమాసం
మా కన్నుల జాబిలీ సిద్దీశ్ గొల్లపెల్లీ
అందిస్తున్నా జన్మదిన దీవెనలు పాటగ అల్లీ
హాప్పీబర్త్ డే టూ యూ సిద్దికన్నా
విష్యూ హాప్పీబర్త్ డే టూ యూ

1.అమ్మానాన్నల అనురాగం రాగమై
చిన్నారి తమ్ముని అభిమానం గానమై
బంధుమిత్రులందరీ శుభకామనల బృందగానమై
నీ పుట్టినరోజే జగతికి అపురూపమై
వర్ధిల్లు వెయ్యేళ్ళు ఆయురారోగ్యాలతో
విలసిల్లు అసమాన కీర్తి ప్రభలతో
హాప్పీబర్త్ డే టూ యూ సిద్దికన్నా
విష్యూ హాప్పీబర్త్ డే టూ యూ

2.కొలవలేని ఓపికే వ్యక్తిత్వ దీపికగా
ఎనలేని ప్రతిభయే నీ ప్రగతికి సూచికగా
పదిమందిసాయపడే మానవతా వాదిగా
వంశానికె వన్నె తెచ్చు  పరసువేదిగా
వర్ధిల్లు వెయ్యేళ్ళు వినాయకుని కరుణతో
విలసిల్లు కొండగట్టు హనుమంతుని అండతో
https://youtu.be/JLmMSzmPNu0

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మధ్యమావతి 

మూఢ భక్తి నీకెంత ఇష్టమో- భోళా శంకరా
గాఢ భక్తి అది ఎంత స్పష్టమో-భక్తవ శంకరా
నెలవంక దాల్చిన జంగమదేవరా గంగాధరా
నా వంక నీవేల రావేలరా  గౌరీవరా అనంగాహరా

1.నాగమణులు రాళ్ళనుకొను ఏనుగు
పత్రి పుష్పాలే చెత్తాచెదారమనే నాగు
దారాల అల్లికతో నీడకూర్తునను సాలెపురుగు
నీపై నిశ్చల భక్తివినా మరి యేమి ఎరుగు
కరుణించవేరా శ్రీ కాళహస్తీశ్వరా
నేనూ పరమ మూఢుణ్ణి గమనించరా

2.గజచర్మాంబరధారిగ గజాసురుని బ్రోచావు
చిరంజీవిగా మార్కండేయుని దీవించావు
కన్నప్పను గుణనిధినీ విధిగా కృపజూచావు
సిరియాళుని వరమొసగగ పరీక్షించినావు
దయజూడవేలరా వేములాడ రాయేశుడ
నేనూ వెర్రిబాగులోడనే పరికించి చూడ
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

విరబోసిన నీలికురుల కృష్ణఝరిని కానా
అరవిరిసిన విరజాజిగ నీ జడను చేరిపోనా
ముగ్ధమోహనం నీ వదనం
మకరంద సాగరం నీ అధరం
బొట్టునై వెలగనా నుదుటన
పుట్టమచ్చనై మెరవనా పెదవంచునా

1.సోయగాల నల్లకలువలే నీకళ్ళు
మిసమిసలొలికే రోజాలే చెక్కిళ్ళు
శంఖమంటె ఏమిటో తెలిపే నీ కంఠము
పసిడివన్నె పరిఢవిల్లు నీసుందర దేహము
ఏ జన్మలోను చెలికానిగాను నను మనని
ఈసారికైనా ఆలకించవే నీ దాసుని మనవిని


2.ఊరించే చూపులు ఉడికించే నవ్వులు
తెలిపేను ఎదలోని ఎన్నెన్నో మర్మాలు
నీ మౌన గానాలు కుదిపే నా పంచప్రాణాలు
గుచ్చుకున్నాయెన్నో గుండెకు విరుల బాణాలు
అలరించవే చెలీ ననుచేరి ఆమని భామినిగా
మన జీవనమే పరిణమించగా బృందావనిగా

Saturday, December 14, 2019

https://youtu.be/31U5bXfGI9M?si=cQig3kampIpMw2Fl

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:శివరంజని

నీదీనాదీ ఒకటే దేశం
మనలో మనకు ఎందుకు ద్వేషం
వేరనడానికీ నెపములెన్నెన్నో
మనమొకటని భావించగా-కారణమొకటైన దొరకదా
బోలో భారత్ మాతకీ జై-బోలో దునియాకీ జన్నత్ కో జై

1.నేను నా కుటుంబం నా వీథి నాఊరు
నా జిల్లా నా రాష్ట్రం అంటూ విడివడతారు
నా శాఖ నా కులము నా మతమే శ్రేష్ఠము
 నా యాస నా భాష నా ప్రాంతమె నా కిష్టము
పెంచుకోర సోదరా హృదయ వైశాల్యము
కలుపుకుంటె నీదిరా సువిశాల భారతం
బోలో భారత్ మాతకీ జై-బోలో దునియాకీ జన్నత్ కో జై

2.జాతీయస్ఫూర్తియే భరతావనికి పెట్టని కోట
ఐకమత్య లౌకికతే ఇంటా బయట భద్రతకు బాసట
ఘనములకు ఝరులకు జలధికి అనుబంధం
ఒకే దేశ ప్రజాస్వామ్య వారసులం మనకెందుకు భేదం
చేయి చేయి కలుపరా  ప్రగతి బాట పట్టరా
ఎదను ఎదుటను ఎదురౌవైరులను తరిమితరిమి కొట్టరా
బోలో భారత్ మాతకీ జై-బోలో దునియాకీ జన్నత్ కో జై


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:మోహన

ముక్కోటి దేవతలకు ఒక్కనాడె దర్శనము
వైకుంఠ ఏకాదశి దర్శనము
ఉత్తర ద్వారాన దర్శనము
కోట్లమంది భక్తులకు దివ్య దర్శనం
ప్రభో అను నిత్య దర్శనం
స్వామీ సామీప్య దర్శనం
చిద్విలాసా హే శ్రీనివాసా
అర్ధనిమీలితనేత్రా హే ఆప్తమిత్రా

1.మునులకు ఋషులకైన దుర్లభమే నీదర్శనం
ఇంద్రాది సురులకైన పరిమితమే నీప్రాపకం
ప్రహ్లాద నారదాది భక్తులకూ పరమ విశేషం
సామాన్య మనుజులకు సర్వ దర్శనం భవ్య దర్శనం
ప్రభో అను నిత్య దర్శనంస్వామీ సామీప్య దర్శనం
చిద్విలాసా హే శ్రీనివాసా -అర్ధనిమీలితనేత్రా హే ఆప్తమిత్రా

2.సుప్రభాత సేవ దర్శనం సుఖదాయకం
అభిషేక సేవలో  నిజరూప దర్శనం
తోమాల సేవ దర్శనం నయనానందకారకం
నిత్యకల్యాణ దర్శనం లోక కల్యాణార్థము
సడలింపు పూలంగి తిరుప్పావడ ఏకాంత సేవలు
పూర్వ జన్మసుకృతాన సులభసాధ్యము
చిద్విలాసా హే శ్రీనివాసా -అర్ధనిమీలితనేత్రా హే ఆప్తమిత్రా
రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:రేవతి

“ మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాం శతం!! ”

ఎలా కలుపుతాడో భగవంతుడు
భిన్నమైన ధృవాలను
ఎందుకు ముడిపెడతాడో పరమేశ్వరుడు
విభిన్నమైన మనస్తత్వాలను
ఎంతటి బలమైనతాడో చెరోవైపు లాగినా తెగనే తెగదు
ఎందుకీ మాయలో పడతాడో తెలిసీ వగచుట తగదు

1.దాంపత్య మంటేనే ఆధిపత్య రాహిత్యం
నవరసాలు నిండిఉన్న అద్భుత సాహిత్యం
అభిప్రాయభేదాలకు తగ్గదు సాన్నిధ్యం
నిత్యం వాదనల నడుమ చెదరదు బాంధవ్యం
ఎంతటి బలమైనతాడో చెరోవైపు లాగినా తెగనే తెగదు
ఎందుకీ మాయలో పడతాడో తెలిసీ వగచుట తగదు

2.భారతీయ వైవాహిక వ్యవస్థ ఘనతనో ఇది
వేదమంత్రాలలోని మహిమాన్విత ఫలితమో ఇది
ఒకరిపట్ల ఒకరికున్న విశ్వసనీయతనో ఈ గుఱి
కాపురాల కాలాంతర అనురాగ మర్మమో మరి
ఎంతటి బలమైనతాడో చెరోవైపు లాగినా తెగనే తెగదు
ఎందుకీ మాయలో పడతాడో తెలిసీ వగచుట తగదు

Thursday, December 12, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం:విహాగ్

నలిగిపోతున్నాడు నేటి కవి
అలిగి మిన్నకున్నాడు భావాల పీకనులిమి
నిరంకుశా కవయః నిన్నటి మాట
ఆచితూచిఅడుగులదీ ఈనాటి బాట

1.విస్తృతమై వరలుతోంది ప్రకటనా మాధ్యమం
అంతర్జాలవేదికయే నడుపుతోంది ఉద్యమం
అన్నీ ఉన్నా గాని అల్లుడి కేల్నాటి శని
నవ్వలేని ఏడ్వలేని త్రిశంకు స్వర్గమిది
గణణీయమై గుణహీనమై కబంధహస్తాల బలహీనమై
కవుల భవిత ఎంతో వేదనగా ఆదరణే కరువైన అనాధగా

2.ప్రశ్నించే యధార్థవాది విప్లవాల ప్రబోధిగా
తాన అంటే తందాన అనగ అస్మదీయులుగా
సభ్యసమాజానికే కవి జవాబు దారుడిగా
రాజకీయ పార్టీలకు కంటగింపు వాడిగా
రాసే భావాలకు కత్తిరింపు వేసి ఎగసే ఆవేశం అణచివేసి
కనిపించని ఉక్కు సంకెళ్ళతో తానుగా మనసనే చెఱసాలలో

Wednesday, December 11, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:భైరవి

జాబిలి నవ్వింది ఆమని పూసింది
ఆనందం జల్లుగా అవనిపైన కురిసింది
మౌనమే ధ్యానమై నా మనసు మురిసింది

1.ఆటుపోటులన్నిటిని తట్టుకొంది తీరము
కంటిలోని సంద్రానికి వేయలేము యాతము
ఎగసిపడే ఎదమంటకు ఏల వగపు ఆజ్యము
నివురుగప్పుకొంటె నిప్పుకెప్పటికీ సౌఖ్యము

2.నరికి వేయు నరులకూ చెట్లు చేటు చేయవు
మురికి చేయు మనుజులకూ నదులు విషమునీయవు
పంచలేమ నలుగురికీ  ఖర్చులేని నవ్వులను
ప్రకటించలేమ పదిమందికి ప్రేమానురాగాలను

https://youtu.be/3hANlTlEcJ4

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కల్యాణి

నా చిత్తపు వ్యవహారము-నీ చిత్తానుసారమే
నా సాహితి వ్యవసాయము-నీ ఆనతి మేరకే
మేధావిని వేదాగ్రణి వాణీ పారాయణీ
నమోస్తుతే సరస్వతి హే భారతి కల్యాణీ

1.అక్షరములు రుచించనీ భావ పథములై
నా పదములు గమించనీ పరమ పదముకై
నవరసములు రంజింపనీ పాఠక హృద్యములై
నా కవన గీతములే నీకు నైవేద్యములై
కదిలించవె నాకలమును అనితర సాధ్యముగా
దీవించవె నారచనలు అజరామరమవగా

2.మనోధర్మ సంగీతము జన మనోహరముగా
తన్మయమౌ రాగతాళ స్వరకల్పన వరముగా
గాయకులే పరవశించి పాడుకొనే గేయముగా
శ్రుతి లయ గతితప్పని అపురూప కీర్తనగా
పలికించవె నా గళమును పదికాలాలు
ఒలికించవే నా పాటలొ  మకరందాలు
https://youtu.be/v4qnytRgkxY

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:హంసానంది

ఫకీరుగా నిన్ను భావింతురు కొందరు
పరమాత్మగానూ ఎంచెదరింకొందరు
కులమతాలకతీతమౌ నాదమే  నీవు
బైబిల్ ఖురాన్ గీతామృతమౌ  వేదమే నీవు
మానవతకు నిలువెత్తు రూపానివి నీవు
సాయిరాముడవీవు సాయి బాబా నీవు

1.సంకుచితమగు మా బుద్ధికి అందదు నీ తత్వము
గిరిగీసికొని బ్రతికే మాకు బోధపడదు విశాలత్వము
 సద్గురువుగా  నిన్ను స్వీకరించమైతిమి
మహనీయమూర్తిగా అనుసరించమైతిమి
నీ మహిమ నెరుగలేనీ మూర్ఖులమే మేము
నీ లీల లేవీ కనలేని  మూఢులము

2.అభిమతాల కనుగుణంగా మతమునంటగడతాము
నచ్చిన రూపాలలోనే నిన్ను పిలుచుకుంటాము
అవధులలో కుదించలేని అవధూతవీవు
అల్లా జీసస్ కృష్ణులా అవతారమే నీవు
నీ జ్ఞాన జ్యోతిని వెలిగించు మా లోన
సౌహార్ద్ర సౌరభాన్ని వెదజల్లు మా పైన


OK

Tuesday, December 10, 2019

https://youtu.be/1kMwJ5ZU7-8?si=_tf5bj3oXzMY1vDu

అమ్మా అమ్మా దేవతవే నీవమ్మా
అమ్మా అమ్మా నా బ్రతుకే నీదమ్మా
నేనడిచే సన్మార్గం నీ చలవేనమ్మా
నా పాలిటి ఇల స్వర్గం నీవే నమ్మా
నీ గోరు ముద్దరుచినే నా మనసు మరువకుంది
నీలాలి పాట ఇంకా నన్ను నిదుర పుచ్చుతోంది

1.వ్యక్త పరచలేనమ్మా నీపైని నా ప్రేమని
బదులు ఇవ్వలేనమ్మా నువు చూపెడి ఆ మమతని
దూరాలు పెరిగాయి నీ దరి మనలేక
పలుకరించనైతి నా వెతను తెలుపలేక
మన్నించవమ్మా నిను మన్నన సేయనైతి
కినుకేలనమ్మా నా తలపులనిను నిలిపితి
నీ చేతి వంట తినగ వస్తానమ్మా
నీ పలుకుల పంచదార తింటానమ్మా

2. తట్టుకోనైతిని నువు మోసేబాధ చూసి
సాయపడకపోతిని మిషతో నే దాటవేసి
కష్టాలకు చిరునవ్వే మందని నేర్పావు
కన్నీళ్ళకు తావీయని దృఢ హృదయము నిచ్చావు
ప్రతి జన్మలోనూ నీ కడుపున ననుమోయి
అమితమైన అనురాగం నా కందగజేయి
మళ్ళీపుట్టినపుడు నిను మాడ్వనమ్మా
విధి ఎంతగ వేధించినా నేనేడ్వనమ్మా

OK


Monday, December 9, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సిత్రమే కవి బతుకు శివుడా
ఆత్రమేలా తనకు భావాలు కక్కంగ భవుడా
పట్టమంటే కప్ప ఒప్పుకోదాయే
విడవమంటే పాము తప్పుకోదాయే
కత్తిమీదిసాము తీరాయే కలమునకు
స్వేఛ్ఛలేకా రాయు కవితలవి ఎందులకు

1.అనుభూతి చెందికద చేయాలి రచనలు
శబ్దరస స్పర్శరూపగంధాలె స్పందనలు
నవరసాలొలికించ తగినదే గద సాహితి
రవిగాంచడేమొగాని కవికేది పరిమితి
కట్టడితొ పుట్టునా కమనీయ కావ్యాలు
ఆంక్షలతొ తీర్చునా అక్షరాలు  లక్ష్యాలు

2.శృంగారం నిశిద్ధమే సభ్యసమాజానికి
అభ్యుదయం కంటగింపు ప్రతి ప్రభుత్వానికి
కరుణరసం పెడసరం నిత్యానందులకు
భీభత్సం భయానకం రౌద్రాలు ఎందులకు
శాంత హాస్య అద్భుతాలు తయారే విందులకు
దశమరసమె మౌనం దాల్చాలి సుఖమందులకు 

Saturday, December 7, 2019

రచన,స్వరకల్పన&గానం:రాఖీ
రాగం :శహనా

ఎదురుచూచు వేళలో అభిసారికవో
ఎదను పరచుసమయాన అపర రాధికవో
వలపుకుమ్మరించగా వరూధినీ ప్రతీకవో
అలకబూను తరుణాన ఆభినవ సత్యభామవో
ఓ చంద్రముఖీ నా ప్రాణ సఖీ
నీవులేక నిలువలేను నిమిషమైనా
నినువినా మనలేను ఓక్షణమైనా

1.మైనాను మరిపించును నీ పలుకులు
కలహంసను తలపించును నీ కులుకులు
మయూరమే తయారగును గురువుగ నినుగొనుటకు
చకోరమే దరిచేరును నీకౌముది గ్రోలగనూ
ఓ చంద్రముఖీ నా ప్రాణ సఖీ
నీవులేక నిలువలేను నిమిషమైనా
నినువినా మనలేను ఓక్షణమైనా

2.ముంగిలియే తపించునీ రంగవల్లి కోసమూ
లోగిలిలో తులసికోట ఆశించును సావాసము
గృహమంతా శోభించునీ ఆలన పాలనలో
నా మనసే సేదదీరు నీ ఒడిలో కౌగిలిలో
ఓ చంద్రముఖీ నా ప్రాణ సఖీ
నీవులేక నిలువలేను నిమిషమైనా
నినువినా మనలేను ఓక్షణమైనా

Friday, December 6, 2019

https://youtu.be/8OsBHhtsMQ0

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

అవతారమెత్తుతాడు చక్రధారి
అవనీతలానా దనుజవైరి  శ్రీహరి
దుర్జనులను నిర్జించగ-దుష్కృతాలు హరియించగ
వినతులు వింటాడు-వెంటనే ఆదుకొంటాడు
కొలువుదీరి ఉంటాడు-కలియుగవైకుంఠమైన
వేంకటాద్రి శిఖరానా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా

1.నదులవరదగొనితెచ్చి-పాపుల ముంచేయును
సుడిగాలిఒడిజేర్చి-కౄరుల పరిమార్చును
అగ్నిశిఖల పడద్రోసి-దూర్తుల దహియించును
పంచభూత ప్రళయాలతో-పతితుల పరిమార్చును

1.పిడుగుపాటు కలుగజేసి-నిహతులవగజేస్తాడు నికృష్టులను
భూకంపాల భీభత్సాన-మట్టుబెట్టి మట్టికప్పు త్రాష్టులను
ఏమానవుడిగానో ఉసురుదీసి-మసిజేయును కామోన్మాదులను
పంచభూత ప్రళయాలతో-పతితుల పరిమార్చును

Thursday, December 5, 2019

https://youtu.be/UPOAXRaZ7Kc

రచన,స్వరకల్పన&గానం:రాఖీ

సాయం కోరితి షిరిడీ సాయి నిన్నూ
భరోసా ఇమ్మని బతిమాలితిని బాబా నిన్నూ
ఎవరినడిగినా గాని నీగొప్పలు చెబుతారు
నీ లీలల అనుభవాలనూ ఏకరువెడతారు
నమ్మశక్యమౌతుందా అనుభూతి చెందేవరకు
మా ఇడుములు బాపక తప్పదు నీ ఉనికి కొరకు
శరణంశరణం సాయీ శరణం షిరిడీసాయీ॥

1.నీ నామం జపియించినంతనె- మనఃశ్శాంతి దొరికునందురు
గురువారం ఉపవసించగా-కోరికలీడేరునందురు
షిరిడీలో నీదర్శనమ్ముతో-చిత్త భ్రమలు తొలగునందురు
విభూతిని నుదుట ధరించిన-భయములు మటుమాయమందురు
నమ్మశక్యమౌతుందా అనుభూతి చెందేవరకు
మా ఇడుములు బాపక తప్పదు నీ ఉనికి కొరకు
శరణంశరణం సాయీ శరణం షిరిడీసాయీ॥

2.మా దృష్టి నీపై ఉంటే  బాధ్యతగా మము కాతువందురు
నీ చరిత్ర పారాయణతో-చిక్కులన్నీ తీరునందురు
దానగుణము కలిగుంటే సంపదలు తులతూగునందురు
నిన్ను శరణుపొందితే వ్యాధులన్ని నయమౌనందురు
నమ్మశక్యమౌతుందా అనుభూతి చెందేవరకు
మా ఇడుములు బాపక తప్పదు నీ ఉనికి కొరకు
శరణంశరణం సాయీ శరణం షిరిడీసాయీ॥

OK