Saturday, January 30, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అతను :వసంతం వచ్చివాలింది

ఆమె     :తనంత తానై మోడైన నా మదిమానున

అతను :మధుస్వరం ఆలపించింది

ఆమె     :సాంత్వన గీతమైనా ఎదగాయం మానున

అతను :వసంతమే నీ స్నేహితం

ఆమె     : ప్రతిగీతం నీ ప్రోద్బలం


1.అతను  :నీ నవ్వులన్నీ అందం గంధం కలిగిన విరులే

ఆమె          :నీ చేరువ వల్ల మరులే రేపే వెచ్చని ఆవిరులే

అతను      :నీ ఊపిరిలో ఊపిరినై కవితలు మొలిపిస్తా

ఆమె           :గళమున గమకాలొలికిస్తూ మాధురి చిలికిస్తా

అతను       :నీ గానమే నా ప్రాణము 

ఆమె           :నీ నీడగా నా జీవితం


2.ఆమె  :గులాబీలనే నువు నడిచే దారంతా పరిచేస్తా

అతను  :అనుక్షణం కనిపెట్టేలా నా చూపులు నీ కాపరిచేస్తా

ఆమె      :హితమును కూర్చే గతులకు మార్చే సూచికనౌతా

అతను  :బడలిక తీర్చి ఉల్లాసమిచ్చే మలయామల వీచికనౌతా

ఆమె      :నా ఆశయం నీ ఉన్నతి 

అతను  :కర్తవ్యమైంది నీ ప్రగతి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాముడెలా వగచాడో

కృష్ణుడెంత వేచాడో

తన సీతకోసం ఒకరాధకోసం

మించిన విరహాన ప్రతినిముసం

నిదురలేమితొ నేను నీకోసం నీ కోసం


1.జాలిలేదు జాగుసేయ

ఝామాయే జాబిలిగని

నా వరాల జవరాల 

ఎడబాటు బాటలేల


2.ప్రతీక్షయే నీ పరీక్షగా 

ప్రతీక్షణం నాకొక శిక్షగా

జీవిత లక్ష్యమే మోక్షమై

దీక్షగా నిరంతరం నిరీక్షణం

Thursday, January 28, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వికసించనీ ఎదసుమం నీ అనురక్తితో

ముకుళించనీ కరద్వయం నీపై భక్తితో

తిలకించనీ నీ రూపమే ఆసక్తితో

పులకించనీ నా మది కడుప్రీతితో

సాయీ దయచేయి సాయీ వరమీయి

సాయీ వందనమోయీ సాయీ ఆనందమీయి


1.నిను నమ్మితే కొదవుండదు

నిను వేడితే భయముండదు

నిను శరణంటే నిశ్చింత

చోటీయీ పదముల చెంత

సాయీ దయచేయి సాయీ వరమీయి

సాయీ వందనమోయీ సాయీ ఆనందమీయి


2.సాయి రాం నాకూతపదం

సాయి నీ స్తోత్రమే భువివేదం

నిను తలవగనే మది మోదం

సాయి నీనామం ఆహ్లాదం

సాయీ దయచేయి సాయీ వరమీయి

సాయీ వందనమోయీ సాయీ ఆనందమీయి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వానకెంత ఆతురత -జాణా నీమేను తడమాలని

తన చినుకుల కనులతో 

జ్యోత్స్నదెంత చతురత-తరుణీ నిను కౌగిలించ

తన శీతల చేతులతో

నేనాగలేను నేవేగలేను రమించగ 

రమణీ నే విరమించగా

నేనోపలేను నేసైచలేను రతికుతి మించగ 

ప్రకృతిగ పరిణమించగా 


1.జలపాతానికీ ఉత్సుకత-నీ ఒళ్ళంతా ముద్దాడగ

తన తుంపరలతొ వింతగ

ఇంద్రచాపానికి ఒక కలత-నిలువెల్లా నిన్నలుకోవాలని

ఏడురంగులున్న చీరగా

నేనాగలేను నేవేగలేను రమించగ 

రమణీ నే విరమించగా

నేనోపలేను నేసైచలేను రతికుతి మించగ 

ప్రకృతిగ పరిణమించగా


2.మల్లికలకు ఎంతటి ఆశ-నీ వీనులకడ ఊసులాడాలని

మాలలొ దారం ఊపిరాడనీకున్నా

అందియల కొకే ధ్యాస-నీ పదాలనే అంటి పెట్టకోవాలని

దుమ్ముధూళీ తమపై రాలుతున్నా

నేనాగలేను నేవేగలేను రమించగ 

రమణీ నే విరమించగా

నేనోపలేను నేసైచలేను రతికుతి మించగ 

ప్రకృతిగ పరిణమించగా

Wednesday, January 27, 2021

 రచన,స్వరకల్పన&గానం :డా.రాఖీ


అంతా నార్మల్ ఐతే-అంతకన్న ఏముంది

ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తే-ఆనందం మనదౌతుంది

 నిన్న చేదు రేపు రాదు-నేడే మనదనుకొంటేనే

సంతోషమే సౌఖ్యమన్నది మననెప్పుడు వీడదు


1.హాప్పీ అడ్రస్ ఎంతవెతికినా బయట దొరకదు

ఎంజాయన్నది మనసులో మినహా ఇలలో ఉండదు

ఎప్పటికప్పుడు మనని మనం రివ్యూచేసుకోవాలి

ఎదుటివారికి నిర్మలంగా లవ్యూ చెప్పుకోవాలి


2.కూలిన సౌధం నిలుపుట అన్నది సాధ్యమే కాదు

పూరిగుడిసెలో ఉంటేనేం సంతృప్తితొ లోటే ఉండదు

నవ్వుల పువ్వులు పూయించాలి పెదాల మీద

మమతల జల్లులు కురిపించాలి ఎదుటి ఎదల్లోన

https://youtu.be/0BkHX-Gqzv8?si=9CdRoSShsWTziOac

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

బ్రహ్మ పదార్థమా-దేశమన్న మాట వ్యర్థమా
నేటి యువత మనసులో అదే అంతరార్థమా
తమ స్వార్థం తమ ఆర్జన తమదైన జీవితమే పరమార్థమా

1.దేశభక్తి యన్న పదమే  ఎదల్లో  ఎంత వెతికినా మృగ్యం
జాతీయభావనంటె కొందరు యువకుల్లో చిత్రమైన వైరాగ్యం
ఇకనైనా మేలుకోకో ఓ యువతా నీదే ఈ దేశం ఇది నీకోసం
ఇకనైనా తెలుసుకో ఓ భవితా ఇది సత్యం  ఇది తథ్యం

2.స్వాతంత్ర్య యోధుల ప్రాణత్యాగాల విలువ తెలియదు
ఉద్యమాలలో బలిదానాలతో సాధించిన ఘనత లెరుగరు
కేంద్రంలో రాష్ట్రంలో ప్రముఖులెవరెవరో వారి ఊసేపట్టదు
గంజాయి మత్తులో పబ్బల గమ్మత్తులో దేశపు ధ్యాసే గిట్టదు

3.భారతదేశమే ఇండియా అంటే కొందరికొక వింత
జాతీయగీతాలాపన ఇంకొందరికెందుకో కడు రోత
తల్లిపాలు తాగి-రొమ్ముగుద్దు వైఖరితో-విద్యావంతుల నడత
స్వదేశానికైతే అతిథులవలెనే -డాలర్లకోసమే విదేశాల వలస

4..వాడుకొనుట ఎరుకె కాని మనదను భావన లేదు
కలర్లకో రిపేర్లకో ఇల్లంటే ఇసుమంతైనా శ్రద్ధలేదు
జీవితాలు కాపురాలు యువతరానికి  తృణప్రాయం
బ్రతుకును నిమ్మళంగ ఆస్వాదించగ ఏదీ సమయం


Tuesday, January 26, 2021

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తారకాసుర హర హరోంహర హరహర

కృత్తికానందన కుమారా పార్వతీ వరపుత్రా

నమోనమః నమోనమః శివాయసూనవే నమః

శూలధరాయ నమో శిఖి వాహనాయ నమో నమః


1. విఘ్నేశ్వరానుజాయ అగ్నితేజాయ నమో

వల్లీ దేవసేన పతయే నమో సురవందితాయ నమః

పాలకావడి నీకు పరమ ఇష్టమటస్వామి

పళనిమల బాలసుబ్రహ్మణ్యస్వామి నమో నమామి


2.చిన్మయానందుడవు సచ్చిదానందుడవు

కచ్చ ఏలనీకు మామీద నిత్య లీలావినోద

షణ్ముఖుడవునీవు అరిషడ్వర్గము నిర్జించేవు

వేడినంతనె వేగమె ఆయురారోగ్యము లిచ్చేవు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చక్కెర కర్మాగారం నాదేహం

పంచదార సంచుల గోదాం

పలుకులే పటిక బెల్లాల తీరు

పాటల్లొ తేనె ఊటలై పుసిపారు

చొరబడుతోంది త్వరితంగా మధుమేహం

ఆరోగ్యవంతమైన మేనుకెంతటి ద్రోహం


1.తీయనైన వస్తువులతొ నోరూరు

భక్షపాయసాలతో మనసు బేజారు

పిండిపదార్థాలంటే జిహ్వకెంత జోరు

ఏలికైన నా నాలుకా నీకు జోహారు

చొరబడుతోంది త్వరితంగా మధుమేహం

ఆరోగ్యవంతమైన మేనుకెంతటి ద్రోహం


2.ఐదు రుచులు మాత్రమే ఇకనుండి రసనకు

మరిచే'దై'పోయింది మధురమే బ్రతుకునకు

తీపి రోగమొకటిచాలు కబళించేటందుకు

ఒకసారి వచ్చిందా బ్రహ్మతరమా వదిలేందుకు

చొరబడుతోంది త్వరితంగా మధుమేహం

ఆరోగ్యవంతమైన మేనుకెంతటి ద్రోహం

Monday, January 25, 2021

 (నా సాహితీ అభిమానులకు,బంధుమిత్రులకు,సమస్త నా దేశ పౌరులకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో)


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హలం చేతబట్టి పొలం దుక్కిదున్ని

ఆహార సృష్టి చేసే రైతన్నే భారత రత్న

తుపాకి చేతబూని సరిహద్దు కాపుకాచి

దేశాన్ని రక్షించే సిపాయన్నకే పరంవీరచక్ర

వందనాలనందుకో సైరికుడా గణతంత్ర దినోత్సవాన

జోహారులు నీకివే సైనికుడా సమగ్రభరత మహోత్సవాన


1.అన్నం పెట్టి అందరి ఆకలి తీర్చే అమ్మరా కిసాను

బ్రతుకును తాకట్టుపెట్టి కాపాడుకొనును తన జమీను

ఫలసాయం చేకూర్చి ఉత్పత్తులనందించి

ఎందరికో దేశాన ఉపాధులెన్నొ కలుగచేయు

కారణభూతుడు కృషీవలుడు-కారణజన్ముడీ క్షేత్రకరుడు

వందనాలనందుకో సైరికుడా గణతంత్ర దినోత్సవాన

జోహారులు నీకివే సైనికుడా సమగ్రభరత మహోత్సవాన


2.చలికి ఎండకు వానకు మననికాచు నాన్నేరా జవాను

బ్రతుకునే ఫణం పెట్టి పోరాటం చేసేటి ప్రాణమున్న మిషను

కంటినిండ మన నిద్రకు కునుకులేని రాత్రులె తనకు

ఇంటాబయటా సింహస్వప్నమే అరాచకమూకలకు

ఆపద్భాంధవుడే సేనాచరుడు-ఆదరణీయుడా క్షేత్రజ్ఞుడు

వందనాలనందుకో సైరికుడా గణతంత్ర దినోత్సవాన

జోహారులు నీకివే సైనికుడా సమగ్రభరత మహోత్సవాన

 రచన.స్వరకల్పన&గానం:


ప్రణవానికి పూర్వం మౌనం

ప్రళయానంతరం మౌనం

జననానికి తొలుతగ మౌనం

మరణానికి అవతల మౌనం

మౌనమే గానానికి ముందుగా

మౌనమే సంతృప్తికి సాక్షిగా


ఆత్మను అల్లుకున్నది మౌనం

పరమాత్మను ఆవరించెనుమౌనం


1.మౌనమే మనిషికి పెట్టని అలంకారం

మౌనమే వ్యక్తిత్వాన్ని తూచే తులాభారం

నీలోకి నీవే తొంగిచూడు అంతా మౌనమే

కన్నులతో మాటాడగలిగే వింతా మౌనమే


2.కంచు మ్రోగేలాగ కనకం మ్రోగదు

మౌనం దాల్చావంటే కలహం ఉండదు

ఎల్లలు లేని విశ్వభాష ఏకైక మౌనమే

అక్షరమాల లేనిభాష లోకాన మౌనమే


3.మనసుకు మనసుకుమధ్యన వారధి మౌనమే

మనోరథాన్ని నడిపించే గీతాసారథి మౌనమే

ఎన్నో చిక్కు సమస్యలకు మౌనమే సమాధానం

ఆత్మజ్ఞానం పొందే క్రమాన మౌనం ధ్యాన సాధనం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గాలిలో తేలిపోతోంది నీ ఊహకే నా ఒళ్ళు

ఎన్నాళ్ళు ప్రియతమా నా యవ్వనానికి సంకెళ్ళు

ఎంతగా అలిసాయో ఎదిరిచూసి చూసి నా సోగకళ్ళు

ఎద గోదారిలోనా ఉద్వేగాల పరవళ్ళు


1.రెక్కలే కట్టుకొని ఎగిరిరానా  నీ దరికి

రెప్పలే మూసుకొని కలల ప్రపంచానికి

రెండు కలిసి ఒకటయ్యే కొత్త గణితం మన ఉనికి

ఏకాంతమే లోకమయ్యే రసరమ్య మధువనికి


2.తెల్లచీర ఉల్లమంతా తెలుపుతోందిగా

మల్లెతావి మనసునంతా నలుపుతోందిగా

పల్లెసీమ పంటచేలు మంచెనే మన పడక

అల్లరే చేస్తోంది ఆకతాయి మది వశపడక

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ యాదే నాకు మనాది

నీ చెంత నిత్యం ఉగాది

నీపేరే అనూ అనూ అంటోది నా హృది

మనకలయిక  కింకా ఎంతుందో వ్యవధి

మేఘాలలో తేలితేలి రావే చెలి

కరిగిపోగ కాచుకుంది బిగి కౌగిలి


1.కటిక చీకటి రాత్రులే లోకమంతా నువులేక

చందమామ వెన్నెల మానేసే పున్నమైనా నిను కనక

కాస్త ఎక్కువైందనిపించినా ఇదే నాకు నిజం కనుక

ఇకనైనా వీడవే  ప్రేయసీ నా ఎడల నీ కినుక

మేఘాలలో తేలితేలి రావే చెలి

కరిగిపోగ కాచుకుంది బిగి కౌగిలి


2.కొత్తగా మొదలెడదాం మనదైన జీవనం

సంతోషాలే తొణికిసలాడే అపురూప భావనం

నవ్వుల పువ్వులతో  దారంతా నందనవనం

రాధాకృష్ణుల  ప్రేమలాగా మన వలపూ పావనం

మేఘాలలో తేలితేలి రావే చెలి

కరిగిపోగ కాచుకుంది బిగి కౌగిలి

Sunday, January 24, 2021

OK

 

శ్రీ విశ్వేశ్వర వారణాసి పుర (కాశీ నగర ) వైభవం 


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శివుడే ఆది దేవుడు-శివుడనాది పరమగురుడు

శివుడే విశ్వనాథుడు-శివుడే కాశీపురాధీశుడు

భవాయనమో భవానీధవాయ

శర్వాయనమో పార్వతీ వల్లభాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ


ఓంకారేశ్వరుడు శంకరుడు-

సంధ్యావాటి నర్తన ప్రియుడు

జ్యోతిర్లింగ స్వరూపుడు నభవుడు

ప్రళయకాల జ్వాలి కపాలి శంభుడు

గంగాధరాయనమో గజచర్మాంబరాయ

అంగజహరాయనమో సాంబశివాయ


భగీరథుని మనోరథము నెరవేర్చగా

దక్షిణవాహినియై ఉత్తమగతులీయగ

ఇలవంక వదిలీ గంగ కడకొంగు వీడక

కాశీయే కడయాత్రకు పావనస్థలిచేయగా

వెలసినాడు కాశీలో విశ్వేశ్వరుడై

అన్నపూర్ణ విశాలాక్షి సమేతుడై


గంగాతరంగాలు మృదంగాలుగా

జపమాలల సవ్వడులే మంజీరనాదాలుగ

నమఃశివాయ ధ్వానాలతొ పురము మారుమ్రోగగా

చతుర్వేద పారాయణ శంఖారావముగా

నటరాజే కనువిందుగ చిందేయగా

వారణాసి అపరకైలాసమై వెలిసెగా


గంగలోన మునకలేయ పునీతులవగా

డూండీ గణపతినర్చించి అనుమతి బడయ

కాశీపురపతి విశ్వపతి మందిరమరయ

నమకచమకస్తోత్రాల అభిషేక పూజలు సేయ

కరుణించు భోళా శంకరుడు

వరములిచ్చు లీలా విలాసుడు


అన్నపూర్ణ భవానిమాతను దర్శించగా

అన్నవస్త్రాలకెప్పుడు కొదవరాదుగా

విశ్వజనని విశాలాక్షిని అర్థించగా

విజయమే కలుగజేయుచు రక్షించుగా

వందనాలివిగొ మముగన్నతల్లీ అన్నపూర్ణా

హారతులు గొనుము కల్పవల్లీ విశాలాక్షీ


కనురెప్పలా కాపుకాయును కాలభైరవుడు

పరాన్నదోషము నివారించు పరాన్నభుక్తేశుడు

సప్తమోక్షద్వారాలకు శ్రేష్ఠతమమీ వారణాసి

ఉత్తరాదిన బనారసను నామమే కడు వాసి

కాశీ దర్శన ఫలప్రాప్తి పూర్వపుణ్యమే

కాశీలో మరణిస్తే శివ కైవల్యమే


సురలకు నరులకు ముక్తిధామము

దేశవిదేశీ భక్తుల కాలవాలము

సనాతన సంస్కృత విద్యా పీఠము

ప్రాచీన సంస్కృతీయుత ప్రాభవము

కాశీనగరము విశ్వానికి కేంద్రము

కాశీ స్మరణయు భాగ్య విశేషము


ఎనుబది నాలుగు లక్షల రకాల జీవరాశి

ఎనుబది నాలుగు గంగాఘాట్లతో కాశి

అస్థికాభస్మాలకు గంగానిమజ్జనమే స్వస్తి

మనిషి జన్మ పరమార్థ సార్థకతకది సంప్రాప్తి

శవభస్మవిలేపనయే ఈశ్వరునికి తృప్తి

కాలకాలుడే ప్రసాదించును జన్మ నివృత్తి


నవరంధ్రాల కాయం అనూహ్యమై మటుమాయం

నవరాత్రులు కాశీపుర శయనం గంగాతోయం

నవవిధ భక్తుల అనుభవం శవం శివమైతే నయం

నవధాన్యాల నవరత్నాల కైంకర్యం కమనీయం

నవనవోన్మేషం నేటి కాశీ పట్టణం 

భువి అభినవ కైలాసం వారాణసి పురం


ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ



 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మనసుల్లో వేరే ఏదోగా

మనషులెంతొ హుందాగా

తలపుల్లో ఎంతో తేడాగా

దాగుడుమూతల్లో స్నేహంగా


1.ఆకర్షణ చూపు తిప్పుకోనంతగా

అనుబంధాలే తెంచుకోలేనంతగా

ఒకరిష్టం మరొకరికి ఆమోదయోగ్యమై

పరస్పరం అభిరుచులే గౌరవించదగినవై

నీకోసం నేనుగా నీ బ్రతుకే నాదిగా

అనురాగమంటె ఇదేగా అనాదిగా


2.తెలుపలేకపోతే తిరిగిరాదు సమయం

తెలుసుకోక పోతే ప్రణయమెలా రసమయం

మాటలకందనపుడు భావం మాట్లాడును మౌనం

మౌనం రవళించి పాడుతుంది హృదయగానం

ముసుగులన్ని తొలగించి పారదర్శకంగా

లొసుగులేవి లేకుండా మార్గదర్శకంగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ కళ్ళలో మధిర నిషా

నీ చూపులో కైపు హమేషా

ముగ్గులోకి లాగడం నీకు తమాషా

మొగ్గలోన త్రుంచేయకు ప్రేమంటే ఆషామాషా


1.నా మగటిమికి నిగ్రహమే ఓ పరీక్ష

నీ సొగసులు ప్రకటిస్తూ నా కెందుకే శిక్ష

తాళజాల బాలా లిప్తైనా ఈ ప్రతీక్ష

వేగిరమే వేయవే నీ వలపులనే భిక్ష


2.ఉండాలా కూడదా నా కంటూ ఒక రేపు

ఊరించే నీ పెదాలే ఎదలోన మంటలు రేపు

గాలిలోన తేలేలా చేస్తుంది నీ ప్రతి తలపు

స్వర్గసుఖాలందేలా ఈ క్షణమే నను చంపు

Saturday, January 23, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సంకటములు బాపరా వేంకటాచలపతి

ఆపదమ్రొక్కులవాడా అలమేలు మంగాపతి

ఎంతగానొ చేసితి నీ   గుణగణాల సన్నుతి

వింతదేమొగాని నిన్ను మెప్పించగ విఫలమైతి


1.పలుమార్లు పొగిడితి సైచక నే తెగిడితి

చలనమే కనరాని శిలవైతివ శ్రీపతి

అన్నమయ్య చేసుకున్న పున్నెమేమిటో మరి

పురంధరునికీ అంతటి భాగ్యమెలా శ్రీహరి

అజ్ఞాన కృతదోషములన్ని మన్నించరా

సుజ్ఞాన మార్గానికి నను మళ్ళించరా


2.తాయిలాల నడుగులాగ మాయలొముంచేవు

ఐహిక వాంఛలపై మోహాన్ని పెంచేవు

వీలైనంతగా మమ్ముల దూరంగా ఉంచేవు

తాత్కాలిక సుఖాలకై పరుగెత్తించేవు

పక్షివాహన నా లక్ష్య మింకనీవేనురా

సాక్షాత్కరించి నాకు మోక్షపదము నీయరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంత చెప్పినా ఒడవని రామాయణం

ఎంత వగచినా మారని భారతం

ఇంటింటా ఉన్నదే ఈ భాగోతం

ఇలా కూడ ఉండేదే జీవితం


1.గిల్లికజ్జాలు చిరుచిరు కలహాలు 

ఎంత కీచులాడినా వీడని మోహాలు

ఎవ్వరూ ఇవ్వకూడదు ఉచితసలహాలు

సంసారాలు అంటేనే నాకం నరకం తరహాలు


2.పగలంతా పగలౌతూ యుద్ధభేరీలు

రాత్రైతే  సంధి కోరుతు కాళ్ళబేరాలు

మనసు మనసుకు చేరువకాని వింతదూరాలు

లోకులకోసం వేసుకొనెటి  ముసుగుల మమకారాలు

Friday, January 22, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ ఊహే ఎంత హాయి

కదలనంది మరి ఈ రేయి

వలపు సాచింది నీకై చేయి

కలల సీమకిక విచ్చేయి


1.అల్లంత దూరాన నీవు

కంటికైనా కనరావు

కవుల కల్పనవైనావు

ఎదలొ నీవే దేవతవు


2.మన దివ్య సంగమం 

సదా హృదయంగమం 

మేని మిథున మథనం

గ్రోలగ తరగని అమృతం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమని రాయను నా కవిత

దుఃఖం గడ్డకట్టిన వెత

చేజారినే చెలిమి జత

అశ్రువులే సిరాగ మారిన కత


1.ఏడంటే ఏడే అడుగుల పయనం

మూడంటే మూన్నాళ్ళైన జీవనం

సుడి గాలి చెలరేగి చెదిరిపోయింది

వడగళ్ళ వానలోనా కమిలిపోయింది


2.చిన్నారి గూడు ఛిద్రమై పోయింది

అందాల లోగిలి వన్నె కోల్పోయింది

జంట పక్షి ఎక్కడికో ఎగిరిపోయింది

ఒంటరి తల్లేమో పిల్లల పొదివి పట్టుకుంది

Thursday, January 21, 2021

https://youtu.be/Sz_QWORta-U?si=wT63UpFAwgndk2iN



రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:తిలక్కామోద్ 


నా తనువే తెరిచిన పుస్తకం

నువు చదువుకో ఆపాదమస్తకం

నా మనసే ప్రణయ ప్రబంధం

పఠించుకో పరవశాన ఆసాంతం


1.చుంబనాల సొంపైన చంపకమాలలు

ఆలింగనాల ఇంపైన ఉత్పలమాలలు

మధించతగిన మత్తేభకుంభస్థలాలు

జయింపదగిన శార్దూల విక్రీడితాలు

మేధకు పదనుపెట్టు ఛందో గంధాలు

అంగాంగం ఊరించే అనంగ రంగాలు


2.సరిక్రొత్త అర్థాల విస్మయ శబ్దావళులు

తమకాల గమకాల సమ్మోహన జావళీలు

అలంకార రహితమైన రహస్య దృశ్యాలు

అనాఛ్ఛాదితాలుగ  అసూర్యంపశ్యలు

రాసుకో తరచితరచి ఎన్నైనా భాష్యాలు

చేసుకో నీదైన భాషలోకి తగిన తర్జుమాలు 


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పరస్పరం ఆత్మీయ పలకరింపు 

హాయెంతగానొ గొలుపు

నేస్తాలమైన  మనకదియే

పన్నీటి చిలకరింపు


1.ఒంటరినేనని తలపుకొస్తే

గురుతుకొస్తుంది నీ చెలిమి

నా కంట నీరు చిప్పిల్లితే

తుడిచివేస్తుంది నీ కూరిమి


2.దేహాలు వేరైనా ఒకే ప్రాణము

మనం శ్రుతి లయల మధుర గానమ

బొమ్మబొరుసులున్న ఒకే నాణెము

అక్షరాలు రెండున్నా ఒకే స్నేహము


https://youtu.be/S8KtsUX6dJ4?si=bAickW6JedpeTiee

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:భీంపలాస్ (అభేరి )

అవధూతవు నీవని అననా దత్తావతారమె నీదని
ఫకీరు నీవని ఎంచనా అల్లాహ్ మాలిక్ అంటావని
ఏసుగ నిను భావించన మరణించీ బ్రతికొచ్చావని
మానవతా వాదివననా నిస్వార్థపు సేవలు చేసావని
సాయిబాబా షిరిడి బాబా-సాయిబాబా సద్గురు బాబా

1.కులమతాలు మాకెందుకు బ్రతుకు తెరువు నిస్తెచాలు
వేషభాషలేవైనా మా ఆశలు నెరవేర్చు చాలు
నీ పలుకులననుసరిస్తె హితమనిపిస్తె చాలు
నీ బోధలు పాటిస్తే మహిత తత్వమిస్తె చాలు
సాయిబాబా షిరిడి బాబా-సాయిబాబా సద్గురు బాబా

2.గుడులనింక  వదిలివేసి మా గుండెల్లో కొలువుండు
ఊరూరూ షిరిడీగా మారిపోతే బాగుండు
మనిషి మనిషి లో నీవే అగుపిస్తే కడుమెండు
శరణాగతి మా కొసగితె మా జన్మలు పండు
సాయిబాబా షిరిడి బాబా-సాయిబాబా సద్గురు బాబా


Wednesday, January 20, 2021

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


నెలవంక తలనున్న శివశంకరా

నా వంకలెంచక అనుకంపగనరా

గరళాన్ని మ్రింగినా భోళాహరా

అజ్ఞాని నేనని అలుసేలరా

పశుపతి గిరిజాపతి కైలాసపురపతి

నాకీయరా సద్గతి కపర్దీ శరణాగతి 


1.లింగరూప గంగాధర జంగమదేవర

త్ర్యంబకా కంకటీక  అంతకాంతకా

కపాలీ శూలీ భగాలీ పింగళీ అస్థిమాలీ

నా గుణదోషాలు నీవే కరుణాకర కనికరించరా


2.వృషవాహన ఋతధ్వజా దూర్జటీ

త్రిపురారి భృంగీశా సితికంఠా ముక్కంటీ

మృత్యుంజయ భస్మాంగ సంధ్యావాటి

నా భవతాపాలు నీవె పరిహరించరా ఉద్ధరించరా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నవ్వే నీ మోముకు నవరత్నాభరణం

నీ మంజుల హాసానికి నా ప్రాణాలే తర్పణం

ఎంతని పొగడను నీ అందం చర్విత చరణం

 అందాన్ని మించి అపురూపమే నీ సౌశీల్య గుణం


1.చూపుల్లో మెరిసె నిశి రాతిరి చుక్కలు

చుబుకానికె సోయగమా చిన్నారి నొక్కులు

చెంపలకే ఇంపైన  విన్నాణపు సొట్టలు

వంకీల ముంగురులే విలాసాన దిట్టలు


2.సన్నధిలో పరిమళించు  మధువన గంధాలు

వాగ్ఝరిలో ప్రవహించు మందార మరందాలు

సఖ్యతలో పొంగిపొరలు అతులిత ఆనందాలు

సౌమ్యతలో హాయిగొలుపు వీరంధర చంద్రకాలు

Friday, January 15, 2021

https://youtu.be/k16ju5S4bCI


సప్తగిరి శ్రీపతి 

గొను భక్తకోటి హారతి

నీవే శరణాగతి

మాకీయగ నిర్వృతి


1.శేషాద్రి పదపీఠము

నీలాద్రి మంజీరము

గరుడాద్రి కటి చేలము

అంజనాద్రి కౌస్తుభము

శిలశిలలో నీరూపము

తిరుమలయే అపురూపము


2.వృషభాద్రి వక్షము

నారాయణాద్రి వదనము

వేంకటాద్రి తిరునామము

వేంకటాచలపతీవె కలి దైవము

మోకాళ్ళమెట్లు ముక్తిదాయకాలు

తిరుకోవెల ధర వైకుంఠపు ఆనవాలు


OK

https://youtu.be/DlSw4jbOdxE?si=J2x46FmTTMetAlO1

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : భీంపలాస్ 


నీ తడి తనువును చూడగనే

చిత్తడిరేగెను చిత్తములో

తహతహ తపనల రాపిడిలో

మత్తడి దూకేను తమకములే


1.రెచ్చగొట్టుతావే పచ్చిపచ్చిగా వచ్చి 

చిచ్చుపెట్టుతావే వెచ్చవెచ్చగా కాల్చి

నచ్చాననుకోనా నను మెచ్చావనుకోనా

పిచ్చిపట్టే నీ పొంకాలతొ రచ్చచేయకె లచ్చమ్మా


2.మత్తులొ ముంచబోకే నిను గుత్తగా నాకిచ్చి

చిత్తుచేయబోకే పోట్లగిత్తనేనని మరిచి

ఇద్దరి సుద్దుల పొత్తు పొద్దుకు మాపుకు గమ్మత్తు

హద్దులు దాట నీ ముద్దు తీర్చగ ఆపద్దు ఆ పద్దు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పుట్టుకలో పోరాటం-బ్రతుకంతా ఆరాటం

అనునిత్యం మృత్యువు చెలగాటం

అనుభవాలే మనిషికి గుణపాఠం

నేస్తమా ఈ క్షణమే తరగని ఆనందం

చెరగని నవ్వులె పెదవులు పంచే మకరందం

హాప్పీ బర్త్ డే టూ యూ-విష్యూ హాప్పీ బర్త్ డే టూ యూ


1.వదలకు దొరికిన మంచి అవకాశం 

మరవకు చేయగ పరులకు చిరుసాయం

ప్రతి మనిషీ పుట్టుకకు ఉంటుందొక పరమార్థం

విజ్ఞత కలిగి చేసుకో నీ జన్మ సార్థకం

నేస్తమా ఈ క్షణమే తరగని ఆనందం

చెరగని నవ్వులె పెదవులు పంచే మకరందం

హాప్పీ బర్త్ డే టూ యూ-విష్యూ హాప్పీ బర్త్ డే టూ యూ


2.ధీరత్వం వీడకపోవుటె విబుధుల సుగుణం 

విధికైనా ఎదురీదడమే యోధుల  లక్షణం

మననం చేసుకొ మధురానుభూతుల నీ గతం

ఆదర్శంగా మారాలి లోకానికి నీ జీవితం

నేస్తమా ఈ క్షణమే తరగని ఆనందం

చెరగని నవ్వులె పెదవులు పంచే మకరందం

హాప్పీ బర్త్ డే టూ యూ-విష్యూ హాప్పీ బర్త్ డే టూ యూ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


స్నిగ్ధవై ముగ్ధవై ఉద్విగ్నవై

చొరబడతావే నా తలపులలోకి

శశివై పున్నమి నిశివై తరగని ఖుషీవై

లాగేస్తావే నను వలపులలోకి

నన్ను నా మానానా బ్రతుకనీయవెందుకే

ఊరించి చంపేవు నీ అందాల విందుకే


1.కిసలయాలు కొసిరేటి కోయిల పాటవై

కరిమబ్బుల మురిసేటి మయూరపు ఆటవై

పలు వన్నెలు విసిరేటి విరిసిన విరితోటవై

వయారాలు వంపులతోటి కులికే సెలయేటివై

మురిపించబోకే నన్ను ఆణిముత్యాల సరమై

ఉడికించమాకే నన్ను ఎదదాగిన కల'వరమై


2.వాలుజడలో పూలుబెట్టి మది కట్టివేయకే

వాలువాలు చూపుల తోటి కనికట్టుచేయకే

పరువాలు ఎరవేసిమరీ ఈ పసిచేపను పట్టకే

అనుభవాలు జతజేసీ నను గురిచూసి కొట్టకే

సూదంటురాయిలాగా నన్నుంటుకోకే

వేధించు హాయిగా చేయీయవే నాతో జంటకే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వలపు నేరమయ్యింది

చెలిమి దూరమయ్యింది

మనసు భారమయ్యింది

బ్రతుకు ఘోరమయ్యింది

వెతల జీవితంలో మతుల కతలు ఎన్నో

కలత నిదురలోనా కరిగిన కలలెన్నో


1.కొత్తదనం ఏమీలేదు అనుభవాలలో

భావుకతకు జాడేలేదు వాస్తవాలలో

జ్ఞాపకాలు ఊపిరాడనీయకుంటే

అనుభూతులు గొంతునులుముతుంటే

క్షణక్షణం మరణమై నీరీక్షణయే రణమై


2.ఎదురు పడితె మాత్రమేమి తలతిప్పుకుంటుంది

తన ప్రపంచమంతా పంజరమనుకుంటుంది

ఎంత బాధపడుతుందో విధికైనా తెలిసేనా

జీవశ్చవమల్లే బ్రతికేదీ ఓ బ్రతుకేనా

దినదినమూ దైన్యమై భవిష్యత్తే శూన్యమై

Tuesday, January 12, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆనందం అంతరంగాన

ఆందోళన జీవిత చదరంగాన

నీతోనే పోరాలి నీలోనే పోరాలి

నిన్ను నీవే గెలవాలి 

గెలవాలన్న తలంపుని సైతం గెలిచితీరాలి


1.క్షణికమైన గెలుపుకోసం వెంపర్లాట

గుర్తింపు కీర్తింపుకై దోబూచులాట

మన ప్రతిభకు మనకన్నా నిర్ణేతలెవ్వరు

మంచిచెడ్డల ఎంపికకు మనం వినా చక్రాంగమెవరు


2.జిహ్వకో రుచిలాగా చిత్తప్రపృత్తి

మనిషికి మనిషికీ తనదైన అభిరుచి

ఒప్పించుట కొందరిని నొప్పించుట కొందరిని

ఆత్మ తృప్తికన్న మిన్న చేర్చదేది నిను దరిని

 

https://youtu.be/8QwshHfvSfA?si=BUMSlXgVCB8KKCSE

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఇచ్చినా నువ్వే మా ఇలవేల్పువి

నొప్పిచ్చినా నువ్వే నా ఇఛ్ఛాదైవానివి 

గుండెన గుడికట్టితి కొలువై నిలువరా

కొండగట్టు కపివరా వేగమె నను కావరా

శ్రీ రామదూతం శిరసానమామి

శ్రితపారిజాతం సతతం భజామి


1.మహాబలుడవే నీ శక్తి అతులితమే

వాయునందనుడవే వాలాసనుడవే

శ్రీరామ బంటువే నీ భక్తి అపూర్వమే

సీతమ్మకు ముదమొసగిన పుత్రసముడవే

నువు దృష్టి పెడితె చింతలన్ని చిటికెలొ మటు మాయం

నువు వెన్నుతడితె గెలుచుటయే సదా మాకు ఖాయం


2.  రవిశిష్యా అవలీలగ  సాగరాన్ని దాటావే

     పింగాక్షా రాక్షసల  దుంపతెంచినావే

   లంకాదహనమే జంకక కావించినావే

   రావణుడి దర్పాన్ని అణచివేసినావే

నీ పేరు చెబితె చాలు స్వామి భూతప్రేతాలు హతం

నిను దర్శిస్తె చాలు ప్రభూ భయాలు బాధలు ఖతం

Monday, January 11, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెప్పడమెంతో తేలిక

వాస్తవాలే మ్రింగుడు పడక

నాదీ అని ప్రేమ పెంచుకొన్నాక

వదలుకోవడమే ప్రహేళిక

మనదనుకొన్నదేదీ దొరకదు చేజారితే

పుణ్యకాలం గడిచేపోతుంది ఏమారితే


1.వాడి త్రోసివేసే జీవితాలు కావు మావి

మమతానురాగాలతొ పెనవేసుకొన్నవి

ఒకే కంచం లో పంచుకుంటు తినడం 

ఒక మంచంలో ఒరుసుక పడుకోవడం

తలనొప్పికి చనువుగ రాసే జండూబామ్ లు 

బడలిక తీరేదాకా పెద్దల ఒళ్ళుపట్టడాలు

మనదనుకొన్నదేదీ దొరకదు చేజారితే

పుణ్యకాలం గడిచేపోతుంది ఏమారితే


2.చిరిగితేనో అతుకులు చిరుచిరు మా బ్రతుకులు

మరమ్మత్తులు చేస్తూనే వాడుకొనే వస్తువులు

అనుబంధం పెంచుకుంటూ ఆప్యాయత నంజుకుంటూ

మూగజీవాలనైనా ఇళ్ళూ పొలాలు ఊళ్ళపైన

మాఊరు మాజిల్లా మా రాష్ట్రం మా దేశంగా

మావిగా అనుభూతి చెందే విశాల హృదయంగా

మనదనుకొన్నదేదీ దొరకదు చేజారితే

పుణ్యకాలం గడిచేపోతుంది ఏమారితే

https://youtu.be/Wba6MR529UQ?si=LgbMoD5Md4QPVMj5

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : చక్రవాకం

నీవే మ్రింగావో నాకే పంచావో
గరళమే నిండింది నా గళములో
మాధురే కొఱవడింది గాత్రమ్ములో
నీలకంఠ కాలకూట విషతుల్యమాయే నా గానము
కపర్దీ  కఫమే ఊరుతు కర్ణకఠోరమాయె నా కంఠము

1.కమ్మగ పాడనాయే ఈ జన్మకు
శ్రోతల నలరించనాయె ఏ పాటకు
శ్రావ్యము మార్దవము శ్రవణపేయమే కాదాయే
భావ రాగ తాళ యుక్తమై ఏదీ ఒప్పారదాయే

2.గరగరలే గొంతులో లాలాజలం నోటిలో
పాటపాటకూ ఆగని ఊటలా ఆటంకమై
జన్మతః నోచుకోని గీతం జీవితపు లక్ష్యమై
అమృత సమగానమే బ్రతుకునకే మోక్షమై

3.పికమేమి పూజచేసి మెప్పించిందో
మైనా ఏమైనా మంత్రజపం చేసిందో
సెలయేరు వరమడిగి అభిషేకమొనరించిందో
పర్జన్యం మౌనంగా తపమెంత చేసిందో

4.సంగీత శాస్త్రరచన చేసిన వాడవే
నటరాజ లయాత్మకంగా తాండవమాడావే
నామీద నీకేల ఇసుమంతయు దయలేదా
కరుణా సముద్రా ఆర్ద్రతే కరువయ్యిందా


https://youtu.be/lDLkwQKb2S8


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బాంధవ్యము నెరుగవా శివా

భార్యాద్వయాన్విత గంగాధరా గౌరీవరా

వాత్సల్యము లేదనా అభవా

కుమరులిరువురౌ గజముఖషణ్ముఖ ప్రముఖ

నీదైతే పరివారమా మాదైతే ప్రవ్రాజ్యమా

పరితోషము మాకీయగ నీకేదో వ్యాజ్యమా


1.తలమీద నీకు గంగ కంటిలో నాకు గంగ

నిరంతరం తడుపుడే నిండా మునగంగ

గణాధిపత్యమొకరికి చేయగ ధారాదత్తం

సేనాధిపత్యాన్ని చేసితివింకొకరి పరం

నా పుత్రులు సైతం నీకాప్తులు కారా

పరమపితవు నీవుకదా నీదే  నా అగత్యం


2.మందుమాకులేనివైన వ్యాధులతో మాదైన్యం

వైద్యనాథుడవీవాయే  మీకంతా ఆరోగ్యం

యాతన మాకెంతనొ లేక ప్రత్యామ్నాయం

మృత్యుంజయుడవీవు ఉండదుగా ఏ భయం

మేమంతా నీ వారము మేమూ నీ పరివారము

విశ్వనాథ చూడవేల మా యోగ క్షేమము


OK

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆదివారం ఆనందతీరం

అలుపు తీరగ పరిహారం

నిద్రలేచుట ఎంతో భారం

కోడికూరతొ యవ్వారం

నోరూరించే మాంసాహారం మైకమిచ్చే విస్కీ రం

ఆదివారమంటేనే విలాసం విలాసాలకే విలాసం


1.మందు విందు ఫ్రండ్స్ తో దినమంతా పసందు

వారంమంతా చేసిన శ్రమకు రోజంతా ఆటవిడుపు

ఉరుకుల పరుగుల ఉద్యోగానికి ఊరట కలిగింపు

సండే అంటే ఎందరికో ఎంజాయ్ దొరికే తలంపు

ఆదివారమంటేనే విలాసం విలాసాలకే విలాసం


2.ఇంటిల్లి పాదికీ సండేనే సరదా పంచే హాలీడే

ఇల్లాలికి మాత్రం రుచురుచులన్నీ  వండే చాకిరే

కాలైనా కదపకుండా కాఫీ టీ టిఫిన్ల అర్డర్లిచ్చుడే

ఓపిక గలిగిన అమ్మకు ఆలికి తప్పక సలాం చేసుడే

ఆదివారమంటేనే విలాసం విలాసాలకే విలాసం


(నేను స్వచ్ఛమైన శాఖాహారిని-మందు,దమ్ము లాంటి ఎటువంటి అలవాట్లు లేవు,ఐనా కవి అన్నవాడు ప్రతి హృదయాన్ని ప్రతి ఫలింపజేయగలగాలి అనే ఉద్దేశ్యంతో)

Saturday, January 9, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రెచ్చగొట్టకే నచ్చినదానా

పిచ్చిపట్టు నీ సొగసును నే కన

పచ్చి ప్రాయమౌ చిత్తములోన

మచ్చిక చేయగ  నను దేవాంగనా


1.అచ్చికబుచ్చిక లాడుదువే

వెచ్చని కౌగిట చేర్చుదువే

ముద్దూముచ్చట తీర్చుదువే

బానిసగా నను మార్చుదువే


2.మూడుముడుల బేరంపెట్టి 

ఏడడుగుల దూరం నెట్టి

ఏమార్చి నా ఎదను కొల్లగొట్టి

కొంగునకట్టేవు చుక్కల చూపెట్టి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పువ్వునేర్పుతుంది మనకు- నవ్వడం ఎలాగో

దివ్వె తెలుపుతుంది మనకు- వెలగడం ఎందుకో

పిట్ట ఎరుకపరుస్తుంది- బ్రతుకు విలువ ఏమిటో

పిల్లి బోధచేస్తుంది- తల్లి ప్రేమ ఎంతనో


1.పికము పాట పాడుతుంది- మొహమాటం లేకనే

నెమలి నాట్యమాడుతుంది- మైమరచి లోకమే 

ఎదిరిచూపు మాధురికి- చకోరమే ఒక పోలిక

తేటతెల్ల పరచుటకు- మరాళమే తగు తూనిక


2.తరువూ గురువే- త్యాగమెలా చేయాలో చెప్పుతూ

చిరుగాలి ఘనఘనము -స్నేహంలో కరుగుతూ

నదీ కడలి సంగమం- అనురాగ రాగమవుతు

పిపీలికం పట్టుదలకు- పట్టదగిన యోగమవుతు

Friday, January 8, 2021


https://youtu.be/0JXR-IT4JWU?si=daRyGl_4zZ8StgfM

భక్త వరదుడవే ఆర్తత్రాణ బిరుదుడవే

శరణాగత వత్సలుడవే కరుణాంతరంగుడవే

తిరుమల గిరిరాయా జాగేల సరగున అరయా

మకరి బారి కరి కరిగాచిన సిరి పరిణేతా నీకిది సరియా

నమో వేంకటేశ నమో శ్రీనివాసా

నమోనమో బాలాజీ తిరునామ విరాజీ


1.ఎలా పరిష్కరిస్తావో జటిల సమస్యల ద్రోసి

ఎలా సంస్కరిస్తావో భవబంధాలు వేసి

సరసిజ నాభా మనలేను ఇకపైన నిను బాసి

ఉపేంద్రా ఉద్ధరించు ఉపేక్షింపక దయచేసి

నమో వేంకటేశ నమో శ్రీనివాసా

నమోనమో బాలాజీ తిరునామ విరాజీ


2.ఒకటిని మించి ఒకటి వెతలెన్నని కోటి

దుఃఖమందె నినువేడుట మాకెపుడు పరిపాటి

నటన సూత్రధారీ నీవాటలొ ఘనాపాఠి నేనేపాటి

జగన్నాథ జనార్ధనా అజన్మమీయ నీకెవరు సాటి

నమో వేంకటేశ నమో శ్రీనివాసా

నమోనమో బాలాజీ తిరునామ విరాజీ


https://youtu.be/hNU0eri8Dt0?si=c8rAh_n9jq7అడ్లిల్

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:దర్బార్ కానడ

చనుబాలను అందించి-మురిపాలను చిందించి
అరచేతికి హాయినిచ్చి-శిశువుకు పరవశమిచ్చి
కృతార్థతనొందేటి ప్రలంబమా
స్త్రీత్వానికి అర్థమైన పయోధరమా
ఎన్నటికీ మగజాతి నీకు బానిస
ఎంతవారికైనా నీమీదే ధ్యాస

1.పసివారి ఆకలి తీర్చే అమృత భాండమా
మాతృత్వ మధురిమలో బ్రహ్మాండమా
కోడెవయసు కోర్కె రేపు అగ్నిగుండమా
జగజ్జెట్టినీ పడగొట్టే వలపుకోదండమా
ఎన్నటికీ మగజాతి నీకు బానిస
ఎంతవారికైనా నీమీదే ధ్యాస

2.త్రిమూర్తులే దత్తుడై గ్రోలిన చందమా
శివభక్తుడు లింగమని పూజించిన వైనమా
పురుషుని చూపులాగు అయస్కాంతమా
సేదతీర్చి ఊరడించు పరమ ఔషధమా
ఎన్నటికీ మగజాతి నీకు బానిస
ఎంతవారికైనా నీమీదే ధ్యాస


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎవరు చెక్కినారమ్మా ఇంత చక్కటి శిల్పాన్ని

భువికి ఎవరు దింపిరమ్మ నీ సజీవ రూపాన్ని

శివుడే పరవశుడైన ఆకాశ గంగవా

కౌశికుడే వివశుడైన అప్సరాంగనవా

అందానికి ఇంతకన్న ఏదీ నిదర్శనం

సౌందర్యానికే నిలువెత్తు నిర్వచనం


1.రతిని మతిని తలవడు నిను గంటే మదనుడు  

రాధనెదను నిలుపడు నినుగాంచ మాధవుడు

బ్రహ్మమానస పుత్రికవో

నవ మోహిని చిత్రికవో

అందానికి ఇంతకన్న ఏదీ నిదర్శనం

సౌందర్యానికే నిలువెత్తు నిర్వచనం


2.అతిలోక సుందరి నీ జతకు తూగరతివలు  

మదగజగామిని నీ హొయలెరుగరు ముదితలు

అంగనగా మారిన సింగిడి నీవు

మెలికల మేని కిన్నెరసాని వీవు

రెప్పలైనవాలవు నిను తిలకించినంత

జన్మలెన్ని చాలవు వలపు చిలకరించినంత

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సిగ్గేలనే ఓ చినదానా

నను ముగ్గులోకి లాగి వలచినదానా

ఎన్నాళ్ళుగానో నాకై వేచినదానా

నన్ను నన్నుగా ప్రేమించినదానా 

నాకై కలవరించినదానా,నన్నే వరించినదానా


1.తల ఎత్తి తరుణి వైపు చూడని వాడను

పల్లెత్తి పరపడతితో ఎన్నడు మాటాడను

అల్లసానివారి అభినవ ప్రవరాఖ్యుడను

నిగ్రహ పరిగ్రహాన మునిజన ముఖ్యుడను


2.అమ్మ కొంగు చాటుమాటు పిల్లవాడినే

కొమ్మా నను పడగొట్టి కొంగున కట్టావే 

నువు గీచిన గీతను జవదాటకుంటినే

నీమాటనెపుడు మీరక నడుచుకుంటినే

 https://youtu.be/NFymiOi5YOQ?si=vRbbwWeXAGjeBHAK

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


లోపమేదొ తెలియకుంది నా కవనంలో

శాపమేదొ తగులుకుంది నా జీవనంలో

ఎంత వైవిధ్య భరింతంగా కవితలున్నా

భావుకతను ఎంతగానొ కుమ్మరిస్తున్నా

ఆదరణకు నోచుకోవు కైతలెందుకో మరి

ఎదలను కదిలించవేమొ కొసరి కొసరి


1.లలితమైన హృదయమే నాకు లేకుందో

అనుభూతి చెందడమే అసలు రాకుందో

సరళమైన పద పొందిక కొఱవడి పోయిందో

వాడుక భాషలోన నా సాహితి సాగకుందో

ఆదరణకు నోచుకోవు కైతలెందుకో మరి

ఎదలను కదిలించవేమొ కొసరి కొసరి


2.పరులను విరివిగా ప్రశంసించ లేదేమో

స్పందించే మిత్ర తతి మెండుగ లేదేమో

ఆర్భాటం హంగామా నాకు చేతకాదేమో

అసలు సిసలు కవిత్వమే నాది కాదేమో

ఆదరణకు నోచుకోవు కైతలెందుకో మరి

ఎదలను కదిలించవేమొ కొసరి కొసరి

Thursday, January 7, 2021

 https://youtu.be/yRui5mblBW4


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సారంగ


నా నాలుక కుంచెగా -నీ తనువున దించునే

ముద్దుల తైలవర్ణ చిత్రాలెన్నో

నీ మేనే వీణియగా-పెదవులు పలికించునే

తమకాల గమకాల రాగాలెన్నో

 ప్రియసఖీ నీవే శృంగార దేవతవు

ప్రేయసీ నీవే మదన కదన గీతవు


1.అజంతా చిత్రాలను కపోలాన ఆత్రంగా

ప్రత్యూష చిత్రాలను పదముల పాత్రంగా

రామప్ప శిల్పహోయలు నూగారుమాత్రంగా

ఖజురహో భంగిమలే రతికేళీ శాస్త్రంగా

చిత్రించెద రసనతో అసిధారావ్రతంగా

శ్రమించెద  విరమించక విశ్వకర్మ సాధనంగ


2.కలశస్తన మర్ధనలో రమ్య కామవర్ధినిని

వ్యూహరచనలో కదనకుతూహలాన్ని

పరిష్వంగ ప్రమోదాన బృందావన సారంగని

సంగమక్షేత్రాన తారాస్థాయిగ ఆనంద భైరవిని

రవళించెద సరసరాగ సమ్మోహనంగా

కురిపించెద ఎదను తడుప సురగంగా


OK

Wednesday, January 6, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చంద్ర కౌఁస్


రమ్మంటే రావేలా పడకటింటికి

గంధర్వకాంతలా కనిపిస్తూ నా కంటికి

తలనిండా మల్లెదండ తహతహ పెంచ

న్యాయమా అర్ధాంగీ నన్నుడికించ


1.ఎప్పుడొస్తానా అని ఎదిరిచూపు నా కొరకు

అభిసారికవై  సాయంత్రం నేనిల్లు చేరే వరకు

వచ్చీరాగానే జాప్యానికి హెచ్చిన అలకలై

ఉవ్విళ్ళూరే యవ్వనమే ఉసూరనగ కలై

తెల్లచీర ఉల్లమందు ఉద్విగ్న పరచ

ధర్మమా శ్రీమతి నా మదిని దోచ


2.సత్యభామ పదములొత్తు కృష్ణుడకానా

మోహినినే బ్రతిమాలెడి శివుడనేనైపోనా

కట్టుకున్ననాడె నీ దాసుడనై పోయానే

బెట్టేజేయ తగదు సఖీ నీ ప్రియపతినికానే

ఓరచూపు మూతివిరుపు నీకందమే

ప్రేయసీ ఊర్వశీ ఇకనైనా అందవే

https://youtu.be/W__mGEV-4ng?si=ovWZzG2s2eMl7_em

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:ద్విజావంతి, కాపి

ఎవరిని అడిగి చేరావు షిరిడి
ఏమాశించి పంచావు ప్రేమని
తొలగించావు తీవ్రమైన బాధలని
ప్రవచించావు ఉచితమైన బోధలని
సాయిబాబా దత్తావదూత నమస్సులివే
నీపద పుష్పాలుగ మా మనస్సులివే

1.అందరినీ ఆదరించు ఆత్మబంధువైనావు
 అంతెరుగని అనురాగ సింధువైనావు
దీర్ఘకాల వ్యాధులకు నీవే మందువైనావు
దివ్య దర్శనమ్మీయగ కను విందువైనావు
సాయిబాబా దత్తావదూత నమస్సులివే
నీపద పుష్పాలుగ మా మనస్సులివే

2.చెబితేనే చూస్తావా మా శ్రేయస్సు
కోరితేనె ఇస్తావా మాకు జ్ఞాన రుచస్సు
దశదిశలా వ్యాపించె నీ లీలల యశస్సు
పొందిన ప్రతి ఉన్నతి నీవొసగిన ఆశీస్సు
సాయిబాబా దత్తావదూత నమస్సులివే
నీపద పుష్పాలుగ మా మనస్సులివే


 

https://youtu.be/bqpnYy-SZXY?si=SFyaX3GIM1fQPxxF

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అభావమయ్యింది మనసెందుకో 

కలతచెందింది కలమెందుకో

కవితకొరకు వస్తువులేకా

ఏ ఘటనకైనా ఎద చలించకా

రాయడానికేముంది నవీన కోణం

చెప్పిందే చెప్పుతూ చర్వితచరణం


1.తాదాత్మ్యత లోపించింది ఆధ్యాత్మికతన

సర్వస్యశరణాగతిలేదు భక్తితత్వాన

ఢాంభికాలు ప్రదర్శనలు అట్టహాసాలు

ఆత్మలోకి అవలోకించక పరమత పరిహాసాలు

రాయడానికేముంది నవీన కోణం

చెప్పిందే చెప్పుతూ చర్వితచరణం


2.పూలుపళ్ళు పోలికతో వనితల ఒళ్ళు

ప్రేమా ప్రణయం అనురాగం శృంగారాలు

విరహాన వేగిపోయే ప్రేమికుల వేదనలు

అనుభవైక వేద్యమైన అను నిత్య భావనలు

రాయడానికేముంది నవీన కోణం

చెప్పిందే చెప్పుతూ చర్వితచరణం


3.కంఠశోష మినహాయించి మంచిమార్పు సాధ్యమా

పుర్రెకో బుద్ది తరహా వైవిధ్య ప్రపంచమా

ప్రవక్తలు సంస్కర్తలస్వప్నం ఈ సమాజమా

భ్రష్టుపట్టి పోతున్న  మానవ భవితవ్యమా

రాయడానికేముంది నవీన కోణం

చెప్పిందే చెప్పుతూ చర్వితచరణం

Monday, January 4, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మది గదిలో ఏదో మౌన గీతం

పాడుతోంది నా శూన్య జీవితం

శిశిరాన ఆశలు ఆకులై రాల

ఎండమావులే ఎదురేగి రాగ


1.వసంతమే సొంతమయ్యే దారి కనరాక

గగనాన  మేఘం వర్షించు వైనం తెలియక

సాగుతోంది బ్రతుకు పయనం సాగరాన

తీరమేది కనుచూపుమేర  అగుపించక


2.నిర్మించుకున్న హర్మ్యాలు సైతం నేల కూల

ఊహించుకున్న స్వర్గాలు కూడ నరకాలై పోగ

చేయూత కోసం వగచేది లేక నడిపేను నావ

కాలం చేసే మాయాజాలం వేయాలి పూల త్రోవ

పలుకుటకే పరిమితమై పరమత సహనం

ఎద ఎదలో బుసలుకొట్టే పరమత హననం

ఆచరణకు నోచుకోని లౌకికత్వ విధానం

వేదికలకె భాషణలకె సమైక్యతా నినాదం

మరలిరా మహాత్మా సమసమాజ నిర్మాతా

తిరగరాయి మహాశయా రాజ్యాంగ నిర్ణేతా


1.చర్చ్  ల దర్శనాలు ఫాదర్ ల దీవెనలు

దర్గాలకు మొక్కులు గురుద్వార యాత్రలు

సంకుచితం కానరాని హైందవ ధర్మాలు

అన్యమతం అతిహేయం మునుగడకే తావీయం

ప్రసాదమే విషతుల్యం ఈసడించు మతమౌఢ్యం

తిన్నింటి వాసాలకు లెక్కలు హక్కుల వితండం

మరలిరా మహాత్మా సమసమాజ నిర్మాతా

తిరగరాయి మహాశయా రాజ్యాంగ నిర్ణేతా


2.రంజాన్ వేడుకలు విందుల వాడుకలు

ఏ ఈద్ కైనా శుభాకాంక్షల వెల్లువలు

అలయ్ బలయ్ హత్తుకునే ఉత్సాహాలు

గంగా జమునా తహజీబ్ భావన తరహాలు

క్రిస్మస్ కానుకలు న్యూ ఇయర్ సంబరాలు

పడిపడి చెప్పుకునే విశాలహృదయ విషెస్ లు

తిలకించు మహాత్మా సమసమాజ నిర్మాతా

పులకించు మహాశయా రాజ్యాంగ నిర్ణేతా


3.దైవాల దూషణలు పురాణాల హేళనలు

అవకాశం అంటుఉంటే అంతానికె సవాళ్ళు

బలవంతపు మార్పిడులు వింతైన ప్రచారాలు

ఇతరులెవరు ఇలలోనే కూడదనే బోధనలు

అనైక్యతే బలహీనత సనాతన ఉదాసీనత

అంతరించు దిశగా నిర్వేదగా అనాథగా ధార్మికత

ఉద్భవించు మహాత్మా సమసమాజ నిర్మాతా

శాసించు మహాశయా శాసన నిర్ణేతా

 

https://youtu.be/ThtCMvvprdA

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఇదేనా నీ దయాపరత్వము

ఇదేనా భక్తపరాయణత్వము

ఇదేనా భోళాశంకర తత్వము

ఇదేనా జగతఃపితరః ఔచిత్యము

శివా నీ లీలలు అవగతమే కావా

భవా నీ మహిమల అనుభవమీవా


1.ధర్మపత్ని నిచ్చావట ఆత్మలింగ మొసగావట

పాశుపతాస్త్రమునే పార్థుకు ప్రసాదించావట

గరళము మ్రింగావట గంగను దాల్చావట

గజాసురుని కడుపులో వాసమున్నావట

కోరనైతి నేను గొంతెమ్మ కోరికలు

వైద్యనాథ మాకీయి ఆయురారోగ్యములు


2.చిరంజీవిగా మార్కండేయుని జేసి

సిరియాళుని సైతం పునర్జీవింపజేసి

 కరినాగులు సాలీడుకు సాయుజ్యమిచ్చేసి

కన్నిచ్చిన తిన్ననికీ కైవల్యము నందజేసి

వినోదింతువేలమమ్ము వెతల పాలబడవేసి

ఆనందమునొందేవా దేవా మా బ్రతుకులు బుగ్గిచేసి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కూలగొట్టితేనేం ఎవరిదో ఒక దేవళం

కాలబెట్టితేనేం ఏదైనా అది దైవ విగ్రహం

కొల్లగొట్టితేనేం మనదైన దేశ సంపద

తలబెట్టితేనేం సాటివారి బ్రతుకులకాపద

మౌనమే సర్వదా మా విధానం

సహనమే మాకు సాంప్రదాయం


1.తురుష్కులానాడు శిథిలపరచలేదా

మొగలాయిలు సైతం మంటబెట్టలేదా

ఆంగ్లేయులు మన సంస్కృతిని మట్టుబెట్టలేదా

అరచేత బెల్లం పెట్టి మతమంటగట్టలేదా

అనైక్యతే కదా మా బలహీనత

నైరాశ్యమే సదా మా అశక్తత


2.కులలా పేరిట నశింపచేస్తాం బలాలు బలగాలు

మతాల పేరిట బలిచేస్తాం ప్రేమ మానవత్వాలు

మత గ్రంథం బోధిస్తుందా ప్రవక్తనే ప్రవచిస్తాడా

లౌకికత్వ దేశంలో అమానవీయ కృత్యాలు

సామాజిక దురాచారమే మా అపచారం

జాతీయభావన కొఱవడుటే మా గ్రహచారంP

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆనందం వర్షించనీ

అనుదినమూ హర్షించనీ

అందరిలో మానవత్వం దర్శించనీ

అనురాగం ఎద ఎదనూ స్పర్శించనీ

శుభోదయం శుభోదయం నేస్తమా

మహోదయం జగానికవనీ మిత్రమా


1.వ్యక్తిత్వం యుక్తమై వికసించనీ

సమానత్వం మానవాళిలో వ్యాపించనీ

స్నేహతత్వం జీవితాంతం ప్రభవించనీ

దాంపత్యం అన్యోన్యమై పరిమళించనీ

శుభోదయం శుభోదయం నేస్తమా

మహోదయం జగానికవనీ మిత్రమా


2.జాతీయతే పౌరులలో పెల్లుబుకనీ

సమైక్యతా రాగమే నినదించనీ

లౌకికతత్వం దేశమంతా వెల్లివిరియనీ

విశ్వైకభావన ప్రపంచమంతా పరిఢవిల్లనీ

శుభోదయం శుభోదయం నేస్తమా

మహోదయం జగానికవనీ మిత్రమా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వచ్చెటప్పుడేం తెచ్చామని

కొనిపోవడం జరగని పని

పదవులు పేరు ప్రతిష్ఠలన్నీ

ఊరువాడ ఇల్లు పట్టులన్నీ

ఉన్నదంతా వదిలివెళ్ళడమే

కన్నవాళ్ళనైన విడిచి పోవడమే


1.పోగుచేసుకున్న సంపదనంతా

కూడబెట్టుకున్న ఆస్తిపాస్తి అంతా

నూలుపోగైనా మేనలేకుండా

పుట్టినప్పుడున్నట్టి వైనంగ

తెలియని ఏవేవొ దారులగుండా

మరలిరాలేని లోకాలె గమ్యంగా

ఉన్నదంతా వదిలివెళ్ళడమే

కన్నవాళ్ళను విడిచి పోవడమే


2.బొందిలొ ప్రాణం ఉన్నంత వరకే

నా తల్లి నా చెల్లి నా నాన్న నా అన్న

చివరి నిద్దుర పోనంత వరకే

నా భర్త నా భార్య నా కొడుకు నా బిడ్డ

బంధాలన్నీ వట్టి నీటి మూటలే

బతుకు నాటకాన ఆడేటి పాత్రలే

ఉన్నదంతా వదిలివెళ్ళడమే

కన్నవాళ్ళను విడిచి పోవడమే


(ముఖ్యంగా ఘంటసాల భగవద్గీత అంతిమ యాత్రా గీతంగా పరిణమించడాన్ని నిరసిస్తూ- తగిన  ఓ పది వరకు గీతాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో )

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఊహలేవొ రేపెను ఉదయాన్నే

ఊదారంగు రంజిల్లి నా హృదయన్నే

మంజుల రవళులె వీనుల విందుగ

మదివీణియ అనురాగము చిందగ


1.తెలుపు తెలుపు శాంతి సహనాన్నీ

నలుపు నలుపు జీవితాన ఉత్సాహాన్ని

ఎరుపు అరుపు జాగృతించు ఉద్యమాన్ని

పసుపు చూపు సంస్కృతి సాంప్రదాయాన్ని


2.హరితమే జగతికి నవ చేతనము

నీలమే నింగికి ఘన ఆఛ్ఛాదనము

నారింజ వర్ణమే త్యాగనిరతి కేతనము

హరివిల్లు అందాలతొ అలరారు జీవనము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఖజురహో శిల్ప భంగిమలే

ఆంధ్రభోజు కావ్య వర్ణనలే

ప్రతి రాతిరి రతి పాఠాలై

దంపతులే మొండి ఘటాలై

సాగుతుంది పోటీ గెలుపుకోసం

ఓడిపోయినాగాని అధర దరహాసం


1. ఎలనాగ ఒళ్ళే ఎక్కిడిన హరివిల్లు

నారి నారి సారించ  రసన నా'రసముల్లు

ఎక్కడో తాకుతుంటే ఎదలొ సరస జల్లు

గుట్టు వీడిపోతుంటే మేనుమేనంత ఝల్లు

సాగుతుంది పోటీ గెలుపుకోసం

ఓడిపోయినాగాని అధర దరహాసం


2.వలకాని పరవళ్ళు అలవికాని తిరునాళ్ళు

ఊపిరాడనీయని ఉద్వేగ బిగికౌగిళ్ళు 

తట్టుకోనంతగా చుంబనాల వడగళ్ళు

తనువుల సంగమాన స్వర్గాల లోగిళ్ళు

సాగుతుంది పోటీ గెలుపుకోసం

ఓడిపోయినాగాని అధర దరహాసం



శ్రీనివాస హే మురహరి  గోవింద 

వేంకటేశ మాం పాహి ముకుందా

చిద్విలాస వదనారవింద

చిన్మయానంద నమో భక్తవరద


1.మా దుఃఖాల అభిషేకాలు

నిందలే అష్టోత్తరాలు

ఆవేదనలన్నీ నివేదనలు

నిరసన జ్వాలలు హారతులు

నీకే సమర్పితం నీ ఈ ప్రసాదాలు

ఎంతకూ ఒడవని మా విషాదాలు


2.నిత్యం గొడవలు నీ భజనలు

మా నిట్టూర్పులె స్తోత్రాలు

మా మొరలే నీకై కీర్తనలు

చావో రేవో మా ప్రార్థనలు

నీకే అంకితం మా జీవితాలు

కొఱవడిపోయిన సంతసాలు

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను చూసిన వెంటనే రెప్పలల్లార్చి

కలయా నిజమాయని నా ఒంటిని గిచ్చి

తెప్పరిల్లి- మళ్ళీమళ్ళీ మైకం వచ్చి

గుండె ఆగిపోయింది ఒక్కక్షణం- నువు పిచ్చిగ నచ్చి

పొగడలేక తడబడుతున్నానే- ఓ అప్సరస

కవులెవ్వరు కాంచి ఉండరు- నీఅంతటి మిసమిస


1.పాతబడ్డ ఉపమానం చంద్రవదనం

 రివాజైన ఉత్ప్రేక్షే హరిణి వీక్షణం

నీ రూపానికి ఇలలోలేదు తగిన రూపకం 

నీవే విరహాగ్నికి ప్రేరేపకం-నీవే ఎద మంటల అగ్నిమాపకం

పొగడలేక తడబడుతున్నానే ఓ అప్సరస

కవులెవ్వరు కాంచి ఉండరు నీఅంతటి మిసమిస


2. నా అపూర్వ నాయిక వీవే  ఓ అవంతిక

నీవేలే  నన్నలరించెడి మనోజ్ఞ గీతిక

కరకరలాడుతు నోరూరించే కమ్మని జంతిక

నిను ఆరాధించుట ఒక్కటే నావంతిక

పొగడలేక తడబడుతున్నానే ఓ అప్సరస

కవులెవ్వరు కాంచి ఉండరు నీఅంతటి మిసమిస

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


జాగో జాగో సాహెబా

నీకున్న ఈ ఈగో సబబా

అడ్జస్ట్ మెంట్ లేక స్టంట్లు

ఫ్యూచర్ని ఏమరచి జడ్జ్ మెంట్లు


1.తొలి అడుగే తప్పటడుగు

బ్రతుకు కన్నీటి మడగు

కార్తీకదీపాలు కంటికి వెలుగు

భరోసాకు డౌటేలా భవితకు


2.చక్కని జీవితాన్ని అక్కున జేర్చుకో

ముళ్ళదారి వదిలేసి రాదారిని ఎంచుకో

ఆచితూచి అడుగేసి అనుకున్నది సాధించు

గతం మరచి హితం నేర్చి ఆనందించు



https://youtu.be/32DqXvk7WgU?si=t3EmLl-GMUMNaOWt

 "హాప్పీ(?) న్యూ ఇయర్"


నిరుటికి నేడే చెప్పేసెయ్ బై బై

కొత్తేడాదిని ఇప్పుడే ఇన్వైట్ చెయ్

నిన్నటి చేదు అనుభవాలకు సమాధికట్టేసెయ్

రేపటి కమ్మటి ఊహలనే మొదలెట్టేసెయ్

ఫ్రష్ట్రేషన్ ఉంటేగింటే పక్కకి నెట్టేసెయ్

అనుక్షణం ఎంజాయ్ కే ఫస్ట్ ఓటేసెయ్

హాప్పీ న్యూ ఇయర్ బాసూ

పెంచేసెయ్ ఉత్సాహం డోసూ


1.కరోనా కాటు వేయ నందుకూ సంతోషించు

చలానా దాట వేసి నందుకూ ఆనందించు

పరీక్షలే లేకుండా పదిపాసైనందుకు నీకూ నాకు హైఫై

వర్క్ ఫ్రం హోమైనందుకు వైఫ్ కు నాకూ వైఫై

ఫ్రష్ట్రేషన్ ఉంటేగింటే పక్కకి నెట్టేసెయ్

అనుక్షణం ఎంజాయ్ కే ఫస్ట్ ఓటేసెయ్

హాప్పీ న్యూ ఇయర్ బాసూ

పెంచేసెయ్ ఉత్సాహం డోసూ


2.ఓటీటీలో నీటుగా ఘాటైన మూవీలెన్నోచూసేసాం

ఇంటిపట్టున ఉంటూ వండుకుంటూ తింటూ వొళ్ళు పెంచేసాం

ఆన్లైన్లోనే అనవరతం గడిపేస్తూ బ్రతికేసాం

డబ్బుకన్నా సబ్బే గ్రేటని ఏడాదంతా కడిగేసాం

ఫ్రష్ట్రేషన్ ఉంటేగింటే పక్కకి నెట్టేసెయ్

అనుక్షణం ఎంజాయ్ కే ఫస్ట్ ఓటేసెయ్

హాప్పీ న్యూ ఇయర్ బాసూ

పెంచేసెయ్ ఉత్సాహం డోసూ

https://youtu.be/cIlLHAri2cs

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హిందుస్తాన్ భైరవి


నీ దయా భిక్షనే తల్లీ నా కవిత్వము

పూర్వపుణ్య సమీక్షయే నా సారస్వతము

శ్రీ వాణీ వేదాగ్రణి పారాయణీ భగవతి

హే భారతి బ్రహ్మసతీ నాకీవే శరణాగతి


1.నీవల్ల నీచేత నీకొఱకే నా గీతా మకరందము

నావి అనుకొనేవన్నీ నీవై అవతరించు చందము

వినితీరాలి కల్పించగ కవితకు పరమార్థము

కవిని ఆదరించకుంటె నీవైనా  బ్రతుకే వ్యర్థము

శ్రీ వాణీ వేదాగ్రణి పారాయణీ భగవతి

హే భారతి బ్రహ్మసతీ నాకీవే శరణాగతి


2.సరసత యున్నచోట సమయము లేదు

సమయము కలిగియున్న సరసత లేదు

రాయలు రసరాజులు నిజ భోజుల ఆచూకి లేదు

అష్టదిగ్గజాలకు నవరత్నాలకు ఆలన పాలన లేదు

శ్రీ వాణీ వేదాగ్రణి పారాయణీ భగవతి

హే భారతి బ్రహ్మసతీ నాకీవే శరణాగతి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీవే ఒక అద్భుతము నా జీవితాన

నీ స్నేహమె ఒక వరము నా అనుభవాన

ఏదో తెలియని ఆత్మీయ బంధము

ఎద మాత్రమె ఎరిగిన పరమానందము


1.వెయ్యేనుగుల బలం కవితకు నీ ప్రోద్బలం

అలుపెరుగక సాగుతోంది అందుకే నా కలం

నీ పలుకులు ఎనలేని స్ఫూర్తికి ఆలవాలం

నీ ప్రశంసలే నా ఆర్తికి పావన గంగాజలం


2. కష్టసుఖాలు పంచుకునేవు నా ప్రాణనేస్తం

వెదకబోయిన తీగలాగ ఎదురై నువు ప్రాప్తం

ఆలోచన ఏదైనా తెలిపేవు నాకు యుక్తాయుక్తం

యుగ యుగాలు సాగేటి  మన మైత్రే అవిభక్తం

OK

 


నెత్తురు చిక్కనైతె అది దుఃఖం

ఊపిరి వెక్కుతుంటె అది దుఃఖం

ఆశలు ఎక్కువైతె అది దుఃఖం

బ్రతుకులు బిక్కుమంటె అది దుఃఖం

దుఃఖం సర్వ వ్యాపి  దుఃఖం విశ్వ రూపి

దుఃఖం మహామాయ దుఃఖం అద్వితీయ


హరిహరాదులెవ్వరినీ వదలలేదు దుఃఖం

రాముడికీ కృష్ణుడికీ తప్పలేదు దుఃఖం

జననంలో దుఃఖం మరణంలో దుఃఖం

జీవితాంతం వెంటాడుతు వేధిస్తూ దుఃఖం

దుఃఖం సర్వ వ్యాపి  దుఃఖం విశ్వ రూపి

దుఃఖం మహామాయ దుఃఖం అద్వితీయ


సంసారం కడు దుఃఖం సన్యాసం బహు దుఃఖం

కాలచక్ర భ్రమణంలో విధి  విన్యాసం పెను దుఃఖం

ప్రకృతి ప్రళయం దుఃఖం మానవ క్రౌర్యం దుఃఖం

స్వార్థం జడలువిప్పి చేసే కరాళ నృత్యం దుఃఖం

దుఃఖం సర్వ వ్యాపి  దుఃఖం విశ్వ రూపి

దుఃఖం మహామాయ దుఃఖం అద్వితీయ

Tuesday, December 29, 2020

 

https://youtu.be/JSMfc9qvcME?si=Z-SGKPajhZoPjuiJ

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రేవు చేరులోపే నావ వెళ్ళిపోయింది

ఊరు వచ్చులోపే దారిమారిపోయింది

ఆశలన్నీ మూటగట్టి ఆతృతగా నీకడకొచ్చా

బాసలన్నీ పాతరవేస్తే నిట్టనిలువుగ నా ఎద చీల్చా


1.శ్రుతి తప్పిన పాటయ్యింది జీవనగీతం

గురి తప్పిన వేటయ్యింది బ్రతుకు సాంతం

మిగిలింది ఏముంది జ్ఞాపకాల గోడు మినహా

భవిత శూన్యమయ్యింది ఒంటరైన కాడు తరహా


2.వేలముక్కలయ్యింది గాజులాంటి నా ప్రణయం

పదిలంగా కాచుకోక చేజార్చినందుకు ఫలితం

అందాల భరిణెవు నీవు నీకు ఫరకు ఏముంది

తెగిపోయిన పతంగి నేను నాకు దిక్కులేకుంది

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గమ్యమెంత దవ్వైనా చెదరనీకు పెదవుల నవ్వు

సర్వాన్ని కోల్పోయీ వదులుకోకు ఆశను నువ్వు

ఒక్కక్షణం యోచిస్తే మనవన్నవన్నీ  అయాచితమే

వాస్తవాన్ని గ్రహియిస్తే ఆనందమయం  జీవితమే


1.పుల్ల పుల్ల పేర్చుకొని కడతాడు తన గూడు

గాలివానకు కూలిపొయినా బ్రతుకునాపడు గిజిగాడు

పువ్వు పువ్వు తిరిగైనా తేనె కూర్చు జుంటీగ

పట్టునంత మంటబెట్ట తిరిగి పట్టును పెట్టునుగా


2.మోయలేని భారమైనా గొనకమానదుగా చీమ

పట్టువిడువక పట్టుబట్టి పుట్టచేర్చుటె గొప్ప ధీమా

అలసిపోక  అలలు సైతం ఆపబోవా యత్నము

కడలి తీరం చేరలేకా వెనుదిరిగితేనేం నిత్యము

 రచన,స్వరకల్పన&గావం:డా.రాఖీ


నను తడిసిపోనీ నీతలపులతో

నను మిడిసి పడనీ నీ వలపులతో

అనుభవాల వానలో తానమాడనీ

అనుభూతుల జల్లులో ఆటలాడనీ


1.సరికొత్త లోకాలేవో చూపించినావు

బ్రతుకు తీరు తెన్నులెన్నో నేర్పించినావు

అండగా ఉంటూ నన్ను నడిపించినావు

కోరదగిన మొనగాడివని నిరూపించినావు


2.స్పందనే లేని నాలో సరిగమలు పలికించావు

స్థాణువంటి నామదిలో మధురిమల నొలికించావు

నూరేళ్ళు తోడౌతానని బాసలెన్నొ చేసావు

నేకన్న  కలల వరమే నీవుగ లభియించినావు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తోలుతిత్తి నశ్వరమౌ నా నారీ దేహము

ఈ మానిని మేను ఎడల ఎందుకంత మోహము

గ్రోలిన కొద్దీ పెరుగుతుంది రాగ దాహము

జనన మరణ దరుల నడుమ మన జీవన ప్రవాహము


1.నీ సృజనకు మూలము ఒక దేవత గర్భగుడి

నీకు పానుపైనది నిను కన్నతల్లి కమ్మని ఒడి

నీ ఆకలి తీర్చినవి నీ ఆటకు ఇచ్చినవి ఆ గుండెలే

నిను ముద్దాడినవి మాటలెన్నొ నేర్పినవి ఆ పెదవులే


2.నా మిసమిసలన్ని వసివాడును ఒకనాడు

వయసు మీరిపోతే రానైనా రావు నాతోడు

ముఖ్యమే కాదనను యవ్వనాన కామము

కామమే ముఖ్యమైతె పశువుకన్న నువు హీనము

నీ lookకే ఇస్తుంది ఒంటికి ఎంతో kickకు 

చూసావంటే నాకేసి  అది నా luckకు 

భవిష్యత్తే అయిపోతుంది నీlovlely loveకే bookకు 

అదృష్టం అంటూ ఉంటేనే నా life long నువు  దక్కు


1.చిన్న నవ్వు నవ్వావా గుండెలో Kassakకు 

కొంటె సైగ చేసావా నా బ్రతుకే  fussakకు 

Novel లో దృష్టిపడిందా నావల్లైతే కాదు తల్లో

Cleavage raaz కోసం సాహసించాలి వీరlevel లో 


2.waist మడతలొ చిక్కామా life కే పెద్ద risk

Lip to lip kiss ఐతే తట్టకోవడం big task 

Hug చేసి అతుక్కపోతే మారుతాయి Clalander లే 

Chating dating meeting mating ప్రతిదీ నీతో wonderలే


నీ lookకే ఇస్తుంది ఒంటికి ఎంతో kickకు 

చూసావంటే నాకేసి  అది నా luckకు 

భవిష్యత్తే అయిపోతుంది నీlovlely loveకే bookకు 

అదృష్టం అంటూ ఉంటేనే నా life long నువు  దక్కు

 

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెరిపివేసావా నా గురుతులని నీ మనో ఫలకం నుండి

బూది చేసావా అనుభూతులని నీ హృదయం మండి 

శిథిలం కానిస్తానా మారిపోతే శిలగా  

శిల్పినై తీర్చిదిద్దనా అపురూప శిల్పంగా


1.నా పాట నిన్నెపుడూ వెంటాడుతుంది

నా పలుకు నీ ఎదనెపుడూ కుదిపివేస్తుంది

అంత తేలికనుకున్నావా నా నుండి పారిపోవడం

ఎంత దూరమున్నాగాని కల్లయే వదులుకోవడం

ఊరుకోలేను ఉరివేసినా గాని

మారిపోలేను ఊచకోతకైనా గాని


2.నీ అందచందాలు ఎపుడైన నేనెంచానా

నీవైన ఆనందాలు ఎన్నడైన కాదన్నానా

నీపు పంచిన ప్రేమతోనే తలమునకలైనాను

అనురాగం నువు కురిపించగ తడిసిముద్దైనాను

ఈ జన్మకేనా మరుజన్మలొ వేధిస్తా

ఎంతగా కాదన్నా దేవతగా ఆరాధిస్తా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చూస్తేనే నోరూరుతోంది ప్రేయసీ నిన్ను

ఆస్వాదిస్తేనే ఆర్తి తీరుతుంది నను నమ్ము

ఎంత వింత దాహమో ఎనలేని ఈ ప్రేమది

ఎంత వింత మోహమో ఓపకుంది నా మది


1.సింగారించకుంటేనేం సహజాతం నీ అందం

పన్నీరు జల్లకున్నా పరిమళించు అంగాగం

సంసిధ్ధమే సదా నీ దేహం మన్మథ రంగం

నిత్య యుద్ధమే కదా పడకటింటి వీరంగం


2.తలవాల్చ భాగ్యమే నీ నడుము వంపులో

చుంబించ సౌఖ్యమే నీ నాభి సీమలో

గ్రోలడమే ఒక వరము నీ అధర సుధలన్నీ

కవగొనడమె ఒక యోగం నీ దివ్య నిధులన్నీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎందుకు పుడతారో భూమ్మీదే

మమ్మల్ని చంపటానికిట్లా సుందరంగా

ఒలకబోస్తారేల అందాల బిందె

చూసినంతనె మాకు సొల్లుకారంగా

పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు మీవైన పొంకాలు

ఘోటక బ్రహ్మచారులకైనా సడలుతాయిలే బింకాలు


1.మేనకలై వచ్చి చెడగొడతారు తపస్సును

రాధికలై గిచ్చి చెదరగొడతారు మనస్సును

కునుకున కలై సొచ్చి సోకనీయరు ఉషస్సును

యవ్వన కోరికలై ఎక్కడిదురు తనువు ధనస్సును

పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు మీవైన పొంకాలు

ఘోటక బ్రహ్మచారులకైనా సడలుతాయిలే బింకాలు


2.దాచుకునే నిధులన్ని బట్టబయలు చేసి

చేసేదంత చేసేసి మాపై అపనిందలు వేసేసి

ఏమెరుగని నంగనాచి కథలెన్నో చెప్పేసి

చేస్తారు మమ్మల్ని మారెడు కాయలల్లె  మసిపూసి

పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు మీవైన పొంకాలు

ఘోటక బ్రహ్మచారులకైనా సడలుతాయిలే బింకాలు

 

https://youtu.be/dZHTyZgNwYA

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చంద్రశేఖరా హరా భవహరా

పురహరా గంగాధరా పరాత్పరా

నందివాహనా భవా సాంబశివా

శంభో త్రయంబకా మహాదేవా  

బ్రహ్మాది దేవతలు దితి సుత తతులు

దేవ దానవ మానవులంతా నీ దాసులు

ఓం నమః శివాయ ఓం నమః శివాయ


1.కమలలోచనుడు కమలనాభుడు

కమలాలయ శ్రీ కాంతుడు నీ భక్తుడు

సహస్రకమలాల కరకమలాలతొ

పూజించెను నిను శ్రద్ధాసక్తులతో

బ్రహ్మాది దేవతలు దితి సుత తతులు

దేవ దానవ మానవులంతా నీ దాసులు

ఓం నమః శివాయ ఓం నమః శివాయ


2. భక్త గజాసుర భస్మాసురులు

రావణాసురుడు బాణాసురుడు

అర్జునుడు భక్త మార్కండేయుడు

శ్రీ కాళ హస్త్యాదులు కన్నప్ప తిన్నడు

బ్రహ్మాది దేవతలు దితి సుత తతులు

దేవ దానవ మానవులంతా నీ దాసులు

ఓం నమః శివాయ ఓం నమః శివాయ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొందరి చూపుల్లో కొంటె వాక్యాలు

ఈ సుందరి చూపుల్లో ప్రణయ కావ్యాలు

మానస వనాన అనురాగ పుష్పాలు

నయన కమలాల ఆనంద భాష్పాలు


1.భాషలెందుకు కన్నులే భావమొలికితే

శబ్దాలెందుకు చూపు కలిపి కొత్త లిపిరాస్తే

ఆడవారిమాటల్లో అర్థాలే ఒకటికి ఇం'కోటి

చూపులకు భాష్యాలైతే రాయడే ఘనపాటి


2.పెదాలతో పొమ్మంటూ కన్నుల్తొ ఆహ్వానిస్తూ

పలుకులతొ వద్దంటూ సైగలతొ స్వాగతిస్తూ

నిఘంటువుల దొరకనివే నీవైన మౌనపదాలు

నిర్వచించలేనివే మగువా నీ మనోభావనలు

 

https://youtu.be/nFOLMUZhP7E

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒడి బియ్యము పోతుమే-మా ఇంటి మా ఆడపడుచుకి

ఒడిని నింపి వేతుమే-మా కంటికే ఇంపైన రుచికి

మా ఇంటి మాలక్ష్మికి తోబుట్టువైన మా కల్పవల్లికి

చీరసారెలనిచ్చి సత్కరించేము

నిండైన దీవెనలు దండిగా ఇచ్చేము


1.అష్టైశ్వర్యములు బడసి వర్ధిల్లగా

అత్తింటి పుట్టింటి కీర్తి పెంపొందగా

దాంపత్య జీవితము అన్యోన్యమై సాగ

పిల్లాపాపలతొ మీ వంశాభివృద్ధికాగా

చీరసారెలనిచ్చి సత్కరించేము

నిండైన దీవెనలు దండిగా ఇచ్చేము


2.మమతానురాగాలె పసుపుకుంకాలు

ఒద్దికా ఓపికలే పుట్టింటి కానుకలు

ఆదరణ అణకువలు తరగనీ సంపదలు

సంస్కృతీ సాంప్రదాయలే తగిన ఆభరణాలు

చీరసారెలనిచ్చి సత్కరించేము

నిండైన దీవెనలు దండిగా ఇచ్చేము

Saturday, December 26, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉదయాన మధురిమ నీవల్లే

హృదయాన రసధుని నీవల్లే

నీవల్ల రేయంత వెన్నెల జల్లే

నీవల్ల హాయెంతొ రాజిల్లే


1.నీ జ్ఞాపకాలే నన్నావరించే

నా వలపులన్నీ నిన్నే వరించే

గతజన్మలెన్నో మన ప్రేమను వివరించే

మన తలరాతలనే  విధి విధిగా సవరించే


2.సర్వదా నిన్నే మది కలవరించే

నిదురలోను నీపేరే పెదవి పలవరించే

తీపి తీపులెన్నిటితోనో మేను పులకరించే

కలయికల కలలతోనే బ్రతుకే తరించే౹


https://youtu.be/GSSyg4la75A?si=ఎకామోర్ఫ్లమక్వాటేఫ్

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం :కనకాంగి

ప్రాణమున్న పాలరాతి బొమ్మలు
పదారణాల తెలుగింటి ముద్దుగుమ్మలు
నటరాజు పాదాల రవళించు మువ్వలు
సరస్వతి చరణాల కడతేరు పువ్వులు
నా పాటలు రసహృదయుల మనోరంజితాలు
నా పాటలు పాఠకాభిమానుల ప్రశంసా ఫలితాలు

1. శ్రీ కృష్ణుని పదహారువేల గోపికలు
అష్టదశ పురాణాల సంగ్రహ దీపికలు
గీతామృత సారమొలుకు సంచికలు
భవ జలధిని దాట దారి సూచికలు
నా పాటలు రసహృదయుల మనోరంజితాలు
నా పాటలు పాఠకాభిమానుల ప్రశంసా ఫలితాలు

2.సైరిక సైనిక శ్రామిక భావనా ప్రతీకలు
కులమతాతీత మానవతా గీతికలు
మమతానురాగాల స్నేహ వీచికలు
భరతమాత కీర్తిచాటు పతాకలు
నా పాటలు రసహృదయుల మనోరంజితాలు
నా పాటలు పాఠకాభిమానుల ప్రశంసా ఫలితాలు

3.విశ్వజనీనమైన ప్రేమ సంతకాలు
సరస ప్రణయ శృంగార ఉత్ప్రేరకాలు
విరహానల జ్వాలాన్విత తమకాలు
దీనుల వేదనాశ్రుధారల ప్రవాహకాలు
నా పాటలు రసహృదయుల మనోరంజితాలు
నా పాటలు పాఠకాభిమానుల ప్రశంసా ఫలితాలు




తిరుక్షవరం తలదాల్చి తిరుకొలనులొ మేను ముంచి

తిరుపావడ పరిఢవించి తిరునామం నుదుట తీర్చి 

తిరుగాడుదు స్వామి గుడి వాకిట పరమే తిరిపెముగా


1. తిరుముత్తము కేతించి తిరుమలేశుని గాంచి

తిరుమంజన మాచరించ తిరువారాధన గావించి

తిరునిగ తిరుముడినై తరించెద తిరుప్పావై పఠించి


2.తిరువీసము  నా హృదయము తిరుబోనము నర్పించి

తిరునాళ్ళలో తీరుబడిగ తిరువీథుల చరించి

తిరుచలొ స్వామి ఊరేగ కృతినౌదు తిరుముద్రల భుజమిచ్చి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అనురాగం రంగరించి

నయగారం కుమ్మరించి

మనసారా నిను వరించి

విరహాగ్నిని నే భరించి

అంగాంగం సిద్ధపరిచా నీగురించి

శృంగార రససృష్టికి నీవే విరించి


1.భక్ష్యమే నా చుబుకం కొఱుకు చిన్నగా

భోజ్యమే నా అధరం నములు మెత్తగా

చోష్యమే చెవితమ్మెలు చప్పరించు హాయిగా

లేహ్యమే మెడవంపు నొల్లు రంజిల్లగా

పయోధర పానీయం ప్రాశిల్లు మత్తిలగా


2.అణువణువును స్పృశించు తమకంగా

కంపించగ మేనుమీటి పలికించు గమకంగా

 అత్తరునే మించు  స్వేదమాఘ్రాణించు మైకంగా

రెప్పార్పక తిలకించు అసూర్యంపశ్యలనేకంగా

రసన సృణికనే గ్రోలు వదలక అదేలోకంగా

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిత్యం పున్నమలే-నీ కన్నుల వెన్నెలలో

రోజూ ఆమనిలే-నీ నవ్వుల పువ్వులతో

కోయిల గానములే-నీ కోమల గళసీమలో

తేనెల మధురిమలే -నీ పలుకుల ఝరిలో


1.ఏనాడూ ఉగాదులే  చెలీనీ సన్నిధిలో

దసరా ఉత్సాహాలు నీ సహవాసములో

దీపావళి ఆనందాలు నీతో పయనములో

సంక్రాంతి సంబురాలు నీవున్న తావులలో


2.పంచామృతాలు  దాంపత్య రుచులు

షడ్రసోపేతాలు నీతో గడుపు నిమిషాలు

సప్తపదితొ ఒనగూరును స్వర్గసౌఖ్యాలు

నవవిధ సరసాలు ఒలుకు నీతో సంగమాలు

Thursday, December 24, 2020


https://youtu.be/5jHaPLxpCaE

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హంసానంది


తెరుచుకుంది  ఉత్తర ద్వారము

మోక్ష ప్రాప్తికి అదియే నిజమార్గము

ముక్కోటి దేవతలకు అందెడి భాగ్యము

మనుజులకైనను దొరికే అదృష్టము

నరసింహస్వామీ నీ దివ్యదర్శనం

ధర్మపురే ఇల వైకుంఠ మన నిదర్శనం


1.విచ్చుకోనీయి నా మనో నేత్రం

మరవకు స్వామి నన్ను మాత్రం

ముక్కోటి ఏకాదశి నేడు పరమ పవిత్రం

నీ దయా దృక్కులకై మాకెంతటి ఆత్రం

నరసింహస్వామీ నీ దివ్యదర్శనం

ధర్మపురే ఇల వైకుంఠ మన నిదర్శనం


2.రాలేదని కినుక వలదు నీ కడకు

నమ్మితి నినుస్వామీ  నాచేయి విడకు

తెలువలేను గెలువలేను నాతో ఆడకు

శరణు నీ పాదాలే నరహరి మాకు కడకు

నరసింహస్వామీ నీ దివ్యదర్శనం

ధర్మపురే ఇల వైకుంఠ మన నిదర్శనం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చేను చుట్టు కంచె ఉంది

నడుమనేమొ మంచె ఉంది

మించిపోని మంచి ఏళ ఉంది

పంచుకోను పడక ఉంది

బేగిరార బిడియాల బావా

ఓపలేను నేనింక మేని యావ


1.పండిన సొగసుంది నాకు

వండిన వలపుంది నీకు

మండిన వయసుంది మనకు

నంజుకోను వగరుంది అంచుకు

బేగిరార బిడియాల బావా

ఓపలేను నేనింక మేని యావ


2.నీ కోరమీసం నచ్చింది

ఎకరమంత నీఛాతి బాగుంది

ఓ పట్టుబడితె నలగాలనుంది

నిను పట్టుబట్టి కట్టుకోవాలనుంది

బేగిరార బిడియాల బావా

ఓపలేను నేనింక మేని యావ


PIC:SRI. Agacharya Artist

Wednesday, December 23, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఇల్లేమో ఇరకటం ఇల్లాలో మరకటం

జీవితాంతం మగనికెంత ఎంత సంకటం

తప్పదు తల ఒగ్గటం ఎప్పుడూ ఆమే నెగ్గటం

మెడకు పడ్డ డోలును విధిలేకే మోయటం


1.పదిమందిలొ నాటకం అన్యోన్యపు కాపురం

నాలుగు గోడల మధ్యన సంసారం సాగరం

పట్టలేని విడవలేని వింతగు పితలాటకం

గుట్టుగ నెట్టుక రావడమే మగవాడికి నరకం


2. మహిమ మాట వట్టిదే మనువు మంత్రాలకు

మనసెలా ఉంటుంది మొండిఘటపు యంత్రాలకు

కీచులాటలన్నీ సద్దుమణగాలి  సాయంత్రాలకు

సరే యనక కుదరదు దాంపత్యపు తంత్రాలకు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువ్వే నాకు ఒక టానిక్కు

లేకుంటే లైఫే మెకానిక్కు

ఎక్కితే మనం ఫ్రెండ్షిప్ టైటానిక్కు

బతుకంతాలక్కు ,లేకుంటే నేనైతే బక్కెట్ కిక్కు


1.మునిగినా సంతోషమే మూణ్ణాళ్ళు కలిసున్నా

మురిపాల కావాసమే నీ చెలిమితొ అన్నులమిన్నా

మళ్ళీ మళ్ళీ జన్మిస్తా నీకొరకె నేస్తమా

మరణాన్ని ఆహ్వానిస్తా మరుజన్మకైనా ప్రాప్తమా


2. నేను కలమై రాయాలంటే పారాలీ సిరావు నీవై

నేను పాటగ మారాలంటే చేరాలీ నా ఊపిరి నీవై

నేను నేనుగ లేనేలేను పరిణమించా నీవుగా

నాలో ఉన్న నీతో ఎపుడో పరిణయించా హాయిగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కురంజి


సద్గురుడవు నీవు కదా సాయి

అందుకో ఇకనైనా ఈ శిశ్యుడి చేయి

వెతుకుతూ వస్తాడట గురువు శిశ్యుడిని

తాత్సారమెందుకు నను ఉద్ధరించడానికి

సచ్చిదానంద సద్గురు సాయినాథా

వందనం యోగిమహారాజా అనాథ నాథా


1.అన్నీ తెలుసుననే అజ్ఞానిని

ఏమీ తెలియని మూఢుడిని

దారీతెన్ను లేక తిరుగుతున్నా

సన్మార్గము చూపమని వేడుతున్నా

సచ్చిదానంద సద్గురు సాయినాథా

వందనం యోగిమహారాజా అనాథ నాథా


2. నా పుట్టుక ప్రయోజనం ఎరుగను

నా జన్మకు పరమార్థం గ్రహించను

కాలయాపనే చేసా ఈనాటి వరకు

తపించిపోతున్నా నీ పాద సేవకొరకు

సచ్చిదానంద సద్గురు సాయినాథా

వందనం యోగిమహారాజా అనాథ నాథా

 "సింగరేణి" శత వార్షికోత్సవ సందర్భంగా-


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కీరవాణి


మా తెలంగాణ ఇంధనమా

సింగరేణి కృష్ణ కాంచనమా

శ్రమైక సౌందర్య జీవనమా

జోహారులమ్మా మా వందనం గొనుమా


1.బాసర పునాదిగా భద్రాద్రి తుదిగా

గోదావరి నదీ లోయ ప్రాతిపదికగా

విస్తరించినావమ్మా మా ఆర్తిని తీర్చగా

తరగని బొగ్గుగనిగ  కీర్తిని చేకూర్చగా

జోహారులమ్మా మా వందనం గొనుమా


2.పరిశ్రమల మనుగడకే ప్రాణవాయువై

విశేషించి విద్యుత్తు ఉత్పాదక మూలమై

ప్రభుత ఖజానాకు నీవు సదా చేయూతవై

ప్రజల ఉపాధికల్పనలో ప్రధాన భూమికవై

జోహారులమ్మా మా వందనం గొనుమా


3.శ్రమజీవుల ఘర్మజలం  నిన్నభిషేకించగా

అనవరతం అలుపెరగని కన్నులు హారతిగా

సింగరేణి కార్మిక జీవితకాలమే నైవేద్యంగా

నీదైన ప్రత్యేక లోకమే జనులకు హృద్యంగా

జోహారులమ్మా మా వందనం గొనుమా


OK

Tuesday, December 22, 2020

 

https://youtu.be/G3Mqpr9m55M?si=Gc3ek_1yr8w1grov

రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీకెందుకు అనిపించదు నాలా

పదేపదే నన్నే పలకరించమనాలా

ప్రేమంటె ఇరువురికీ రెండర్థాలా

ఒకవైపే చొరవ ఉంటె చాలా?

పరస్పరం ఆశిస్తే ఆ బంధం విలువ చాలా!


1.కలవకుంటె ఎంతగానొ ఆరాటం

కనబడితే తీరుతుంది ఉబలాటం

అనుక్షణం నీ గురించె మనమున మననం

నీకెందుకలా తోచదో అగమ్యగోచరం


2.నీ పలుకులు పంచదార చిలుకలు

నీ నవ్వులు సంతూర్వాద్య రవళులు

నీ సన్నిధి నవపారిజాత పరిమళం

నా మదియే ఓ దేవీ నీ పవిత్ర దేవళం

Monday, December 21, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వలపుకు ప్రతిబంధకమే కాదు వయసు

నిత్య యవ్వనంతో చెలగును మనసు

అనుభవాన దొరికిన స్త్రీ అనుభూతులు

పలవరించి మురిసిన మధురస్మృతులు

జీవితం ఎప్పటికీ నవరసభరితం

సరసం విరసం సమపాళ్ళై సమ్మిళితం


1.సౌందర్యోపాసనే పూర్వజన్మ సుకృతం

సౌందర్యారాధనే అపురూప అవకాశం

సౌందర్య పోషణ అనవరతమౌ ఘోరతపం

సౌందర్య లహరితొ తరియించట తథ్యంతథ్యం

జీవితం ఎప్పటికీ నవరసభరితం

సరసం విరసం సమపాళ్ళై సమ్మిళితం


2.సుందరమౌ వదనమే సుదతికి వరం

శరీర సౌష్ఠమే తోయజాక్షికి అదృష్టం

హోయలొలికెడి నడకలు అదనపు సొత్తు

ప్రియవచనములే పడతిజల్లెడి మత్తు

జీవితం ఎప్పటికీ నవరసభరితం

సరసం విరసం సమపాళ్ళై సమ్మిళితం

 https://youtu.be/e3XkqnCMNUU?si=FlHAxiYPg8gsPpdi


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హిందోళ వసంతం


శుభంకరా శివ శంకరా

శంభోహరా గంగాధరా

నమఃపార్వతీ పతయే శశిధర

జయజయ జయజయ రాజేశ్వర

జయహే కాశీ విశ్వేశ్వరా జయహే రామలింగేశ్వరా


1.చమరించిన నా నయనమ్ములలో

తరగక ఊరెను సలిల ధారలు

సంతతధారగ  అభిషేకించగ

ఎంచుకుంటివా నను పరమ శివా

సరిపోవేమో నా ఆశ్రువులని 

సందేహించకు  సాంబశివా

నా చివరి  రుధిర బిందువు సైతం

అర్పణ జేసెద నీకే రుద్రా


2.అవధరించు నను నువు ధరించగా

నా చర్మము గలదు చర్మాంబరధరా

పరవశించగా నువు వసించగా 

నా మానసమే కైలాసమాయెగా సదాశివా

నీ నాట్య వేదికగ నా చిత్తము చేకొను

తకిట తధిమియని నా మదము నణచగా

కరకమలములే సమర్పించెద  ప్రియమారగా

సరగున బ్రోవగ సన్నుతించెద మహాదేవా

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎదుటి మనసు గాయపరచు ఆగ్రహమది ఎందుకు

నీ ఎదకే ముప్పుతెచ్చు ఆవేశమెందులకు

ఎవరిమీది కోపమో పరుల ఎడల ఎందుకు

అసహాయత ఆవరించ వృధా అరుపులెందుకు

ఇదే మన ఖర్మమని భరించక

ఇందుకే మనమున్నదని సహించక


1.తెలివైనవాడు అమాయకుణ్ణి

ధనికుడు కడు పేదవాణ్ణి

బలవంతుడు బలహీనుడిని

యజమాని సేవకుడిని

అడుగుడుగున వంచనతో ముంచుతున్నా

ప్రతిసారి మోసగించి దోచుకున్నా

ఇదే మన ఖర్మమని భరించక

ఇందుకే మనమున్నదని సహించక


2.చిన్న చేపను ఓ పెద్దచేప మ్రింగు రీతి

ఆ పెద్దచేపను మరో పెద్దచేప మ్రింగడమే లోకనీతి

మోసపోవడం జీవితంలో ఓ భాగమై

అనునిత్యం అంతర్మధన దౌర్భాగ్యమై

ఘర్షణతో నిరంతరం జ్వలించినా

వాదనతో అనవరతం వచించినా

ఇదే మన ఖర్మమని భరించక

ఇందుకే మనమున్నదని సహించక

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నువ్వే కారణం నీ నవ్వే కారణం

నా ఎద గుమ్మాన అనునిత్యం నీ జిలిబిలి పలుకుల తోరణం

నీ చూపుల వెన్నెలతో నా వెతలన్నీ నివారణం


1.నువ్వే కాదన్నావంటే మరణమె నాకు శరణం

నీతో నాబ్రతుకంటే ఈ జన్మకే విశేషణం

నీవంటూ లేకపోతే నాకేది దిక్కూదివాణం

నాజీవితాన నువు కాలుమోపినదే శుభతరుణం


2.ప్రేమకు ప్రణయానికి మనమే ప్రమాణం

మనసుకు మనసుకు జరిగినదే మనకళ్యాణం

సహనశీలతే నీకు అపురూప ఆభరణం

ఆదర్శమైన గృహిణిగా ఎందరికో నువ్వే ప్రేరణం

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


గులాబి చెప్పింది గుడ్మాణింగ్

మల్లిక చెప్పింది మనసారా మాణింగ్

మందారం తెచ్చింది అందాల మాణింగ్

పున్నాగ అందించింది ఫ్రెష్ నెస్ మాణింగ్


1.నందివర్దనంతో నవ్వుల మాణింగ్

పారిజాతాల పరిమళ మాణింగ్

బంతిపూలతో బంగారమే మాణింగ్

చేమంతి పూలంటి మాటామంతి మాణింగ్


2.నిద్రగన్నేరంటి గమ్మత్తు మాణింగ్

తంగేడు పూలంటి రంగారు మాణింగ్

చంపకాలంటి ఈ చైతన్య మాణింగ్

ఉత్పలాలంటి కడు ఉత్తేజ మాణింగ్



తీరిపోతె ఏముంది కోరిక

నిస్సారమే ఈ జీవనం ఇక

ఫలించినంత అంతటిదే వేడుక

అసంతృప్తిలోనె ఉంది భవితవ్య దీపిక

వేంకటరమణా నేనేంటో నీకే ఎరుక

కరుణాభరణా నన్నుద్ధరించు జాగు సేయక


1.మితిమీరిన సుఖములనే బడసి

మతినైనను నిను నిలపనైతి అరసి

గతినీవే అన్యమెరుగ దయగను శ్రీపతి

ద్యుతినీవే అంధకార బంధురమవ నా ఋతి

వేంకటరమణా నేనేంటో నీకే ఎరుక

కరుణాభరణా నన్నుద్ధరించు జాగు సేయక


2.అలసినాను బ్రతుకున పరుగిడి పరుగిడి

ఎండమావులైన ఐహిక బంధాల పాలబడి

నొచ్చినప్పుడే నీ శరణుజొచ్చితి భయపడి

వెతల కాన్కలిచ్చైనా  మరువనీకు పొరబడి

వేంకటరమణా నేనేంటో నీకే ఎరుక

కరుణాభరణా నన్నుద్ధరించు జాగు సేయక

Saturday, December 19, 2020

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


దాహాన్ని తీర్చేటి నది నీ మది

తోడునీడ నిచ్చేటి తరువు నీ తనువు

నీ అనురాగం నను తడిపేను  మేఘమై

నా జీవితాన అడుగిడినావే చెలీ రసయోగమై


1.హరివిల్లులె నీ బుగ్గల్లో సిగ్గు బిడియాలు

విద్యుల్లతల పుట్టిళ్ళు మన్మోహన నీ హాసాలు

జలపాత వేగాలు వంకలేని నీ పనిపాటలు

నీవు నడయాడే చోట వెలసేను విరితోటలు


దాహాన్ని తీర్చేటి నది నీ మది

తోడునీడ నిచ్చేటి తరువు నీ తనువు

నీ అనురాగం నను తడిపేను  మేఘమై

నా జీవితాన అడుగిడినావే చెలీ రసయోగమై


2.నీ మేను అందంకన్నా నీ మనసే సుందరం

 నీలో నేను మెచ్చే గుణమే నీవుచేసే పరోపకారం

మంచులా కరిగుతుంది నీ దయార్ద్ర హృదయం

దీపమల్లె వెలుగిస్తుంది  ఆదరించు నీ సౌశీల్యం

 

https://youtu.be/hJkaY-NoHy8

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భీంపలాస్


చిత్తజ జనని విత్తరూపిణీ

అప్రమత్తవై ననుగాంచవే

సమాయత్తమై ఏతెంచవే

నమస్తే సంపద సమృద్ధిని 

నమోస్తుతే ఐశ్వర్య దాయిని


1.శ్రీ చక్రరాజ సింహాసినీ

   శ్రీ హరి హృదయేశ్వరి

   శ్రీ పీఠ  సంవర్ధినీ సిరి

   శ్రీ దేవీ సురనర సేవినీ

   నమస్తే సౌభాగ్యద

   నమోస్తుతే విజ్ఞానద


2.ఓం కార నాదాత్మికా

   హ్రీం కార బీజాత్మికా

   క్లీం కార మంత్రాత్మికా

   శ్రీం కార రూపాత్మికా

  నమస్తే ఆనందవరద

  నమోస్తుతే కైవల్యద

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పచ్చని పైరంటి కోమలీ

వెచ్చని నెగడంటి నెచ్చెలీ

నా ఊసులు నా బాసలు గ్రహించవేమే

నా ఊహలు తపనలు ఫలించనీవే


చిరుగాలితొ కబురంపినాను

నీ చెవిలో నా మనసును 

గుసగుసగా వినిపించమని

మరుమల్లితొ విన్నవించినాను

నా చిత్త వాసన తన సువాసన 

మేళవించి నిన్నలరించమని

బదులుపలుక వైతివే-ఎదను తెలుపవైతివే

నా జీవన ఆమని-నా హృదయ మధువని


తొలిపొద్దును అడిగినాను  

సిందూరతిలకమై 

నీ నుదురును ముద్దాడమని

గోదారిని వేడినాను 

తన అలల చేతులే నావిగా 

నిను కౌగిలించమని

మౌనము వీడవైతివే-ప్రేమను పంచవైతివే

నా జీవన ఆమని-నా హృదయ భామిని

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


(యుగళగీతం)


అతను: గాజుకళ్ళ పిల్లా

            నా మోజుతీర్చవెల్లా

            పడిపోయా నిను చూసి వెల్లాకిల్లా

            ముంచేయకె నంగనాచి ననునిలువెల్లా


ఆమె:  చొంగకార్చు బావా

           ఎప్పుడూ నీకదే యావా

           మనువయేదాక ఆ మాత్రం ఆగలేవా

           అంతలోనె మతిమాలుతు ఇంతటి కరువా


అతను:1.తిప్పుకుంటు తిరుగుతుంటె

               ఎవరైనా చప్పున పడిపోరా

               చుప్పనాతి బుంగమూతి మొహందాన

               సూదంటు రాయంటి సోకుదాన


ఆమె:      ఉత్తినె ఊరిస్తే  ఉరికొస్తావు

               చనువిస్తే కాస్త సంక నెక్కుతావు

               ఏదో పాపం పోనీ లెమ్మంటే

               పోకిరోడా నా ఎదనే దో చేసేస్తావు


అతను:2.నాటకాలంటేనే నాకెంతకు పడవే

               తాయిలాలిస్తె నువ్వస్సలు పడవే

               నడపవె చుక్కానివై నా బతుకు పడవే

               తింగరి బుచ్చి నాపై ఏల మనసు పడవే


ఆమె:     లగ్గమింక చేసుకో తిరకాసు బావ

              పగ్గాలింక నీకిస్తా పరుగులె మన తోవ

              దగ్గరైపోతా నీ మనుసులొ మనసుగా

              ఒగ్గుతా నా తనువును తపనలారగా


OK 


నీ కడ లేకనే ఇవ్వలేదో

నాకివ్వాలనిలేకనే ఇవ్వలేదో

నీ పోకడ అర్థమే కాదెవరికీ

బ్రతుకును చేయకు చేదెవరికి

దయచేయుమా సాయిరామా

వేంచేయిమా నా హృదయ సీమ


1.నవ్వులనే ఎత్తుకెళ్ళావు సాయిబాబా

పువ్వులనే నలుపుచుందువు నీకిది సబబా

కవ్వముమై చిలుకుమయ్య నా మదిని

తొవ్వలైతే తప్పనీకు చేరగ నీ సన్నధిని

దయచేయుమా సాయిరామా

వేంచేయిమా నా హృదయ సీమ


2.పక్షపాతముందేమో నీకు సాయిబాబా

లక్ష్యపెట్టవెందుకు మరి నన్ను భక్త సులభా

నిను నమ్మితె వమ్ముకాదు ఇది జనవాక్కు

నిను వదలను వరమీయగ అదినా జన్మహక్కు

దయచేయుమా సాయిరామా

వేంచేయిమా నా హృదయ సీమ

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఈ నాన్నకే నాన్నవౌతుంటావు

నీ వెన్న మనసు పంచుతుంటావు

తొక్కుడు బండకున్న ఓపిక నీది

మిక్కిలి వెలుగులీను దీపిక నీ మది

అశీస్సులివే నీకు సిద్దీశ్ కన్నా

జన్మదిన దీవెలివె వృద్ధినొందు సాటివారి కన్నా

హ్యాప్పీ బర్త్డే టూయూ విష్యూ హ్యాప్పీ బర్త్డే టూయూ 


1.విలువలకే విలువనిచ్చు నీ సంస్కారం

బంధాలను బలపరిచే నీ జీవన విధానం

జగతిలోన నీవే ఆదర్శం కావాలి

ప్రగతి పొంది ఇంటిపేరు నిలపాలి

అశీస్సులివే నీకు సిద్దీశ్ కన్నా

జన్మదిన దీవెలివె వృద్ధినొందు సాటివారి కన్నా

హ్యాప్పీ బర్త్డే టూయూ విష్యూ హ్యాప్పీ బర్త్డే టూయూ 


2.ముంబై సిద్దివినాయకుడు చల్లగ చూడాలి

కొండగట్టు అంజన్న కరుణను కురిపించాలి

వెములాడ రాజేశుడు నీ వేడ్కలు తీర్చాలి

ధర్మపురి నరుసన్న నీకు అండ ఉండాలి

అశీస్సులివే నీకు సిద్దీశ్ కన్నా

జన్మదిన దీవెలివె వృద్ధినొందు సాటివారి కన్నా

హ్యాప్పీ బర్త్డే టూయూ విష్యూ హ్యాప్పీ బర్త్డే టూయూ

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వెలవెల బోతున్నది నెల వెన్నెలా

అలకల చంపకే ఇల నన్నిలా

మిసమిస వన్నెలున్న అన్నులమిన్నా

రుసరుసలేలనే అన్నిట నా కన్నా నీవే మిన్నా


వెలవెల బోతున్నది నెల వెన్నెలా

అలకల చంపకే ఇల నన్నిలా

మిసమిస వన్నెలున్న అన్నులమిన్నా

రుసరుసలేలనే అన్నిట నా కన్నా నీవే మిన్నా


1. చక్కని నీ మోముకు నీ నగవే వజ్రాభరణం

చిక్కిన నీ నడుముకు తులము పసిడి వడ్డాణం

పలుచని నీ పాదాలకు పాంజేబులె విన్నాణం

పాలరాతి శిల్పము అంగనా నీ అంగ నిర్మాణం

నీ పొందే బహుజన్మల నా పుణ్య ఫలం

మూతిముడిచి పస్తుంచకు నను చిరకాలం


వెలవెల బోతున్నది నెల వెన్నెలా

అలకల చంపకే ఇల నన్నిలా

మిసమిస వన్నెలున్న అన్నులమిన్నా

రుసరుసలేలనే అన్నిట నా కన్నా నీవే మిన్నా


2.చలిని తరిమికొట్టవె నను కౌగిట బంధించి

నా తాపము తీర్చవే నీ పెదవులనందించి

ఆవురావురంటున్నది నెరవేరక తనువున తమకం

ఆరాటపడుతున్నది ఐక్యవవగ ఎడద ఢమరుకం

రతిమదనుల గతి సాగెడి సృష్టికార్యముకై

ప్రీతిమీర అలరించవె దృష్టిసారించినాపై


వెలవెల బోతున్నది నెల వెన్నెలా

అలకల చంపకే ఇల నన్నిలా

మిసమిస వన్నెలున్న అన్నులమిన్నా

రుసరుసలేలనే అన్నిట నా కన్నా నీవే మిన్నా

Tuesday, December 15, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మౌనం మన మధ్యన పారే జీవనది

భావనా యానానికి అక్షర వారధి

ప్రత్యక్ష సావాసమె మన పరమావధి

ఉవ్విళ్ళూరుతోంది తలవగ నామది


1.మాటలతో కట్టేస్తా మహారాణీ నీకో కోట

నందనవనాలే నీ నగవులు విరియు చోట

స్వప్న లోకాలలో సరదా విహారమేనంట

స్వర్గసీమలే మనకు వేసవి విడుదులంట


2. స్నిగ్ధ సౌగంధికా పుష్ప చందమే నీ తనువు

కేతకి పొదల ఎదల సుగంధమే నీవున్న తావు

పరిపక్వ ఆమ్ర ఫల రసానందమే నీతో చనువు

అముక్తమాల్యద ప్రబంధమే నీతో నా మనువు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నవ్వడం నేర్చుకుంది నినుచూసి నవ్వు

పురులు పొదువుకుంది నినుగని పువ్వు

తొలకరి నేలకైన అబ్బురమే నీ మేని తావి

సుధకు మధుర మలరింది తాకినంత నీ మోవి


1.ఉరకల నెరిగాయి నినుగాంచి సెలయేళ్ళు

పరవశాలు మరిగాయి నిను తలంచి నెమళ్ళు

వర్ణాలను వెతికింది నిను తూగగ హరివిల్లు

ధన్యత నొందింది నిను తడుపగ చిరుజల్లు


2.వికలమైంది  నిను నుతించి మరి లిఖించ కవికలం

విరమించుకుంది కుంచె మరి దించక నీ  చిత్రణానంతరం

పలువిధముల నిను పాడి మరిపాడక మౌనవించె పికగళం

సాహసించదే ఏ ఉలి  ఏమరి మలచగ  నీ దివ్య శిల్పం

 

https://youtu.be/iAU_znayN28?si=SMbAPo3xVn3fdZiV

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


యుగయుగాలుగా చిరంజీవిగా

తరతరాలుగా మా ఇలవేలుపుగా

ఇలవెలసిన శివతేజా మారుతి రాజా

స్మరియింతు నిన్ను వీరాంజనేయా

భజియింతు నిన్ను భక్తాంజనేయా


1.వ్యక్తి కన్న రామనామమే శక్తివంతమని

నిరూపణే చేసితివి ఎదుర్కొనగ శ్రీరాముని

సీతమ్మకు శ్రీరాముడు వశమైన మిష నెరిగి

సిందూర ధారణతో  రాముని మది గెలిచితివి

ధ్యానించెద నిన్ను అభయాంజనేయా

ప్రస్తుతించెదనూ  ప్రసన్నాంజనేయా


2.భీముడు నీ అనుజుడు కదపలేడు నీ వాలము

మహాబలుడ వీవే మోయగ సంజీవనీ శైలము

ప్రత్యక్ష దైవమా స్వామి  నిను ఎన్నగ జాలము

శరణంటిమి కరుణించగ  నీ ఎదయే విశాలము

నమో సంస్థుతాయ నృసింహాంజనేయా

ప్రభో ప్రపత్తిదాయ పంచాననాంజనేయా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కలవడమే కలైతే ఎలా-

కలకాలం ఇలా'నే బలా

కలయిక కల ఇక యని కలతలు రేపగ

కలభము నైతిని నిను దీనత వేడగ


1.కలవని తలవనా కల'వని తలవనా

కలయో వైష్ణవమాయో యని ఎంచనా

కలగాపులగమాయె చెలఁగిన భావనలు

కలరవమాయేనో కలికి నీ సాంత్వనలు


2.కలవరింతలే రేయీ పగలు

కలకంఠి మాన్పవె నా దిగులు

కలకండ నీ జిలిబిలి పలుకులు

కలబోస్తివి చెలి నీ మిసమిసలు


3.కలవరమే కలిగె నా ఎదలో

కల'వరమే ఔనా ఈ జన్మలో

కలహమా నాతో కలహంస గమన

కలమే నీ పరమై కదిలే ఈ తీరున


PIC courtesy: Radha Mohan Rangu

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సృష్టిలో స్రష్ట చాతుర్య సృజనే అద్భుతం

నా దృష్టిలో నీ శ్రేష్ఠ సౌష్ఠవమే అత్యద్భుతం

అందానికి పరాకాష్ట నీ సౌందర్యం

అదృష్టవంతుడనే నీతో నా సహచర్యం

చెలీ సఖీ ప్రేయసీ ప్రియతమా

నేను నీవుగా మారిన జీవితమా


1.గడ్డిపూవు చాకిరేవు ఇంద్రధనువు అందమే

హిమశిఖరం పిక స్వరం నీలాంబరం అందమే

పొద్దు పొడుపు మెదటి వలపు కలల రేపు అందమే

అలల కడలి నెలజాబిలి చెలికౌగిలి అందమే

కనువిందుచేయగ ప్రకృతి సాంతం అందమే

నందింపజేసెడి జగతియంతా మహదానందమే

చెలీ సఖీ ప్రేయసీ ప్రియతమా

నేను నీవుగా మారిన జీవితమా


2.పద మువ్వలు పసి నవ్వులు గుడిదివ్వెలు  అందమే

నిశి తారలు జలధారలు రుచి కూరలు అందమే

గులాబీలు జిలేబీలు పంటచేలు అందమే

సామవేదం యక్షగానం వేణునాదం అందమే

కనువిందుచేయగ ప్రకృతి సాంతం అందమే

నందింపజేసెడి జగతియంతా మహదానందమే

చెలీ సఖీ ప్రేయసీ ప్రియతమా

నేను నీవుగా మారిన జీవితమా

 

https://youtu.be/sGc8oS897CQ

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చెలి మేని బ్యూటీ హైదరాబాదు సిటీ

చెలి పలుకుల స్వీటీ నవ్వుల్లో  నాటీ

భాగ్యనగరమే చెలి తనువుకు నగలా 

విశ్వనగరికి దీటుగా చెలి విశ్వసుందరిగా


1.హెడ్ పై క్రౌనుగా అలరారును చార్మినారు

మకుటాన ఎమరాల్డే భాగ్యలక్ష్మి అమ్మవారు

లాంగైన  హేయిరేమో నల్లని మూసీరివరు

తురిమిన మల్లెపూలే నయాపురానా పూలు

నీ ఐసే ఐమాక్సు నీ లుక్సే మల్టీప్లెక్సు

నీ నోసే ఐనాక్సు నీ చిక్సే ఇనార్బిట్సు


2.కోటీ టూ ఆబీడ్సు జవరాలి కంఠసీమగా

ఎల్బీస్టేడియమే విశాలమైన చెలి ఎదగా

ప్లానిటోరియం బిర్లాటెంపుల్ కొండలే పాలిండ్లుగా

నక్లెస్ రోడ్డే నాజూకైన నడుముకు వడ్డాణంగా

ప్యారడైజే ప్రియురాలి నాభికి తార్కాణంగా

 మెట్రోరైలు ఫ్లయ్యోవరే నూగారుకు నిదర్శనంగా


3.బంజారా జూబ్లీ హిల్సే ప్రియురాలి కోకారైకలు

సాఫ్ట్ వేర్ గుట్టంతా హైటెక్సు గచ్చిబౌడిగా

హ్యాండ్ బ్యాగేమో కృష్ణానగరు ఫిల్మ్ సిటీలు

రామోజీ ఫిల్మ్ సిటీ ప్రేయసి అందాలగొడుగు

హుస్సేను సాగరే చెలి చెమటల మడుగు

ప్రియురాలి సావాసమే ఆశలేవో తొడుగు


OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అతివైనా దాసోహమె సాటి సుదతి అందానికి

మతినిండా మోహమే అసూయ చెందడానికి

తమకము తీరక అరమరికలు అసలు లేక 

అల్లుకపోతారు లతలై లతాంగులు సుందరాంగులు


1.జలకములాడునపుడు వలువలు దాల్చునపుడు

పరస్పరం సంగమ సంగతుల పరాచికాలాడునపుడు

బిడియము వదిలివేసి,సిగ్గు తెరల తొలగించ

ఎంచలేనంతగా ఒకరినొకరుమించి ఆనందించ

అల్లుకపోతారు లతలై లతాంగులు సుందరాంగులు


2.వావివరుసలేవైనా వయసులు వ్యత్యాసమైన

మనసువిప్పి చెప్పుకొనగ మగువలు స్వతంత్రులు

నెలసరికి ప్రసూతికి మహిళకు మహిళే గురుసదృశంగా

సందేహ నివృత్తిలో సాంత్వన ప్రవృత్తిలో పడతులాదర్శంగా

అల్లుకపోతారు లతలై లతాంగులు సుందరాంగులు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాయలమారి ప్రేమపేర ఒకపోరి

మరుపురాని గురుతుల గోదావరి

యవ్వనమంతా వరదల విరహాలు పారి

చెలి చేజారి విషాద కడలి పంచన నే జేరి


1.గలగలా రావాలు కనుమరుగాయే

స్ఫటికమంటి నీరంతా మురుగాయే

ప్రహాహమిపుడు కదలక మడుగాయే

జ్ఞాపకాల బరువుతో గుండె చెఱువాయే


2.కులాల కుళ్ళుతో కలుషితమాయే

మూఢనమ్మకాలవల్ల కల్మషమాయే

ఏ గొంతు తడుపుటకో ఏరు ఎడారాయే

సర్దుబాటు బాటలో నా కంట గోదారాయే

Monday, December 14, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కమలమేదో ముఖ కమలమేదో

మందారమేదో అధరారుణమేదో

ఒయ్యారి నీ ఒంటి నిండ ప్రకృతి

సౌందర్యానికి నీవే సరైన ఆకృతి


1.నీలిమేఘమాల నీ కురులలో

కొలనులోని కలువలు నీ కన్నులలో

రాలిపడే మల్లెలే నీ మోవిలో

విరిసిన విరితోటయే నీ మోములో


2.గిరులు నీ వక్షస్థలమ్ములో

ఝరులు నీ కటిప్రదేశమ్ములో

లోయలో అగాధాలొ అరణ్యాలో

ఎదురౌతుంటాయి నీ మేనిలో


https://youtu.be/MGrZcvlP_9M?si=N59qp0X78VpYOecK

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:కానడ

చిక్కుజడల జడదారి-చిక్కునాకు ఝర్ఝరి
నా చిక్కుల పరిహారి-చిక్కితి నిను కోరి కోరి
నమో నమస్త్రిపురారి-నమోస్తుతే మదనారి
శరణు శరణు నెలదారి-కరుణాకర పాహి భూరి

1.నిండిపో నా చిత్తమందు-ఉండిపో గుండెయందు
నా మనసే కైలాసమందు-భవ రుజలకు నీవె మందు
నమో నమస్త్రి పురారి-నమోస్తుతే మదనారి
శరణు శరణు నెలదారి-కరుణాకర పాహి భూరి

2.అర్పించితి నా మదే-రసనపై నీ నామమదే
పలవరింతు పదేపదే-నీ ఎడ భక్తి నాకుసంపదే
నమో నమస్త్రి పురారి-నమోస్తుతే మదనారి
శరణు శరణు నెలదారి-కరుణాకర పాహి భూరి


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందనివే లలనామణుల అందాలు

అవి గగన కుసుమ సమములు

అనుభూతించవే అంగనల పొంకాలు

అవి తావిలేని విరుల చందాలు

ఆరాధించాలి అపురూప సౌందర్యాన్ని

తరింపజేయాలి ఆస్వాదనలో జీవితాన్ని


1. కట్టు బొట్టులలో చక్కని సాంప్రదాయము

ఆకట్టుకొనే విధములో తెరచాటు సోయగము

సిగ్గులమొగ్గలౌతు మేనంతా సౌకుమార్యము

చూసిచూడగనే కలుగు ఎదనేదోచేసే ఆహ్లాదము

ఆరాధించాలి అపురూప సౌందర్యాన్ని

తరింపజేయాలి ఆస్వాదనలో జీవితాన్ని


2.మిసమిసలతొ  కసిరేపే నెరజాణతనము

ఉసిగొలిపే పరువాల మదన రంగస్థలము

కవ్వింపు చేష్టలతో మతినేమార్చు గుణము

అచ్చికబుచ్చికలతొ బుట్టలోపడవేసే మాటకారితనము

ఆరాధించాలి అపురూప సౌందర్యాన్ని

తరింపజేయాలి ఆస్వాదనలో జీవితాన్ని

 రచన,స్వరకల్పన&గానం :డా.రాఖీ


రాగం:చారుకేశి


చల్లనివాడే రేపల్లియవాడే

చిత్తముపై  మత్తునింక చల్లెడివాడే

నల్లనివాడే అల్లరివాడే

మెలమెల్లగ ఉల్లములే దోచెడివాడే


1.కల్లాకపటమే ఎరుగనట్టుంటాడు

ఎల్లలోకాలు నోట చూపెడుతుంటాడు

కల్లబొల్లిమాయల్లో పడగొడుతుంటాడు

వల్లమాలిన మైకంలో ముంచుతుంటాడు

అహం మమ భ్రమలందుంచుతాడు


2.జాడాపత్తాకలేక దొరకనేదొరకడు

జగమంతా తానే నిండి ఉంటాడు

జనన మరణాల చక్రం తిప్పుతుంటాడు

శరణాగతులకెపుడు వరమౌతుంటాడు

తానే ఇహపరమౌతుంటాడు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా కవితలా మారిపో ప్రతి రోజు

నిను స్ఫూర్తిగా గొనడమే నాకు రివాజు

నీ మృదుమంజుల భాషణతో

పరుగులిడును నా కలము

నీ పద మంజీర రవముతో

నా పదములౌను మంజులము


1.తలపున మెదులును నినుగాంచగ తులసికోట

భావనలో ఊరును  పలుకరించ తేనె తేట

నువు గాత్రం విప్పినంత ప్రతిఋతువున కోయిలపాట

నీ సన్నిధి అనవరతం పరిమళించు పూదోట


2.తూరుపు సింధూరం నీ నుదుటన మెరిసింది

చుక్కలదండు మల్లెచెండై నీ జడన అమరింది

అరవిరిసిన మందారం అధర మాక్రమించింది

గోదావరి గలగలయే నగవుల రవళించింది

https://youtu.be/qf399pW4K88?si=oyn4Gav6NeYoMkYM

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:జయంత శ్రీ

నిను అర్చించుటకే నాకున్నవి ఈ అవయవాలు
సాష్టాంగ ప్రణామాల అవినీ పదముల వాలు
నీ పదముల పొగడగ  పదములకే సవాలు
తిరుమలరాయా కలిగించు దివ్యమౌ అనుభవాలు
నమో వేంకటేశా  సంకట నాశా-ప్రభో శ్రీనివాసా శ్రితజన పోషా

1.ఉఛ్వాస నిశ్వాసల నిన్నే స్మరించనీ
మూసినా తెరచినా కనుల దర్శించనీ
ప్రతివస్తువు నీవేనను భావనతో స్పృశించనీ
నే చేరెడి ప్రతితావు తిరుమలగా ఎంచనీ
నమో వేంకటేశా  సంకట నాశా-ప్రభో శ్రీనివాసా శ్రితజన పోషా

2.నే పలికెడి పలుకుల్లో గోవిందా యని ధ్వనించనీ
నా చేతలన్నీ నీ సేవలుగానే పరిణమించనీ
నిమిత్తమాత్రుడనై నీ ధ్యానమందే తరించనీ
నా చిత్తములో కేవల నీ ధ్యాసనే అవతరించనీ
నమో వేంకటేశా  సంకట నాశా-ప్రభో శ్రీనివాసా శ్రితజన పోషా


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లేవక ఆగునా నిను చూసిన క్షణానా

కాటికి కాళ్ళుచాచు ముదుసలైనా

మానక సాగునా అతి ఘోర తపమైనా

నీవెంట పడక ఎటువంటి తాపసైనా

మెరుపు తీగ నీ అందం చెలీ అందించవే

జలపాతం నీపరువం  ప్రేయసీ ననుముంచవే


1.పడి ఛస్తాను నీకోసం బ్రతికినంతకాలం

కళ్ళప్పగిస్తాను కలకాలం నీవే ఇంద్రజాలం

 తలదించుతాయి కుంచెలు నినుదించలేక

కలవరమొందుతాయి కలములు భావమందించలేక

మెరుపు తీగ నీ అందం చెలీ అందించవే

జలపాతం నీపరువం  ప్రేయసీ ననుముంచవే


2.హంపిశిల్ప సౌష్ఠవం బలాదూరు నీముందు

ఖజరహో వైభవం దిగదుడుపే నీవీయ పొందు

ఖంగుతింటారు నినుగని వాత్సాయనాదులు

వెలితనుకొంటారు నీ ఊసెత్తని అష్టపదులు

మెరుపు తీగ నీ అందం చెలీ అందించవే

జలపాతం నీపరువం  ప్రేయసీ ననుముంచవే

 https://youtu.be/boGYOEw74mo


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రాణం పోతే మాత్రమేమి-ఇచ్చిన మాటకోసం

బ్రతుకే బూడిదైతే ఏమి-చేసిన బాస కోసం

ఆడితప్పక ఆలిని సైతం అమ్మాడు హరిశ్చంద్రుడు

పలికి బొంకక సుతునివండె సిరియాళుని పితరుడు

పెదవిదాటనీయనేల నీపలుకే ఫలించలేకుంటే

వాగ్దానమీయనేల చేతల కసాధ్యమయ్యేదుంటే


1.చేప్పిందేదైనా తప్పక చేయటం సత్యవ్రత సాధన

చేసిందేదైనా ధైర్యంగా చెప్పటం సూనృత పాలన

ఆత్మసాక్షికే నీవు జవాబుదారునిగా

ఆత్మవంచన చేసుకోని ధీరునిగా

మూణ్ణాళ్ళుంటె చాలు జన్మకోసార్థకత

సంతృప్తిని పొందుచాలు శాంతీ సౌఖ్యత


2.అబద్దాలు వింతైన అంతులేని అంటువ్యాధులు

అసత్యాలు ఎంతగ నరికినా పుట్టుకొచ్చు దైత్యులు

హానిచేస్తే చేయనీ వాస్తవమెరిగించగా

ప్రాప్తమైందె దొరకనీ నిజాలనే తెలుపగా

నిదురిస్తే చాలు నేడిక నిశ్చింతగా

గడిపేస్తే చాలు బ్రతుకు యధేచ్ఛగా


OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వదలలేని తంట-చల్లనైన మంట

నీడలా మనవెంట స్నేహితమంట

మేలుకొలుపు పాట-అమ్మ సద్ది మూట

బ్రతుకు పూలబాట-స్నేహితమే ఏ పూట


1.నా కోసమె నీవనే గట్టి నమ్మిక

నీ కోసమె నేననూ చెలిమి గీతిక

అనుక్షణం పరస్పరం బాగోగుల కోరిక

వెన్నుతట్టి చేయిపట్టి నడిపించే పూచీయిక


2.ఆత్మనేనూ పరమాత్మ నీవుగా

త్వమేవాహమనే తత్త్వ రీతిగా

నేను దేహమై నీవు ప్రాణమైన తీరుగా

మైత్రిని నిర్వచించలేమను వెలితి తీరగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రేమను టాక్సీగ వాడటం నీకు బాగా తెలుసు

గుండెను మిక్సీలొ రుబ్బడం నీకు మరిమరి తెలుసు

కల కందామన్నా కునుకును దోచేయడం

కలుసుకుందామన్నా మాట దాటేయడం

నీకు బాగా తెలుసు మరిమరి తెలుసు


1.తన్నుక వస్తాయి పదాలెన్నొ నువు తలపుకు వస్తే

తపనలు మొలుస్తాయి ఎదన నీవెదుటికొస్తె

తప్పించక పోమాకే ఒయ్యారి  చుప్పనాతి

గొప్పలన్ని నీవల్లే నువులేక నేనధోగతి


2.ఉడికించుట కోసమే ఉవ్విళ్ళూరుతావు

నన్నే మార్చుటకే నాటకాలాడుతావు

పడిపోయానెప్పుడో  నీ ప్రణయ పథకానికి

నీకధీనమైనానే  మూడుముళ్ళ బంధానికి

Wednesday, December 9, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


స్పందన లేదేమిసాయి రాయిలా

వందనమిడుదునోయి దయగని రా ఇలా

ప్రత్యక్ష దైవమెవరు నువు వినా సాయీ ఈ ఇల

దీక్షగనిను వేడినా లక్ష్యపెట్టవేల హఠయోగిలా


1.నిను నమ్మితె నల్లేరు నడకలా

నిను కొలిచితె బ్రతుకు పూల పడకలా

నీ కృపతో నెరవేరును ప్రతీ కలా

భువిని నీవె కరుణకు నిలువెత్తు ప్రతీక లా

వింటిని నే నీగురించి మిన్నకుంటి వెందుకలా

నా మనవిని వినిసైతం పెడచెవినినీవు పెట్టకలా


2.విశ్వసించు విధముగ చూపు నీ ఘనతల

నను తరింపజేయగ తెలుపు నీ బోధల

నీ ప్రేమ కురింపించి తొలగించు మా బాధల

అనుభవైకవేద్యముగా పాడనీ నీ గాథల

ఎందరి తలరాతలో మార్చావే విధాతలా

తొందరగా సుందరమౌ  భవితనీయి నేతలా (నేత=శ్రీ మహావిష్ణువు)

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కళ్ళార చూస్తేనే కలగాలి కైపు

ఒళ్ళారబోస్తెనో ప్రతీ వనిత వెగటు 

అతివేగా మగమతికిల ఆహ్లాదం

ఆస్వాదించగ హృదయ ప్రమోదం

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలుగా

జ్ఞానేంద్రియాలకే స్పురించాలి అందాలుగా


1.చెవితమ్మెల మెత్తదనం 

మెడవంపుల కమ్మదనం

చుంబనాల తీయదనం

నవ్వుల సంతూర్ వాదనం

 కనుకలికే చంద్రవదనం

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలుగా

జ్ఞానేంద్రియాలకే స్పురించాలి అందాలుగా


2.తనువు తాక పులకరం

 మేని తావి శీతకరం

 రసనాగ్రమె ప్రియకరం

నుడుగు సడులె వశీకరం

మగువ మోము శ్రీకరం

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలుగా

జ్ఞానేంద్రియాలకే స్పురించాలి అందాలుగా





సరిచేస్తాడు లెక్కలన్ని సిరి హృదయేశుడు

కొసరికొసరి వడ్డిస్తాడు ఆ వడ్డికాసులవాడు

గుణపాఠం నేర్పుతాడు అతి తెలివి తేటలకు

తగినశాస్తి చేస్తాడు మితిమీరిన మోసాలకు

శరణుశరణు గోవిందా పాహి ముకుందా

శరణాగత వత్సలా పరమానందా


1.దశావతారాలలో అవతరించినాడు

పంచాయుధాలతో దైత్యుల దునిమినాడు

నవ విధ భక్తులకు అధీనుడై పోతాడు

ఆరుకాలాలలోను మనకతడే రక్షకుడు

శరణుశరణు గోవిందా పాహి ముకుందా

శరణాగత వత్సలా పరమానందా


2.చతుర్దశ భువనాలకు పరిపాలకుడు

ఒక్కడే స్వామి  శ్రీమన్నారాయణుడు

ద్వాదశాదిత్యులకు మూలమైన వాడు

త్రిగుణాతీతుడు భువి తిరుమల వాసుడు

శరణుశరణు గోవిందా పాహి ముకుందా

శరణాగత వత్సలా పరమానందా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హలధారుడే హాలాహలధారుడు

కృషీవలుడే ఇలలోన శూలధారుడు

సేద్యకారుడే అపర సద్యోజాతుడు

అన్నదాతయే అన్నపూర్ణ ప్రాణేశ్వరుడు

వందనాలు వందనాలు సైరిక శ్రేష్ఠునికి

హృదయ చందనాలు స్వయం శ్రేష్ఠునికి


1.ప్రకృతి పార్వతినే ప్రేమించువాడు

గంగమ్మను సతతము ఆశించువాడు

ఎద్దులనే  ఆలంబన చేకొన్న కేదారుడు

నరుడయ్యీ క్షుద్బాధ హరింయించువాడు

వందనాలు వందనాలు సైరిక శ్రేష్ఠునికి

హృదయ చందనాలు స్వయం శ్రేష్ఠునికి


2.దళారీల పాలబడే భోళా శంకరుడు

అక్షయ ఫలసాయమిచ్చు నిత్యబిచ్చగాడు

ప్రాణం మానం కాచే ప్రపంచేశ్వరుడు

కర్మను తప్పని కర్షకుడే ధరణీశ్వరుడు,

కన్నెర జేస్తే రైతే ప్రళయకాల రుద్రుడు

వందనాలు వందనాలు సైరిక శ్రేష్ఠునికి

హృదయ చందనాలు స్వయం శ్రేష్ఠునికి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆదివారమంటే అది ఒక వరమే

అలసిన తనువుకు  సంబరమే

ఏమని సెలవీయను సెలవుకున్న మహిమను

ఎంతగా ఆస్వాదించను మంచై కరిగే క్షణాలను


1.ఎదిరిచూపులెన్నెన్నో గడచిన నాటినుండే

ఎప్పటికి వస్తుందో మనసైన మన సండే

ప్రణాళికలు రచిస్తూనే మది పరవశిస్తుండే

రవివారం విందంటుంటే నోరూరుతుండే


2.నిద్రనుండి లేవడానికే  వొళ్ళు బద్దకించే

సర్దుకోవడానికే సగంరోజు సంకనాకె

ఏకిపీకి చూసేలోగా ఉన్నపొద్దింక  గ్రుంకే

కన్నుమూసి తెరిచేలోగా సండే కాస్త మండే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కన్నీటి కడలే నా కడలేని  జీవితం

కలల పడవలో నా తెగని ప్రయాణం

చెక్కుకున్న చిరుఆశలే చుక్కానిలై 

ఎనలేని ఎదురుతెన్నులే తెరచాపలై


1.అడుగడుగున ముంచెత్తే-ఆరాట కెరటాలు

నడుమ నడుమల్లో  జంజాట సుడిగుండాలు

హృదయ అగాధాలలో దాగిన బడబానలాలు

మూస్తున్నకొద్దీ పడవకు పడేటివెన్నో కన్నాలు


2.దాడిచేసే సొరచేపలు విత్తపు విపత్తులు

మ్రింగేసే తిమింగలాలు పుండుమీది పుట్రలు

వశపడని కుంభవృష్టిగా శారీరక రుగ్మతలు

సునామిగా కబళించే  మానసిక వ్యాధులు

Saturday, December 5, 2020

  రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చూడాలని ఉంది

నీ మనసులోన ఏముందో

చెప్పాలని ఉంది 

నా గుండె ఏమంటూందో

పటాపంచలైపోనీ సందేహాలనీ

ఊరటచెందనీ మన దేహాలనీ


1.నాకెలా ఔతుందో అది నీకూ ఔతోందోని

నీకేలా అయ్యిందో అది నాకైంది కనుకని

అది ఇది ఒకటే అన్నది నీ మది చెబుతోంది

నా మది ఏనాడో నీదైంది అన్నదే నిజమని


2.పదేపదే అదేపనిగ నను నువు కదపగా

పదపదమును పదిలంగా నీకు నివేదించగా

ముదముకూర్చ పెదవుల నందించగా

నా ఎదనే స్వీకరించు విధిమాటగ విధిగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏ భావనాలోకంలో విహరిస్తున్నావో

ఏ కల్పనా మైకంలో  విరహిస్తున్నావో

ప్రత్యూష సమయాన కొలనులో కమలంగా

అనూష తరుణాన పుష్యరాగ వర్ణంగా

అలజడిని రేపలేనే   నీ మానస సరోవరానా

ఒత్తిడిని పెంచలేనే నీ ప్రశాంత జీవనానా


1.ఒత్తిగిలి బజ్జున్న పసిపాప చందంగా

మత్తుగా మధువును గ్రోలే మధుపంగా

కొబ్బరాకు మాటున జాబిలి కిరణంగా

పూరెక్కల దాపున మౌక్తికాభరణంగా


2.ఏకాంత వనసీమల్లో ఏకాగ్ర తాపసిలా

ఊరి చివర గిరిశిఖరాన చిరుకోవెలలా

మలయ మారుతాన గుల్మొహర్ మాధురిలా

మంద్రస్వరాన వీనులవిందయే రసరాగఝరిలా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ ఎత్తులు పయ్యెత్తులు మత్తుగొలుపులే

మది చిత్తయ్యీ పోయేటి వలపు పిలుపులే

లలనా కాదనగలనా నీదాసుడనైనందు వలన

చల్లార్పే పనిచూడు మగడా తాళజాల ఈ జ్వలన


1.సొగసులు మూటగట్టి బిగువుగ దాచిపెట్టి

ఉంచాను సఖా ఇన్నేళ్ళుగ నీ కొఱకే అట్టిపెట్టి

ఏమరుపాటుగను ప్రియా చేజారని తీరుగను

కోర్కెలు ముడుపుగట్టి  పెట్టాను  ఆతృత బిగబట్టి


2.మదనుడె గురువుగా ప్రణయ పాఠాలునేర్చి

సంగమ సంగ్రామానికి కాలుదువ్వె నా మగటిమి

కొత్తలోకాలు గెలిపించి వింత మైకాల్లొ మురిపించి

తారాస్థాయిలో హాయిని కురిపించగ నీ ఈ పెనిమిటి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గోదావరి నేనై తడపనా ననులేత నీ పాదాలను

చిరు తరగను నేనై ముద్దాడనా మువ్వల పట్టీలను

గడ్డిపరకను నేనై నీ అడుగుల మడుగులొత్తనా

అరికాళ్ళకు మట్టంటకుండ అరిచేతులు నావుంచనా


1.మధురమైన జ్ఞాపకమై  గిలిగింతలు పెట్టనా

పరువపు పరవశమై పులకింతల ముంచనా

ఆనందపు చెమరింతనై అవధులు తొలగించనా

కలలోనూ కమ్మని కలవరింతనై నిను వేధించనా


2.వణికే చలిలోన కౌగిళ్ళనెగళ్ళనే రాజేయనా

నీ అంగ ప్రాంగణాన పెదాల రంగవల్లులేయనా

మనసును పొగల చక్కెర పొంగళిగా అందించనా

ఊష్ణం ఊష్ణేన ఊష్ణమని నేను ఋజువు పరచనా


OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నవ్వనిదేముంది నీ మోములో

నచ్చనిదేముంది నీ వదనసీమలో

ప్రతిరేయీ పున్నమే నీ సన్నిధిలో

అనుక్షణమూ స్వర్గమే నీ కౌగిలిలో


1.ఒద్దికగా నయగారమొలుకు నీ కురులు

పాపిట మెరిసేటి పావన సింధూరము

నుదుటన వెలిగేటి కుంకుమ తిలకము

మదనుని విల్లంటి ఎక్కిడిన కనుబొమలు


2.కోటేరులాటి మిసమిస వన్నెల నాసిక 

చామంతి కాంతినొలుకు చక్కని ముక్కుపుడక

కనులలో మనసుకు పంపే ప్రేమలేఖలు

కనుచూపులో రారమ్మని ఎదకు ఆహ్వానాలు


3.చెక్కిళ్ళలో విచ్చుకున్న సుమసౌరభాలు

పెదవులతో రగిలించే ప్రణయ సందేశాలు

చుబుకమునే ముద్దుచేయ అనుమతి పత్రాలు

నగవుల సెగల జల్లులో తడవగ ఆత్రాలు

Thursday, December 3, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తొంగిచూడు రైతు మనసులోకి

చెవియొగ్గు రైతుగుండె స్పందనకి

ఏసాయం కోరని వ్యవసాయం మానని

కృషీవలుని నిరసించుట న్యాయమా

కూడుబెట్టువాని పొట్టగొట్ట ధర్మమా


1 అమ్మ ఆకలి లేని దెవ్వరికిలలోన

రైతు వల్లనేకదా ఆహార ధాన్య ఉత్పాదన

కర్షకుని ఉనికికే ప్రభుత చేటు తేవాలా

జనమెక్కిన కొమ్మనే జనం నరుక్కోవాలా


2.కరువులు వరదలు ప్రకృతి భీభత్సాలు

విత్తనాల ఎరువుల వ్యాపారుల కుత్సితాలు

పురుగు మందు కల్తీలతొ కృంగే  వాస్తవాలు

కృషాణ కర్ణుడి పతనానికి కారణాలు వేలు


3.దిగుబడి రాబడి అంతంత మాత్రమాయె

గిట్టుబాటు ధర ఎన్నడు చట్టబాటపట్టదాయే

మద్దతు ధరసైతం హాలికునికి అయోమయమాయే

సంపన్నుల మయసభలో సైరికునికి అవమానమాయే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


దారులన్నీ మూసుకపోయిన వేళ

చేష్టలుడిగి నిస్సత్తువగా నిలిచినవేళ

ఉదాసీనంగా మౌనంగా

నిర్లిప్తంగా దీనంగా

బ్రతుకే బరువై భవితే కరువై

మనసే మరుగై కన్నీరు చెఱువై


1. తలవంచక తప్పదు విధి ముందు

ఎంచకతప్పదు శాపంగా మదియందు

పగవాడికైనా రాకూడని దుస్థితి

ఏ జన్మకైనా పట్టరాని దుర్గతి

చూస్తూ ఉండలేము నిస్సహాయంగా

జీవితమే మారింది అయోమయంగా


2.చావనేదెంతటిదీ బ్రతుకు నరకమైతే

కాడనేది నందనమే ఇల్లువల్లకాడైతే

సమాంతర పైనము బాధలు కలతలతో

అంతెరుగని వైనము కడగండ్లు వెతలతో

నూరేళ్ళలో ఏనాడో ఉషోదయం

నా కళ్ళు ఎపుడౌనో వెన్నెలమయం

Monday, November 30, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వేలాల మల్లన్న వేములాడ రాజన్నా

దయగల్ల ధరంపురీ శ్రీరామలింగన్నా

ఎట్లనిన్ను పిలిచినా అట్లనే ఓయంటవ్

నోరుతెరిచి ఏదడిగిన సంబరంగ సయ్యంటవ్

భోళా శంకరునివి కాలకూట ధరునివి

గౌరమ్మ వరునివి ఘోరపాప హరునివి


1.మిద్దెలొద్దు మేడలొద్దు పదవులు అధికారమొద్దు

మణులు మాణిక్యాలు వరహాల మూటలొద్దు

చేసుకున్నవారికి నోచుకున్నంత మహదేవ

ప్రాప్తమున్న కాడికే దయచేయర సదాశివ

భోళా శంకరునివి కాలకూట ధరునివి

గౌరమ్మ వరునివి ఘోరపాప హరునివి


2.పస్తులుంచకుంటె చాలు పరమాన్నంబెట్టినట్టే

కంటికి కునుకుంటెచాలు కైలాసం ముట్టినట్టే

పిల్లా పాపలను సల్లంగా సూడు స్వామీ

కన్నతండ్రివి నీవె కదా మముకడతేర్చవేమి

భోళా శంకరునివి కాలకూట ధరునివి

గౌరమ్మ వరునివి ఘోరపాప హరునివి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


క్యాచీగా ఉండె ట్యూనేదో

మాచీగా ఉండె ఫీలేదో

నీతో  నన్నే కనెక్ట చేసేనే

నన్నే నీలోకి ఇంజెక్ట్ చేసెనే


1.లైఫంటే రియల్ ఫ్రండ్షిప్పే

ఎంతమంది ఎక్కితే అంతగొప్పే

లవ్వంటే రిలేషన్ షిప్పే

క్లారిటీ మిస్సైతె కడు ముప్పే


2.ఎంజాయ్ చెయ్యాలి ఎవ్రీ మినిట్

నోఛాన్స్ ఫర్ ఇఫ్ ఐండ్ బట్

ఓపెన్గ పలికించు నీ ఎద ట్రంపెట్

వేస్ట్ చేయబోకేది దొరికినా ఫుక్కట్

Sunday, November 29, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొమ్ముకాస్తూ కొంత మీడియా

అమ్ముడవుతూ వింత మీడియా

విలువలు విప్పేకుసుకుంది మీడియా

నిగ్గు తేలని వార్త వాగితె అది వాడియా


1.చదువరులే కరువైన తరుణంలో

పేపర్ లెస్సైన ఎన్విరాన్ మెంట్ లో

ఖర్చేమో తక్కువైన అంతర్జాలంలో

కన్ఫ్యూజన్ పెంచుతోంది నెటిజన్లలో


2.పార్టీల జాగ్గీర్లు టీవీ ఛానళ్ళలో

ఆత్మస్తుతి పరనింద నిత్యం ఆనోళ్ళలో

చదివేస్తే ఉన్నమతీ పోయిన చందంగా

సంచలనవార్తలే సమ్మోహనాస్త్రంగా


3.దొరికిన ఏ వేదిక వదలని లీడర్ లా

ఫేక్ లీకు విషయాలకు తామే ప్లీడర్ లా

ఫేస్బుక్ వాట్సప్ గ్రూపుల్లో వైరలయేలా

సమాంతరంగ సాగుతోంది సోషల్మీడియా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తెలతెలవారిన వెలుగులలో

తెరిచీ తెరవని కన్నులలో

కదిలిన రూపం నీదే మిత్రమా

స్నేహానికి ప్రతిరూపం నీవే నేస్తమా

శుభోదయం మనసుకు శుభోదయం

శుభోదయం మనకిదె శుభోదయం


1.ఆకాశానికి వేసేద్దాం ఆశల నిచ్చెన

నిన్నకు రేపుకు నిర్మిద్దాం ఊహల వంతెన

దేహం వేరగు ప్రాణం ఒకటగు మిథునంగా

పరస్పరం ఆలంబనతో జీవిద్దాం హాయిగా

శుభోదయం మనసుకు శుభోదయం

శుభోదయం మనకిదె శుభోదయం


2.బీడుకు తోడై కలపండించే చినుకవుదాం

నైరాశ్యపు ఎడారినే నందనవని చేద్దాం

విచ్చని పెదవుల చిరుచిరు నగవుల పొద్దవుదాం

ఆకలి ప్రేగుల ఆర్తిని బాపగ అన్నపు ముద్దవుదాం

శుభోదయం మనసుకు శుభోదయం

శుభోదయం మనకిదె శుభోదయం