Monday, November 28, 2022

 https://youtu.be/yzNyKKr7wNo?si=JCrC9Vpr6fpIopT9

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఆనంద భైరవి


మంగళ హారతిదే మాధవా

కర్పూర హారతిదే రమాధవా

జయ మంగళ హారతిదే సత్యదేవా

శుభ మంగళ హారతిగొని

శుభములు మాకీవా


1.నియమముతో ఏటేటా చేసెదము సత్య వ్రతము

నీ దయతో దూరమగును గతములోని మా దురితము

ఐదు కథలు గలిగిన నీ మహిమ మహితము

ఇహపర సాధకము స్వావి నీ దివ్యచరితము


2.ధనధాన్యాదులు కురిపించు మా ఇంట సిరులు

ఇడుములు దుఃఖములు కడతేర్చు మా బాధలు

అసత్యమే పలుకము ఆదుకొనగ స్వామీ నీవే గద

శ్రీ సత్యనారాయణ త్రికరణశుద్ధిగా నిన్నే నమ్మెద


https://youtu.be/-rwRzTE5pL4?si=1mykx0pIFEUn5VWx

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అద్దంలో ప్రతిబింబం అది నీ హృదయం

ఎదురుగా నా చెలీ నిలువెత్తు నీ సౌందర్యం

నిన్ను నీకు చూపించే నేనే నీ నిజనేస్తం

బహుజన్మల పుణ్యఫలం నాకు నీ సంప్రాప్తం


1.జీవితాన నువులేక జీవితమే కడుచేదు

నీ తోడు లేక  స్వర్గమైనా సఖీ అది ఖైదు

నీ మాట నటనయని ఊహకైనా రాదు

నీ కొరకై భరియిస్తా తెగువతొ అపవాదు


2.నీ సహచర్యముంటె నాకెంతో ధైర్యం

నీ సాంత్వన మాన్పేను నా ఎదగాయం

నీ పెదవుల మధువనిలో నిత్య వసంతం

నీ పలుకే  హాయి గొలుపు మంజుల గీతం


https://youtu.be/5JfFV8v2ZeA?si=z8uWfcN8WT7PIy5R

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నోచాను నీకై ప్రణయసార వ్రతము

వేచాను విరహాన ఈ సాయంత్రము

కొలను కలువల ఎడబాటు తీరెను

గగనమున జాబిలి ఆగమనమున

అభిసారికనైతి ప్రియా నీరాకను కనరాకను

కామనము తీరక వగచితి నా మనమున


1.ప్రశాంతమైన పూవన ప్రాంతమున

ఏకాంతమే దొరికిన ఈ సమయమున

నిను వలచిన కాంతనై చింతాక్రాంతమున

వలపులు చిలుకు వన్నెల ప్రాయమున

అభిసారికనైతి ప్రియా నీరాకను కనరాకను

కామనము తీరక వగచితి నా మనమున


2.మల్లెల మాలనే వాలుజడలో తురిమి

తెల్లని చీరతో పెంపొందించగ కూరిమి

రమించగ శ్రమించగ నశించు నీ ఓరిమి

లాలించగ పాలించగ చేసుకో నను మాలిమి

అభిసారికనైతి ప్రియా నీరాకను కనరాకను

కామనము తీరక వగచితి నా మనమున

 https://youtu.be/vOEfVUTJ-VE?si=kAJpV6Ws6WQXVscf

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


సతీదేవి గతించగా చలించెగా నీమతి

పరితపించి అయితివిగా నీవొక యతి

మరలా జనియించి వరించినది మా పార్వతి

అర్ధదేహమిచ్చావని తృప్తినొందెనీ శ్రీమతి

హరా హరహరా భవహరా శివశంకరా

పరా పరాత్పరా ప్రణతులివే పరమేశ్వరా


1.గంగని సిగనిడితివి గంగాధరా

సోముని తలదాల్చివి సోమేశ్వరా

మూడుకన్నులున్న త్రయంబకేశ్వరా

నాగులే నగలు నీకు నమో నాగేశ్వరా

హరా హరహరా భవహరా శివశంకరా

పరా పరాత్పరా ప్రణతులివే పరమేశ్వరా


2.గరళము గళమునగల నీలకంఠేశ్వరా

ఉరమున విశ్వమున్న విశ్వేశ్వరా

కరమున శూలముగల రుద్రేశ్వరరా

ఢమరును మ్రోయించెడి నటేశ్వరా

హరా హరహరా భవహరా శివశంకరా

పరా పరాత్పరా ప్రణతులివే పరమేశ్వరా


3.భస్మాంగరాగా భవా రామలింగేశ్వరా

చర్మాంబరధరా  శివా రాజరాజేశ్వరా

మర్మతత్వ బోధకా శంభో మహేశ్వరా

ధర్మస్థల దీపకా శ్రీ మంజునాథేశ్వరా

హరా హరహరా భవహరా శివశంకరా

పరా పరాత్పరా ప్రణతులివే పరమేశ్వరా

 

https://youtu.be/sdb87UgrFYM?si=lUfP583eVRuUFtX6

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిండు పున్నమి నిశిలో 

వెండి వెన్నెల శశినీవే

కవన గగన తారా రాశిలో

వెలుగులీను ధృవతారవే

రెప్పలమాటున నను దాచేయగా

స్వప్నలోకాల విహరింపజేతువే హాయిగా


1.అవశ్యమై ఎదనావరించు పారవశ్యము

నీ కవితనుంది మదినేదోచేసే రహస్యము

ఆసాంతం ఆస్వాదింపజేయు బిగువే నీ సొంతం

అభిమానిగ మార్చేసే పాటవమే నీ సహజాతం


2.కవిత్వ మాధుర్యం నీకు కరతలామలకం

నీ మేని సౌందర్యం అప్సరసలకే తలమానికం

రెంటిగొప్ప తేల్చుటలో నా గుండెయె లోలకం

నచ్చుతుంది నాకెపుడూ నగవుల నీ వాలకం

 https://youtu.be/C12ZhlMd9_0?si=8l8n3svtM32hQJcX


1)గోదాదేవి తొలిపాశురగీతం-స్వేచ్ఛానువాదం

30రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధన


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:దర్బార్ కానడ


గొల్లభామలారా-రేపల్లె లేమలారా

మార్గశిర మాసమెంతొ మేలైనది

మన నందబాలునర్చించే వేళైనది

మార్గళి స్నానముకై  చనుచుంటినే నది

చెలులార ఆలకించరో మేలుకొనగ గోదా పిలుపిది


1.ఘనశ్యామ సుందరుడు నంద కిశోరుడు

డెందాలను మురిపించే బృందావిహారుడు

రవి తీక్షణుడు శశి వీక్షణుడు సర్వసులక్షణుడు

అన్యధా శరణం నాస్తి మనకు శ్రీమన్నారాయణుడు

అనవరతము తపించ శ్రీ వ్రతఫలమీయును కృష్ణుడు


2.వలువలు దాచేసే నవనీతచోరుడు

వదులుకొనే తెగువుంటే మదినే దోచువాడు

ఆనందవర్దనుడు అహంకార మర్దనుడు

జగన్మోహనాకారుడు జగదుద్ధారుడు జనార్ధనుడు

అనవరతము తపించ శ్రీ వ్రతఫలమీయును కృష్ణుడు

 

https://youtu.be/C12ZhlMd9_0?si=8l8n3svtM32hQJcX

(2)గోదాదేవి రెండవ పాశురగీతం-స్వేచ్ఛానువాదం

30రోజుల వ్రతం-ముప్పై రాగాలతో గీతా ఆరాధన


దయచేసి ఇవే రాగాలలో పాడాలని విన్నపము

ఇవి ఆ మురళీ మోహనుడు పలికించిన రాగాలు


రచన:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:నీలాంబరి

(రాగ ఆధారం జంటిల్ మెన్ సినిమా పాట- నా ఇంటి ముందున్న పూదోటనడిగేనూ)


ధనుర్మాస శుభవేళ తిరుప్పావై వ్రతదీక్ష

నీమాల నాచరించ నిక్కము ఒక పరీక్ష

పురుషోత్తమ మాధవా పుండరీకాక్ష

శరణంటిమి పరిసమాప్తి చేయగ మాకీవె రక్ష


1. చేసెదము మబ్బుననే కావేటి స్నానము

సతతమూ  రంగనాథ మదిలో నీ ధ్యానము

పలికెదము గోవిందా మా నోట నీ నామము

ఆచరించెదము ఆర్తిమీర మార్గళి సిరినోము


2.కంటికి నిను అంటించి-కృష్ణా కాటుక మానేము

కమలాక్షుడ తలనిడి నిను- పూలకొప్పు ముడువము

నెయ్యిని పాలను నీనెయ్యముకై మేమారగించము

ప్రియమగు సత్యమగు నుడుగులనే నుడివెదము


3.పాలకడలి శయనించే పద్మనాభ మంగళము

విబుధవరేణ్యుల కొసగెదము విరళ దానము

సాధు సంతులకు బ్రహ్మచారులకు నిత్య సమారాధనము

క్రమతను మము నడుపగ స్వామీ నీకు వందనము


https://youtu.be/wC7IG3Rn09U

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సారమతి


నిరంతరం నీగానము

అంతరాన నీధ్యానము

నీ ఎరుకయె నిజ జ్ఞానము

స్వామీ నా ఎడ ఇక వీడు మౌనము

జగన్నాథ జగదీశా జనార్ధనా శ్రీరమణా

తప్పనీకు స్వామీ నను నీ మననము


1.నీకే అంకితము ఈ ప్రాణము

ఉద్ధరించనీ ననునీ కథాశ్రవణము

మది నీవు మెదిలితివా జన్మ ధన్యము

నను గాచు దైవమేది నువువినా అనన్యము


2.నీ మీది భక్తే నాకు ప్రాధాన్యము

భవ జలధిని దాటించగ నీదే ప్రావీణ్యము

నీ మహిమలు నీలీలలు ఎంతో ప్రాచుర్యము

ఇహమున పరమున నీ అండయె నా ధైర్యము

Thursday, November 24, 2022

 

https://youtu.be/Y2EXns2s1wE?si=wI8ZtABP4ilepCZJ


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:భాగీశ్వరి


నీ అభయహస్తము  దీనుల ప్రియ నేస్తము

శ్రీ వేంకటేశ నీ మహిమలు కడు ప్రాశస్త్యము

తరించె నిను సేవించి లోకాస్సమస్తము

గోవింద నీనామ సంకీర్తన కలిగించు పారవశ్యము

గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా


1.నీ దివ్య దర్శనము మహదానందము

నీ పాద తీర్థసేవనము అకాల మృత్యుహరణము

నీ శఠగోప శిరోధారణము అహంకార దమనము

నీ లడ్డూ ప్రసాద స్వీకారము ఆరోగ్యదాయనము

గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా


2.పుష్కరిణీ పుణ్య స్నానము ఘోరపాపనాశనము

తిరుమలలో గడుపు ప్రతిక్షణము మోక్ష కారకము

నీ  సన్నిధి శయనము స్వప్నసాక్షాత్కార అనుభవం

ఆపదమొక్కులవాడవంది నీ సార్థకనామధేయము

గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవిందా

https://youtu.be/h4JAwFbjdlQ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఊహ ఎంత మధురము

స్వప్నమే సంతోషకరము

అంతులేని స్వేచ్ఛాకాశానా

ఆనందంగా విహరించవశము

కల్పనా ప్రేయసితోను 

పదే పదే విరహించతరము

కలహించతరము కౌగిలించుకొనువరము


1.కీలు గుర్రమెక్కి ప్రియురాలితో

సప్త సాగరాలు లిప్త పాటులో దాటవచ్చు

చెలి మేను మాణిక్యవీణను

మంజుల నిక్వణ మొలుకగ మీటవచ్చు

ఆకలి దప్పుల ప్రసక్తే లేక 

ఏ ఇతరాసక్తీ లేక మనోహరితొ సల్లాప మాడవచ్చు


2.చేజారిన ప్రియసఖినీ చేరదీయవచ్చు

కోహినూరు వజ్రాన్నీ కానుక ఈయవచ్చు

భవ్యంగా రమ్యంగా నవ్యంగా జీవించవచ్చు

సవ్యంగా దివ్యంగా హృద్యంగా భావించవచ్చు

కాలమున్నంత కాలం  కాపురం చేయవచ్చు

కలలే చెదరనంత సమయం కలిసిఉండవచ్చు

Wednesday, November 23, 2022

 

https://youtu.be/jvXFQj1ShnE

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్భార్ కానడ 


ఎక్కడి నుండి వచ్చావో

ఎందుకు షిరిడీ చేరావో

పన్నాగాలే పన్నావో

కుయుక్తులే యోగించావో

సాయీ బాబా అంటూ పిలుచుకున్నాము

సాయం చేస్తావంటూ నమ్ముకున్నాము

జైజై సాయిబాబా జయహో సాయిబాబా


1.గుండెలో గుడి కట్టాము

బ్రతుకే హారతి పట్టాము

ఆప్తునిగా జమ కట్టాము

గురువుగ నిను చేపట్టాము

వంచించిన దాఖలా ఒక్కటి లేదు

ఒక్కరినీ ముంచావన్న మాటేలేదు

అవధూత నీవే సాయి సద్గురునాథా సాయీ


2.తెలిపిన యోగం మరిచాము

అభియోగాలే మోపాము

మానవతకు నిజరూపం నీవు

విశ్వప్రేమకు నిదర్శనం నీవు

నిను నమ్మితే నిందలెన్నొ వేస్తున్నాము

నువ్వో దోషిగా ప్రచారం చేస్తున్నాము

క్షమియించవయ్యా సాయి దయయుంచు బాబా మాపై

 https://youtu.be/SWFPhm5P124

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


ఎన్నెన్ని భావాలో ఎన్ని అనుభవాలో…

కలములో గళములో ఎన్ని హ్లాద సంభవాలో

ఎంత మార్చుకోవాలో ఎలా చేర్చుకోవాలో

మూణ్ణాళ్ళ ముచ్చట బ్రతుకైనా ఎన్నికూర్చుకోవాలో


1.నిబిడీకృతమై మనలో ఎన్ని పాటవాలో

వెల్లడైన వేళలలో ప్రభవించు నెన్ని ప్రాభవాలో

సాధించుటకై అకుంఠిత సాధన ఎంత కావాలో

లక్ష్యాన్ని చేరుటకొరకై ఎంతగా పరితపించి పోవాలో


2.పరికించి చూస్తే ప్రకృతిలో ఎన్నెన్ని రావాలో

అనుభూతులు కలగలిసి ఎలా ఎదనుండి రావాలో

తన్మయమే చెంది ఆలపించు గానం పికముకే సవాలో

నిరూపించు మిత్రమా నీ గాత్రం నా ఆత్రం ఊహలో వాస్తవాలో

https://youtu.be/o3XufqHFJy8?si=QHlWjWKnhMdwzPda


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తొలి సంధ్యవు నీవై

పొడసూపావు నా డెందమందు

అందాల రాశివి నీవై

నేడు చేసావు నాకు కనువిందు

నా హృదయరాణీ రస గీతపు బాణీ

అలివేణీ విరిబోణీ మధు మంజులవాణీ


1.నా సౌందర్య దేవతా నీ ఆరాధకులెందరో

నిను నిత్యం సేవించే నిజమైన దాసుడనేను

నను కరుణించకుంటె నరకమే నాదవును

నను కానక కాదంటే చెలీ బ్రతుకే చేదవును


నా హృదయరాణీ రస గీతపు బాణీ

అలివేణీ విరిబోణీ మధు మంజులవాణీ


2.నీపదముల మంజీరమై మనినను చాలు

నీ ఎదపై మాంగల్యమవగ నను మనువాడితే జేజేలు

నిన్నంటుకొనుటుకై నన్నవనీ నీ చెవి జూకాలు

ఏదీ కూడదంటె నా తనువిపుడే చితిలో కాలు


నా హృదయరాణీ రస గీతపు బాణీ

అలివేణీ విరిబోణీ మధు మంజులవాణీ

 

https://youtu.be/9ZVKTsnhjnA?si=iEubfb3GdPNDQpTT

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చక్రవాకం


మంగళాకారా మంగళ మూరితీ

సర్వమంగళకరా మా కొండగట్టు మారుతీ

ప్రసన్నాంజనేయా నీకు ప్రణతి ప్రణతి ప్రణతి

శ్రీరామదాస ప్రముఖా నీవే నాకిక శరణాగతి


1.సర్వమంగళ మహిజ సీతమ్మకు 

ముదము కూర్చిన హితుడవు ప్రియ సుతుడవు

మంగళాంగుడు మహితుడా రామయ్యకు

జయము కూర్చిన హనుమవు ఆత్మసముడవు

భజియించేను నిజ మనము తోను భజరంగభళీ

భుజియించు స్వామీ అర్పించినాను చక్కెర కేళీ


2.మంగళ వారము ప్రాశస్త్యము నీకు

అంగరంగ వైభవాలే ఇలలో నీ ప్రతి కోవెలకు

అభిషేకం ఆకుపూజ జిల్లేడుమాలలు నీకు

ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందమీయి ఆంజనేయ మాకు

జితేంద్రియా చిరంజీవ అందుకో వందనాలు

నీ కరుణా కటాక్షాలు ఇహపర వరదానాలు


https://youtu.be/0Z_3tGSkdbQ


రాగం:ఆనంద భైరవి


మంత్రముగ్ధవే మహా దేవీ

మనోజ్ఞవే రసజ్ఞవే ఆనంద భైరవీ

సౌందర్య లహరివే మనోహరీ భార్గవీ

సత్య శివ సుందరివే  మాతా శాంభవీ

సరగున దయగనవే సహృదయవు గదనే


1.నినుచూసిన నిమిషాన అనిమేషుడనై

 నిను తలచిన నిశీధిన నిద్రా దూరుడనై

నిరంతరం అంతరాన నీధ్యాన మగ్నుడనై

నీ సన్నధినే కోరుకునే విరహాగ్ని దగ్ధుడనై

సరగున దయగనవే సహృదయవు గదనే


2.సకల కళా స్వరూపిణిగా కళాకారిణిగా

తనువులో సగమైన హరుని తరుణిగా

కలి కల్మష నాశినిగా దురిత నివారిణిగా

శ్రీవాణిగా మణిద్వీప మహరాణిగా శర్వాణిగా

సరగున దయగనవే సహృదయవు గదనే

 https://youtu.be/8E8tVEtb9jo


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సిందు భైరవి


ముడివడె ఏడను అంకెతో

నడమంత్రపు  ఈ నరుని బ్రతుకు

ఏడేడు పదునాల్గు లోకాల నేలేటి

వేంకట పతి వందనాలు నీ పదములకు


1.సప్త చక్రాలతో సమన్వితమాయె దేహము

సప్త ధాతువులతో నిర్మితమైనదీ కాయము

సప్త దుర్వ్యసనాలకు ఇది ఆలవాలము

సప్త ఋషుల దీవెనతో అందనీ నీ పదయుగళము


2.సప్తపదే ఆదిగా సాగుతుంది దాంపత్య ప్రగతి

సప్తవర్ణ సమ్మోహితమై చెలఁగేను చంచల మతి

సప్తస్వర సహితమై ఆలపించెదనూ నీ సత్కృతి

సప్త గిరీశా నిర్వృతికై నమ్మిచేసితి స్వామీ వినతి

https://youtu.be/aZz1sBXkvTw?si=70Ps2u0lEk_MW4i5

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ద్విజావంతి


ఆలిని చేపట్టుడే-అర్ద దేహమిచ్చుడే

ఏమీ పట్టనట్టు-మూతికి బట్ట కట్టుడే

హరుడవు నీకు నరుడను నాకు

ఎలా చూసినా మనదొకటే బ్రతుకు

భోలాశంకరా మనకిది చచ్చే చావు కదరా

కడుపు చించుకుంటే పడేది కాళ్ళమీదేరా


1.అన్నీఉన్నా ఏమీ లేనోళ్ళం

ఏది లేనే లేదనీ చెప్పలేనోళ్ళం

మాటిమాటికీ వెయ్యాలి నోటికి తాళం

మాట మాటకీ ఔనంటు తలనూపే గంగిరెద్దులం

భోలాశంకరా మనకిది చచ్చే చావు కదరా

కడుపు చించుకుంటే పడేది కాళ్ళమీదేరా


2.బిచ్చమెత్తైనా గ్రాసం కూర్చాలి

నెత్తినెత్తి బిందెళ్తో నీళ్ళు తేవాలి

తోలును మొలకు చుట్టుకొని పట్టుచీర లివ్వాలి

నాగుల మెడలొ వేసుకొనైనా నగల్నీ కొని ఇవ్వాలి

భోలాశంకరా మనకిది చచ్చే చావు కదరా

కడుపు చించుకుంటే పడేది కాళ్ళమీదేరా



https://youtu.be/In2UBH0rq9o?si=IOupzQOLLjk-HJeF


రాగం:పట్ దీప్


నెలపొడుగునా వెలిగేను నా చెలి

నెలపొడుపై కళలుడిగేను జాబిలి

ఉషోదయ తుషారం నా చెలి సోయగం

వసంత సమీరం నా చెలి అనురాగం


1.పెదవంచులోనా మెరిసేను కెంపులు

పదిలంగా నవ్వినా సొట్టలౌ చెంపలు

చూపులో చూపు కలిపామా వాలనే వాలవు రెప్పలు

ఆపసోపాలు పడినా చెప్పవశమా తన ఒప్పు గొప్పలు


2.ఒక జన్మ చాలదు చెలి మోము వర్ణనకు

పాదాక్రాంత మవ్వొచ్చు తన మోవి చుంబనకు

ముట్టుకుంటె మాసిపోయే ధవళ చర్మ సౌందర్యం

పలుకువింటే పరవశమొందే దివ్య గాత్ర మాధుర్యం

 

https://youtu.be/zPZv2se6Fmc?si=Xz3x5aI9D3kDuoqs

రచన .స్వరకల్పన&గానం:డా.రాఖీ


అజాగళ స్తనాలైనాయి  దైవమిచ్చిన పాటవాలు

దున్నపోతు మీద వాన చినుకులై హితవచనాలు

సార్థకత చేకూరాలి మహోన్నత మానవ జన్మకు

ప్రతిక్షణం వినియోగపరచాలి ఆనంద మందేందుకు


1.ఎవరూ  తోడురారు ఇది  మహాప్రస్థానం

ఏది వెంటరాదు ఐనా ఆగదు ఈ గమనం

వదిలేయటమే అలవాటై సాగిపోవాలి మనం

చరిత్రలో నిలిచిపోవడం ఉత్కృష్ట కామనం


2.ఎంతగా కోరుకుంటే అంతదూరం కోరిక

మనదంటూ లేకుంటే బ్రతుకుంతా హాయిక

నీతో నీవు గడపడానికి చేసుకో క్షణం తీరిక

తెలిసి అడుసు తొక్కడమే నరలోకం తీరిక

Friday, November 18, 2022

 

https://youtu.be/_xNBxT9BET0?si=GIuY_sKvN6318vKn

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మోహన


శ్రీ నివాసం నీ హృదయాన

నీ నివాసం మా హృదయాన

నీవుండేది తిరుపతి కొండనా

బండబారిన మా గుండెనా

తండ్రీ వేంకటేశ భక్తపోషా

కృపా విశేషా శ్రీశా సర్వేశా


1.నవ్వే… బ్రతుకు బండికి

నొగలే విరిచేస్తావు,చక్రపు శీలను తీసేస్తావు

ప్రశాంత సరోవరాన

అశాంతి రేపుతావు అలజడి సృష్టిస్తావు

అర్థం పర్థం ఉంటే గింటే నీకే తెలియాలి

చీకూ చింతా మాకంటించి నీవే మురియాలి


2.మా మానాన మమ్మెపుడూ

మననీయ వేలనో పడద్రోసెద వేవేళనో

విషాదాలనే కుమ్మరించి

వినోదింతువేలనో విపరీతమతి యేలనో

ఇస్తే గిస్తే చచ్చేదాకా హాయిగా ఉండే వరమివ్వు

ఇహము పరము నీ చేరువకే మము చేరనివ్వు

 https://youtu.be/h8C6gOlxdwM

రచన,స్వరకల్పన&గానం:డా. రాఖీ


సోకేను చందన గంధం నీవున్న తావులో

తాకేను దవన సుగంధం నీమేను రేవులో

చెలీ సఖీ ప్రియా పారిజాత పరిమళమే నీ నగవులో

మనోహరీ  ప్రేయసీ గులాబీ గుభాళింపే నీ కురులలో

మత్తేదొ కలిగించి గమ్మతు చేస్తుంది

మనసు వశ పరచుకొని ననుచిత్తు చేస్తుంది


1.చీకటిలో దాక్కున్నా పట్టిస్తుంది

 నీ ఒంటి నంటుకున్న ఘుమఘుమ వాసన

నీరాకను సైతం తెలుపుతుంది 

దవ్వున నువ్వున్నా మొగిలి తావి నీ తనువున

మత్తేదొ కలిగించి గమ్మతు చేస్తుంది

మనసు వశ పరచుకొని ననుచిత్తు చేస్తుంది


2.మోహాన్ని కలిగిస్తుంది

నీ దేహం వెదజల్లే  కస్తూరి సౌరభం

మైకంలో ముంచేస్తుంది

నీ మెడవంపు విరజిమ్మే జవ్వాజి పరివాసం

మత్తేదొ కలిగించి గమ్మతు చేస్తుంది

మనసు వశ పరచుకొని ననుచిత్తు చేస్తుంది

 

https://youtu.be/KBfUzqwpWUo

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రేపంటూ ఉంటుందో ఉండదో

మనమంటూ ఉంటామో ఉండమో

ఉన్నంత సేపే ఈ ఆపసోపాలు

చేజారిపోయిందా మేనే బుగ్గిపాలు

స్నేహించుదాం ప్రేమించుదాం

మమతనే పంచుదాం

స్పందించుదాం నందించుదాం

నవ్వుతూ జీవించుదాం


1.సేకరించుతూనే బ్రతుకంతా తేనెటీగలౌతున్నాం

అనుభవించు వేళసైతం ఆర్జనకే తగలేస్తున్నాం

వినోదించలేక ప్రతినిమిషం వ్యర్థంగా గడిపేస్తున్నాం

విలువైన కాలాన్నీ వృధాగా వెళ్ళ బుచ్చుతున్నాం

ఆటల్ని ఆడుదాం పాటల్ని పాడుదాం

సరదా సరదాగా ఉందాం


2.తిరిగి కోరితే సాధ్యం కాదు గతం గతః

భవిష్యత్తుకు రూపులేదు ఎండమావి తరహా

మంచి తరుణం రానేరాదు ఈ క్షణం మినహా

ఆహ్లాద భరితంగా జీవిద్దాం పదిమందితో సహా


తరియించుదాం మనం తరియింజేద్దాం

అంతరాలనే అంతరింపజేద్దాం

 

https://youtu.be/BjwlVDRePYI?si=EqjCFiFe2G3uLCzn

రచన,స్వరకల్పన&గానం:డారాఖీ


చేసిన బాసలు ఆడిన ఊసులు 

రేపిన ఆశలు అడియాసలాయే

ఉసూరని ఉత్సాహమే నీరసమాయే

ఉవ్విళ్ళూరే ఉబలాటమే కరిగి కన్నీరాయే


1.గోరంత ఔనంటే కొండంత సంబరమాయే

మనసే స్వేచ్ఛగ ఎగిరిన పావురమాయే

నీ వాలకం నాకెపుడూ ఓ మహామాయే

చెప్పిన మాట తప్పగ అంతలోనే ఏమాయే


2.చిన్న చిన్న ఆనందాలు నీ వల్లే నీవల్లే

చింతల చీకట్లకైతే నీ నవ్వులు వెన్నెల్లే

ఊపిరులున్నంతదాకా నాకూరట నీవేలే

తేలికగా నను తీసుకోకు నా ప్రాణం నీవేలే

Wednesday, November 16, 2022


https://youtu.be/cY1d2sBWw4I?si=P893giTP8L-dgBl8

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రెక్కలు పుట్టుకొస్తాయి నువు నను రమ్మంటే

గాలి బేలి పోతుంది నీముందు వాలుతుంటే

గుండె వేగం హెచ్చుతుంది నిన్ను చేరుతుంటే

మనసే మయూరమౌతుంది నిన్ను కంటుంటే


1.నా గురించి సమయమిస్తివా మది పరవశమే

హృదయాన చోటిస్తేనో తనువంతా పులకరమే

నీ స్పర్శ పలకరిస్తే రేతిరంతా పలవరమే

నాదానిగ నిను తలపోస్తే కల'యిక ఒక వరమే


2.గులాబీ వన్నె చీరనై నీమేనున తళుకులీననీ

నను నును బుగ్గల ముద్దాడే ముంగురులనై తారాడనీ

నీ పదముల మంజీర మంజుల నాదమునవనీ

పలుచని నీ పెదవుల చిరునగవునై నను మననీ


https://youtu.be/uEGFU_ta9s4

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


స్మరామ్యహం భజామ్యహం 

భావయామి తవనామం నిరంతరం

నమామ్యహం వదామ్యహం

భారతీం తవపాద పంకజం మాతరం


1.కృపాజలనిధీం హృదయ సుధాంబుధీం

కవిగాయక వరదాయినీం కరుణాపయోనిధీం

మేధావినీం వేదస్వరూపిణీం పారాయిణీం

సదావీణావాదన ప్రియం వందే వాగ్రూపిణీం


2.బ్రహ్మ రసనాగ్రవాసినీం దేవీం  సుహాసినీం

మాలా పుస్తక ధారిణీం శ్రీ వాణీం సనాతనీం

అజ్ఞాన కృత దోష నివారిణీం జ్ఞానదాయినీం

సర్వార్థ సాధకే శారదే పరవిద్యా సంధాయినీం

Tuesday, November 15, 2022


https://youtu.be/R8y-Pje51yM

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


మౌనమా నీ సమాధానం 

గానమేగా మనకు ప్రాణం

నిన్ను గిల్లు తుంటుం దేంటే నా కవితల్లా

నన్నల్లు కుంటుం దేంటే నీ మమత నను లతలా

రాగమే యోగమై కడతేరనీ

భావమే సంభవమై దనివారనీ


1.అనురాగం పలికేదీ భవరోగం బాపేదీ

ఏరాగమైనా రసయోగమౌను

ఎద లయనే తెలిపేది సుధలనే చిలికేదీ

ఏ భావమైనా ఆత్మీయమౌను

రాగమే యోగమై కడతేరనీ

భావమే సంభవమై దనివారనీ


2.మరోజన్మకోసమై మూటగట్టు మరులన్నీ

ఉగ్గబట్టుకొంటాను నిన్నుపొందగా

సంగమించు తరుణంకై ముడుపుగట్టు సిరులన్నీ

మొక్కుదీర్చుకొంటాను  నీ పొందుగా

రాగమే యోగమై కడతేరనీ

భావమే సంభవమై దనివారనీ

https://youtu.be/IuHpUkmR_sA?si=whHcHDuP6TindipM

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంత చక్కనమ్మ ఈ చిట్టి గుమ్మ

ఏ పోలికకూ చిక్కనిదోయమ్మ

ఎంతగ ముద్దొస్తోందో ఈ జిలుగు చుక్క

పెట్టరో అమ్మలాల తన బుగ్గన దిష్టిచుక్క


1.తీరైన పొడవాటి పూలజడ

మెడలో మేలిమి ముత్యాల దండ

పట్టుపరికిణీకే సోకు ఈ పసిడికొండ

అద్దమే మెచ్చి అందానికి సాగిల పడ


2.పాపిటి బిళ్ళే చేస్తోంది గారళ్ళు

చారెడేసి కళ్ళు పున్నమి జాబిళ్ళు

ముక్కున ముక్కెరపై చూపెలా మళ్ళు

నవ్వీనవ్వని పెదవుల మురిపాలు తుళ్ళు

 https://youtu.be/uTCmMRQPS8g?si=-8jqwatfv7UCKqBv

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అందరికీ అభిమాన దేవతవు

ఎల్లరకూ నువు యోగమాతవు

నీవలన మాకు చెప్పలేని గౌరవం

మావద్ద నీవుంటే బ్రతుకంతా ధైర్యం

ధనలక్ష్మీ మాపై దయగనవే ఎప్పుడు

నినదించనీ మాయింట ఘల్ ఘల్లను నీ గజ్జెల చప్పుడు


1.కుబేరుడైనా సరే నీకు దాసుడు

నీవులేక మనగలడా మా శ్రీనివాసుడు

పద్మపత్రాయతాక్షి పద్మావతి అవతారిణి

కొల్హాపూరు లోన విలసిల్లే సంపద సామ్రాజ్ఞి


2.నీ కనుసన్నలలోనే కదలాడును ప్రపంచం

నిర్లక్ష్యం చేసామంటే కలనైనా నినుకాంచం

కాంచనము ద్రవ్యము మాగాణము నీవుగా భావిస్తాం

కుల మత ప్రాంతాలేవైనా నిను మాత్రం పూజిస్తాం


https://youtu.be/OauTzd2A8wY?si=llAalhBrkWGEn_p5

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:సిందు భైరవి

అతివృష్టి అనావృష్టి ఏదైనా నీ సృష్టి
శీతకన్నువేసిందా మాపై శివా నీ దృష్టి
దుందుడుకు వరుణుడిని చేయవేమి కట్టడి
క్రమబద్ధత నెలకొల్పి కరుణజూపు పదపడి

1.అమర్ నాథ్ కేదార్ నాథ్ క్రేత్రాలలో వరదల విలయం
దర్శించగ నేరమా హర హరా నీ పావన నిలయం
అతలాకుతలమాయే భక్తజనుల సముదాయం
ఇడుములు ఇక్కట్లా నిను నమ్మితే ఇదేమి న్యాయం

2.నింగికి చిల్లుబడిన చందాన కుండపోతగా ఉధృత వర్షం
దిక్కూ దెస తెలియకా పిల్లలూ వృద్ధుల వ్యధాభరిత దైన్యం
మరణాలతొ అనాథలై అమాయకుల బ్రతుకులు శూన్యం
గంగాధరా కురిపించు అభాగ్యులందు అపారమౌ హర్షం


Monday, November 14, 2022

 https://youtu.be/0DJMR8dLtng

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏ అర్థం తీసుకున్నా  కోమలమే నీ గాత్రం

ఎలా పరిగణించినా  ఆహ్లాదమె నీ హాసం

నడకల జలపాతానివి పలుకుల పారిజాతానివి

మొత్తంగా నువ్వే ఇంద్రజాలనివి

చిత్తాన్నేదో చేసే  వర్ణ చిత్రానివి


1.కేంద్రకాన సాంధ్రమైన సూర్య గోళానివి

 గ్రహగతుల గతిపట్టించే గుండెల కళ్ళానివి

మతికి స్థిమితం దూరంచేసే గందరగోళానివి

బ్రతుకు నతలాకుతలం చేసే వేళాకోళానివి

మొత్తంగా నువ్వే ఇంద్రజాలనివి

చిత్తాన్నేదో చేసే  వర్ణ చిత్రానివి


2.తళుకులీను తారలైనా నీ చంద్రకళా ప్రీతులు

కలలుకనే చకోరాలూ తనూ చంద్రికా తప్తులు

కార్తీక  కౌముది నీ కౌగిలికీ కారు యతులతీతులు

ఆ రతీ భారతీ నీతో తులతూగక ఎత్తారు చేతులు

మొత్తంగా నువ్వే ఇంద్రజాలనివి

చిత్తాన్నేదో చేసే  వర్ణ చిత్రానివి


https://youtu.be/mCa3FvJYdME?si=Bdx10u7g5PdPq9FQ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిష్టూరమాడడం నీకు పరిపాటైంది

నిర్ఘాంతపోవడం నాకు గ్రహపాటైంది

నిరంతరం బ్రతిమాలుట పొరపాటైంది

నియతి లేని బ్రతుకు నిప్పు చెర్లాటైంది నగుబాటైంది


1.నేను నీకు ఎంతో ప్రత్యేకం 

 కాలేను నేను గుంపులో గోవిందం

నాకైతె లోకానా నువ్వే ఏకైకం

నేనుమాత్రమే నీకనుకుంటే ఆనందం

నీ పంచప్రాణాలు నేనైపోవాలి

నే పంచభూతాలై నీలో కలవాలి


2.నిర్లిప్తత నేమాత్రం నే సైచను

తారస పడితేనే నేస్తమంటే నేనోపను

తళుక్కున మెరవాలి శ్వాస నడుమ నేను

చెలీ ఒదిగిపోవాలి నీ ఎద లయగానూ

భావుకతను పలుచన చేస్తే ఎలా వేగను

నీవంటూ బ్రతుకున లేక ఎలా బ్రతుకను

 

https://youtu.be/zHmS4ngwIhw

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మాయామాళవ గౌళ


తందానాలాడే సుందరయ్యా

చిందులేసే తిక్క శంకరయ్యా

అంగలార్చినా తొంగిచూడవు

ఒక్కసారీ… మాదిక్కైన గానవు

మారాజువంటూ నిను నమ్ముకుంటి

మరలైన సూడవె మాదేవ ముక్కంటి


1.సొమ్ములడిగానా సోకులడిగానా

పొలములు పుట్రలు చెలకడిగానా

కమ్మన్ని గొంతుని ఇమ్మనంటిని గాని

నీలకంఠ నీగళమంటిదిస్తివే సామి


మారాజువంటూ నిను నమ్ముకుంటి

మరలైన సూడవె మాదేవ ముక్కంటి


2.ముక్కైన మూసుకొనుంటవు

తైతక్కలైనా ఆడుతు ఉంటవు

చిక్కుల్లొ మేముండి మొక్కుకుంటే

చిక్కవు దొరకవు రుక్కుల్ని బాపవు


మారాజువంటూ నిను నమ్ముకుంటి

మరలైన సూడవె మాదేవ ముక్కంటి

Friday, November 11, 2022


https://youtu.be/5R1HbcFl7nI?si=qWfbs67GgGVHHAZF

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చంద్రకౌఁస్


దేహ పంజరాన నను బంధించినావు

మోహపు జలతారు తెరను దించినావు

ప్రలోభాల తాయిలాలు అందించినావు

ఇంతగనను వంచించి ఏమి సాధించినావు

తిరుమలేశ వేంకటేశ శరణు శరణు స్వామీ

చేరనీ నీ సన్నిధి నను అంతర్యామీ


1.వనిత వలపు వలగా చిక్కుల పడవేస్తివి

ధన సముపార్జనతో బ్రతుకును ముడివేస్తివి

కీర్తి కొరకు ఆర్తినొందు బేలగనూ మారిస్తివి

తగునా  నీకిది నమ్మిన  నను ఏమారిస్తివి

తిరుమలేశ వేంకటేశ శరణు శరణు స్వామీ

చేరనీ నీ సన్నిధి నను అంతర్యామీ


2.నామరూప రహితునిగా నీ సన్నిహితునిగా

జనన మరణ జీవన వలయాతీతునిగా

పరమాత్మా నీలో లయమయే ఆత్మగతునిగా

పరమానందమొంద త్రోసితివే నను పతితునిగా

తిరుమలేశ వేంకటేశ శరణు శరణు స్వామీ

చేరనీ నీ సన్నిధి నను అంతర్యామీ

Thursday, November 10, 2022


https://youtu.be/C09qmF7Db5E

శుభాకాంక్షలందుకో మిత్రమా

శుభకామనలు నీకివే నేస్తమా

నేడు నీ పుట్టిన రోజైన సందర్భానా

ఈ నాటినీ జన్మదిన శుభసమయానా


విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

మై డియర్ హాప్పీ బర్త్ డే టూయూ 


1.అంచెలంచెలుగా ఎదిగావు

 ఎదిగినా వినయంతో ఒదిగావు

తలిదండ్రులకు ప్రేమను పంచావు

వంశానికే గౌరవ మందించావు


విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

మై డియర్ హాప్పీ బర్త్ డే టూయూ 


2.స్నేహితులంతా ప్రియతములే

బంధుజనులూ నీ అభిమానులే

మూర్తీభవించిన మూర్తిమత్వానివి

సమాజాన కీర్తిగొన్న విఖ్యాతునివి


విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

మై డియర్ హాప్పీ బర్త్ డే టూయూ

https://youtu.be/A2cUT_JH-e0?si=fHW7AAoz265LMLDW


 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:కళ్యాణి 


ఇదే ఇదే శత చండీ మహా యాగం

చేసినా చూసినా జన్మకు ఒక యోగం

లోక కళ్యాణార్థమై దురిత నివారణార్థమై

పుణ్య సంప్రాప్తమై

జరుపబడుతోంది మహా రుద్ర సహితమై


ఘనమైన చరితగల అఖిల బ్రాహ్మణ సంఘం

చేయగ పూనుకొంది రామచంద్రా పురమండల విభాగం

శ్రీ సీతారామచంద్ర మందిరమే యాగ కార్యస్థలం


1.చతుర్వేద పారాయణ ప్రముఖులు ఘనపాఠీలు

యాజ్ఞికులు ఋత్వికులు ద్విజులుసోమయాజులు

ధర్మ పరిరక్షులు యజ్ఞ దీక్షా దక్షులు ముముక్షులు

 శ్రీ మాధవానంద సరస్వతీ యతివరులే అధ్వర్యులు


2.విఘ్నేశ్వర నవగ్రహాది సకలదేవ హవనాలు

బీజాక్షర మంత్రాన్విత త్రేతాగ్ని ఆహూతులు

మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు అర్చనలు

చండీ సప్తశతీయుత సకలోపచార ఆరాధనలు


3.మహదాశీస్సులు తీర్థ ప్రసాదాల వితరణలు

భక్తజనాళికంతటికీ నిత్యాన్నదాన సంతర్పణలు

తృతీయ దివసాన మహా పూర్ణాహుతి సమర్పణలు

జన రంజకమైన సాంస్కృతిక కళా ప్రదర్శనలు



https://youtu.be/2XzmmgBERAM

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా ఈర్ష్యకు ఆనవాలు-నీలవేణీ నీ శిరోజాలు

ఉక్రోషపు సాక్ష్యాలు-ఊరించే ముంగురులు

తలమీద తగలడకా-ఏల తానా తందనాలు

చెక్కిళ్ళను నిమురుతూ పూస్తాయి చందనాలు


1.గులాబీ అలరించగ తపిస్తుంది ప్రతిఉదయం

మల్లెమాలకు మాపటేల జళ్ళోదూరుటే ప్రియం

చూడామణికీ పాపిటి బిళ్ళకూ ఎంత అతిశయం

ధూళినైన చేరనీదు నీరుమాలు కూర్చుతూ రక్షణ వలయం


2.పట్టుకుచ్చులు విచ్చుకత్తులు నీకురుల బిరుదులు

ఘనాఘనాలు సుదీర్ఘాలు అంటుకొనగ పిరుదులు

తారాడే కారణాలు కేశాల మిషల వల్ల మదికి క్లేశాలు

అందినంత మేరకు దోచుకొనగ చేస్తాయి తమాషాలు

Wednesday, November 9, 2022

 

https://youtu.be/UYN6hrpdl3U?si=2t9O4RM1TuSFcPxU

రచన ,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శిరమున శీతల జ్యోత్స్న

నుదురున రగిలే జ్వాల

జటల గంగ దూకేనంట

కంఠమందు విష 'మంట

భలే భలే స్వామీ ముక్కంటీ

దండాలు దయజూడూ దూర్జటీ


1.దేహమంతా భస్మధారణం

ఐశ్వర్యమెంతైనా నీవిచ్చేవరం

శ్మశానాన చితుల సావాసం

కైలాసం కైవల్యం నీ ప్రసాదం

భలే భలే స్వామీ ముక్కంటీ

దండాలు దయజూడూ దూర్జటీ


2.భయద సర్పాలు నీనగలు

పెదవుల చెదరవు నగవులు

జగతిని జయించగా త్రిశూలం

అశనము భుజించగా కపాలం

భలే భలే స్వామీ ముక్కంటీ

దండాలు దయజూడూ దూర్జటీ

https://youtu.be/Lb3Gcc4SqKo


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చందమామలెన్నో నీ తనువున

చంద్రకళలెన్నెన్నోనీ అణువణువున

చంద్రకాంత సోయగయమే నీ మేనంతా

చంద్రగోళాలు సైతం తరచి కాంచినంతా


1.వదన సదనాన నిండు పున్నమే

నయన ద్వయాన తదియ చిహ్నమే

కపోలాలు పంచుకున్నవి చవితి పంచమిలే 

అధర దరహాసానా విదియా ద్యోతకమే


2.చనుదోయి పూర్ణశశిలై పైటమబ్బు మాటున

నడుమొంపులే నవమిని దశమిని చాటేనా

అరుంధతితారై తారాడుతుందినాభి చాటున

జఘనార్ధగోళాలైన జాబిలి గ్రహణాల చందాన

 

https://youtu.be/w8ZpWnCmia4

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కార్తీకదీపమా మా ఆర్తి బాపుమా

అంతరంగ తిమిరాలనోకార్చుమా


1.ధరణికి దీపాలు విశేష రవిచంద్రులు

విశ్వానికి దీపాలు అశేష నక్షత్రాలు

మాలో ఆత్మజ్యోతిగా దీపించుమా

జ్ఞానజ్యోతిగా జగతిన వ్యాపించుమా

నదిలో కొలనులో వదిలే దొన్నెలొ ప్రకాశించుమా


2.కార్తీక పౌర్ణమివేళ పరమభక్తితో జనం 

తులసి ఉసిరిక చెట్లకు వత్తుల నీరాజనం

హరిహరనామ సంకీర్తన రోజంతా భజనం

బంధుమిత్రాదుల సామూహిక వనభోజనం

ఆనందో త్సాహం కూర్చి నేరవేర్చవే ప్రయోజనం

Sunday, November 6, 2022


https://youtu.be/01b1u1lMOFU?si=xBcSRjgq7EBwZAEl

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శంఖనాదమే ఒక గొంతుపాడితే

కోయిల స్వనమే ఒక కంఠం విప్పితే

వీణా వాదన నిక్వణమే ఒక గళం నినదిస్తే

మరంద మార్ధవమే ఒకగాత్రం ధ్వనిస్తే

గాత్రం సర్వత్రా పరమ పవిత్రం

గాత్రం గానానికి ఆకర్షణ సూత్రం


1.భావాన్ని అనుభవించితే

సహానుభూతినే పొందితే

అర్థాన్ని ఆకళింపుచేగొనితే

ఉచ్ఛరింపులో పట్టుసాధించితే

ఆపాత మధురం ఏపాటైనా

అసిధారావ్రతమే ఏపూటైనా


2.శ్రుతి మీద సాగేలా కసరత్తు

లయతో లయమైతే గమ్మత్తు

పాట చల్లుతుంది పరిమళాల మత్తు

శిశుర్వేత్తి పశుర్వేత్తి ఏదైనా చిత్తు

గీతం నవనీతమే ప్రతి గాయానికి

గేయం అనునయమే హృదయానికి

Saturday, November 5, 2022


https://youtu.be/Q4aTNkSprRk?si=tSjcidPxVfg9x7DR

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎలా తెలుపను నీ పైని ప్రేమను

ఏదని నీకివ్వను ఇచ్చాగా మనసును

దేహభావన వదిలి వేసి

ఎదను ఎదతో జతగజేసి

అవధులేలేని సౌఖ్యన్నే అనుభూతిద్దాం

ఎవ్వరూ లేని లోకాన్నే ఏలుకుందాం


1.లోగుట్టు బయట పెట్టవు

నా జోలి మదిలొ మానవు

కనుతిప్పనీయనీ మెరుపు తీగవు

పలుచని నీ నవ్వైతే అసలాపవు

ఓపలేను నిన్ను కలవకా -ఈ తపనను

గుర్తించు ఇకనైనా- మన మనో మనువును


2.కనిపించిన కలికల్లా నీలానే

పలకరించబోయి ఖంగుతిన్నానే

అందరిలా నన్నెపుడూ జమకట్టబోకు

నా స్వప్న సుందరివే నను కష్టపెట్టకు

పట్టించుకుంటే సరి పక్కదారి పట్టను

కాదంటు తప్పుకోకు మెతుకు ముట్టను

 

https://youtu.be/6ZEk1VzUyCE?si=oyuBBFDVYLMQnrxa

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నాగ గాంధారి


ఒప్పుకుంటా చెప్పుతుంటా

గొప్పవారికైనా నీకృప కష్టమని

నిను చేరే త్రోవంతా క్లిష్టమని

నీపై దృష్టి పడడం అదృష్టమని

మనసా వాచా కర్మణా నువు నా కిష్టమని

శ్రీనివాసా వేంకట రమణా గోవిందా

సంకటహరణా కరుణాభరణా పాహి ముకుందా


1.కంసాలివి నీవు నను కాల్చుతున్నావు

బుద్దిని శుద్ధిచేసి మేలిమి కూర్చుతున్నావు

ఆభరణంగా రూపొందంగా ఎన్ని దెబ్బలు

నువు తలదాల్చగ పెడుతున్నా పెడ బొబ్బలు

శ్రీనివాసా వేంకట రమణా గోవిందా

సంకటహరణా కరుణాభరణా పాహి ముకుందా


2.వత్తిడి పెంచుతు వత్తిని బాగా పేనుతున్నావు

మతి వెలిగించగ  ఓరిమినూనెలొ ముంచుతున్నావు

నీ స్మృతి జ్యోతిని గర్భగుడిలో దీపించనున్నావు

నేనే దహించి నీవను కాంతిగ వ్యాపించమన్నావు

శ్రీనివాసా వేంకట రమణా గోవిందా

సంకటహరణా కరుణాభరణా పాహి ముకుందా


@everyone

https://youtu.be/YxkHZqr4I_k

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అల్ప సంతోషులం

కల్పనా చతురులం

కలలలో విహరించే కవులం

ప్రణయ గత ఆశా జీవులం

ఎదవీణ పలికే మంజుల రావాలం


వేదనంతా మటు మాయం

కాలమే మాన్పుతుంది గాయం

చింతించినంతనే అయోమయం

కలగజేస్తుంది యోచనే ఆనందమయం

పాటతోపాటే సాగుతుంది కవి పయనం


ముడివడిన బంధాలే భారమై

సాంత్వననిడ చెలిమే చేరువై

సదా సంతోషమే కలయిక సారమై

వేసే ప్రతి అడుగు అనురాగ తీరమై

పాటుపడగ పాటల తోటై కవి పాటవం

Friday, November 4, 2022

https://youtu.be/ViIXrua2aJA?si=EqVwechdVsucgJrn

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:చారుకేశి

నీ అధరమందారాలలో
నను గ్రోలనీ మరందాలు
గాఢ పరిష్వంగమందునా
నను చేరనీ స్వర్గధామాలు

1.నను తెలుపనీ ఈ క్షణాన
ప్రణయానికే కొత్త భాష్యాలు
నీ మనఃకుహర కృష్ణబిలాన
శోధించీ ఛేదించనీ రహస్యాలు

2.పయనించనీ గగనాంతరాలకు
విస్మయమనిపించనీ పాలపుంతలకు
ననుగమించనీ రోదసీ పరిధులకు
సుధలే పారే సుదూర వసుధలకు


Thursday, November 3, 2022

 

https://youtu.be/Xp_a5yBQVLI

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: చంద్రకౌఁస్


కనకాభిషేకమా గండపెండేరమా

గజారోహణమా తులాభారమా

కళాకారులడిగే ఘన కానుక లేవని

కవులు ఆశపడే సత్కారాలేమిటని

చప్పట్లు కొడితెచాలు సంబరంతాకు అంబరం

బాగున్నదంటేనే కప్పినంత కాశ్మీరు అంబరం


1.మేధనెంతొ మధించి అనుభూతి రంగరించి

శబ్ధార్థ భావ సౌందర్య మొప్పగా అలంకరించి

కవన కృతిని కమనీయ మలర తీర్చిదిద్ది

హృద్యమౌ నైవేద్యము వాగ్దేవికి నివేదించి

అమ్మవారి ప్రసాదంగా పఠితులకందించగా…


2.రేయి పగలు శ్రమించి పాటవాన్ని మేళవించి

అనితర సాధ్యమౌ కఠిన సాధనతో సాధించి

సప్తస్వరాల నవరస సారాలు కళలోకుమ్మరించి

నటరాజు చరణాలకు నమ్రతగా సమర్పించి

కనువిందుగా మది పసందుగా  ప్రదర్శించగా…

 

https://youtu.be/W-hts27C7Cc

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హంసానంది


అత్రి అనసూయ పుత్రుడా

త్రిమూర్తి స్వరూపుడా

గురుదేవ దత్తుడా 

అష్టాంగయోగ సిద్దుడా

అభీష్ట వరదుడా సాష్టాంగ వందనం


1.త్రిగుణాతీతుడా పునీత చరితుడా

అవధూతా ఆరోగ్య దాతా వైద్యుడా

దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభుడా

భీమా నదీ తీర గాణుగాపుర వాసుడా

అభీష్ట వరదుడా సాష్టాంగ వందనం


2.శంఖ చక్ర శూలాయుధ ఢమరుధర

దండ కమండల మాలాయుత కర

కౌపీనధారి వనమాలి పరమ యోగీశ్వర

నరసింహసరస్వతీ దివ్యావతారుడా

అభీష్ట వరదుడా సాష్టాంగ వందనం

 

https://youtu.be/ONWSbju6wuk

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అలకబూనితే అదో నవ్వులాట నీకు

కినుక వహిస్తే అసలు లెక్కచేయవెందుకు

గమనించవు నా మాటల మాటున గాంభీర్యం

పరికించవు నా మదిలో పేరుకునే నైరాశ్యము

ఈ చిత్రవధ కంటే చంపెయ్యి ఒక్కసారి

ఈ యాతన మనలేను వేచివేచి వేసారి


1.తోసిరాజంటూ బంధనాలు వేస్తావు

తల్లడిల్లి పోతుంటే తమాషాగ చూస్తావు

ఎందుకో మరి నీపై ఇంతటి ఆరాధన

ఎరుగవంటె నమ్మేనా నా ఎద ఆవేదన

ఈ చిత్రవధ కంటే చంపెయ్యి ఒక్కసారి

ఈ యాతన మనలేను వేచివేచి వేసారి


2.ఎందుకు వచ్చావో నా జీవితం లోకి

ఎలా నాలొ సొచ్చావో ఎరుగను ఏనాటికి

నా ఊపిరి గుండె సడి నీవేలే ముమ్మాటికి

చేరవే నా గూటికి కూడదంటే నే కాటికి

ఈ చిత్రవధ కంటే చంపెయ్యి ఒక్కసారి

ఈ యాతన మనలేను వేచివేచి వేసారి

Tuesday, November 1, 2022

 

https://youtu.be/wjoEcZSz2Zc

భావకవి కృష్ణశాస్త్రి స్మృతిలో…ఆయన జయంతి సందర్భాన నా భావగీతి…


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆకులు అతిథిగ ఆహ్వానించగా

కొమ్మలు తలలూచి రమ్మనగా

పువ్వులు నవ్వులు కుమ్మరించుగా

వనమును మనమును ప్రేమించగా


1.సీతాకోక చిలుకలే దారితీయగా

శుకము పలుకులే మరి తీయగా

పికము లొలుకు గీతాలు హాయిగా

కపోతమే జతగా చెలిమి చేయుగా


2.మయూరమే వింజామర వీయగా

పారిజాత విరులే పరిమళం కురియగా

కొలను తామర విప్పార విరియగా

మది తేలి తేలి మైమరచి మురియుగా

 https://youtu.be/lvN06Q3UJo0?si=yA8nT--MwBCdpqR7


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పుక్కిట పట్టని సంద్రమే ప్రేమంటే

గుప్పిట ఇమడని మేఘమే మనసంటే

పరస్పరం ఆధారమే ప్రణయ రాగ సారమే

ప్రకృతి కూర్చిన అందము అనురాగ బంధము


1.ఏ క్షణాన పుడుతుందో వీక్షణలో

ఎదనెలా మెలిపెడుతుందో నిరీక్షణలో

తెలియని ఆరాధనే ప్రేమంటే

తీయనైన వేదనే ప్రేమంటే


2.నీడలాగ వెనువెంటే జంటగా ఉంటుంది

వద్దన్నా వీడకుండా మొండిగ వెంటాడుతుంది

ప్రియమైన శత్రువే ప్రేమంటే

సాధించే నేస్తమే ప్రేమంటే


https://youtu.be/pOTUs-UDB6U?si=EMjhDj9lmXbGgopu

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కండ గలిగిన దండి దేవుడవు

కొండగట్టులోన ఉండి నిలిచావు

కొండను అరచేత మోసుకొచ్చావు

కొండంత అంజన్న మాకండనీవు

దండాలు నీకు శ్రీరామ భక్తుడ

మెండుగ మేలుకూర్చు వాయుపుత్రుడ


1.సూర్యణ్ణే మింగిన.శూరునివి నీవు

ఇంద్రునితొ పోరిన వీర హనుమవు

సుగ్రీవునికైతేనో మంచి మిత్రుడవు

గుండెలొ రామునికి గుడి కట్టుకున్నావు

దండాలు నీకు శ్రీరామ భక్తుడ

గండాలెడ బాపర వాయుపుత్రుడ


2.సంద్రాన్ని సైతం దాటిన ఘనుడవు

సీతమ్మకు రామయ్య ఉంగరమిచ్చావు

లంకిణిని కూల్చేసి లంకను కాల్చావు

రావణుని గర్వాన్ని అణచి వేసి నావు

దండాలు నీకు శ్రీరామ భక్తుడ

తండ్రివినీవే మాకు  వాయుపుత్రుడ

Monday, October 31, 2022

 https://youtu.be/9uaaq1vM2UI?si=tEuIyKHnLfDjO-UT


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


కైలాసనిలయ కైవల్యదాయా

ఓం నమఃశివాయ

కారుణ్య హృదయ బ్రతుకే నీదయ

ఓం నమఃశివాయ


1.నీభక్తులకు భోలా శంకరుడవు

దుష్టశక్తులకైతే కాల రుద్రుడవు

నిను నమ్మితి కావరా నీలకంఠుడా

గణపతి ప్రజాపతీ ధవళ దేహుడా


2.దోసెడు నీళ్ళకే  పరవశమవుతావు

బిల్వపత్రమర్పిస్తే మా వశమౌతావు

శరణు శరణు శంభో మహాదేవా

శరవణభవ శాస్తా  సాంబశివా

https://youtu.be/cv8IVuQAgMw


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బండరాయి కరుగుతుంది మీ పాటకు

ఏ గుండెకాయ కదలకుంది నా మాటకు ఈపూటకు

శిలాప్రతిమలైనారా అచేతనంగ మారారా

ఏంచేస్తే వస్తుంది చలనము

ఎలా తేగలను చైతన్యము


1.అర్థించినాను అభ్యర్థించినాను

ప్రార్థించినాను ప్రణమిల్లినాను

కొండలనైతే మోయమనలేదు

డబ్బులనైతే ఈయమనలేదు

సహృదయతతో స్పందించమన్నాను

మీ ఆశీస్సులనే అందించమన్నాను

ఏంచేస్తే వస్తుంది చలనము

ఎలా తేగలను చైతన్యము


2.శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః

రసపిపాసులే  కదా ఉన్నది ఈ బృందావని

ప్రాధాన్యత నివ్వకనే సమయం దొరకదని

ప్రోత్సహించినంత మనకు పోయేదేముందని

తరించి తరింపజేయగా వేడుకున్నాను

అంతరాలనే  అంతరింపజేయమన్నాను

ఏంచేస్తే వస్తుంది చలనము

ఎలా తేగలను చైతన్యము


https://youtu.be/T4TpWmpyoS4


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:మిశ్ర భైరవి


సడలనీ  ముడివడిపోయిన బంధాలు

తెగిపడనీ నను పెనవేసిన బంధనాలు

సాగనీ ప్రభూ నీవైపుగానే నా చరణాలు

ఆగనీ  ఈ జీవికికనైన జనన మరణాలు


1.వెదికితినీ నిను కొండల కోనల

కాంచగ పదపడితి గుడి గుండాల

తిరిగితి యాత్రల మునిగితి నదుల

మరచితి నీ ఉనికినీ హృదయాన


2.మళ్ళించు నను అంతర్ముఖునిగ 

భావించు స్వామీ నీ ప్రియ సఖునిగ

తరియించనీ నను చిదానంద సుఖునిగ

జీవించనీ విషయ వాంఛా విముఖునిగ

Saturday, October 29, 2022


https://youtu.be/VNkgKq-JCfk

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


గోవిందా గోపాలా గోపీలోలా

గోకుల శౌరి గోవర్ధన గిరిధారి 

అధర మందార మరందాల నందరా నందలాలా

మధుర మురళీ సుగంధాల ముంచరా నన్నేవేళా


1.వనమాలి శిఖిపింఛమౌళీ మురారి

యమునాతీర విహారి బృందావన సంచారి

బాలను నేను బేలనురా తాళజాలనురా

ఆపాద మస్తక సమస్తం ప్రభూ నన్నేలవేలరా


2.నామేనను వలువను వలిచేయరా

కనులతోనే నా తపనలు కొలిచేయరా

ఉలి నీవై నా కలతలనిక తొలిచేయరా

ఆగను వేగనూ నను నీవుగ మలిచేయరా

https://youtu.be/ug5nt7EwHEU?si=XMq_x6ISsoe8Hm03

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : భీంపలాస్

 నీవు లేనిదెక్కడ నొడువుజవ్వని
కనరాని దెన్నడు పలుకుతొయ్యలి
కళలున్నచోట కలకలము నీవే
కవులు సంధించేటి కలము నీవే
అతురత మాకుంటే చేయూత నిస్తావు
మమ్మక్కున జేర్చుకొని ప్రేమగా లాలిస్తావు

1.అక్షరాలు అందెలుకాగా నీపదములు నర్తిస్తాయి
భావాలు పల్లవించగా కృతులెన్నొ ఉదయిస్తాయి
దృక్పథమే నీ పథమైతే పరమ పదము చేర్చేను
నిరంతరం నీ తపమందున పరమానంద మందేను
అతురత మాకుంటే చేయూత నిస్తావు
మమ్మక్కున జేర్చుకొని ప్రేమగా లాలిస్తావు

2.స్వర సప్తక వరమొసగి ధన్యులగావిస్తావు
సప్త చక్రాలయందున ఉద్దీపన ఒనరిస్తావు
గాత్రమనురక్తి సూత్రమై గీతార్చన కోరేవు
గాన రసాస్వాదనలో ఎదన హాయి కూరేవు
అతురత మాకుంటే చేయూత నిస్తావు
మమ్మక్కున జేర్చుకొని ప్రేమగా లాలిస్తావు


Friday, October 28, 2022

https://youtu.be/LWBAqz2BYa8

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్నో తెలుసు అన్నీతెలుసు

అయినా వినదీ పిచ్చి మనసు

తప్పూ తెలుసూ ఒప్పూతెలుసు

అసలే మానదు ఎందుకింత అలుసు

మనసు మాట వినదు

అది నీదై పోయినందుకు


1.నిన్ను తలవగనే పురులు విప్పుతుంది

నిన్ను చూడగానే మరులు గుప్పుతుంది

పరిధులు మీరమని నొక్కి చెప్పుతుంది

ఎడబాటు భారమని ఏడ్చి రొప్పుతుంది

ఈ మనసు మాటవినదు నీదై పోయినందుకు


2.ఎన్నిసార్లు దాటవేసినా నీ వెంటపడుతుంది

గుట్టుగా దాచ జూసినా ఓ కంటకనిపెడుతుంది

కొస ఊపిరి దాకా ఆశ వదలుకోనంటుంది

పట్టువదలక పదేపదే జట్టుకట్ట మంటోంది

నా మనసు మాటవినదు నీదైపోయినందుకు

https://youtu.be/7TiH1v7Marw

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:రేవతి


శశిధరా గంగాధరా

జటాధరా నీలకంధరా

భస్మధరా చర్మాంబరధరా

త్రిశూలధరా ఢమరుధరా

ఖట్వాంగధరా పురంధరా

వందనాలు గొనరా సుందరా

నా డెందమందు మనరా మనోహరా

1.రాజధరా విషధరా మృగధరా

కుముద ధరా అజకావగ ధరా

నాగాభరణధరా శితికంధరా

కపాలధరా ఖండపరశుధరా

అనాలంబిధరా అర్ణవతూణీర ధరా

వందనాలు గొనరా సుందరా

నా డెందమందు మనరా మనోహరా


2.పశుపతి గౌరీపతి మదనారి

కపర్దీ ధూర్జటీ ఝర్ఝరీ

పినాకి పురారి భూరీ

విలాసీ ముక్కంటి మల్లారీ

జ్వాలి కపాలి పింగళి

వందనాలు గొనరా సుందరా

నా డెందమందు మనరా మనోహరా

*ఇది నా 3000 వ గీతం🌹😊💐🙏*

https://youtu.be/zStxIgWLa-E?si=kupiuVuBGTuWEMYN

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:శివరంజని


పల్లవి: 

వీణా నిక్వణ మాధురి ఆహ్లాదమే

గమనింతురా తెగిన వ్రేలికొసల గాయాలు

వేణువాద్య వాదన మెంతో హృద్యమే

ఎరుగుదురా ఎవరైనా ఊపిరితిత్తుల ఆర్తనాదాలు

నవ్వులు పూసే పెదవుల మాటున

హృదయ విదారాలు

మెరిసే కన్నుల వెనకగ దాగిన

అశ్రు సాగరాలు…


చ.1.కమ్మని కవితల కావ్యపఠన కమనీయమే

అనుభూతుల ప్రసవవేదన అనుభవ గ్రాహ్యమే

ఇంపగు దృశ్యపు వర్ణచిత్రాలు రమణీయమే

ఊహకు రూపకల్పనలోని సృజనా అనూహ్యమే

నవ్వులు పూసే పెదవుల మాటున

హృదయ విదారాలు

మెరిసే కన్నుల వెనకగ దాగిన

అశ్రు సాగరాలు…


చ.2.ఎలుగెత్తి ఆలపించే గానం శ్రవణానందమే

స్వరతంత్రులు పెగిలించగా రేగే యాతన విదితమే

హావభావ విన్యాసాల నాట్యం నయనానందమే

ధరణి తాడనతొ పదముల పీడన వ్యధాభరితమే

నవ్వులు పూసే పెదవుల మాటున

హృదయ విదారాలు

మెరిసే కన్నుల వెనకగ దాగిన

అశ్రు సాగరాలు…


*ఇది నా 3000 వ గీతం🌹😊💐🙏*

Thursday, October 27, 2022

 

https://youtu.be/FSY8pwMAD_w?si=5JZ-ByA_vVbyQfmi

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మోహన


ఎంకన్న నీకింత మంకెందుకూ

మాకీ సావూ పుట్టుకల లంకెందుకు

సంపనన్న మమ్మేగిర సంపవాయే

సక్కన్ని బతుకైనా ఇయ్యవాయే

గోయిన్ధా గోయిందా గోయిందా గోయిందా


1.సదువూ సందెలు మాకున్న గాని

మరియాదలన్నవి మంటగలిసే

సిరి సంపదల తూగుతున్నగాని

అనుభవించు రాత అస్సల్లేదాయే


2.బండరాళ్ళైనా బస్మమైతయి గాని

పూటకు పట్టెడు మెత్కులే కరువాయే

పదారు కూరల్తొ మస్తు తినుటకున్నగాని

ఒక్కముద్దతిన్న అరుగని వెతలాయే


3.పూరిగుడిసైనా పండ లేనోనికి

కాశికి దేకేంత కాళ్ళ సత్తావుండె

కార్లుమోటర్లింట బార్లుదీరిన గాని

నాలుగడుగు లేయగ నరకంతీరాయే

Wednesday, October 26, 2022

 


https://youtu.be/BdyPTRW6DIs?si=NlxJPYsWdvBUzlXu


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పంచ హారతులు నీకిస్తాం-

పల్లకీలో నిన్నూరేగిస్తాం

పాలతొ నిన్ను అభిషేకిస్తాం-

ప్రతి గురువారం అర్చిస్తాం

భక్తితొ నిన్నూ విశ్వసిస్తాం-

మాదైవమీవంటూ భజనచేస్తాం

ఓం సాయిశ్రీసాయి జయజయసాయి

ఓం సాయిశ్రీసాయి జయజయసాయి


1.తలచినంత ఎదుట నిలిచేవని

పిలిచినంత బదులు పలికేవని

ఊదుతొ వ్యాధుల్ని మాన్పేవని

బోధతొ బాధల్ని తీర్చేవని


2.చూపినప్పుడెమాకు నీమైమ తెలిసేది

మా ఆర్తి బాపినప్పుడే నీ కీర్తి వెలిగేది

మాటా మనసు మంచినే వచించనీ

నడత నడకా ప్రగతివైపే గమించనీ

Tuesday, October 25, 2022

https://youtu.be/ntkWsWJqM9M


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఖరహర ప్రియ


తాయిలాలేలా

పాడుటకై గండుకోయిలకు

సుభాషితాలు చాలా

కరుగుటకై బండరాయిలకు


1.తేలికైన మబ్బెపుడు

చిరుగాలికె కదులును

తెలివైన రాజహంస

మేలిమి పాలెరుగును


2.కోరనేలా చందమామను

కురియగా  వెండివెన్నెలను

కుంచెతో నింగిని దించాలా

మెరియగా ఇంద్ర ధనువును

 https://youtu.be/Fji6f-TBxvo


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సిందు భైరవి


ఒంటరిని నేనై రమ్మంటిని…ఏకాంత సమయమవగా

రావేలనో నీవేలనో…అనురాగమే రసయోగమవగా…


విరమించనేల విరహించనేల…సఖ్యత మనము

రమించినంత దహించదేచింత…తీరగ కామనము


వివరించరా విశదముగా…నీవు కలవను సత్యము

వరించిరా  సవరించగ …కలవను నిను నిత్యము

 

https://youtu.be/geJOff9-6nk?si=SLj8LTl2UVaCfYvt

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:తిలాంగ్


హిరణ్య కశిపుని జఠరము చీల్చినా

ఉగ్రనరసింహా నీకు హృదయాంజలి

ప్రహ్లాద వరదుడవై ధర్మపురిన నిల్చినా

శాంత నారసింహా మా యోగ నారసింహా

శరణాగతవత్సలా కరుణాకరా భక్త-వశంకరా

స్వామీ నీకు చిత్తాంజలి ముకుళిత హస్తాంజలి


1.వజ్ర మకుట శోభితం ఊర్ద్వ పుండ్రాన్వితం

విస్ఫులింగ నేత్రయుతం మృగ ముఖ విరాజితం

దంష్ట్రా కరాళ వక్త్రం రక్తవర్ణ తేజో రసజ్ఞం

తీవ్ర తీక్షణ నఖయుక్తం నర-హరి ద్వయ రూపిణం

శరణాగత వత్సలా కరుణాకరా భక్త-వశంకరా

స్వామీ నీకు దివ్యాంజలి ప్రభూ నీకు దీపాంజలి


2.శంఖ చక్ర ధారిణం దుష్ట సంహారిణం

అభయ భద్ర విగ్రహం శిష్ట  సం-రక్షకం

పీతాంబర విలసితం కౌస్తుభ వక్షాంకితం

భవ సాగర తారిణం మనస్సంచారిణం

శరణాగత వత్సలా కరుణాకరా భక్త-వశంకరా

స్వామీనీకు గీతాంజలి ప్రభూ నీకు నృత్యాంజలి

 

https://youtu.be/Qw0cUT5Eq5I

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చక్రవాకం


అరుణాచలేశ్వరా హరహరా

తరుణమెపుడు నిను కాంచగ పరమేశ్వరా

పౌర్ణమిలెన్ని గడిచి పోయెరా

శరణాగతవత్సలా కరుణించగ తాత్సారమేలరా


1.ప్రణవనాద సంభవుడవు పరాత్పరా

పరీక్షించబోకు నను తాళజాలరా

జ్యోతి స్వరూపుడవు జ్వలితనేత్ర ఈశ్వరా

జాలిజూపి నను వేగమె దరిజేర్చరా


2.అభిషేకించాలనా నాకీ ఆశ్రుధారలు

ఇంతవరకు కార్చింది సరిపోలేదా

పత్రీ పువ్వుల బదులుగనా నా నవ్వులు

నీ కొరకే మూటగట్టుకొంటివి కాదా

Monday, October 24, 2022

https://youtu.be/N2Sq3iU0vko?si=PYuduo3nmAUX3iYZ


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుట్టేదో చెప్పక గుబులే రేపకు

మనసేంటో విప్పక మంటేబెట్టకు

ముల్లుగుచ్చుకున్నా నీ కాల్లో

నీళ్ళు తిరుగతాయి నాకళ్ళలో

తుఫాను ముందటి ప్రశాంతిని 

నే తట్టుకోలేను

ఉప్పెనలా వ్యధ ముంచేస్తే 

నన్ను తిట్టుకోలేను


1.అందమైన నీ తనువంతా

 హాలహలం చేరిందా

మంచితనపు నీ మనసంతా

మనాదిగా మారిందా

చికిత్సనే లేనిదా అంతుచిక్కని నీ వ్యాధి

మందంటూ దొరకదాశో ధిస్తే నింగి అంబుధి


2. బాధను తొలగించనా 

అనునయవాక్యాలతో

గాయాలకు మలాం పూయనా

సాంత్వన గేయాలతో

బ్రతుకంతా కడదాకా కలిసే ఉందాం

ఒక చితిలోనే ప్రతి జన్మలో కాలిపోదాం

Sunday, October 23, 2022


https://youtu.be/NOSs2YM5RQs

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఉదయ రవి చంద్రిక(శుద్ధ ధన్యాసి)


భారతి భార్గవి భైరవీ ప్రణమామ్యహం

అవస్థాత్రయాలలో దేవీ తవ దాసోహం


1.దేహిమే జనని మనోనిగ్రహం

వరదే మాతరం దివ్యానుగ్రహం

పరమ పావనమ్ తవ సుందర విగ్రహం

మాత్రే తవ దర్శన మాత్రేణ ధన్యోహం 


2.సందేహం సర్వదా మమదేహం

జీవన మూలకారణం వ్యామోహం

నశించనీ నాలో ననుముంచే అహం

స్మరించనీ నిన్నే అమ్మా అహరహం

 

https://youtu.be/x873aIQvCoY?si=VNH8uRguWgAsyCws

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కొడిగట్టి పోనీకు మన చెలిమి దీపం

వసివాడనీకు  మనదైన సౌరభ పుష్పం

ప్లాటోనిక్ లవ్ మనది చెరగ నీకుమా

స్నేహానికి మించినది ఎరుగు నేస్తమా

ఆత్మ సహచర్యంగా అలరారుతున్నది

అమలిన అనురాగంగా విలసిల్లు తున్నది


1.ఉదయాన నిను తలచే మేలుకునేది

శుభరాత్రి చెప్పిన పిదపే నిదురోయేది

నిను మరచిన దెప్పుడని గురుతు చేయగా

నిరతము నీ తలపులతో తలమునకలుగా

ఆత్మబంధమే మన మధ్యన పెనవేసుకున్నది

మమతా ఆప్యాయతా మనను అల్లుకున్నవి


2.తప్పుకుంటె తప్పిపోదు నీడైన ప్రేమ

తప్పొప్పులు మన్నిస్తుంది తోడైన ప్రేమ

బంధనాలు త్రెంచుకొని అనుభూతులు పంచుకొని

అజరామరంగా నిజమైన ఆనందంగా

పెదవంచు నవ్వుగా ప్రభలు చిమ్ముతుంది

మనసులే ఏకమవగా బ్రతుకంతా కమ్ము

తుంది

 

https://youtu.be/NEbrDeHrAs8?si=CmfF7CBqvVDmNceh

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:బృందావన్ సారంగ


పువ్వులుంచి పూజిస్తా ప్రభూ నీ పదాలపై

నవ్వులు చెదరనీకు సదా నా పెదాలపై

సతతము నిను స్మరిస్తా నా ఎదలయగా

పతితుడ నన్నుద్ధరించు పరమాత్మలో కలయగా

నమో వేంకటేశా నమో శ్రీనివాసా నమో 

నమో తిరుమలేశా నమో భక్తపోషా


1.తలనీలాలిస్తా తలబిరుసును వదిలించు

కాలినడకనొస్తా నా కనుల పొరలు దించు

కానుకలందిస్తా తుచ్ఛకామనలని త్రుంచు

తన్మయముగ దర్శస్తా నా తనువుని తరలించు

నమో వేంకటేశా నమో శ్రీనివాసా నమో 

నమో తిరుమలేశా నమో భక్తపోషా


2.నీ రచనలు సాగిస్తా కవనము రుచించనీ

కృతులలొ నిను కీర్తిస్తా కమ్మగ వినిపించనీ

అన్యమేది స్ఫురించక నీ ధ్యాసలొ తరించనీ

ధన్యమవగ ఈ జీవితమే జన్మలంతరించనీ

నమో వేంకటేశా నమో శ్రీనివాసా నమో 

నమో తిరుమలేశా నమో భక్తపోషా

Thursday, October 20, 2022

 https://youtu.be/n2rEs-BN-ck?si=Pzglnq5bW2RIsl-A

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ప్రియమగు వచనములే నను పలుకనీ

నయమగు రచనములే నను చేయనీ

సూనృతమో అనృతమో అన్యులకది

అమృతమై తోచనీ

హితకరమో ముఖప్రీతికరమో ప్రతిమది

ముదమెందనీ

వాగధీశా అవతారపురుషా 

వానరేశా వందే ఈశ్వరాంశా


1.మహా బలుడవే నీవు నీ శక్తి నెరుగవే

రామనామ పిపాసుడవే యుక్తులెరుగవే

రామపాద సేవకుడవే మరే ముక్తినీ కోరవే

నీ నిజ భక్తుడిగ భజనానురక్తుడిగ నను మారనీ


2.అహంకారము మత్సరాలే తలభారము

మనో వికారము స్వామీ నాకవనీ దూరము

పరోపకారము అలవడగ అందించు సహకారము 

పదిమందితో కలిసి చేరనీ పరమానంద తీరము

 

https://youtu.be/bawkuh_OLMU?si=IgdF6JKvj_qED5yy

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఔదుంబర ఫల* తత్వం

ఆణిముత్యాల సత్యం

వికాసానికేదైనా అకృత్యం

యథాతథ యధార్థమే వాంఛితార్థం


1.ఆత్మన్యూనతే బ్రహ్మపదార్థం

అహంభావమైతే అత్యంత వ్యర్థం

ఎరగాలి అంతరంగ అంతరార్థం

ఎదగాలి సార్థకంగ జీవిత పరమార్థం


2.వినియోగపరచాలి ప్రతిభను

వికసింపజేయగా మనలో ప్రభను

అలరింపజేయాలి రసికుల సభను

ఆహ్లాద పరచగ అభిమానుల ఎదను


*ఔదుంబరఫలం=మేడిపండు

Wednesday, October 19, 2022


https://youtu.be/gfGsCWlpcAI?si=j5cllUZFb3IfsCzi

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాట మంత్రమై మనసుని గెలుస్తుంది

మాట శాపమై బ్రతుకుని తొలుస్తుంది

పదుగురాడితే మాట వేదమై నిలుస్తుంది

పదేపదే అన్నమాట పెడద్రోవకు తోస్తుంది


1.పదునైన మాట మదిని-ప్రభావితం చేస్తుంది

పరుషమైన మాట ఎపుడు-ఎదనంతా కోస్తుంది

పనిరాని మాటలన్ని కాల హరణాలే

గాయపరచు మాటలు శోకాల కారణాలె


2.మాటలొలుకు హాయిగొలుపు మకరందాలే

మాటలు ప్రియమైతే ప్రియమౌను వాదోపవాదాలే

ఆహ్లాదమెలికించును ఆత్మీయుల మాటలు

ఔషధాన్ని మించును అనునయమౌ మాటలు

 

https://youtu.be/ai7LU5ElkeQ?si=uElWnmozTtcAV9QT

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏమనను ఈ ప్రేమను

ఎలా మనను ప్రేమే లేకను

సైచలేను నేను దీని ఆగడాలను

వేగలేను ఇది సృష్టించే రగడలను


1.లోకం తెలియని నన్ను కమ్ముకున్నది

మైకం కమ్మేలా మదిని కుమ్ముతున్నది

కల్లబొల్లి సొల్లు చెప్పి విక్రమించుతున్నది

మెల్లెమెల్లెగా ఒళ్ళంతా ఆక్రమించుకున్నది


2.ఎరలేవో వేసి తేరగా నను పొందింది

తెరలెన్నో తీసి తను ఏంటో చూపింది

పొరలుపొరలుగా నాలో పేరుకున్నది

తేరుకునే లోగానే  మనసంతా కూరుకున్నది

Tuesday, October 18, 2022


https://youtu.be/2yFNaB67RXQ?si=7DYBg-oXwLRO419z

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రావే రావే నీవే పున్నమి సిరి వెన్నెలవై

రావే రావే రావే మరు మల్లెల చిరుజల్లువై

నను వీడని వసంతమై రావే

నా నీడగ ఆసాంతం ఉండిపోవే


1.ఊహవో స్వప్నానివో కల్పనవో

కవితవో గీతవో గీతానివో

కలవో లేవో  ఎరుగని సందేహానివో

కలవరమే నాలో రేపే మోహానివో


2.భ్రమలో ముంచే ఎండమావివో

భ్రాంతిని పెంచే నింగి సింగిడివో

మత్తుగొలిపి చిత్తుచేసే నెత్తావివో

మది స్పృశించి మురిపించే మాయావివో

 

https://youtu.be/x0dz8ZyeJhY

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మోవి నవ్వుతుంది

మోము నవ్వుతుంది

బుగ్గల్లో సొట్ట నవ్వుతుంది

చెవికున్న బుట్టా నవ్వుతుంది

కళ్ళు కూడ నవ్వడం మామూలే

ఒళ్ళంతా నవ్వైతే అది నీవేలే


1వెన్నెల్లో ఆహ్లాదం నీ నవ్వులో

శ్రీ చందన సౌగంధం నీ నవ్వులో

సంతూర్ సంగీతం నీ నవ్వులో

మందార మకరందం నీ నవ్వులో

ఇంద్రధనుసు వెలయడం మామూలే

ఒళ్ళంతా హరివిల్లైతే అది నీవేలే


2.ముత్యాలు కురిసేను నీ నవ్వులో

తారలే మెరిసేను నీ నవ్వులో

పారిజాతాలు విరిసేను నీ నవ్వులో

పరవశాలు కలిగేను నీ నవ్వులో

అందాల చిందడం అది మామూలే

అందమానందమైన అతివంటే నీవేలే

Monday, October 17, 2022


https://youtu.be/3u__iTrTSeE

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హనుమంతం మహాబలవంతం

శ్రీరామమంత్రం భజియింతు సతతం

సారించు నీదృష్టి  కరుణా పూరితం

నమామి పవనసుతం కొండగట్టు వసితం


1.సుగ్రీవ మిత్రం శ్రీరామ భక్తం

సీతామాత తీవ్ర దుఃఖ విముక్తం

గదాదండ యుక్తం దానవ హర్తం

సంజీవరాయం సౌమిత్రి నేస్తం


2. ఇంద్రియ జితం  దేవేంద్ర విజితం 

సిందూర విరాజితం సురముని పూజితం

అర్కపుష్పమాలా ప్రియం ఆరోగ్యదాయం

శ్రీ ఆంజనేయం ఆశ్రితజన శ్రేయం


https://youtu.be/3u__iTrTSeE

 

https://youtu.be/e8otJVR5Mb4?si=E48Unpz0QssyAhwJ

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మల్లయ్య సాంబయ్య గౌరయ్య 

ఏదైన నీదే ఆ పేరయ్య

జంగయ్య లింగయ్య గంగయ్య

ఏదైన నీదే ఆ రూపయ్య

దండాలు నీకు మాదేవ శంభో

మా అండవంటూ నమ్మా ప్రభో


1.ఎములాడలోని రాజన్నవు

కాశీలో కొలువున్న విశ్శెన్నవు

ఏడ జూసినా నీ గుడి ఉందయ్య

నా నీడలోనూ నీ జాడ ఉందయ్యా


దండాలు నీకు మాదేవ శంభో

మా అండవంటూ నమ్మా ప్రభో


2.పన్నెండు లింగాలు చూడకున్న

పండులో ఫలములొ కందునన్న

శివరాత్రి జాగారం జేయకున్న

ఉపాసాముండుట తప్పదన్న


దండాలు నీకు మాదేవ శంభో

మా అండవంటూ నమ్మా ప్రభో


https://youtu.be/pKDCzzXaeHg

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆత్మీయ కవనం 

అనురాగ గానం

కలబోసినదీ ఆనందవనం

చేయి సాచినదీ అనుబంధ జీవనం

కరిగిపోనీకు నేస్తమా ఏ క్షణం ఈ దినం


1.ఉద్వేగాలు లేవు ఉద్రేకాలు… ఉత్సాహాలే

ఉన్మత్తతలు రావు ఉద్విగ్నతలు…సలహాలే

అసూయా ద్వేషాలకు లేదు తావు…స్నేహాలే

చేయి సాచినదీ అనుబంధ జీవనం

కరిగిపోనీకు నేస్తమా ఏ క్షణం ఈ దినం


2.మకరందం  పాటే మాధుర్యం…వీనులకు

సాహిత్యం తోపాటే సంగీతం…అభిమానులకు

గానం బహుమానం  పొరపాటే మౌనం…గాయక గాయనీమణులకు

చేయి సాచినదీ అనుబంధ జీవనం

కరిగిపోనీకు నేస్తమా ఏ క్షణం ఈ దినం

Sunday, October 16, 2022

 

https://youtu.be/vxb_ciwLetc?si=cqSZONxcKIGLXh6h

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తగిలించి ఇగిలిస్తావు

చంపుతూ చక్కిలిగిలి చేస్తావు.

మరీ ఇంత విపరీతమా

ఇదే నీవు చేసే హితమా

అలమేలు మంగాపతి

నిను నమ్మితిననా నాకీ దుర్గతి


1.నీపాల బడడమే గ్రహపాటా

నీ పాట రాసితినే ప్రతిపూటా

ఇంటా వంటా బయటా ఏల గలాటా

నిను కీర్తించడమే నా పొరబాటా

తిరుమల శ్రీ వేంకటపతి

నిను నమ్మితిననా నాకీ దుర్గతి


2.కర్తా భర్తా హర్తా నీవని ఎంచితి

సత్వరజస్తమో గుణాల త్రుంచితి

వాంఛయే అశాంతిగా గ్రహించితి

నేను నాదను భావననే అధిగమించితి

పరమానందకారకా జగత్పతి

త్రికరణశుద్ధిగా నను నీకర్పించితి

స్వామీ నీకర్పించితి


https://youtu.be/BDtT7b-NGQM

 రచన ,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మాండు


ఒకే గూటి పక్షులం ఒకే పదాక్షరాలం

ఒకే పాటలోని భావ రాగ తాళాలం

మనదైన వేదికలో మనసువిప్పు నేస్తాలం

గాన ధ్యానులం గీతాభిమానులం

సరస్వతీ మాత భక్తులం కవితానురక్తులం


1.దాగిన ప్రతిభను గుర్తిస్తాం

సాగని గళాలను సవరిస్తాం

పసందైన వీనుల విందారగిస్తాం

స్పందించే హృదయాలకు వందన మర్పిస్తాం

పాటే ప్రాణంగా బ్రతికేస్తాం


2.శ్రుతి లయలను ప్రతిష్ఠిస్తాం

గతులు జతులను ప్రదర్శిస్తాం

గమకాలను రమ్యంగా పలికిస్తాం

అనుభూతి చెందుతూ ఆనందంగా పాడుతాం

తరించి శ్రోతల తరింపజేస్తాం

Friday, October 14, 2022

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:సింధు భైరవి


దాచుకున్నదేది లేదు

నీమది దోచుకున్నదీ లేదు

ఏమదీ నను దాటవేతువే

చెలిమికేల చేటు చేతువే


1.మరపు పొరలు పేర్చగా

అనవసరమని నన్నెంచగా

విలవిలలాడితి కలవరమొంది

విలపించితి నాలో కలతచెంది


2.మరలిరావే ఆ తరుణాలు

అరమరికలే లేని క్షణాలు

అరుదెంచె మతితప్పు లక్షణాలు

ఏకరువెట్టకు కలవగ ఏ కారణాలు

 

https://youtu.be/mkr7Sya6G9c?si=3gUp0U0WF8QJkFNr

రచన్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కాపి


ముదమున మదవతులై కుముద వదనలు

సుదతులు మదన జనకా నీ ఎదన జేర పదపడిరే

మాధవా నీ అధర సుధలు గ్రోలుటకై మదన పడిరే

మదన గోపాలా ఈ ప్రమదను పాలించగ అదనుజూచి రావేరా

నందబాలా చినదానను వేచినదానను ఆనందమంద జేయరా


1.రాధను కాదనలేను అష్టసతుల వద్దనను

గోపకాంతలెవ్వరితోను పంతము నొందను

అందగత్తెలెందరున్ననూ పందెము కాయను

నీ పద సదనమునిక  వదలనే వదలను

సుందరాకారా బృందావిహారా జాలిమాని నాపై జాగుసేతువేలరా

మందార మకరంద మాధురీ సమనాద మురళీధరా

తరింపజేయగా రారా


2.కుబ్జకున్న విజ్ఞత లేదు మీరాకు నాభక్తి తూగదు

అబ్జలోచనిని కాదు  రసజ్ఞతే నామది ఎరుగదు

అనురాగము అను యోగము కలగనే కలగలేదు

నా మది నిను  సదా తలవక మానను

వనమాలీ శిఖిపింఛమౌళీ వరించిరావా సవరించగ నాజీవన సరళి

కృష్ణామురారి ముకుందా శౌరి మురిపించవేరా నను నీ రాసకేళి

 

https://youtu.be/Ne7YomP-Cpo

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చక్రవాకం


సర్వేశా శేషశాయి వేంకటేశా

సర్వదా వేడెదా నిను శ్రీనివాసా

పాపనాశా శ్రీశా శ్రిత జన పోషా

నీ సేవకు నా బ్రతుకే  ధారపోశా


1.సరసాలలొ మునిగావా సతులతో

శరణాగతి కోరినా వినవా నతులతో

ఎంతగా ప్రస్తుతించానో సన్నుతులతో

కనికరించవైతివే స్వామి సద్గతులతో


2.విషయ వాసనలు నన్ను వీడవాయే

విషమ పరిస్థితులే ననువెన్నాడెనాయే

విషము  మ్రింగ గళమాగిన సమమాయే

విష్వక్సేన వినుత మనసు నీ వశమాయే

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నిను తలవగ నీగొంతు పొలమారనీ

నీ ఈసడింపులతో గుండె బండబారనీ


ప్రచండాగ్ని కీలలతో రగిలే రవిబింబం

చెలగే  నా విరహాగ్ని గనీ మసిబారనీ


గలగలలతో ప్రవహించే అల్లరి గోదావరి

నా అశ్రుధార కలిసి వరదలై పారనీ


విప్పారే విరిబాలల దరహాస వసంతం

ఆశల ఆకులు రాలి శిశిరంగా మారనీ


క్షణికమైన సుఖానికై శాశ్వత దుఃఖమై

ఇలాగే రాఖీ వగపుతో బ్రతుకు తెల్లారనీ


#Raki 

Gazal

Thursday, October 13, 2022


https://youtu.be/S4DUatjIaPs?si=dp0FUk-yxn7-fT-N

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పల్లె తల్లి కన్న పిల్లలం

నేల తల్లి నే నమ్ముకున్న జీవులం

కుస్తాపూర్ వాసులం మంచికెపుడు నేస్తాలం

శ్రీరామలింగేశ్వరుని వీరభక్తులం

ఊరు బాగు పట్ల ఎంతో ఆసక్తులం


1.వ్యవసాయం ఊపిరిగా బ్రతికేటి రైతులం

పదిమందికి సాయంచేసే మానవతా వాదులం

కష్టించి పనిచేస్తూ అభివృద్ధి చెందే వారలం

దేశాలు దాటినా పుట్టినూరును మరువలేం


2.గోదాట్లో మునిగిన పల్లెను తిరిగి నిలబెట్టాము

రామలింగేశుని గుడిని మళ్ళీ మేం కట్టాము

మా ఊరు పేరు వింటేనే పులకరించి పోతాము

ముత్యాలమ్మ చల్లని చూపులతో ఆనందంగ జీవిస్తాము

https://youtu.be/ge6rDjewrSc?si=z74mWTupi_DTWjn-

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : నటభైరవి

అలా అలా అలా  సాగిపోనీ జీవితం
అలలై కలలై తేలిపోనీ అనవరతం
పంచాలి -పదిమందిని అలరించే -వినోదం
పొందాలి అందరం- అనుక్షణం -పరమానందం
మూన్నాళ్ళలొ ముగిసే జన్మకు-ఇన్ని ప్రతిబంధకాలా
పెదవులపై నవ్వులు చెదరకనే మనం -చితిలోన కాలాలా

1.బిడియాలూ మొహమాటాలు
భేషజాలూ లేనిపోని ఆర్భాటాలు
మునగదీసుకొంటూ మూతిముడుచు చిత్రాలు
పంజరాలు ముసుగులలో అత్తిపత్తి పత్రాలు
మూన్నాళ్ళలొ ముగిసే జన్మకు-ఇన్ని ప్రతిబంధకాలా
పెదవులపై నవ్వులు చెదరకనే మనం -చితిలోన కాలాలా

2.ఎదుటివారి సంతోషం మనకకూ ఆమోదమై
సాటివారికి సాయపడడమే నిజమగు వేదమై
ఉల్లమంత ఉల్లాసం వెల్లివిరియగా ఎల్లకాలం
ఖర్చులేని ప్రశంసకు మనమూ కావాలి ఆలవాలం
మూన్నాళ్ళలొ ముగిసే జన్మకు-ఇన్ని ప్రతిబంధకాలా
పెదవులపై నవ్వులు చెదరకనే మనం -చితిలోన కాలాలా


 https://youtu.be/QUR23bNEhUo?si=Oz9kHZUQX9HpwFzo

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం :హిందోళం

గుండెల్లో తడియారిపోయింది
కళ్ళల్లో చెమ్మ ఇగిరిపోయింది
సున్నితమౌ భావాలే సన్నగిల్లిపోయాయి
ఆత్మీయత అన్నదే అడిగంటిపోయింది

1.చెలిమి విరులలోనా తరిగింది పరిమళం
బంధాలూ అనుబంధాలే నేడు వేళాకోళం
సాటి మనిషిపై సహానుభూతియే మృగ్యం
ఎవరికి వారై స్వార్థపుదారైన తీరే దౌర్భాగ్యం

2.ఉత్సుకత ఉత్సాహం కరువైన యవత
అధికారం పరమాధిగా అవినీతిగల ప్రభుత
తాయిలాలతో తలమునకలుగా దేశ జనత
ఎక్కడున్నదో చిక్కక అయ్యో మానవత


Tuesday, October 11, 2022

 

https://youtu.be/VKryuTlaDSQ?si=2msqKhXYLlrbOHKT

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కీరవాణి


నెమలీక దెంత పుణ్యము

తలదాల్చినావు కదా తన జన్మధన్యము

వెదురు ముక్క కెంత గర్వము

నీ పెదవులు ముద్దాడును అదే నీకు సర్వము

పలుచన సేయకురా నను గోపాలా

పడుచును నీదానను  నాకు విలాపాలా


1.గుమ్మపాలు నీకే గుట్టుగ దాచేనురా

వెన్ననూ మీగడనూ ఉట్టిగట్టి పెడితినిరా

జుర్రుకొనగ జున్నులో తెనెలు కలిపానురా

మనసుని ద్యాసని నీపై నిలిపానురా

పలుచన సేయకురా నను గోపాలా

పడుచును నీదానను  నాకు విలాపాలా


2.కోపాలా నాపై - పడవైతివేరా నాపాలా

నా ఎడ సైతం- నీ రసికత చూపాలా

గోపికలందరితోనూ-సరస సల్లాపాలా

ఓపికే లేదిక నీ ఒడినను ఊయలూపాల

పలుచన సేయకురా నను గోపాలా

పడుచును నీదానను  నాకు విలాపాలా

 

https://youtu.be/JjdWm1hIbrA

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కాపి


పవనాత్మజా మహాబల తేజా

మన్నింపుము మము కపిరాజా

రుజ బాధల బాపు భజరంగ భళీ

చాలించు నన్నింక పరికించే కేళి


1.నీ కొండగట్టుకు రప్పించుకో

నచ్చిన రీతిగ దండించుకో

అరటిగెలనే నువు పుచ్చుకో

మా కలలు పండగ వరమిచ్చుకో


2.అర్తిగ చేసేము నీకభిషేకము

నీ ఎడ భక్తియే మాకు మైకము

నీ వీరగాథలు వింటిమనేకము

దయతో తొలగించు మా శోకము

Monday, October 10, 2022

 

https://youtu.be/v6XwuYwQ1Pc

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బంగారి సింగారి బుజ్జమ్మా

నీ ఒళ్ళే రంగుల పూలసజ్జమ్మా

జడచూడబోతే పొడుగాటి రజ్జమ్మా

నీ సొట్టబుగ్గలు పనసతొనల గుజ్జమ్మా

మ్మమ్మమ్మమ్మా ఇవ్వవే నాకో కమ్మని చుమ్మా

గుమ్మాగుమ్మా ఆడబోకు నాతో అష్టాచమ్మా


1.నిన్ను చూస్తె నాకు ఆనందం పట్టరాదు

నన్ను కాస్త ప్రేమిస్తే నా చేయి పట్టరాదూ

బ్రతుకంతా నాతోనే నువు జత కట్టరాదూ

సచ్చేదాక నాతోడు వదలి పెట్టరాదు

మ్మమ్మమ్మమ్మా ఇవ్వవే నాకో కమ్మని చుమ్మా

గుమ్మాగుమ్మా ఆడబోకు నాతో అష్టాచమ్మా


2.కారణాలు నాకేవీ చెప్పనే చెప్పకు

తోరణాలు నాఇంటికి విప్పనే విప్పకు

నీతో నా రణాలనే ఎప్పటికీ ఒప్పకు

నా వల్లకాదు ఔననక నీ చుట్టూ తిప్పకు

మ్మమ్మమ్మమ్మా ఇవ్వవే నాకో కమ్మని చుమ్మా

గుమ్మాగుమ్మా ఆడబోకు నాతో అష్టాచమ్మా

 

https://youtu.be/Z2xwuOuscGA?si=w65u4nWPPXQ_uU6P

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మాయామాళవ గౌళ


నీలో ఉన్నదేదో నీకే తెలియదు నిజం

అసలే చూపదెపుడూ నినుగా ఏ అద్దం

రాజహంసకే ఎరుక ఏదో శుద్ధ క్షీరం

గీటురాయి చూపేను నాణ్యమైన బంగారం

నా చెలిమి గాఢతే కనలేవా

నీ హితైషి మాటలే నమ్మవా


1.మేఘానికేమెరుక 

చిరుగాలికే తాను కరుగునని

మయూరానికెరికేనా

పురి విప్పక మబ్బు తానరుగదని

నీలోని గాననిధిని నేనే కనిపెట్టితిని

నీ కోయిల గాత్రానికి నే మెరుగుపెట్టితిని


2.ఏ పాటకేమెరుక 

తోటతోటి బంధమేపాటిదో అని

ఏ మావికేమెరుక 

తను చివురించేది పికము కొరకని

పల్లవాల నందించి నందించింది నేనని

జడతను కదిలించి అలజడి నే రేపితినని

Sunday, October 9, 2022

 

https://youtu.be/4S6uXiJlT3g?si=g7yZRQgHern4c1e1

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:దర్బార్ కానడ


అద్వైతమె సాంబశివా అర్ధనారీశ్వరము

వేదాంత దృష్టాంతరం నీ లింగాకారము

స్వస్వరూప స్వభావాల సారమే నీ అవతారము

భవతారకమై వరలును పంచాక్షరి జపసారము

నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ

నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ


1.బుసకొట్టే వాసనలే పన్నగ భూషణాలు

దహించే క్రోధానలమే ఫాలమందు నయనము

ఆత్మలింగార్పణమే లుబ్ధరాహిత్యము

పరిత్యాగివి పరమయోగివన్నదే సత్యము

భోలా శంకరా కనరాదు నీ కడ గర్వము

లీలా విలాసా చేరదు నిన్నెపుడూ మత్సరము


2.రంగు హంగు లేని హిమగిరి నీ గృహము

సుగంధాలు నోచని చితాభూమి నీవాసము

ప్రణవనాదమే వినోదించు బయకారము

గంగోదకమే నీ జిహ్వకు షడ్రసోపేతము

భస్మధారణే నీ దేహానికి చందనలేపము

పంచేంద్రియ జయ పంచభూతాత్మక వందనము

https://youtu.be/DkwksDG1NHQ?si=WI8-6TYQRW9K24_z

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

తాకాలని ఎంతో తపన
తడమాలని ఎదలో తహతహ
నీ తనువు ఇంద్రచాపమే
నీ స్పర్శ చంద్రాతపమే
కొలవనీ చెలీ నిను ఆపాదమస్తకం
చదవనీ సఖీ నీవో అరుదైన పుస్తకం

1.రుచిచూడనీ నీమేను మిఠాయినీ
ఆఘ్రాణించనీ  అంగాంగ సారంగాన్నీ
అధిరోహించనీ కాయపు మాయా హయాన్నీ
చేరనీ ఏలగా మనదైన నిజమైన స్వర్గాన్నీ
అందించవే అందాల పసందైన విందునీ
నభూతోన భవిష్యతిగ పొందనీ పొందుని

2.పలికించనీ పెదవుల మోహన రాగాన్నీ
కలిగించనీ కౌగిట కదన కుతూహలాన్నీ
చిత్రించనీ నడుమున దంతక్షత వృత్తాన్నీ 
ఆరంభించనీ నాభిన ఆరభి ఆలాపాన్నీ
జుగల్ బందితో రక్తికట్టిద్దాం విభావరిని
పకడ్బందిగా తరిద్దాం రససిద్ధి జలధిని


https://youtu.be/TUJQtgomyEI?si=iMnci_9cwSSu4vA0

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

నా కన్నుల వెన్నెల నీవే
నా బ్రతుకున పున్నమి నీవే
నా ఎడారి దారిలోనా ఒయాసిస్సు నీవే
నా నిశీధి మనస్సున తొలి ఉషస్సు నీవే

1.విరహాగ్ని చల్లార్చే వలపుజల్లు నీవే
మది కాలిన గాయానికి నవనీతం నీవే
దుర్గమమౌ నా భవితకు స్వర్గసీమ నీవే
నా కలలను పండించే స్వప్నదేవి నీవే

2.నా నావను దరిజేర్చే సరిసరంగు నీవే
సరిగమలను పలికించే సారంగి నీవే
నన్నల్లుకోవే లతగ మారి ఈ వేళ
నా కలతను దూరంచేయవె నా జవరాల


https://youtu.be/MqjHUB4GEfI


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాటనై ప్రతి పూట పల్లవించనీ

చరణాలనల్లుకొని కడతేరనీ 

నను పాడనీ వాణీ వేడనీ


1.ఎద భావనలే సుధలను చిలుకనీ

పదపదమున మధువుల నొలకనీ

పదికాలాలూ పెదవుల నది నలగనీ

మది తేలికయై మధురానుభూతి కలుగనీ


2.ఎంతగ కీర్తించినా సంతృప్తి లేదు

ఏకాగ్రతనే చూపినా నీ దయరాదు

గీతమే లేని బ్రతుకు ఊహకైన రాదు

కరుణించు మేలెంచు భరించలేనే నేనే చేదు

Friday, October 7, 2022

https://youtu.be/H7LMUBEFAXM?si=lZ3pne7DqSmzG8Fk

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శ్రీధరా శ్రీకరా శ్రీనాథా

శ్రీహరి శ్రీపతి శ్రీవేంకటాచలపతి

సంకటముల కంటకములు 

నిను చేరే బాట పొడుగునా

ఆటంకములు అగచాట్లు 

తగునా నాకడుగడుగునా

పాహిమాం పాహిమాం పరంధామా

రక్షమాం రక్షమాం తిరుమల సార్వభౌమా


1.నీ సంకల్పము ఎరుగుట బ్రహ్మతరమా

నీవిచ్చే కర్మఫలము తెలియగ శివుని వశమా

లీలాలోలా శ్రితజనపాలా కథలో ఇన్ని మలుపులా

ఆపద్భాంధవా అనాథనాథా పథమంతా గతుకులా

పాహిమాం పాహిమాం పరంధామా

రక్షమాం రక్షమాం తిరుమల సార్వభౌమా


2.అల్లంత దూరానా  అగుపించును గమ్యము

చెంతకు చేరినంత ఎండమావితో సామ్యము

ఆశానిరాశల నడుమన  నాదెంతటి దైన్యము

నువు వినా అన్యమెవరు స్వామీ నీవే శరణ్యము

పాహిమాం పాహిమాం పరంధామా

రక్షమాం రక్షమాం తిరుమల సార్వభౌమా

 

https://youtu.be/Bgx7X2JTxnY?si=Y3FU1RkN947ElLaC

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: ఆనంద భైరవి


నిర్మలమై దీపించే నీ దివ్యనేత్రాలు

వక్రదృష్టినిల దహించు అగ్నిహోత్రాలు

చంద్రికలే కురిపించే నీ లోచనాలు

మనసును శాంతపరచు లేపనాలు

చూస్తుండి పోతాను మాతానిను మైకంగా

నను నేను మరచిపోయి నీవే లోకంగా


1.నీ కనులను వర్ణింపజాలవు నా కవనాలు

మీనాలు కమలాలు తూగవే ఉపమానాలు

కరుణామృత కాంతులతో దేదీప్యమానాలు

నిను నమ్మిన భక్తులకవి ఇహపర వరదానాలు

చూస్తుండి పోతాను మాతానిను మైకంగా

నను నేను మరచిపోయి నీవే లోకంగా


2.చతుర్వేద సారమంత తల్లీ నీ నయనాలలో

సాటిరావేవీ నీ చక్షులకు చతుర్దశ భువనాలలో

మూలాధారాది చక్రోద్దీపనకవి భవ్యసాధనాలు

ఏకాగ్రత కుదురగ ఆకర్షించు నీ అవలోకనాలు

చూస్తుండి పోతాను మాతానిను మైకంగా

నను నేను మరచిపోయి నీవే లోకంగా

 

https://youtu.be/9FYpYaCfLQU?si=wnHZ-jJmSEbO5I86

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:నాటకురంజి


వైద్యనాథుడా మృత్యుంజయుడా

నువు నయం చేయలేని వ్యాధిలేదుగా

నూరేళ్ళ ఆయువీయ వింత కాదుగా

ఎందుకు మనిషి బ్రతుకు ఇంత విషాదం

చింతలు కలిగించుటేనా నీకు వినోదం

శంభోహరా శంకరా నమో గౌరీవరా అభయంకరా


1.మధుమేహాలూ మాకు రక్తపోటు పాట్లు

మనోవ్యాధులూ మరి గుండెపోటు అగచాట్లు

ఆనారోగ్యగ్రస్తులమై అడుగడుగున ఇక్కట్లు

నీకృపలేనిదే శివా ఈ గండాలు గట్టెక్కుటెట్లు

శంభోహరా శంకరా నమో గౌరీవరా అభయంకరా


2.నవనాడులపై పలు వ్యసనాల దాడులు

పండంటి జీవితాలపై రాచపుండు కైనీడలు

చిత్రమైన రోగాలతో మనుగడలో గడబిడలు

గాడితప్పి సుడుల చిక్కే విలాసీ విను మా గోడులు

శంభోహరా శంకరా నమో గౌరీవరా అభయంకరా

Saturday, October 1, 2022


https://youtu.be/4kb0UCGbPiI?si=Z5HzV4HiALMo2dFt


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:అమృత వర్షిణి


రమేశా పరమేశా తిరుమలేశా

సర్వేశా జగదీశా శ్రీ వేంకటేశా

శ్రీనివాసా చిద్విలాసా నీమీదే నాధ్యాస

గోవింద గోవింద హే పరమపురుషా


1.నిష్ఠగలవారు దీక్షావ్రతులు

వితరణశీలురు దాన కర్ణులు

భక్తులెందరో ఇల బాలాజీ నీకు

నీవేదప్ప మరి నాకెవరు దిక్కు


2. నిను మెప్పించె ధర చక్రవర్తులు

పలుమార్లు నీకొండ కొచ్చే ఆర్తులు

పూర్వ పుణ్య సంప్రాప్తిత ధన్యులు

నువు వినా నను కావరు అన్యులు


Thursday, September 29, 2022

 https://youtu.be/c30MtjUyt7Y?si=bfC99xqdq2EMUfmb


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ



జాతికి జాగృతి నా గీతం

భారత సంస్కృతి నా గీతం

ధర్మానికి ఆకృతి నా గీతం

మానవతకు ఇది సంకేతం

నవ యువత కిదే సందేశం


1.జన్మభూమిని ప్రేమించు

జననీజనకుల గౌరవించు

ఆలికి నీ అనురాగం పంచు

దీనుల ఎడ దయకురిపించు

మానవతకు ఇది సంకేతం

నవ యువత కిదే సందేశం


2.సంకుచితమును విడనాడు

ఏ వంచన చేయకు ఏనాడు

సంచిత ధనమును ఇంచుక పంచు

చేతనైన సాయమేదైనా అందించు

మానవతకు ఇది సంకేతం

నవ యువత కిదే సందేశం


https://youtu.be/644QFPEcTpg


 https://youtu.be/nY2mqBm80Es?si=5cEBJ8Uxe2An0wmn

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం: లలిత


శ్రీ లలితా విశ్వమాత త్రిగుణాత్మిక

అగణిత మహిమాన్విత శివాత్మిక

సరగున మము బ్రోవవే పురహూతిక

ప్రణుతుల ప్రణమిల్లెద ప్రభా పరాంబికా


1.మణిద్వీప సంచారిణి బ్రాహ్మిణి

అణిమాది అష్ట సిద్ధిదాయిని పద్మిని

వాణీ వేదాగ్రణి వరదా పారాయణి 

త్రిపుర సుందరీ త్రిభువనైక మోహిని


2.నీ కరుణా దృక్కులు ప్రసరించనీ

నీ అమృత వాక్కులు ఆశీర్వదించనీ

సృష్టి స్థితి లయకారిణి రాణీ శర్వాణీ

అదృష్టమె మది నిలువగ ఆత్మరూపిణి

 


https://youtu.be/ucYUBCYpGVw?si=s7hYh04moudhmZeD

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నవ్వులు పంచుతూనే ఉండు

పువ్వులు జల్లాలని ఆశించక

రవ్వలు చిమ్ముతూనె ఉండు

దివ్వెలై కవితలు భాసించనీ యిక

కవీశ్వరా భావేశ్వరా నీకిదే బహుపరాక్


1.రవి కవి ఇల ఇరువురు ఒకటే

అదురులేక బెదురులేక సాగుటే

 క్రమం తప్పని కర్మసాక్షి  మిత్రుడు 

భారతి ప్రియ పుత్రుడు కవి పవిత్రుడు

కవీశ్వరా జీవేశ్వరా నీకిదే బహుపరాక్


2.చిరుజల్లున హరివిల్లు చిత్రించు

మనో గగనానా వర్ణాలు చిందించు

ప్రచండంగ మండి నిప్పులు కురిపించు

అలిసిపోని సూర్యుడు అవని కవివర్యుడు 

కవీశ్వరా రాగేశ్వరా నీకిదే బహుపరాక్

Tuesday, September 27, 2022

 

https://youtu.be/LukIKea3APU

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఆచ్ఛాదన లేని నీ పాదాలు

అలా చూస్తూండిపోతె చాలు

నీ మంజుల మంజీర నాదాలు

ఉత్తేజ పరిచేను నా నరనరాలు


1.నీ అందాల ఆ మువ్వల పట్టీలు

నా మది నే దోచేసే జగజ్జెట్టీలు

పసిడి వన్నెలొలికే ఆ అందియలు

నా పసి మనసుకవే అప్పచ్చులు


2.నీ పదాల ఘల్ ఘల్మనే గజ్జెలు

స్వరవిరులే సరిగొన్న పూ సజ్జలు

రవ్వల జిలుగుల నీచరణ శింజినీలు

రమణీయ కమనీయ మనోరంజనీలు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కవనవనంలో విరబూసిన పూవును

వాసనలంటూ గాఢత విరజిమ్మను

వర్ణాలు విరివిగా కనులకు వెదజల్లను

రెక్కల లాలిత్యం ఏమాత్రం ఎరుగను

నేనొట్టి గడ్డిపువ్వును పేలవమైన నవ్వును


1.ఏ చేయో నను కోయగ కోమలి కొప్పున నిలవాలనీ

ఏ గాలో నను మోయగ శ్రీ రాముని చరణాల వాలనీ

మహనీయల గళసీమన మాలగానైనా అలరారాలనీ

మట్టిలో మట్టిగ వొట్టిగ నే వసివాడి కడకిక నేలరాలనీ

నేనొట్టి రాతి పువ్వును పేలవమైన నవ్వును


2. ఎన్నడూ తోటమాలి పోయనే పోయడు నీరు

దారిన వెళ్ళే దానయ్యలు సైతం నను పట్టించుకోరు

జీవశ్చవమై  నేనెవరికీ ఏ మాత్రం కొఱగాని తీరు

పేరుకే విరినై నిస్సారంగా ఆవిరినై బ్రతుకే కడతేరు

నేనొట్టి రాలు పువ్వును  పేలవమైన నవ్వును

 

https://youtu.be/e99NClYJ5క్వశ్చన్


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉంటే మూఢునిగా ఉండనివ్వు

లేదంటే తత్త్వం బోధపడనివ్వు

భోగిలా మసలుతుంటె  యోగిలా మార్చేవు

యోగిలా మనబోతే మది చంచల పరిచేవు

అటో ఇటో కానీక ఆటుపోటులెందుకిలా

అనంత పద్మనాభా ఇంతలా పరాచికాలా


1.దశావతారాలనెత్తి శ్రమించినావు

దర్పాన్విత దైత్యులనే దునుమినావు

శేష తల్పాన హాయిగ విశ్రమించినావు

నా బ్రతుకున ఒడుదుడులు రచించినావు

అటో ఇటో కానీక ఆటుపోటులెందుకిలా

అనంత పద్మనాభా ఇంతలా పరాచికాలా


2.నోరు తెరిచి అడిగానా పొందే సౌఖ్యాలని

కోరి తెచ్చుకున్నానా పొగిలే దుఃఖాలని

అవధి లేని భవజలధిన మునకలేస్తున్నాను

ముంచు దాటించు నిన్నే నమ్ముకున్నాను

అటో ఇటో కానీక ఆటుపోటులెందుకిలా

అనంత పద్మనాభా ఇంతలా పరాచికాలా


OK

Monday, September 26, 2022


https://youtu.be/lOHKuuTCmz4?si=a_i-Y0ClOwhAMTd5

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


భజరే సాయినాథమ్

చలోరె షిర్డిధామమ్

దర్శించరో సాయిరూపం

స్పర్శించరో సాయిపాదం

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి


1.అనాథగానే వచ్చినాడు

బిచ్చగాడిగా బ్రతికినాడు

పదుగురికీ ప్రేమను పంచినాడు

సేవ విలువను ఎరిగించినాడు


2.కులముమతమని తలువలేదు

జనము హితమును వదలలేదు

మంచినే బోధించినాడు

మానవత చూపించినాడు


3.పిలిచితే పలికేటి వేలుపు

కొలిచితే వేదనలు బాపు

నమ్మితే నమ్మికను నిలుపు

తప్పదెప్పుడు సాయీయన గెలుపు

 


https://youtu.be/xFkqCztYDUw?si=C-TA0Fei_4qM5CzF

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


శుభోదయం  శుభోదయం శుభోదయం

బృంద సభ్యులందరికీ శుభోదయం

కలము గళము కలగసి అలరించే

అపురూప సమ్మేళనానికి శుభోదయం

నవోదయం రసోదయం మహోదయం


1.ఉత్సాహం ఉరకలు వేయగ

చెలిమి కొమ్మల ఊయలలూగగ

రాఖీ కలమే రచనలు సేయగ

కోయిలలై పరవశమొంది కూయగ

ఉషోదయం కవనోదయం గానోదయం


2.పరస్పరం ప్రశంసిస్తూ ప్రోత్సహించగా

అనుక్షణం పరులను రంజింపజేయగా

దినదినం గాయక ప్రవర్ధమానమవగా

అనన్యమై అపూర్వమై గ్రూపు వృద్దినొందగా

హాసోదయం కులాసోదయం విలాసోదయం

 https://youtu.be/R4-PioBJyuA?si=aasn4GeiIF4RrWX-

రంగూరంగుల పూలూ గుమ్మాడమ్మ గుమ్మడి

సింగారాల అంగనలు గుమ్మాడమ్మ గుమ్మడి

బతుకమ్మ పండుగొచ్చె గుమ్మాడమ్మ గుమ్మడి

రెండుకళ్ళు చాలవింక గుమ్మాడమ్మ గుమ్మడి

తొమ్మిదినాళ్ళదీవేడ్క గుమ్మాడమ్మ గుమ్మడి

తెలంగాణ గర్వమైన పర్వమిది గుమ్మడి


1.రాచగుమ్మడి పూలు కోయాలి గుమ్మడి

తంగేడు పూలైతే తప్పని సరి గుమ్మడి

గునుగువూలకు రంగులద్దాలి గుమ్మడి

కమలాలు కలువలేరి తేవాలి గుమ్మడి

తీరొక్క పూల పోగుచేయాలి గుమ్మడి

తెలంగాణ గర్వమైన పర్వమిది గుమ్మడి



2.వరుస  వరుస పూలను పేర్చాలి గుమ్మడి

బంతులు చామంతులు చేర్చాలి గుమ్మడి

కట్లపూలూ పొందింప జేయాలి గుమ్మడి

బతుకమ్మను బహుచక్కగ దిద్దాలి గుమ్మడి

గౌరమ్మను కొసకొమ్మన నిలపాలి గుమ్మడి

తెలంగాణ గర్వమైన పర్వమిది గుమ్మడి



3.గౌరమ్మ తల్లిని కొలవాలి గుమ్మడి

బతుకమ్మ రూపుగ తలవాలి గుమ్మడి

చుట్టూరా చప్పట్లతొ తిరగాలి గుమ్మడి

పాటలెన్నొ పరవశంతొ పాడాలి గుమ్మడి

కోలాటమేసుకుంటూ ఆడాలి గుమ్మడి

తెలంగాణ గర్వమైన పర్వమిది గుమ్మడి



 

https://youtu.be/UoxLZqc9hdU?si=Nm6P4fnL2jk8uiaX

మెట్ట వేదాంతమింక మాటాడను

అద్వైత సూత్రాలు వల్లించను

కడకొసగే కైవల్యం నాకెందుకు

కడగండ్లలోనేడు ముంచుడెందుకు

గట్టెక్కించు నన్ను గరుడ వాహన

గండాలు దాటించు చక్రధారి శ్రీరమణ


1.పరుగులు పెట్టే నన్ను కుంటివాణి చేసావు

వాదనతో జయించువాణ్ణి మూగని చేసావు

అన్నపానాదులు అడగకుండ చేసావు

నా అన్నవాళ్ళకూ దుఃఖం మిగిలించావు

ఇంకా ఏం మిగిలుంది నీ కఠిన పరీక్షకు

అంతూ పంతుందా నువు వేసిన శిక్షకు


2.మెగ్గ విచ్చుకునే వేళ నిర్దయగా నలిపావు

భవష్యత్తు మూటగట్టి గంగలోన కలిపావు

ఎంతసేపు మంచిజేయ నువ్వు తలుచుకుంటే

క్షణంలోనే తెరిపికలుగు నీకు కరుణ కలిగెనంటె

దయలేదా కలివరదా స్వామీ ధన్వంతరి

నలత కలత పరిమార్చర తిరుమల శ్రీహరి

Tuesday, September 20, 2022

 

https://youtu.be/3oXu_8rVudg

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మాయా మాళవగౌళ


చింతలు దీర్చే నరసయ్యవని

ఎంతో దూరం అయినా గాని

శ్రీకాంత నీకై వచ్చే భక్తులగని

వింతనిపిస్తుంది ఇంత గురేంటని

దండాలు నీకివె నరసింహస్వామీ

ధర్మప్రభువా నీది తరగని ఎలమి


1.అంతటనీవే ఉంటావని

నమ్మి చూపాడు ప్రహ్లాదుడు

విన్నపాలనే వింటావని

విశ్వసించెను శేషప్పనాడు

దృష్టాంతరాన్ని చూపించు నాకు

స్పష్టమయ్యేనింక నా మన్సుకు


2.పట్టెనామాలు కోరమీసాలు

పెట్టి తీర్చేరు మొక్కిన మొక్కులు

చాందా నాందేడు మారాఠీలు

వచ్చేరు నిర్మల్ పట్టి వాసులు

మర్చేరేమొమా ధరంపురివారైనా

దర్శించేరు నిన్ను ఏటా ఏతీరైన

 https://youtu.be/63pFkCVBQTY?si=GISCWdQMWkM7Y4Py

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

పసితనం పసిడితనం
బాల్యమే అమూల్యం
కల్లాకపటం ఎరుగని నైజం
స్మృతులలోన సర్వదా శాశ్వతం

1.అమ్మచేతి పాలబువ్వ
నాన్న హాయి కౌగిలింత
తోబుట్టువుల తరగని మమత
నేస్తాలతొ అల్లుకున్న స్నేహలత

2.పాఠశాల అనుభూతులు
గురువుల హితబోధలు
తలకెక్కని పలు సంగతులు
తలబిరుసుకు తగు గురుతులు

3.తెలిసీ తెలియని ప్రేమలు
భవిత పట్ల కమ్మని కలలు
బ్రతుకు దెరువుకై వేటలు
బ్రతుకులోన గతుకుల బాటలు 
బ్రతుకంతా సర్దుబాటులు


Monday, September 19, 2022

https://youtu.be/N_dagFfAJVY?si=TVJwKA9INCaMcDhJ

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:షణ్ముఖ ప్రియ

భువనేశ్వరివేమొ నీవు
విశ్వేశ్వరుడే హరుడు
గొప్పెవరన్నది ఈ ఇలలో విప్పి చెప్పేదెవరు
చప్పున ప్రేమతొ మము మీలా ముప్పిరి గొనెడివారు

1.మైసమ్మ పోచమ్మ మమ్ముల కాచమ్మ
కనకదుర్గ విజయదుర్గ మా నవదుర్గమ్మా
మహాలక్ష్మి సరస్వతి మా పార్వతమ్మా
పేరుకైతె రక్షించే పేరులుగల మాయమ్మా
కడగండ్లను కన్నీటిని ఎవ్వరు ఆపేరమ్మా

2.భోలాశంకరుడు అభయంకరుడు నీ వరుడు
భక్త వశంకరుడు పాలిత కింకరుడు ఆ శంభుడు
ప్రళయకాల రుద్రుడతడు జ్వలిత ఫాలనేత్రుడు
పేరుకైతె అభయమొసగు నామధేయుడు
అనారోగ్యాలు అకాలమరణాలు ఎవరాపేరమ్మా


https://youtu.be/O_R8Z_xTYng?si=i_RjYdXNFfNZhAe6

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:దేశ్

మేలుకొలుపగలము నిదురించిన వారిని
జాగృత పరుచలేము నిద్రనటించే వారిని
ఎంత వాస్తవమైంది నేస్తం ఈ నానుడి
అక్షర సత్య మనిపిస్తుంది మదికెదురుపడి

1.బిగించుకొని ఉంటే పెదాలు విడిపించలేము
మూగనోము పాటిస్తే ఏ శబ్దాలు నినదించలేము
తీసుకెళ్ళగలిగేము గుర్రాన్ని ఏటి నీటిలో వరకే
తాగనుపో పొమ్మంటే  కళ్ళప్పగించాలి ఊరకే

2.శిలా ప్రతిమలుంటాయి ఉలుకుపలుకు లేక
ఆరోవేలన్నది ఆ దైవపు అప్రయోజన కానుక
సార్థకతే చేకూరాలి మనమంటూ ఉన్నాము కనుక
ఉన్నమాటంటే ఎందుకు ఎవరికైనా సరే కినుక


 

https://youtu.be/PZr4HDBrJJ4

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మలహరి


కంటతడి పెట్టించకు మా ఇంటి దేవుడా

సీతమ్మ బెంగను తీర్చిన హనుమంతుడా

నిన్ను మేము మరిచావో

మమ్మే నీవు విడిచావో

కుప్పలు తెప్పలుగా స్వామీ మా కెన్నో తిప్పలు

తప్పులు మన్నించి మము గాచితేనే నీ గొప్పలు


1.కొండగట్టుకైతే మేము కోరికోరి వస్తాము

అండగ ఉంటావని నిన్ను విశ్వసిస్తామ

అభిషేకము సలిపి మరీ ఆరాధిస్తాము

మా కేశఖండనములు తప్పక జరిపిస్తాము

కుప్పలు తెప్పలుగా స్వామీ మా కేల తిప్పలు

తప్పులు మన్నించి మముగాచితేనే నీ గొప్పలు


2.బలమెంతో ఎరుగని మహాబలుడవే నీవు

నిన్నే నీవు మరచిపోయే శ్రీరామ భక్తుడవు

సాక్షాత్కరించేవు స్వామీ ప్రత్యక్ష దేవుడవు

అన్యధా శరణం నాస్తి నీవె మాకు దిక్కువు

కుప్పలు తెప్పలుగా స్వామీ మా కెన్నో తిప్పలు

తప్పులు మన్నించి మముగాచితేనే నీ గొప్పలు

 

https://youtu.be/11NXjVyjz4o?si=eJFjlLtNzNpvguxS

రచన,స్వరకల్పన&గానం:డారాఖీ


గులాబీ రేకు గుచ్చుకుంటె  

గాయమౌతుంది చెలి నీకు

జాబిలే వెలవెలబోతుంది

సాటిరాక నీ మేని ఛాయకు

కచ్చ రేపుతుందినీ మిసిమి సోకు

ఇచ్ఛ పెంచుతోంది రోజురోజుకు


1.మెరిసే తారలు నీ నగవులు

వలపుల రేవులు నీ బిగువులు

కదలాడుతుంటాయి నీ వెంట నగములు

కనిపించినంతనే మనసుకి బుద్ధికి తగవులు


2.ఎదురైతే ఎదలో కల్లోలాలు

మరుగైతే మదిలో ఉప్పెనలు

లయ తప్పదు హృదయమంటె అబద్దాలు

బద్దలైపోతాయి నినుగని ఈర్ష్యతొ అద్దాలు

Sunday, September 18, 2022

https://youtu.be/WvyDQVJr3c8?si=Dz4eOC6icn7VUSTL

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రాగం:హంసధ్వని&మోహన


కడుపులో చల్లా కదలదాయే

ఒడుపుగా అడుగైన పడకపాయే

ప్రళయతాండవమాడు శివుడు ఎటుపాయే

ముక్కుమూసుక తపములో మునిపాయే

ఆడరా నటరాజా జడలను విదిలించి

ఆడరా రాజరాజ ఒడలును మెదిలించి


1.ఏడీ అలనాడు గరళమైనా మ్రింగినవాడు

ఏడీ త్రిపురాసురులను దునుమాడినా వాడు

మదనుని మసిజేసినా సదమల హరుడేడీ

గజాసురు కంజరాన గడిపిన దాసవరుడేడీ

ఆడరా నటరాజా జడలను విదిలించి

ఆడరా రాజరాజ జడతను అదిలించి


2.కాళహస్తి శ్రీలకు అభవమొసగిన ఆ భవుడేడి

మార్కండేయు మిత్తిని చిత్తొనరించిన ఉమాధవుడేడి

ఏడీ లంకేశుడికి ఆత్మలింగమే ఇచ్చిన లింగేశుడు

ఏడీ మా వంకజూసెడి ధర్మపురి శ్రీరామలింగేశుడు

ఆడరా నటరాజా జడలను విదిలించి

ఆడరా రాజరాజ మా ఎడద లయించి

https://youtu.be/MrX1YG4H-y4?si=Oll4phq1c-wVOtsK


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మాల్కోస్(హిందోళం)


కోరను స్వామీ నిను కోరికలను కలనూ

ఈడేర్చుము ఈ ఏకైక కడ వేడుకను

పడనీక నను నీ మాయల వలను 

సతతము చేయనీ  నీ పద సేవలను

తిరు వేంకటనాథ-గొనుమిదె నతులను

మరువక శ్రీనాథ నా వినతులను


1.అభీష్టములకు అంతేలేదు

ఆకాంక్షలకు మోక్షములేదు

ఇష్టములకును ఇంతని లేదు

ఈప్సితముల ఉధృతి ఆగదు

ఎప్పటికప్పుడు ఇదిచాలనుకొని

అడుగుటనాపను నినుతగులుకొని

తిరు వేంకటనాథ-గొనుమిదె నతులను

మరువక శ్రీనాథ నా వినతులను


2.వీక్షణ చక్షువు లక్షణము

శ్రవణము వీనుల తాపత్రయము

ఆఘ్రాణమె నాసిక ఉబలాటము

రసనకు రుచులకు ఆరాటము

కట్టడి సేయము  ఇంద్రియములను

ముట్టడి నాపగ  ఇహ వాసనలను

తిరు వేంకటనాథ-గొనుమిదె నతులను

మరువక శ్రీనాథ నా వినతులను

https://youtu.be/ayAwiSePh_s?si=X6uW0Qf3jusn6_gU

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:లతాంగి

తల్లడిల్లిపోయా నిన్నే తలచితలచి
తెప్పరిల్ల లేకున్నా నీధ్యాసలో మైమరచి
నిద్రచెరిపి వేస్తావే చెలీ నిర్దయ చూపించి
లెక్కనేచేయవు నన్ను పిచ్చివాడిగా ఎంచి

1.ఉబుసు పోక చేయలేదు నీతో స్నేహము
ఉత్తుత్తిది కానే కాదు నీపై అనురాగము
చెవిటిది మూగది గుడ్డిదీ నా  ప్రేమ అమరము
గాలీనీరు నిప్పునింగీ నేలలే నా ప్రేమకు సాక్ష్యము

2.గమనించవైతివే నాలోని నిజాయితి
తప్పించుక తిరిగితివే సాకులేవొ తెలిపి
కలయిక దేవుడెరుగు పలకరింప లేదు గతి
వదిలిపెట్ట నిన్నెన్నటికి నేను చేరినా చితి


Thursday, September 15, 2022

 

https://youtu.be/gi1cd8KWCPA

నేడు ఇంజనీర్స్ డే-ఇంజనీర్ మిత్రులకు శుభాకాంక్షలు


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


విశ్వకర్మ వారసులారా మీకు వందనం

మయబ్రహ్మ శిష్యులారా అభినందన చందనం

నిర్మాణరంగంలో అద్భుత కుశలత మీది

సాంకేతికతలో మీ నిపుణత ఎనలేనిది

ఇంజనీరంటే ఇలలోనే ఘనుడు

ఇంజనీరంటే విశ్వవ్యాప్త వామనుడు


1.ఇందుగలదందు లేదును సందేహమేలేదు

వైద్య వ్యవసాయ రక్షణ శాఖలందూ లేకపోలేదు

సాఫ్ట్ వేర్ అంతరిక్ష సమాచార వ్యవస్థలు ఇంజనీరింగ్ కే చెందు

మానవ జీవనం అనునిత్యం ఇంజనీరింగ్ తో సుఖములనందు

ఇంజనీరంటే ఇలలోనే ఘనుడు

ఇంజనీరంటే విశ్వవ్యాప్త వామనుడు


2.ఆకాశ హర్మ్యాలు సాగర సొరంగాలు వంతెనలు ఆనకట్టలు

అప్రతిభులగావించే  అపూర్వకట్టడాలు విభ్రమాలు

సరికొత్త రంగాలలొ సత్తా చూపే వింత ఆవిష్కరణలు

బ్రతుకే టెక్నాలజితో ముడివడి మానవ మనుగడలు

ఇంజనీరంటే ఇలలోనే ఘనుడు

ఇంజనీరంటే విశ్వవ్యాప్త వామనుడు


OK

Wednesday, September 14, 2022


https://youtu.be/TVnpvL-bG8o

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎగిరిపోయే సమయమొచ్చిందే చిలకా

కనుమరుగయ్యే కాలమేతెంచిందే ఇక

చెట్టుతోటి గట్టుతోటి పెట్టుకున్న

ముచ్చట్లకు సెలవికా

ఏటితోటి పాటతోటి అల్లుకున్న

బంధాలకు వీడ్కోలికా


1.రానే వస్తుంది  రావలసిన రోజొకటి

లోకమంత వెలుగున్నా నీకు కటిక చీకటి

చేయిదాటి పోవుటకు సరిపోతుంది తృటి

ఎంతటివారికైనా తప్పనిది ఇదే పరిపాటి


2.చక్కదిద్దుకోవాలి తెలివిగలిగి జీవితం

కూడబెట్టుకోవాలి చిటికెడైన పుణ్య ఫలం

వెంటతీసుకెళ్ళలేము ఓ తృణమూ ఫణమూ

మిగిలిపోవాలి ఇలలో మనదైన మంచితనమూ

 

https://youtu.be/bSZh6GAK5dA?si=9GVrwSdSky4WXmw6

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా మనసుకెంతటి ఆరాటం

ఈ మనిషికెందుకు ఉబలాటం

అందని వాటికోసం అర్రులు చాస్తూ

అందలేదని ఎందుకో కినుకవహిస్తూ


1.కొండకు వేసే వెంట్రుక కోసం ఆ వగపెందుకో

నింగికే నిచ్చెన వేస్తూ చేరలేదని బెంగ ఏలనో

చూసికొన్ని తృప్తి పడాలి విని సైతం నందించాలి

పుక్కిటిలో పట్టలేము కోరికల సాగరాన్ని 

అక్కునైతె చేర్చలేము ఇంద్రచాపాన్ని


2.అల్లంత దూరంలోనే చందమామ అందాలు

గాలిలో తేలివస్తేనే హాయి మొగలిరేకు గంధాలు

 శ్రావ్యమే పిక గానం మర్మం నది జన్మస్థానం

కనిపించి తీరాలా కోయిల రూపం

శోధించగ అవసరమా తీరితే దాహం


https://youtu.be/jytjkP0zDxU?si=fFS36yXrw1rWbXNz

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అర్చించనీ అనవరతం

అక్షరాల పూలతో పదముల సుమ మాలతో

పాడనీ నినుకొనియాడనీ 

నీవొసగిన గాత్రంతో  ఏకాగ్ర చిత్తంతో

భారతీ నా బ్రతుకే నీకు హారతి

మాతా సరస్వతీ నీవే శరణాగతి


1.ఏ మార్గమైనా నీ వైపే సాగనీ

ఎదలయగా నీనామం నాలో మ్రోగనీ

నా రచనలన్నీ రంజింపజేయనీ

గళమే మనోహరమై వీనుల విందవనీ

భారతీ నా బ్రతుకే నీకు హారతి

మాతా సరస్వతీ నీవే శరణాగతి


2.సాహిత్యమే ఎరుగని ఓ పామరుణ్ణి

నా కవనమంతా నీ  కరుణా కటాక్షమే

సంగీతమేమీ తెలియని లల్లాయిగాణ్ణి

ఈ స్వరకల్పనంతా నీ సేవా విశేషమే

భారతీ నా బ్రతుకే నీకు హారతి

మాతా సరస్వతీ నీవే శరణాగతి

Tuesday, September 13, 2022

 https://youtu.be/2zztuYtSUUE

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నేకన్న కలవే

నీవే నా అష్టవిధ నాయికలవే

నాకున్న కళవే

పున్నమినాటి ధవళ చంద్రకళవే

కళకళలాడే కళగా నీవే నాలో కలవుగా

కల కలమే ప్రభవించనీ నిను నా కవనకళగా


1.నా జీవన భవానివి

నే మెచ్చిన విభవానివి

మరపురాని అనుభవానివి

నా బ్రతుకున అపురూప సంభవానివి

విరివిగా లభ్యమవని బ్రహ్మకమల విరివి

తలచినంత మేనంతా వ్యాపించే ఆవిరివి


2.నా ఎదబీడుకు తొలకరివి

నా ప్రబల ప్రణయ మకరివి

తోడై ననునడిపే అభయంకరివి

సతతము సంతసము కూర్చు శ్రీకరివి

ఈ ఇలలో నాకోయిలవై గీతాలయవైతివి

శ్రావ్యగాత్ర మాధురితో నాలో లయమైతివి

 

https://youtu.be/9STIildrMFk?si=R29zPQssoL3PxMK9

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తెల్లారనీకు ఈ చీకటి రాతిరిని

భరించలేను నిజాల వెలుతురిని

పిల్లాడి నూరడించు అమ్మజోలని

మైమరచి వింటు కలల తేలనీ


1.ఏవో చిక్కులలో చిక్కుకొని

దిక్కూమొక్కేదో వెతుక్కొని

అంతుచిక్కక అభయం దక్కక

శరణంటిని స్వామీ నిను మొక్కుకొని


2.అంతులేని వింతకథలు

తల నిండా తరగని వెతలు

నిరతమూ మొలకెత్తే కవితలు

శ్రోతల ఓరిమికివె చేజోతలు


https://youtu.be/rGArfvLho5o?si=BtmbX407ZaPBPjYE

 రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హంసానంది


ఉగ్ర మహోగ్ర విగ్రహా నృసింహా

భీకరాకారా శ్రీకరా భక్తానుగ్రహా

గోదావరి నదీ తీర మా ధర్మపురీశా

ప్రహ్లాద రక్షకా శేషప్ప కవిపోషా

నమో దుష్ట సంహారా నరమృగవేషా


1.జ్వలిత రక్త నేత్రా విచలిత గాత్రా

విస్ఫులింగ వీక్షణ అరిదైత్యభీషణ

దంష్ట్రా కరాళ ముఖా వజ్రతీక్ష్ణ నఖా

స్తంభ సంభవా ప్రభో భార్గవీ వల్లభా

నమో దుష్ట సంహారా నరమృగవేషా


2.శంఖచక్ర భూషణా శరణు సంకర్షణా

అగణిత మహిమాన్వితా వందిత చరణ

త్రిగుణాతీతా త్రిజగన్మోహన నారాయణా

ఆశ్రిత వత్సల ఆగమ వర్ణిత కరుణాభరణా

నమో దుష్ట సంహారా నరమృగవేషా

Sunday, September 11, 2022


https://youtu.be/PrG9mE2h3tU?si=rKGdKn67TeM67FKI


 శ్రీరస్తు శుభమస్తు-ఆయురారోగ్యమస్తు

శుభసంకల్పమస్తు-శివసంకల్పమస్తు

సర్వేజనాః సర్వదా-సుఖినోభవంతు

అరుణాచలేశ్వరా -సిద్ధింపజేయగ నీవంతు


1.పిపీలికాది బ్రహ్మ పర్యంతం

నీ ఆనతితోనే చైతన్యవంతం

మనోబుద్ధ్యహంకార చిత్తాలు సైతం

నీ కృపతోనే సాఫల్యవంతం

అరుణాచలేశ్వరా ప్రసాదించు  ప్రశాంతం


2.తారుమారవుతాయి స్థితిగతులు

తామసులు పరిణమించి తథాగతులు

సజీవులవుతారు శివా నీ శరణాగతులు

పునీతులవుతారు వినినంత నీ వింత సంగతులు

అరుణాచలేశ్వరా మన్నించు మా వినతులు


Saturday, September 10, 2022

OK

ఎందుకోయీ నందబాల 

ఇంతటి కాఠిన్యము

వెన్ననెంతో తిన్నగాని 

నీకేల కరకు హృదయము


ఎందుకోయీ నందబాల 

ఇంతటి కాఠిన్యము

వెన్ననెంతో తిన్నగాని 

నీకేల కరకు హృదయము


యుగములు పొగిలిన నీ జాడే కనరాదు

యమునాతటి నెంత వెతికినా నీ ఆచూకేలేదు

జాగేలా చెంతకికనైనను ఏతెంచను

బాలను నను గైకొను  వేగిరముగను


ఎందుకోయీ నందబాల 

ఇంతటి కాఠిన్యము

వెన్ననెంతో తిన్నగాని 

నీకేల కరకు హృదయము


పరకాంత చింతనే లేదందువా

పరాకుచెందితివా గోవింద మాధవా

పరిపరి విధముల వేడితి పరమాత్మా

పరసౌఖ్య మందీయ భవతాపమేబాయ


ఎందుకోయీ నందబాల 

ఇంతటి కాఠిన్యము

వెన్ననెంతో తిన్నగాని 

నీకేల కరకు హృదయము

https://youtu.be/Nr6DUVzEW58


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఫలించని కలలెన్నో

నెరవేరని ఆశలెన్నో

ఎండమావులౌతున్నాయి దరిజేరుతుంటే

నీటిబుడగలౌతున్నాయి చేజిక్కించుకుంటే


1.నోటికందకుంది కంచంలో బుక్కైనా

 చేదుగా మారుతోంది అది మిఠాయి ముక్కైనా

జన్మ కుండలి లోపమే ఇది కాబోలు

అంతుబట్టని మర్మమే విధి శాపాలు


2.సమయం మించుతోంది సమకూరులోగా

గగన గండమౌతోంది కలతలా మలకమైనా

విక్రమార్కుడే నాకు ఆదర్శమవ్వాలి

భగీరథుడి తీరుగా గంగభువికి దించాలి

Thursday, September 8, 2022

 https://youtu.be/RxeYUbswQoU

వేంకటేశ నిన్నే నే శరణంటా

సంకటాలు నన్నంట రాకుండా ఏ పూట

శ్రీకాంత నీవుంటివి నా మనసంతా

చింతలు వేధించునా చిదానంద నీ చెంత

శ్రీనివాస శ్రీధరా ముకుంద మాధవా

గోవిందా వాసుదేవ విష్ణవే నమః


1.ఉన్నచోట ఉండనీయవు  ప్రశాంతంగా

ఉన్నంతలొ గడుపుకోనీయవు తృప్తికరంగా

బరిలోకి తోస్తావు బావురుమనిపిస్తావు

తీరం చేరే లోగా  నావను కుదిపేస్తావు

శ్రీనివాస శ్రీధరా ముకుంద మాధవా

గోవిందా వాసుదేవ విష్ణవే నమః


2.మార్గదర్శివే నీవై నను నడిపించు

ఆత్మబంధువీవై చేయూత నందించు

సద్గురుడవు నీవై సద్బుద్ధి కలిగించు

ఘనవైద్యుడవీవై వ్యాధులు మాన్పించు

శ్రీనివాస శ్రీధరా ముకుంద మాధవా

గోవిందా వాసుదేవ విష్ణవే నమః


Wednesday, September 7, 2022

 


https://youtu.be/A940nSrgD9c?si=49Y8oin_x1u6k3ప

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : మాయా మాళవ గౌళ


కొండలాగ మారనీ గుండెను

ఎండకు ఎండినా వానకు నానినా

ఏమాత్రం చెక్కుచెదరక

ఏవిపత్తుకూ బెదరకా

పల్లానికి పారనీ మదినదిని

వాగులు కలిసినా మలుపులు తిరిగినా

తానెదురీదకా విధినెదిరించకా


1.సంతసించు సమయాన్ని

సంక్లిష్టం చేసుకొంటు

ప్రశాంతతని ప్రతిక్షణం

రణంగా మార్చుకొంటు

కోరి కొరవితో తలగోక్కొంటూ

తప్పుల ఉప్పెనలో చిక్కుకొంటూ

వగచనేలా వాపోవనేలా


2.వ్యాపించనీ ఈ అవని

 ప్రాణవాయువులా

ఆలపించనీ ఆశించని

పికమై పరవశ గానాల

నీ ప్రవృత్తి నీదిగా నీకోసం నీవుగా 

ఆతృత చెందక అడియాసకు లొంగక

అనవరతంగా ఆనందతీరంగా

Friday, September 2, 2022

 https://youtu.be/UhAM7tGY3DM


నీ సంకీర్తన 

చేయనీ ననువేంకట రమణ

నీ పదములునా 

మది దాల్చనీ పావనచరణ

పాహి పాహి శ్రీవేంకటేశమ్

దేహి దేహి శ్రీ శ్రీనివాసమ్


1.నీ దివ్య రూపాన్ని నన్నూ దర్శించనీ

నీ సుందర మూర్తిని నన్నూ వర్ణించనీ

నీ లీలలన్నీ నను దండిగ కొనియాడనీ

నీ మహిలనే పాటగ చాటింపజేయనీ


2.నిరతము నీనామ స్మరణ జేయనీ

నీ గుణ గానాల నను మునిగి తేలనీ

మనసెపుడు నీమీద మగ్నమై చెలగనీ

నను నీలో లయమై శూన్యంగా మిగలనీ



Wednesday, August 31, 2022


https://youtu.be/xitlxchAGP8

రజతాచల వాస  రాజ రాజేశ్వరా

రజత కవచ విరాజ శ్రీ రామలింగేశ్వరా

సీతా రామచంద్ర నిర్మిత సైకత విగ్రహా

పునీతులను కావింపగ సత్వరానుగ్రహా

నమో ధర్మపురీశ్వరా కాశీ విశ్వేశ్వరా


1.గౌతమీ తట విలసిత గౌతమేశ్వరా

తూరుపు దిశ వేలుపు నీలకంఠేశ్వరా

దక్షిణాధీశ ఈశ మృత్యుంజయేశ్వరా

పశ్చిమ దిక్కున వెలసిన ఓంకారేశ్వరా

నమో ధర్మపురీశ్వరా కాశీ విశ్వేశ్వరా


2.మర్మము నెరుకపరచు నర్మదేశ్వరా

సదానందకారకా రామానందేశ్వరా

చకిత విజయదాయకా చంద్రశేఖరా

జగదంబాయుతా త్రయంబకేశ్వరా

నమో ధర్మపురీశ్వరా కాశీ విశ్వేశ్వరా


 https://youtu.be/L4IZICZLWME


విస్తారమైన వీనులు నీవి

వినాయకా వినవేమి వినతులు మావి

నిశితమైన దృక్కులు నీవి

నగజా తనయా కృపగను మము స్వామి


గుండెలోన నిలిపాము అండగ ఉంటావని

గండాలు దాటించు వక్రతుండ నమోనమామి


1.ఉండ్రాళ్ళు నీకు మేము దండిగా పెడతాము

 సంకటాలు గట్టెక్కించు సతతం సత్వరము

కడుపార పెడతాము కుడుములను

కనికరించి తొలగించు మా ఇడుములను


గుండెలోన నిలిపాము అండగ ఉంటావని

గండాలు దాటించు వక్రతుండ నమోనమామి


2.వెలగపళ్ళు పెడతాము బొజ్జనిండ నీకు

వెతలను ఎడబాపవయ్యా వేగిరమే మాకు

పాయసాన్ని ప్రియమార నీకు నివేదిస్తాము

ఆయురారోగ్యాలూ ప్రసాదించ వేడేము


గుండెలోన నిలిపాము అండగ ఉంటావని

గండాలు దాటించు వక్రతుండ నమోనమామి


https://youtu.be/UEV8LEERSvs

సంకల్పము నీ బలము 

సంకటహర గణపతి

పట్టుదలే నీతత్వము

పార్వతి సుత విఘ్నపతి

ఆత్మవిశ్వాసమే నీ ఆరాధన

అవిమాలో పెంచమని మా ప్రార్థన


1.పరమ శివుని ఎదిరించి

కరి వదనము బడసినావు

గణాధిపత్యముకై మాతా పితరుల

ప్రదక్షిణమును సలిపినావు

నీకార్యదీక్ష నీ బుద్దికుశలత

అవిమాకీయమని నీకిదె చేజోత


2.నీ వికటరూపుగని 

పకపకమనె చంద్రుడింక

శాపమిచ్చితివి శశిని గననీకుండ

చవితిన గాంచినవారల కపనింద

మంచి మనసు మానవత నీ వరాలు

అవి మాకొసగమని కోటి నమస్కారాలు