Tuesday, March 22, 2022

 

https://youtu.be/h3XpK5ECluc

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


క్రీగంట చూసినా చాలు లైలాలా

ఫీలైపోతాను నాకు నేను మజ్నూలా

ఓ పూట హా యన్నా చాలు లవ్ లీగా

సంబరాలు చేసుకుంటా హోళీలా

ఎలిజిబెత్ రాణి వేస్టే నీముందు

క్లియోపాత్రా వరెస్టే నీదే అందమందు


1.దినమానం అరుస్తున్నా వినిపించుకోవేమే

అనుక్షణం అంగలారుస్తున్నా పట్టించుకోవేమే

గొట్టంగాడెవడో నీకెందుకు చుట్టమవ్వాల

బేవార్స్ ఆ టోపీవాల నీకేల సోపతి కావాల

ఓర్చుకోలేను సూర్యుడి పోడ తాకినా సైతం

జీర్ణించుకోలేను వడగాలి సోకినా ఏమాత్రం


2.తలచుకో చాలు నన్ను జీ హుజూరని వాలుతాను

ఆజ్ఞాపించు వేలుకోసుకొమ్మని మెడత్రెంచి నే తెస్తాను

కొండంత నా ప్రేమను ఈజీగా  బలిఇస్తా

పిసరంత నీ ప్రేమను బ్రతుకంతా చవిచూస్తా

నువ్వు నాకే సొంతం -బద్నామ్ ఐనా మానే - నేనూ నా స్వార్థం

నువ్వే జీవన సాఫల్యం నీ ప్రేమే నా పరమార్థం


OK


 

https://youtu.be/kFX0nRjYcYM?si=2Ia2ziPFn99zJBPp

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


(మహాకవి శ్రీ శ్రీ గారి ప్రేరణతో)


కుంభవృష్టి కురిసినా చలించని దున్నలం

కుళ్ళి కంపుకొడుతున్న  జీవశ్చవాలం

మనదీ ఒక బ్రతుకేనా బ్రతకలేక బ్రతికేస్తూ

మనదీ ఒక మనుగడనా ఎలాగోలా గడిపేస్తూ


1.తాయిలాల కోసమే చొంగ కారుస్తూ

ఎంగిలి మెతుకులకై అంగలారుస్తూ

ఎరగా  దొరికేటి రాయితీల కోసమై

తేరగా లభించేటి కాటి కూటి కొఱకై

మనదీఒక బ్రతుకేనా అరచేతి బెల్లానికి మోచేయి నాకుతూ

మనదీ ఒక బ్రతుకేనా స్వతంత్ర భారతిలో బానిసలై మసలుతూ


2.ఓటుకొరకు మనని మనం అమ్ముకొంటూ

కులం మతం ప్రాతిపదికగ కుమ్ముకుంటూ

కుడి చేత్తో కుడిపించి ఎడం చేత్తొ లాక్కొనడమెరుగక

కుక్కిన పేనల్లే చిక్కిన చాపలల్లే ఏ మాత్రం కిక్కురుమనక

మనదీ ఒక బ్రతుకేనా శక్తున్నా చేష్టలుడుగి చేవ చచ్చి

మనదీ ఒక బ్రతుకేనా సోయున్నా సోమరులై మనసుపుచ్చి

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సగం సగం నమ్మినపుడె భ్రష్టుబట్టి పోతారు

సగం సగం నమ్మనపుడె బొక్కబోర్ల పడతారు

విశ్వాసం అంటేనే వంద శాతం

ఆస్తికతో నాస్తికతో సంపూర్తిగ నవ్మితేనే సజావు జీవితం


1.అన్యధా శరణం నాస్తియంటూ

పొందాలి సర్వస్య శరణాగతి స్వామిని వేడుకొంటూ

ఒడ్డును చేర్చే సరంగు నీవేయని 

సాగిలపడిపోవాలి సర్వం సమర్పణ చేసుకొంటూ

రాకతప్పదప్పుడు కరిరాజ వరదునికి

శాయశక్తులా నువు చేసిన ప్రయత్నానికి

నీకు చేయూతనీయడానికి

దైవం మానుషరూపేణాయని తెలపడానికి


2.చెదరని సంకల్ప బలం

మొక్కవోని ప్రయత్నం అనితరసాధ్యమైన సాధన

గెలువడమే స్థిర లక్ష్యం

ఓటమి ఒక గుణపాఠం ఏకాగ్రత విజయానికి నిచ్చెన

గమ్యమే కాదు సుమా గమనమైన రమ్యమే

కలుపుతుంది ఒక గీత గెలుపును ఓటమిని

తెలుపుతుంది బ్రతుకు విలువ

ఆత్మవిశ్వాసమే ఆనంద హేతువని

Monday, March 21, 2022

 https://youtu.be/xxpR_vD1rGc


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:మధ్యమావతి


కళ్యాణ వేంకటేశ్వరా కళ్యాణమే కూర్చరా

కళ్యాణ వేంకటేశ్వరా జగత్కళ్యాణమే కూర్చరా

కారుణ్య శ్రీనివాసుడా మాపై కనికరము జూపరా

కారుణ్య శ్రీనివాసుడా అభయకరమునందీయరా

వేంకట గిరి శ్రీహరి గోవింద మాధవ హరే మురారి

ధర్మపురిన అలరారే వేంకటపతి నమోనమో శౌరి


1.మంగమ్మను పద్మావతిని సతులుగ చేకొంటివి

రంగరంగ వైభోగముతో సేవలందుకొనుచుంటివి

మేలుకొలుపు మొదలుకొని పవళించు వేళ వరకు

విశ్రమించవు భక్తులబ్రోయుచు కూర్చోవూ చివరకు

వేంకట గిరి శ్రీహరి గోవింద మాధవ హరే మురారి

ధర్మపురిన అలరారే వేంకటపతి నమోనమో శౌరి


2.వలచి వరించినావు  శ్రీమతిగా పద్మావతిని

అప్పుచేసి సైతం అందుకొంటివి శ్రీదేవి చేతిని

నిలువుదోపిడే అడిగేవు ఋణబాధ విముక్తికోసం

దేహమే కాదు స్వామి దోచుకోవయ్య నా మానసం

వేంకట గిరి శ్రీహరి గోవింద మాధవ హరే మురారి

ధర్మపురిన అలరారే వేంకటపతి నమోనమో శౌరి

 రచన,స్వరకల్పన&గానం:  డా.రాఖీ


సొట్టబుగ్గల సొగసెంత - కళ్ళు తిప్పలేనంత

సోగకన్నుల సొబగెంత - కవులు పొగడలేనంత

పలుకులలో పదునెంత- మంత్రముగ్ధులయ్యేంత

నవ్వులలో సుధ ఎంత-మృతులు తిరిగి బ్రతికేంత

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం


1.మండుటెండలోన నీచెంతన మలయమారుతం

ఎడారిదారులందు ఎదురైతే నీవే ఆమని సంయుతం

కాళరాతిరిలో నీవే వెల్లువయ్యే పూర్ణచంద్రికా పాతం

ఆశల వెలుగుల పొడసూపేటి  తూరుపు సుప్రభాతం

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం


2. నీవున్న తావులే కమనీయ నందనవనములు

నీసన్నధిలోని క్షణాలే  రాధికాసాంత్వన సమములు

నీ కరస్పర్శ  మరిపించు మయూర పింఛ స్పృశ్యతను

నీ దర్శనమే మురిపించు చకోరి చంద్రికా సదృశ్యతను

నీస్నేహ సౌరభం ఒకవరం- చెలీ నీమనసే అనురాగ సరోవరం

https://youtu.be/cETKvC4CO0o?si=MM2J_v9iHiCjmxLw

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: రామప్రియ

నీవే నడయాడే ఒక హరివిల్లు
నీ తనువున అణువణువున హోళీ ఆనవాళ్ళు
ఆపాదమస్తకం సప్తవర్ణ ప్రస్ఫుటమౌ గాజు పట్టకం
నఖశిఖ పర్యంతం వన్నెలు మార్చే కృకలాస సదృశం

1.విరబోసిన కురులలో ఒలికే నల్లదనం
చిరునవ్వున దంతాల మెరిసే తెల్లదనం
సిగ్గులొలుక బుగ్గలలో కురిసే ఎరుపుదనం
సిరిచందన ఛాయ చిలికె నీ సంవాహనం

2.నీ చేతి గాజులలో నిగారించె హరితము
పాదాల సంరక్షగ పరిఢవిల్లె హరిద్రము
వీనుల ఊగాడే బుట్టలదోగాడే ఉదావర్ణము
నయనాల కనుపాపల ద్యోతకమౌ నీలము


Wednesday, March 16, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తలుపులు మూయగలవేమో-తలపుల చొరబడ అడ్డేది

కలవగ వాలాయించెదవేమో - కలలో కలయికెలా చెడేది

ఊపిరిలో ఊపిరినౌతా - ఎదచేసే సవ్వడినౌతా

తప్పుకోగలవా నానుండి - తప్పనిసరే నాతో నీముడి


1.మెడకు పడిన పామైనా కరవకుండునేమో

అడుగు పెడితె ముల్లైనా గుచ్చకుండునేమో

పసుపు తాడునై నీతో జతపడి పోతా

నుదుట కుంకుమనై నేనతుకు పడతా

మనసులో భావమవుతా మాటలో స్పష్టమవుతా

తప్పుకోగలవా నానుండి - తప్పనిసరే నాతో నీముడి


2.నీడైనా ఎపుడైనా నిను వీడిపోవునేమో

నీవైనా ఎన్నడైనా నీ ఆజ్ఞ మీరుదువేమో

తనువు చాలించినా నిను వదలని తోడౌతా

నువు గీచిన గీతనెపుడూ దాటని నీ దాసుడనౌతా

పెదవి మీద నవ్వునౌతా పదముల సిరిమువ్వ నౌతా

తప్పుకోగలవా నానుండి - తప్పనిసరే నాతో నీముడి

https://youtu.be/IXxykgH6H0g?si=f4pd6y0IAQxPVuDa

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

నీ సొమ్మేం జారిపోతుంది 
ఒక్కసారి నాకు నువ్వు హాయ్ చెప్పితే
నీ సోకేం కరిగిపోతుంది 
గుడ్ మార్నింగంటూ నన్ను పలకరించితే
గజ గమనా ఘనజఘనా నీకిది తగునా
లలనా  మనగలనా నిముషమైన నువు వినా

1.నా అంతట నేనుగా కుదుపాలి నిన్ను
కవితగా నిను మలచగ కదపాలి పెన్ను
పొలమారునట్లుగా తలచాలి నిన్ను ప్రతిపొద్దు
కలనెరవేరేట్లుగా దాటవేల నువ్వు ప్రతి హద్దు
గజ గమనా ఘనజఘనా నీవేలే నా మనమున
లలనా  మనగలనా నిముషమైన నువు వినా

2.గాజుముక్కలే పూలరెక్కలు నీ చూపుల కన్నా
గండశిల సైతం అతిసున్నితం నీ కరకు గుండెకన్నా
నావైపుగా ఆరాటమెంత ఉంటే ఏం ప్రయోజనం
అర్పించినా కరుణించవాయే హృదయ నీరాజనం
గజ గమనా ఘనజఘనా నువ్వే లేక నే కవినా
లలనా  మనగలనా నిముషమైన నువు వినా


https://youtu.be/7t-GYRbJO2c?si=nX5NIXPE5BzeRu6f

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : వసంత ముఖారి /బసంత ముఖారి

ఇమ్మని అడుగలేదు ఏనిధిని-ఇస్తే చాలు సాయీ విబూదిని
కోరానా షిరిడీలో నీ సన్నిధిని-తొలగిస్తే మేలు నా దీర్ఘవ్యాధిని
చాలించు ఏకాదశ సూత్ర సోదిని-పరిమార్చు చిరకాల మనాదిని
పట్టించుకోనప్పుడు సాయిబాబా మరి తిట్టించుకొనగ నువ్వు సిద్దపడు

1.గొప్పలకేం కొదవలేదు సన్యాసివైనా
ఘనతకేం తక్కువని అవధూతవైనా
నీ గురించే నీ ధ్యాస చూడవేల మా దెస
ఎందరినినో బాగు చేసావే నాపై శీతకన్ను వేసావే
పట్టించుకోనప్పుడు సాయిబాబా మరి తిట్టించుకొనగ నువ్వు సిద్దపడు

2.మహిమలంటు ఉన్నాయా నిజముగనీకు
లీలలు చూపావంటే  నమ్మశక్యమా నాకు
కనికట్టులు చేసావేమో గారడీలు చూపావేమో
వందిమాగధులతో వింతగు ప్రచారాలు నెరిపావేమో
పట్టించుకోనప్పుడు సాయిబాబా మరి తిట్టించుకొనగ నువ్వు సిద్దపడు


Tuesday, March 15, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాకి: కలడు కలండనగ నీవిక కలవో లేవో

కలనైనా కనిపించక నీవొక కలవూ కావో


ఉన్నావని స్మరించలేనులే

లేనే లేవని విస్మరించలేనులే

ఎంత సందిగ్ధమాయే నీ ఉనికి

సంశయాలె తీరవాయే ఈనాటికి

నిరూపించుకోలేకుంటే నువ్వే హుళుక్కి

స్వామీ నువ్వే హుళుక్కి


1.శిష్టరక్షకుడ వంటారు 

దుష్ట శిక్షకుడవంటారు

తారుమారాయే నేటి తార్కాణాలు

శిష్ట శిక్షకునివైనావు దుష్ట రక్షకునిగ మారావు

ఉన్నావని నిను నమ్ముకోలేను

లేనే లేవని నిర్ధారించుకోలేను


2.ఆపత్తులలో ఆదుకొందువందురు

నీ భక్తుల నీదరికి చేదుకొందువందురు

ఎటమటమైపోయే నీ లక్షణాలు

ఆపదలు కలిగిస్తావు భక్తులను బాధిస్తావు

ఉన్నావని ఎలుగెత్తిచాటను

లేనే లేవని నాస్తికుడనవ్వను

Saturday, March 12, 2022

 

https://youtu.be/FkAIDnG4HsI

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గోదారి గంగలో తానాలు

నరసిమ్మసామి దర్శనాలు

ఏటేటా జరిగే జాతరా సంబరాలు

మొక్కులుముడుపులు కోరమీసాలు పట్టెనామాలు

గోవిందా గోవిందయని ఎలుగెత్తగ భక్తులు

పిక్కటిల్లు ధరంపురిలొ  నేల అంబరాలు


1.లచ్చిందేవి నరుసయ్యల పెండ్లే కనువిందు

కోనేట్లొ తెప్పదిరుగ సామిది - షానా పసందు

డోలాలు ఊగుతుంటె పక్క చూపులే బందు

బుక్కాగులాలు బత్తెరసాల పేర్లు సామికె చెందు

గోవిందా గోవిందయని ఎలుగెత్తగ భక్తులు

పిక్కటిల్లె ధరంపురిలొ  నేల అంబరాలు


2.జోడు రథాలెక్కి కదుల నరహరి హరులు

తోకముడిచి పారిపోర కదాన  దానవ వైరులు

నలుదిక్కుల జైత్రయాత్ర సాగించి పలుమారులు

ఏకాంత సేవలో మునిగెదరు  శ్రీహరి సిరులు

గోవిందా గోవిందయని ఎలుగెత్తగ భక్తులు

పిక్కటిల్లు ధరంపురిలొ  నేల అంబరాలు

 https://youtu.be/VCQB-J8EzwE?si=0BSg9LLHJnlcu8fC

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


రవ్వలగాజులు చేతులకే రమణీయం

మువ్వల పట్టీల పాదాలే కమనీయం

నవ్వుల రతనాల మోవియే మాధుర్యం

పువ్వుల దండ వాలు జడకే సౌందర్యం

అన్నీ అమరిన నా నెచ్చెలి అందానికే అందం


1.సూర్యకాంతి మించిన మేను విణ్ణానం

చంద్రకాంతి వర్షించే కన్నుల విన్యాసం

అంగారక రంగీనే నుదుటన సిందూరం

గురుతరమై అలరారే యుగ పయోధరం

అన్నీ అమరిన నా నెచ్చెలి అందానికే అందం


2.పాంచజన్యం ప్రతిధ్వనించే కోమల గాత్రం

గాండీవాన్ని స్ఫురింప చేసే అంగ సౌష్ఠవం

సంగ్రామానికి సమాయత్తగా కుడి కురుక్షేత్రం

విజయాన్ని అందించడమే అంతస్సూత్రం

అన్నీ అమరిన నా నెచ్చెలి అందానికే అందం

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ గతానికీ భవితకూ నేనౌతా వంతెన మిత్రమా

నీ ప్రగతికి ఆశయానికీ నేనౌతా నిచ్చెన

వేలుపట్టి నడిపించే తోడును నేనౌతా నేస్తమా

వెన్నంటి ఉండేటి చేదోడు వాదోడుగ జతగూడుతా


1.అవసరాలు నెరవేర్చే అద్భుత దీపమౌత

ఆపదలందు కాచు  యోధుని రూపమౌతా

నీ వేదన తొలగించే ఉల్లాసం కలిగించే వినోదమౌతా

కడుపార తినగలిగే కమ్మదనపు అమ్మచేతి ముద్దనౌతా


2.చెలిమిభ్రమలొ త్వరపడగ చెలియలికట్ట నౌత

తుప్పల దారుల తప్పించే కూడలి దిక్సూచి నౌతా

ఆనందం కలిగించే ప్రేరేపించే ప్రశంసకు అచ్చమైన అచ్చునౌత

వికాసాన్ని అందించే మెళకువ నేర్పించే మచ్చునౌత

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సరసిజనాభ హరి పుండరీకాక్ష

ఎన్నాళ్ళు స్వామీ ఈ కఠిన పరీక్ష

సప్తగిరీశా తాళజాల నీకై ఈ ప్రతీక్ష

చాలదా నాకీ జన్మకు ఇంతటి ఘోర శిక్ష

గోవింద గోవింద పాహి ముకుందా

ఆశ్రిత భక్త పోష పావన చరణారవింద


1.ఎవరైనా సుఖించిరా నిన్ను నమ్మి అనాదిగా

సంతోషమునందిరా నిన్ను కొలిచి నిత్యవిధిగా

దశరథుడూ లక్మణుడూ మైథిలీ హనుమంతుడు

త్యాగరాజు రామదాసు అన్నమయా జయదేవుడు

బ్రతుకంతా నీ స్మృతిలో నిరంతరం నీకృతిలో

గోవింద గోవింద పాహి ముకుందా

ఆశ్రిత భక్త పోష పావన చరణారవింద


2.ఎంతటి కష్టానికైన హద్దంటూ ఉండదా

ఏ దోషానికైన ఒక పద్దంటూ ఉండదా

తండ్రివి నీవుగాక తప్పులెవరు మన్నింతురు

దండించిన తదుపరి మము అక్కునెవరు చేర్చెదరు

నడుపుమమ్ము నీగతిలో చేర్చుకో నిర్వృతిలో

గోవింద గోవింద పాహి ముకుందా

ఆశ్రిత భక్త పోష పావన చరణారవింద

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అవధులులేనిది ఏదీ లేదు విశ్వం సహా

అపారమైన  నా ప్రేమ మినహా

పరిధులు కలదే ప్రతిదీయన్నది వ్యర్థపు ఊహ

అనంతమే నా హృదయ విశాలత ఎవరెరుగరు ఈ తరహా

నీవే నాలోకమై నీవంటే మైకమై నీతోనే నాకమై నువు లేక శోకమై


1.వదలను నీచేయి వదులుకోను ఈ హాయి 

వలపులు నీతోనే పగలూ రేయి

అడుగులొ అడుగేసి ఏడడుగులు నడిచేసి

తరిస్తా బ్రతుకంతా నీతో గడిపేసి

నీవే నాలోకమై నీవంటే మైకమై నీతోనే నాకమై నువు లేక శోకమై


2.ముగ్గులోకి ననుదించి  ప్రేమనెంతొ అందించి 

నీ దాసునిజేసావే నను మురిపించి

దాటిపోను నీ గీత జవదాటను నీ మాట

ఆనందనందనమే నాకు నీవున్నచోట

నీవే నాలోకమై నీవంటే మైకమై నీతోనే నాకమై నువు లేక శోకమై

Thursday, March 10, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంతగా పొగిడేను ఇంతీ నీ ఇంతటి  అందాన్ని

దేనితో పోల్చేను సాటిలేని ఈ చినదాన్ని

కొలమానమే లేదు కొలువగ సొగసులని

ఉపమానమే లేదు ఎంచగ  బెళుకులకి

తేరుకోరెవరు  చక్కదనపు నీ నిక్కులకు

ఊరుకోరెవరు  మిక్కిలియగు నీటెక్కులకు


1.జాబిలిదే  సౌందర్యము నినుగాంచ నంతవరకు

వెన్నెలతో ఆహ్లాదము నీ హాస చంద్రిక గనుదాకా

అల్పమైన వాటిని కవులు ప్రామాణిక మనుకొన్నారు

కూపస్థ మండూకాలై భ్రమలు బడసియున్నారు

ఒక్కసారి నిను చూస్తే బిక్కమొకం వేస్తారు

సుందరాంగి నీవేనంటూ అంగలార్చుతారు


2.హిమనగాలు ఎత్తేలే నిన్నమొన్న నిన్ను చూడక

సెలయేళ్ళదే మెలికల నడక నీ హొయలు తిలకించక

మెరుపు తీగ కాంతిహీనమే అంచనాకు నువు అందాక

మంచిగంధమెంతటి వాసన నీ తనువు తావితెలిసాక

ప్రతీకేది నీకై దొరకదు ఎవరెంతగ శోధించినా

సింగారొకతి పుట్టుకరాదు పాలకడలి మధించినా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పలుకే పంచదార పాకం

కులుకే బైర్లుగమ్ము మైకం

ఏంటే నీ సోకుమాడ

ఏడనే కనగ నీజాడ

ఒక్కసారి పలుకవే ఒప్పులకుప్పా

ఒప్పుకొని తీరుతా నీ వంపుల గొప్ప


1.వద్దనబోకే నీవద్దకు వస్తుంటే

కాదనబోకే అదనుకై చూస్తుంటే

మంచిమంచివాళ్ళే మన్ను బుక్కిపోతారు

స్థాయి మరచి నీ చూపుకె బుక్కైపోతారు

మామూలు వాణ్ణి నాకు మతిపోయిందే

మైమరిచి పోయేంతగా శ్రుతి మించిందే


2.చూసీ చూడగనే పడిపోవుట మరి ఖాయం

పరిసరాలు సైతం ఔతాయి మటుమాయం

నీ వెంటబడక పోవడమే నిజమైన అన్యాయం

ముదుసలికీ వస్తుంది నినుగని యవ్వన ప్రాయం

ఫిదానై పోయా నీ పిచ్చెక్కేఅందానికి

సదా నీవే విలాసము పరమానందానికి


PIC courtesy: Sri. AAGACHARYA sir

https://youtu.be/XJexuwGMsCs?si=QEWpYvNPMFWJVJhj


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాఎదయే తిరుమల-మా మతియే తిరుపతి

కనులు మూసుకుంటె చాలు కనిపింతువు శ్రీపతి

ధ్యాస నిలిపినంత వరకు అపారమౌ మనశ్శాంతి

వేంకటనాథా అనాధనాథా శ్రీనాథా హే జగన్నాథా


1.అంధకారమే  జగతి సూర్య చంద్రులున్నా

ఏకాకులమే చుట్టూరా బంధుమిత్రులున్నా

నిత్య దరిద్రులమే తరగని సిరి సంపదలున్నా

ఒక్కగానొక్కనీవు ఆత్మజ్యోతివై వెలుగకున్నా

వేంకటనాథా అనాధనాథా శ్రీనాథా హే జగన్నాథా


2.తీర్థాల మునిగితేమి మనసున మకిలుంటే

క్షేత్రాలు తిరిగితేమి చిత్తశుద్ది లేకుంటే

పూజాపునస్కార ఫలమేమి భూతదయే లేకుంటే

తపములేక వరమిత్తువు మాలో మానవత్వముంటే

వేంకటనాథా అనాధనాథా శ్రీనాథా హే జగన్నాథా

 

https://youtu.be/VqHZdNmrKWE?si=y0hpAbO9jAutfXP_

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అరయవె సరగున  జ్ఞాన సరస్వతి

కురియవె వరముల  విద్యా భారతి

సంగీత మందీయి శ్రీ శారదామణి

నా రాత సరిజేయి నమసము శ్రీవాణి


1.పఠనము కొఱవడె దినచర్యలో

సాధన అడుగంటె ఎద రాపిడిలో

అక్షరమొకటే లక్ష్యముగా మారే

జీవిత చక్రపు కక్ష్యయే తారాడే


2.ఐహికపరమౌ మోహము మెండాయే

పరమార్థ చింతన చింతల పాలాయే

నుతుల ముఖస్తుతుల మతి బానిసాయే

సద్గతి నడుపగ సాయ మపసారమాయే

Tuesday, March 8, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అద్దానికైనా ఆతురతే నీ అందమంటే

బింబానికైనా అసూయే నీ చందమంటే

ఎన్నిహృదయాలు జారిపడినాయో నువు నడిచే దారివెంట

ఎన్ని చూపులు వెన్నంటి వెంబడించినాయో ఎరుగవంట

ఎలా కాపాడుకుంటావో నిన్ను నీవు నీరజాక్షి

ఎలా గట్టెక్కుతావో తోడవనీ చెలీ నీకు కర్మసాక్షి


1.పడిగాపులు పడతారు నీ వాలుచూపు కోసం

పిల్లిమొగ్గలేస్తారు కోరి పిసరంత దరహాసం

తహతహలాడతారు మాటకలుప

ఏ నిమిషం

చొంగకార్చుకొంటారు కలిపిస్తే అవకాశం

ఎలా కాచుకుంటావో నిన్ను నీవు నీరజాక్షి

ఎలా దాటవేస్తావో చూపిస్తూ ఒక బూచి


2.పబ్బంగడుచుటకై మునగచెట్టులెక్కిస్తారు

అరచేతిలొ స్వర్గమంటూ గారడులే చేస్తారు

గోముఖాల వ్యాఘ్రాలై  నిలువున కబళిస్తారు

దాటిస్తారని నమ్మితే  నట్టేట ముంచుతారు

ఎలా నడువగలుగుతావో కత్తిమీదే నీ నడక

నొప్పింపక నువు నొవ్వక ఇక తికమక పడక

Saturday, March 5, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పదములు చాలవు మది తెలుప

తపనలు తీరవు  నిను గనక

నా బ్రతుకు నా భవిత నీవే గనక

నను చేకొనమా ఇకనైనా కాదనక


1.విన్నపమొకటే ఆ విధికి

ప్రార్థన చేసెద దేవునికి

నీతో నిలుపగ నా ఉనికి

కలుపగ నీతో నను జతకి


2.నీవే నీవే చెలీ నాలోకం

లేదులే మరియే వ్యాపకం

నీతో ఉన్నదె నాకు నాకం

నిత్యం చేస్తా ప్రేమాభిషేకం


https://youtu.be/lzpBPNU_9OM

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఓడిపోక తప్పదు నీకు ఓ వేంకటేశ్వరా

పోటీగ నిలిచేవా గెలిచేవా జగదీశ్వరా

పెట్టుకో ఎన్నైనా కఠిమైన పరీక్షలు

తట్టుకొనగలిగెదను నీ పాదాలే నా రక్షలు


1.దేహానికే గదా నువు వేసే  శిక్షలు

భౌతికమైనవేగా ఈ ఈతిబాధలు

గాయాలు మానిపోతాయి నీ ధ్యాసలో

కష్టాలు తీరిపోతాయి  నీ నీడలో


2. కొలిమిలో కాల్చేవు తనువు మకిలిని

తపనలో మాడ్చేవు మనసు కొసరును

త్రోవలన్ని  మూసేది నీ దారి చేరుటకేగా

బంధాలు బిగించేది త్వరగా తెగుటకేగా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండెలో  పరవశం నువ్వే నువ్వే

బ్రతుకులో పరిమళం నువ్వే నువ్వే

సఫలీకృత స్వప్నం నువ్వే

ఎదురొచ్చిన స్వర్గం నువ్వే


1.నా మనసును కబ్జా చేసిన రౌడీ నువ్వే

నా తలపులనాక్రమించిన కేడీ నువ్వే

నిలువెల్లా దోచేసావు దోపిడి చేసి

మదినెత్తుక పోయావు మాయజేసి


2.ఊ అంటే బెదిరిస్తావు అలుసుగ నన్నెపుడు

ఊహూ అంటూ వారిస్తావు అలకతొ ఉన్నపుడు

తగ్గదే లేదంటూ తగవే పెడతావు

ఏదేమైనా ఎంతగానో నన్నిష్టపడతావు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అతివలకైనా మతిపోగొట్టే అంగ సౌష్ఠవం

అప్సరసలే అచ్చరువొందే అప్రమేయ సౌందర్యం

దాగుడుమూతల ఉసిగొలిపే వస్త్రధారణం

ఇంతకన్నావలసిందేమిటి దాసుల జేసే కారణం

వందలసార్లు చావొచ్చే చెలీ నీకోసం

తెగింపునిస్తుందెంతగానో నీ దరహాసం


1.తుమ్మెదనై జన్మిస్తా నీ ముంగురుల చందంగా

సీతాకోకచిలుకై పుడతా నీగులాబి చెంపల వ్రాలగ

తేటిగనైతీరుతా నీపెదవుల మకరందం  గ్రోలగ

తూనీగగా మారిపోతా సున్నితమైన నీ మేను తాకగ

వేలసార్లు పుట్టొచ్చే చెలీ నీకోసం

 పడిగాపులు పడవేస్తుంది నీ క్రీగంటి వీక్షణం


2.తమలపాకునేనౌతా నీ పాదాలతొ పోటీపడగ

తామరతూడునైపోతా నీచేతివ్రేళ్ళతొ పోలగ

మెరుపుతీగనైతే మాత్రం నీ మురిపానికి సరిపోతానా

వంపుల సొంపుల వాగునైనా తూగగలనా నీ పొంకానా

ఏలకేళ్ళు బ్రతికేస్తా చెలీ నీకోసం

నీ పంటినొక్కులు పలుకగ నాకాహ్వనం

Wednesday, March 2, 2022

 

https://youtu.be/BCH_j6tuIbs?feature=shared

అంతర్జాతీయ మహిళా దినోత్సవం(08/03/20


స్వావలంబన చేకొనుమా మహిళామణి

సాధికారత సాధించు నీవే నీవే మహారాణి

ఆర్థిక స్వేఛ్ఛ లేకపోవుటే నీకు వెనకబాటు

ఆకాశంలో సగంగ ఎదుగు వద్దంటూ వెసులుబాటు

అబలవు కాదు సబలవు నీవు పరమసత్యం గ్రహించు

శక్తిస్వరూపిణి నీవే సృష్టిలొ మనసారా విశ్వసించు


1.నిక్కచ్చిగా చదువుకొని చదువుల తల్లిగ భాసించు

తల్లి చదివితే తరతరాలు ప్రగతే యని నిరూపించు

ఉద్యోగాలూ చేయాలి ఊళ్ళను సైతం ఏలాలి

అన్ని రంగాల్లొ అభ్యున్నతినే అవలీలగ పొందాలి

అబలవు కాదు సబలవు నీవు పరమసత్యం గ్రహించు

శక్తిస్వరూపిణి నీవే సృష్టిలొ మనసారా విశ్వసించు


2.సిరిసందలకు స్త్రీయే మూలం దర్జాగా ఆర్జించు

 ఆకతాయిల ఆటలు కట్టగ వీరనారిగా విజృంభించు

ఆత్మన్యూనతను అధిగమిస్తూ నీలో ప్రతిభను దీపించు

ప్రపంచ మహిళా దినోత్సవాన మహిలో మహిళగ గర్వించు

అబలవు కాదు సబలవు నీవు పరమసత్యం గ్రహించు

శక్తిస్వరూపిణి నీవే సృష్టిలొ మనసారా విశ్వసించు

 

https://youtu.be/braTYeKZhlk


"కాలవలయం"

కాలచక్రం గిర్రున తిరిగింది

కళ్ళముందుకు మళ్ళీవచ్చింది

ప్రతి ఉగాదికంటే ఎంతో విశేషమైనదిది

అమ్మకడుపున అంకురమై నాడు నే వెలిసినది

శుభములు కూర్చుతుంది శుభకృతు ఉగాది

అరవై ఏళ్ళక్రితం ఇదే ఇదే నా ఉనికికి నాంది


1.అగ్రహారం నదీతీరం  చక్కని వాతావరణం

పచ్చని పైరులు చుట్టూ గిరులు చెక్కుచెదరని పర్యావరణం

నిర్బంధమె లేని విద్యావిధానం వీథి వాడా క్రీడా మైదానం

అమూల్యమైన బాల్యమే ఆటపాటల సన్నిధానం

సంస్కృతి సభ్యత సహితంగా సాగింది అభ్యసనం

శుభములు కూర్చింది నాడు జగతికి శుభకృతు 

శోభను మోసుకొచ్చింది ఆవెనుకే వచ్చిన శోభకృతు


2. మహానగరం గరం గరం అశాంతి వాతావరణం

వాయు శబ్ద కాలుష్యాలతొ విషతుల్య పర్యావరణం

చిత్తడి చిత్తడిగా తీవ్ర వత్తిడితో చిత్తవుతూ చిత్రంగా చిత్తం

లేనిదిలేదు మోదం మినహా యాంత్రికంగా కృతక జీవనం

కవనం గానం ఊపిరిగా మనుగడ సాగును ఆసాంతం

శుభములు తేవాలని ఉంది బ్రతుకున ఈ శుభకృతు

శోభను కలిగించాలని ఉంది వచ్చే ఏటికి శోభకృతు



https://youtu.be/m8SmhdL_XpU?si=FPxGzws0aoVk0pjs

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏకాదశి ఉపవాసమెన్నడుండగనైతి

శివరాత్రి జాగరణ నియతి చేయగనైతి

నడిచి దండిగ నీకొండ నెక్కగానైతిని

పట్టెడైనను అన్నార్తికిని పెట్టనైతిని

ఐనను నను ఆదుకో  అరుణాచలేశ్వరా

కరుణగని చేదుకో  చంద్రమౌళీశ్వరా


1.గోదారి గంగలో మేను ముంచకపోతి

దోసెడు జలమైన లింగాన పోయనైతి

పత్తిరి దళమైన శ్రద్ధగా నీ తలనపెట్టనైతి

భక్తిమీరగ హరహరా యని మ్రొక్కనైతి

ఐనను ఆదుకో నను అరుణాచలేశ్వరా

కరుణగని చేదుకో నను చంద్రమౌళీశ్వరా


2.ననుగన్న నాన్నగను చనువుగనుంటిని

అనురాగమింకను ఆశించుచుంటిని

తప్పులు నావంతు తప్పించమంటిని

గార్వము నీఎడల దూరమోర్వకుంటిని

ఐనను ఆదుకో నను అరుణాచలేశ్వరా

కరుణగని చేదుకో నను చంద్రమౌళీశ్వరా

OK

కలుసుకున్నాయి హృదయాలు గుంభనంగా

అల్లుకున్నాయి బంధాలు లతల చందంగా

నదివి నీవు కడలి నేను ఏకమైనాము సంగమంగా

పూవు నీవు తావి నేను వనమునకు మనమే అందంగా


1.నా ఉనికి కోల్పోయాను నీలోన లీనమైపోయి

మనుగడను సాగిస్తున్నాను నీకు ఆలంబననేనై

రుచీ గతి వదిలేసాను నేను నీవుగ మారిపోయి

పరిపూర్ణగ తరించినాను నీకు జతగ చేరిపోయి


2.నా పుట్టుక కొండలు గుట్టలు తోబుట్టులు ఇరుగట్టులు

మెట్టినింట అడుగెట్టినాను నీ తరగలు సంఘట్టనలు

లావణ్యం సౌందర్యం వరములు నా  సహజాతాలు

నీవు నా తోడైనప్పుడు గుప్పుమనెను గుభాళింపులు

Tuesday, March 1, 2022


https://youtu.be/CdEzKhWnHYw?si=CctAaIqz76QPVyxf

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శివశంకరా అభయంకరా

గిరిజామనోహరా హరా హరహరా

గంగాధరా సుందరా చర్మాంబరధరా

ఈశ్వరా పరమేశ్వరా శ్రీరాజ రాజేశ్వరా

ప్రణతోస్మి ఝర్ఝరీ ధన్యోస్మి దూర్జటీ


1.చెప్పలేనంత ఆకలీ ఉపవాసమెలా సాగాలీ

పగలే నిద్ర ముంచుకొస్తే జాగారమెలా చేయాలి

శివరాత్రి  వ్రతమే తీవ్రతరమాయే కదా కపాలి

నీ ఆనతిలేనిదే పరిపూర్తి సాధ్యమా ఇందుమౌళి

ప్రణతోస్మి ఝర్ఝరీ ధన్యోస్మి దూర్జటీ


2.గుడికైన వెళ్ళనైతిని నా గుండెలోనె ఉన్నావని

కోరికలేవీ కోరనైతిని నా అక్కఱలన్నీ ఎరిగేవని

ప్రతిశ్వాస నీధ్యాసగ నిరంతరం నీ ఉపవాసమే

నా ఎదలయ నీ స్మరణగ అనవరతం జాగారమే

ప్రణతోస్మి ఝర్ఝరీ ధన్యోస్మి దూర్జటీ

Monday, February 28, 2022

 

https://youtu.be/YvcA0SXTWnI?si=tYhHb3ObHfzpaPMU

రచన,స్వరకల్పన&గానం:డారాఖీ


*మహాశివరాత్రి-2022 శుభాకాంక్షలు*

రాగం:తోడి

ప్రణవనాద ప్రాభవా పరమేశ్వరా

పరంజ్యోతి స్వరూపా ప్రభాకరా

మహాలింగ విగ్రహా మహేశ్వరా

శాశ్వత శివదాయక శంభోహర శంకరా


1.సోమనాథ సంస్థిత సోమేశ్వరా

శ్రీశైల శిఖరాగ్ర గృహ శ్రీ మల్లీశ్వరా

ఉజ్జయినీ నగరేశ్వర  మహాకాళేశ్వరా

ఓంకార పురీశ్వరా అమరేశ్వరా


2.చితాభూమి స్థావరా వైద్యనాథా

ఢాకిన్య స్థిరా నమో భీమశంకరా

సాగర తీరాగారా శ్రీ రామనాథా

దారుకావన స్థితా నమో నాగనాథా


3.వారణాసి వాసా విశ్వేశ్వరా

గౌతమీతట నివాసా త్రయంబకేశ్వరా

హిమశిఖర విలాసా హే కేదారీశ్వరా

ఎల్లోరా ఘృష్ణేశ్వరా శ్రీ రాజరాజేశ్వరా

 

https://youtu.be/PhqGpQvsGxg?si=jVPvzPtKJbc0AK3-

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


హర హర హర నమః పార్వతీపతయే నమః

శివ శివ శివ శంభో మహాదేవాయ నమః

కాలకాలాయనమః ఫాలనేత్రాయనమః

రుద్రాయనమః భద్రాయనమః 

మహాలింగరూపాయ నమః గంగాధరాయనమః

రాజరాజేశ్వరాయనమః రామలింగేశ్వరాయనమః


1.నీల కంఠాయ నమః శూలహస్తాయ నమః

దిగంబరాయ నమః త్రయంబకాయ నమః

భూత నాథాయ నమః ప్రమధనాథాయ నమః

శంకరాయ నమః శశి శేఖరాయ నమః

నగధర సన్నుత నమః పన్నగ శోభిత నమః

రాజరాజేశ్వరాయనమః రామలింగేశ్వరాయనమః


2.భస్మధరాయనమః పురంధరాయనమః

జటాధరాయనమః మహానటాయ నమః

మృత్యుంజయాయ నమః నృత్య ప్రియాయ నమః

వృష వాహనాయ నమః శ్రీ వైద్యనాథాయ నమః

రాజరాజేశ్వరాయనమః రామలింగేశ్వరాయనమః

 

https://youtu.be/VEplLsvioEs?si=kEnGKNp67nFaYdnF

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ



రాగం:మోహన

అగ్గేమో ఎగసేను నీ కంటిగుండా

బుగ్గేమో పూసేవు నీ ఒంటినిండా

నీటి బుగ్గేమో నెత్తినుండి జారుతుండ

ఎలుగు బుగ్గేమో తలన ఎలుగుతుండ

చెప్పనలవిగాదు శంకరా నీకుండె సింగారమింకరా

మాతప్పులెంచకింకరా చప్పున ఇప్పుడె మా వంక రా


1.సంపేటి ఇసమేమో బొండిగనుండ

కాటేసె పామేమో నీ మెడలొ దండ

ఏనుగు తోలే నీకు కట్టే బట్టగనుండ

బుడబుక్క తిప్పేటి సప్పుడెప్పుడుండ

చెప్పనలవిగాదు శంకరా  నీకున్న గొప్పలింకరా

మాతప్పులెంచకింకరా చప్పున ఇప్పుడె మా వంక రా


2ఎద్దునెక్కినువ్వు తిరుగుతుండ 

ఇంటింటి బిచ్చంతొ నీకడుపునిండ

వల్లకాట్లోనే నీదైన కొలువుండ 

నీ ఇల్లుపట్టేమో ఆ ఎండికొండ

చెప్పనలవిగాదు శంకరా సన్యాసి నీ వాసినింకరా

మాతప్పులెంచకింకరా చప్పున ఇప్పుడె మా వంక రా

 

https://youtu.be/z6UgpVAjaXM?si=uRz_HidvkbJfTNg6

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కైలాసము నాకేల కైవల్యము నాకేల

కథలలో వినగనేల పరమశివా నీ లీల

ఉన్నట్టో లేనట్టో గమ్మునుంటె తెలియుటెలా

కదులు మెదులు ఎదలొ నీవె మా జీవ లయలా

కరుణామయుడవనే పేరుంటే అదిచాలా

కనికరించి దయకురియగ ఇంకా ఈ జాగేలా


1.పురాణాలు కావ్యాల ఎన్ని తార్కాణాలు

హరికథలు స్థలగాథల ఎన్ని నీ  నిదర్శనాలు

అంతటా లింగాలు అడుగడుగున నీ గుళ్ళు

నామమాత్రమే  కదా వెత దీర్చని దేవుళ్ళు

కరుణామయుడవనే పేరుంటే అదిచాలా

కనికరించి దయకురియగ ఇంకా ఈ జాగేలా


2.ప్రదోషకాల వ్రతాలు సంతతాభిషేకాలు

శివరాత్రి ఉపాసాలు జాగార ఉపాసనలు

హరహరమహాదేవ శంభోయను నినాదాలు

ఇవేకదా సదా శివా  మేమేరిగిన వేదాలు

కరుణామయుడవనే పేరుంటే అదిచాలా

కనికరించి దయకురియగ ఇంకా ఈ జాగేలా


డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

మొబైల్:9849693324P

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మది బృందావని కెంతగా ఎదురుతెన్నులు

మనమను యమునకు కాయలుకాచెను కన్నులు

కన్నయ్యా నీ హృదయమే వెన్నయ్యా

కనికరముతొ కని అరుదెంచగ నీకింతటి జాగేలయ్యా


1.ఆరాధనే అగుపించదా నేచేసే ఆరాధనలో

ఆ మీరా స్ఫురించదా నేసమర్పించే నివేదనలో

అనాథనైతిని నేను నను చేరదీయరా శ్రీనాథా

అక్కునజేర్చుకోవేరా ఆలకించి నా దీనగాథ


2.తీర్చావుగా పదహారు వేల గోపికల కోరికల

నెరవేర్చవేలనయా వారిలా నేకన్న తీపి కల

చోటులేకపోతెమానె కాసింతైనా నీ ఎడదన

కడతేరనీయి కన్నయ్యా నీ పదముల కడనైనా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


భారతీయులం మేము లౌకికవాదులం

కులమతాల ఆజ్యంలో రగిలే మంటలం

జాతీయత వలసిన చోట మతాల మతలబులం

హైందవమంటూ కలవని కులాల కంపులం

భిన్నత్వంలో ఏకత్వంగా మెలిగే పౌరులం

సమైక్యభారత సౌభ్రాతృత్వ వారసులం


1.మతం మనసు దాటనేల నమ్మిందే దైవం

తరచిచూస్తె అన్నిమతాల్లో ఏకైక భావం

సాటి మనిషి సంతోషానికి కాస్తైనా సాయపడు

చేతనైంది ఇసుమంతైనా  చేయగ ముందుండు

పరులు వైరులను సూత్రాలేవి ప్రతిపాదించకు

అభిమతమే ముఖ్యంకదా విద్వేషాలందించకు


2.గడపదాటితే ఏ కులమైనా ఎడదన వ్యాకులమే

వృత్తుల వల్ల వృద్ధిచెందితేం కులాలు కోరే కాకులమే

పుట్టిన జాతికి చేసే పనికి పొంతన లేని లోకులమే

వచ్చినప్పుడు పోయేనాడు ఎవ్వరమైనా ఏకాకులమే

విశ్వమానవ .కళ్యాణానికి తలా ఓ చేయి వేయాలి

వసుధైక కుటుంబమంటే ఏంటో తెలియజేయాలి


3.ఉనికి కోసం ఉచితానుచితం అసలో ఆలోచించం

పదవిని పొందే పందెంలో ఎంతకైనా ఎపుడూ సిద్ధం

సమాఖ్య  సాకుగ మాటల బాకుతొ మా యుద్ధం

రాజకీయ చదరంగంలో రౌతు జిత్తులే పద్మవ్యూహం

సమగ్ర భారత సార్వభౌమ భావనే మా ప్రాధమ్యం

ఝండా ఊంఛా రహే హమారా ఇది సత్యం తథ్యం

Tuesday, February 22, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మోమున జాబిలి అందం 

మోవిన జాలువారు మకరందం

నా జీవన నందనవనిలో 

నీవే చెలీ కమ్మని చందన గంధం


1.శ్వేత చేల సుందరి

దివ్య స్వర్ణ మంజరి

నా కలమున ప్రవహించే జీవఝరి

సరస గీత మాధురి

సకల జన మనోహరి

నా గళమున ఉరకలిడే సుధా లాహిరి


2.నీ నామ జపమే సతతం

నీ రూపు వలపునకూతం

నీ చూపే నాలో మరులకు సుప్రభాతం

నీ తనువే కిసలయ చూతం

నీ నవ్వే  ఆమని పిక గీతం

నిలువెల్లా చెలీ నీవే గణిత నిర్మితం

నడవడి నేర్పని బడి ఎందులకు

బ్రతుకు తెరువు గరపని చదువెందులకు

క్రీడాస్పూర్తి కొరవడిన స్పర్ధ వ్యర్థమే కదా

మానవతను వికసింపజేయని విద్యయే వృధా


1.అరకొర చదువులు ఎందుకట బట్టీ పట్టే పాఠాలు కాబట్టి

గాడిద మోతలెందుకట తూకం తోటే జ్ఞానం అనుకోబట్టి

చదువుకొనే లోకంలో చదువుకుంటె లౌక్యమబ్బేనా

మార్కులకోసం విక్రమార్కులైతే తెలివిక మబ్బేనా


2.ఆటలు పాటలకలవేకాని పాఠశాల ఒక బంధీఖానా

చదువుతొ బాటుగ సంస్కారానికి లేనేలేదు ఠికానా

విలువల విలువను ఎరుగుట లేదుగ ఈ జమానా

తమతో తామే తలపడినప్పటి  గెలుపే ఓ నజరానా


Sunday, February 20, 2022

అసూయకలగనీ నాలో నీ ఉన్నతినేగని

పదేపదే నే కలగనీ పొందనీ నీకున్న ప్రతిభని

నీ భావాల పాదాలకు మువ్వల పట్టీనై నను చెలగనీ

నీ మంజుల వర్ణాలకు శబ్దాల లయనై నను మెలగనీ


1.రమ్యమైన నా గమ్యం నీకీర్తి శిఖరమై

అనన్యమైన నీ ధ్యానం జనవశీకర కరమై

దృక్పథాన్ని విశ్వమంత విస్తృత పరచనీ

మనోరథాన్ని విశాలమైన సరళపథము చేర్చనీ


2.శిష్యులే సద్గురువుకు మార్గదర్శులైన వేళ

గురువు మదే ఊగదా సదానంద డోలికల

నీ గెలుపే నాదిగా అనాదిగా అలవాటే కదా

నీ నుదుటన ఒదగదా సిందూరమై నా ఎద 



ప్రియురాలా ప్రియురాలా నీవేలే నా తీయని కల

ప్రియురాలా ప్రియురాలా  నీవేలే నా తీరని కల

రేయి పగలు నీ తలపుల్లో ఎప్పుడు చూడు నీ ఊహల్లో

ఏడడుగులు వేస్తానే నే తోడొస్తానే 

ఏడేడు జన్మాలు నీతోనే నీతోనే


1.తూచే తూనికలేవీ లేవీ లోకంలో నా ప్రేమను

వివరించే పదములు సైతం కరువేలే నా ప్రేమను

మనసు కనులతో తరచిచూడు నా ప్రేమ సాంద్రత

వలపు భాషతొ చదివి చూడు నాదైన  ప్రేమ కవిత

తోటలోకొస్తావా నీకు నీటు బాటలేస్తా

నీ చేయినందిస్తావా  బ్రతుకు నీకు రాసిస్తా


2.నిన్ను చూస్తె ఒళ్ళంతా తకధిమితక నాట్యాలే

చేరువగా నీవుంటే గుండె నిండా సరాగాలే

ఎరుక పరచు సమ్మతిని బంధమనే బహుమతిని

కాదు కూడదన్నావంటే తప్పదింక చేరక చితిని

చిరునవ్వే వరముగ ఇస్తే చిరకాలం నే జీవిస్తా

మూడు ముళ్ళు వేయనిస్తే నీవాడిగ తరియిస్తా



Friday, February 18, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ముందేంది వెనకేంది అందానికి హద్దేంది

ఎత్తేంది కురచేంది కొలతలకొక పద్దేంది

ముద్దే కదా ముగ్ధ మురిపెము అనాదిగా

తనివే తీరునా ఎంతగ చూసినా ఎగాదిగా


1.వర్ణించారు కవులందరు అతివను ఆపాదమస్తకం

అధ్యయనమెంతచేసినా పడతే ఒడవని పుస్తకం

కురులైనా కుచములైనా పెదాలు పాదాలు సైతమైనా

ఉత్తేజమే గొలుపుతాయి చిత్తాలనే లాగుతాయి


2.రాసిచ్చారు రాజ్యాలైనా  ఘన సార్వభౌములు

మానొచ్చారు తపములనైనా మహా మహా మునులు

ఇంద్రులైనా చంద్రులైనా సాక్షాత్తూ ఆ త్రిమూర్తులైనా

దార్తిగొన్నారు తెఱగునకు దాసోహమన్నారు తరుణులకు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్నదగినవెన్నెన్నో చేయగలుగు దానాలు

చేయిసాచనేల ఒరులు వదిలి అభిమానాలు

అతి ముఖ్యమైనది మన నేత్రదానం

అత్యవసరమైనదెపుడు రక్తదానం

దానాలెన్ని ఉన్నా సులభమైనదొకటే దానం

అన్నదాతా సుఖీభవా అను దీవెన పొందే దానం

అన్నిదానాలకెల్లా మిన్ననే అన్నదానం

 ఇక చాలనిపించి తృప్తి నిచ్చే అన్నదానం


1.ధనిక పేద భేదమేది ఉండబోదు ఆకలి బాధకు

కులమతాల తేడా ఉండదు కడుపు కాలు వేళకు

దొరికిన దేదైనా సరే పరమాన్నమె నకనకలాడే పొట్టకు

అన్నం పరబ్రహ్మ రూపంగా కానవచ్చు కట్టెదుటకు

అన్నదాతా సుఖీభవా అను దీవెన పొందే దానం

అన్నిదానాలకెల్లా మిన్ననే అన్నదానం


2.పదో పరకో ఇవ్వజూస్తే వందలు వేల మీద ఆశ

సువర్ణము మణుల నొసగినా మరలదు ఆ ధ్యాస

దశదానాదులెన్ని చేసినా అంతకు మించినదాని నస

పట్టెడన్నం పెడుతున్నప్పుడు అన్నదాతలో దైవాంశ

దానాలెన్ని ఉన్నా సులభమైనదొకటే దానం

 ఇక చాలనిపించి తృప్తి నిచ్చే అన్నదానం

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:కళావతి


అరుణిమలొలుకుతాయి నీ అరచేతులు గులాబి పూలై

గుభాళిస్తాయి నీ చేతులు కమ్మగ మత్తిడు విరితావులై

ఏనాడు చెలి సంకటాల కంటకాలు నువు తొలగిస్తావో

బంగారు భవితకు చెదరని నమ్మిక తనలో చివురింపజేస్తావో


1.కళ్ళెదుట నిలుస్తాయి కన్న కలలన్ని కనుపాపగ తనని కాచుకుంటే

వెన్నెలలు కురుస్తాయి నెలలో రాత్రులన్ని తన పెదాలు నవ్వులొలుకుతుంటే

పురివిప్పును నెమలే చిన్న మెప్పుకే తన మేన పరవశమొందగా

పోటెత్తును కడలే మాట గుచ్చితే తన కంటినుండి నీరు చిందగా


2.కంబళి కంటే వెచ్చనిహాయే పదిలంగా అర్ధాంగిగ పొదువుకుంటే

వ్యాహళి వంటి స్వాదనమగును పదపదము తనతో కదలుతుంటే

తలపించును తనతో గడిపే ప్రతి క్షణము స్వర్గ సౌఖ్యంగా

మురిపించును మరులొలుకగ ప్రియుడే తన ఏకైక లోకంగా

https://youtu.be/terH4YVzP7M?si=vFksS8m2bS52E0UO

నువ్వంటే కాదు అభిమానం

నువ్వంటే కాదు అనురాగం

నువ్వంటే కాదు ప్రణయం

నువ్వంటే కాదు హృదయం

నువ్వంటే కాదు దేహం

నువ్వంటే కాదు ప్రాణం

నువ్వంటేనే జీవితం

నువ్వుంటేనే జీవితం

నా చెలీ సఖీ ప్రేయసీ

నా సఖా ప్రియా ప్రియతమా


1.నువ్వంటే కాదు స్నేహం

నువ్వంటే కాదు మోహం

నువ్వంటే కాదు  ఇష్ట దైవం

నువ్వంటే కాదు ప్రేమభావం

నువ్వంటే కాదు స్వప్నం

నువ్వంటే కాదు స్వర్గం

నువ్వంటేనే జీవితం

నువ్వుంటేనే జీవితం

నా చెలీ సఖీ ప్రేయసీ

నా సఖా ప్రియా ప్రియతమా


2.నువ్వంటే నా మానసం

నేనంటూ ఉన్నదె నీకోసం

నువ్వంటే ఆకసం

నీవెంటే ఆశయం

నువ్వే నా లక్ష్యము

నువ్వే నా మోక్షము

నువ్వంటేనే జీవితం

నువ్వుంటేనే జీవితం

నా చెలీ సఖీ ప్రేయసీ

నా సఖా ప్రియా ప్రియతమా

OK

Friday, February 11, 2022


https://youtu.be/zW5Z4Sovi6E


 పడగ ఎత్తిన నాగు మెడకు సొబగాయే

నడుమున ఏనుగు తోలు వలువాయే

షష్టి చందుర వంక సిగన నగతీరాయే

నెత్తినెత్తిన గంగ నీకెంతొ ప్రియమాయే

మస్తు మస్తుగున్నవు మా రాజరాజేశ్వర

వస్తిమి వేములాడ భక్తితో శ్రీ రాజరాజేశ్వర


1.ధర్మగుండంలో నిండ మునకలేస్తాము

బిరబిర నీకడకు తరలి వస్తాము

కొబ్బరికాయలు కొట్టి నిన్ను మొక్కేమూ

పత్రి పూలు పెట్టి నీ పూజ చేసేము

మస్తు మస్తుగున్నవు మా రాజరాజేశ్వర

వస్తిమి వేములాడ భక్తితో శ్రీ రాజరాజేశ్వర


2.రోజంతా శివరాత్రి ఉపాసముంటాము

రేయంతా నిదురోక జాగారముంటాము

ఊరంతా గుడికాడ వండుకొని తింటాము

భక్తులందరికి అన్నదానాలు చేస్తాము

మస్తు మస్తుగున్నవు మా రాజరాజేశ్వర

వస్తిమి వేములాడ భక్తితో శ్రీ రాజరాజేశ్వర



3..పార్వతమ్మతొ జరుగు నీ పెండ్లి చూసేము

అరదమెక్కించి మిమ్ము ఊరంతా తిప్పేము

శివరాత్రి జాతరల సిత్తమంతా నువ్వేలే

మూడు రోజుల పాటు ఆనందాలూ నవ్వులే

మస్తు మస్తుగున్నవు మా రాజరాజేశ్వర

వస్తిమి వేములాడ భక్తితో శ్రీ రాజరాజేశ్వర

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్ని పాటలు కట్టను

నన్నిలా చూపుతో కట్టిపడవేస్తుంటే

ఎంతగా చూస్తుండి పోను

అందాల రూపుతో ఆకట్టుకొంటుంటే

తట్టుకోలేను నేనొట్టి నరుడను

పట్టుబడతాను నేనుత్తి పామరుడను


1.మరుడైన ఆగునా నీ తేజస్సుకు

హరుడైనా వేగునా నీతో రహస్సుకు

ఇంద్రాది దేవతలు నీకు పరిచారకులు

తాపసులు మునులు నీకు నిజదాసులు

తట్టుకోలేను నేనొట్టి నరుడను

పట్టుబడతాను నేనుత్తి పామరుడను


2.చక్షువులు రెండైన సరిపోవునా నినుగన

ఒక్కనాలుక అలసిపోయేను నిన్నుగ్గడించ

మనసునే చేసేను నీకు అంకితము

జీవితమునిచ్చేను నీకు నైవేద్యము

తట్టుకోలేను నేనొట్టి నరుడను

పట్టుబడతాను నేనుత్తి పామరుడను

Tuesday, February 8, 2022

రథ సప్తమి శుభాకాంక్షలు 

https://youtu.be/j2-GG8dFazI?si=4n4WuCuy0l_QR2E-

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఉదయ రవి చంద్రిక


ఉదయాద్రి మీయమ్మ గర్భాన ఆవిర్భవించి

ఉషఃశ్రీ నీ తోబుట్టుతో చెట్ట పట్టాలు చేబట్టి

గోదారిగంగలో మునకలేసి తానాలు చేసి  

చెట్లంట పుట్లంట వరిచేలు గట్లంట ఆటలాడి

పుడమితో మైత్రి సలిపెడి మిత్రుడా పవిత్రుడా వందనం

లోకులెల్లరికి నిజ బాంధవుడవైన భాస్కరా నమస్కారం


1.ప్రాణవాయువు నొసగు ప్రాణదాతవు నీవు

చీకటులు పరిమార్చు కాంతి రూపుడవు

నీటి వలయ చలన నిత్య నిర్ణేతవు నీవు

గ్రహగతుల క్రమతకు కేంద్ర బిందువువు

పుడమితో మైత్రి సలిపెడి మిత్రుడా పవిత్రుడా వందనం

లోకులెల్లరికి నిజ బాంధవుడవైన భాస్కరా నమస్కారం


2.అవిరళ ప్రజ్వలిత  శక్తి స్వరూపుడవు

అనంతానంత కాలాల సాక్షీభూతుడవు

కులాతీత మతాతీత మానవతా నేతవు

విశాల విశ్వసీమ నరజాతి విలాసమీవు

పుడమితో మైత్రి సలిపెడి మిత్రుడా పవిత్రుడా వందనం

లోకులెల్లరికి నిజ బాంధవుడవైన భాస్కరా నమస్కారం

Monday, February 7, 2022

 

https://youtu.be/AC1VidGdyWM

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా జతగా దేవతగా భావించడమే ప్రేమ

నా కనులే నీ అంద చందాలకు చిరునామా

నా ప్రణయ సామ్రాజ్యాన సామ్రాజ్ఞిగ నిను నిలిపా

నా అనురాగ మందిరానా త్రిపుర సుందరిగా కొలిచా


1.నీలో కలవని నీకే తెలియనీ గుప్తనిధులు వెలితీసా

మెరుగుల నెరుగనీ నీ వన్నెల కెన్నో నగిషీలు చెక్కేసా

లలిత లావణ్య మొలుకు కులుకుల నెన్నో తెలియగజేసా

మరులను సంధించెడి విరి శరముల నెరుక కలుగజేసా


2.రాయిలాగ ఉన్న నిన్ను రమణీయ శిల్పంగా చెక్కా

రామప్ప గుడిలోనినాగినికే నిను నకలుగ మలిచా

పదేపదే ప్రస్తుతించి నీమేని  ప్రాజ్ఞతను ఇనుమడించా

నీకోసమె నేను ఉన్నది అన్న గట్టి నమ్మకాన్ని కలిగించా

https://youtu.be/lfda48w-CD8


మనకోసమే ఉన్నదీ  లోకమంతా

మన చెంతకే చేరవు శోకమూ చింత

నాకు నీవే సాంత్వన నీకు నేనాలంబన

కనుపాపగ నిన్నే నే చూసుకుంటా

కనురెప్పగ నిన్నే నే కాచుకుంటా

ప్రియతమా ప్రియతమా నా హృదయమా

ప్రణయమా ప్రణయమా నా ప్రాణమా


1.నీ వలపుల వాకిలికి నే తొలిపొద్దునౌతా

నీ కౌగిలి లోగిలిలో ముత్యాల ముగ్గునౌతా

గులాబీ పువ్వువే నువ్వు ప్రేమైక జీవనాన

గుభాళింపువే నువ్వు అనురాగ భువనాన

ప్రియతమా ప్రియతమా నా హృదయమా

ప్రణయమా ప్రణయమా నా ప్రాణమా


2. మనసెరిగిన వాడినై నిన్నేలుకుంటా

మరుజన్మకైనా నిన్నే నే కోరుకుంటా

అంకితమైపోతా అనుబంధం పెనవేయగా

అర్పించుకుంటా నన్నే నీలో లయమవగా

ప్రియతమా ప్రియతమా నా హృదయమా

ప్రణయమా ప్రణయమా నా ప్రాణమా




 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీరాజనాలు చెలీ నీ రాజసానికి

జోహారులే సఖీ నీ సోయగానికి

ఒకరే పుడతారు నీలాంటి అందగత్తె యుగానికి

ఒకరే ఉంటారు నీవంటి సొగసుకత్తె జగానికి

ఎంతటి అదృష్టమో నాపాలబడ్డావు

ఏ పూర్వపుణ్యమో నా పరమైనావు


1.నీకాలిగోటికి సరితూగరు ముదిరలైనా

నీతోటి పోటీకి నిలవలేరు అప్సరలైనా

వంపులు సొంపులు నిలువెల్లా నీ సొంతం

వన్నెలు చిన్నెలెన్నొ నీ పాదాక్రాంతం

ఒక్కసారి నిను చూస్తే నీకు ఫిదాలవుతారు

తాకడమే జరిగిందా బానిసలైపోతారు


2.నీ బిగి కౌగిలింతే కైవల్యప్రాప్తియంటె

నీపొందు పొందుటే అమరసౌఖ్యమంటె

నీ కోసం ఎంతకైన తెగించగలుగుతారు

నీవడిగితె ఏదైనా త్యజించగలుగుతారు

విరమిస్తా బ్రతుకు  రమించు వరమిస్తే

పడిఉంటా పదములకడ నీవాడినవనిస్తే

Monday, January 31, 2022

 

https://youtu.be/urzUZefJvC4

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:చారుకేశి


నీ పంచన చేరాయి పంచభూతాలు

నిన్నే శరణు వేడాయి మూడు లోకాలు

నిగ్రహించవేలర- నా పంచేంద్రియాలు

ఏకాగ్రత కుదరనీ -తలవగ నీ నామాలు

ఓం నమః శివాయ ఓం నమః శివాయ


1.నడుము నొప్పి నశించనీ- అడుగిడ నీ గుడికి

నడువగ శక్తీనీయి -ఎక్కుటకై నా కాళ్ళు నీ గిరికి

తిమ్మిరులే తొలగని తుంటికి-  చేరగ నీ దరికి

ఏ నలతను కలగనీకు హరా -ధరణిలో ఎవరికి

ఓం నమః శివాయ ఓం నమః శివాయ


2.వత్తిడులూ దూరమవని - చిత్తాన నిను నిలుపగ

వ్యాపకమే నీవవనీ -మదికి ముదము కలుగగ

ప్రతి పలుకుకు ముందువెనక -నీ పేరే పలుకనీ

త్రికరణ శుద్ధిగా నా చర్యల -మానవతే ఒలుకనీ

ఓం నమః శివాయ ఓం నమః శివాయ

Saturday, January 29, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఖరహరప్రియ


తడబడుతున్నాయి నాకు పదములు

కొఱవడుతున్నాయి ప్రభూ ముదములు

భక్తి విశ్వాసాలే సన్నగిల్లినాయా స్వామి

అరిషడ్వర్గాలే మితిమీరినాయా ఏమి

ఏడుకొండలవాడా జాలి గుండెగల రేడా

మన్నించు తప్పిదాలు నమ్మితి నీచరణాలు


1.అధ్వాన్నమవుతోంది ఎందుకో నాకవనం

అస్తవ్యస్తమౌతోంది ఏలనయా జీవనం

చిత్తచాంచల్యమే మనోవైకల్యమాయే స్వామి

వృధాగా కాలమంతా వైఫల్యమాయే ఏమి

ఏడుకొండలవాడా జాలి గుండెగల రేడా

మన్నించు తప్పిదాలు నమ్మితి నీచరణాలు


2.పట్టుబడకపాయె నాకు పంచేంద్రియాలు 

తట్టుకోనైతినయా నీ మాయోపాయాలు

తుట్టతుదకు శరణంటిని నీ దివ్య చరణాలు

కట్టెదుట నినుగాంచి సమర్పింతు ప్రాణాలు

ఏడుకొండలవాడా జాలి గుండెగల రేడా

మన్నించు తప్పిదాలు నమ్మితి నీచరణాలు

Thursday, January 27, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎందుకు నేస్తం ఇంతటి జాడ్యం

బ్రద్దలు కొట్టు ఈ మౌన కుడ్యం

అని అనివార్యం వినకుంటె ఆంతర్యం

ప్రణయానికి ప్రాథమ్యం గుండె ధైర్యం


1.మించిపోనీకు ఈ మంచి తరుణం

తీరిపోనీ జన్మ జన్మాల మన ఋణం

తేలికపడనీ తెలుపగ నీ ఎదభారం

విప్పకపోతే మనసిప్పటికైనా ఘోరనేరం


2.నోరార తెలుపు నాపైన నీ ప్రేమ

బిడియాన్ని వదిలేయి అందాల ఓలేమ

నేనోపలేను నీ మూగ ఆరాధన

ఎన్నాళ్ళు కన్నీళ్ళ నా నివేదన

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏది పువ్వో చెలీ ఏది నువ్వో ఎలా తేల్చుకోను

ఏది తూపో ఏది నీ చూపో ఎలా పోల్చుకోను

ప్రకృతిలో ప్రకృతిగా సుందరాకృతి దాల్చావే

అందానికి నిర్వచనంగా నా ఎదుట నిలిచావే


1.నీ కొప్పున చేరాయి నీలాల మబ్బులన్ని

నీ కోకన వాలాయి సీతాకోక చిలకలన్నీ

నవ్వులై విరిసాయి సిరిసిరి మల్లెలన్నీ

తేనెలై కురిసాయి మరుల పలుకులన్నీ


2.బుగ్గలపై మెరిసాయి పగడాల అరుణిమలు

సిగ్గులుగా ఒలికాయి శరదిందు పూర్ణిమలు

కంఠమందు అమరింది దక్షిణావృత శంఖము

కటిన వడ్డాణమైంది  ముంజేతి కనక కంకణం

Wednesday, January 26, 2022

 రచన,స్వరకల్పన &గానం:డా.రాఖీ


తెలుసు నీకు తెలుగు భాష

ఎరిగెదవేమో ఆంగ్ల భాష

మాట్లడ గలవుకాస్తైనా హిందీభాష

ఎన్ని వచ్చి లాభమేమి ఎరుగనపుడు మనసు భాష 

నా మనసు భాష

ఎపుడైనా నా మనసుకు నీదే ధ్యాస- నీవే అభిలాష


1.క్రీగంటి లిపితొ తెలిపినా

పెదవి మలిపి తెలిపినా

మునిపంటనొక్కి తెలిపినా

చిలిపిచూపు కలిపి తెలిపినా

ఎరుగవాయే నా ఎద భాష

నీవే లేక ఆగుతుంది నా శ్వాస - ఓ అనిమేష


2.కవితగ నిను మలచినా

పాటగా నేనాలపించినా

నా మదిమర్మం చిత్రీకరించినా

మౌన సందేశమందించినా

గ్రహించవైతివి గుండె ఘోష

కొడిగట్టుతోంది బ్రతుకు ఆశ నా బ్రతుకు ఆశ

Tuesday, January 25, 2022

 ఆజాదీకా అమృతమహోత్సవ-73వ గణతంత్రోత్సవ శుభాకాంక్షలతో-డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


సంధించి నాడు సత్యాగ్రహ రణతంత్రం

సాధించినాడుగాంధీజీ మన స్వాతంత్రం

ఆవిష్కరించె అంబేద్కర్ అద్భుత రాజ్యాంగం 

సుపరిపాలనకు సూచికగా మన గణతంత్రం

జయహో జయహో స్వేఛ్ఛా భారత్ జైహింద్

జయహోజయహో విశ్వవిజేత  జైహింద్


1.అసాధ్యాలు సుసాధ్యాలుగా దృఢ భారత్

భిన్నత్వంలో ఏకత్వంగా సమైక్య భారత్

పలువిధ కులమత జనతాయుత ౹ భారత్

పెక్కురాష్ట్రాల సమాఖ్యస్ఫూర్తిగ అఖండభారత్ 

జయహో జయహో స్వేఛ్ఛా భారత్ జైహింద్

జయహోజయహో విశ్వవిజేత  జైహింద్


2.ప్రపంచానికే మార్గదర్శిగా ఆదర్శ భారత్

మేధస్సే పెట్టుబడిగ జగమేలే ప్రజ్ఞా భారత్

వెనకడుగేయని ఆత్మస్థైర్యపు సాహస భారత్

కార్మిక కర్షక సైనిక శ్రామిక స్వచ్ఛ భారత్ -మనది అఛ్ఛాభారత్

జయహో జయహో స్వేఛ్ఛా భారత్ జైహింద్

జయహోజయహో విశ్వవిజేత  జైహింద్

OK

 https://youtu.be/svR8nOBi73o?si=yDzBTUFPwGDxYA8v

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం :చారుకేశి

నను సాంతం నీకే సొంతం చేస్తా
బ్రతుకంతా నీకే  కైంకర్యం చేస్తా
నేను పుట్టింది కేవలం నీకోసమే
మనసు పెట్టింది మాత్రం నీమీదనే
ఆ మీరా చేసింది ప్రణయారాధన
మనసారా నే చేసితి నన్నే నివేదన

1.నిన్ను మేలుకొలుపే జాగృతులు
తలారబోసుకున్న నా తడి కురులు
నీ పూజ కొరకు విచ్చుకున్న నిర్మల కమలాలు
నిను స్వామిగ నిలుపుకున్న ఈ నా కనులు
ఆ మీరా చేసింది ప్రణయారాధన
మనసారా నే చేసితి నన్నే నివేదన

2.నిన్నభిషేకించెడి పంచామృతాలు
 నా పెదవుల ఊరేటి అధరామృతాలు
శయనించగ నామేనే హంసతూలికా తల్పము
ఏకాంత సేవలో నీక్రాంతమైన హాయే అనల్పము
ఆ మీరా చేసింది ప్రణయారాధన
మనసారా నే చేసితి నన్నే నివేదన


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


తేనే కళ్ళ చిన్నది వన్నేలెన్నో ఉన్నది 

బాకులంటి చూపులనె ఎదలొ దించుతున్నది

చేపకళ్ళ చిన్నది చెలగిపోతున్నది

ఎరలసొంటి చూపులతో నన్ను లాగుతున్నది


1.వాలుకళ్ళచిన్నది వంపులెన్నె ఉన్నది

హంపిలోని శిల్పంలా తలపు చెరుపుతున్నది

కలువకళ్ళ చిన్నది కసి పెంచుతున్నది

పసి పసి నా మనసునే ఉసిగొల్పుతున్నది


2.చిలిపి కళ్ళ చిన్నది వలపులొలుకుతున్నది

ఊరించే నవ్వులతో మత్తుగొలుపుతున్నది

చారెడేసి కళ్ళున్నది ఆశ పెంచుతున్నది

బ్రతుకంతా బానిసగా నన్ను చేసుకున్నది

Monday, January 24, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఏ దేవుని వరమడుగను

కొలువగ నిను దేవిగను

ఏ పదముల నిను పొగడను

పదపదమున నా హృదయమె 

పదిలముగా తెలుపగను


1.నవనాడుల నీ స్పందన

నరనరమున నీ స్మరణ

నా మనమున నీ తపన

ఊఛ్వాసలొ నిశ్వాసలొ

ఎద లయలో  నీ భావన


2.వేడితినిను వ్యసనముగా

వేచితినే యుగములుగా

మలచితి నిను కవితలుగా

నా వేడుక నిక తీర్చగ 

నీ అక్కున నను జేర్చగ

 

https://youtu.be/Ws_Qg74pYp8

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


శివమే నీవు- విశ్వమే నీవు

జీవేశ్వరుడవు- నాలో నీవు లేక శవమే నేను

భవమే నీవు -అనుభవమే నీవు

ప్రాణేశ్వరుడవు- నీవు లేక నిర్జీవ కాయం నేను

నేను అని పలికే -ఈ నేనును సైతం- నీవేను

నా నుండి -నేను విడివడి -నీవుగా మారేను


1.శివకేశవులొకటగు -అద్వైతమైన ఆత్మను- పరమాత్మను

శివపార్వతులొకటగు తత్వమైన -సాంబ-సదా-శివుడను

చరమును నేనే -అచరమునేనే- సకల జీవరాశిని నేనే

పంచేంద్రియముల- పంచభూతములకధినేతను- నేనే

నేను అని పలికే- ఈ నేనును సైతం- నీవేను

నా నుండి -నేను విడివడి- నీవుగా మారేను


2.మాయాకల్పితమైన -ఈ సృష్టినాదే- ఆ స్రష్టయు నేనే

ఆదిఅంతములేనిదైన- కాలము నేనే -కాలకాలుడ నేనే

పాలితుడను నేనే -సర్వం సహా పరిపాలకుడనూ- నేనే 

వేదము నేనే -మోదము నేనే -నిర్వేదము ఖేదము నేనే

నేను అని పలికే -ఈ నేనును సైతం- నీవేను

నా నుండి -నేను విడివడి- నీవుగా మారేను


OK


https://youtu.be/0kWrFMQCmQE?si=al1No6WBdd9Ao_Ow

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:నాద నామక్రియ

నిలుపమనుచు కోరలేదు నను ఉరమున శ్రీపతి
ఆసనమడుగనైతి నీ అంకమందు  వేంకటపతి
కడతేరగ నిను వేడితి నీ పదాబ్జ శరణాగతి
సులభమైన పర సాధన వసుధన నీ సన్నిధి
నమః శ్రీనివాసాయా నమో దీననాథాయా
తిరుమల వాసాయ నమో  శ్రితజనపోషాయా

1.అప్పులున్నవాడివాయే సంపదలడుగ గలన
తిప్పలున్న వాడివాయె నొప్పినెరుకపరుచ గలన
అప్పడివీవని ఎప్పుడు తలచెద నీగురించి గొప్పగ
చెప్పడమేలనీకు ముప్పును గ్రహించి అనుగ్రహించగ
నమః శ్రీనివాసాయా నమో దీననాథాయా
తిరుమల వాసాయ నమో  శ్రితజనపోషాయా

2.కర్మలు సహజమాయే నీ మర్మము బోధపడగ
పూజలు రివాజాయె కవితలుగా వెలువడగా
యాంత్రిక మాత్రమైతినే బంధాలలొ చిక్కుపడగ
ఆత్రము మితిమీరిపోయే స్వామి నీపై మనసు పడగ
నమః శ్రీనివాసాయా నమో దీననాథాయా
తిరుమల వాసాయ నమో  శ్రితజనపోషాయా


Friday, January 21, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అన్నీ తెలిసీ తెలియనట్టుంటావు

మా మనసెరిగీ ఎరగనట్టుంటావు

వలలెన్నొ పన్నేవు వలపుల్ని రువ్వేవు

వెర్రిగా నీ వెంటపడితే కన్నెర్ర జేసేవు

మమ్ము మా మానానా మననీయవైతివే మానినీ

నీవిలాసానా వశపరచుకొందువే జగజ్జననీ


1.వ్యామోహమేల పురుషులకు మాత్రమే

వనితలవనీ తలాన ఆసాంతం పవిత్రమే

పక్షపాతమేల నీకు పడతి ఎడల పరాశక్తీ

ఇనుపమతి మాకు సుదతికి సూదంటుశక్తి

మమ్ము మా మానానా మననీయవైతివే మానినీ

నీవిలాసానా వశపరచుకొందువే జగజ్జననీ


2.చంచలవు నీవైనా వెంటతిప్పుకుంటావు

నశ్వరపు అందాలైనా లోబరచుకుంటావు

ఆత్మసౌందర్య మర్మం అంతుబట్టనీయవు

అంతచ్ఛక్షువన్నది మాకు తెరుచుకోనీయవు

మమ్ము మా మానానా మననీయవైతివే మానినీ

నీవిలాసానా వశపరచుకొందువే జగజ్జననీ

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


వెన్నెలనే చీరగా కట్టుకున్నావే

కన్నులలో చుక్కలనే నిలుపుకున్నావే

పెదాలపై చంద్రవంక నుంచుకొన్నావే

చెంపలపై సొంపులెన్నొ వంపుకొన్నావే

కలల్లోన కవ్వించే గంధర్వకన్యవే

కళ్యాణివై  మురిపించే రాగరమ్యవే


1.నీ స్నేహమె నాకు అపురూప బహుమానమె

నీ చెలిమే నాపాలిటి జన్మాల తపఃఫలమె

నీ మైత్రి ననుమెచ్చి దైవమొసగినట్టి వరమె

నీతో అనుబంధమే అనన్యమౌ రాధామాధవమే 

సౌందర్యవతివై పాలించే చంద్రకళవే

మధ్యమావతివై లాలించే మంజుల రవళివే


2.ఎడారిలో ఏకాకికి ఒయాసిస్సువైనావే

నా చీకటి జీవనాన ఉషస్సువై వచ్చావే

కడదాకా చేయిపట్టి నడిపించే దేవతవే

కడతేరగ నను వీడక తోడొచ్చే నా జతవే

పావనగంగవై భంజించవే మదమునే

శివరంజనీ రంజింపవే నా మనమునే

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాయీ అని ఒకరంటారు బాబా అని ఒకరంటారు

మా తండ్రివి నీవంటారు మా తాతవు నీవంటారు

బాంధవ్యమేలయ్యా భవబంధం త్రెంచేవాడికి

చుట్టెరికమేలయ్యా గట్టునెక్కించేవాడికి

గుట్టు విప్పవయ్యా సాయీ ఈ మర్మము

ఎరుకపరచుటేకాదా నీ ధర్మము


1.అనాథవీవని అంటారు ఫకీరు నీవని అంటారు

అవథూత నీవని అంటారు సద్గురువీవని అంటారు

మందిరాలు నీకేలా శిథిల మసీదులో ఉండేవాడికి

వైభవాలు నీకేలా చిరుగుల కఫ్నీ ధరించువాడికి

గుట్టు విప్పవయ్యా సాయీ ఈ మర్మము

ఎరుకపరచుటేకాదా నీ ధర్మము


2.అందరితో ఉన్నావు అందరిలో ఉన్నావు

అందరికొరకు తపియించావు అందరికొరకె జీవించావు

ఎవరెక్కడ పోతే ఏంటి ముక్కుమూసుకున్న మునివే 

బోధించి సాధించేదేమిటి నిజమైన నిష్కామునివే

గుట్టు విప్పవయ్యా సాయీ ఈ మర్మము

ఎరుకపరచుటేకాదా నీ ధర్మము

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎగిరిపోవే సిలకా ఏమాత్రం ఆలసింపకా

ఎందుకు వచ్చావో ఇలకిక నీకేమైనా ఎరుకా

ధర పంజరాన బానిసవై ఉరఃపంజరాన బంధివై

ఆర్జించినాగాని ఆంక్షలెన్నో ఖర్చుచేసినాగాని కట్టడులెన్నో

పరులకొరకు అక్కఱరాక నీకోసం నీవైనా లేకా

స్వేఛ్ఛలేని బ్రతుకెంతదాక అనుక్షణం చచ్చాక


1.మనిషిగా నిను మసలనీరు వ్యక్తిగా ఎవ్వరు గుర్తించరు

కులమతాల బురదను పూసి మానవతను మసిజేసి

కట్టుబాట్లనెన్నో అంటగడతారు ఇరుకైన చట్రాల్నే ఒంటబెడతారు

నిన్ను నిన్నుగా ఎపుడూ ఉండనివ్వరు నిశ్చింతగా రోజూ పండనివ్వరు

పరులకొరకు అక్కఱరాక నీకోసం నీవైనా లేకా

స్వేఛ్ఛలేని బ్రతుకెంతదాక అనుక్షణం చచ్చాక


2.గాలికోయే కంపలెన్నో కొంపలోన వేస్తారు

బట్టగాల్చి మీదవేసి వినోదాన్ని తిలకిస్తారు

మౌనంగాఉందామంటే ఊరుకోరు మాటల్తో ముంచేస్తే తట్టుకోరు

సంసారిగాను వేగనివ్వరు సన్యాసిగాను సాగనివ్వరు

పరులకొరకు అక్కఱరాక నీకోసం నీవైనా లేకా

స్వేఛ్ఛలేని బ్రతుకెంతదాక అనుక్షణం చచ్చాక

Monday, January 17, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మూడేళ్ళ ముచ్చటైన ముద్దుల పాపకు ఆశీరభినందనం

బుడిబుడిబుడి తొలి అడుగుల శ్రీ

రాగరమ్య సంస్థకు జన్మదిన శుభకామనం


1.బహుముఖీయమై జనరంజకమై

విద్యావైజ్ఞానిక సామాజిక సేవా కళా రంగాత్మకమై

సాంస్కృతిక గగనంలో వెలిసింది సప్తవర్ణాల హరివిల్లై

సప్తస్వర సంగీత లోకాన కురిసింది రమ్య రాగాల రస జల్లై


2.పలురంగాల ప్రముఖులు చేయూతనీయగా

కవన గాన నృత్య కారులకు

వేదికనందీయగా

విజయవంతమొనరించెను పెక్కు కార్యక్రమాలను

తురుముకుంది మకుటాన కలసాకారమవగ నెమలీకలను

నిన్నే దేవిగ కొలిచాను ప్రణయ దేవిగ నిలిపాను

నిన్నే నిన్నే మెచ్చాను నీకే హృదయము నిచ్చాను  

ఎంతో తపన పడ్డాను ఎంతటి తపమో చేసాను

కనికరించవే ప్రాణేశ్వరి శుభకరించవే ప్రణయేశ్వరి

శరణంటినే నిన్ను సచ్చిదానందమయి

దరిజేర్చుకోవే నన్ను పరమ దయామయి


1.నీరూపం నా మదిలో నీ తలపే మేధలో

కలలొ నిను కంటున్నా ఎదలొ నిను వింటున్నా

ఎవ్వరు నాకెదురైనా నీవుగానె భావిస్తున్నా

నిరంతరం నీ నామమే మనసులో స్మరిస్తున్నా

శరణంటినే నిన్ను సచ్చిదానందమయి

దరిజేర్చుకోవే నన్ను పరమ దయామయి


2.అక్షరాల పూలతో అర్చనలే చేస్తున్నా

గీతాల మాలలనే నీ మెడలో వేస్తున్నా

గాలి కదలాడినా నీరాకను తలపోస్తున్నా

ఉఛ్ఛ్వాస నిశ్వాసలలో ఊపిరిగా చేసుకున్నా

శరణంటినే నిన్ను సచ్చిదానందమయి

దరిజేర్చుకోవే నన్ను పరమ దయామయి

OK

https://youtu.be/dplW3kXFqF4?si=Pk5vCfGqT6aD1Y5G

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:ఉదయ రవి చంద్రిక (శుద్ధ ధన్యాసి )

కనుల నుండి కురుస్తోంది వెన్నెల జల్లు
కనుబొమలే ఎక్కడిన మరుని విరుల విల్లు
నీ తనువే   విరిసిన హరివిల్లు
నీ వలపే  మురిపాల పొదరిల్లు
వందనమందును నీ అందానికి
ఆనందమొందెద నీతో బంధానికి

1.పెదవుల మందార మరందాలు
నీ ఎదన పూమంజరి చందాలు
నడుమున నాగావళి వంశధారలు
నడకలు మరాళ మయూరాల సౌరులు
వందనమందును నీ అందానికి
ఆనందమొందెద నీతో బంధానికి

2.కురులలో ఉరికేను కృష్ణవేణి
నుడులలో కదిలేను గోదావరి
పదపదమును పదేపదే అదే ఉపమానము
దనివారదు కనరుండదు నీ గురించి కవనము
వందనమందును నీ అందానికి
ఆనందమొందెద నీతో బంధానికి


OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అమ్మా నేను నీ ముద్దు బిడ్డను

తల్లీ నేను నీ ప్రియభక్తురాలను

రేయి పగలు నిన్నే ధ్యానించుదానను

నీ పదముల మనెడి ఇసుకరేణువును

అమ్మా నేను నీ ముద్దు బిడ్డను

తల్లీ నేను నీ ప్రియభక్తురాలను


నీ కటాక్ష వీక్షణకై నిరీక్షించుచున్నాను

నీ దయాదృక్కులకై పరితపించుచున్నాను

తల్లీ ఎప్పుడు నను కనికరింతువో

అమ్మా అక్కున నన్నెప్పుడు జేర్చుకొందువో

అమ్మా నేను నీ ముద్దు బిడ్డను

తల్లీ నేను నీ ప్రియభక్తురాలను

రేయి పగలు నిన్నే ధ్యానించుదానను

నీ పదముల మనెడి ఇసుకరేణువును

అమ్మా నేను నీ ముద్దు బిడ్డను

తల్లీ నేను నీ ప్రియభక్తురాలను


నాలోనికి నిన్ను ఆవహన చేసెద

నను నీవుగ భావించి అభిషేకించెద

నాదనుకొను ఏదైనా నీకు సమర్పించెద

మనసావాచాకర్మణా నను కాచే దేవిగ నిను నమ్మెద


అమ్మా నేను నీ ముద్దు బిడ్డను

తల్లీ నేను నీ ప్రియభక్తురాలను

రేయి పగలు నిన్నే ధ్యానించుదానను

నీ పదముల మనెడి ఇసుకరేణువును

అమ్మా నేను నీ ముద్దు బిడ్డను

తల్లీ నేను నీ ప్రియభక్తురాలను



ఏమౌతోందీ కౌమారదశ -ఎటుపోతున్నది ఈ వ్యవస్థ

ప్రేమరాహిత్యంలో వింతైన పైత్యంలో

అనురాగాలను బలిచేసి-అనుబంధాలకు శిలువేసి

నైరాశ్యంతో అడుగులు వేస్తూ-వైషమ్యాలను పెంపొందిస్తూ

తెలిసీతెలియని వయసులో-ఫలితం ఎరుగక దురుసుగా

గమ్యమేదో గ్రహించకుంది వక్రదారుల పయనిస్తోంది


1.అమ్మానాన్నలు దూరమై-ఆలన పాలన కరువై

అనాథలల్లే అభాగ్యులల్లే క్రష్ లలో క్రష్షై

ఖైదీలమాదిరి వెలివేసిన సరి హాస్టళ్ళలో  రోస్టై

ప్రేమరాహిత్యంతో పెడదారులు పట్టి

వింతైన పైత్యంతో వ్యసనాలు చుట్టిముట్టి

మంచికి చెడ్డకు తేడా తెలియక

తప్పొప్పులకు అసలే జడవక

నేర ప్రవృత్తికి చేరువై నడవడికే చెడి కౄరులై


2.ఫ్రెండ్షిప్ అనే ముంచే నౌకనెక్కుతూ

బర్త్ డే పార్టీ పేరిట పీకలు నొక్కుతూ

పబ్బులు రేవ్ పార్టీలంటూ డబ్బులు కక్కుతూ

చిన్నచితకా చైన్ స్నాచింగ్ తెఫ్ట్ ల్లో చిక్కుతూ

డేటింగ్ రైడింగ్  ఫైటింగ్ లంటూ తిరుగుతూ

 బెట్టింగ్  డ్రగ్స్  మాఫియాలకు మరుగుతూ 

ఆక్సిడెంట్ సూసైడ్ మర్డర్లలొ కనుమరుగౌతూ



Sunday, January 16, 2022

 

https://youtu.be/k_Dzo6Nwy98

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అణువణువూ పరబ్రహ్మ  తత్వమే

కణకణమూ పరమాత్మ రూపమే

అండపిండ బ్రహ్మాండమంతా పరమేశ్వరుడే

సకల చరాచర జగత్తు అంతా జగదీశ్వరుడే

ఎదుట కనగ మహామాయే ఎరిగినంత ఎదన హాయే


1.గర్భాన శిశువుకు ఆత్మ బంధువతడు

జీవరాశి ఎల్లెడల ప్రేమ సింధువతడు

అవధిలేని విశ్వరచన కేంద్ర బిందువతడు

అక్షర లక్ష్యమైన  సచ్చిదానందమతడు

ఎదుట కనగ మహామాయే ఎరిగినంత ఎదన హాయే


2.శవమే శివమయ్యె జీవమూలమతడు

సృష్టి కార్యకారణమౌ భావజాలమతడు

ఏకమనేకమై అనేకమూ ఐక్యమయేలీలయతడు

ఆది అంతమంటూ లేని అనంతకాలమతడు

ఎదుట కనగ మహామాయే ఎరిగినంత ఎదన హాయే

https://youtu.be/Rn2VOK_8XZw?si=tmrieCjeovlcaiSj

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ప్రేమించు ఎద ఎదకూ ప్రేమను పంచు

ప్రేమకు సరియగు అర్థంతో ప్రేమగా వ్యాపించు

మోహమనో కామమనో  ప్రేమ ఎలా తలపించు

విశ్వజనీనమైన ప్రేమను ఉచితంగా నిర్వచించు


1.జీవుల ఎడ చూపేది జీవకారుణ్యము

సాటి మనిషికి సాయం చేస్తే మానవత్వము

లలిత కళాకారుల పట్ల చూపేది అభిమానం

ప్రకృతి స్త్రీ రమణీయతలో సౌందర్యోపాసనం


2.కనులతో చూసే అందం కడుపు నింపుకోలేము

శ్రవణపేయమౌ సంగీతం ఒంట నిలుపుకోలేము

పంచేంద్రియ రంజకమంతా ఆస్వాదనార్హము

క్షణికమైన జీవితాన ప్రేమ అనుభవైకవేద్యము


3.బహుముఖీయమైనది ప్రేమరస పూరిత గంగ

తరచిచూస్తేనో మమతానురాగప్రణయ పరాగంగ

వాత్సల్యంగా ఆరాధనగా భక్తి గౌరవాల సంగమంగ

పాత్రలోన ఇముడుతుంది ప్రేమఅన్నది కడుచిత్రంగ

 

https://youtu.be/Y-bOneytBhg

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


అంతగా మునిగావా రాముని ధ్యానంలో

వింత ఏముంటుంది ఉంటే స్వామి మైకంలో

చింతలే పట్టవా పవనాత్మజా మాదైన ఈ లోకంలో

చింతన నీదే ఇక నిరంతరం కాచేంతవరకీ నరకంలో

రామలక్ష్మణ్ జానకీ జై బోలో హనుమాన్ కీ


1.గల్లంతాయే ఎపుడో మానవత్వ మైథిలి

లంకలోనో ఏ డొంకలోనో  ఆచూకి కనుగొనాలి

లంఘించే శక్తిలేదు లాఘవముగ  కడచ కడలి 

లంఖిణి మదమునణిచి వెదకి వెలికి తీయాలి

రామలక్ష్మణ్ జానకీ జై బోలో హనుమాన్ కీ


2.హానిగొలుపు క్రిముల నుండి జనుల కావుమా

సకలరోగ సంజీవని మాకై చేగొనితెమ్మా హనుమా

స్వార్థం అసంతృప్తి అశాంతులే మా మనాదులు

గ్రహించనీ మము నీ అనుగ్రమున మా విధులు

రామలక్ష్మణ్ జానకీ జై బోలో హనుమాన్ కీ

Saturday, January 15, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కాటుక కనులే కథలు చెబుతున్నాయి

నల్లని కురులైతే మతులు పోగొడుతున్నాయి

అరవిరిసిన నవ్వులే వరములౌతున్నాయి

జిలిబిలి నీపలుకులే మరులు రేపుతున్నాయీ

ఓ సఖీ  చంద్రముఖీ అందీయవే నీ చేయీ

ఓ చెలీ నెలజాబిలీ నేనోపలేనే ఈ రేయీ


1.తప్పునాది కానేకాదు నీ అందం గొప్ప అది

 చెప్పలేక నామది తిప్పలెన్నొ పడుతోంది

ఏది పోల్చినాగాని నీకది తక్కువగా తోస్తోంది

కలం కదలలేనంటూ కడు తికమక పడుతోంది

ముందుకెళ్ళనా అంటూ తటపటాయిస్తోంది

హద్దుదాటడానికెంతో ఉబలాటపడుతోంది


2.నీ ప్రతి ఒక చిత్రమే వెలుస్తోంది పదచిత్రమై

నీ జతగా ప్రతీకలా ప్రేమకే ప్రతీకలా పవిత్రమై

నీతోటి కలయికలన్నీ తృటిలా ఈషణ్మాత్రమై

కనబడని బంధమేదో ఒక మంగళ సూత్రమై

ముడివేసె మన ఇరువురిని విధి తెగని రీతిగా

అమరమౌ మన అనురాగం ఎడతెగని రీతిగా

 https://youtu.be/bi--9HOo6HQ

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఈశ్వరా వేంకటేశ్వరా కావరా సర్వేశ్వరా

శివుడవు నీవై  కేశవుడవు నీవై

కాలస్వరూపుడవై ద్రవ్యస్వరూపుడవై

శక్తిసంయుక్తుడవై కాంతిసంయుతుడవై

ఏకమేవాద్వితీయమౌ పరబ్రహ్మవై అమ్మవై


1.సృష్టి స్థితి లయ కార్యోన్ముఖుడవై

సత్వరజస్తమో గుణత్రయాత్మకుడవై

తాపత్రయాతీతమైన అభివ్యక్తుడవై

శ్రీ పరా విద్యా దివ్యపద సంప్రాప్తుడవై

ఏకమేవాద్వితీయమౌ పరబ్రహ్మవై అమ్మవై


2.ఐహికాముష్మిక ఐశ్వర్య వరదుడవై

శరణాగతవత్సల బిరుదాంకితుడవై

మనోవాక్కాయకర్మలతో నమ్మిన వశుడవై

నవవిధ భక్తికి మురిసెడి పరమేశుడవై

ఏకమేవాద్వితీయమౌ పరబ్రహ్మవై అమ్మవై

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ పాటే ప్రతిపూట

నీ వెంటే నా బాట

నీవున్న తావే వన్నెల విరితోట

మరులు రేపుతావే నీ సందిట

నీతోటే నా అచ్చట ముచ్చట

నీవులేని బ్రతుకే మరుభూమట


1.కనులే కలువ రేకులు

చూపులే వలపు తూపులు

పెదవుల విరిసేను మందారాలు

పలుకుల కురిసేను అమృతాలు

కలుపుకోనను నీలో కంజదళాయతాక్షి

పంచభూతాలే నా మనసుకి ఇక సాక్షి


2.నగవులే సహజపు నగలు

తలపులే  మరి రేయి పగలు

రేగుతాయి ఏవేవో ఎదలో సెగలు

జాగుమనకేల ఐపోదాం ఆలుమగలు

కనికరించవే నన్ను నీ కరమందించి

అలరించవే నన్ను వినతులాలకించి

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాక్షాత్కరించావు కల సాకారమవగా

ప్రత్యక్షమైనావు తపమే ఫలించగా

నువు తప్ప ఇతరమైనదేదదీ వలదునాకు

నీకనులలోనే ఇహము పరము కలదునాకు

వరించనీయవే మది పులకరించగా

తరించనీయవే నాకై అవతరించగా


1.ఎరుగని వారికి శిలవు నీవు

దొరకని వారికి కలవు నీవు

నిను గ్రహించిన జనులకు కలవు నీవు

నీవనుగ్రహించిన మునులకు దైవమీవు

నీ మాయకు నేవశుడను నీ మమతకు పరవశుడను

నీ అనురక్తుడను ఆసక్తుడను నీ ప్రియ భక్తుడను 


2.నను బంధించినావే నీ వీక్షణతో

నే మననిక నిమిషము నీ నిరీక్షణతో

అక్కున నను జేర్చుకో మిక్కిలి మక్కువతో

చక్కని దృక్కులతో చక్కెర పలుకులతో

నీనుండి వెలిసినవాడను నీలో కలిసెడి వాడను

నీ సుతుడను సన్నితుడను సదాతనుడను

Thursday, January 13, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నచ్చడానికి ఏముంటుంది కారణం

నచ్చనంత మాత్రనా చేయగానేల రణం

పెట్టబుద్దైతుంది కొందరిని చూస్తే

మొట్టబుద్దైతుంది కొందరు ఎదురొస్తే

భరించగాలేము బ్రద్దలైనంత   నిజాలు

పుర్రెకోబుద్ధిగా జిహ్వకో రుచిగా ఎంత వింత నైజాలు


1.ముఖప్రీతి మాటలు హితకరమగు ప్రియవచనాలు

గోరంతలు కొండంతలుగా మసాలా దట్టించి పచనాలు

మసిపూసి మారెడిగా చూపించెడి సులోచనాలు

పొగడ్తలే సరిపడలేనపుడు   ఎడతెగని విరోచనాలు

భరించగాలేము బ్రద్దలైనంత   నిజాలు

పుర్రెకోబుద్ధిగా జిహ్వకో రుచిగా ఎంత వింత నైజాలు


2.వ్యక్తులకే విలువ ఎక్కువ విషయంలో విషయం లేకున్నా

పరిచయాలకే ప్రాముఖ్యత ప్రజ్ఞాపాటవాల మాటే సున్నా

ఎందుకా వెంపర్లాట లోకం మననే చూడనప్పుడు

సాగిపోవాలి బెదరక వినబడేది తాటాకుల చప్పుడు

భరించగాలేము బ్రద్దలైనంత   నిజాలు

పుర్రెకోబుద్ధిగా జిహ్వకో రుచిగా ఎంత వింత నైజాలు

 

https://youtu.be/F9JEVnuoZxA

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఉత్తపుణ్యానికే-ఉత్తర ద్వారం ద్వారా దర్శనం

అలవోకగనే -అలవైకుంఠపుర ప్రతీహార ప్రవేశం

తిరుమలలో వేంకటపతి దివ్య వైభోగం

ధర్మపురిలొ నరకేసరి సరిలేని వైభవం

చూసిన వారికిలన సుందర దృశ్యము

దర్శనమాత్రాన జీవితమే ధన్యము


1.ముక్కోటి దేవతలకు మాత్రమే దక్కునది

వైకుంఠ ఏకాదశీ రోజుననే చిక్కునది

నిరంతరం హరినామ స్మరణలో భక్తజనం

కన్నులే చెమ్మెలుగా చూపుల నీరాజనం

చూసిన వారికిలన సుందర దృశ్యము

దర్శనమాత్రాన జీవితమే ధన్యము


2.ఏడాది పొడగునా వేచును ఏడేడు లోకాలు

వీక్షించగ ప్రతీక్షించు పదునాల్గు భువనాలు

అంతరించేను స్వామినిగన భవబంధనాలు

తరించేను ఉపవసించి మానవ జీవనాలు

చూసిన వారికిలన సుందర దృశ్యము

దర్శనమాత్రాన జీవితమే ధన్యము

Monday, January 10, 2022

https://youtu.be/VQWfXctSmMk?si=FsOPtKiR4KA35HVj

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:పటదీప్

వలపుల వలన చిక్కవెందువలన
నీ కనులు మీనాలే కదా ఓ లలన
ముత్యాలు దొరుకునేలా నీ కడ  కడలే లేకున్నా
 నీ పెదవి అల్చిప్పల నవ్వులె మౌక్తికాల సృజన
స్పందించని ఎద ఉండదు  నిను తిలకించి
నందించని బ్రతుకుండదు  మది పులకించి

1.కాళిదాసులౌతారు నీ ఎదుట నిరక్షరకుక్షులు
తెనాలి రామకృష్ణులౌతారు నీవల్ల అజ్ఞాన పక్షులు
వరదలై పారుతాయి కవితలు కవితల నుండి
వరములై  తీరుతాయి కన్నకలలు కాస్తా పండి
స్పందించని ఎద ఉండదు  నిను తిలకించి
నందించని బ్రతుకుండదు  మది పులకించి

2.బింకమొదిలి చూసేరు నీవంక ఏదోవంకతో 
తహతహలాడేరు పలకరింప ఏదో టొంపుతో
వరుసకట్టి నిలిచేరు సామ్రాట్టులు నీ క్రీగంటి వీక్షణకై
రేబవళ్ళు పహారా కాసేరు ఈగవాలనీకుండ నీ రక్షణకై
స్పందించని ఎద ఉండదు  నిను తిలకించి
నందించని బ్రతుకుండదు  మది పులకించి


https://youtu.be/mG33I6z8G_Y


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రంగరించిన శృంగారం ..పోతపోసిన బంగారం

అంగాంగ నయగారం..అందాల ధనాగారం

తలపుకొస్తే జాగారం తప్పిపోతె చలిజ్వరం

కౌగిలిస్తే కారాగారం చుంబనాల్లొ రతిసారం


1.చేయబోకు చేష్టలతో నను మారాం

రేపబోకు నా మదిలో గాలి దుమారం

ఒక్కసారితాకనీయి నీమేనే అతిసుకుమారం

విరహమెంత వేధించినా మనమెన్నడు మారం


2.రమించే క్రమంలో మనతీరమెంతో దూరం

విరమించని మన ప్రయాణం ప్రణయ విహారం

అలుపులేదు చేరేదాకా సరస స్వర్గ ద్వారం

సృష్టికార్యమే పవిత్రం భావించనేల అది నేరం

https://youtu.be/Itw0hzat4Pk?si=hls1T4lvVNQhlukU

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ


"అవసాన దశ"


గొంతేమో పెగలదు కాలుచేయి కదలదు

విన్నవించుకోవడం ఎంతకూ కుదరదు

ఎవ్వరూ గ్రహించకుంటె  బాధలెలా తీరురా

నా వెత గమనించకుంటె పాలుపోని తీరురా

నీవైనా ఎరుగవా నీలకంఠేశ్వరా హరా పరా

తక్షణమే స్పందించి నా యాతన నాపరా


1.రౌరవాది నరకాల్లో ఇంత క్రౌర్యముంటుందా

యమలోకపు శిక్షలలో ఈ దైన్యముంటుందా

పిడచకట్టు నాలుకపై గుక్కెడన్ని నీళ్ళకు కరువు

లుంగచుట్టు ప్రేగులకు పట్టెడంత ముద్దే ఆదరువు

నీవైనా ఎరుగవా నీలకంఠేశ్వరా హరా పరా

తక్షణమే స్పందించి నా యాతన నాపరా


2.కఫవాత పైత్యాలు దాడిచేసె నాపై ఒకేసారి

మతిమాట చెల్లకుంది నా మేన ఆపై ప్రతిసారి

పక్కతడిపే పరిస్థితుంటే ఇంకెక్కడిది పరువు

పశుపతి నీ చలవతో అయ్యింది గుండె చెఱువు

నీవైనా ఎరుగవా నీలకంఠేశ్వరా హరా పరా

తక్షణమే స్పందించి నా యాతన నాపరా

 https://youtu.be/zuZC8YYsaM4?si=PanrJVUqH03IniZc

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎంత వర్చస్సు ముఖబింబానా

ఎంత తేజస్సు నీ స్వరూపాన

రెప్పైనా వాలదు నిన్ను చూస్తుంటే

చూపైనా మరలదు దర్శనమౌతుంటే

నినుపోలగ యత్నించాడు మోహినిగా శ్రీహరి

నువుగాక వేరేలేదు విశ్వ సౌందర్య లహరి


1.వశులుకాని దెవ్వరు ఇలలోన నినుగాంచి

పరవశులౌతారు నీ కైపులొ విలాసి విరించి

సామాన్య మానవుణ్ణి నీమాయకు వివశుణ్ణి

పాలుత్రాగు పసివాణ్ణి పరికించకు  దాసుణ్ణి

నినుపోలగ యత్నించాడు మోహినిగా శ్రీహరి

నువుగాక వేరేలేదు విశ్వ సౌందర్య లహరి


2.భీకరాకృతి దాల్చిన భద్రకాళి మూర్తివి నీవే

సదా చిన్మయానందం చిందించే పరాశక్తివీవే

నన్ను నిదురించనీ నీ ఒడి నెలబాలుడిగా

నీ పదముల కడతేరనీ నను పరమ భక్తుడిగా

నినుపోలగ యత్నించాడు మోహినిగా శ్రీహరి

నువుగాక వేరేలేదు విశ్వ సౌందర్య లహరి

Sunday, January 9, 2022

https://youtu.be/YXTcier9HEk

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


హృదయాన దాచుకోన నిను సిరిలా

నా అర్ధ దేహాన నిలుపనా శ్రీ గౌరిలా

రసనాసనమందీయనా శ్రీవాణి మాదిరిలా

నాగళమును రవళించన రాగరమ్యఝరిలా


1.నీవే సీతగా వరించనా హరువిల్లు విరిచి

నీవే జతగా రమించనా రాధికగా భావించి

నిను దేవతగా ఆరాధించనా సర్వం సమర్పించి

నువు చేయూతగా జీవించనా సతిగా స్వీకరించి


2.నిను బంధించనా నా కవితగ మలచి

 ఎద నందించనా ఊహల నిను చిత్రించి

జనులను అలరించనా నిను పాటగ మార్చి

నీ అడుగులొ అడుగేయనా జన్మలు వలచి

 https://youtu.be/IYWz--pvDjg


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మరలి చూడకే నన్ను మరదలు పిల్లా

మరల మరల చూసావంటే మరి నే నొల్లా

మరువమంటి నిను చూసి పడ్డానే వెల్లాకిల్లా

మరులు రేగ నేనాగడమన్నది కలనైనా కల్లా


1.మరకతమణి చందమే నీదైన అందము

మరంద మధురిమ సమమే నీ అధరము

మరాళాన్ని తలపించు నడకలనీ వయారము

మరుడైనా హరుడైనా ఔతారు పరమునొదిలి నీ పరము


2.మరిచిపోతా నన్ను నేనే నువు గురుతుకొస్తే

మరిమనైనా ఎదిరిస్తా నువు చేయినందిస్తే

మరీచికలా మారకే చెలీ నా జీవన గమనమున

మరియాదతో దేవతగా గుడికడతా నా మనమున

Saturday, January 8, 2022

 https://youtu.be/7mPXe2v85Bw

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హరి కాంభోజి


నెమలికి ఇచ్చావు నాట్యము

పికముకు ఇచ్చావు గాత్రము

పిట్టకు సైతం ఇచ్చావు గ్రాసము

వరముగ ఇచ్చావు వాటికి స్వేచ్ఛా జీవితము

ప్రసాదించావు ముమ్మాటికి ఆనందమయ లోకము

ఏల స్వామీ  నీకు ఏక పక్షము-పక్షివాహనా ఈ పక్షపాతము


1.నరసింహుడవై ప్రహ్లాదుని గాచినావు

రఘురాముడివై హనుమని బ్రోచినావు

ధర శ్రీ కృష్ణుడివై రాధని వలచినావు

శీతకన్ను వేసితివే నాపై వేంకటాచలపతి

నా రాతనిలా రాసితివే తిరుమల శ్రీపతి

ఏల స్వామీ  నీకు ఏక పక్షము-పక్షివాహనా ఈ పక్షపాతము


2.త్యాగరాజు ఒసగినాడ ఏదైనా లంచము

అన్నమయ్య అందించిన దే బహుమానము

నాకైతే మాటలొ పాటలో నీతోడిదె  ప్రపంచము

శిఖరము చేరేంతలొ లోయలోకి తోయాలా

తీరము దాపులొనె నావముంచి వేయాలా

ఏల స్వామీ  నీకు ఏక పక్షము-పక్షివాహనా ఈ పక్షపాతము

 

https://youtu.be/3LZ0Ouo82mQ?si=iBnSwoPnFq-tNeVx

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నేత్రాల కెంత ఆతృత-అరవిందాలై విప్పారగ

ముంగురులకెంత తొందర-మధుపాలై అధరాల వాలగ

పోతపోసి చేసాడు నిను ఆ విధాత

నువు అపరంజి చందనాల కలబోత

నినుగన్న  కనులకు ఆనందనందనం

నినుగన్న జననికిదే నా అభివందనం


1.చంద్రికయే కొలువుదీరు నీ హాసాన

ఇంద్రధనుసు విరిసేను నీ మేనున

చిలకలు కులుకులీను నీ పలుకుల

అలకనంద స్ఫురించేను నీ నడకల

నినుగన్న  కనులకు ఆనందనందనం

నినుగన్న జననికిదే నా అభివందనం


2.గొంతెండిన దాహార్తికి నీవే చలివేంద్రం

మైత్రీ బంధానికి నువు అనురాగ సంద్రం

ఆదరణతొ అలరించును నీ విశాల హృదయం

నీ చేరువలోనున్నంత గురుతురాదు సమయం

నినుగన్న  కనులకు ఆనందనందనం

నినుగన్న జననికిదే అభివందనం

Friday, January 7, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పెరుగుతోంది నీకూ నాకూ మధ్య దూరం

హెచ్చుతోంది సైచలేక నా హృదయ భారం

వీడక తప్పదు పరస్పరం ఏ నాటికైనా

విషాదమేలే తుదకు ఏ బ్రతుకు నాటికైనా


1.మన పరిచయమే ఎంతో విడ్డూరం

మైత్రీబంధమైతే మరింతటి అబ్బురం

అడుగిడు ద్వారం లేనిది మన ప్రేమ మందిరం

అల్లంత దవ్వునుండి అది అత్యంత సుందరం


2.కలలే కంటున్నా నెమరువేసుకుంటున్నా

శిలలా పడి ఉన్నా శిల్పి కొరకు చూస్తున్నా

ఎందుకు ఎదురొచ్చావో  ఎదను గాయపర్చావు

మందమతిగ నను మార్చి మందహాసమిస్తున్నావు

Thursday, January 6, 2022

కంటికి రెప్పగ కాచుకునే మముకన్నతల్లివి నీవే

కడుపు నిండా అన్నం పెట్టేటి మాకల్పవల్లివి నీవే

మట్టినైనా  బంగారంగా మార్చే పరసువేదివే

పుట్లకొద్దీ ధాన్యం పండేటి పురిటి గడ్డ నీవే

నేలమ్మ నేలమ్మ నేలమ్మా మా ఇలవేలుపు నీవమ్మా

చేలమ్మ చేలమ్మ పంటచేలమ్మా మా మాగుండె సవ్వడి నీవమ్మా

నిన్నే నమ్ముకున్నాము- నీవే సొమ్మనుకున్నాము

మా దమ్ము ధైర్యం నీవుగా  నిబ్బరంగా మేమున్నాము

అంబరాన్ని తాకుతున్నాము సంబరాలతేలుతున్నాము 


1.ఏడాది పొడుగునా మూడు పంటల నిచ్చేవు

ఏరువాక సాగేవేళ మా వెన్నుతట్టి నడిపేవు

సారవంతమైన నీ ఒడిలో సాగుతుందిలే మా సాగు

నువు సాయమందిస్తుంటే వ్యవసాయం కొనసాగు

నాగళ్ళతో దున్నినంత మా వెన్నదన్నుగా ఉంటావు

కొడవళ్ళతొ కోసినంత మా గాదెలనంతా నింపేవు

కుప్పలు తెప్పలు పంటపండగా రోజూ మా ఇంట పండగ

అప్పుల బాధలు ఉండనట్లుగా ఉంటావు నీవే మాకు అండగ


2.పల్లె కాస్త పట్నమైతుందని కన్నతల్లి నిన్ను వదులకొన్నాము

బేరాలు సారాలు పెద్దయాపారాలు పెంపైతవనుకున్నాము

కర్మాగారాలు కంపెనీలు ఎన్నెన్నొ పెడతారనుకొన్నాము

చదువుకున్న మా సంతతికి కొలువులొస్తయని నమ్మాము

ఉన్న ఈ బ్రతుకునింకెంతో ఉన్నతంగ ఊహించుకొన్నాము

రైతే రాజై రాజ్యాలేలినట్లు మేము పగటి కలలే కన్నాము

కన్నుమూసి తెరిచేలోగా ఉన్నది ఆ కాస్తా ఊడిపోయేనే

అనుకున్నదొకటి అయ్యింది ఒకటై పంట పొలమే బీడాయే

ఊరు ఊరే వల్లకాడాయే


Tuesday, January 4, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మోము చూపించవా

మోవి నందించవా

మోమాటమేల మోహనాంగి

మోదము కూర్చవే నా సారంగి


1.మోహాతిశయమున మోహరించితి

మోడిన బడ నా నిబ్బరమగు మతి

మొగపడితి నీ మెలపునికనే మోకరిల్లితి

మ్రోలనుంచితి నా మనసను బహుమతి


2.మోక్షము నాకొకటే సఖీ నీ సమక్షము

మోకంటి బంధానికి మన ప్రేమే సాక్ష్యము

మోసము జేయకు నను మోడుగ మార్చకు

మోటనమాడదు నినుగనక నన్నేమార్చకు

Monday, January 3, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


బొత్తిగా నను మరిచిపోయావు

ఉత్తినే నాపై అలకబూనావు

గుర్తు చేసుకుంటావా రోజుకొక్కసారైనా

పరితప్తవౌతావా స్వప్నలోకమందైనా

ఎలా ఔతుంది చెలియా ఏకపక్ష ప్రేమనాది

మన ఇరువురికుంది కదా కలవాలనే మనాది


1.పట్టించుకోవా అంటే అది సత్యం కాదు

ఇష్టం ప్రకటిస్తావంటే అదికూడ నిజంకాదు

వదులుగా ఉండవు వదిలించుకోనూ లేవు

కాదగిన కార్యాలన్నీ కాలానుకె వదిలేస్తావు

ఎలా ఔతుంది చెలియా ఏకపక్ష ప్రేమనాది

మన ఇరువురికుంది కదా కలవాలనే మనాది


2.బయటపడవే మాత్రమైనా నీది ప్రేమ సూత్రమే

బద్నామైపోతుంది నీ ఎదురుగ నాలోని ఆత్రమే

ఓరుగల్లు పట్నమొచ్చినా నా ఓపిక కిక అంతే లేదా

మన ప్రేమ రీతి నభూతోనభవిష్యతి అంతే కదా

ఎలా ఔతుంది చెలియా ఏకపక్ష ప్రేమనాది

మన ఇరువురికుంది కదా కలవాలనే మనాది

Sunday, January 2, 2022

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మరులు రేపుతున్నావే మధిరాక్షి

వలపు గెలుచుకున్నావే వనజాక్షి

మౌనమేలనే నా ఎడల మీనాక్షి

కరుణ జూడవేలనే నన్నిక కామాక్షి

నీ పాద దాసుడినై కొలవనా నిను జన్మజన్మలు

నీ ప్రియ భక్తుడనై కోరనా ఇహ పర సౌఖ్యములు


1.నీ నయనాలు దయాపారావతాలు

నీ అధరాలు మకరంద సరోవరాలు

నీ మందగమనాలు తలపించు ఐరావతాలు

నీ అందచందాలు అందగ ఆపాత మధురాలు

నీ పాద దాసుడినై కొలవనా నిను జన్మజన్మలు

నీ ప్రియ భక్తుడనై కోరనా ఇహ పర సౌఖ్యములు


2.నీ సన్నిధి మనగలిగిన మదికి పరవశాలు

ప్రసాదించవే మాతా సంగీత సాహితి కలశాలు

నలుదిక్కుల వ్యాపించిన నవమోహిని నీవె దిక్కు

పలుచిక్కులు తొలగించిన కైవల్యమె నాకు దక్కు

నీ పాద దాసుడినై కొలవనా నిను జన్మజన్మలు

నీ ప్రియ భక్తుడనై కోరనా ఇహ పర సౌఖ్యములు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:ఉదయ రవి చంద్రిక


ఎక్కడిదా వైభోగం ఏడు కొండలరాయ

మాయమ్మ శ్రీ రాగాన నీ ఎడదను తాను వెలయ

అలవికానిదీ నీ వైభవం అచ్యుతానందమయ

తిరుచానూరున పద్మావతిని ప్రతిరేయీ నువు కలయ

గోవింద గోవింద హరే ముకుంద  మురారి మాధవ పరమానంద


1.కాంతుల కాంచన  శిఖరం కాంచిన నయనానందకరం

బంగారు వాకిళ్ళ నీ మందిరం భావించినను ప్రియకరం

జగన్మోహనకరమైన నీ దివ్య దర్శనం జన్మసాఫల్యకరం

పరమపావన నీ పదతీర్థ సేవనం సర్వదా ఆరోగ్యకరం

గోవింద గోవింద హరే ముకుంద  మురారి మాధవ పరమానంద


2.తల నీలాలొసగినంతనే తొలగును మా తల బిరుసు

కోనేటిలొ మే మునిగినంతనే కరుగును మాలో దురుసు

లడ్డూప్రసాద మహిమను గూర్చి ఎందరికని ఇల తెలుసు

ఇడుములనడ్డెడి ఆపద్బాంధవ ఎన్నలేనిదే నీదొడ్డ మనసు

గోవింద గోవింద హరే ముకుంద  మురారి మాధవ పరమానంద

 https://youtu.be/FWBwDBM9I20?si=H5dwYo203iSfAapH

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ

రాగం : శ్యామ

పద చిత్రాల్లో పొదువుకుంటున్నా

ఎద లోతుల్లో నిన్నేలుకుంటున్నా

మధురానుభూతులే నెమరువేసుకుంటున్నా

మరల మరల చెలీ నీ కలయికనే కోరుకుంటున్నా


1.తూనీగ ఏదైనా నీమీద వాలిందా ఏమైనా చెప్పిందా

తారక ఒకటైనా  పలకరించి నవ్విందా నా మదిని విప్పిందా

నీ పదాలు తాకిన గోదారి నా పెదాలు తడిపింది

నీ కురులు మీటిన చిరుగాలి నా అలసట తీర్చింది


2. కోవెలలో దేవిని సైతం ఏ పూట కన్నా నీవేననుకుంటున్నా

కోనేటి నీటిలోనా కలువ రేకు నీకన్నానా అని మురిసిపోతున్నా

నీ కూనిరాగమేదో నా చెవిని గుసగుసలాడింది

నువు కలగను రసయోగమేదో నను తట్టిలేపింది

Friday, December 31, 2021



https://youtu.be/vfoXvtQUvkQ?si=AxHsCaCTixsL1JRP

మూలాలు వదలకుండా కాలాలు దాటుదాము

తత్వాన్ని వీడకుండా మానవత చాటుదాము

ఆరారు ఋతువులున్నా వెన్నెలల నవ్వులిద్దాము

వైరుధ్యమెంత ఉన్నా వసుధైకభావమై వసిద్దాము


1.అలుపాట విడుపుకోసం అన్వేషణ సాగిద్దాము

పండగంటు ఏదొచ్చినా సంబరాల మునిగేద్దాము

జీవితానికి పరమార్థం ఆనంద మందడ మొకటేగా

కలుపుకుంటు పోయామంటే కలిగేదిక సుఖమేగా


2.సంకుచితమైన భావనలు వింతవింత వాదనలు

తొలగించవు ఏ మాత్రమైనా ఎద దాగిన వేదనలు

ఏడాదికొకసారైనా ఎదురైన ఏదో ఒక హేతువుతోనైనా

ప్రతిరోజూ సంతోషిద్దాం ప్రమోదాలనే పంచుకుందాం


3.ఏ దినమూ అమ్మను కానక మాతృదినం ఎందుకంటాం

తెలుగుదనం ఊసేలేక ఆంగ్లవత్సరాదిని నిరసిస్తాం

జన్మదిన వినోదాలనూ రసాభాసగా రచ్చరచ్చచేసేస్తాం

భారతీయ విలువల మాటలు వలువలందూ విస్మరిస్తాం


Wednesday, December 29, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కథ కార్తీకదీపమైంది

కరోనా తిరిగి పుంజుకుంది

పెంచిపోషించినంత కాలం

దీపపు జ్వాలలొ మనమే శలభాలం

సమసి పోయేవరకు తప్పని సరి తగు జాగ్రత్తలు

అనివార్యం జీవితకాలం మన ముక్కున మాస్కులు


1.కొత్తకొత్త మలుపులతో చిర్రెత్తే మజిలీలతో

సాగే సాలీడు జిగురులా  ఎడతెగనిదా వైనం

వింతవింత రూపాంతరాలతో వికృత దాడులతో

డెల్టా ఒమిక్రాన్ డెల్మిక్రాన్  కరోనా నామాలనేకం

సమసి పోయేవరకు తప్పని సరి తగు జాగ్రత్తలు

అనివార్యం జీవితకాలం మన ముక్కున మాస్కులు


2.మనుగడ కోసం ఇరువురి  తీవ్ర పోరాటం

మనిషినే శాసించే కరోనాతో ఏల చెలగాటం

దొంగదెబ్బ తీయడానికి కాపుకాసింది కౄర కరోనా

ఏమరుపాటెపుడైనా చెల్లించాలి బ్రతుకనే జరిమానా

సమసి పోయేవరకు తప్పని సరి తగు జాగ్రత్తలు

అనివార్యం జీవితకాలం మన ముక్కున మాస్కులు

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఒక నేను ఒకే నేను

ఎన్నో నేనులుగా అన్నీ నేనను నేనులుగా

తెలిసిన నేనులు కొన్ని తెలియని నేనులు ఎన్నలేనన్ని

అంతులేని యానంలో అహంకారిగా నేను

అహం త్వమేవాహమై ఏకైక సోహం గానేను


1.నేను గా మొదలై నేనూ గా కదలాడి

నేనే అన్న స్థాయికి ఎదిగీ ఎగిరీ కూలబడి

నేనేమో ఎరుగని ఎవరు చెప్పినా వినని నా నడవడి

నాదైన వాదనతోనే అందరితోనూ కలబడి

అంతులేని యానంలో అహంకారిగా నేను

అహం త్వమేవాహమై ఏకైక సోహం గానేను


2.తెలుసనుకొనే నేను సైతం అజ్ఞానమేనని

తెలిసీ తెలియని నేను కాసింత తెలుసుకొని

తెలుసుకొన్న సంగతి ఒకటే ఏ మాత్రం తెలియదని

నన్ను నేను తెలుసుకొనే జిజ్ఞాసే గమ్యమని

అంతులేని యానంలో అహంకారిగా నేను

అహం త్వమేవాహమై ఏకైక సోహం గానేను

Tuesday, December 28, 2021



 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


https://youtu.be/4nu5E3oqUJY?si=4zbJi2qLqH2XQyZh


నిద్రలేమి నీవల్లే ఎంతటి మోక్షగామికైనా

జాగృతమౌతాయి కాంక్షలు ముదిమి కైనా

వ్రతభంగమౌతుంది అస్కలిత బ్రహ్మచారికైనా

కోర్కె మేలుకుంంటుంది వింతగ సాటినారికైనా


1.పురివిప్పిన నినుగాంచి మబ్బునాట్యమాడుతుంది

నీ గాత్ర మధరిమ కోరి ఆమని అరుదెంచుతుంది

ఆపాదమస్తకం మదనరంగమే నీ అందాల అంగాంగం

వాత్సాయన శాస్త్ర రూపమై పొంగిపొరలె నీ శృంగారం


2.ప్రతి పుటలో ప్రస్ఫుటమే నీమేని గ్రంథాన రతికేళి విన్యాసం

వీణియలా వేణువులా తబలాలా ఎట మీటినా రస సంగీతం

తారాస్థాయిచేరుతుంది అనుభూతి సారమంతా సారవంతమై

తీరా తీరం చేరినంతనే తిరిగి మొదలౌతుంది పయనం పంతమై

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సజీవంగ ఉండాలి మనిషెప్పుడు

చోటునార్జించాలి జనుల మదిలొ గుప్పెడు

కీర్తిని గడించాలి లోకోపకారియై

మన్నన పొందాలి మహనీయుడై

మహత్మా గాంధీలా మదర్ థెరిసాలా అబ్దుల్ కలాం లా


1.ప్రవర్తించాలి అనునిత్యం దయామయుడై

ఆచరించి చూపాలి నడత ఆదర్శప్రాయుడై

ఆదరించగలగాలి అందరిని స్నేహశీలుడై

అసామాన్యుడైనా మెలగాలి నిస్వార్థుడై

వివేకానందునిలా నెల్సన్ మండేలాల బిస్మిల్లా ఖాన్లా


2.అడుగులేయాలి సగటు మనిషి దిశగా

ఆవిష్కరించాలి సకల మానవ హితైషిగా

కొలువుండాలి గుండెల్లో బడుగుల ఆశగా

జాగృత పరచాలి జాతిని తను మార్గదర్శిగా

రతన్ టాటాలా ఐన్ స్టీన్ లా అంబేడ్కర్ లా

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


సాటి మనిషి ఎదుగుదలను సైచలేని గుణం

నిలువెల్లా నిండినది మనుషుల్లో ఓర్వలేనితనం

తనకున్నా లేకున్నా ఒరుల ఎడల అసూయే

తలవంచుక చనలేక మాటలు చేతలు విషమాయే


1.గొడ్డలి కామాయే చెట్టుకు చేటాయే

తనజాతి వారెపుడు జనులకు కడు హానియే

పొందేదేది ఉండదు ఈర్ష్య వల్ల పైశాచికత్వం మినహా

కోల్పోయేదీ ఉండదు కుళ్ళుబోతు ఆంబోతు తరహా


2.అరిషడ్వర్గాలలో అయితేనేం అది ఆఖరిది

అర్థరహితమే అది వ్యర్థమైనది అనర్థమైనది

వ్యక్తిత్వానికి మానవత్వానికి మాయని మచ్చఅది

అకారణంగా విరోధాన్ని పెంచునది మత్సరమన్నది

Saturday, December 25, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


చలికాలమే నచ్చదు నాకు

చెలి సరసన నేనసలే లేనందుకు

హేమంతమంటే పంతమే నాకు

చెలికూపిరాడకుండ చేసినందుకు

ఎంతగర్వమో ఈ శీతాకాలనికీ

వెన్నులోంచి వణుకే కనుక ఎంతటి మహాబలులకీ


1.చెలి వలపులె  నాలో సెగలు రేప

తోకముడుచుకుంటుంది చలి పులి

చెలి తలపులె  నాలో వగపు నింప

జ్వలించదా విరహాన వయసు ఆకలి

దూరలేక పోరలేక పారిపోవు పిరికి చలి

ఒళ్ళే నెగళ్ళుకాగ కాగదా వేడదా బ్రతకనీయ బ్రతిమాలి


2.ఆయుధాలె నా నెచ్చెలి అధరాలు

చెలరేగే చలి బారిని రక్షించగా

కంచుకోట జవరాలి బిగికౌగిలి

చొరబడితే చలికి మతి చలించదా

దూరలేక పోరలేక పారిపోవు పిరికి చలి

ఒళ్ళే నెగళ్ళుకాగ కాగదా వేడదా బ్రతకనీయ బ్రతిమాలి


https://youtu.be/X0vVq4mhkmY?si=ejh3uyJlF2uCGo38

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ 


అని నడుమన నుడివినావు గీతా మకరందము

అనుభవాల పరాభవాల సంసార సార చందము

పార్థుని సారథిగా తెలిపావు జీవన సన్మార్గము

బహుముఖాలుగా వర్ధిల్లగా వ్యక్తిత్వ వికాసము

కార్యోన్ముఖుల జేయుచు శాంతించగ తాపత్రయము


1.నవనీతాలు సరసాలు మాత్రమే కాదు నీ జీవితం

అది అడుగడుగున ఒడిదుడుకుల నవరస సమ్మిళితం

కారణమేదైనా మారణమిక తప్పదని తేటతెల్లమైనా

మానక పోతివి మానిని వలదన్నా రాజీ రాయభారాలు

ఎత్తుకు పైయ్యెత్తులు మాయోపాయాలు రాజకీయాలు


2. బంధాలకు బాంధవ్యాలకు ఇప్పించావు తిలోదకాలు

బీరువులా పాఱి వెనకడుగేయనీక అడ్డావు నీ మోకాలు

వ్యూహాలు ద్రోహాలు రణమందున సాధారణమే ఐనా

యుద్ధనీతి గెలుపు రీతి ఆపద్ధర్మయుక్తి నెరిగించావు

మనుగడకై పోరమని ఫలాపేక్షవలదని ప్రవచించావు

Friday, December 24, 2021

OK

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


కనుల కురిసేను చంద్రికాపాతాలు

అధరాల ఒలికేను సుధామధురాలు

నీ మాయలో బడని మనిషేడి మహిలోన

నినుగని అనిమేషులమే వీక్షించిన తక్షణాన


1.ఉదయించును నీ నుదుట ప్రత్యూష భానుడు

ప్రభవించును ముక్కెరగా పంచమితిథి చంద్రుడు

కృష్ణవేణి నదీ ప్రవాహం నీ నీలి కురుల సమూహం

రేగేను పరమేశునికి నీ చెంతన మరులు అహరహం


2.నీ ప్రతి రూపమే ఇలలో ప్రతి స్త్రీ మూర్తి

సౌందర్యలహరివి నీవే తీర్చవేల మా ఆర్తి

అడుగడుగున మామనుగడకు నీవేగా స్ఫూర్తి

నీ సన్నిధి చేరినపుడే నా మనసుకు సంతృప్తి

……………………………………… జన్మలకిక పరిపూర్తి


https://youtu.be/FGqrL_LKF6c?si=yVwAqWNoWZ5Kvkhn

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


ఆది అంతము లేనివాడు

చావు పుట్టుక లేనివాడు

నీలోను నాలోను కొలువైనవాడు

లోకములనేలేటి లోకేశుడు

పరమశివుడు సదా శివుడు సాంబ శివుడు

నమః శివాయ నమఃశివాయ నమఃశివాయ


1.అక్షిత్రయముతో అలరారు వాడు

కుక్షిలో విశ్వాన్ని కూర్చుకొన్నాడు

పక్షివైరుల ఒడలంత దాల్చువాడు

దక్షిణామూర్తిగా ప్రథమ గురువైన వాడు

పరమశివుడు సదా శివుడు సాంబ శివుడు

నమః శివాయ నమఃశివాయ నమఃశివాయ


2.భిక్షమెత్తును గాని ఐశ్వర్యమిస్తాడు

పరీక్షించితేనేమి మోక్షమే ఇస్తాడు

ప్రతిఫలాపేక్ష లేకుండ పనిచేయమంటాడు

దక్షాధ్వరధ్వంసి జగతికి ఏకైక లక్ష్యమేవాడు

పరమశివుడు సదా శివుడు సాంబ శివుడు

నమః శివాయ నమఃశివాయ నమఃశివాయ

 

https://youtu.be/Md4If263fAs?si=uxRSvKNmbA1u65fq

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ధనుర్మాసమంటేనే గోదా రంగనాథులకు ప్రీతి

మాసానం మార్గశీర్షోహం అని కదా గీతన ప్రతీతి

భక్తులకు వైష్ణవానురక్తులకు హరిపదమే శరణాగతి

బ్రహ్మీ ముహూర్తాననే స్వామికి అభిషేకార్చన హారతి


1.గజగజ వణికే వేకువ ఝామున  జాగృతమొంది

గజరాజ వరదుని నిజ మనమున ఆరాధించి

తులసీదళ మాలల గోవిందుని గళమున వైచి

తిరునామాలు తిరువాభణాలు అలంకరించి

తరించెదము ఇహపరముల నరహరి కనుగాంచి


2.శేషశయనుడు పద్మనాభుడు సిరి వల్లభుడు

క్షీరాబ్ది నిలయుడు భక్తసులభుడు ఆండాళ్ విభుడు

వైకుంఠ వాసుడు  వైజయంతి మాలాలంకృతుడు

శంఖచక్ర కర ధరుడు కౌస్తుభమణి వక్షాంకితుడు

గరుడ గమన సంచరుడు సాక్షాన్మోక్ష ప్రదాయకుడు

 

https://youtu.be/ZXh7pjWupFQ?si=xwC3JpCLKA1yBSCx

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నా ఊహల మంజరిని ఇస్తున్నా కానుకగా

మానస మంజూషను అర్పించా బహుమతిగా

అనవరతం నా కలమొలికే కృతి ఆకృతి గా

ఎన్నెన్ని జన్మలెత్తినా గీతా నీవే నా శ్రీమతిగా

నా దేహం హృదయం ప్రాణం సర్వం నీకోసమేగా


1.బలమైన తరుణం లో పరిచయమైనావుగా

అలవోకగ నను బుట్టలో వేసుకున్నావుగా

ఆత్మీయ మైత్రితో నేస్తమై  అలరిస్తున్నావుగా

అపూర్వమై అపురూప బంధమై పెనవేసినావుగా

నా దేహం హృదయం ప్రాణం సర్వం నీకోసమేగా


2.అనుక్షణం పరితపించి నను తలిచే నెచ్చెలిగా

ప్రణయంలో ముంచెత్తే నా ప్రియురాలిగా

నాతో కలిసి కడదాకా అడుగులేయు ఇల్లాలిగా

నన్నల్లుకపోయావే అభేదమై సిరిమల్లి వల్లిగా

నా దేహం హృదయం ప్రాణం సర్వం నీకోసమేగా

Thursday, December 23, 2021

 

https://youtu.be/6MwtG_XmcNs

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:హంసానంది


నీ విభాస వక్త్రము విస్ఫులింగ నేత్రము 

నీ తీక్ష్ణ ఆలోకము నీ భీకర లోలము

రక్తవర్ణ చేలము  రుధిర తప్త శూలము 

వాహనమే శార్దూలము మహిషాసుర మర్దనము

దుర్గా భవాని జననీ శర్వాణీ నమోస్తుతే శ్రీ మాత్రేనమః


1.భవతాపహారిణి దుష్కర్మ వారిణి  శివాని

దుర్జన భంజని నిర్గుణి నిరంజనీ శాంభవి

అరివీర భయంకరి నిజ కృపాకరీ శాంకరి

జపించెద భజించెద ఆత్మలో నిను దర్శించెద

దుర్గా భవాని జననీ శర్వాణీ నమోస్తుతే శ్రీ మాత్రేనమః


2.బ్రహ్మాచ్యుత శంకర వందిని గౌరి బ్రాహ్మిణి

శ్రీ వాణీ గిరిజా స్వస్వరూపిణి మారి రుద్రాణి

సకల భువన పాలిని కార్య కారణకారిణి ఆర్యాణి

 కీర్తించెద ప్రార్థించెద నిరతము నిను సేవించెద

దుర్గా భవాని జననీ శర్వాణీ నమోస్తుతే శ్రీ మాత్రేనమః

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎక్కడో ఉన్నాడు నా సద్గురుడు

నా కొరకే వస్తాడు నా నిజ గురుడు

రానైనా వస్తాడు తను నా కడకు

నన్నైనా పిలుస్తాడు రమ్మని కడకు

జీవాత్మ పరమాత్మల బంధం మాది

నన్నుధ్ధరించే కర్తవ్యం గురు స్వామిది


1.వెలుతురున్నా అంధకారం మదికి మాత్రం

చూడకుంది తెరుచుకోని నా మనోనేత్రం

గురుని ఎరుకకు ఎంత ఆత్రం ఎంత ఆత్రం

మార్జాల కిషోర న్యాయం నేనెరిగిన సూత్రం

జీవాత్మ పరమాత్మల బంధం మాది

నన్నుధ్ధరించే కర్తవ్యం గురుస్వామిది


2.అష్ఖాంగ యోగాన్ని   నేర్పుతాడు నేర్పుగా

కుండలినీ శక్తినుద్ధీపనజేస్తాడు ఎంతో ఓర్పుగా

యోగవాశిస్టాన్ని బోధిస్తాడు నాకు సుస్పష్టంగా

గురు కృప దొరకడమే నా జన్మకు అదృష్టంగా

జీవాత్మ పరమాత్మల బంధం మాది

నన్నుధ్ధరించే కర్తవ్యం గురు స్వామిది

Wednesday, December 22, 2021

 

https://youtu.be/GWTispMy4Hk?si=9E3nLk5qO76QxM-j

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నేనే …నువ్వై… ప్రేమైనాము

దేహం నీవై జీవం నేనై ఒకటైనాము

ఊహల్లో చేస్తున్నాను నీతో నే కాపురం

కలలకే పరిమితమైంది మన ప్రణయం

ఏకైక ఆదర్శ ప్రేమికుణ్ణే నేను

నీకోసం ప్రాణాలైదు అంకిత మిస్తాను


1.తూకం వేసాను లోకాన్నంతా

సరితూగలేకుంది నీపై నా ప్రేమంత

జల్లెడ పట్టాను ఈ జగమంతా

సాటిరాదేది నీ సౌందర్యమంత

ఏకైక ఆదర్శ ప్రేమికుణ్ణే నేను

నీకోసం ప్రాణాలైదు అంకిత మిస్తాను


2.సూర్య చంద్రులు చూడలేదులే

నా వంటి ఆరాధకుణ్ణి ఇలలో ఏనాడు

సృష్టి మొత్తంగా  జాడనే దొరకదులే

నా తీరుగ నీ కోసం తపించే తాపసెవ్వడు

ఏకైక ఆదర్శ ప్రేమికుణ్ణే నేను

నీకోసం ప్రాణాలైదు అంకిత మిస్తాను

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


గుండె చెమ్మగిల్లితే కన్ను ఊరకుంటుందా

మనసు నలిగిపోతుంటే నరకమింక ఉంటుందా

మతి లేని ఓ విధీ చేసితివి బ్రతుకు సమాధి

జీవశ్చవాలుగా ఇలా ఎన్నాళ్ళని జీవించేది


1.పుండు మీద పుట్రలాగా కష్టాల పరంపర

గాయాలు మానకుండా ఎదమీద శరంపర

అదిరిపాటుగా వెన్నుపోటుగా  అనుక్షణం ఎన్ని దెబ్బలు

నిలువెల్లా తగులబెడితివే మానేనా ఈ కాలిన బొబ్బలు


2.పరిష్కారమే లేనివి సృష్టించిన సమస్యలన్నీ

సమాధానమే దొరకవు  సంధించిన ప్రశ్నలన్నీ

ఎదిరించే మార్గంలేదు  దీనంగా మౌనంగా భరించడమే

తీర్చగలుగు  దేవుడే లేడు  పంటి బిగువు సైచడమే

Tuesday, December 21, 2021

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎన్ని కుంభకోణాలు పచ్చిదగామోసాలు

మాయోపాయాలు  పలికితె హేయాలు

మనుగడకై రగడలతో విలువలకే తిలోదకాలు 

కుట్రలు కుతంత్రాలు వెరసి నేటి నీచరాజకీయాలు


1.డబ్బుంటే రాజకీయాలు డబ్బుతో గబ్బు రాజకీయాలు

అబ్బోయని తబ్బిబ్బగు డబ్బు కొరకు రాజకీయాలు

పదవి కొరకు రాజకీయాలు పవరు కొరకు రాజకీయాలు

నోట్లు ఫీట్లు ఓట్లు వెరసి నేటి నీచరాజకీయాలు


2.కార్పొరేట్ల  రాజకీయాలు బ్యూరోక్రాట్ల రాజకీయాలు

గుడులు బడులు ఆసుపత్రుల భ్రష్టు పట్టించిన రాజకీయాలు

గల్లీనుండి ఢిల్లీదాక లొల్లిలొల్లి చిల్లర చిల్లర రాజకీయాలు

ఎంతకైన తెగింపులు వ్యవస్థకే తలొంపులు  వెరసి నేటి నీచరాజకీయాలు


3.

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఎక్కేస్తుంటారు ఎక్కేటివాళ్ళు

దిగిపోతుంటారు తావొచ్చినవాళ్ళు

ఎక్కడిదాకో ఈ బ్రతుకు బండి పయనం

మలుపులెన్నో మజలీలెన్నో చేరే లోగా గమ్యం


1.ఉండబట్టలేకా ఎందుకో ఆగడాలు

తమకే సొంతమంటు అందరితో జగడాలు

ఉన్నంతసేపే కద గొప్పలకై తిప్పలు

ఊరువచ్చినాక తొవ ముళ్ళ తుప్పలు


2.హాయగ గడపలేక ఎరనబడే చేపలు

పరిధే దాటక తిరిగే బావిలొ కప్పలు

సాలీడు గూటిలొ చిక్కే ఆశపోతు ఈగలు

భూగోళం కబళింపజూచు మూర్ఖపు డేగలు


3.చిరునవ్వుతొ పలకరించె పరిచయస్తులు

పరస్పరం తోడుండే నిజమైన దోస్తులు

బంధాలతొ బంధింపజూసె ధారాపుత్రులు

కడిచాక వెంటరానివి నీ ఆస్తిపాస్తులు

 https://youtu.be/27KKGz9YY3M?si=34ovFneMXuYaYkTS

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

రాగం:హిందోళ వసంతం

ఎవరన్నారు నిన్ను శివా
సర్వసంగ పరిత్యాగివని
నమ్మడమెటుల ఉమాధవా
సంసారం పట్టని యోగివని
నమఃశివాయ ఓం నమఃశివాయ
నమఃశివాయ ఓం నమఃశివాయ

1.సతికై పరితపిస్తివి వాడ వాడల
పార్వతికి వసతిస్తివి  నీ సగము  ఒడల
మోహ మొందితివి మోహిని ఎడల
తనయ తనయుల నొదలవైతివి చిక్కడి ముడుల
నమఃశివాయ ఓం నమఃశివాయ
నమఃశివాయ ఓం నమఃశివాయ

2. ధరియిస్తివి నెలవంకను నీ తలను
భరియిస్తివి ఇల భక్తజనుల వెతలను
అందిస్తివి  జగతికి సంగీత శాస్త్రమును
చిందులేస్తివి ఆనందమందును ఆగ్రహమందును
నమఃశివాయ ఓం నమఃశివాయ
నమఃశివాయ ఓం నమఃశివాయ


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నీ ఎద కుముదము కోరుకొనే

తుమ్మెదనై పొందెద మోదమునే

గ్రోలెద ప్రణయ మరందమునే

పెదవుల పొరలెడి మాధవినే

నీవే నెచ్చెలి నా మది మెచ్చెడి ఆమనివే


1. వన్నెల చిన్నెల విరుల మంజరి

మత్తిలు వలపుల అత్తరు కస్తురి

తాకిన జినుగుల హాయిడు సుదృతి

తరగక తొరగెడి మధుర సుధాఝరి

నీవే నెచ్చెలి నా మది మెచ్చెడి శర్వరి


2. కన్నుల కురియును కైరవిపాతం

గళమున వరలును సుస్వరపాతం

మనసంతా  మమతాన్వితమౌ నవనీతం

మేను వేణువే ఒలికించు సరసరమ్యగీతం

నీవే నెచ్చెలి నా మది మెచ్చెడి సంగీతం

 

https://youtu.be/czFSiBSX1po?si=G5_kbmv6vRJZMwae

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


లోక కళ్యాణకారకం శ్రీ శ్రీనివాస కళ్యాణం

జగదుద్ధార ఉద్దీపనం పద్మావతితొ స్వామి వివాహం

వేలకన్నులు చాలవు తిలకించగా ఆ వైభవం

భాషలేవీ తూగవు కీర్తించగా ఆ దివ్య ప్రాభవం

కమనీయమై రమణీయమై మది పులకాంకితమాయెగా

అమందానందకందళిత హృదయారవిందమాయెగా


1.బ్రహ్మ రుద్రులే పెండ్లి పెద్దలుగ

సకల దేవతలు పెండ్లికతిథులుగ

షణ్ముఖుడే ఆహ్వానము పలుకగ

వకుళమాత మానస తనయుడు

మహా లక్ష్మి ప్రియమైన  వల్లభుడు

వేంకటేశ్వరుడె  వరునిగ వరలగ


2.అశ్వత్థ వృక్షమే సాక్షిగ మారగ

ఉత్తర దిక్పతి అప్పును కూర్చగ

ఆకాశరాజుకు అనుంగు పుత్రిక

పద్మావతీ దేవి  నవ వధువవగ

అంగరంగ వైభోగంగా స్వామి పరిణయం 

కనివిని ఎరుగనిరీతిగా పాణిగ్రహణం

Ok

https://youtu.be/4S77nPSvlpI?si=SjIpwysMTvwPhvK0

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం : దర్బార్ కానడ

వాడిన మాల లేల నచ్చితివో
గోదాదేవి ఇచ్ఛగించి మెడనదాల్చి ఇచ్చినప్పుడు
ఎంగిలి పళ్ళనేల మెచ్చితివో
శబరిమాత వగరుతీపి రుచిచూసి ఇచ్చినప్పుడు
భక్తిభావనే నీకు కడు ప్రీతికరము భౌతికపరమైన చర్యకన్నా
ముక్తినొసగ తగనా కనికరించి బ్రోవగనను తిరుపతి వెంకన్నా

1.పక్షిదెంత ఆయమో అందుకొనగ మోక్షము
ఉడతదెంత సాయమో  కీర్తిగొనగ అక్షరము
మార్గమేది ఎంచుకున్నా చేర్చును నీ సన్నిధానము
చిత్తశుద్దితో అర్చన చేయగ ఏదైనా సరె విధానము
భక్తిభావనే నీకు కడు ప్రీతికరము భౌతికపరమైన చర్యకన్నా
ముక్తినొసగ తగనా కనికరించి బ్రోవగనను తిరుపతి వెంకన్నా

2.తులసీదళమెంత బరువని తూచింది నిన్ను సైతం
అటుకులు పిడికెడు ఐతేనేమి తెలిపాయి గాఢ స్నేహం
శేషప్ప కొలిచాడు పద్యశతముల పొగిడీ తెగిడీ
అన్నమయ్య కీర్తించాడు వేలకృతుల పాడీ వేడీ
భక్తిభావనే నీకు కడు ప్రీతికరము భౌతికపరమైన చర్యకన్నా
ముక్తినొసగ తగనా కనికరించి బ్రోవగనను తిరుపతి వెంకన్నా


 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


ఊరూరా నీ ఊసాయే-మదిమదిలో నీ ధ్యాసాయే

షిరిడీ చనగ నిను దర్శించగ సాయీమాకు మనసాయే

పరమదయాళా నువు దయగనగ బ్రతుకంతా కులాసాయే

అక్కునజేర్చి చక్కని దెసకు నడిపించమనిమా కాసాయే


1.సాటి మనిషిని ఆదరించని ప్రతివారూ కసాయే

ఆత్మస్తుతి పరనిందలతో ఎప్పుడు ఒకటే నసాయే

విద్వత్తున్నా విజ్ఞతలేకా సంస్కారమంతా మసాయే

అభిశంసలకు ఆక్షేపణలకే వృధా పరిచెడి మా పసాయే

అక్కునజేర్చి చక్కని దెసకు నడిపించమనీ మా కాసాయే


2.స్థాయికి తగని వారైనా ఎదలొ ఎందుకొ జెలసాయే

అనుభవజ్ఞతే ముదిరిన గాని ఎదగని ఒదగని వయసాయే

ఔచిత్యం ఔన్నత్యం లేని వాదమే గురివిందా పూసాయే

మార్మిక పదముల అక్కసుకక్కే తింగరి తింగరి బాసాయే

అక్కునజేర్చి చక్కని దెసకు నడిపించమనిమా కాసాయే

Wednesday, December 15, 2021

https://youtu.be/njTtSbPMiGY

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ


తెల్లామద్ది కొమ్మవే - పిల్లా ముద్దుగుమ్మవే

హద్దుపద్దూలేకుండా అందాలద్దబడినపూరెమ్మవే

వద్దనలేనే నీ చూపు సుద్దగు పిలుపులను

వద్దకు తేవే నీ కైపు ముద్దగు పెదవులను


1. మావితోట మరుగు కాడ 

మాటువేసినావే కన్నుగీటినావే

ఏటిగట్టున పొదల కాడ 

 కాపు కాసినావే నాచేయి పట్టినావే


పరువాలను మూటగట్టి మాగబెట్టి నావే

ఏండ్లకేండ్లు నిదుర సైచి ఎదిరి చూసినావే


2.హంపి శిల్పపు వంపులెన్నో 

నింపుకొంటివి ఒంటినిండా

ఖజురహోజాణల భంగిమలెన్నో 

వంపుచుంటివి వలపే పండ


నీకై నేనుంటా బ్రతుకంతా అండదండ

నీతో ప్రతి కలయకా కమ్మని కలకండ


OK

 

https://youtu.be/tnGZwBbqPE8?si=fOL6Ll-FSc097eN2

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


పాము నీకు తల్పము పక్షి నీ విమానము

పాలకడలిలో నీ నివాసము-నీ ఎదన నీ ఎదుట శ్రీనివాసము

చెప్పనలవి కాదు నీ వైభోగము-శ్రీ వేంకటేశ నీ వైభవము

నను బ్రోవగ ఇవియేనా నాపాలిట ఆటంకము


1.కోటానుకోట్లుగా నీకుండిరి భక్తజనము

నీ కృపకై వేచేరు నీ వాకిట అనుదినము

కన్నుమూసి తెరిచేంతలొ మాయమయే నీ వైనం

పడిగాపులు పడితేనేం భాగ్యమె నీ దర్శనం

చెప్పనలవి కాదు నీ వైభోగము శ్రీ వేంకటేశ నీ వైభవము

నను బ్రోవగ ఇవియేనా నాపాలిట ఆటంకము


2.మొక్కులు ముడుపులు లెక్కలేని కానుకలు

పలురకాల సేవలుగొన పగలురేయి తలమునకలు

నిత్యోత్సవ బ్రహ్మోత్సవ దివ్యోత్సవ వేడుకలు

తిలకించెడి నయనాలకు అదృష్ట దీపికలు

చెప్పనలవి కాదు నీ వైభోగము శ్రీ వేంకటేశ నీ వైభవము

నను బ్రోవగ ఇవియేనా నాపాలిట ఆటంకము

Monday, December 13, 2021


రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నీగమ్యం నా గమ్యం ఒకటే ప్రేమ

నీధ్యేయం నా లక్ష్యం ఒకటే ప్రేమ

కడు భవ్యం రసరమ్యం మనదైన ప్రేమ

కమనీయం రమణీయం మనసైన ప్రేమ


1.నీ పయనం ఉత్తరమాయే వింతగా

నా గమనం దక్షిణమాయే చింతగా

వ్యతిరేక దిశలో వెళితే ఎప్పటికౌనో మన కల ఇక  కలయిక

దిక్కులను ముక్కలుచేసైనా కానీయను కలయిక కల ఇక


2.అందరాని ఆకసమైతివి చెలియా చిత్రంగా

అందుకొనగ సంద్రపు కరనైతిని నేనాత్రంగా

నా తీరు మార్చుకొని నేనావిరై మబ్బునై నిన్ను చేరెద

గాలి నను వానగ నేలని చేర్చినా వారాశి అలనై కరిగెద

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


నవ్వులు జళ్ళో మల్లెలైనాయి

కన్నులు కరమున కమలాలైనాయి

చూపులు మధువున కైపులైనాయి

తిలకపు చెమకులు  తూరుపు వెలుగుల రేఖలైనాయి

చెలీ ప్రేమాంకురమైంది చూడగనే నీ చిత్రం 

చెలీ నీ చేయినొదలను ఏడుజన్మలు మాత్రం


1.అందమంతా పరచుకుంది నీ అంగాగం

అంతకుమించింకేదో ఉంది నీలో వైభోగం

కదలాడుతోంది వదనాన ఏదో వలపు కవ్వింపు 

ఉసిగొలుపుతోంది ఉల్లాన్నికాస్త చిలిపి ఊరింపు

చెలీ ప్రేమాంకురమైంది చూడగనే నీ చిత్రం 

చెలీ నీ చేయినొదలను ఏడుజన్మలు మాత్రం


2.తలతిప్పనీకుంది పొందికైన నీపొంకం

రెప్పవాల్చనీకుంది ముద్దుగొలుపు నీ మురిపెం

తిప్పలెన్ని పడితేనేమి చేసుకొనగ నినునా సొంతం

ముప్పు వస్తె ముంచుక రానీ అంకితమిస్తా నాజీవితం

చెలీ ప్రేమాంకురమైంది చూడగనే నీ చిత్రం 

చెలీ నీ చేయినొదలను ఏడుజన్మలు మాత్రం

Thursday, December 9, 2021


https://youtu.be/Qz_WvRZftYU

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


రాగం:యమన్


అదేం గమ్మత్తో -పలుకులు పంచదార చిలుకలవుతూ

అదేం మత్తో-చూపులు పారిజాత చినుకులవుతూ

తలపులు వలపు తలుపులు తడితే

తలగడలు తమకాల పడగలవుతూ…

మనసులు పరస్పరం రమిస్తే

యుగాలే ఫఠేల్మనే బుడగలవుతూ…


1.ఎదిరిచూపులు- ఎదను చీల్చే తూపులవుతూ

రేపులు మాపులు- మునిమాపునకు సైతం రిపులవుతూ

ప్రాపుకోసం దాపుకోసం ప్రాయపుతాపపు తహతహలవుతూ

మనసాకలికి ప్రతీకలవుతూ కనే ప్రతీకల హాయిగొలుపు నెమలీకలవుతూ

అంతలోనే కడువింతగా తనువంతా చింతరేపు మరీచికలవుతూ


2. గంధర్వఅందాలు- మేను మేనంతా మకరందాలే

ప్రవరుణ్ణీ మునివర్యుణ్ణీ రెచ్చగొట్టే ఇందుకళిక గంధాలే

వదనారవిందము పాదారవిందము నయనారవిందాలే

డెందమరవిందచందమై మరుల భ్రమరాలకు రసవిందులే

మధురోహలే ప్రణయ వీణియ మీటగా జీవితమే పసందులే

 రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


రాగం:మధ్యమావతి


నాకు కీర్తి నిను కీర్తన చేసినప్పుడే

నాకు తృప్తి నువ్వు  ప్రాప్తించినప్పుడే

నా ఆర్తి నీ పదములు చేరుటొక్కటే

తల్లీ భారతీనను చప్పున బ్రోవుమిప్పుడే


1.తుచ్ఛమైన ఇచ్ఛల ఎడ నా మది మళ్ళించకు

స్వఛ్ఛమైన యోచనలను సమకూర్చవె నా మేధకు

అచ్చెరమొందెడి అచ్చరమవనీ తిరముగ నను జగతీ

మచ్చరమే లేకుండగ మెచ్చనీ సహకవులిల సరస్వతీ


2.రామకృష్ణ కవిని నాడు కనికరించినావటా

రామకృష్ణ పరమహంస ఎదన నిలిచినావటా

రామకృష్ణ నామముతో వరలుచుంటి నీ ఎదుటా

పరమతృష్ణ నిను చేరుట మన్నించవె వాణీ నా మాటా

Tuesday, December 7, 2021

 రచన,స్వరకల్పన&గానం: డా.రాఖీ


ప్రేమ పుట్టి తీరుతుంది నిన్ను చూసి చూడగానే

కన్నుకుట్టి తీరుతుంది అందగత్తెకైనా నీవెదురు పడగానే

తప్పుకానే కాదులే ఎవరికైన నిన్ను తేరిపారచూడగ మనసైతే

తప్పైనా తయారే ఎంతటి శిక్షకైనా పద్మినీ జాతిది నీ సొగసైతే


1.తొంగితొంగి చూస్తాయి భ్రమరాలై నీ ముంగురులు

నీ ముఖారవింద మందు మకరంద మందడానికే ఆ తొందరలు

పందాలు కాస్తాయి నీ జళ్ళోని తెల్లని సిరిసిరి మల్లియలు

నీ మేని మెరుపుల తళుకుల సరితూగవనీ తెలిసీ ఆ హొయలు


2.నీ వాలుచూపులకు వాలిపోదురు ఘనులు మునులు 

నీ కొఱ నగవుకు దాసులౌదురు ఋషులు ఘోటక పురుషులు

చూస్తుండి పోవడానికే  సరిపోదు నాకొక జీవితకాలము

నీ గుండెగ మారడానికి జన్మలెన్ని  ఎత్తాలో లెక్క తేలము