Saturday, September 19, 2020

 రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ


మాటల్లా పాటౌతోంది మధుసూదనా

పాటే నిత్యం నాకు సాపాటౌతోంది 

పదమల్లా శ్రీ పదమౌతోంది జనార్ధనా

నీ పదపద్మాలచేర్చు బాటౌతోంది

శ్రీధరా శ్రీకరా శ్రీనివాసుడా కనికరించు వేవేగ

తపించనీ తరించనీ నను భవబంధాలు వీడగ


1.అన్నమయ్య పాటలా అలరించనీ

త్యాగయ్య కృతివోలె మైమరపించనీ

క్షేత్రయ్య పదము భంగి సింగారమొలకనీ

శ్యామయ్య కీర్తనయై తత్వంబోధించనీ

శ్రీధరా శ్రీకరా శ్రీనివాసుడా కనికరించు వేవేగ

తపించనీ తరించనీ నను భవబంధాలు వీడగ


2.జయదేవుని అష్టపదిగ పరవశింపజేయనీ

పురంధరుని గీతికగా రంజింపజేయనీ

రామదాసు గేయమై శ్రవణపేయమవనీ

మీరా భజనగా తన్మయమొందించనీ

శ్రీధరా శ్రీకరా శ్రీనివాసుడా కనికరించు వేవేగ

తపించనీ తరించనీ నను భవబంధాలు వీడగ

Wednesday, September 16, 2020



సమర్థ సద్గురుసాయినాథా
సమస్తలోకాలకే అధినేతా
భక్త సులభ భవబంధమోచకా
అనురక్తి యుక్త ముక్తిమార్గ బోధకా
జయజయధ్వానాలు సాయీ నీకు
సాష్టాంగ వందనాలు నీ పాదాలకు

1.సాయనిపిలువగనే ఓయంటావు
మా ఇంటితలుపు తడుతుంటావు
నిండుగ గుండెలోన స్థిరపడతావు
కొండంత అండగ నిలబడతావు
జయజయధ్వానాలు సాయీ నీకు
సాష్టాంగ వందనాలు నీ పాదాలకు

2. మా మొరలే నీకు వేదమంత్రాలు
మా పంచప్రాణాలే పంచహారతులు
మా నాలుకయే నీకు పల్లకీ సేవ
ఏకాదశ సూత్రాచరణ మాకు త్రోవ
జయజయధ్వానాలు సాయీ నీకు
సాష్టాంగ వందనాలు నీ పాదాలకు
https://youtu.be/R3zUnJOa1m4?si=wuF4fIhfQtj3v1WP

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

నింగిన పూసే సింగిడి నీవు
నగవులు కాసే జాబిలి నీవు
దారితప్పి నేలన రాలిన ఉల్కవు నీవు
వేకువ వాకిటి వెలిగే వేగుచుక్కవు నీవు
మన మైత్రీబంధం హిందోళరాగమై
మన కవన సుగంధం సంధ్యార్ణవమై

1.కైలాసగిరిపై మెరిసే పసిడి ఉషఃకిరణం  నీవు
తాజ్ మహల్ పైన కురిసే చంద్రాతపం నీవు
కొలనులో విచ్చుకున్న ఎర్రకలువవే నీవు
రవినిగాంచి తలతిప్పే సూర్యకాంతి పూవు నీవు
మనస్నేహ యోగమే మోహనమై
సాహితీ సంగమమే జీవనమై

2.ఎడారిలో పిపాసికీ ఒయాసిస్సు నీవు
ఊబిలోకి జారేవేళ ఊతమై నిలిచేవు
ఊపిరాగిపోతుంటే ప్రాణవాయువౌతావు
నీవున్న తావులో మోదాన్ని పంచుతావు
మన చెలిమియే హంసానందియై
సారస్వతలోకంతో మనం మమేకమై

చిత్ర సహకారం: Sri.  Agacharya Artist
https://youtu.be/6_bRoPESnCI?si=OwWzczRjVnmRQ7W1

రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మోహన

అన్ని కాలాలూ అనుకూలాలే వలపుపంటకు
అన్ని సమయాలూ ఆమోదాలే పడుచుజంటకు
మధుమాసం పంపుతుది ఆహ్వానం
పికగాత్రం పలుకుతుంది స్వాగతం

1.గ్రీష్మతాపం ఆర్పివేయును మరుమల్లెల సౌరభం
వర్షదారలు తడిపివేయుగ పునీతమౌ యవ్వనం
కార్తీక వెన్నెల కాల్చుగ హాయిగొలుపెడి అనుభవం
తమకపు ఎదతాపాలకు చందనాలు
తడిసిన తనువందాలకు వందనాలు

2.హేమంత శీతలకోతల ఉపశమనం పరిష్వంగం
మాఘ ప్రణయ రాగాలకు పరవశించు అంగాంగం
శిశిరాలు రేపగ విరహం మది మదన కదనరంగం
రతికేళీ నిపుణత అంటే నెగ్గిస్తూ నెగ్గడం
రసరమ్య క్రీడలో ఇరుజట్లకూ విజయం

చిత్ర సహకారం: Sri.  Agacharya Artist

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చూసి రమ్మంటే కాల్చివచ్చిన ఘనుడవయా
ఓషధికావాలంటే గిరినే తెచ్చిన యోధవయా
మరిచావా మము -మా ఇలవేల్పువు నీవేనయ్యా
మన్నన చేసి ఆదుకొనరా ఆంజనేయా వీరాంజనేయా
భక్తాంజనేయా అభయాంజనేయా స్వామీ ప్రసన్నాంజనేయా

1.చిటికెడు సింధూరంతో రాముడు వశమగునంటే
మేను మేనంతా పులుముకొన్న భక్తుడవయ్యా
రామనామ మనునది రాముడికంటె గొప్పదని
శరణాగతుడిని కావగ నిరూపించినావయ్యా
మన్నన చేసి ఆదుకొనరా ఆంజనేయా వీరాంజనేయా
భక్తాంజనేయా అభయాంజనేయా స్వామీ ప్రసన్నాంజనేయా

2.అంతులేని అంబుధినే అవలీలగ దాటేసావే
సీతమ్మకు ముద్రికనిచ్చి సంబరాన ముంచేసావే
నినుకోరినదేమి స్వామీ పిడికెడంత సంతోషాన్నే
నిను ఏమని వేడితిమయ్యా చిమ్మెడంత ఆనందాన్నే
మన్నన చేసి ప్రసాదించరా ఆంజనేయా వీరాంజనేయా
భక్తాంజనేయా అభయాంజనేయా స్వామీ ప్రసన్నాంజనేయా

Monday, September 14, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కళ్ళూ నవ్వుతున్నాయే-పళ్ళూ నవ్వుతున్నాయే
మోమూ నవ్వసాగే-మోవీ నవ్వ సాగే
ప్రియతమా నీ ఒళ్ళూ ఒళ్ళంతానూ
అరె తుళ్ళితుళ్ళీ నవ్వుతోందే
మళ్ళిమళ్ళి నవ్వుతోందే

1.జళ్ళోని మల్లెపువ్వులోనూ నవ్వులే
మెళ్ళోని రవ్వల పసిడి గొలుసింక నవ్వులే
చెక్కిన చక్కని నీముక్కూ నవ్వసాగే
పెదవంచు అందాల పుట్టుమచ్చా నవ్వ సాగే
ప్రియతమా దిద్దుకున్న నీ తిలకం కూడ
అరె తుళ్ళితుళ్ళీ నవ్వుతోందే
మళ్ళిమళ్ళి నవ్వుతోందే

2.వేసుకున్న  రవికే అద్దాలలోనూ నవ్వులే
కట్టుకున్న కోకకున్న ఏడు వర్ణాలలోనూ నవ్వులే
పెట్టుకున్న రత్నపుటుంగరం నవ్వసాగే
చెవిన ఊగు ముత్యాల బుట్టాలు నవ్వసాగే
ప్రియతమా వాటికెంతటి గర్వం
నిన్నట్టి పెట్టుకున్నందుకే ఆ నవ్వులు
అందం ఇనుమడించినందుకే నవ్వులు

Sunday, September 13, 2020

https://youtu.be/b-ubrgOg53g?si=D17-28exi388Z5pJ

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పరిరక్షించును శివ పంచాక్షరి మంత్రం
ఓం నమఃశివాయ నే పరమ పవిత్రం
సత్ఫలితము నొసగును స్మరణ మాత్రం
శివపదమును చేరగ నా మదికెంత ఆత్రం
ఓం నమః శివాయ ఓం నమఃశివాయ

1.ప్రణవనాద సంయుతం శివ మంత్రం
పరమానందకారకం సదాశివనామం
కైవల్య దాయకం సతతం శివధ్యానం
కరుణావర్షితం  అనవరతం కపర్ది వీక్షణం
ఓం నమః శివాయ ఓం నమఃశివాయ

2.ఆరోగ్యదాయిని మృత్యుంజయ మంత్రం
ఐశ్వర్య  ప్రదాయిని దారిద్ర్యదహన స్తోత్రం
కామితవరదాయిని కాశీపురపతి స్తవం
జన్మరాహిత్యకరం రాజేశ్వర గుణగానం
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

Saturday, September 12, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అవినీతే మీకు ఆనవాయితీ
ఆమ్యామ్యాకు బానిసాయె మీ మతి
చట్టాలెన్నిచేసినా చుట్టమాయే లంచం
లంచమే ఊపిరిగా మీదైన ప్రపంచం

1.జీతమే ఇస్తుంది సౌకర్యవంత జీవితం
గీతానికెందుకు కక్కుర్తి పడుతు బ్రతకడం
శాపనార్థాలతో బావుకున్న సంపద
పిల్లాపాపలకెపుడో కొనితెస్తుంది ఆపద

2.దర్జాను పోగొట్టునొకనాడు అక్రమార్జన
గౌరవాన్ని మంటగలుపు వక్ర సంపాదన
ఎదుటివారి కన్నీరే దాహమార్పుతుందా
శవాలపై పేలాలే మీ  కడుపు నింపుతాయా

OK

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కళావతి 

నా పదాలు సాగుతాయి నీ పదాలవైపుగా
నా భావాలు పరిణమిస్తాయి నీ పదాలుగా
భారతి నీ కృతిగా  మార్చివేయగా
నా పయనం సాహితీ పథముగా
నా గమ్యం పరమ పదముగా

1.వివిధ వర్ణాలనే మేళవించుకొనగ
విరి పదములు ఏరేరి తెచ్చుకొనగ
కుసుమాలమాలగా గుచ్చుకొనగ
కవితలనలంకరించ మెచ్చుకొనగ
భారతి నీ కృతిగా  మార్చివేయగా

2.కలం పరసువేదై వస్తువు వసువవగా
సహానుభూతి ఉలితొ అపూర్వ శిల్పంగా
ఓషధీభూతమైన అలకనంద శైలిగా
నా కవనగంగతో జగతి పావమవగా
భారతి నీ కృతిగా  మార్చివేయగా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

బొంకొక వంక ఎందుకో జనానికి
బొంకు వంక పోనేల నిజానికి
బొంకి బొంకి జంకడం అవసరమా
బొంకే వంకర బ్రతుకూ బ్రతుకన తరమా

1.ప్రాణ మాన హాని లేనివేళనైననూ
విత్తభంగ ఘటన ఎదురుకాకున్ననూ
మంచినీళ్ళ ప్రాయంగా బొంకెదరు రివాజుగా
బొంకు కొరకు మరిమరి బొంకెదరూ తేలికగా

2.ఆడిన మాటకై ఆలినిబిడ్డను అమ్మొద్దు సరే
ఇచ్చిన మాటకై ఏళ్ళుగా అడవులకెళ్ళొద్దు మరే
ఆచితూచిఅడుగేయక అందలాలకై అర్రులు సాచాలా
ఉన్నంతలొ సగపెట్టుక మనగలిగితె అది చాలా చాలా


https://youtu.be/7m_bFX_je_A?si=V2A1Ro9rfLnv-qmD

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:షణ్ముఖ ప్రియ

వలపు కొలుపుకు వేళాయె మోహనుడా
మాన్పర ఇంక నా బిగువుల రగడ
నా మేనే చిక్కని పాల మీగడ
ఉట్టిగట్టిపెట్టాను నీకై నందనందనుడా

1.కొట్టినపిండేనీకు కొల్లగొట్టడమూ
కుదరదింకా కాయమాగబెట్టడమూ
దోరదోరగా పచ్చిపచ్చిగా నచ్చునోలేదో
ఇచ్ఛదీర్చు నటుల పండగ జేయగ రాదో

2.చిలకనైతి పాలకుండలిక నీపాలే
ఒలకబోయకవి మిన్నగా వెన్నగావలె
పలకగ నీ పిల్లనగ్రోవి ఆడెద నెమలివలె
చిలకర జల్లులు గాలేసిన కరిమబ్బల్లే


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హంసధ్వని

అన్నపూర్ణమ్మ నీవే కొలువుండగ మా నేలను
అన్నమో రామచంద్రా ఆర్తనాదమేలను?
అన్నదాతే వెన్నెముకైన మా దేశాన
అన్నార్తుల ఆకలి చావులు ఇంకానా

1.పంచభక్ష్య పరమాన్నాలమాట పక్కనపెట్టు
పట్టెండంత అన్నాకైనా దీనులు నోచుకుంటె ఒట్టు
షడ్రుచుల మాటన్నది నీ పతి శంకరుడెరుగు
లవణమన్నమైనగాని మ్రింగగలుగ సొబగు

2.అమ్మతెలుసుకోలేదా కొడుకు కడుపువెలితి
ఆర్చగతీర్చగ నీవుండగా వేరెవరమ్మా మాకుగతి
అన్నంపరబ్రహ్మ స్వరూపమని నెరనమ్మితి
ఆహారారోరాగ్యముల నెల్లరకిమ్మని వేడితి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మాళవి(-శ్రీ)

నీ పదములు నమ్మితిని ఆపదమొక్కులవాడా
గుడ్డిగ నిను వేడితిని వడ్డి కాసుల వాడా
ఏవిధినను కాచెదవో ఏడుకొండలవాడా
వేరెవరూ దిక్కులేరు నాకిక వేంకటేశ్వరుడా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా

1.కోట్లాది భక్తుల మాదిరి కానా నేను
కోరికలే నెరవేర్చగ సత్వరముగాను
కొట్లాడైనా నీతో హక్కుగ సాధించగను
కొండలరాయా నిను తండ్రిగా ఎంచెదను
గోవిందా గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా

2.అరిచిగీపెట్టాలా అంతర్యామీ నీ ముందు
ప్రతిదీ వివరించాల సర్వజ్ఞుడా ఏమందు
ఎప్పటికెయ్యది ఉచితమో ప్రసాదించగా వరము
భారము నీదైనప్పుడు స్వామి నాకేల కలవరము
గోవిందా గోవిందా గోవిందా గోవిందా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా

Friday, September 11, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పసివాడినై బజ్జుండనీ నీ ఒడిలోన
చెలికాడినై సేదతీరనీ నీ ఎదపైన
మధుర స్వప్నాల పెన్నిధి నీ సన్నిధి
అమర ధామాల లోగిలి నీ కౌగిలి
కడతేరనీ నీ ప్రణయారాధనలోన
తరియించనీ నను సరసవాహినిలోన

1.నీ అక్కునజేరినంత ఎనలేని సాంత్వన
నా తలను నిమిరిన వేళ ఆహ్లాదభావన
నువు అనునయించగా ఉపశమించు వేదన
నువు బుజ్జగించితే తెప్పఱిల్లు బడలిక
కడతేరనీ నీ ప్రణయారాధనలోన
తరియించనీ నను సరసవాహినిలోన

2.నీ పలుకులన్నీ  ప్రియకరమౌ వచనాలే
నీ చూపులన్నీ హిమశీతల కిరణాలే
నీ నవ్వులన్నీ మనోహర కుసుమాలే
నీ రాకలన్నీ శుభసూచక శకునాలే
కడతేరనీ నీ ప్రణయారాధనలోన
తరియించనీ నను సరసవాహినిలోన


Thursday, September 10, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఊహల ఊయలలో ఊగుతున్నావో
ఆశల పల్లకిలో ఊరేగుతున్నావో
కనవేమి ముందు నిలుచున్నా వాస్తవాన్నై
పట్టించుకోవేమి వెంటపడుతున్నా నీ నీడనై
నీ దారి దక్షిణం నా తావు ఉత్తరం
కలిసామంటే మాత్రం ఇలలోనే విచిత్రం

1.గాలిమేడలు కోరు వాలకం నీది
పూరిగుడిసెలొ లోలకం నామది
స్వప్న ప్రపంచంలో నీ విహారం
ఒడిదుడుకులతో నా సంసారం
నీ దారి దక్షిణం నా తావు ఉత్తరం
కలిసామంటే మాత్రం ఇలలోనే విచిత్రం

2.పట్టేవదలని మొండిఘటం నీవు
పట్టూవిడుపుల గాలిపటం నేను
అలభ్యతన్నది ఎరుగదు నీ నిఘంటువు
పొందిన దానితొ తృప్తి పడటమే నా రేవు
నీ దారి దక్షిణం నా తావు ఉత్తరం
కలిసామంటే మాత్రం ఇలలోనే విచిత్రం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

దగ్గరకే రాబోకు ఓ దగ్గమ్మా -కరోనాతో నువు కూడి మరీ
త్వరబడకే ఊరికే తుమ్మమ్మా-కోవిడ్ తో చేరి ఈ తూరీ
తోకను చూసి  బెదరాలి బెబ్బులిగా -బలిపశువై పోవద్దంటే
అప్రమత్తంగ మెలగాలి-బ్రతికి బట్టకట్టాలంటే

1.ఎర్రతివాచీ పరుస్తుంది శరీరాన పెరిగే జ్వరము
గొంతంతా తిమతిమలాడును దగ్గుతొ సత్వరము
ఊపిరేభారమౌతు ముక్కుమూసినట్టౌతుంది
చమటలే పట్టేస్తూ ఉక్కిరిబిక్కిరైపోతుంది
వేళమించిపోకముందే మేలుకుంటె మేలుమేలు
చేజార్చుకోకుండా చక్కబర్చుకోవాలి పరిస్థితులు

2.పోరునే గెలిపిస్తుంది బలవర్థక ఆహారం
ఎదురొడ్డినిలుస్తుంది అనునిత్య వ్యాయామం
అవిరులు కషాయాలు శ్వాసనే తేలిక పరచు
ఆత్మవిశ్వాసం వీడకుంటే అదే గట్టునెక్కించు
స్వీయగృహనిర్బంధమే శ్రీరామరక్ష ఎల్లరకు
ఆచితూచి అడుగేస్తే అంతమేగా కరోనాకు

Wednesday, September 9, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:వసంత భైరవి

సాక్షీభూతుడనవనీ సాయీ
సదానందమే దయచేయీ
మోక్షాభీష్టుడ నేనోయీ
సుఖదుఃఖాల సమత్వమీయీ

1.ఎన్నిసార్లు నేజన్మించానో
ఏయే జీవిగ కడతేరానో
మనిషిగ నేను పుట్టుటె ధన్యము
ఏనాటిదొ ఆ పుణ్యవిశేషము
పునరపిజననం పునరపి మరణం
వలదిక సాయీ చక్రభ్రమణం

2.కనులు తెరిచినప్పటి నుండి
మాయపొరలు కప్పెను నన్ను
నిన్ను నేను కలుసుకునేలా
నన్ను నేను తెలుసుకునేలా
తెరిపించు సాయీ  అంతర్నేత్రం
కనిపించు నిరతము నువు మాత్రం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రేపని మాపని ఏ పని నాపకు
నీపని నాపని అంటూ గీతలు గీయకు
ఆపనిఈపనిఅని ఏపనినీ చులకన చేయకు
నేనే తోపని నాతో గెలుపని విర్రవీగకు
చుట్టున్నవారితో జట్టేకట్టు
జట్టుస్ఫూర్తి రేకెత్తించీ ఉట్జేకొట్టు

1.కనివిని ఎరుగని రీతిగా చూపించు పనితనం
పనిలోమునిగి పనితో చెలఁగి తరియించు అనుదినం
నేనునేనను మాటకు బదులు వాడాలి 'మనం'
సంఘజీవిగా ఎదిగినప్పుడే సార్థకమౌను జీవనం

2.అవని అవనంతా అవనీ నీ పనిగని  విస్మయం
పసగలపనితో రాకతప్పదు ఎవ్వరికైనా విజయం
కర్మఫలం ఆశించక కర్మను చేయుటె గీతాసారం
ఘర్మజలంతో అభిషేకించగ పనియే కాదా దైవం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మేలుకొంది వలపు-ఈ మునిమాపు
జాలిగొంది వయసు-నీ జాడలేక వగపు
జామురాతిరైనా రావేలా పెనిమిటీ
కోర్కెరేపుతోంది కోణంగి చీకటి

1.వాడకనే మల్లెలన్ని వాడసాగే
కురిసికురిసి వెన్నెలే కునుకు తూగే
సిద్ధపర్చి ఉంచాను పరువాల విందు
వడ్డనయే మిగిలింది ఆరగిస్తె పసందు

2.తానాలే తానాలు నీటితొ చెమటతో
వలువల వలిచినా మొలిచెటి ఊటతో
చల్లార్చు ఒంటివేడి వేడుక తీర్చగా
వేడివేడి రాపిడి మంచయ్యే నానుడిగా

Pic courtesy :Sri Agacharya Artist
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఇష్టసఖి తన్నలేద కృష్ణమూర్తిని
అష్టపది పాడినట్టె సరసపట్టుని
నువ్వు తిట్టినా జో కొట్టి నట్టుంటది
గడ్డిపెట్టినా కమ్మకమ్మగుంటది                             
కంసాలి ముక్కు కుట్టినట్టు
నర్సమ్మ సూదిగుచ్చినట్టు

1.పురమాయింపొక పాఠమల్లె ఉంటది
మందలింపు గుణపాఠ మౌతుంటది
మొట్టికాయ వేసినా బుజ్జిగించినట్టుంటది
చెవులు మెలిపెట్టినా సమ్మసమ్మగుంటది
మాలిషోడు మర్ధించినట్టు
తాతగారు గద్దించినట్టు

2వద్దని వారించినా రమ్మన్నట్టుంటది
లేదని బెదిరించినా పటమన్నట్టుంటది
నువ్వు అలిగినప్పుడు అందమినుమడిస్తది
నువ్వలుముకుంటెనా ఊపిరాగుతుంటది
మేఘమాల గర్జించినట్టు
మల్లెతీగ అల్లుకున్నట్టు

Monday, September 7, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:యమన్ కళ్యాణి

కడదాక మిగిలేనా స్పందన కరువైన బంధం
ప్రాకులాడి ప్రాధేయపడడం హాస్యాస్పదం
కావలించుకుంటే రాదు కడుపులో లేనిది
కొనలేము వెల చెల్లించి పరస్పరం నచ్చనిది

1.వ్యక్తిత్వ శిఖరం నుండి ఒకరికొరకు జారకు
నీదైనతత్వం నుండి ఎపుడు దిగజారకు
మంచిచెడ్డ లెంచగలిగే తూనికరాళ్ళేవి లేవు
అవతారపురుషులూ సర్వులను మెప్పించలేరు

2.అభిమానించాలి నిన్ను నిన్నుగానే
ఆదరించగలగాలి మనసారా మిన్నగానే
పైమెరుగులు సవరించడమే సలహా అన్నది
మరకనెరుకపర్చవచ్చు తప్పేమున్నది
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రెప్పవేయనీయనిదే అందమంటే
మనసుకొల్లగొట్టేదే సౌందర్యమంటే
మనుషుల అనిమేషుల చేసేదే సోయగమంటే
పశుపతి మతినీ పోగొట్టేదే సౌష్ఠవమంటే
నిదురకు దూరమైనాను చెలీ నినుచూసి
వెర్రివాడినైనాను నినుగని నే భ్రమిసి

1.రాజ్యాలు రాసి ఇచ్చేదే సొగసంటే
యుద్ధానికి సిద్ధంచేసేదే పొంకమంటే
కవనాలు పెల్లుబికించేదే చెలువమంటే
గానాల నెలుగెత్తించేదే విన్నాణమంటే
బికారినయ్యా తెగించి ఉన్నా  చెలీ నీకోసం
వాగ్గేయకారుడినైపోయా ఈ నిమిషం

2.మత్తులోన ముంచెత్తేదే మురిపెమంటే
నోరెళ్ళ బెట్టించేదేనే సఖీ నెయ్యమంటే
అసూయాగ్ని రెకెత్తించేదే హవణిక అంటే
కైవశముకై పురికొలిపేదే కోమలికమంటే
సోయిలేదు యోచనలేదు చెలీ నీ వల్ల
గుండెగుల్ల చేసావే నిను వదలుట కల్ల
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:భీంపలాస్

మనసెరిగిన భాషయే  మమత కదా
మమత పంచినపుడల్లా ఆనందమే సదా
కరిగిపోని తరిగిపోని పెన్నిధే అనురాగం
ప్రేమ విశ్వజనీనమైతె అది ఘనయోగం

1.లావాదేవీలు-లాలూచీలు-ప్రేమలోన మృగ్యం
తారతమ్యాలు-ఏ భేషజాలు-ప్రేమలో అసహజం
ప్రేమకు వలపునకు హస్తిమశకాంతరం
చరాచరాలన్నిటిపైనా ప్రేమే మనోహరం

2.మాతాపితరులు- కనబరచెడి- వాత్సల్యం
సోదరీ సోదరుల -నడుమన -అనురాగం
దంపతుల మధ్యలో అల్లుకున్న ప్రణయం
బలమైన స్నేహంగానూ ప్రేమే బహుముఖం

Sunday, September 6, 2020


రచన,స్వరకల్పన&గానం:రాఖీ

రాగం:వకుళాభరణం


శివోహం శివోహం శివోహం
శివపరమైతే నా ఆత్మదేహం
శివోహం శివోహం శివోహం
నేనే నాలో లయమై అహరహం
ఓం ఓం ఓం ఓం ఓం-ఓం ఓం ఓం ఓం ఓం

1.నే మేలుకొనగన సుప్రభాత సేవగ శివోహం
నా కాలకృత్యాలే అర్ఘ్యపాద్యాలుగా శివోహం
ఆచరించు స్నానమే అభిషేకంగా శివోహం
భుజియించే ఆహారం నైవేద్యమవగా శివోహం
ఓం ఓం ఓం ఓం ఓం-ఓం ఓం ఓం ఓం ఓం

2.నా నయన దీప్తులే హారతులై శివోహం
నా మాటలన్నీ మంత్రపుష్పాలై శివోహం
నా నడకలన్నీ చండీ ప్రదక్షణాలై శివోహం
నేనే నిదురించగా పవళింపు సేవగా శివోహం
ఓం ఓం ఓం ఓం ఓం-ఓం ఓం ఓం ఓం ఓం

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎపుడూ ఒకటే తపన
నవ్యత కొరకే మథన
అనుక్షణం నా శోధన
వైవిధ్యమే ఆలంబన

1.కవన వస్తువే ప్రతి ఘటన
సమస్యలతో  ప్రతిఘటన
నేనెరుగని పదమే నటన
కలమే  కదులును ప్రగతి బాటన

2.మదిలో మెదిలిన భావన
మలవగ వెలసిన కవిత
మనోధర్మ సంగీతాత్మిక
ప్రభవించగ అభినవ గీతిక

https://youtu.be/hpYvKVGsy8w?si=qR4dEuSLBAgKa5DP

'గ'కారాది ప్రాసతో గణపతికి రచన,స్వరకల్పన&గానం తో డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)ఆత్మావలోకనగా నివేదన

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం :మధువంతి

గర్వమే హెచ్చిందో గాఢతే తగ్గిందో
గిరిగీసుకున్న తావుకు గీతమే రాకుందో
గుండెలోతులోన గుబులు గూడుకట్టింది
గృహసీమలోనూ గెలుపు గేలిచేసింది

1.గైరికము కావాలి నా గేయము
గీటిచూసుకోవాలి సాహితీలోకము
గొణుక్కుంటె లాభమేమి గొప్పగా రాయాలి
గోష్ఠులే జరిగేలా నా కవిత వెలగాలి

2.గౌరవాలు పొందాలి గడిచే కాలానికి
గంధమే అబ్బాలి నా కవనానికి
గాంధర్వం అమరాలి నా గాత్రానికి
గణపతి నను చేర్చాలి నా గమ్యానికి

Saturday, September 5, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఆవు వ్యాసమైనావు నా చెలీ
నా వ్యాసంగమంతానీదే ఫక్కున నవ్వే జాబిలి
తూలిపడే నామనసుకు నీ పాదముద్రలే తెలుసు
చిప్పిల్లిన నా కళ్ళలొ నీ జాలి చూపులే స్రవించు

1.వెన్నెల్లో ఆడపిల్లలా మారింది వెన్నెల్లో గోదావరి
అనుభూతుల గండశిలల మాటున
మంచుపూల పరిమళం నీవే మరి
తిరిగిరాని జ్ఞాపకం నీవేగా
వెర్రి మొర్రి మాలోకం నేనేగా

2.దీనంగా తచ్చాడే నా గుండెకు
ఎప్పటికీ నీవేగా చివరి మజిలీ
ప్రాణంగా ప్రేమించే మనస్సాక్షికి
ఆత్మబంధమైనావు కోమలి
నీ పెదాల గుమ్మానికి నా కన్నీటి తోరణం
చావలేక బ్రతుకలేక నాకిక మరణంతో రణం

OK

Friday, September 4, 2020

https://youtu.be/YPGEXo50F2c?si=7QqdZMDMNePgTHho

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో...

రచన,స్వరకల్పన&గానం::డా.రాఖీ

ఉత్ప్రేరకం ఛాత్రునికి ఉపాధ్యాయుడు
పరసువేది విద్యార్థికి అధ్యాపకుడు
అపర బ్రహ్మ ఆభ్యున్నత సమాజానికి
దినకరుడే అజ్ఞాన తిమిరానికి
వందనాలు తీరిచిదిద్దే గురువర్యులారా
కృతజ్ఞతలు సన్మార్గాన నడిపే ఆర్యులారా

1.మట్టిముద్దనైనా మలిచేరు పసిడి బొమ్మగా
గడ్డిపూవుకైనా కూర్చేరు పరిమళాన్ని నేర్పుగా
ఏ వేదమంత్రమున్నదో ఏ ఇంద్రజాలమున్నదో
కాలాంతరాన మీ శిశ్యులే ఏలేరు ఏడేడు లోకాలే
వందనాలు తీరిచిదిద్దే గురువర్యులారా
కృతజ్ఞతలు సన్మార్గాన నడిపే ఆర్యులారా

2.నాణ్యమైన బోధనయే ఏకైక లక్ష్యంగా
విలువలు నేర్పడమే ప్రాథమిక బాధ్యతగా
సందేహ నివృత్తియే  అంతిమ ధ్యేయంగా
సానబట్టి మార్చుతారు రాయినైన వజ్రంగా
వందనాలు తీరిచిదిద్దే గురువర్యులారా
కృతజ్ఞతలు సన్మార్గాన నడిపే ఆర్యులారా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వాలిపోతాను గాలితొ కబురంపినా
ఎదుట నిలిచేను ఎదలోను తలచినా
ఊహల ఝరి దరులకు మనం చెరోవైపు
కల్పనే మన మనసులను ఒకటిగ కలుపు

1.ఆశించడానికి ఏముంటుంది ప్రత్యేకంగా
అనిర్వచనీయమైన మనబంధానా
భావాలు ప్రవహిస్తూ మధురానుభూతులుగా
కలయికలు పరిణమిస్తూ భవ్యమౌ అనుభవాలుగా

2.మూటగట్టుకుందాము క్షణాలనే ఏరుకొని
స్నేహాన్ని ప్రతిఫలించే లక్షణాలనే కోరుకొని
పరస్పరం హితమును కూర్చే నిస్వార్థ లక్ష్యంగా
అపురూపం అపూర్వమయ్యే మైత్రికి సాక్షంగా
https://youtu.be/kXyi8izArtU

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నా మాటలు పాటలతోటే
నా భావాలు పాటల 'తోటే'
నా కవనాలు పాటల బాటే
నా బ్రతుకంతా పాటలతోబాటే
విరులన్ని ఒలికించే నవరసాలు
స్వరాలన్ని కురిపించే హావభావాలు

1.చిరునవ్వుల సిరిమల్లెలు
పలుకుల పారిజాతాలు
చూపుల అరవిందాలు
మూతి విరుపు మందారాలు
విరులన్ని ఒలికించే నవరసాలు
స్వరాలన్ని కురిపించే హావభావాలు

2.ప్రణయ రాయబారులు గులాబీలు
విరహాగ్ని ప్రతీకలు అగ్నిపూలు
పల్లెపడుచు అందాలు ముద్ద బంతులు
సాంప్రదాయ వనితల తీరు సన్నజాజులు
విరులన్ని ఒలికించే నవరసాలు
స్వరాలన్ని కురిపించే హావభావాలు

OK

Thursday, September 3, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

శరణు శరణు ధర తిరుమలవాసుడా
ఇందీవరశ్యామ మందహాస వదనుడా
సుందరాకారా శ్రీకరా శ్రీనివాసుడా
మనిజన వందిత భవబంధ మోచకుడా
గోవిందా ముకుందా నమో చిన్మయానందా

1.ఆపాద మస్తకం నీ రూపుని వర్ణించితి
సుప్రభాతాది పవళింపు సేవల నుడివితి
నీ అవతార కారణ గాథను వివరించితి
తిరుపతి క్షేత్ర ఘనత సాంతము తెలిపితిని
ఇంకేమని రాయను ఇభరాజ వరదా
గోవిందా ముకుందా నమో చిన్మయానందా

2.మహితమైన నీ మహిమలు నే కొనియాడితి
నీ భక్తవరులు కీర్తించిన తీరును వెలయించితి
సతులిరువురితొ నీ సఖ్యత నాఖ్యానించితి
నీ దయాపరత్వము హృద్యముగా విరచించితి
ఇంకేమని పాడను ఇంద్రాది సురసేవితా
గోవిందా ముకుందా నమో చిన్మయానందా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నను రాయనీ
నీ హృదయ పత్రం పై ప్రేమ లేఖనీ
నను గీయనీ
నా మనోఫలకంపై నీ రూపాన్నీ
చెలీ పెనవేయనీ మన అనుబంధాన్నీ
ప్రియా ముడిపడనీయనీ మనజీవితాలని

1.అర్థిస్తే కలుగదు అనురాగం
ప్రాధేయపడితె ఇచ్చేది ప్రేమ అనం
వ్యక్తిత్వపు గుర్తింపుకు బహుమతి ప్రేమ
స్వచ్ఛమైన మనసే ప్రేమకు చిరునామా
చెలీ పెనవేయనీ మన అనుబంధాన్నీ
ప్రియా ముడిపడనీయనీ మనజీవితాలని

2.ప్రేమకు ఎప్పుడూ ప్రారంభమే
చరితలు తిరగేస్తె ప్రేమ అజరామరమే
ప్రేమ కెపుడు ఉండదు విఫలమన్నది
మరువకు  ప్రేమించే హక్కు నీకున్నది
చెలీ పెనవేయనీ మన అనుబంధాన్నీ
ప్రియా ముడిపడనీయనీ మనజీవితాలని
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కవితలు మారవు అనుభూతులు వీడవు
కన్నీటి ధారాపాతానా గుండెమంటలారవు
పదాలూ తప్పవు పెదాలూ నవ్వవు
జ్ఞాపకాల గోదావరిలో అలజడులు ఆగవు

1.వదులుకోలేని వాక్యాల గోల
కలచివేసేటి అనుభవాల కీల
ఒడవని పురాణమే మన ప్రేమాయణం
రావణకాష్ఠమే మన విషాద కథనం

2.ఎక్కడ మొదలైనా ఒకటే మలుపు
తప్పుఎవరిదైనా కారణం మన వలపు
కరువైపోయింది ప్రేమగొలుపు నీపిలుపు
కడహీనమయ్యింది దినదినం నా బ్రతుకు

OK
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పాలకడలి చిలికినపుడు పుట్టావో
పరమశివుడి ఆనతితో నా జత కట్టావో
స్రష్టసృష్టి ఎరుగని సౌందర్యం నీవో
జగన్మోహిని  దివ్య అవతారానివో
దివిజగంగ పావన సలిలం నువ్వు
బహుజన్మల నా తపఃఫలం నువ్వు

1.గరళం మ్రింగినందుకు ప్రతిగా
నిను పొందె భవుడు వేల్పుల బహుమతిగా
ఇరువురి ఇంతులతోనే వేగని ఈశ్వరుడు
నా మీది ప్రేమతో నిను ముడిపెట్టాడు
చంద్ర కిరణ శీతల అనిలం నువ్వు
బహుజన్మల నా తపఃఫలం నువ్వు

2.కాలకూట విషం మినహా
క్షీరాంబుధి జనిత అద్భుతాల సహా
కలబోసి కూర్చిన అతిలోక సుందరి నువ్వు
నభూతోనభవిష్యతి నీ చిరునవ్వు
నవపారిజాత పరిమళం నువ్వు
బహుజన్మల నా తపఃఫలం నువ్వు

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఏ పుణ్యము చేసుకుందొ  వేణువు
మాధవు పెదవుల మధువులు గ్రోలగా
ఏ వ్రతము నోచుకుందొ పింఛము
గోవిందుని శిఖన జేరి మెరవగా
ఎంతటి తపమాచరించెనో తులసీదళము
వాసిగ వాసుదేవునే సరితూచగా
ఏ విధి సేవించెనో కాళీయ పన్నగము
బాలుని పదముద్రలు ఫణమున బడయగా
వందే కృష్ణం యదునందనం
వందే యశోదా ప్రియ సూనం

1.చెఱసాలకు సైతం విలువ హెచ్చెగా
 దేవకి గర్భాన హరియే జన్మించగా
ఖరముకైన కాసింత స్థలము దొరికెగా
భాగవత పుటలయందు స్థిరపడిపోవగా
రేపల్లే గోకులము గోపకులు గోపికలు
నిరంతరం తరించగా మధుర మధురమాయెగా
ఆద్యంతం లీలలతో జన హృద్యమాయెగా
అబ్బురపడి పోవగా అంతా కృష్ణమాయేగా

2.కబళింపగ జూసిన కర్కశ రక్కసులను
మట్టుబెట్టె జెగజ్జెట్టి మన్మోహన బాలుడిగా
కుబ్జను కుచేలుడిని కుంతీ మాద్రి సంతతిని
కృష్ణను కాచాడు ఆపద్బాంధవుడిగా
రాజకీయ చతురతతో రాయభారమొనరించి
కురుక్షేత్రాసమరం నడిపాడు సారథిగా
మానవాళికంతటికీ మార్గదర్శనం చేసే
గీతా మకరందం పంచాడు జగద్గురువుగా

Tuesday, September 1, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చెలీ చెలీ చెలీ సఖీ సఖీ సఖీ
నీ పేరు జపమయ్యింది
నీ తలపు తపమయ్యింది
నీపై ప్రేమ ఊపిరయ్యింది
నీతో బ్రతుకు ఆయువయ్యింది
ఎలా చావనే చెలీ బంధించు నీ బిగి కౌగిట
అందించు నే జీవించగ  అధర సుధలు ఏ పూట

1.కనిపించకుంటేనేమో మనుగడే దుర్భరము
కనిపించినావంటే సడలేను మది నిబ్బరము
అందుకోలేను నేలనేను నీవు నీలిఅంబరము
ఇంద్రధనుసు వంతెనమీదుగ నిను చేరగ సంబరము
ఎలా చావనే చెలీ బంధించు నీ బిగి కౌగిట
అందించు నే జీవించగ  అధర సుధలు ఏ పూట

2.తపనతో పరుగున వస్తే మృగతృష్ణవైతేనో
మనం సంగమించే చోటు దిక్చక్రమైతేనో
రెక్కలగుర్రమెక్కినేను నీ కల్లోకి వచ్చేస్తాను
ఏకాంతలోకాలకు నిన్నెగరేసుక పోతాను
ఎలా చావనే చెలీ బంధించు నీ బిగి కౌగిట
అందించు నే జీవించగ  అధర సుధలు ఏ పూట
https://youtu.be/4nU6GF6apXA?si=8TAikC1vcpe_gvvf

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఆకుపూజ నీకు చేతుమయ్యా ఆంజనేయా
ఆదుకొనుము ఆపదల్లొ మము వీరహనుమా
జిల్లేడుపూలమాల వేతుమయ్యా జితేంద్రియా
మాన్పవయ్య వ్యాధులన్ని సంజీవరాయా
వందనాలు అందుకో వాయునందనా
హరిచందనాలు గొనుమయ్య లంకాదహన పంచాననా

1.కోరినిన్ను కొలిచేము వాగధీశుడా
కొబ్బరికాయ కొట్టేము కొండగట్టు వాసుడా
పొర్లిదండాలు బెట్టేము కేసరి ప్రియసూనుడా
రామభజనలో మునిగెదము రాక్షసాంతకుడా
వందనాలు అందుకో వాయునందనా
చందనాలు గొనుమయ్య లంకాదహన పంచాననా

2.కృపతో మము చూడవయా హే కపివరా
చిత్తము స్థిరపరచవయా చిరంజీవుడా
ఆర్తితొ నిను శరణంటిమి మమ్మాదరించరా
ఆయురారోగ్యాలను స్వామి ప్రసాదించరా
వందనాలు అందుకో వాయునందనా
చందనాలు గొనుమయ్య లంకాదహన పంచాననా
https://youtu.be/BorVKaD_mwY

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హిందోళ వసంతం

స్వరం దేవుడిచ్చిన వరం
ఎలుగెత్తి ఆలపించగా తనువంతా రోమాంచితం
గాత్రం పరమ పవిత్రం
అపాత్రదానమనిపించేలా ఏల గర్వసంచితం
రంజింపజేయడమే గాయనీగాయక ధ్యేయం
మంజుల కలనిస్వనమే శుకపిక న్యాయం

1. సరాగాలు చిలకాలి మేను వీణగా మార్చి
శ్రావ్యతే ఒలికించాలి మనసు పులకరించి
మైమరిచిపోవాలి శ్రోతలూ గీతప్రదాతలు
స్థాణువులై నిలవాలి సకల జీవజాతులు
రంజింపజేయడమే గాయనీగాయక ధ్యేయం
మంజుల కలనిస్వనమే శుకపిక న్యాయం

2.శ్రుతితొ సంధానించాలి  జీవరావము
లయకు నిలయం కావాలి హృదయనాదము
శ్రుతి లయల మేళనంలో అనురాగం ఉదయించాలి
రాగతాళ సంగమంలో రసయోగం సిద్ధించాలి
రంజింపజేయడమే గాయనీగాయక ధ్యేయం
మంజుల కలనిస్వనమే శుకపిక న్యాయం

Monday, August 31, 2020

https://youtu.be/J2Be1ZPQc2A

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

శివతత్వ మెరుగరా నరుడా
శివోహమగునటుల కరుగరా జడుడా
భవజలధి దాటించు భవుడు
భయనివారకుడు భైరవుడు

1.సామాన్యమై చెలఁగు సాధుజీవనము
అనితరసాధ్యమౌ అద్వైత భావనము
దిగమ్రింగుకొనగలుగె జనహానికరములు
తనకంటులేకుండ పంచె ఐశ్వర్యమ్ములు
కైవల్యదాయకుడు కైలాసవాసుడు
కరుణాంతరంగుడు ఖట్వాంగధరుడు

2.ఇవ్వడం మినహా శంభుడాశించడు
తోయము పత్రితో పరమ సంతుష్టుడు
ఎవరికీ చెందని అవ్యక్తుడా విశ్వైక యోగి
అందరికి అందేటి సుందరేశ్వడా విరాగి
భూతనాథుడు భూరి పురహరుడు మదనారి
విశ్వనాథుడు అజుడు జడదారి ఝర్ఝరి

Ok 

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నిదురలేమి కలవరం
నిదురతోనే కల వరం
నిదుర మనిషికి దేవుడిచ్చిన దివ్యవరం
నిదుర మనిషి బడలిక తీర్చగ అత్యవసరం

1.ఆదరించి అక్కునజేర్చే నిదుర కన్నతల్లే
ఊరడించి ధైర్యంనింపే స్నేహితుడికిమల్లే
జీవక్రియలు కొనసాగుటలో ఉత్ప్రేరకం నిద్ర
జీవజాలమంతటికీ జన్మసహజమైంది నిద్ర

2.జోగునిద్ర కలత నిద్ర మగత నిద్ర గాఢనిద్ర
ఆరోగ్యపాలనలో నిద్రదే బలమైన ముద్ర
కంటిమీద కునుకే ఉండదు దీక్షాదక్షులకు
ఒంటిమీద సోయుండదు నిద్రన రంధిలేని వ్యక్తులకు

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మాయామాళవ గౌళ

ఉన్నట్టో లేనట్టో ఉండీలేనట్టో
ఔనన్నట్టో కాదన్నట్టో ఆ మౌనానికి అర్థం ఏమన్నట్టో
బెడిసికొట్టితీరుతుంది ప్రతిపాదనేది చేసినా
ఒడిసిపట్ట సాధ్యంకాదు తలక్రిందులు తపంచేసినా
భార్యా బాధితులారా మీకు నా సానుభూతి
నొక్కివక్కాణించగ నాదైన సహానుభూతి

1.నమ్రతగా అనుమతికోరును అందాల శ్రీమతి
నమ్మి కాలరెగురేసామా మన పని ఇక అధోగతి
 వందలాది ముందుపరచినా నిర్ణయాలు అర్ధాంగివే
గింజుకుంటె లాభమేమి పందాన గెలుపు గృహిణిదే
భార్యా బాధితులారా మీకు నా సానుభూతి
నొక్కివక్కాణించగ నాదైన సహానుభూతి

2.ఏకులాగ ఎదలోదూరి మేకులాగ దిగబడుతుంది
అదుపాజ్ఞల భయపడుతూనే మహానటిగ మారుతుంది
అతిథిలాగ అడుగును మోపి అజమాయిషి చేసేస్తుంది
వాదించి నెగ్గే యోధుడికై జగతి వేచి చూస్తోంది
భార్యా బాధితులారా మీకు నా సానుభూతి
నొక్కివక్కాణించగ నాదైన సహానుభూతి

OK


తరిగిపోదు అందం తరుణిదెప్పుడు
ఇగిరిపోదు  చందనగంధం ఇంతిదెన్నడు
తరాలెన్నిమారినా ఇనుమడించు తన్వి సోయగం
మాతృత్వం తొణికిసలాడగ మానిని సౌందర్యం

తరిగిపోదు అందం తరుణిదెప్పుడు
ఇగిరిపోదు  చందనగంధం ఇంతిదెన్నడు
తరాలెన్నిమారినా ఇనుమడించు తన్వి సోయగం
మాతృత్వం తొణికిసలాడగ మానిని సౌందర్యం

మబ్బు మూటగట్టుకొంది మగువ కురుల స్వైరవిహారం
సంజె సంతరించుకుంది సుదతి నుదుటి సింధూరం
చంద్రవదన సరస్సులోనా కనులబోలె కలువల వైనం
మంకెనల సింగారం సిగ్గుల బుగ్గల నయగారం

తరిగిపోదు అందం తరుణిదెప్పుడు
ఇగిరిపోదు  చందనగంధం ఇంతిదెన్నడు
తరాలెన్నిమారినా ఇనుమడించు తన్వి సోయగం
మాతృత్వం తొణికిసలాడగ మానిని సౌందర్యం

రూపుదిద్దుకుంది శంఖం రమణి కంఠ మాధారంగా
గిరులు పెరిగిపోయాయి గరిత  ఎడదతొ పోటీపడగా
సెలయేరు మెలికలన్నీ హంసయాన తృటి కటివలన
జలపాతం దూకుడు సైతం తనుమధ్య పొక్కిలిలోన

తరిగిపోదు అందం తరుణిదెప్పుడు
ఇగిరిపోదు  చందనగంధం ఇంతిదెన్నడు
తరాలెన్నిమారినా ఇనుమడించు తన్వి సోయగం
మాతృత్వం తొణికిసలాడగ మానిని సౌందర్యం
అలజడి రేపకు చెలికాడా
ప్రశాంత మానస సరోవరానా
చిత్తగు ఒత్తిడి వద్దుర మగడా
గుంభనాల సంసార సాగరానా
దొరికావులే సరిజోడుగా తపించగా వరానా
మన సంగమాలెపుడూ ప్రేమదీవి తీరానా

1.చీకాకుల అనుదినచర్యకు ఆటవిడుపు నువ్వు
చీకటి ముసిరిన రాతిరికి పొద్దుపొడుపు నువ్వు
నిస్సారపు జీవనఝరికి కొత్తదైన మలుపే నువ్వు
నీ తలపులు నాలో లోలో చల్లని వెన్నెలలే రువ్వు
దొరికావులే సరిజోడుగా తపించగా వరానా
మన సంగమాలెపుడూ ప్రేమదీవి తీరానా

2.నా మది కిటికీ తెరవగనే మలయానిలమై దూరేవు
నెమ్మది నెమ్మది వేదన నార్పే సాంత్వననే కూరేవు
పనిబడి బడలిక తీర్చేమందగు లాలిపాటగా మారేవు
నిద్దురలోకి జారగనే మధుర స్వప్నమై నను చేరేవు
దొరికావులే సరిజోడుగా తపించగా వరానా
మన సంగమాలెపుడూ ప్రేమదీవి తీరానా


Sunday, August 30, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

శుభరాత్రి ప్రియతమా కలలోకి స్వాగతం
మనమైత్రి సాక్షిగా కలవాలి ప్రతిదినం
దూరాలు భారమాయే ఇలలోనా
మనసులే చేరువైన తరుణాన

1.నిదురే మన కలయిక వేదికగా
నేనే కృష్ణుడు నీవే రాధికగా
నను సేదతీరనీ నీ ఊహల కౌగిలిలో
అదమరచిన పసిపాపగ నీ ఒడిలో

2.దేహాలు దగ్ధమైన అద్వైతస్థితిలో
ఆత్మలేకమౌ దివ్య సంగమ గతిలో
మరణిద్దాం మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ
ఆనందించేందుకు మళ్ళీమళ్ళీ తుళ్ళీతుళ్ళీ
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కలత చెందనేల ఆనందం లేదని
దిగులే ఆవరించిన చోటేది అనుమోదానికి
వెదకడం ఎందుకని ఆహ్లాదమేదని
కొలువుందిగా నీ మదిలొ  దేవులాట దేనికని
ఆనందపడటం అన్నది నిత్యసాధన
ఉన్నదాంతొ తృప్తి పడితే దరికిరాదు వేదన

1.మెట్టవేదాంతం కాదు సంతృప్తి అన్నది
తృప్తి వల్ల ఆగిపోదు ప్రగతి అన్నది
కృషి శ్రమ సంకల్పంతోనే కలుగుతుంది వికాసము
అభ్యున్నతి వల్లనే ఒనగూరును సంతసము
ఆనందపడటం అన్నది నిత్యసాధన
ఉన్నదాంతొ తృప్తి పడితే దరికిరాదు వేదన

2.నొప్పి బాధ దుఃఖాలన్నవి అత్యంత సహజమే
సుఖమైనా దుఃఖమైనాదేహగతమైనవే
ఉద్వేగం ఉద్రేకం పరిపక్వరాహిత్యం
నిరామయ స్థితప్రజ్ఞతే పరిపూర్ణ వ్యక్తిత్వం
ఆనందపడటం అన్నది నిత్యసాధన
ఉన్నదాంతొ తృప్తి పడితే దరికిరాదు వేదన
https://youtu.be/DzO4wauaOn4

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నీదీ నాదీ ఒక ప్రేమకథ
కంచికి చేరని మధుర వ్యథ
ఎలా మొదలయ్యిందో
ఏ మలుపులు తిరిగిందో
వాస్తవంలో  గాయాలెన్నో
నవనీతాల స్మృతులెన్నో
మదిని కాస్త మెలిపెడతూ
సుధను చిలికి ఊరడిస్తూ

1.నరకమూ నాకమూ నీ ప్రతి జ్ఞాపకం
శూన్యమై పోయిందే నీ జతలేక నాలోకం
నీ ఊహలు ఊపిరిగా నీ తలపులు ప్రాణంగా
బ్రతుకునీడుస్తున్నా జీవశ్చవంగా
ఎదురైన ప్రతిసారి నా ఎదకు ఛిద్రం
నా సంగతి వదిలెయ్యి నువ్వు మాత్రం భద్రం

2.నీ నిస్సహాయత దీనంగా చూస్తోంది
నా అసహాయత శాపమై కోస్తోంది
గోదారి ఇసుక తిన్నెలు కనుమరుగైనాయి
వెన్నెల రాత్రులన్ని అమావాస్యలైనాయి
మరణం కోసమే నా ఈ నిరీక్షణ
మరుజన్మకైనా తీరనీ మన వేదన

Ok
https://youtu.be/VR5vlUVp6Bo

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:తోడి

సంకటములు బాపవేర వేంకటేశ్వరా
సంతసమును కూర్చవేర శ్రీనివాసుడా
వ్రతములు పూజలు వాసిగజేయలేను
సతతమునీ నామస్మరణ మరువజాలను
మననమాపను
వేంకటేశ పాహిమాం తిరుమలేశ రక్షమాం
శ్రీనివాస పాలయమాం చిద్విలాస నమామ్యహం

1.ఎక్కలేను నీవున్న ఏడు కొండలు
నిక్కముగా అక్కరయే నీ అండదండలు
మొక్కలేను మొక్కుబడిగ ఏ పూటనూ
చక్కని నీరూపమే మది నెంచకనూ
నీవులేనిదెక్కడ సర్వాంతర్యామివే
నాలో కొలువుండిన అంతర్యామివే

2.గొంతెమ్మ కోర్కెలేవి కలలోనూ కోరకుంటి
గుంజుకున్న వైభవమే తిరిగి నాకీయమంటి
నా తప్పుకు శిక్షనో నా ఓర్పు పరీక్షనో
ప్రతీక్షించలేను స్వామి నా అపేక్ష తీర్చమంటి
ప్రత్యక్షరమందున కావె కావ ప్రత్యక్షము
లక్ష్యపెట్టు నను స్వామి ప్రసాదించు మోక్షము

Saturday, August 29, 2020

ఎంతకాలం ప్రేమించుకుందాం
ఇలా చాటుమాటుగా
ఎంతగా మనం ఇక దాచుకుందాం
ఎదలోని భావాలు గుట్టుగా
తెగిస్తే ఏముంది జీవితం మనదేగా
కలిసి బ్రతికేద్దాం చిలకా గోరింకగా
వెఱచేది లేదు వేలెత్తి చూపే లోకానికి
వగచేది లేదు వెంటాడబోయే శోకానికి

1.కడుపు నింపుకుందాం కలోగంజో తాగి
నీడ వెతుక్కుందాం ఏ చెట్టుక్రిందో ఆగి
ప్రేమైక నందనంలో ఆనందమె ఆనందం
మనమున్న తావేదైనా మరో బృందావనం
వెఱచేది లేదు వేలెత్తి చూపే లోకానికి
వగచేది లేదు వెంటాడబోయే శోకానికి

2.హృదయమెపుడు నీదే నీదే ప్రియా
ప్రాణమిపుడు నీదైపోయే ఓనా చెలియా
చెవులు కొరుక్కోనీయి వెర్రి జనం హాయిగా
పట్టించుకోనేల ప్రతీది ఈ జగమే మాయగా
వెఱచేది లేదు వేలెత్తి చూపే లోకానికి
వగచేది లేదు వెంటాడబోయే శోకానికి
గంగోత్రివే నీవు నా గీత గంగకు
ప్రియమైత్రివీవు నా అభిష్వంగకు
నా కవన స్ఫూర్తివి నీవు
నా ఎడద ఆర్తివి నీవు
వ్యధాభరిత జీవితాన సాంత్వన నీవు
మనసు వెళ్ళబోసుకోగలిగే నేస్తం నీవు

1.లిప్తకు లిప్తకు గుర్తుకువచ్చే ఆప్తురాలవు
అక్షర బీజాలను అక్కునజేర్చుకునే తల్లినేలవు
సాహితీసుధలనే సంగ్రహించె సుగుణశీలవు
పలువన్నెల విరులనొప్పు మంజుల మంజులవు
వ్యధాభరిత జీవితాన సాంత్వన నీవు
మనసు వెళ్ళబోసుకోగలిగే నేస్తం నీవు

2.స్వాతి చినుకు వెలయించిన ఆణిముత్యానివి
కల ఇలకే కదిలొచ్చిన విధి   పరమ సత్యానివి
 సహజ ప్రేరణగా ఒదిగిన నా నిత్యకృత్యానివి
నాకుగా నే కుదుర్చుకున్న   నాపై ఆధిపత్యానివి
వ్యధాభరిత జీవితాన సాంత్వన నీవు
మనసు వెళ్ళబోసుకోగలిగే నేస్తం నీవు

Friday, August 28, 2020

ఇంత వింత పరుషమా ఇంతీ నీ హృదయం
వజ్రమంత కఠినమౌనా వనితా నీ మానసం
చెక్కితే రాయైనా రమ్య శిల్పమౌతుందే
మొక్కితే రప్పైనా కాస్త కనికరిస్తుందే
ఎలా నిన్ను ఒప్పించాలో సూచించవే సఖీ
ఏమిచ్చి మెప్పించాలో ఆదేశించవే చెలీ

1.షరతులతో అనుబంధం పెనవేసుకుంటుందా
కట్టడితో అనురాగం ఇనుమడించిపోతుందా
వేయమన్న ఒట్టేదో చెలియలికట్టౌతుందా
పట్టుబట్టి బెట్టుచేస్తే పంతమే నెగ్గుతుందా
ప్రేమ బాసలెప్పుడూ మనసులకే పరిమితం
ఆచితూచి అడుగులు వేస్తే పేచీలిక గతం గతం

2.ఎన్నాళ్ళని నే వేగాలి నీ అలకల తాకిడిలో
ఎలా మనం మనగలగాలి చిలకలజత ఒరవడిలో
తట్టుకొని కడదాకా సాగలేను ఈ ఒత్తిడిలో
ఎపుడు సేదదీరేనో హాయిగొలుపు నీ ఒడిలో
మాయమాయే ఒకరినొకరం ఇచ్చుకున్న వేళలు
గురుతుకొస్తే భారమాయే చెదురుతుంటే మన కలలు

Thursday, August 27, 2020

మోడువారనీకు మానవతా వృక్షాన్ని
నీరుగారనీకు ఉన్నతమౌ లక్ష్యాన్ని
కొడిగట్టనీకు నీ మానస దీపాన్ని
నువు మరిచిపోకు జీవిత పరమార్థాన్ని

1.పరుల కొరకె అంకితము
విరులైనా తరులైనా గిరులైనా ఝరులైనా
పరోపకారార్థమే త్యజించారు దేహము
బలియైనా శిభియైనా దధీచి జీమూతవాహనులైనా
జీవకారుణ్యతే ప్రాధాన్యత
మానవత్వం తత్వమైతే జన్మ ధన్యత

2. పంచప్రాణాలే పంచభూతాత్మకం
నేల నీరు నిప్పు గాలి ఆకాశం మనిషికోసం
వ్యాధివల్ల వచ్చేమరణం కానేలదారుణం
శవమునైన -నోచుకోనీ -అంతిమ -సంస్కారం
అనుబంధాలను అంతలోనె త్రెంచకు
సహానుభూతివల్లనే సార్థకత బాధ్యతలకు

Wednesday, August 26, 2020

నా బలహీనతపై స్వామీ ఆడుకోకు
చపల చిత్తమే నాది చులకన చేయకు
విరుల కొరకు భ్రమిసే భ్రమరం నా మానసం
మాయలోకి తోసి ప్రభూ నను చేయకు మోసం

1.ఘోటక బ్రహ్మచారి నసలేకాను
ఇంద్రియాల నణచిన తాపసినీ కాను
కోతివంటి నా మదిని నిప్పుల బడవేయకు
నిరంతరం నీ ధ్యానం స్వామీ నను తప్పనీకు

2.చేయూతనీయి దాటగ భవసాగరం
చేయబోకు నను నీనుండి దూరం
నేరక చేసితి నే చేసిన ప్రతి నేరం
శరణాగత వత్సలా స్వామి నీదే నా భారం

Tuesday, August 25, 2020


ఆకాశం నువ్వైతే మబ్బుల పల్లకిలో వస్తా
అందాల జాబిలివైతే వెన్నెలనేనై చుట్టేస్తా
చిరుగాలివి నువ్వైతే పరిమళమై అలరిస్తా
మధుమాసం నువ్వైతే కోయిలనై మరికూస్తా
ఆనందాల నందనం చేసేస్తా మన సదనం
సంబరాల్లొ మురిపిస్తా  చేస్తూ సహజీవనం

1.బీడునేల నీవైతే తొలకరినై పలకరిస్తా
మోడుగా మారిపోతే చిగురుల నే తొడిగిస్తా
ఎడారంటి దారుల్లో గుడారమై నీడనిస్తా
మండు వేసవి తాపాన్ని చలివేంద్రమై తీరుస్తా
ఆనందాల నందనం చేసేస్తా మన సదనం
సంబరాల్లొ మురిపిస్తా  చేస్తూ సహజీవనం

2.స్వప్నాలు నిజమయ్యే మంత్రమొకటివేసేస్తా
స్వర్గాన్ని చేరుకొనే పూలదారి నడిపిస్తా
సామ్రాజ్యం నిర్మించి మహరాణిగ నిను చేస్తా
ఏడేడు జన్మలదాకా జోడుగా తోడుగ వస్తా
ఆనందాల నందనం చేసేస్తా మన సదనం
సంబరాల్లొ మురిపిస్తా  చేస్తూ సహజీవనం







రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

తేరగవస్తే ఏదైనా ఎగబడతారు ఏబ్రాసులై
అడ్డదారిలో పనికోసం లంచమిస్తారు మూర్ఖులై
అర్హతలంతమాత్రమైనా సాధిస్తారు పైరవీతో
మోసపోవడం మామూలేనని వగచేరు నిస్పృతో
ఇది వెర్రిజనం వేలంవెర్రిజనం జనానికినీరాజనం
పెడచెవిన పెట్టేవాళ్ళకు ఏమిచెప్పిఏం ప్రయోజనం

1.ఎన్నిసార్లు ఎంతమంది ఎన్నితీర్ల వంచించబడినా
విర్రవీగుతారు తాముమాత్రం అవతారపురుషులుగా
లాటరీలు ఆఫర్లు గొలుసుకట్టు స్కీములు
సరికొత్త విధానాల వింత వింత పథకాలు
ఒకరిని చూచి ఇంకొకరు తాయిలాలకై ఆశపడి
నిండామునుగేరు మూకుమ్మడిగా ఊబిలోదిగబడి

2.అనుచితమే అనితెలిసినా ఒరులకు నష్టమని ఎరిగినా
త్వరపడతారు ముందస్తు ప్రణాళికే లేకా
సామ దాన భేద దండోపాయాలనూ
ఎర వేతురు కాంతా కనకాల వినోదాలనూ
పక్షపాతమే శస్త్రం కులమతాల సాక్షంగా
రాజకీయ బ్రహ్మాస్త్రం సిఫార్సులే లక్ష్యంగా







Monday, August 24, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

గాదె క్రింది పందికొక్కులు-గోతికాడి గుంటనక్కలు
తోకనూపు ఊరకుక్కలు-హీనమౌ పరాన్న బుక్కులు
లంచగొండి పురుగులు బంట్రోతు నుండి మంత్రిదాకా
అవినీతి జలగలు వ్యాపారి మొదలు ఉత్పాదకులదాకా

1. గడ్డికరుస్తారంతా అన్నం బదులుగా
సంచరిస్తుంటారు మరీ దిగంబరంగా
అక్రమార్జనెప్పుడో బయటపడక  మానదు
బినామీ ఆస్తులకూ ముప్పురాక తప్పదు
మేలుకుంటె మేలుకలుగు ఈ క్షణమైనా
ఉన్నంతలొ తృప్తిపడితె హాయే స్థాయేదైనా

2.విలువకోల్పోతారు సభ్యసమాజాన
గౌరవం మంటకలుసు బంధు మిత్ర బృందాన
అనుభవించిన వారే ఈసడించుకుంటారు
భార్యా పిల్లలు సైతం చీదరించుకుంటారు
ఎవరికొరకు  తాకట్టో అవినీతిపరుల ఆత్మగౌరవం
ఎందుకు బజారుపాలో లంచావతారుల వ్యక్తిత్వం


https://youtu.be/MhkCoCoQgSk

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:వలజి

హే పంచముఖీ హనుమా
నీ పంచన నాకు చోటీయుమా
నా పంచప్రాణ కారణమా
నీ చరణసేవ ప్రసాదించుమా
ప్రణామాలు నీకివే పవన సుతా
వందనాలనందుమా అంజనానందనా

1.వానర వదన సకల శత్రుసంహరణ
సింహముఖా భూతప్రేత వినాశకా
గరుడాననా స్వామీ ఘోరరోగ ప్రశమనా
ఆదివరాహ లపన అక్షయ సంపత్ప్రదానా
హయగ్రీవ చుబ్రమాయ జన వశంకరాయ
పంచముఖీ హనుమతే నమో ఆంజనేయాయ


2.మా ఇంటి ఇలవేల్పువు నీవే స్వామీ
ఇలలోన నా ఇష్ట దైవమూ నీవె స్వామి
సీతామాతకు సంతసము కూర్చితివి
సౌమిత్రికి సంజీవిదెచ్చి జీవము నిలబెట్టితివి
రామప్రియా నన్ను కావగ జాగేలరా
ప్రేమమీర నన్నిపుడే ఆదుకోవేమిరా

రాగం:ఉదయ రవి చంద్రిక

ఆచితూచి అందాలు రంగరించి
అపురూప వర్ణాలు మేళవించి
కొసరి కొసరి మెరుగులెన్నొ చిలకరించి
ప్రావీణ్యమంతా ప్రదర్శించి
కొలతలు తగురీతిగ అమరించి
నెలతా నిను సృజించాడు విరించి

1.వెన్నెల వెన్న లు ఏర్చికూర్చి
మేలిమి పుత్తడిని కరిగించి
శ్రీగంధం మకరందం సాధించి
పాలను పుష్పాలను మధించి
పోతపోయ తగువిధంగ సవరించి
నెలతా నిను సృజించాడు విరించి

2.సప్తస్వరాలు గళమున ఒదిగి
నవరత్నాలే నవ్వుల పొదిగి
ఇంద్రధనుస్సే మేని వంపై ఇల దిగి
పొంకాలన్నీ పోటీపడి ఎదిగి
వర్ణించలేనట్లు నీ సౌరు వివరించి
నెలతా నిను సృజించాడు విరించి



గంగాధరా జటాధరా
భోళాశంకరా గరళ కంధరా
అవలీలగ కనికరించె పరమదయాళా
నీలీలలు అద్భుతమే భళా భవా భళా

1.భగీరథుని మనోరథం మన్నించినావు
ఆకాశగంగనే జటనుంచి కురిపించావు
గాండీవి గర్వాన్ని అణిచివేసినావు
పాశుపతాస్త్రమునే ప్రసాదించినావు
అలవోకగ పరికించే చంద్రకళాధరా
అలవిమాలిన ప్రేమ  ప్రసరింతువురా

2.మార్కండేయుని  ఆశీర్వదించావు
మృత్యుంజయుడనీ అనిపించావు
శ్రుతిర్మాత లయః పితగ గీతమువైనావు
సంగీతనాట్య శాస్త్రాల మూలకర్తవైనావు
మధురగాత్రమొసగేటి మహాదేవా
నా గళమున వసియించు సదాశివా


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

వెలకట్టలేనిదిమీ అభిమానము
తీర్చుకోలేను ఎప్పటికి మీ ఋణము
ఏ మేరకు అలరించానో నా కవితలతో
ఎంతగావిసిగించానో నావైన వెతలతో
చేజోతలు మీకివే ప్రియమైన హితులారా
కృతజ్ఞలు శతకోటి శ్రేయోభిలాషులారా

1.కవి భావన ఎదలోపలికి చొప్పించగలిగానో
వ్యవహార భాషలోనే వ్యక్తపరుచగలిగానో
ఏ ఒక్కపూటైనా నా పాటైనా ఆహ్లాదం కలిగించిదో
పూర్వజన్మ బంధమేదో మన మధ్యన నిలిచిందో
చేజోతలు మీకివే ప్రియమైన హితులారా
కృతజ్ఞలు శతకోటి శ్రేయోభిలాషులారా

2.వైవిధ్యం కొనసాగిస్తే నచ్చనివీ భరించారు
రాశిలాగ కుప్పబోస్తే ఓరిమితో సహించారు
అనుక్షణం ప్రోత్సహిస్తూ నన్ను నడిపిస్తున్నారు
తగువిధంగ స్పందిస్తూ నా వెన్నుతడుతున్నారు
చేజోతలు మీకివే ప్రియమైన హితులారా
కృతజ్ఞలు శతకోటి శ్రేయోభిలాషులారా

Sunday, August 23, 2020

రాగం:మోహన

గానమాపదు కోయిల
ఎవరు విన్నా వినకున్నా
నా మనసు మారదు రాయిలా
ఢక్కామొక్కీ లెన్ని తిన్నా
ఎద చెలిమెలోన ఎండదు నా పాటల ఊట
ఊపిరాగిపోయే వరకు కవిత్వమే నా బాట

1.అక్షరాలు మూటగట్టి
పదములె నా పదములుకాగ
భావుకతను ఖడ్గంగా నవరసాలు మార్గంగా
పట్టువదలక  అడుగేస్తాను కవనసీమలో
విసుగుచెందక సాగుతాను విక్రమార్కధీమాలో

2.కాగితరహిత జమానాలో
ప్రచురిత పుస్తకమతిశయమవగా
అంతర్జాలవేదికమీద సామాజిక మాధ్యమసాక్షిగా
క్రమంతప్పక వ్యక్తపరుస్తా నా భావాలను
హుందాగా తలదాలుస్తా తీపి చేదు అనుభవాలను
దాహం తీర్చినపుడె జీవనదికి సార్థకత
మనిషి త్రాగునీటిగా పంట సాగునీటిగా
క్షామం ఆర్చినపుడె మేఘమాల ఘనత
వర'దలై కురియగా వరదల ముంచెత్తకా
రంజింపచేస్తేనే  సాహిత్య సంగీత రమ్యత
శ్రవణపేయంగా సరస హృద్యంగా

1.అనునిత్యం పెను ఒత్తిడి యాంత్రిక జీవితాన
అనుభూతులె మృగ్యమాయె అలసిన హృదయాన
మొక్కుబడిగ గడపడమే రివాజాయె ఏ రోజున
సున్నతమౌ భావనలే కరువైపోయే తరుణాన
ఎదకు మేధకు ఆహ్లాకరమైన ఆటవిడుపు ప్రతిపూట
ఆలోచనామృతంగ ఆపాత మధురంగా పాటే ఊరట

2.దిక్కేతోచని వేళలోన నేస్తంగా మారుతుంది
ప్రేమరాహిత్యంలో అనురాగం పాడుతుంది
అపన్నుల గోడు తెలుప పొలికేక పెడుతుంది
నిస్తేజపు గుండెల్లో  దేశభక్తి దైవభక్తి ఔతుంది
ఎదకు మేధకు ఆహ్లాకరమైన ఆటవిడుపు ప్రతిపూట
ఆలోచనామృతంగ ఆపాత మధురంగా పాటే ఊరట




Saturday, August 22, 2020


https://youtu.be/2lkaNs4qPz0?si=sKoHgBdDvhZqlPjx

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:శుభ పంతువరాళి /ముల్తాన్

ఏవి స్వామి భక్తితోడ వెల్లువెత్తిన సంబరాలు
మనిషిమనిషిలొ ఉరకలెత్తిన నవరాత్రి ఉత్సవాలు
కరడుగట్టిన ఆధునికత కరాళనృత్యం ఆడసాగే
పెట్రేగిపోయి మాఫియాలే వికటాట్టహాసం చేయ సాగే
పార్వతీసుత ఐక్యతనే మాలో వికసింపజేయి 
గణపతి మానవతనే మాలో విలసిల్లనీయి 

1.భక్తియన్నది మచ్చుకైనా కరువాయె కదస్వామి
ఢాంబికాలా డంబరాలకు వేదికాయెగా చవితి
ముక్కుపిండి వసూళ్ళు బెదిరింపుతో చందాలు
గొప్పలకు పోతుపోతూ ఎత్తుకెదిగే విగ్రహాలు
రెండుమూడిళ్ళకే సా..మూహిక మంటపాలు
హానికర రాసాయనాల రంగురంగుల ప్రతిమలు

2.బీదవారు నిరుపేదవారు  నోచుకోనీ నివేదనలు
అష్టోత్తరాలుగ రకరకాలు తీరొక్క నైవేద్యాలు
పూజ భజనలు మృగ్యమై డి జే రొదలే రోతలాయే
వినోదాల పేరిట మద్యమైతే వరదలాయే
జాగారమంటూ యువత జూదము పాలాయే
తూలి ప్రేలి పిచ్చి గెంతుల శోభాయాత్రలాయే

3.మట్టి ప్రతిమలు వాడమంటే నామోషీ తీరాయే
ఊరికొక మంటపం     ససేమిరా     కుదరదాయే
ఐకమత్యమె ధేయమైతే కులముకొకటిగ చీలిపోయే
రాజకీ..య పక్షా..లా అండదండలు అక్కెఱాయే
చెరువులన్ని పూడిపోగా పర్యావరణపు ముప్పాయే 
మానవాళని చక్క దిద్దిస్వామి మహితమౌ బుద్దినిస్తే మేలాయే 

Friday, August 21, 2020

https://youtu.be/p1EyN0FgGPw

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

సన్నుత చరణా-సంకట హరణా
ఎంత సుందరం నీ  విగ్రహం
కరుణాభరణా-దీనావనా
నీ అవతారతత్వమే పరమార్థం
గౌరీనందన గజాననా
సకలలోక వందితా  ప్రథమ పూజితా
ప్రణతులివే అందుకో ప్రమధాధిపా

1.హే సుముఖా హస్తిముఖా నీకివే స్వాగతాలు
భాద్రపద శుద్దచవితి నీ జన్మదిన సంబరాలు
శ్రద్ధాసక్తులతో చేయనీ నవరాత్రి ఉత్సవాలు
పూజలు భజనలు  నీ నామస్మరణలు
గౌరీనందన గజాననా
సకలలోక వందితా  ప్రథమ పూజితా
ప్రణతులివే అందుకో ప్రమధాధిపా

2.గణపతి బప్పా మోర్యా నీవె మా అండదండగా
చింతలేల మా చెంత వక్రతుండ నీవుండగా
 కరోనాసురుణ్ణి నీవు  కడతేర్చి మము కాపాడుమా
పాటిస్తాం జాగ్రత్తలు నీ ఆదేశంగా
గౌరీనందన గజాననా
సకలలోక వందితా  ప్రథమ పూజితా
ప్రణతులివే అందుకో ప్రమధాధిపా




Thursday, August 20, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అలలై తేలివచ్చే దేవళపు మేలుకొలుపు
పావనమౌ సుప్రభాతం వీనులకే హాయిగొలుపు
కూటికొరకు గూడునొదిలే పక్షుల కువకువలు
గాలిలోన తేలివచ్చే మల్లిజాజి మధురిమలు
ప్రేమగా తట్టిలేపే అమ్మలాంటి చిరుపవనాలు
ఇది కదా అందరికీ శుభోదయం
ఇదే కదా లోకానికి ఉషోదయం

1.పంటచేలు కంటూసాగే ఎడ్ల మెడలొగంటల సడులు
మందగా మేతకు నడిచే పాడి పశువుల సందడులు
కళ్ళాపి చల్లుతుంటే ఇల్లాళ్ళ గాజుల సవ్వడులు
రంగవల్లి దిద్దే పడుచుల జడకుప్పెల విసవిసలు
దినచర్యకు ఆయత్తంగా పల్లె తల్లి పదనిసలు
ఇది కదా అందరికీ శుభోదయం
ఇదే కదా లోకానికి హసోదయం

2.మబ్బుననే లేచికునుకుతూ చదివే పిల్లల గొణుగుళ్ళు
కొత్తకోడళ్ళపైన పెత్తనాలతో అత్తల విసిగే సణుగుళ్ళు
దంతావధానాల పుకిలింతల వింతౌ చప్పుళ్ళు
బహిర్భూమికై కడుపులో ఏవో తెలియని గడిబిళ్ళు
ఉత్ప్రేరకమౌ కాఫీ టీలు వెంటనె అందక అరుచుళ్ళు
ఇది కదా అందరికీ శుభోదయం
ఇదే కదా లోకానికి రసోదయం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:కీరవాణి

నిత్యమూ నా కవితకు స్ఫూర్తివి నీవే
నే పాడే పాటకు మొదటి శ్రోతవు నీవే
నా నుదుటన విధిరాసిన గీతవు నీవే
నేను కనే తీయనైన కలవు నీవే
నా కనుల ఎదటనూ కలవు నీవే

1.ప్రత్యూష వేళలో తొలికిరణం నీవే
తొలకరి గుభాళించు మంటి గంధంనీవే
కార్తీక పౌర్ణమిలో విరగ కాయు కౌముది నీవే
ఆమనిలో విరివిగా విరియు విరియూనీవే
నేను కనే తీయనైన కలవు నీవే
నా కనుల ఎదటనూ కలవు నీవే

2.ధ్వజస్తంభాన మ్రోగె మంజుల సడినీవే
గర్భగుడిలో కొడిగట్టని దీపకళిక నీవే
కోవెలలో నినదించే చతుర్వేదఘోష నీవె
స్వామి మెడను అలరించే తులసిమాలనీవే
నేను కనే తీయనైన కలవు నీవే
నా కనుల ఎదటనూ కలవు నీవే

OK

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:సూర్య

రూపు సౌందర్యం-మాట మాధుర్యం
ఎదన ఔదార్యం-నడత చాతుర్యం
నీ ప్రేమపొందడమే చెలీ నా ఆంతర్యం
ప్రాప్తమైతె చాలు చెలీ నీ సాహచర్యం

1.లేత తమలపాకు వంటి ఒంటి సౌకుమార్యం
తెలుగుదనం ఉట్టిపడే ఉగాదిలా ఆహార్యం
భారతీయ వనిత తెగువలా ఎనలేని శౌర్యం
అబలకాదు సబలనిపించే కడుమొండి ధైర్యం
ఇన్నియున్న ఇంతీనీవు ఇలలోనే ఆశ్చర్యం
ప్రాప్తమైతె చాలు చెలీ నీ సాహచర్యం

2.నిన్ను చూసిచూడగానే బుగ్గిపాలె బ్రహ్మ చర్యం
లాఘవంగ చేసావే నా మనోనిధిని చౌర్యం
నూరేళ్ళ జీవితమంతా సఖీ నీకు కైంకర్యం
నాతో సహజీవనం ఐఛ్చికమూ అనివార్యం
ప్రాప్తమైతె చాలు చెలీ నీ సాహచర్యం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మనిషికి మనిషికి మధ్యన ఎన్ని అగాథాలు
మనిషికి మనసుకు మధ్యన ఎన్ని అగడ్తలు
ఎరుకపరచకుంటె మానే ఏ పొగడ్తలు
కించపరచనేల ఎరుగకనే ఉచితానుచితాలు
సంస్కార హీనతే ఎంతదౌర్భాగ్యం
కన్నవారికైనా తప్పదు హీన సుతులతో దైన్యం

1.విర్రవీగుతారు ఏ మాత్రం విజ్ఞత లేక
పెట్రేగుతారు తమ స్థాయిని గమనించక
గౌరవం మర్యాద బ్రహ్మ పదార్థాలు
మితిమీరిన చేష్టలకు ఉండబోవు అర్థాలు
సంస్కార హీనతే ఎంతదౌర్భాగ్యం
కన్నవారికైనా తప్పదు హీన సుతులతో దైన్యం

2.అంతంత మాత్రపు చదువులు ఎంతటిచేటు
శీలము వినయాలకు మదిలోన ఉండదు చోటు
వ్యర్థంగా వాదిస్తూ ఒప్పుకోరు తమ పొరపాటు
విధివశాత్తు తాసరపడితే మనపాలిటి గ్రహపాటు
సంస్కార హీనతే ఎంతదౌర్భాగ్యం
కన్నవారికైనా తప్పదు హీన సుతులతో దైన్యం

Wednesday, August 19, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఉండేది తెలియదు పోయేది తెలియదు
ఎంతకాలం మనగలమొ తెలియదు
మూడునాళ్ళ ముచ్చటాయే బ్రతుకు సాయీ
ఇప్పుడైనా ఉన్న సమయం నిను వెతుకనీయీ

1.అహము మోహము వదలవాయే
కామనలు నను వీడవాయే
ఆగ్రహమ్మే అదను చూసుక ఉబుకునాయే
నిగ్రహపు ఆచూకియే ఆనదాయే
ఎందుకొచ్చిన భేషజాలివి సాయీ
నీ దివ్యపదమున చోటీయవోయీ

2.నిన్ను గానక కన్నులె తలనెక్కెనోయీ
నిన్ను తలవక నాలుకే బిరుసెక్కెనోయీ
నీదు లీలలు ఆలకించక చెవులు దిమ్మెక్కెనోయీ
నీదు సన్నధి చనకనే కాళ్ళు రేగళ్ళాయెనోయీ
కాస్త దయతో నన్నిక పట్టించుకోవోయీ
నీ దివ్య పథమున చేయిపట్టీ నడిపించవోయీ
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కళ్ళతోనే జుర్రుకుంటా-మకరందమేలే నీ అందము
చూపుతోనే గ్రోలుతుంటా-అమరసుధయే నీ అధరము
ఎలానిన్ను సృష్టించాడో బ్రహ్మదేవుడు
నిను పొందినోడే ఇలలో అదృష్టవంతుడు

1.జాబిలిని మాయచేసి నీ మోమున అద్దాడు
రవిబింబం వాలినప్పుడే నీ నుదుటన దిద్దాడు
నీలిమేఘమాలను తెచ్చి నీ కురులుగ మార్చాడు
పలురకాల విరులను గుచ్చి నీ మేనున కూర్చాడు
ఇలానిన్ను సృష్టించాడే బ్రహ్మదేవుడు
నిను పొందినోడే ఇలలో అదృష్టవంతుడు

2.ముందేమో వింధ్యామలలే ఎదన పేర్చాడు
వెనకాల మేరుగిరులనే నితంబాలు చేసాడు
రోదసీకుహరాలు పొంకాలుగ అమరించాడు
కృష్ణబిలాలేవో పొందికగా నిర్మించాడు
విశ్వరచన చేసాడు నీలో బ్రహ్మదేవుడు
నిను పొందినోడే ఇలలో అదృష్టవంతుడు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

పెద్దగా బ్రతకాలనేం లేదు
అర్ధాంతరంగా చావాలనీ లేదు
ప్రతిక్షణం చస్తూ బ్రతకాలని లేదు
ఆత్మను బలిచేస్తూ చావాలని లేదు
చితిలోన కాలేవేళ రాలాలి మనకై కన్నీటి బొట్టొకటైనా
చిరకాలం బ్రతికుండాలి జనుల తలపుల్లోనా

1.ఉన్ననాల్గు నాళ్ళైనా నవ్వుతూ బ్రతికేయాలి
చనిపోయే సమయంలోను పెదాలపై నవ్వుండాలి
సునాయాసంగ బ్రతకాలి బ్రతుకంతా
అనాయాసంగ చావాలి చావు వొచ్చినంత
చితిలోన కాలేవేళ రాలాలి మనకై కన్నీటి బొట్టొకటైనా
చిరకాలం బ్రతికుండాలి జనుల తలపుల్లోనా

2.ఎన్నేళ్ళు బ్రతికితె ఏమి జీవశ్చవాలమై 
మూణ్ణాళ్ళుఉన్నాచాలు ఘనకీర్తిశేషులమై
జన్మ ఎత్తినందుకు సార్థకం కావాలి
మంచిపనులనొనరించి చరితార్థం కావాలి
చితిలోన కాలేవేళ రాలాలి మనకై కన్నీటి బొట్టొకటైనా
చిరకాలం బ్రతికుండాలి జనుల తలపుల్లోనా

Tuesday, August 18, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మల్లె ఎంత మంచిదో
పల్లె పడుచు పిల్లలాగ
మల్లె ఎంత చక్కనిదో
పసిపాప నవ్వులాగ
తనువు తనువంతా శ్వేతకాంతి
తన మనసు తావే ప్రశాంతి

1.వనాల్లోను మనగలిగేను అడవి మల్లి
చేలలోన సాగుబడౌను బొండు మల్లి
చెట్టులాగ ఎత్తెదిగేను బొడ్డు మల్లి
మేడమీది కెగబాకేను తీగమల్లి
నవశకపు నాందౌతుంది తొలిరేయిలోన
ఉత్ప్రేరకం తానౌతుంది దాంపత్యాన

2.ముళ్ళతో గాయ పరచదు గులాబిలాగ
బురుదతో మకిల పరచదు కమలంలాగ
భయమే కలిగించదు మొగలిపొదల లాగ
చపలచిత్తయే కాదు సూర్యకాంతి విరిలాగ
మూరెడంత దండౌతుంది ప్రియురాలి జడలోనా
నిలువెత్తు మాలౌతుంది స్వామి వారి మెడలోనా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చెప్పాలి ఏదో ఒకటి
విప్పాలి గుట్టే గుండెది
ఎన్నాళ్ళని మోస్తుంది ఎనలేని అనురాగం
ఎన్నేళ్ళని దాస్తుంది వలపు సరాగం
పల్లవించాలి ప్రేమ గీతపు పల్లవి
కలిసి కదలాలి చరణయుగ్మ యుగళి

1.నీదీ నాదీ ఒకటే మతం అభిమానయుతం
 అభిమతమేదైనా సరే పరస్పరం సమ్మతం
నాదీ నీదీ ఒకటే యోగం తావేలేదు అభియోగం
ఎన్నడు కూడదు కలలోనైనా మనకు వియోగం
ప్రేమైక లోకంలో ఏకైక జంట మనం
నిరంతరం ఫలించే కలల పంటే మనం

2.అలవోకగా అమరాలిగా బ్రతుకంతా ఆహ్లాదాలు
పేనవేయగా నిజమౌనుగా  ఇరువురి హృదయాలు
నీవు మురళీ రవం ప్రియా నేను  బృందావనం
నీవు తులసీదళం చెలీ తూచేవునన్నే తులాభారం
నీకు సదా నేనే సఖా జన్మదాసీనే
నీకు సఖీ నేనే కట్టు బానిసనౌతానే
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాలిపోతున్నాయ పండుటాకులు
కాలిపోతున్నాయి నిండు బ్రతుకులు
పసివారికైనా తప్పుటలేదు ఖనన గోతులు
వయసూ వరుసా లేదు నిత్యం రగిలే చితులు
కరోనా మహమ్మారి కాటుకు బలియై
తగు జాగ్రత్తలకే స్వయంగా వెలియై

1.లాక్ డౌన్ ఎత్తివేత పచ్చజెండా కాదు
ప్రజా జీవనం కొనసాగ దండన లేదు
అడుగు తీసి అడుగు వేస్తే ఏమరుపాటు తగదు
అజాగ్రత్త మూలంగా మూల్యం తప్పదు
అదినిండు ప్రాణమనీ చెప్పక తప్పదు

2.పెండ్లీ పేరంటాలు కరోనాకు ప్రతినిధులు
విందులు వినోదాలు మహమ్మారి వ్యాపకులు
గుమిగూడిన జనవాహిని చేటు దేశానికి
కాలుకదపనప్పుడే రక్ష ఇల్లు దేహానికి
తప్పనిసరైతె తప్ప కదులు అత్యవసరానికి

Monday, August 17, 2020


https://youtu.be/gmJYUrrofp4?si=19uRHACkCO8kMeZ-

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం: భూపాలం 


శ్రీ కాళ హస్తీశ్వరా శ్రీ శైల మల్లీశ్వరా
వేములాడ రాజేశ్వరా కాళేశ్వర ముక్తీశ్వరా
ఎన్ని క్షేత్రాలని తిరుగను స్వామి
ఎన్నెన్ని నామాలని తలవను స్వామీ
విశ్వమంతా నీవాసమే  విశ్వేశ్వరా నమో
పేరేదైనా నీదే కదా సర్వ భూతేశ్వరా నమో

1.తెలుగునాట త్రిలింగాలు తిలకించినాను
పంచభూత లింగాలను వీక్షించినాను
పంచారామాల పవిత్ర యాత్రనే చేసాను
ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించుకొన్నాను
ధర్మపురీ శ్రీరామలింగేశుని కన్నాను
నా ఆత్మలింగమునే కనుగొనకున్నాను

2.ప్రతి సోమవారము ఉపవాసమున్నాను
శ్రావణ సోమవార వ్రతము పూనుకొన్నాను
కార్తీక సోమవార నోము నోచుకున్నాను
మాఘమాస శివరాత్రి జాగరణ ఉన్నాను
దీక్షలెన్ని గైకొన్నా నీ కృప గనకున్నాను
తదేకదీక్షగా నీ కటాక్ష వీక్షణకై వేచాను

ఆమె:      నాకు నేనే తప్పిపోయా-ఎక్కడో చెప్పవా ఆచూకిని
అతను:   తొంగిచూడు నా కళ్ళలో-కనుగొందువు నీ రూపుని
ఆమె:      భద్రంగా నీ గుండెలో నను దాచి ఉంచు
అతను:   తిరిగివ్వను నువ్వడిగినా నిన్ను నీకు
ఆమె:      నిధులన్ని మూటగట్టి నీపరం చేసేసా
అతను:   పదిలంగా చూసుకుంటా వరంగా భావించి

1.ఆమె:   నా మనసు విరి చేసావు-సిగ్గు ధనుసు విరిచేసావు
                రాముడివే ఐనాగానీ రాసలీల ముంచేసావు
అతను:    లేడి పిల్లలాగా వాడిగా నను చూసావు
                నను మచ్చిక చేసుకొని నీవాడిగ మార్చేసావు
ఆమె:       యవ్వనాల నా పూదోట కానుకగా నీకిచ్చా
అతను:    పరిమళాల నాఘ్రాణించి మనసారా నిను మెచ్చా

2.అతను:  అత్తి పత్తివేలే ఆనాడు కత్తిలా నా ఎదలో దిగినావు        నేడు
                 దారంలా  చుట్టకొని ఆధారం నీవైనావు
ఆమె:        పాదాలు కందకుండా నీ అరిచేతుల నడిపావు
                ఏ లోటు రాకుండా నను రాణిని చేసావు
అతను:    ఎన్ని జన్మలైనాగానీ నిన్ను వీడనే చెలీ
ఆమె:       రేయపవలు ఎప్పుడైనా నీ నీడనే ప్రియా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం: దేశ్

కరుణ నొలుకు కనుల తల్లి
కనక దుర్గ కల్పవల్లి
ప్రణుతింతును ప్రణమిల్లి
మముకావగ కృపనుజల్లి

1.అనుపానుల నెరిగినది
మనమునందు నిలిచినది
దుష్టుల దునుమునది
కష్టములెడ బాపునది
కనకదుర్గ ఎలమి హృది
నెరనమ్మితి నా మది

2.భవ బంధము త్రెంచునది
వైతరణీ దాటించునది
వరములెన్నొ ఇచ్చునది
పరమును అందించునది
కనక దుర్గ దయాంబుధి
జగజ్జననె శరణాగతి

Sunday, August 16, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రేమో ఏమో తెలియని వేళ
నాఎదలో చొరబడినావు
చాపక్రింది నీరులాగా
మెదడే ఆక్రమించినావు
చేరువలోనే ఉన్నాగాని
చేరలేని దూరం మన మధ్య
నీవేలేకా చెలీ నా చెలీ 
లోకమంతా ఒక మిథ్య

1.ఎవరినడిగి నాకు ఎదురుపడిపోయావో
ఎందుకు నా జీవితంలో అలజడిరేపావో
నా బ్రతుకు నన్ను బ్రతకనీవేమే
అనుక్షణం తలపులతో నను చంపుతున్నావే
ఊరించడం నీకు సయ్యాటాయే
వేధించడం నీకు అలవాటాయే

2.ప్రేమా దోమా అంటూ గేలిచేసినావు
ఉబుసుపోక నన్ను వాడుకొన్నావు
తీరా నా ప్రేమ తెలిపితే తప్పించుక తిరిగావు
నిను నమ్మి మనసు విప్పితే ఈసడించుకున్నావు
ప్రణయమంటె నీకు నవ్వులాటనా
పరిణయం అంటేనే బొమ్మలాట నా

Saturday, August 15, 2020


కొండమీద వెదికాను-కోనలోన శోధించాను
గుడిలోను బడిలోను గాలించినాను
కనుగొంటినీ నీ ఆచూకిని-నా గుండెలో నీ ఉనికిని
వందనాలు గొనుమమ్మా వేదాగ్రణి పారాయణి

1.నా గళమే నీ ఆసనమై-నా కలమే నీ వాహనమై
నా భావం నీ సంభవమై- నా వర్ణం నీ రూపమై-
వరలుతున్నావే వరవీణా మృదుపాణీ
వందనాలు గొనుమమ్మా వేదాగ్రణి పారాయణి

2.నా ఊపిరి నీ అస్తిత్వం-నా తపనే నీ తత్వం
 నా నివేదనే రాగమై -నా సాధన నీ యోగమై
చెలఁగుతున్నావే సామప్రియా సరస్వతీ
వందనాలు గొనుమమ్మా వేదాగ్రణి పారాయణి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

బొమ్మ ఏకాంతం బొరుసే ఒంటరితనం
ద్వంద్వకోణాలున్నదే అద్వైతమనే నాణెం
సాహసమే ఒక్కమాటలో వేదాంతాన్ని నిర్వచించడం
కొదవేలేని తెగువే ఒక పాటలో యోగవాశిస్టం బోధించడం

1.కమలం దైవం భ్రమరం నేనై
పరిభ్రమించే పరిక్రియా విశేషంలో
తపించి రమించి తరించగా
త్వమేవాహమై ఉదయింతుగా

2.యోగ సాధనే తగు మార్గంకాగా
రుచులారు ఋతువులారు వైరులార్గుని జయించి
షడ్చచక్రాలనధిగమించి సహస్రారాన్ని ఛేదించగా
లయమై అక్షరమైన కైవల్యమందుగా

3.ఒక నేనను నేనే ఇల అన్నినేనులై
భావించే ఆత్మజ్ఞాన శోధనలో
కర్తా కర్మా క్రియా నేనైన తరుణాన
విశ్వం సహా సోహమై భాసింతుగా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నేస్తమా నేస్తమా నీకిదే శుభరాత్రి
కొనసాగనీ కలకాలమిక మన మైత్రి
చికాకులే కాకులై అరచి గీపెట్టాయేమో
లోకులతో వేగలేకా అలసి పోయావేమో
ముంచుకొచ్చే నిద్రనే ఆదరించినావా
కమ్మనైన కలల నావా ఎక్కేసినావా

1.కనుపాపలు ఊయలలూపగ
కనురెప్పలు నిను జోకొట్టగ
వేధించే వేదనలే వదిలించుకొంటూ
సాధించే వత్తిడులే తొలగించుకొంటూ
తీరని నీ ఆరాటాలు మానుకొనినావ
కమ్మనైన కలల నావా ఎక్కేసినావా

2.పీడకలలు రాకూడదనీ
నిద్రాభంగం కలగకూడదని
ముక్కోటి దేవుళ్ళ వేడుకొంటూ
మధురస్మృతులు నెమరేసుకొంటూ
కమ్మనైన కలల నావా ఎక్కేసినావా
ఆనందాల దీవులనే చేరుకొన్నావా

https://youtu.be/jnmLsL3cKNQ?si=l-ui8caNfBkOChyB

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:హంసానంది

పథకాలు వేయాలి
ప్రణాళికలు రచియించాలి
పతాక స్థాయిలో మనదేశం
పతకాలు సాధించాలి
ఆసరా దొరికితే మనకభయం
ఆత్మవిశ్వాసం వికసిస్తే అన్నిటా విజయం

1.ప్రోత్సాహం కరువైన క్రీడాకారులు
ఉత్సాహం మరుపైన ప్రభుత్వతీరులు
నిబద్ధతే కొరవడిన శిక్షణా సంస్థలు
నిలకడలేని అర్హతలేని ప్రశిక్షకులు
ఆసరా దొరికితే మనకభయం
ఆత్మవిశ్వాసం వికసిస్తే అన్నిటా విజయం

2.బాల్యం నుండే శ్రద్దాసక్తులు
తల్లిదండ్రుల తగు ఆపేక్షలు
గెలుపోటముల సమభావనలు
వెనకడుగేయక సాధనలు
ఆసరా దొరికితే మనకభయం
ఆత్మవిశ్వాసం వికసిస్తే అన్నిటా విజయం

https://youtu.be/4OqL208TxqY?si=E6eXgVogkIDCT0U1

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

(జడి)వాన జల్లు పడుతోంది
నా ఒళ్ళు జిల్లు జిల్లంటోంది
ఈదురుగాలి వీస్తోంది
ఎదఎదో ఆదరువు కోరుతోంది
నులివెచ్చని చెలికౌగిలిలో వేవేల స్వర్గాలు
బొందితో దివినే చేరగ సంగమాలె మార్గాలు

1.ఎంతమంది పొందగలరు-పొందులోని మకరందాలు
ఎవరెవరు దర్శించారో-మదనాంతర మందిరాలు
ప్రదక్షిణలు చేసేలోగా సొమ్మసిల్లురెందరో
గర్భగుడిని చేరేలోగా అలసిపోదురెందరో
జేగంటకొట్టాలి హారతి చేపట్టాలి
దైవమనుగ్రహించాకే ప్రసాదాన్ని గ్రోలాలి

2.ముడుపు కట్టిన ముద్దులే-సమర్పించుకోవాలి
గుసగుసగా సుద్దులతో -అభినుతించి తీరాలి
నివేదించ ఆత్రమేల పత్రమో పుష్పమో
వల్లించాలి స్తోత్రమో మహా మంత్రపుష్పమో
పవిత్రంగ నిర్వర్తించగ రతి ముగితి ఏకమే
తనువులే వివశమైతే తాదాత్మ్యమే,సాలోక్యమే

ముగితి =సిద్ది, మోక్షం, ముక్తి 

https://youtu.be/xgCt28EH0Us

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రపంచమే తలవంచదా
మనుజాళియే కీర్తించదా
భారతీయులది ఒకే మాటగా
భరతావనిదిక ప్రగతిబాటగా
మన ఉత్పత్తులు ఉన్నతమవగా
మన మేధావులు ఉత్తములవగా
జయహో ఆత్మనిర్భర భారత్-వందేమాతరం
జయహో ఆత్మ గౌరవ భారత్-వందే మాతరం

1.మాదకద్రవ్యం ఊసే ఎరగక
నిరుద్యోగమను మాటే లేకా
ఏదో ఒక పని పోషించేదిగ
అద్భుతాలనే సాధించేదిగ
మన యవశక్తే నిరంతరం తలంచగా
ఉత్పాదకతను అనవరతం పెంచగా
జయహో ఆత్మనిర్భర భారత్-వందేమాతరం
జయహో ఆత్మ గౌరవ భారత్-వందే మాతరం

2.ఆత్మహత్యల జోలే లేకా
రైతులు జగతికి ఆకలి తీర్చగ
సేద్యం ప్రభుత ప్రాథమ్యం కాగా
మన వస్తువులే జనులు వాడగా
జాతీయతనే సర్వులకు ఊపిరవ్వాలి
భారతదేశం నాదేనంటూ గర్వంగా నవ్వాలి
జయహో ఆత్మనిర్భర భారత్-వందేమాతరం
జయహో ఆత్మ గౌరవ భారత్-వందే మాతరం
నీ అందం ఎంతటిదో నా కన్నులనడుగు
నీ రూపం గొప్పదనం నా చూపులే తెలుపు
నా మనసుకొకటే తెలుసు నీ కున్న మంచితనం
నా అనుభవానికే ఎరుక నీలోని మానవత
చెలీ మొత్తంగా నీవంటే నాకు ప్రాణం
సఖీ ఇష్టంగా బ్రతుకంతా నీ వెంటే నా ప్రయాణం

1.విచలితమై పోతావే అన్నార్తులనే గాంచి
నీ కళ్ళు చమరించేనే అనాథలను పరికించి
తినబోయే ఆహారాన్ని క్షుదార్తులకు పంచేస్తావు
మరులుగొన్న చీరలు సైతం అభాగినులకందిస్తావు
చెలీ మొత్తంగా నీవంటే నాకు ప్రాణం
సఖీ ఇష్టంగా బ్రతుకంతా నీ వెంటే నా ప్రయాణం

2.ప్రతివారిని పలకరించే స్నేహగుణం నీకుంది
ఆశించక సాయం చేసే దయాహృదయమే నీది
నిను మెచ్చుకోవారు ఇల లోన లేనేలేరు
నను నచ్చినావంటే నాకన్న శ్రీలుడు లేడు
చెలీ మొత్తంగా నీవంటే నాకు ప్రాణం
సఖీ ఇష్టంగా బ్రతుకంతా నీ వెంటే నా ప్రయాణం

Friday, August 14, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

గాయపరచుట ఎంత తేలిక
కత్తులు కటారులేవీ వాడక
ఒక మాట చాలు ఈటెలాగా
ఒక చేష్టతోనే  గుండె మండగ

1.ఎదుట పడితే తప్పుకొంటూ
గొప్పగా నను చెప్పుకొంటూ
శల్య సారథ్యమై శూల ప్రతిఘాతమై
అడ్డుపుల్లలు అడుగుఅడుగున వేసుకొంటూ

2.తాళిబొట్టును మొక్కుకొంటూ
మొగుడినెత్తిన మొట్టుకుంటూ
పతియె పట్టని పతివ్రతలా నేతిబీరకు మారుగా
మనతోబాటు తమని తామే మభ్యపెట్టుకొంటూ


https://youtu.be/R0rwbDtEMuc?si=RBKXDlPM7WLDD2DG

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం :కానడ

కస్తూరి గంధాలు నీరాకలో
హరివిల్లు అందాలు నీకోకలో
కలహంస వయ్యారాలు నీ నడకలో
అమరసంగీతాలు నీ శ్రావ్యగీతికలో
చెలీ నీతో తీరని దప్పికో ఆరని ఆకలో
ప్రియా నీవే నీవే నమ్మలేని నిజమో కలో

1.పంటచేల మీది పైరగాలివో
నల్లమబ్బులోని మెరుపుతీగవో
కోవెలలో మ్రోగేటి జేగంటవో
కోనేటిలొ విరిసేటి కలువ బాలవో
చెలీ నీతో తీరని దప్పికో ఆరని ఆకలో
ప్రియా నీవే నీవే నమ్మలేని నిజమో కలో

2.ఛాతిపైన చెదిరిపోని పచ్చబొట్టువో
చేతిమీద చెరిగిపోని పుట్టుమచ్చవో
అనునిత్యం తట్టి లేపే సుప్రభాత గీతం నీవో
ఆదమరచి నిదురపుచ్చే అమ్మజోల పాటవో
చెలీ నీతో తీరని దప్పికో ఆరని ఆకలో
ప్రియా నీవే నీవే నమ్మలేని నిజమో కలో

Tuesday, August 11, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

చెఱసాలన పుట్టిన వాడా
గోపాలన చేసినవాడా
నీ ఆగడాలే రేపల్లె వాడవాడా
ఇల్లిల్లు వెన్నల చోరే ఓ నల్లనోడా
నీ భజన కీర్తనలే నే పాడా ( డ్ యా)
నిన్నే శరణుకోరా మము కాపాడా

1.నాట్యమాడినావు కాళిందినాగు పైనా
నగము నిలిపినావు చిటికెన గోటిపైనా
లీలలెన్నొ చూపావు గోవిందుడా
గోలగోల చేసావు గొల్లబాలుడా
నీ భజన కీర్తనలే నే పాడా ( డ్ యా)
నిన్నే శరణుకోరా మము కాపాడా

2.కోకలెత్తుకెళ్ళావు గోప కాంతలవి
శోకాల బాపావు కుబ్జా కుచేలులవి
ప్రణయమంటె తెలిపావు రాధతొ గూడి
తత్వబోధ చేసావు అని గీత నుడి నిడి
నీ భజన కీర్తనలే నే పాడా ( డ్ యా)
నిన్నే శరణుకోరా మము కాపాడా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

గంధర్వ గానాలు నీ కనులలో
పారిజాత సౌరభాలు నీ నగవులో
తేనెలూరు కమ్మదనాలు నీ మోవిలో
చందమామ చక్కదనాలు నీ మోములో

1.హంపిలోని చెక్కణాలు నీ తనువులో
అజంతా చిత్రాలు అణువణువులో
రామప్ప నాగిని సోయగం నీకే సొంతం
ఖజురహో భామిని పరువం నీ ఆసాంతం

2.బాపు బొమ్మకు ప్రాణం నీ ఆకృతిలో
రవివర్మ రాధకు జీవం నీ హవణికలో
ఎంకి ఒంపుసొంపులకు నీవే ప్రతిరూపం
యండమూరి వెన్నెల పిల్లకు నీవే ఆధారం


https://youtu.be/XV43FRntenA?si=cPrTP5xaFCRlh6pr

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:హంసానంది

వాసి చూసి స్పందించే హృదయాలెన్ని
సాహితీ విలువలనెరిగి నందించే ఎదలెన్ని
కవి భావన గుర్తించే అభిమానులెంతమంది
కవనమునాస్వాదించే రసపిపాసులెంతమంది

1.చదవడమే గగనమై సాగుతున్న సమయాన
తెలుగు వెలుగు కృష్ణపక్ష మౌతున్న చందాన
వార్తలు వ్యాసాలే పఠనీయత ఉన్నవేళ
సిసలైన కవిత్వమే  నిరాదరణ పాలా

2.సాహిత్యపు పేజీలే అంతంత మాత్రము
ప్రాధేయత పలుకుబడుల పత్రికా లోకము
అస్మదీయ తస్మదీయ పురస్కార వైభవము
ప్రహసనంగా  మారిన బిరుదుల ప్రదానము

Sunday, August 9, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నేస్తమా నీకిదే నా జోలపాట
మిత్రమా నీకిదే నా లాలిపాట
గందరగోళంలో కొట్టుమిట్టాడేవు
ఉత్తుత్తి ఒత్తిడిలో చిత్తడి అయ్యేవు
ఆదమరచి సేదదీరు రేయంతా హాయిగా
నిదురలోకి జారుకో అమ్మ ఒడే యాదిగా

1.ఆటుపోట్లే నీకు గ్రహపాటు తీరే
అడుగడుగు వంచెనలె రివాజుగా మారె
బెదరబోకు నేస్తమా బేలగా మారి ఇలా
కలతయేల మిత్రమా బాలలా ఈ వేళా
ఆదమరచి సేదదీరు రేయంతా హాయిగా
నిదురలోకి జారుకో అమ్మ ఒడే యాదిగా

2.భూతకాలము నిన్ను భూతమల్లె వేధించె
అనుకోని ఘటనలు నీడలాగ  వెంటాడె
మరచిపో గతమంత  దుఃస్వప్నమల్లే
చెలగిపో తెగువతో  లేకున్న బ్రతుకు లొల్లే
ఆదమరచి సేదదీరు రేయంతా హాయిగా
నిదురలోకి జారుకో అమ్మ ఒడే యాదిగా

3.కానున్నదేదీ కాకుండా మానదుగా
జరిగేది తప్పక జరిగే తీరునుగా
వదిలేయడం మనకు సులువైన సాకే
నిశ్చింత తోడైతే  నిమిషంలొ కునుకే
ఆదమరచి సేదదీరు రేయంతా హాయిగా
నిదురలోకి జారుకో అమ్మ ఒడే యాదిగా
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

నా హృదయం గులాబీ నీకే సొంతం
ప్రేమతో అర్పించా ప్రియా కాస్త పదిలం
గుచ్చుకోనీయనీకు వాడైన ముళ్ళను
రాలిపోనీయకునా సుకుమారపు రెక్కలను

1.చూపు తిప్పుకోనివ్వదు నా అందం
అడుగుకదపనీయదు నా సుగంధం
ఎంతమంది కోసుకో జూసినా
యత్నాలెన్నో నాకై చేసినా
ముడుపుకట్టి ఉంచానీకై నా సోయగాన్ని
అదను చూసి అందించా నీకే పరువాన్ని

2.కంటగించుకొన్నాను తుంటరివారిని
కంటకాలతో వారికి చేసితి గాయాలని
పూలమనసు నీకు తెలుసనీ
జాలిగొన్న ఎద నీదనీ
ధారపోసినాను నీకై  ప్రాణాలని
అంకితమిచ్చాను నా జీవితాన్ని

OK

ఇంటిపేరు ఆదరణ మారుపేరు వితరణ
మూర్తీభవించిన నిలువెత్తు కరుణ
మన డా. సబ్బని లక్ష్మీనారాయణ -
అనవరతం సారస్వత పారాయణ

1.మల్లేశం నాగమ్మల పుత్రరత్నము
బొమ్మకల్ జన్మభూమి గౌరవ చిహ్నము
లెక్కకు మిక్కిలి భిన్న పట్టభద్రతలు
సాహితీ కృషికి ఎనలేని గుర్తింపులు
ఆంగ్లోపన్యాస వృత్తి రచనే ప్రవృత్తి
సామాజిక సేవలోనె జీవన నివృత్తి

2.మనసెరిగిన అర్ధాంగి మానిని శారద
పుత్రద్వయమేమో శరశ్చంద్ర వంశీకృష్ణ
పౌత్రుడై పంచసాగె శ్రీయాన్ ఆనందం
విశ్రాంత జీవితాన అవిశ్రాంతమా కవనం
ముప్పైపై చిలుకు గ్రంథాల ప్రచురణ
అనుబంధాలకు తానే అసలైన చిరునామా





రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కోకకెంత మిడిసిపాటో నిను చుట్టుకున్నానని
రవికకెంత గర్వపాటో నిన్నట్టి పెట్టుకున్నానని
మెడలోని నగకెంతటి కులుకు  నీ ఎదపై ఒదిగానని
పుట్టుమచ్చకైనా ఎంత టెక్కు తాను దృష్టి దాటిపోనని

1.నా తలపే నీ పెదవిన నవ్వై విరియనీ
నా ఊహే నీకన్నుల మెరుపై మెరవనీ
నా తపనే నడుమొంపులొ తరించనీ
నా బ్రతుకు నీ స్పర్శకొరకు తపించనీ

2.చీర పారిపోయేలా మనసునాక్రమించనీ
చోలి తప్పుకునేలా నిన్నే అలరించనీ
ఆభరణం నేనై నీ తనువునల్లుకోమీ
చెరగని స్మృతి చిహ్నమై నీలో ఉదయించనీ

Saturday, August 8, 2020

నా చేయి వదిలావు ఎందుకు స్వామి
ఒంటరిని చేసావు ఇది న్యాయమా ఏమి
నీవూ నేనే కదా మనదైన లోకాన
నను ముంచివేసావు కడలేని శోకాన

1.నిర్మలమైన నామది కడలిని
కల్లోల పరిచెడి కాఠిన్యమేల
నిశ్చలమైన నా హృదయాన
అలజడి రేపెడి కరడు నీకేల
నను వేరుచేయకు పరమ దయాళా
నను మరచిపోబోకు ఏవేళా

2.నే కోరుకున్నాన ఈ భవబంధాలు
నిను వేడుకున్నాన ఇహలోక సౌఖ్యాలు
నువులేక నేనెపుడు అనాథనే
నినుగనక నాకు నిత్య వ్యథనే
ననుచేర్చుకో స్వామి నీ అక్కున
ఎడబాటు నోపను రావయ్య గ్రక్కున


వన వాటిక సంచరించె ముని కన్యకవో
నెలనాటి జాబిలి వెన్నెల తునుకవో
జలపాతధారల నురగల మెరుపువో
హిమవన్నగ శ్వేతవర్ణ కాంతిరేఖవో
సౌందర్యం సౌశీల్యం కలబోసిన కలికివో

1.అలనాటి దుష్యంతుని శాకుంతలవో
అవీక్షితుని వరించిన వైశాలినివో
ఋష్యశృంగ పత్ని దశరథపుత్రి శాంతవో
శ్రీరాముని పదతాడిత సతీ అహల్యవో
సాంప్రదాయ సోయగం సొంతమైన దానవో

2.కలనైనా పరపురుషుల తలవని సీతవో
పతికోసం దండధరుని ఎదిరించిన సావిత్రివో
త్రిమూర్తులకె పాలిచ్చిన అనసూయా మాతవో
యజ్ఞోద్భవి పంచ పాండవ సతి ద్రౌపది నీవో
విలువలకే కట్టుబడిన అల దమయంతి వీవో


నింపావు కళ్ళలో సప్తసముద్రాలు
దింపావు గుండెలో అగ్నిపర్వతాలు
పదేపదే పెల్లుబికే కన్నీటి ఉప్పెనలు
నిరంతరం బ్రద్దలౌతు అడియాసల లావాలు
ప్రభూ నేను ఆటబొమ్మనా
స్వామీ నీలీలగ నే నమ్మనా

1.ఎందుకు అందలాలు ఎక్కిస్తావో
ఎప్పుడు ఊబిలోకి నను తోస్తావో
దేనికొరకు విర్రవీగ నను చేస్తావో
అంతలోనె న్యూనతనే కలిగిస్తావో
ప్రభూ నేను ఆటబొమ్మనా
స్వామీ నీలీలగ నే నమ్మనా

2.నీ క్రీడకు సమవుజ్జీననుకున్నావా
నీ కేళికి ప్రేమతొ నన్నెంచుకున్నావా
మించిపోయిందిలేదు తగు శిక్షణ నాకివ్వు
చెరగనీకు స్థిరమదితో నాపెదాల చిర్నవ్వు
ప్రభూ నేను నేనే కానే కానా
స్వామీ నీవు నాలో లేనే లేవా

Friday, August 7, 2020


రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:శివరంజని

నిలువు నామాలు నీకా
పంగనామాలు మాకా
అంగలార్చినా బెంగతీర్చవాయే
నంగనాచిలా సంగతెరిగినా ఆర్చవాయే
రంగరంగ  వేంకటేశ కరుణాంతరంగ నమో
భవరోగ భంగ తిరుమలేశ భక్తాంతరంగ నమో

1.మా ఆర్తనాదాలే నీకు సుప్రభాతాలు
మా అశ్రుధారలతో  నిత్యాభిషేకాలు
మా దైన్య వీక్షణలే నీకు పుష్పార్చనలు
ఎనలేని వేదనలే మేమొసగే నివేదనలు
రంగరంగ  వేంకటేశ కరుణాంతరంగ నమో
భవరోగ భంగ తిరుమలేశ భక్తాంతరంగ నమో

2.కొడిగట్టిన మాఆశలు నీకు నీరాజనాలు
మా తపనల తలపులే మంత్రపుష్పాలు
భవిష్యత్తు మృగ్యమైన మాబ్రతుకే కైంకర్యం
పునః పునః ప్రస్తావన నీకు పునః పూజనం
రంగరంగ  వేంకటేశ కరుణాంతరంగ నమో
భవరోగ భంగ తిరుమలేశ భక్తాంతరంగ నమో
https://youtu.be/07aiKzaX4N0

రాగం:తోడి

హరుడవే-గౌరీమనోహరుడవే
మనోహరహరుడవే-త్రిపురాసుర సంహరుడవే
కావేల ఈవేళ మా దుఖఃహరుడవే
శంభుడవే- సాంబసదా శివుడవే
నిజభక్తవ శంకరుడవే-రాజరాజేశ్వరి వరుడవే
కావేల నీవేల మా అభీష్ట వరదుడవే
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

1.అనునిత్యం కన్నీటితొ నీ అభిషేకం
ఎలాసాధ్యమనేనా తీర్చవు మా శోకం
అనుక్షణం తప్పమునీ నామస్మరణం
ఇడుముల నిడుటకు అదేనా కారణం
కావేల ఈవేళ మా దుఖఃహరుడవే
కావేల నీవేల మా అభీష్ట వరదుడవే
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

2.త్రయంబకం యజామహే మహామంత్రము
మాకు వర్తించుటలో ఏలనీ కుతంత్రము
నమఃశివాయ పంచాక్షరి కైవల్యదాయకం
ఎంతవల్లించినా మాకౌనా నిరర్థకం
కావేల ఈవేళ మా దుఖఃహరుడవే
కావేల నీవేల మా అభీష్ట వరదుడవే
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ

OK






Thursday, August 6, 2020

https://youtu.be/Go1Oy2oHqs0

రచన,స్వరకల్పన&గానం;డా.రాఖీ

మా ధర్మపురి రాముడు మహిమగల దేవుడు
మా గోదావరి గట్టున సుందరంగ  వెలసినాడు
సీతమ్మా సోదరులూ హనుమతోను  నిలిచినాడు
రామ రాజ్యమే  జనహితం రామ ధ్యేయమే ధర్మయుతం
మహిలో రామచరితమే మహిమాన్వితం
ధరలో రామనామమే మధురామృతం

1.గంగలోన మునకవేసి తడిబట్టలతోనే
రాముని కోవెలకు ఆర్తి మీర వెళ్ళెదము
సీతారాములను ప్రీతిగ దర్శించెదము
అభిషేక తీర్థమును భక్తిగ సేవించెదము

2.రామనవరాత్రాలు అందరికీ సంబరాలు
శ్రీ రామనవమితో ఆనందోత్సాహాలు
సీతారామ కళ్యాణం సకలలోక కళ్యాణం
తిలకించిన కమనీయం పులకించగ రమణీయం

3.వేదోక్త పూజలు తీరైన తీర్థప్రసాదాలు
వడపప్పు కొబ్బరి జామపండ్ల ముక్కలు
రామాయణ పురాణాలు శ్రవణపేయ హరికథలు
అనుభూతులు అనుభవాలు అద్భుతాలు వేనవేలు

Monday, August 3, 2020


రచన,స్వరకల్పన&గాఖనం:డా.రాఖీ

రాగం:యమన్ కళ్యాణి

ఎదురుగా ఉన్నపుడు నడవడికల శిక్షణ
ఏ కాస్తైనా  జాప్యమైనా ఎంతో నిరీక్షణ
శ్రీవారంటే శ్రీమతికెంతో ఆరాధన
శ్రీమతి చెంత శ్రీవారికెప్పుడు సాంత్వన

1. కాదంటే ఔనని రమ్మంటే వద్దని శ్రీమతి అర్థాలు
ముక్కుసూటి బాటలో ముక్కుపచ్చడవడం శ్రీవారి ప్రాప్తాలు
తిరుగమనే స్వేఛ్ఛ ఇచ్చి గిరిగీయడం శ్రీమతి రివాజు
గీతదాటడం హద్దుమీరడం సాహసాలు శ్రీవారికి మోజు

2.కృష్ణుడిలా లౌక్యం రాముడి ఔన్నత్యం శ్రీమతికతి ప్రియం
ఇంట్లోరామయ్య వీథిలో కృష్ణయ్య శ్రీవారి నైజం
కలహాల కాపురంలో అపార అనురాగమె గోపురం
కష్టాల గృహసీమలొ ఇష్టాల దాంపత్యమే మర్మం


(05/08/2020 రోజున రామజన్మభూమి-అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణ సందర్భంగా)

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:రేవతి

ఏ జన్మభూమి స్వర్గంగా భావించాడో
ఏ పుణ్యభూమి రామరాజ్యమనిపించాడో
ధర్మమే ఊపిరిగా ఏ మహనీయుడు శ్వాసించాడో
సరయూనది తీరాన ఏ సార్వభౌముడు పాలించాడో
ఆ రామజన్మభూమి అయోధ్య
రఘురాముని అద్భుత మందిరనిర్మాణం
నేడే నేడే జయజయధ్వానాల మధ్య

1.ముష్కరుల దాడిలో విధ్వంసమై
పరుల దురాక్రమణలో జీర్ణమై
న్యాయపోరాటంలో పునరుజ్జీవమై
సకల మానవ లోక కళ్యాణార్థమై
శ్రీరామజన్మభూమి అయోధ్య
రఘురాముని అద్భుత మందిరనిర్మాణం
భక్త జనుల జయజయధ్వానాల మధ్య

2.హిందూమత ధర్మసంస్థాపనకై
భారతీయ సాంప్రదాయ సంప్రాప్తికై
వేద సంస్కృతి అనంతవిశ్వ వ్యాప్తికై
సర్వదా సర్వజనుల సుఖశాంతులకై
శ్రీరామజన్మభూమి అయోధ్య
రఘురాముని అద్భుత మందిరనిర్మాణం
దేశ ప్రజల జయజయధ్వానాల మధ్య

OK

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:గౌరీ మనోహరి

శివ లీలా విలాసము-శివ కేళీ లాసము
భక్త మనోల్లాసము-భవ నిశ్రేయసము
ఓం నమఃశివాయ ఓంనమఃశివాయ

1.ప్రదోష కాలాన ఆనంద తాండవము
ప్రళయ కాలానా ప్రచండ రుద్ర తాండవము
కాలకూట విషమునుండి కాచిన దైవము
కైవల్య దాయకము పరమ శైవ భావము
ఓం నమఃశివాయ ఓంనమఃశివాయ

2.అల్ప సంతుష్టుడు అంగజవైరి
అనల్ప శక్తి సంయుక్తుడు పురారి
జలాభిషిక్త సహిష్టుడు జటాఝూటధారి
జన్మసాఫల్యకరుడు  గౌరీ మనోహారి
ఓం నమఃశివాయ ఓంనమఃశివాయ

Saturday, August 1, 2020

https://youtu.be/-BZCoSs23qI?si=ARHNG-_olJ1Lplyp

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:మాయామాళవ గౌళ

పదునాల్గు భువనాల్లొ ప్రథమ పూజలు నీకే
ముక్కోటి దేవతల తొలి దైవమూ నీవె
గణనాథ కరుణించు మము ప్రేమ మీర
విఘ్నేశ దయజూడు సంకటములే తీర

1.గుంజీలు తీసేము తప్పులను మన్నించు
చెంపలేసుక వేడ దోషాలు పరిమార్చు
సాష్టాంగదండాలు ఇష్టంగ పెట్టేము
కష్టాలు నష్టాలు తొలగించి కాపాడు

2.ఏవేవొ రోగాలు ఎడతెగని వ్యాధులు
ఊపిరాడని తీరు ఉద్విగ్న బాధలు
నిమిషంలొ తీరేను నువు తలచుకుంటే
జాగేలనయ్యా నీవే శరణంటుంటే
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:నట భైరవి

చెప్పనలవి కాదు నీ తిరుమల శోభ
నుడువతరముగాదు నీ లీలా ప్రభ
పట్టించుకోవేలా నను పద్మనాభా
పద్మావతి వల్లభా హే భక్త సులభా

1.మనసు పెట్టి నిన్ను మ్రొక్కలేదా
ఏనాడో అది నీ వశమాయెకదా
చిత్తమందు నేను నిన్నుంచలేదనా
ఎప్పుడో నీ పదముల అది చేరేనా
నాదికానిది నాలొ లేనిది ఏమిచ్చేను స్వామీ
పుష్కలమౌ అజ్ఞానముంది ఒడువగొట్ట వేమి

2.పూలతోని నిన్ను సేవించలేదనా
వాడని నా హృదయ కమలమది నీదే
దీపాలనైన వెలిగించలేదనా
కొడిగట్టిన మెదడున్నది నీకై వెలగనీవదే
నీవిచ్చిన ఫలములన్ని నీకే సమర్పయామి
విత్తొకటి చెట్టొకటి ఎలా కుదురుతుంది స్వామి
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఇన్నేళ్ళు వచ్చినా  ఓనమాల పసినే
కవితలెన్ని రాసినా కవన పిపాసినే
కడలి ఒడ్డున కడుతున్నా
భావనల పిచ్చుకగూళ్ళు
ఎలా ఈది చేరెదనో సాహితి తీరం
మునకలేస్తూ నములుతు నీళ్ళు

1.ఏ కవితరాసినా ఎదలోన బెరుకేదో
ఇన్నాళ్ళ కృషిలోనూ ఎరుగనైతి ఎరుకేదో
ఆచితూచి అడుగేస్తున్నా ఇంకానే తడబడుతున్నా
మనసుబెట్టి రాస్తున్నా మదిచూరగొనకున్నా
ఎలా ఈది చేరెదనో సాహితి తీరం
ఎలా దించుకోగలనో నా గుండెభారం

2.వరిగడ్డి మంటలాగా మండి ఆరితే ఎలా
నింగిలో వెలిగే రవిలా నిరంతరం వెలుగీనాల
యుగాలెన్నిమారినా నా పాట మారుమ్రోగేలా
ఒక్కగీతమైనా జన్మకు చిరంజీవి కావాలా
ఎలా ఈది చేరెదనో సాహితి తీరం
ఎలా దించుకోగలనో నా గుండెభారం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

కవికెపుడు ఆర్తి
పొందాలి స్ఫూర్తి
కవితనే వెలయిస్తే
అమితమైన సంతృప్తి

1.ప్రకృతే ప్రేరణ
ప్రశంస ఉద్దీపన
పెల్లుబికిన భావన
గీతరూప కల్పన

2.నిత్యదైవ ప్రార్థన
నిజ సమాజోద్ధరణ
ప్రేమా ఆరాధన
విరహమూ వేదన

Friday, July 31, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ఎన్నాళ్ళైందో గుండెనిండా గాలిపీల్చి
ఎంతకాలమైందో బ్రతుకుపట్ల భయం మరచి
అడుగుతీసి అడుగువేస్తె కరోనా పంచన
ఏమరుపాటేమైనా మరణం అంచున
మనదీ ఒక బ్రతుకేనా నిత్యం ఛస్తూ
మనకూ ఇక భవితుందా ఆంక్షలన్ని భరిస్తూ

1.రోజు గడుపుతున్నాం గతస్మృతులను నెమరువేస్తు
బ్రతుకువెళ్ళదీస్తున్నాం అద్భుతాలనూహిస్తూ
విందులూవినోదాలు ఎపుడో బందైనాయి
బంధాలు ఇంటికే బంధీలైపొయినాయి
మనదీ ఒక బ్రతుకేనా శ్వానాల్లా స్వేఛ్ఛేలేక
మనదీ ఒక బ్రతుకేనా శవాల్లా ఇఛ్ఛే లేకా

2.పండగ పబ్బము పెండ్లీ పేరంటాలన్నీ మృగ్యము
ఎన్నడూలేనంతగా శ్రద్ధవహించాలి ఆరోగ్యము
సినీహాళ్ళు షికార్లు దుర్లభమైనాయి
స్నేహాలు మోహాలు పరిమితమైనాయి
మనదీ ఒక బ్రతుకేనా లక్ష్యమే శూన్యమై
మనదీ ఒక బ్రతుకేనా  గమ్యమే దైన్యమై

SRI.V.JANAKIRAMARAO' POST inspiration

https://m.facebook.com/story.php?story_fbid=4169565813118855&id=100001964310859
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:ముల్తాన్

కొడుకునైనా కాచలేక తల్లికెంత తపన
అమ్మ ఆతృత కానలేక బిడ్డకెంతటి వేదన
సంసార సాగరంలో ఉన్నఫళమున పడవ మునక
బిక్కుబిక్కని బిక్కచచ్చిరి దిక్కుదెసనే తోచక

1.కార్చిచ్చే కాల్చివేసెనొ-వరదలొచ్చే ఊరు ముంచెనొ
అయినవారికి దూరమైనా-బ్రతుకు వారికి భారమైనా
భవిత సంగతినెరుగకున్నా-దారితెన్నూ తెలియకున్నా
పయనమైరీ కాలమే చేర్చు తీరానికి
సాగసాగిరి దైవమే కూర్చు గమ్యానికి

2.ఒంటిపైని బట్టమినహా-చేతబట్టిన పొట్టతోసహా
గడిపితీరాలిక పోరుతీరు అనుదినం వెతలేలా తీరు
మానవతపై ఆశచావక-మనుషులంటే వెర్రి నమ్మిక
పయనమైరీ కాలమే చేర్చు తీరానికి
సాగసాగిరి దైవమే కూర్చు గమ్యానికి

For AUDIO plz contact whatsapp no.9849693324

https://youtu.be/PRO6NbpabgA?si=ZN2z4cwWbxJes7IU

రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

రాగం:బృందావన సారంగ

పుట్టింది ఎక్కడో పెరిగింది ఎక్కడో
చేసే పని ఏమిటో తెలిపే నీతేమిటో
ఎక్కడ తానున్నా ఆనందనందనం
ఏ పనిచేస్తున్నా మహిమాన్వితం
వందే గోకులబాలం వందే నందకిశోరం

1.గోపికల చీరలే ఎత్తుకెళ్ళినా
ద్రౌపదికి చీరలెన్నొ అందించినా
ఎంతగానొ వెన్ననే దొంగిలించినా
సుధాముని అటుకులే ఆశించినా
ప్రతిచర్యలోను అంతరార్థమెంతొ ఉంది
నమ్ముకున్న వారికెంతొ ప్రతిఫలముంది
వందే గోపికాలోలం వందే యశోదానందనం

2.రాసలీలలో మునిగి తేలినా
రాయభారమే చెలగి చేసినా
సారథిగా ధర్మ యుద్ధం నడిపించినా
జీవన సారమున్న గీతను బోధించినా
ప్రతికర్మలోను పరమార్థముంది
ప్రభావవంతమైన తాత్వికత ఉన్నది
వందే గోవర్ధన గిరిధరం వందే కృష్ణం జగద్గురుమ్

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అతిథిగా వస్తేనే ఆ కాస్త ఆదరణ
ఏకైవచ్చి మేకైపోతే ఎవరికైనా ఛీత్కరణ
కరోనా నువు వచ్చిన కొత్తలొ మాకెంత జాగరూకత
పాతబడిపోయావిపుడిక  నువుకాదు వింత
లేనే లేదు మా జనాలకు చింతాకంత చింత

1.తొలుదొలుత ఆనాడు చప్పట్లు తప్పెట్లూ
ఉత్సాహపూరితంగా హారతులు లైట్లూ
దేశమంతా లాక్డౌన్లు మూసాము ఇంటిగేట్లు
వార్తల్లో నీ గొప్పలు కూడళ్ళలొ నీ కటౌట్లు
పాతబడిపోయావిపుడిక  నువుకాదు వింత
లేనే లేదు మా జనాలకు చింతాకంత చింత

2.మా మొహాల మాస్కులు ఆన్లైన్ల టాస్కులు
సానిటైజర్ యూజర్లు ఫిజికల్ గ్యాప్ సిటిజన్లు
బ్రతికితే చాలనుకొంటూ బలుసాకు భోజనాలు
అలవాటైనావు కదా మాకు నీతో సహజీవనాలు
పాతబడిపోయావిపుడిక  నువుకాదు వింత
లేనే లేదు మా జనాలకు చింతాకంత చింత

INSPIRATION:ATTACHED VIDEO
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

అడ్డుకాదు మూతిగుడ్డ అందానికి
కనులు చాలు భావాలను తెలుపడానికి
మహరాణులు వాడలేద జలతారు ముసుగులు
మాస్క్ లతో స్కార్ఫ్ లతో మరుగౌను లొసుగులు

1.దుమ్ము ధూళి నాపుటలో సాధనాలు
వాహనదారులకు కాలుష్య రోధకాలు
వైద్యవృత్తి వారికైతె నిత్యాభరణాలు
పారిశుధ్యకార్మికులకు రక్షణ కవచాలు
మాస్క్ లతో స్కార్ఫ్ లతో కట్టడౌను వ్యాధులు

2.ఎదలోని వేదనలను దాచుటకై నగవులు
సుందరీకరణనైతె ఇనుమడించ రంగులు
రాతిరి చీకటిని కప్పిపుచ్చగా వెన్నెలలు
బహుళార్థ సాధకాలు అలనాటి బురఖాలు
మాస్క్ లతో స్కార్ఫ్ లతో మట్టికఱచు వైరస్ లు
https://youtu.be/v6-FHakWYYY

రచన.స్వరకల్పన&గానం:డా.రాఖీ

సాయి నామం జపించరా
సాయి కోసం తపించరా
సాయినాథుని విశ్వసించర
సాయి సాయని శ్వాసించరా
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి॥

1.షిరిడి ధాముని చిత్తాన నిలుపు
సాయి రాముని దీవెన గెలుపు
సాయి గాధలు మేలుకొలుపు
సాయి బోధలు బ్రతుకున మలుపు
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి॥

2.సాయికర్పణ చేయి కర్మలు
సాయి ఇచ్చును సత్ఫలితములు
సాయిని శరణన సకల శుభములు
సాయి చరణముల అక్షయ సుఖములు
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి॥

Wednesday, July 29, 2020

రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

మదన పంజరం మంజరీ నీ శరీరం
ఒక్కొక్క అవయవం పదునైన  విరి శరం
వంపువంపులోనూ వలపు వలల పన్నాగం
చిత్తుచిత్తైపోదా మత్తుగొంటు ప్రతి చిత్తం

1.పరువాల పందెంలో వస్త్రాలకె పరాజయం
పొంకాల బింకంలో హస్తాలకె పరాభవం
పట్టులాగ జారుతుంది పట్టుబోతే నీ నడుము
తోకముడుస్తుందేమో పట్టలేకనే ఉడుము

2.ఎత్తైన కొండలు లోతైన లోయలు
ప్రకృతికే ప్రతిరూపం నీ మేని హొయలు
మొదలు పెడితె చాలు నీ ఒడిలో సరసాలు
కడతేరు వేళ మధురమౌ సుధా రసాలు

FOR audio,u may whatsapp to 9849693324
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

ప్రేమ అనురాగం ఆకర్షణ ఆరాధన
పేరేదైనా పెట్టుకో నను మాత్రం నీగుండెల్లో పెట్టుకో
ఎంత అందం మూటగట్టుక వచ్చావే చెలీ
నిను చూసి పడిపోని ధీరుడెవ్వడే జాబిలీ

1.నువ్వడిగితె స్వర్గమైనా నేలకు దించుతా
తారలమాలగ గుచ్చి జడనలకరించుతా
నువు కోరితె ప్రపంచాన్నే ఇప్పుడే జయించుతా
నువ్వు హుకుంజారీ చేస్తే యోధులనే బంధించుతా
నీకు ఫిదా కానిదెవ్వరె ఈ జగాన
ప్రాణాలూ ధారపోతురె ఏ క్షణాన

2.ఏడువింతలేమోగాని ఏకైక వింతనీవు
సొంతమైతెగానీ నా చింతలన్ని తీరిపోవు
నగుమోము కంటుంటే కడుపునిండిపోతుంది
నయగారం ఒలికిస్తుంటే బ్రతుకు గడిచిపోతుంది
వర్ణించగాలేదు ఏ కలము నిన్ను
తిలకించగానే స్థాణువౌను నమ్ము
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాగం:తిలాంగ్

నీకున్నది తరిగిపోదు
వేరొకరిది నీకు రాదు
ఎంతటి నిష్ప్రయోజనం అసూయ అన్నది
ఓర్వలేకపోవడం అతివిచిత్రమైనది

1.చెప్పకనే నీ న్యూనత చెప్పినట్లౌతుంది
గొప్పెవరో నీకు నీవె ఒప్పినట్లౌతుంది
స్పర్ధే ప్రేరకమై  నీ ఔన్నత్యం వర్ధిల్లాలి
ఈర్ష్య ఏ కోశానానూ నీవై వర్జించాలి

2. ప్రజ్ఞంటూ నీకుంటే కీర్తి తలుపు తడుతుంది
నీ కడ ఉన్న ప్రతిభ రేపైనా వెలుగుతుంది
ఎదుటివారి పట్ల  కినుక గౌరవ భంగమే
తుఛ్ఛమైనదే మచ్చరమున్న అంతరంగమే
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

సాటివారి పట్ల సానుభూతి
అపన్నుల ఎడల సహానుభూతి
సాయం చేయగలుగు సన్మతి
సోనూ సూద్ లాగ ఉమాపతి
దయచేయగ మనసారా నా వినతి
ఇదేనా ప్రణుతి అందుకో నాప్రణతి

1.సంపద  ఉండీ ఏమిటీ ప్రయోజనం
అలమటించి పోతుంటే ఆర్తజనం
తృణమో ఫణమో చేయూత నీయగా
ఆస్తిపాస్తులేవీ తరగనే తరగవుగా
దైవం మానుష రూపేణా సోనూ సూద్ గా
మానవతా విలువలనే మాకు చాటి చెప్పగా

2.అరిషడ్వర్గాలలో లోభమే ఘనవైరి
ఆర్జింతుము తరతరాల మనుగడ కోరి
రేపటికై చింతించగ నేడూ చేయి జారి
మేము కుడువమొరులకైన పెట్టము ఏమారి
పుణ్యపురుషులున్నారు సోనూ సూద్ తీరున
వితరణే ప్రేరణగా మము జేర్చుము ఆ  సరసన

Sunday, July 26, 2020

కడుపే కైలాసం -హరహరా అదే సదా నీ ఆవాసం
ఇల్లే వైకుంఠం- శ్రీహరీ ఇదేకదా నీవుండే సదనం
వెదకబోను వేరెచటా దైవమా నినుకానగ
చంకలొ పాప కనక వృధాగ ఆరాట పడగ
వందే శంభుముమాపతిం-గోవిందం శ్రీపతిం నమామ్యహం

1.అర్ధనారీశ్వరా నీదైన స్థానము
మహాశక్తి కాలవాలము
తరగదింక నా గుండె బలము
శ్రీనివాసమే గోవిందా నీ హదయము
కొదవలేని సిరుల భోషాణము
దరిరాదెప్పుడు దారిద్ర్యము
వందే శంభుముమాపతిం-గోవిందం శ్రీపతిం నమామ్యహం

2.నీవుంటే చుట్టూరా మంచేనంట
చంద్రచూడ తలనెలవంక
వెన్నెల పంచేనంట
నీవున్నతావంతా పాలేనంట
శేషశయన తాపాలనింక
మదినెడ బాపేవంట
వందే శంభుముమాపతిం-గోవిందం శ్రీపతిం నమామ్యహం











ఇల్లు చిన్నబోయింది నీవు లేక
వాడ అడుగుతున్నది నీ రాకపోక
నిన్నమొన్న వెళ్ళావేమో సరిహద్దున యుద్ధంకై
యుగాలల్లె తోస్తోంది  పరితపించ హృదయం నీకై

1 దేశాన్ని భద్రంగా కాచే జవాను నీవు
కంటిమీద కునుకు లేక సంరక్షిస్తున్నావు
నెత్తురైన గడ్డకట్టే మంచుకమ్ము లోయలు కొండలు
ఎండవేడినోర్వలేక ఎడారుల్లొ మండును గుండెలు
జాతికె అంకితమాయే నూరేళ్ళ నీజీవితం
చావంటే బెదురే లేదు ప్రాణమే తృణప్రాయం

2.అనుక్షణం క్షేమం కోరుతు నీ తల్లి దీవిస్తోంది
మనసంతా నీవేనిండగ నీకై అర్ధాంగి ప్రార్థిస్తోంది
వందముప్పైకోట్లమంది వెన్నంటి వెంటున్నారు
మడమతిప్పకుండా నీకు మద్దతెంతొ ఇస్తున్నారు
సైనికుడా ధన్యుడవే నీ జన్మ చరితార్థకమవగా
యోధుడా మాన్యుడవే మాతృభూమి ఋణం తీర్చగా

ఎదుట ఒక కవిత
ఎదలొ ఒక కవిత
హరివిల్లు వర్ణాలు కనుల ముందు
పరవళ్ళ వర్ణాలు హృదయమందు

1.పదములే కదిలాయంటే
 అందెలే రవళించేను
పదములే కుదిరాయంటే
కవనమే వికసించేను
కవిత నడకలన్నీ కలహంసకు పాఠాలు
నాకావ్య గతులన్నీ జవరాలికి భాష్యాలు

2.కవిత  మోములోనా
కలువలు మందారాలు సంపెంగ రోజాలు
కవిత రీతిలోనా
ఉత్పలాలు చంపకాలు ఆటవెలదికందాలు
కవిత వెలయించేను కవితలు వేవేలు
కవితలకు స్ఫూర్తి నిచ్చే కవితకు జేజేలు
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ

రాజ్యమెందుకు రాజసానికి
మకుటమెందుకు గౌరవానికి
పదవి వల్లనె వెలిగిపోదురు ఎందరెందరొ నేతలు
పదవికే తగు వన్నె తెత్తురు జనహృదయ నేతలు

1.అడ్డదారుల తెచ్చుకొందురు
 తేరగా అధికార యోగం
అర్హతన్నది మృగ్యమైనా
వారసత్వపు రాజకీయం
అంచలంచెలు ఎదుగువారికి ఎదురుండబోదిక ఎన్నడు
వ్యక్తిత్వమే ఆభరణమైతే  వెలిగిపోదురు ఎప్పుడు

2.కులమతాలే అండకాగా
పక్షపాతమే ఆలంబనం
సంపదెంతో లంచమీయగ
అధిరోహింతురు అందలం
భాగ్యమన్నది ప్రాప్తముంటే తలుపుతట్టును భోగము
మేధావులంతా జాతికెప్పుడు సేవచేయగ సిద్ధము
నేనేమో ఉత్తర ధృవం-నీవైతే దక్షిణ ధృవం
అందుకేనేమో ఆకర్షణ పరస్పరం
నాలోని వెలితికి నీ జతయే ఒకవరం
నా కోసమె పుట్టించెను నిన్నా దైవం
ఈనాడే నా శ్రీమతీ గీతా నీ జన్మదినం
ఎన్నో జన్మలుగా అన్యోన్యమైన దంపతులమే మనం
హ్యాప్పీ బర్త్ డే టూ యూ గీతా
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

1.పనైపోవడమొకటే నా లక్ష్యం
పద్ధతిగా చేయడం నీకు ముఖ్యం
బండవేసి దాటుటే నా కర్తవ్యం
వంతెన నిర్మించడం నీ ఉద్దేశ్యం
అర్ధపూర్ణత్వమే నువులేక జీవితం
అర్ధనారీశ్వరమే మన ఇరువురి కాపురం
హ్యాప్పీ బర్త్ డే టూ యూ గీతా
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ

2.ఇరుగూ పొరుగులతో సఖ్యత నీకిష్టం
ఏకాంతం ప్రశాంతత దొరికితె నా కదృష్టం
ఎముకలేని చెయ్యినీది ఉదారతకు పెన్నధి
నీకెదురు చెప్పలేని అపూర్వ ప్రేమ నాది
నియతి లేక ఎగిరేటి గాలిపటం నేను
క్రమత నడుపు ఆధారం ఆ దారం నీవు
హ్యాప్పీ బర్త్ డే టూ యూ గీతా
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ