మా ఊరు ధర్మపురి- మాదైవం నరహరి-గలగలా పారే -గోదావరి మాకు సిరి-జగతిలోనలేనె లేదు దీనికేదీ సరి-కళలకు కాణాచి- వేదాలకు పుట్టిల్లు-విద్వఛ్ఛికామణుల కాలవాలమైనది
gamanika:
నా టివి ప్రోగ్రాం మరియు రికార్డ్ అయిన పాటలకోసం(naa recorded songs and TV show-plz click the links)
- -కొత్త పాటలు -UPDATED ON 13-11-2012RAKI-SRI MANIKANTHA MAHIMA
- కొత్త పాటలు -UPDATED ON 13-11-2012-RAKI-SRI MANIKANTHA GEETHARCHANAM
- కొత్త పాటలు -UPDATED ON 13-11-2012 RAKI-OM GAM GANAPATHAYE NAMAHA
- DHARMAPURI NRUSIMHAA-27-02-2012 VIDUDALA UPLOADED ON 28-02-2012
- VEMULADA RAJANNA MANASU VENNA SHIVARATRI-2012 VIDUDALA UP LOADED ON 28-02-2012
- e link nundi kuda "DAYAMRUTHA VARSHINI"AUDIO SONGSdownload chesukovacchu
- FREE DOWNLOAD AVAILABLE/ PLZ PUT A COMMENT REGARDING LYRICS TUNES MUSIC AND SINGERS @ naa geethaalu(my recorded audio songs
- ***NEW ONE/RAKI-DAYAMRUTHAVARSHINI RELEASED ON 25-09-11-updated on 22-10-2011)
- my elder son short film
- naa videos ayyappa,maa tv,dharmapuri utsavalu pandugalu.godavari
- కవితల కలకలం(వచన కవితలు)
- నిత్యం-నానే-సత్యం(నానీలు)
Wednesday, August 19, 2020
కళ్ళతోనే జుర్రుకుంటా-మకరందమేలే నీ అందము
చూపుతోనే గ్రోలుతుంటా-అమరసుధయే నీ అధరము
ఎలానిన్ను సృష్టించాడో బ్రహ్మదేవుడు
నిను పొందినోడే ఇలలో అదృష్టవంతుడు
1.జాబిలిని మాయచేసి నీ మోమున అద్దాడు
రవిబింబం వాలినప్పుడే నీ నుదుటన దిద్దాడు
నీలిమేఘమాలను తెచ్చి నీ కురులుగ మార్చాడు
పలురకాల విరులను గుచ్చి నీ మేనున కూర్చాడు
ఇలానిన్ను సృష్టించాడే బ్రహ్మదేవుడు
నిను పొందినోడే ఇలలో అదృష్టవంతుడు
2.ముందేమో వింధ్యామలలే ఎదన పేర్చాడు
వెనకాల మేరుగిరులనే నితంబాలు చేసాడు
రోదసీకుహరాలు పొంకాలుగ అమరించాడు
కృష్ణబిలాలేవో పొందికగా నిర్మించాడు
విశ్వరచన చేసాడు నీలో బ్రహ్మదేవుడు
నిను పొందినోడే ఇలలో అదృష్టవంతుడు
పెద్దగా బ్రతకాలనేం లేదు
అర్ధాంతరంగా చావాలనీ లేదు
ప్రతిక్షణం చస్తూ బ్రతకాలని లేదు
ఆత్మను బలిచేస్తూ చావాలని లేదు
చితిలోన కాలేవేళ రాలాలి మనకై కన్నీటి బొట్టొకటైనా
చిరకాలం బ్రతికుండాలి జనుల తలపుల్లోనా
1.ఉన్ననాల్గు నాళ్ళైనా నవ్వుతూ బ్రతికేయాలి
చనిపోయే సమయంలోను పెదాలపై నవ్వుండాలి
సునాయాసంగ బ్రతకాలి బ్రతుకంతా
అనాయాసంగ చావాలి చావు వొచ్చినంత
చితిలోన కాలేవేళ రాలాలి మనకై కన్నీటి బొట్టొకటైనా
చిరకాలం బ్రతికుండాలి జనుల తలపుల్లోనా
2.ఎన్నేళ్ళు బ్రతికితె ఏమి జీవశ్చవాలమై
మూణ్ణాళ్ళుఉన్నాచాలు ఘనకీర్తిశేషులమై
జన్మ ఎత్తినందుకు సార్థకం కావాలి
మంచిపనులనొనరించి చరితార్థం కావాలి
చితిలోన కాలేవేళ రాలాలి మనకై కన్నీటి బొట్టొకటైనా
చిరకాలం బ్రతికుండాలి జనుల తలపుల్లోనా
Tuesday, August 18, 2020
మల్లె ఎంత మంచిదో
పల్లె పడుచు పిల్లలాగ
మల్లె ఎంత చక్కనిదో
పసిపాప నవ్వులాగ
తనువు తనువంతా శ్వేతకాంతి
తన మనసు తావే ప్రశాంతి
1.వనాల్లోను మనగలిగేను అడవి మల్లి
చేలలోన సాగుబడౌను బొండు మల్లి
చెట్టులాగ ఎత్తెదిగేను బొడ్డు మల్లి
మేడమీది కెగబాకేను తీగమల్లి
నవశకపు నాందౌతుంది తొలిరేయిలోన
ఉత్ప్రేరకం తానౌతుంది దాంపత్యాన
2.ముళ్ళతో గాయ పరచదు గులాబిలాగ
బురుదతో మకిల పరచదు కమలంలాగ
భయమే కలిగించదు మొగలిపొదల లాగ
చపలచిత్తయే కాదు సూర్యకాంతి విరిలాగ
మూరెడంత దండౌతుంది ప్రియురాలి జడలోనా
నిలువెత్తు మాలౌతుంది స్వామి వారి మెడలోనా
చెప్పాలి ఏదో ఒకటి
విప్పాలి గుట్టే గుండెది
ఎన్నాళ్ళని మోస్తుంది ఎనలేని అనురాగం
ఎన్నేళ్ళని దాస్తుంది వలపు సరాగం
పల్లవించాలి ప్రేమ గీతపు పల్లవి
కలిసి కదలాలి చరణయుగ్మ యుగళి
1.నీదీ నాదీ ఒకటే మతం అభిమానయుతం
అభిమతమేదైనా సరే పరస్పరం సమ్మతం
నాదీ నీదీ ఒకటే యోగం తావేలేదు అభియోగం
ఎన్నడు కూడదు కలలోనైనా మనకు వియోగం
ప్రేమైక లోకంలో ఏకైక జంట మనం
నిరంతరం ఫలించే కలల పంటే మనం
2.అలవోకగా అమరాలిగా బ్రతుకంతా ఆహ్లాదాలు
పేనవేయగా నిజమౌనుగా ఇరువురి హృదయాలు
నీవు మురళీ రవం ప్రియా నేను బృందావనం
నీవు తులసీదళం చెలీ తూచేవునన్నే తులాభారం
నీకు సదా నేనే సఖా జన్మదాసీనే
నీకు సఖీ నేనే కట్టు బానిసనౌతానే
రాలిపోతున్నాయ పండుటాకులు
కాలిపోతున్నాయి నిండు బ్రతుకులు
పసివారికైనా తప్పుటలేదు ఖనన గోతులు
వయసూ వరుసా లేదు నిత్యం రగిలే చితులు
కరోనా మహమ్మారి కాటుకు బలియై
తగు జాగ్రత్తలకే స్వయంగా వెలియై
1.లాక్ డౌన్ ఎత్తివేత పచ్చజెండా కాదు
ప్రజా జీవనం కొనసాగ దండన లేదు
అడుగు తీసి అడుగు వేస్తే ఏమరుపాటు తగదు
అజాగ్రత్త మూలంగా మూల్యం తప్పదు
అదినిండు ప్రాణమనీ చెప్పక తప్పదు
2.పెండ్లీ పేరంటాలు కరోనాకు ప్రతినిధులు
విందులు వినోదాలు మహమ్మారి వ్యాపకులు
గుమిగూడిన జనవాహిని చేటు దేశానికి
కాలుకదపనప్పుడే రక్ష ఇల్లు దేహానికి
తప్పనిసరైతె తప్ప కదులు అత్యవసరానికి
Monday, August 17, 2020
https://youtu.be/gmJYUrrofp4?si=19uRHACkCO8kMeZ-
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం: భూపాలం
శ్రీ కాళ హస్తీశ్వరా శ్రీ శైల మల్లీశ్వరా
వేములాడ రాజేశ్వరా కాళేశ్వర ముక్తీశ్వరా
ఎన్ని క్షేత్రాలని తిరుగను స్వామి
ఎన్నెన్ని నామాలని తలవను స్వామీ
విశ్వమంతా నీవాసమే విశ్వేశ్వరా నమో
పేరేదైనా నీదే కదా సర్వ భూతేశ్వరా నమో
1.తెలుగునాట త్రిలింగాలు తిలకించినాను
పంచభూత లింగాలను వీక్షించినాను
పంచారామాల పవిత్ర యాత్రనే చేసాను
ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించుకొన్నాను
ధర్మపురీ శ్రీరామలింగేశుని కన్నాను
నా ఆత్మలింగమునే కనుగొనకున్నాను
2.ప్రతి సోమవారము ఉపవాసమున్నాను
శ్రావణ సోమవార వ్రతము పూనుకొన్నాను
కార్తీక సోమవార నోము నోచుకున్నాను
మాఘమాస శివరాత్రి జాగరణ ఉన్నాను
దీక్షలెన్ని గైకొన్నా నీ కృప గనకున్నాను
తదేకదీక్షగా నీ కటాక్ష వీక్షణకై వేచాను
ఆమె: నాకు నేనే తప్పిపోయా-ఎక్కడో చెప్పవా ఆచూకిని
అతను: తొంగిచూడు నా కళ్ళలో-కనుగొందువు నీ రూపుని
ఆమె: భద్రంగా నీ గుండెలో నను దాచి ఉంచు
అతను: తిరిగివ్వను నువ్వడిగినా నిన్ను నీకు
ఆమె: నిధులన్ని మూటగట్టి నీపరం చేసేసా
అతను: పదిలంగా చూసుకుంటా వరంగా భావించి
1.ఆమె: నా మనసు విరి చేసావు-సిగ్గు ధనుసు విరిచేసావు
రాముడివే ఐనాగానీ రాసలీల ముంచేసావు
అతను: లేడి పిల్లలాగా వాడిగా నను చూసావు
నను మచ్చిక చేసుకొని నీవాడిగ మార్చేసావు
ఆమె: యవ్వనాల నా పూదోట కానుకగా నీకిచ్చా
అతను: పరిమళాల నాఘ్రాణించి మనసారా నిను మెచ్చా
2.అతను: అత్తి పత్తివేలే ఆనాడు కత్తిలా నా ఎదలో దిగినావు నేడు
దారంలా చుట్టకొని ఆధారం నీవైనావు
ఆమె: పాదాలు కందకుండా నీ అరిచేతుల నడిపావు
ఏ లోటు రాకుండా నను రాణిని చేసావు
అతను: ఎన్ని జన్మలైనాగానీ నిన్ను వీడనే చెలీ
ఆమె: రేయపవలు ఎప్పుడైనా నీ నీడనే ప్రియా
రాగం: దేశ్
కరుణ నొలుకు కనుల తల్లి
కనక దుర్గ కల్పవల్లి
ప్రణుతింతును ప్రణమిల్లి
మముకావగ కృపనుజల్లి
1.అనుపానుల నెరిగినది
మనమునందు నిలిచినది
దుష్టుల దునుమునది
కష్టములెడ బాపునది
కనకదుర్గ ఎలమి హృది
నెరనమ్మితి నా మది
2.భవ బంధము త్రెంచునది
వైతరణీ దాటించునది
వరములెన్నొ ఇచ్చునది
పరమును అందించునది
కనక దుర్గ దయాంబుధి
జగజ్జననె శరణాగతి
Sunday, August 16, 2020
ప్రేమో ఏమో తెలియని వేళ
నాఎదలో చొరబడినావు
చాపక్రింది నీరులాగా
మెదడే ఆక్రమించినావు
చేరువలోనే ఉన్నాగాని
చేరలేని దూరం మన మధ్య
నీవేలేకా చెలీ నా చెలీ
లోకమంతా ఒక మిథ్య
1.ఎవరినడిగి నాకు ఎదురుపడిపోయావో
ఎందుకు నా జీవితంలో అలజడిరేపావో
నా బ్రతుకు నన్ను బ్రతకనీవేమే
అనుక్షణం తలపులతో నను చంపుతున్నావే
ఊరించడం నీకు సయ్యాటాయే
వేధించడం నీకు అలవాటాయే
2.ప్రేమా దోమా అంటూ గేలిచేసినావు
ఉబుసుపోక నన్ను వాడుకొన్నావు
తీరా నా ప్రేమ తెలిపితే తప్పించుక తిరిగావు
నిను నమ్మి మనసు విప్పితే ఈసడించుకున్నావు
ప్రణయమంటె నీకు నవ్వులాటనా
పరిణయం అంటేనే బొమ్మలాట నా
Saturday, August 15, 2020
కొండమీద వెదికాను-కోనలోన శోధించాను
గుడిలోను బడిలోను గాలించినాను
కనుగొంటినీ నీ ఆచూకిని-నా గుండెలో నీ ఉనికిని
వందనాలు గొనుమమ్మా వేదాగ్రణి పారాయణి
1.నా గళమే నీ ఆసనమై-నా కలమే నీ వాహనమై
నా భావం నీ సంభవమై- నా వర్ణం నీ రూపమై-
వరలుతున్నావే వరవీణా మృదుపాణీ
వందనాలు గొనుమమ్మా వేదాగ్రణి పారాయణి
2.నా ఊపిరి నీ అస్తిత్వం-నా తపనే నీ తత్వం
నా నివేదనే రాగమై -నా సాధన నీ యోగమై
చెలఁగుతున్నావే సామప్రియా సరస్వతీ
వందనాలు గొనుమమ్మా వేదాగ్రణి పారాయణి
బొమ్మ ఏకాంతం బొరుసే ఒంటరితనం
ద్వంద్వకోణాలున్నదే అద్వైతమనే నాణెం
సాహసమే ఒక్కమాటలో వేదాంతాన్ని నిర్వచించడం
కొదవేలేని తెగువే ఒక పాటలో యోగవాశిస్టం బోధించడం
1.కమలం దైవం భ్రమరం నేనై
పరిభ్రమించే పరిక్రియా విశేషంలో
తపించి రమించి తరించగా
త్వమేవాహమై ఉదయింతుగా
2.యోగ సాధనే తగు మార్గంకాగా
రుచులారు ఋతువులారు వైరులార్గుని జయించి
షడ్చచక్రాలనధిగమించి సహస్రారాన్ని ఛేదించగా
లయమై అక్షరమైన కైవల్యమందుగా
3.ఒక నేనను నేనే ఇల అన్నినేనులై
భావించే ఆత్మజ్ఞాన శోధనలో
కర్తా కర్మా క్రియా నేనైన తరుణాన
విశ్వం సహా సోహమై భాసింతుగా
నేస్తమా నేస్తమా నీకిదే శుభరాత్రి
కొనసాగనీ కలకాలమిక మన మైత్రి
చికాకులే కాకులై అరచి గీపెట్టాయేమో
లోకులతో వేగలేకా అలసి పోయావేమో
ముంచుకొచ్చే నిద్రనే ఆదరించినావా
కమ్మనైన కలల నావా ఎక్కేసినావా
1.కనుపాపలు ఊయలలూపగ
కనురెప్పలు నిను జోకొట్టగ
వేధించే వేదనలే వదిలించుకొంటూ
సాధించే వత్తిడులే తొలగించుకొంటూ
తీరని నీ ఆరాటాలు మానుకొనినావ
కమ్మనైన కలల నావా ఎక్కేసినావా
2.పీడకలలు రాకూడదనీ
నిద్రాభంగం కలగకూడదని
ముక్కోటి దేవుళ్ళ వేడుకొంటూ
మధురస్మృతులు నెమరేసుకొంటూ
కమ్మనైన కలల నావా ఎక్కేసినావా
ఆనందాల దీవులనే చేరుకొన్నావా
https://youtu.be/jnmLsL3cKNQ?si=l-ui8caNfBkOChyB
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:హంసానంది
పథకాలు వేయాలి
ప్రణాళికలు రచియించాలి
పతాక స్థాయిలో మనదేశం
పతకాలు సాధించాలి
ఆసరా దొరికితే మనకభయం
ఆత్మవిశ్వాసం వికసిస్తే అన్నిటా విజయం
1.ప్రోత్సాహం కరువైన క్రీడాకారులు
ఉత్సాహం మరుపైన ప్రభుత్వతీరులు
నిబద్ధతే కొరవడిన శిక్షణా సంస్థలు
నిలకడలేని అర్హతలేని ప్రశిక్షకులు
ఆసరా దొరికితే మనకభయం
ఆత్మవిశ్వాసం వికసిస్తే అన్నిటా విజయం
2.బాల్యం నుండే శ్రద్దాసక్తులు
తల్లిదండ్రుల తగు ఆపేక్షలు
గెలుపోటముల సమభావనలు
వెనకడుగేయక సాధనలు
ఆసరా దొరికితే మనకభయం
ఆత్మవిశ్వాసం వికసిస్తే అన్నిటా విజయం
https://youtu.be/4OqL208TxqY?si=E6eXgVogkIDCT0U1
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
(జడి)వాన జల్లు పడుతోంది
నా ఒళ్ళు జిల్లు జిల్లంటోంది
ఈదురుగాలి వీస్తోంది
ఎదఎదో ఆదరువు కోరుతోంది
నులివెచ్చని చెలికౌగిలిలో వేవేల స్వర్గాలు
బొందితో దివినే చేరగ సంగమాలె మార్గాలు
1.ఎంతమంది పొందగలరు-పొందులోని మకరందాలు
ఎవరెవరు దర్శించారో-మదనాంతర మందిరాలు
ప్రదక్షిణలు చేసేలోగా సొమ్మసిల్లురెందరో
గర్భగుడిని చేరేలోగా అలసిపోదురెందరో
జేగంటకొట్టాలి హారతి చేపట్టాలి
దైవమనుగ్రహించాకే ప్రసాదాన్ని గ్రోలాలి
2.ముడుపు కట్టిన ముద్దులే-సమర్పించుకోవాలి
గుసగుసగా సుద్దులతో -అభినుతించి తీరాలి
నివేదించ ఆత్రమేల పత్రమో పుష్పమో
వల్లించాలి స్తోత్రమో మహా మంత్రపుష్పమో
పవిత్రంగ నిర్వర్తించగ రతి ముగితి ఏకమే
తనువులే వివశమైతే తాదాత్మ్యమే,సాలోక్యమే
ముగితి =సిద్ది, మోక్షం, ముక్తి
ప్రపంచమే తలవంచదా
మనుజాళియే కీర్తించదా
భారతీయులది ఒకే మాటగా
భరతావనిదిక ప్రగతిబాటగా
మన ఉత్పత్తులు ఉన్నతమవగా
మన మేధావులు ఉత్తములవగా
జయహో ఆత్మనిర్భర భారత్-వందేమాతరం
జయహో ఆత్మ గౌరవ భారత్-వందే మాతరం
1.మాదకద్రవ్యం ఊసే ఎరగక
నిరుద్యోగమను మాటే లేకా
ఏదో ఒక పని పోషించేదిగ
అద్భుతాలనే సాధించేదిగ
మన యవశక్తే నిరంతరం తలంచగా
ఉత్పాదకతను అనవరతం పెంచగా
జయహో ఆత్మనిర్భర భారత్-వందేమాతరం
జయహో ఆత్మ గౌరవ భారత్-వందే మాతరం
2.ఆత్మహత్యల జోలే లేకా
రైతులు జగతికి ఆకలి తీర్చగ
సేద్యం ప్రభుత ప్రాథమ్యం కాగా
మన వస్తువులే జనులు వాడగా
జాతీయతనే సర్వులకు ఊపిరవ్వాలి
భారతదేశం నాదేనంటూ గర్వంగా నవ్వాలి
జయహో ఆత్మనిర్భర భారత్-వందేమాతరం
జయహో ఆత్మ గౌరవ భారత్-వందే మాతరం
నీ రూపం గొప్పదనం నా చూపులే తెలుపు
నా మనసుకొకటే తెలుసు నీ కున్న మంచితనం
నా అనుభవానికే ఎరుక నీలోని మానవత
చెలీ మొత్తంగా నీవంటే నాకు ప్రాణం
సఖీ ఇష్టంగా బ్రతుకంతా నీ వెంటే నా ప్రయాణం
1.విచలితమై పోతావే అన్నార్తులనే గాంచి
నీ కళ్ళు చమరించేనే అనాథలను పరికించి
తినబోయే ఆహారాన్ని క్షుదార్తులకు పంచేస్తావు
మరులుగొన్న చీరలు సైతం అభాగినులకందిస్తావు
చెలీ మొత్తంగా నీవంటే నాకు ప్రాణం
సఖీ ఇష్టంగా బ్రతుకంతా నీ వెంటే నా ప్రయాణం
2.ప్రతివారిని పలకరించే స్నేహగుణం నీకుంది
ఆశించక సాయం చేసే దయాహృదయమే నీది
నిను మెచ్చుకోవారు ఇల లోన లేనేలేరు
నను నచ్చినావంటే నాకన్న శ్రీలుడు లేడు
చెలీ మొత్తంగా నీవంటే నాకు ప్రాణం
సఖీ ఇష్టంగా బ్రతుకంతా నీ వెంటే నా ప్రయాణం
Friday, August 14, 2020
గాయపరచుట ఎంత తేలిక
కత్తులు కటారులేవీ వాడక
ఒక మాట చాలు ఈటెలాగా
ఒక చేష్టతోనే గుండె మండగ
1.ఎదుట పడితే తప్పుకొంటూ
గొప్పగా నను చెప్పుకొంటూ
శల్య సారథ్యమై శూల ప్రతిఘాతమై
అడ్డుపుల్లలు అడుగుఅడుగున వేసుకొంటూ
2.తాళిబొట్టును మొక్కుకొంటూ
మొగుడినెత్తిన మొట్టుకుంటూ
పతియె పట్టని పతివ్రతలా నేతిబీరకు మారుగా
మనతోబాటు తమని తామే మభ్యపెట్టుకొంటూ
https://youtu.be/R0rwbDtEMuc?si=RBKXDlPM7WLDD2DG
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం :కానడ
కస్తూరి గంధాలు నీరాకలో
హరివిల్లు అందాలు నీకోకలో
కలహంస వయ్యారాలు నీ నడకలో
అమరసంగీతాలు నీ శ్రావ్యగీతికలో
చెలీ నీతో తీరని దప్పికో ఆరని ఆకలో
ప్రియా నీవే నీవే నమ్మలేని నిజమో కలో
1.పంటచేల మీది పైరగాలివో
నల్లమబ్బులోని మెరుపుతీగవో
కోవెలలో మ్రోగేటి జేగంటవో
కోనేటిలొ విరిసేటి కలువ బాలవో
చెలీ నీతో తీరని దప్పికో ఆరని ఆకలో
ప్రియా నీవే నీవే నమ్మలేని నిజమో కలో
2.ఛాతిపైన చెదిరిపోని పచ్చబొట్టువో
చేతిమీద చెరిగిపోని పుట్టుమచ్చవో
అనునిత్యం తట్టి లేపే సుప్రభాత గీతం నీవో
ఆదమరచి నిదురపుచ్చే అమ్మజోల పాటవో
చెలీ నీతో తీరని దప్పికో ఆరని ఆకలో
ప్రియా నీవే నీవే నమ్మలేని నిజమో కలో
Tuesday, August 11, 2020
చెఱసాలన పుట్టిన వాడా
గోపాలన చేసినవాడా
నీ ఆగడాలే రేపల్లె వాడవాడా
ఇల్లిల్లు వెన్నల చోరే ఓ నల్లనోడా
నీ భజన కీర్తనలే నే పాడా ( డ్ యా)
నిన్నే శరణుకోరా మము కాపాడా
1.నాట్యమాడినావు కాళిందినాగు పైనా
నగము నిలిపినావు చిటికెన గోటిపైనా
లీలలెన్నొ చూపావు గోవిందుడా
గోలగోల చేసావు గొల్లబాలుడా
నీ భజన కీర్తనలే నే పాడా ( డ్ యా)
నిన్నే శరణుకోరా మము కాపాడా
2.కోకలెత్తుకెళ్ళావు గోప కాంతలవి
శోకాల బాపావు కుబ్జా కుచేలులవి
ప్రణయమంటె తెలిపావు రాధతొ గూడి
తత్వబోధ చేసావు అని గీత నుడి నిడి
నీ భజన కీర్తనలే నే పాడా ( డ్ యా)
నిన్నే శరణుకోరా మము కాపాడా
గంధర్వ గానాలు నీ కనులలో
పారిజాత సౌరభాలు నీ నగవులో
తేనెలూరు కమ్మదనాలు నీ మోవిలో
చందమామ చక్కదనాలు నీ మోములో
1.హంపిలోని చెక్కణాలు నీ తనువులో
అజంతా చిత్రాలు అణువణువులో
రామప్ప నాగిని సోయగం నీకే సొంతం
ఖజురహో భామిని పరువం నీ ఆసాంతం
2.బాపు బొమ్మకు ప్రాణం నీ ఆకృతిలో
రవివర్మ రాధకు జీవం నీ హవణికలో
ఎంకి ఒంపుసొంపులకు నీవే ప్రతిరూపం
యండమూరి వెన్నెల పిల్లకు నీవే ఆధారం
రాగం:హంసానంది
వాసి చూసి స్పందించే హృదయాలెన్ని
సాహితీ విలువలనెరిగి నందించే ఎదలెన్ని
కవి భావన గుర్తించే అభిమానులెంతమంది
కవనమునాస్వాదించే రసపిపాసులెంతమంది
1.చదవడమే గగనమై సాగుతున్న సమయాన
తెలుగు వెలుగు కృష్ణపక్ష మౌతున్న చందాన
వార్తలు వ్యాసాలే పఠనీయత ఉన్నవేళ
సిసలైన కవిత్వమే నిరాదరణ పాలా
2.సాహిత్యపు పేజీలే అంతంత మాత్రము
ప్రాధేయత పలుకుబడుల పత్రికా లోకము
అస్మదీయ తస్మదీయ పురస్కార వైభవము
ప్రహసనంగా మారిన బిరుదుల ప్రదానము
Sunday, August 9, 2020
నేస్తమా నీకిదే నా జోలపాట
మిత్రమా నీకిదే నా లాలిపాట
గందరగోళంలో కొట్టుమిట్టాడేవు
ఉత్తుత్తి ఒత్తిడిలో చిత్తడి అయ్యేవు
ఆదమరచి సేదదీరు రేయంతా హాయిగా
నిదురలోకి జారుకో అమ్మ ఒడే యాదిగా
1.ఆటుపోట్లే నీకు గ్రహపాటు తీరే
అడుగడుగు వంచెనలె రివాజుగా మారె
బెదరబోకు నేస్తమా బేలగా మారి ఇలా
కలతయేల మిత్రమా బాలలా ఈ వేళా
ఆదమరచి సేదదీరు రేయంతా హాయిగా
నిదురలోకి జారుకో అమ్మ ఒడే యాదిగా
2.భూతకాలము నిన్ను భూతమల్లె వేధించె
అనుకోని ఘటనలు నీడలాగ వెంటాడె
మరచిపో గతమంత దుఃస్వప్నమల్లే
చెలగిపో తెగువతో లేకున్న బ్రతుకు లొల్లే
ఆదమరచి సేదదీరు రేయంతా హాయిగా
నిదురలోకి జారుకో అమ్మ ఒడే యాదిగా
3.కానున్నదేదీ కాకుండా మానదుగా
జరిగేది తప్పక జరిగే తీరునుగా
వదిలేయడం మనకు సులువైన సాకే
నిశ్చింత తోడైతే నిమిషంలొ కునుకే
ఆదమరచి సేదదీరు రేయంతా హాయిగా
నిదురలోకి జారుకో అమ్మ ఒడే యాదిగా
నా హృదయం గులాబీ నీకే సొంతం
ప్రేమతో అర్పించా ప్రియా కాస్త పదిలం
గుచ్చుకోనీయనీకు వాడైన ముళ్ళను
రాలిపోనీయకునా సుకుమారపు రెక్కలను
1.చూపు తిప్పుకోనివ్వదు నా అందం
అడుగుకదపనీయదు నా సుగంధం
ఎంతమంది కోసుకో జూసినా
యత్నాలెన్నో నాకై చేసినా
ముడుపుకట్టి ఉంచానీకై నా సోయగాన్ని
అదను చూసి అందించా నీకే పరువాన్ని
2.కంటగించుకొన్నాను తుంటరివారిని
కంటకాలతో వారికి చేసితి గాయాలని
పూలమనసు నీకు తెలుసనీ
జాలిగొన్న ఎద నీదనీ
ధారపోసినాను నీకై ప్రాణాలని
అంకితమిచ్చాను నా జీవితాన్ని
OK
మూర్తీభవించిన నిలువెత్తు కరుణ
మన డా. సబ్బని లక్ష్మీనారాయణ -
అనవరతం సారస్వత పారాయణ
1.మల్లేశం నాగమ్మల పుత్రరత్నము
బొమ్మకల్ జన్మభూమి గౌరవ చిహ్నము
లెక్కకు మిక్కిలి భిన్న పట్టభద్రతలు
సాహితీ కృషికి ఎనలేని గుర్తింపులు
ఆంగ్లోపన్యాస వృత్తి రచనే ప్రవృత్తి
సామాజిక సేవలోనె జీవన నివృత్తి
2.మనసెరిగిన అర్ధాంగి మానిని శారద
పుత్రద్వయమేమో శరశ్చంద్ర వంశీకృష్ణ
పౌత్రుడై పంచసాగె శ్రీయాన్ ఆనందం
విశ్రాంత జీవితాన అవిశ్రాంతమా కవనం
ముప్పైపై చిలుకు గ్రంథాల ప్రచురణ
అనుబంధాలకు తానే అసలైన చిరునామా
కోకకెంత మిడిసిపాటో నిను చుట్టుకున్నానని
రవికకెంత గర్వపాటో నిన్నట్టి పెట్టుకున్నానని
మెడలోని నగకెంతటి కులుకు నీ ఎదపై ఒదిగానని
పుట్టుమచ్చకైనా ఎంత టెక్కు తాను దృష్టి దాటిపోనని
1.నా తలపే నీ పెదవిన నవ్వై విరియనీ
నా ఊహే నీకన్నుల మెరుపై మెరవనీ
నా తపనే నడుమొంపులొ తరించనీ
నా బ్రతుకు నీ స్పర్శకొరకు తపించనీ
2.చీర పారిపోయేలా మనసునాక్రమించనీ
చోలి తప్పుకునేలా నిన్నే అలరించనీ
ఆభరణం నేనై నీ తనువునల్లుకోమీ
చెరగని స్మృతి చిహ్నమై నీలో ఉదయించనీ
Saturday, August 8, 2020
ఒంటరిని చేసావు ఇది న్యాయమా ఏమి
నీవూ నేనే కదా మనదైన లోకాన
నను ముంచివేసావు కడలేని శోకాన
1.నిర్మలమైన నామది కడలిని
కల్లోల పరిచెడి కాఠిన్యమేల
నిశ్చలమైన నా హృదయాన
అలజడి రేపెడి కరడు నీకేల
నను వేరుచేయకు పరమ దయాళా
నను మరచిపోబోకు ఏవేళా
2.నే కోరుకున్నాన ఈ భవబంధాలు
నిను వేడుకున్నాన ఇహలోక సౌఖ్యాలు
నువులేక నేనెపుడు అనాథనే
నినుగనక నాకు నిత్య వ్యథనే
ననుచేర్చుకో స్వామి నీ అక్కున
ఎడబాటు నోపను రావయ్య గ్రక్కున
నెలనాటి జాబిలి వెన్నెల తునుకవో
జలపాతధారల నురగల మెరుపువో
హిమవన్నగ శ్వేతవర్ణ కాంతిరేఖవో
సౌందర్యం సౌశీల్యం కలబోసిన కలికివో
1.అలనాటి దుష్యంతుని శాకుంతలవో
అవీక్షితుని వరించిన వైశాలినివో
ఋష్యశృంగ పత్ని దశరథపుత్రి శాంతవో
శ్రీరాముని పదతాడిత సతీ అహల్యవో
సాంప్రదాయ సోయగం సొంతమైన దానవో
2.కలనైనా పరపురుషుల తలవని సీతవో
పతికోసం దండధరుని ఎదిరించిన సావిత్రివో
త్రిమూర్తులకె పాలిచ్చిన అనసూయా మాతవో
యజ్ఞోద్భవి పంచ పాండవ సతి ద్రౌపది నీవో
విలువలకే కట్టుబడిన అల దమయంతి వీవో
నింపావు కళ్ళలో సప్తసముద్రాలు
దింపావు గుండెలో అగ్నిపర్వతాలు
పదేపదే పెల్లుబికే కన్నీటి ఉప్పెనలు
నిరంతరం బ్రద్దలౌతు అడియాసల లావాలు
ప్రభూ నేను ఆటబొమ్మనా
స్వామీ నీలీలగ నే నమ్మనా
1.ఎందుకు అందలాలు ఎక్కిస్తావో
ఎప్పుడు ఊబిలోకి నను తోస్తావో
దేనికొరకు విర్రవీగ నను చేస్తావో
అంతలోనె న్యూనతనే కలిగిస్తావో
ప్రభూ నేను ఆటబొమ్మనా
స్వామీ నీలీలగ నే నమ్మనా
2.నీ క్రీడకు సమవుజ్జీననుకున్నావా
నీ కేళికి ప్రేమతొ నన్నెంచుకున్నావా
మించిపోయిందిలేదు తగు శిక్షణ నాకివ్వు
చెరగనీకు స్థిరమదితో నాపెదాల చిర్నవ్వు
ప్రభూ నేను నేనే కానే కానా
స్వామీ నీవు నాలో లేనే లేవా
Friday, August 7, 2020
రాగం:శివరంజని
నిలువు నామాలు నీకా
పంగనామాలు మాకా
అంగలార్చినా బెంగతీర్చవాయే
నంగనాచిలా సంగతెరిగినా ఆర్చవాయే
రంగరంగ వేంకటేశ కరుణాంతరంగ నమో
భవరోగ భంగ తిరుమలేశ భక్తాంతరంగ నమో
1.మా ఆర్తనాదాలే నీకు సుప్రభాతాలు
మా అశ్రుధారలతో నిత్యాభిషేకాలు
మా దైన్య వీక్షణలే నీకు పుష్పార్చనలు
ఎనలేని వేదనలే మేమొసగే నివేదనలు
రంగరంగ వేంకటేశ కరుణాంతరంగ నమో
భవరోగ భంగ తిరుమలేశ భక్తాంతరంగ నమో
2.కొడిగట్టిన మాఆశలు నీకు నీరాజనాలు
మా తపనల తలపులే మంత్రపుష్పాలు
భవిష్యత్తు మృగ్యమైన మాబ్రతుకే కైంకర్యం
పునః పునః ప్రస్తావన నీకు పునః పూజనం
రంగరంగ వేంకటేశ కరుణాంతరంగ నమో
భవరోగ భంగ తిరుమలేశ భక్తాంతరంగ నమో
రాగం:తోడి
హరుడవే-గౌరీమనోహరుడవే
మనోహరహరుడవే-త్రిపురాసుర సంహరుడవే
కావేల ఈవేళ మా దుఖఃహరుడవే
శంభుడవే- సాంబసదా శివుడవే
నిజభక్తవ శంకరుడవే-రాజరాజేశ్వరి వరుడవే
కావేల నీవేల మా అభీష్ట వరదుడవే
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
1.అనునిత్యం కన్నీటితొ నీ అభిషేకం
ఎలాసాధ్యమనేనా తీర్చవు మా శోకం
అనుక్షణం తప్పమునీ నామస్మరణం
ఇడుముల నిడుటకు అదేనా కారణం
కావేల ఈవేళ మా దుఖఃహరుడవే
కావేల నీవేల మా అభీష్ట వరదుడవే
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
2.త్రయంబకం యజామహే మహామంత్రము
మాకు వర్తించుటలో ఏలనీ కుతంత్రము
నమఃశివాయ పంచాక్షరి కైవల్యదాయకం
ఎంతవల్లించినా మాకౌనా నిరర్థకం
కావేల ఈవేళ మా దుఖఃహరుడవే
కావేల నీవేల మా అభీష్ట వరదుడవే
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
Thursday, August 6, 2020
మా ధర్మపురి రాముడు మహిమగల దేవుడు
మా గోదావరి గట్టున సుందరంగ వెలసినాడు
సీతమ్మా సోదరులూ హనుమతోను నిలిచినాడు
రామ రాజ్యమే జనహితం రామ ధ్యేయమే ధర్మయుతం
మహిలో రామచరితమే మహిమాన్వితం
ధరలో రామనామమే మధురామృతం
1.గంగలోన మునకవేసి తడిబట్టలతోనే
రాముని కోవెలకు ఆర్తి మీర వెళ్ళెదము
సీతారాములను ప్రీతిగ దర్శించెదము
అభిషేక తీర్థమును భక్తిగ సేవించెదము
2.రామనవరాత్రాలు అందరికీ సంబరాలు
శ్రీ రామనవమితో ఆనందోత్సాహాలు
సీతారామ కళ్యాణం సకలలోక కళ్యాణం
తిలకించిన కమనీయం పులకించగ రమణీయం
3.వేదోక్త పూజలు తీరైన తీర్థప్రసాదాలు
వడపప్పు కొబ్బరి జామపండ్ల ముక్కలు
రామాయణ పురాణాలు శ్రవణపేయ హరికథలు
అనుభూతులు అనుభవాలు అద్భుతాలు వేనవేలు
Monday, August 3, 2020
రాగం:యమన్ కళ్యాణి
ఎదురుగా ఉన్నపుడు నడవడికల శిక్షణ
ఏ కాస్తైనా జాప్యమైనా ఎంతో నిరీక్షణ
శ్రీవారంటే శ్రీమతికెంతో ఆరాధన
శ్రీమతి చెంత శ్రీవారికెప్పుడు సాంత్వన
1. కాదంటే ఔనని రమ్మంటే వద్దని శ్రీమతి అర్థాలు
ముక్కుసూటి బాటలో ముక్కుపచ్చడవడం శ్రీవారి ప్రాప్తాలు
తిరుగమనే స్వేఛ్ఛ ఇచ్చి గిరిగీయడం శ్రీమతి రివాజు
గీతదాటడం హద్దుమీరడం సాహసాలు శ్రీవారికి మోజు
2.కృష్ణుడిలా లౌక్యం రాముడి ఔన్నత్యం శ్రీమతికతి ప్రియం
ఇంట్లోరామయ్య వీథిలో కృష్ణయ్య శ్రీవారి నైజం
కలహాల కాపురంలో అపార అనురాగమె గోపురం
కష్టాల గృహసీమలొ ఇష్టాల దాంపత్యమే మర్మం
రచన,స్వరకల్పన&గానం:డా.రాఖీ
రాగం:రేవతి
ఏ జన్మభూమి స్వర్గంగా భావించాడో
ఏ పుణ్యభూమి రామరాజ్యమనిపించాడో
ధర్మమే ఊపిరిగా ఏ మహనీయుడు శ్వాసించాడో
సరయూనది తీరాన ఏ సార్వభౌముడు పాలించాడో
ఆ రామజన్మభూమి అయోధ్య
రఘురాముని అద్భుత మందిరనిర్మాణం
నేడే నేడే జయజయధ్వానాల మధ్య
1.ముష్కరుల దాడిలో విధ్వంసమై
పరుల దురాక్రమణలో జీర్ణమై
న్యాయపోరాటంలో పునరుజ్జీవమై
సకల మానవ లోక కళ్యాణార్థమై
శ్రీరామజన్మభూమి అయోధ్య
రఘురాముని అద్భుత మందిరనిర్మాణం
భక్త జనుల జయజయధ్వానాల మధ్య
2.హిందూమత ధర్మసంస్థాపనకై
భారతీయ సాంప్రదాయ సంప్రాప్తికై
వేద సంస్కృతి అనంతవిశ్వ వ్యాప్తికై
సర్వదా సర్వజనుల సుఖశాంతులకై
శ్రీరామజన్మభూమి అయోధ్య
రఘురాముని అద్భుత మందిరనిర్మాణం
దేశ ప్రజల జయజయధ్వానాల మధ్య
OK
రాగం:గౌరీ మనోహరి
శివ లీలా విలాసము-శివ కేళీ లాసము
భక్త మనోల్లాసము-భవ నిశ్రేయసము
ఓం నమఃశివాయ ఓంనమఃశివాయ
1.ప్రదోష కాలాన ఆనంద తాండవము
ప్రళయ కాలానా ప్రచండ రుద్ర తాండవము
కాలకూట విషమునుండి కాచిన దైవము
కైవల్య దాయకము పరమ శైవ భావము
ఓం నమఃశివాయ ఓంనమఃశివాయ
2.అల్ప సంతుష్టుడు అంగజవైరి
అనల్ప శక్తి సంయుక్తుడు పురారి
జలాభిషిక్త సహిష్టుడు జటాఝూటధారి
జన్మసాఫల్యకరుడు గౌరీ మనోహారి
ఓం నమఃశివాయ ఓంనమఃశివాయ
Saturday, August 1, 2020
రాగం:మాయామాళవ గౌళ
పదునాల్గు భువనాల్లొ ప్రథమ పూజలు నీకే
ముక్కోటి దేవతల తొలి దైవమూ నీవె
గణనాథ కరుణించు మము ప్రేమ మీర
విఘ్నేశ దయజూడు సంకటములే తీర
1.గుంజీలు తీసేము తప్పులను మన్నించు
చెంపలేసుక వేడ దోషాలు పరిమార్చు
సాష్టాంగదండాలు ఇష్టంగ పెట్టేము
కష్టాలు నష్టాలు తొలగించి కాపాడు
2.ఏవేవొ రోగాలు ఎడతెగని వ్యాధులు
ఊపిరాడని తీరు ఉద్విగ్న బాధలు
నిమిషంలొ తీరేను నువు తలచుకుంటే
జాగేలనయ్యా నీవే శరణంటుంటే
రాగం:నట భైరవి
చెప్పనలవి కాదు నీ తిరుమల శోభ
నుడువతరముగాదు నీ లీలా ప్రభ
పట్టించుకోవేలా నను పద్మనాభా
పద్మావతి వల్లభా హే భక్త సులభా
1.మనసు పెట్టి నిన్ను మ్రొక్కలేదా
ఏనాడో అది నీ వశమాయెకదా
చిత్తమందు నేను నిన్నుంచలేదనా
ఎప్పుడో నీ పదముల అది చేరేనా
నాదికానిది నాలొ లేనిది ఏమిచ్చేను స్వామీ
పుష్కలమౌ అజ్ఞానముంది ఒడువగొట్ట వేమి
2.పూలతోని నిన్ను సేవించలేదనా
వాడని నా హృదయ కమలమది నీదే
దీపాలనైన వెలిగించలేదనా
కొడిగట్టిన మెదడున్నది నీకై వెలగనీవదే
నీవిచ్చిన ఫలములన్ని నీకే సమర్పయామి
విత్తొకటి చెట్టొకటి ఎలా కుదురుతుంది స్వామి
ఇన్నేళ్ళు వచ్చినా ఓనమాల పసినే
కవితలెన్ని రాసినా కవన పిపాసినే
కడలి ఒడ్డున కడుతున్నా
భావనల పిచ్చుకగూళ్ళు
ఎలా ఈది చేరెదనో సాహితి తీరం
మునకలేస్తూ నములుతు నీళ్ళు
1.ఏ కవితరాసినా ఎదలోన బెరుకేదో
ఇన్నాళ్ళ కృషిలోనూ ఎరుగనైతి ఎరుకేదో
ఆచితూచి అడుగేస్తున్నా ఇంకానే తడబడుతున్నా
మనసుబెట్టి రాస్తున్నా మదిచూరగొనకున్నా
ఎలా ఈది చేరెదనో సాహితి తీరం
ఎలా దించుకోగలనో నా గుండెభారం
2.వరిగడ్డి మంటలాగా మండి ఆరితే ఎలా
నింగిలో వెలిగే రవిలా నిరంతరం వెలుగీనాల
యుగాలెన్నిమారినా నా పాట మారుమ్రోగేలా
ఒక్కగీతమైనా జన్మకు చిరంజీవి కావాలా
ఎలా ఈది చేరెదనో సాహితి తీరం
ఎలా దించుకోగలనో నా గుండెభారం
Friday, July 31, 2020
ఎన్నాళ్ళైందో గుండెనిండా గాలిపీల్చి
ఎంతకాలమైందో బ్రతుకుపట్ల భయం మరచి
అడుగుతీసి అడుగువేస్తె కరోనా పంచన
ఏమరుపాటేమైనా మరణం అంచున
మనదీ ఒక బ్రతుకేనా నిత్యం ఛస్తూ
మనకూ ఇక భవితుందా ఆంక్షలన్ని భరిస్తూ
1.రోజు గడుపుతున్నాం గతస్మృతులను నెమరువేస్తు
బ్రతుకువెళ్ళదీస్తున్నాం అద్భుతాలనూహిస్తూ
విందులూవినోదాలు ఎపుడో బందైనాయి
బంధాలు ఇంటికే బంధీలైపొయినాయి
మనదీ ఒక బ్రతుకేనా శ్వానాల్లా స్వేఛ్ఛేలేక
మనదీ ఒక బ్రతుకేనా శవాల్లా ఇఛ్ఛే లేకా
2.పండగ పబ్బము పెండ్లీ పేరంటాలన్నీ మృగ్యము
ఎన్నడూలేనంతగా శ్రద్ధవహించాలి ఆరోగ్యము
సినీహాళ్ళు షికార్లు దుర్లభమైనాయి
స్నేహాలు మోహాలు పరిమితమైనాయి
మనదీ ఒక బ్రతుకేనా లక్ష్యమే శూన్యమై
మనదీ ఒక బ్రతుకేనా గమ్యమే దైన్యమై
SRI.V.JANAKIRAMARAO' POST inspiration
https://m.facebook.com/story.php?story_fbid=4169565813118855&id=100001964310859
రాగం:ముల్తాన్
కొడుకునైనా కాచలేక తల్లికెంత తపన
అమ్మ ఆతృత కానలేక బిడ్డకెంతటి వేదన
సంసార సాగరంలో ఉన్నఫళమున పడవ మునక
బిక్కుబిక్కని బిక్కచచ్చిరి దిక్కుదెసనే తోచక
1.కార్చిచ్చే కాల్చివేసెనొ-వరదలొచ్చే ఊరు ముంచెనొ
అయినవారికి దూరమైనా-బ్రతుకు వారికి భారమైనా
భవిత సంగతినెరుగకున్నా-దారితెన్నూ తెలియకున్నా
పయనమైరీ కాలమే చేర్చు తీరానికి
సాగసాగిరి దైవమే కూర్చు గమ్యానికి
2.ఒంటిపైని బట్టమినహా-చేతబట్టిన పొట్టతోసహా
గడిపితీరాలిక పోరుతీరు అనుదినం వెతలేలా తీరు
మానవతపై ఆశచావక-మనుషులంటే వెర్రి నమ్మిక
పయనమైరీ కాలమే చేర్చు తీరానికి
సాగసాగిరి దైవమే కూర్చు గమ్యానికి
For AUDIO plz contact whatsapp no.9849693324
https://youtu.be/PRO6NbpabgA?si=ZN2z4cwWbxJes7IU
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం:బృందావన సారంగ
పుట్టింది ఎక్కడో పెరిగింది ఎక్కడో
చేసే పని ఏమిటో తెలిపే నీతేమిటో
ఎక్కడ తానున్నా ఆనందనందనం
ఏ పనిచేస్తున్నా మహిమాన్వితం
వందే గోకులబాలం వందే నందకిశోరం
1.గోపికల చీరలే ఎత్తుకెళ్ళినా
ద్రౌపదికి చీరలెన్నొ అందించినా
ఎంతగానొ వెన్ననే దొంగిలించినా
సుధాముని అటుకులే ఆశించినా
ప్రతిచర్యలోను అంతరార్థమెంతొ ఉంది
నమ్ముకున్న వారికెంతొ ప్రతిఫలముంది
వందే గోపికాలోలం వందే యశోదానందనం
2.రాసలీలలో మునిగి తేలినా
రాయభారమే చెలగి చేసినా
సారథిగా ధర్మ యుద్ధం నడిపించినా
జీవన సారమున్న గీతను బోధించినా
ప్రతికర్మలోను పరమార్థముంది
ప్రభావవంతమైన తాత్వికత ఉన్నది
వందే గోవర్ధన గిరిధరం వందే కృష్ణం జగద్గురుమ్
అతిథిగా వస్తేనే ఆ కాస్త ఆదరణ
ఏకైవచ్చి మేకైపోతే ఎవరికైనా ఛీత్కరణ
కరోనా నువు వచ్చిన కొత్తలొ మాకెంత జాగరూకత
పాతబడిపోయావిపుడిక నువుకాదు వింత
లేనే లేదు మా జనాలకు చింతాకంత చింత
1.తొలుదొలుత ఆనాడు చప్పట్లు తప్పెట్లూ
ఉత్సాహపూరితంగా హారతులు లైట్లూ
దేశమంతా లాక్డౌన్లు మూసాము ఇంటిగేట్లు
వార్తల్లో నీ గొప్పలు కూడళ్ళలొ నీ కటౌట్లు
పాతబడిపోయావిపుడిక నువుకాదు వింత
లేనే లేదు మా జనాలకు చింతాకంత చింత
2.మా మొహాల మాస్కులు ఆన్లైన్ల టాస్కులు
సానిటైజర్ యూజర్లు ఫిజికల్ గ్యాప్ సిటిజన్లు
బ్రతికితే చాలనుకొంటూ బలుసాకు భోజనాలు
అలవాటైనావు కదా మాకు నీతో సహజీవనాలు
పాతబడిపోయావిపుడిక నువుకాదు వింత
లేనే లేదు మా జనాలకు చింతాకంత చింత
INSPIRATION:ATTACHED VIDEO
అడ్డుకాదు మూతిగుడ్డ అందానికి
కనులు చాలు భావాలను తెలుపడానికి
మహరాణులు వాడలేద జలతారు ముసుగులు
మాస్క్ లతో స్కార్ఫ్ లతో మరుగౌను లొసుగులు
1.దుమ్ము ధూళి నాపుటలో సాధనాలు
వాహనదారులకు కాలుష్య రోధకాలు
వైద్యవృత్తి వారికైతె నిత్యాభరణాలు
పారిశుధ్యకార్మికులకు రక్షణ కవచాలు
మాస్క్ లతో స్కార్ఫ్ లతో కట్టడౌను వ్యాధులు
2.ఎదలోని వేదనలను దాచుటకై నగవులు
సుందరీకరణనైతె ఇనుమడించ రంగులు
రాతిరి చీకటిని కప్పిపుచ్చగా వెన్నెలలు
బహుళార్థ సాధకాలు అలనాటి బురఖాలు
మాస్క్ లతో స్కార్ఫ్ లతో మట్టికఱచు వైరస్ లు
సాయి నామం జపించరా
సాయి కోసం తపించరా
సాయినాథుని విశ్వసించర
సాయి సాయని శ్వాసించరా
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి॥
1.షిరిడి ధాముని చిత్తాన నిలుపు
సాయి రాముని దీవెన గెలుపు
సాయి గాధలు మేలుకొలుపు
సాయి బోధలు బ్రతుకున మలుపు
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి॥
2.సాయికర్పణ చేయి కర్మలు
సాయి ఇచ్చును సత్ఫలితములు
సాయిని శరణన సకల శుభములు
సాయి చరణముల అక్షయ సుఖములు
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి॥
Wednesday, July 29, 2020
మదన పంజరం మంజరీ నీ శరీరం
ఒక్కొక్క అవయవం పదునైన విరి శరం
వంపువంపులోనూ వలపు వలల పన్నాగం
చిత్తుచిత్తైపోదా మత్తుగొంటు ప్రతి చిత్తం
1.పరువాల పందెంలో వస్త్రాలకె పరాజయం
పొంకాల బింకంలో హస్తాలకె పరాభవం
పట్టులాగ జారుతుంది పట్టుబోతే నీ నడుము
తోకముడుస్తుందేమో పట్టలేకనే ఉడుము
2.ఎత్తైన కొండలు లోతైన లోయలు
ప్రకృతికే ప్రతిరూపం నీ మేని హొయలు
మొదలు పెడితె చాలు నీ ఒడిలో సరసాలు
కడతేరు వేళ మధురమౌ సుధా రసాలు
FOR audio,u may whatsapp to 9849693324
ప్రేమ అనురాగం ఆకర్షణ ఆరాధన
పేరేదైనా పెట్టుకో నను మాత్రం నీగుండెల్లో పెట్టుకో
ఎంత అందం మూటగట్టుక వచ్చావే చెలీ
నిను చూసి పడిపోని ధీరుడెవ్వడే జాబిలీ
1.నువ్వడిగితె స్వర్గమైనా నేలకు దించుతా
తారలమాలగ గుచ్చి జడనలకరించుతా
నువు కోరితె ప్రపంచాన్నే ఇప్పుడే జయించుతా
నువ్వు హుకుంజారీ చేస్తే యోధులనే బంధించుతా
నీకు ఫిదా కానిదెవ్వరె ఈ జగాన
ప్రాణాలూ ధారపోతురె ఏ క్షణాన
2.ఏడువింతలేమోగాని ఏకైక వింతనీవు
సొంతమైతెగానీ నా చింతలన్ని తీరిపోవు
నగుమోము కంటుంటే కడుపునిండిపోతుంది
నయగారం ఒలికిస్తుంటే బ్రతుకు గడిచిపోతుంది
వర్ణించగాలేదు ఏ కలము నిన్ను
తిలకించగానే స్థాణువౌను నమ్ము
రాగం:తిలాంగ్
నీకున్నది తరిగిపోదు
వేరొకరిది నీకు రాదు
ఎంతటి నిష్ప్రయోజనం అసూయ అన్నది
ఓర్వలేకపోవడం అతివిచిత్రమైనది
1.చెప్పకనే నీ న్యూనత చెప్పినట్లౌతుంది
గొప్పెవరో నీకు నీవె ఒప్పినట్లౌతుంది
స్పర్ధే ప్రేరకమై నీ ఔన్నత్యం వర్ధిల్లాలి
ఈర్ష్య ఏ కోశానానూ నీవై వర్జించాలి
2. ప్రజ్ఞంటూ నీకుంటే కీర్తి తలుపు తడుతుంది
నీ కడ ఉన్న ప్రతిభ రేపైనా వెలుగుతుంది
ఎదుటివారి పట్ల కినుక గౌరవ భంగమే
తుఛ్ఛమైనదే మచ్చరమున్న అంతరంగమే
సాటివారి పట్ల సానుభూతి
అపన్నుల ఎడల సహానుభూతి
సాయం చేయగలుగు సన్మతి
సోనూ సూద్ లాగ ఉమాపతి
దయచేయగ మనసారా నా వినతి
ఇదేనా ప్రణుతి అందుకో నాప్రణతి
1.సంపద ఉండీ ఏమిటీ ప్రయోజనం
అలమటించి పోతుంటే ఆర్తజనం
తృణమో ఫణమో చేయూత నీయగా
ఆస్తిపాస్తులేవీ తరగనే తరగవుగా
దైవం మానుష రూపేణా సోనూ సూద్ గా
మానవతా విలువలనే మాకు చాటి చెప్పగా
2.అరిషడ్వర్గాలలో లోభమే ఘనవైరి
ఆర్జింతుము తరతరాల మనుగడ కోరి
రేపటికై చింతించగ నేడూ చేయి జారి
మేము కుడువమొరులకైన పెట్టము ఏమారి
పుణ్యపురుషులున్నారు సోనూ సూద్ తీరున
వితరణే ప్రేరణగా మము జేర్చుము ఆ సరసన
Sunday, July 26, 2020
ఇల్లే వైకుంఠం- శ్రీహరీ ఇదేకదా నీవుండే సదనం
వెదకబోను వేరెచటా దైవమా నినుకానగ
చంకలొ పాప కనక వృధాగ ఆరాట పడగ
వందే శంభుముమాపతిం-గోవిందం శ్రీపతిం నమామ్యహం
1.అర్ధనారీశ్వరా నీదైన స్థానము
మహాశక్తి కాలవాలము
తరగదింక నా గుండె బలము
శ్రీనివాసమే గోవిందా నీ హదయము
కొదవలేని సిరుల భోషాణము
దరిరాదెప్పుడు దారిద్ర్యము
వందే శంభుముమాపతిం-గోవిందం శ్రీపతిం నమామ్యహం
2.నీవుంటే చుట్టూరా మంచేనంట
చంద్రచూడ తలనెలవంక
వెన్నెల పంచేనంట
నీవున్నతావంతా పాలేనంట
శేషశయన తాపాలనింక
మదినెడ బాపేవంట
వందే శంభుముమాపతిం-గోవిందం శ్రీపతిం నమామ్యహం
వాడ అడుగుతున్నది నీ రాకపోక
నిన్నమొన్న వెళ్ళావేమో సరిహద్దున యుద్ధంకై
యుగాలల్లె తోస్తోంది పరితపించ హృదయం నీకై
1 దేశాన్ని భద్రంగా కాచే జవాను నీవు
కంటిమీద కునుకు లేక సంరక్షిస్తున్నావు
నెత్తురైన గడ్డకట్టే మంచుకమ్ము లోయలు కొండలు
ఎండవేడినోర్వలేక ఎడారుల్లొ మండును గుండెలు
జాతికె అంకితమాయే నూరేళ్ళ నీజీవితం
చావంటే బెదురే లేదు ప్రాణమే తృణప్రాయం
2.అనుక్షణం క్షేమం కోరుతు నీ తల్లి దీవిస్తోంది
మనసంతా నీవేనిండగ నీకై అర్ధాంగి ప్రార్థిస్తోంది
వందముప్పైకోట్లమంది వెన్నంటి వెంటున్నారు
మడమతిప్పకుండా నీకు మద్దతెంతొ ఇస్తున్నారు
సైనికుడా ధన్యుడవే నీ జన్మ చరితార్థకమవగా
యోధుడా మాన్యుడవే మాతృభూమి ఋణం తీర్చగా
ఎదలొ ఒక కవిత
హరివిల్లు వర్ణాలు కనుల ముందు
పరవళ్ళ వర్ణాలు హృదయమందు
1.పదములే కదిలాయంటే
అందెలే రవళించేను
పదములే కుదిరాయంటే
కవనమే వికసించేను
కవిత నడకలన్నీ కలహంసకు పాఠాలు
నాకావ్య గతులన్నీ జవరాలికి భాష్యాలు
2.కవిత మోములోనా
కలువలు మందారాలు సంపెంగ రోజాలు
కవిత రీతిలోనా
ఉత్పలాలు చంపకాలు ఆటవెలదికందాలు
కవిత వెలయించేను కవితలు వేవేలు
కవితలకు స్ఫూర్తి నిచ్చే కవితకు జేజేలు
రాజ్యమెందుకు రాజసానికి
మకుటమెందుకు గౌరవానికి
పదవి వల్లనె వెలిగిపోదురు ఎందరెందరొ నేతలు
పదవికే తగు వన్నె తెత్తురు జనహృదయ నేతలు
1.అడ్డదారుల తెచ్చుకొందురు
తేరగా అధికార యోగం
అర్హతన్నది మృగ్యమైనా
వారసత్వపు రాజకీయం
అంచలంచెలు ఎదుగువారికి ఎదురుండబోదిక ఎన్నడు
వ్యక్తిత్వమే ఆభరణమైతే వెలిగిపోదురు ఎప్పుడు
2.కులమతాలే అండకాగా
పక్షపాతమే ఆలంబనం
సంపదెంతో లంచమీయగ
అధిరోహింతురు అందలం
భాగ్యమన్నది ప్రాప్తముంటే తలుపుతట్టును భోగము
మేధావులంతా జాతికెప్పుడు సేవచేయగ సిద్ధము
అందుకేనేమో ఆకర్షణ పరస్పరం
నాలోని వెలితికి నీ జతయే ఒకవరం
నా కోసమె పుట్టించెను నిన్నా దైవం
ఈనాడే నా శ్రీమతీ గీతా నీ జన్మదినం
ఎన్నో జన్మలుగా అన్యోన్యమైన దంపతులమే మనం
హ్యాప్పీ బర్త్ డే టూ యూ గీతా
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ
1.పనైపోవడమొకటే నా లక్ష్యం
పద్ధతిగా చేయడం నీకు ముఖ్యం
బండవేసి దాటుటే నా కర్తవ్యం
వంతెన నిర్మించడం నీ ఉద్దేశ్యం
అర్ధపూర్ణత్వమే నువులేక జీవితం
అర్ధనారీశ్వరమే మన ఇరువురి కాపురం
హ్యాప్పీ బర్త్ డే టూ యూ గీతా
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ
2.ఇరుగూ పొరుగులతో సఖ్యత నీకిష్టం
ఏకాంతం ప్రశాంతత దొరికితె నా కదృష్టం
ఎముకలేని చెయ్యినీది ఉదారతకు పెన్నధి
నీకెదురు చెప్పలేని అపూర్వ ప్రేమ నాది
నియతి లేక ఎగిరేటి గాలిపటం నేను
క్రమత నడుపు ఆధారం ఆ దారం నీవు
హ్యాప్పీ బర్త్ డే టూ యూ గీతా
విష్యూ హాప్పీ బర్త్ డే టూయూ
Saturday, July 25, 2020
పిడికెడు మెతుకుల కోసమని
రెక్కల కష్టం నమ్ముకొని
ఒకరికి చేయి సాచకూడదని
ఎవరి పంచనో చేర బోమని
చిరువ్యాపారం చేసుకొని బ్రతికే అభాగ్యులెందరో
బేరసారాలు చూసుకొని జీవించే వ్యథార్థులెందరో
1.బుట్టెడు ఫలాలు మోసుకొని-తట్టెడు పండ్లే అమ్ముకొని
పొద్దంతా శ్రమకోర్చి వచ్చినదానితొ తృప్తి పడి
నిజాయితీగా నడుచుకొని బ్రతికే అభాగ్యులెందరో
ఎండావానల వీథిన బడుతూ జీవించే వ్యథార్థులెందరో
2.గీచిగీచి బేరమాడే గిరాకినైనా వదల లేక
ఆచితూచి చిల్లర కోరే పినాసినైనావెళ్ళగొట్టక
గిట్టుబాటే గిట్టకున్నా ఏదో ధరకు విక్రయించే అభాగ్యులెందరో
మామ్మూళ్ళెన్నో ఇచ్చుకొని గిరిగిరి వడ్డీ కట్టుకొనే వ్యథార్థులెందరో
ప్రేమ మీర నను స్పృశించగా
నీ చేతి స్మార్ట్ ఫోనైనా కాకపోతి
నా హృదయ ధ్వనినే వినిపించగా
నువు వాడే హెడ్ ఫోనైనా అవకపోతి
వస్తువుకున్న విలువ ఆప్తులకూ కరువాయే
వాస్తవికత నొదిలివేయ మిథ్యా బ్రతుకాయే
1.చేదబావే లేక బోర్వెల్ కరెంటు బిచ్చమాయె
వీచు గాలినోచక సీలింగ్ ఫ్యాన్లే దిక్కాయే
సహజవనరులన్నీ తత్వాలను కోల్పోయే
యాంత్రికత గుప్పిట ప్రకృతి నీరుగారిపోయె
వస్తువుకున్న విలువ ఆప్తులకూ కరువాయే
వాస్తవికత నొదిలివేయ మిథ్యా బ్రతుకాయే
2.మనిషి మనిషి మధ్యలో అంతర్జాలమాయే
కాలక్రమేణా ఎన్నో పనిముట్లే మాయమాయే
అనుబంధం ఆత్మీయత మొక్కుబడిగ మారెనాయె
సాంప్రదాయమంటేనే పురావస్తు శిథిలమాయే
వస్తువుకున్న విలువ ఆప్తులకూ కరువాయే
వాస్తవికత నొదిలివేయ మిథ్యా బ్రతుకాయే
జడత్వమే ఆదరువు నియంత్రణే నాకు కరువు
శాఖోపశాఖలై విస్తరిల్లె నా కవన తరువు
నిమిషమైన మోయలేను నాలో భావాల బరువు
గీతమై వెలువరించ నా మనసే ఆపోవు
కవనమే నాకు జీవనం గీతమే ప్రియతమం
1.పగలు లేదు రాత్రి లేదు ఇపుడపుడని లెక్కలేదు
భక్తీ రక్తీ ముక్తీ దేశానురక్తిగా విషయమొక్కటని కాదు
అనుకోని అతిథిగా ఏదెపుడెద తడుతుందో
ఏ రూపుదిద్దుకొని ఎలా వెలుగు చూస్తుందో
కవనమే నాకు జీవనం గీతమే ప్రియతమం
2.ఊపిరాడని ఒత్తిడి ఎన్నెన్నో సవాళ్ళ దాడి
రచనచేయ అడుగడుగున అవాంతరాల సుడి
దొరికిన సమయాన్ని లిప్తపాటు వదలను
అనుకున్న అనుభూతి వచ్చు వరకు వదలను
కవనమే నాకు జీవనం గీతమే ప్రియతమం
3.ప్రశంసలు విమర్శలు ఏవైతేం స్పందనలు
సత్కారం బహుమానం కావు తూచు తూనికలు
పాఠకుల ఎదలోన స్థిరపడాలి పదిలంగా
అభిమానుల మన్నలు పొందాలి ఘనంగా
కవనమే నాకు జీవనం గీతమే ప్రియతమం
వేదాంత మెంతగ చెప్పితేనేం చట్టాలనెన్ని గుప్పితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
పనికిమాలిన సొల్లుకబురులు వాగడం తగదురా
ధర్మ పన్నాల్ వల్లించితేనేం మూల్యమే చెల్లించితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
వంచనల పంచన చేరగ మినహాయింపే లేదురా
నీతులే బోధించితేనేం న్యాయముగ వాదించితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
తమదాక వస్తే నియమాల మాటే చేదురా
బాసలెన్నైనను చేసితేనేం ఆశలే కల్పించితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
పదవి వరకే పలుకు విలువ నిజం చెబితె బాధరా
సాంత్వనలు కల్పింతేనేం ఉచితసలహాలిచ్చితేనేం
తన్నుమాలిన ధర్మమేది ఉండబోదుర సోదరా
నొప్పి తీవ్రత చెప్పతరమా రాఖీ లోకం వినదురా
Friday, July 24, 2020
తలపుల తోటలో వలపుల పాటవే
తపనల బాటలో తరగని ఊటవే
తన్మయమొందగా అందాల విందువే
తమకము తీరగా పరువాల పొందువే
చేజారిన మణిపూస రాలేవే నా దెస
ఏమారిన వేళలో ఎదురైందీ అడియాస
1.బ్రతుకునకొక్క మారె చావన్నది బూటకం
క్షణక్షణం ఛస్తున్నా నీ ప్రేమే పితలాటకం
నీతో జతగా నీ ప్రతి ఊహా కర్పూరం
వెలిగి కరిగి పోయింది బంగారు జీవితం
చేజారిన మణిపూస రాలేవే నా దెస
ఏమారిన వేళలో ఎదురైందీ అడియాస
2.నిస్సహాయమైననీ చూపేనా గుండెకోత
డోలాయమానమైన నీ మనసే విధివంచిత
ఎదురొచ్చి ప్రతిసారి ఇరువురిలో కలవరం
పొరపాటో గ్రహపాటో ఎరుగమైతిమే వివరం
చేజారిన మణిపూస రాలేవే నా దెస
ఏమారిన వేళలో ఎదురైందీ అడియాస
అమ్మ అన్న మాటలోనె తేనెల ఊట
అమ్మే దైవము అమ్మే లోకము
అమ్మ చెంత ఉంటే దరిచేరదు శోకము
1.నాన్నకు నాకు రాయబారి అమ్మ
వీథి గొడవలేవైనా నా వకీలు అమ్మ
దాచినాకు రొక్కమిచ్చు మహాదాత అమ్మ
పూచికత్తు తానై నా తప్పుకాయు అమ్మ
2.తీరొక్క రుచులతో కడుపునింపు అమ్మ
ఉన్నదూడ్చి మూటకట్టి సాగనంపునమ్మ
లేదను మాటనదు చేతికెముక లేని అమ్మ
అమ్మంటె నాకే కాదు ఊరంతకు తాను అమ్మ
https://youtu.be/mlxPwf_jvDk?si=5jvWk9nGTEJad-kA
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం :అఠాణా
శ్రీచక్ర రాజ సింహాసనీ శ్రీ లలితే
శ్రీ విద్యా పరాంబికే పరదేవతే
శ్రీ మాతా భువనేశ్వరీ నమోస్తుతే
1.ఏకమేవా బ్రహ్మ రూపితే
ద్విజ తతి నిత్య సంపూజితే
త్రిమూర్తి సహిత భృత్య వందితే
చతుర్వేదాంతర్గత ప్రతిఘోషితే
2.పంచకోశ మాయా నిగూఢితే
షడ్చక్ర ఛేదనానంతరప్రకటితే
సప్త స్వర సంగీత గానలోలితే
అష్టాంగ యోగసిద్ధి ప్రసాదితే
Thursday, July 23, 2020
మేటిదైన మన వార్తా పత్రిక
బైస దేవదాసు మానస పుత్రిక
పాఠక జనులకైతె నిత్య వేడుక
1.నిక్కచ్చి నిజాల కిది వేదిక
వాస్తవాల్నె ఘోషించే గొంతుక
పూర్తిగా పక్షపాతరహితమైనది
ఏ రాజకీయ పక్షానికి చెందనిది
పాత్రికేయ విలువలకు పేరొందినది
నమ్మిన సత్యానికే కట్టుబడినది
2.సారస్వతానికిచట పెద్దపీట
గురువారం సాహితీ కెరటాలె ప్రతిపుట
వర్ధమాన కవులకిచ్చు తగు బాసట
ఉత్తమ కవితలకు చోటు దొరికేనిట
తెలుగు రాష్ట్రాల ప్రభావవంతమైంది
పత్రికాలోకంలో మకుటాయ మానమిది
https://youtu.be/aBetYMQWEmI?si=s7pj3PNjWpfqtmo0
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం :మధ్యమావతి
నట్టింట తిరుగాడే మహలక్ష్మి మా చెల్లెమ్మ
కనురెప్పలాగా నను కాచు మా అన్నయ్య
సోదరిసోదరుల పండగే రక్షాబంధనం
అనురాగం యోగంగా నడిపించే ఇంధనం
1.హరివిల్లు విరిసేను నా చెల్లి నవ్వులలో
అమృతమే కురిసేను నా అన్న చూపులలో
చెదరనిది మరవనిది తోబుట్టుల అనుబంధం
సృష్టిలోన తీయనైనది ప్రేగు పంచుకున్న బంధం
2.యమద్వితీయ నాడు భగిని నీ హస్త భోజనం
రాఖీ పున్నమి రోజు అన్నా నీకు నీరాజనం
రక్తసంబంధం మనది ఎన్నడు వీడిపోనిది
ఆత్మీయ గంధం మనది ఎన్నడు వాడిపోనిది
Tuesday, July 21, 2020
జాలి చూపెట్టవే జవరాలా
బానిసగానైనా నన్నట్టిపెట్టుకో
నీదాసుడనేనని గుర్తుపెట్టుకో
1.కనుకొలుకుల జారే కన్నీరే
తలపిస్తోంది వరద గోదారే
ఫక్కున నవ్వుతూ రెచ్చగొట్టు నీతీరే
చంద్రహాసవీక్షణ నీమోముకనగ తీరే
2.నీపాదం బొటనవేలు నావేణువు
ఊదేను నా పెదాలు తాకనివ్వు
నీ గుండెనే నా కిక ఏకైక తావు
నువుకాదంటే మిగిలింది నాకిక చావు
Monday, July 20, 2020
ప్రలోభాలు ప్రలోభాలు ప్రలోభాలు
మనిషి బలహీనతపై స్వారిచేసె మత్తేభాలు
జ్వాలల మోజులో కాలిపోవు నెన్నో శలభాలు
వేటగాళ్ళ ఉచ్చులో చిక్కేను బేల శరభాలు
1.స్వేఛ్ఛను హరింపజేసే ఓట్ల బేరసారాలు
విచ్చలవిడిగా పంచేటి నోట్లు సారాలు
ఇఛ్ఛను భ్రమింపజేసే మతబోధ సారాలు
లౌకికతే భ్రష్టుబట్టు విషమయ కాసారాలు
తార్పిడులకు మార్పిడులకు తావా మన మానస వసారాలు
2.ఆత్మను అమ్ముకొనుటె తీసుకుంటె లంచం
డబ్బిస్తే నాకడమేనా ప్రతివాడి ఎంగిలి కంచం
కష్టార్జితానికే విలువనీయగలదు ఈ ప్రపంచం
పరాన్నబుక్కులు దొంగల బ్రతుకే నీచాతినీచం
తలతెగితేనేం మనుషుమైతె మనం ఎవరికి తలవంచం
రాగం:కళావతి
పొన్నచెట్టు పొదలమాటు
ఏకాంతమైన చోటు
కన్నయ్యకోసమే కాచుకుంది
అన్నులమిన్న వేచిఉంది
తమకం కమ్ముకున్న అభిసారిక
తపనలనోర్వక అభినవ రాధిక
1.నల్లనయ్యకోసమని పిల్లనగ్రోవి గొని
వేణుగాన మాధురిలో పరవశమొందాలని
మువ్వలపట్టీలు కట్టి నాట్యమాడాలని
మువ్వగోపాలుని మురియగ జేయాలని
తహతహలాడుతోంది అభిసారిక
తపనలనోర్వక అభినవ రాధిక
2.కలువల కళ్ళతోని పూజించాలని
అధరసుధారసములనే నివేదించాలని
తనువు కర్పూరమవగ హారతి పట్టాలని
మనసు మనసు సంగమించ స్వర్గం ముట్టాలని
తరుణముకై తొందరించె అభిసారిక
తపనలనోర్వక అభినవ రాధిక
రాగం:శివరంజని
తల్లిగర్భములోని పిండానికి అండదండెవ్వరో
ఇహలోక బంధాలు అవలీలగా ముడివేయునెవ్వరో
పురిటిగుడ్డుకు రోదనలు నేర్పింది ఎవ్వరో
అమ్మరొమ్మును కుడువ బోధించెనెవ్వరో
అట్టి పరమేశునికి నా అభివందనం
అఖిల విశ్వేశ్వరునికి నా ఆత్మ వందనం
1.ఆకలిదప్పులు అంగాంగ నొప్పులు శిశువుకెవ్వరు తీర్తురో
ఆహార లభ్యతను స్వీయ సంరక్షణను పశువుకెవ్వరు కూర్తురో
పక్షులకు చేపలకు ఎగరగా ఈదగా ఎవరు శిక్షణ నిత్తురో
క్రిమికీటకాదుల మనుగడకు ఏర్పాటు నెవరుకావింతురో
అట్టి పరమేశునికి నా అభివందనం
అఖిల విశ్వేశ్వరునికి నా ఆత్మ వందనం
2.మనిషికీ మనిషికీ నిమిషనిమిషానికీ బుద్ధినెవ్వరు మార్తురో
బహువింతరోగాలు ఉన్నతులు దుర్గతులు ఎవరంటగడ్దురో
విపరీతపోకడల పైశాచ కృత్యాల పురికొల్పు దాతెవ్వరో
పంచభూతాల భీభత్సకాండతో లోకమే హరియించు నేతెవ్వరో
అట్టి పరమేశునికి నా అభివందనం
అఖిల విశ్వేశ్వరునికి నా ఆత్మ వందనం
Saturday, July 18, 2020
ప్రకృతి పార్వతి కాలమే అహర్పతి
అర్ధనారీశ్వరమే సర్వం సహా జగతి
క్షితిజగామి భగవతి ఊర్ధ్వగామి పశుపతి
సంతులన సాధనయే సమకూర్చును సద్గతి
శ్రీవిద్యాన్విత ప్రాణాయామమే శివశక్తుల సంగమము
ఓం నమఃశివాయ శ్రీ మాత్రే నమోనమః
1.పంచకోశమయమీ పాంచభౌతిక దేహం
అరిషడ్వర్గాలతొ సతతం అతలాకుతలం
ఉద్దీపనకావాలి నిద్రాణమైన కుండలినీ శక్తి
శ్రీచక్రోపాసనతో సంప్రాప్తమౌను నరజన్మకు ముక్తి
శ్రీవిద్యాన్విత ప్రాణాయామమే శివశక్తుల సంగమము
ఓం నమఃశివాయ శ్రీ మాత్రే నమోనమః
2.అద్వైత భావనయే పరయోగ పథము
ఆత్మైక దర్శనమే పరాశక్తి వరప్రదము
మూలాధారాన జాగృతమై షడ్చక్ర చైతన్యమై
నిర్వికల్ప సమాధిగా సహస్రారమే ఛేదనమై
శ్రీవిద్యాన్విత ప్రాణాయామమే శివశక్తుల సంగమము
ఓం నమఃశివాయ శ్రీ మాత్రే నమోనమః
OK
బృందావన సంచారా యమునా తీర విహారా
రాధికా హృదయ చోర మీరా మానస పచేరా
నీ అష్టభార్యలే అష్టవిధ శృంగార నాయికలు
పదారువేల గోపికలు రసకేళికే దివ్యదీపికలు
1.స్వాధీన పతిక నీకు ప్రియసతి సత్యభామ
వాసక సజ్జికయే సలక్షణ ధర్మపత్ని లక్షణ
విరహోత్కంఠిత ఏకాంత విరిబోణి సుదంత
విప్రలబ్ద విజయలబ్ద సుదతి జాంబవతి
అష్టభార్యలే అష్టవిధ శృంగార నాయికలు
పదారువేల గోపికలు రసకేళికే దివ్యదీపికలు
2.ఖండిత విరహజ్వలిత ఉవిద మిత్రవింద
కలహాంతరిత నీ సహధర్మచారిణి రుక్మిణి
ప్రోషిత భతృక ఇంతి పాలుషి కాళింది
అభిసారిక సంగమగీతిక నీ కళత్రమౌ భద్ర
అష్టభార్యలే అష్టవిధ శృంగార నాయికలు
పదారువేల గోపికలు రసకేళికే దివ్యదీపికలు
Friday, July 17, 2020
అందమంటే నీలా ఉంటుందా
అందమంటే అందనంటూ పందెం వేస్తుందా
అందలం ఎక్కిస్తాను అందుబాటులో ఉంటే
అందరికీ చెప్పేస్తాను బంధం పెనవేస్తానంటే
1.అందెలు నీపాదాల సుందరంగ అమరాయి
చిందులు వేస్తుంటే గుండెలెన్నొ అదిరాయి
కందిపోతాయేమో సుకుమారం నీ అరికాళ్ళు
అందనీయవే నాకు నీ సొగసులు సోయగాలు
2.అరవిందాలే చెలీ సంకెళ్ళువేసే సోగకళ్ళు
మకరందాలే సఖీ నీళ్ళూరించే నీ మోవిపళ్ళు
ఏ డెందమైనా మందిరమయ్యేను దేవి నీవుగా
ఆనందనందనమే జీవితమంతా నీతొ మనువుగా
(చిత్రం కవితకు ప్రేరణ,ఆలంబన మాత్రమే-వ్యక్తిగతమైన ఏ సంబంధం ఈ గీతానికి చెందని గమనించ ప్రార్థన)
OK
పట్టించుకోకుంటె పరితాపం
పట్టిపట్టి చూసామా ఎంతటి కోపం
అందాలన్ని ఆరబోసే ఆ వైనం
కనువిందనుకొన్నామా సంస్కార హీనం
ప్రాణాలు తోడేసే ఎలనాగలు అలివేణులు
శవాలకూ జీవం పోసేరు సుందరాంగులు అమృతగుళికలు
1.అల్లార్పే కన్నులు బుగ్గన సొట్టలు చుబుకం నొక్కులు
క్రీగంటి చూపులు మునిపంటినొక్కులు అన్నీచిక్కులు
మామూలు బాణమైన ఛేదించగలిగేను హృదయము
దివ్యాస్త్రాలైతేనో నిలువెల్లా దహియించు తథ్యము
అత్తిపత్తులే నత్తగుల్లలే అతివలు అందని ద్రాక్షలు
2.చిచ్చుపెట్టే చిట్కాలెన్నో వెన్నతో పెట్టిన విద్యలు
రెచ్చగొట్టే ఆయువు పట్లే కరతలామలకాలు
మెండైన ప్రలంబాలు నిండైన నితంబాలు
ప్రధానమే సదా వగలాడికి ప్రతారికా ప్రదర్శనం
పృష్ఠము కటి వళి అంగమేదైనా అయస్కాంతము
సర్వాంతర్యామివి కదా స్వామి నీవు
విగ్రహాలు ముక్కోటి పేర్లేల దైవమా
నామ రూప రహితుడవే స్వామీ నీవు
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
నమో తిరుమలేశా నమో పాపనాశా
1.విన్నవించుకోవాలా మా వినతులు
జగముల కన్నతండ్రివే నీవైనప్పుడు
విడమరచి చెప్పుకోవాలా మాకున్న వెతలు
సర్వజ్ఞుడివే స్వామీ నీవైనపుడు
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
నమో తిరుమలేశా నమో పాపనాశా
2.కలతచెందాలా మేం పుట్టుక మరణాలకై
కర్తా కర్మా క్రియా అన్నీ నీవై నప్పుడు
బాధ్యత వహించాలా నిమిత్తమాత్రులమై
జగన్నాటక సూత్రధారివే నీవై నప్పుడు
నమో వేంకటేశా నమో శ్రీనివాసా
నమో తిరుమలేశా నమో పాపనాశా
Wednesday, July 15, 2020
పొగిడితే పొంగవు తెగిడితే కృంగవు
ఏ ప్రలోభాలకూ లొంగనే లొంగవు
కలుషితాలు తొలిగించే పావన గంగవు
దత్తాత్రేయుని అవతారమేనీవు
షిరిడీ సాయిగ మాకై వెలిసావు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆశ్రితజనాభీష్ట వర ప్రదాయకా
1.సాయి నీనామం నిరంతరం మా స్మరణం
బాబా నీ రూపం అనవరతం మా ధ్యానం
పగలూ రేయీ కలలో ఇలలో నీపై ధ్యాస
పీల్చిన వదిలిన నీదేనీదే నా ప్రతి శ్వాస
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆశ్రితజనాభీష్ట వర ప్రదాయకా
2.ఆపదలోను సంపదలోను ఆప్తుడవీవే
వేదనలోనూ మోదములోనూ నేస్తము నీవే
తల్లిదండ్రి గురువూ దైవము సర్వము నీవే నీవే
అన్యధాశరణం నాస్తి ఆదుకోగ వేగ రావే
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
ఆశ్రితజనాభీష్ట వర ప్రదాయకా
పాలకావడి పట్టుకొచ్చా పళనిమలవాసా
పంచదార మోసుకొచ్చా పార్వతి ఔరసా
ఆయురారోగ్యాలకు నీదేలే స్వామి భరోసా
నమ్మికొలుచుకుంటున్నాను చేయకయా అడియాసా
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం స్వామినాథా సుబ్రహ్మణ్యం
1.మార్గశీర్ష శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యా నీ జన్మదినం
మనసారా చేయుదు నీకు అభిషేకం అర్చనం
అగ్నితోజోమూర్తీ వర్ణించ నా వశమా నీ కీర్తీ
నీవే ఇక నెరవేచ్చాలి తీరని నా హృదయపు ఆర్తి
2.గుహ్యతరమైనది నీ జన్మ వృత్తాంతం
భవ్యమయమైనది నీ దేవ సేనాధిపత్యం
శ్రీ వల్లీ ప్రియ మనోహరా హర కుమారా
సంతానం నీ వరప్రసాదం షణ్ముఖా కావరా
3.కుక్కుటధ్వజానీకు బహుపరాక్ బహుపరాకు
శిఖివాహన స్కందా వేలవందనాలు నీకు
వేలాయుధపాణి నీకు శతకోటి దండంబులు
కార్తికేయ శరవణభవ నీకివె నా శరణార్థులు
రాగం:ఉదయ రవిచంద్రిక
చిదిమి దీపం పెట్టుకోవచ్చు బహు చక్కని రూపం
మదిని చిత్రం నిలుపుకోవచ్చు సంశయించక ఏమాత్రం
అందానికే నీవు అసలైన కొలమానం
ఏ కవీ ఉపయోగించని అపురూప ఉపమానం
1.కళ్ళలో ఏదో అద్భుత దివ్యత్వం
చూపుల్లో జింకపిల్లలా అమాయకత్వం
చెంపలింక సిగ్గులొలికే మంకెన మొగ్గలు
కురులైతే కారుకొనే పట్టుకుచ్చులు
దొండ పళ్ళు మరిపించే నీ పెదవులు
కౌముదే కలత చెందే నీ నగవులు
2.తలని నిమురాలనిపించే ముగ్ధత్వము
తెలవారువేళలో విరుల స్నిగ్ధత్వవము
ముట్టుకుంటె మాసిపోయే సౌందర్యము
పట్టుకుంటె కందిపోయే సౌకుమార్యము
అపరంజి బొమ్మవు నీవు లేలేత కొమ్మవు నీవు
ఆహ్లాదం కురిపించే ఏడురంగుల నింగి విల్లువు
ఎద తలుపు తట్టేదెవరో
నా కవి తలపు కొచ్చేదెవరో
అతిథిగా వేంచేసేది ఏ వస్తువో
తానుగా స్పృశియించేది ఏ విషయమో
ఏ రసం వర్షిస్తుందో ఎంతగా అలరిస్తుందో
1.అన్నమయ్య ఆవహించి భక్తి వెలువరించేనో
క్షేత్రయ్య ప్రేరేపించి శృంగారం కురిపించేనో
వేమనే స్ఫూర్తినీయ సమాజమే స్ఫురించునో
దేశమాత బోధించ జాతీయత నినదించేనో
ఏ రసం వర్షిస్తుందో ఎంతగా అలరిస్తుందో
2.తొలి ప్రేమలోని బిడియాలు ఒలికేనో
దాంపత్యమందలి అనురాగం చిలికేనో
స్నేహబంధంలోని మధురిమే పలికేనో
మగతలోని మానవతనే మేలుకొలిపేనో
ఏ రసం వర్షిస్తుందో ఎంతగా అలరిస్తుందో
కవినైనాను నేను నీ చలవవల్లే చెలియా
కవితలే రాస్తున్నాను నా అనుభూతులే ప్రియా
కనులముందుకొస్తే ప్రణయైక కవిత
కనుమరుగైతేనో విరహాగ్నే కవిత
అహరహమూ నీదే ధ్యాస
అనవరతము నీమీదే ఆశ
1.గూఢంగా నిన్నే ఎపుడూ వెంబడించాను
మౌనంగా నిన్నే ఆర్తితో ఆరాధించాను
చెలరేగిన భావాలన్నీ మదిలొ దాచుకున్నాను
ఏరుకొన్న నీగురుతులను పదిలపరచుకున్నాను
మనువాడగ కలలే కంటూ తాత్సారం చేసాను
రెప్పపాటులోగా నిన్ను పరభార్యగ చూసాను
2.నాహృదయ గోదావరిని వరదలే ముంచెత్తాయి
ఊహలన్ని ఊడ్చిపెట్టి ఎడారిగా మార్చేసాయి
యాంత్రికంగ నా బ్రతుకేదో అలా గడిచి పోతోంది
నువ్వు ఎదురైనపుడల్లా లావా పెల్లుబుకుతోంది
నవ్వులనే పులుముకున్న జీవశ్చవాన్ని నేను
మరుజన్మకైనా నీవాడిగా వరము కోరుకుంటున్నాను
గార్హపత్యాయ నమో
ఆవహనీయాయనమో
దక్షిణాగ్ని సంయుతా
త్రేతాగ్ని రూపాయ నమో నమో
అగ్ని దేవాయా నమో నమో నమో నమో
1.తమసోమా జ్యోతిర్గమయా వహ్నిదేవాయ నమో
యజ్ఞయాగాది క్రతు అధిప హవ్యవాహనాయ నమో
సూర్యచంద్ర తేజో ప్రదాయకాయ అనలాయనమో
అరణి మథన ఆవిర్భవ కృశానాయ నమో నమో
2.ఖాండవ వన దహనాయ ధూమధ్వజాయనమో
సర్వభక్ష ద్విశీర్శాయ స్వాహా పతయే నమో
సీతా పునీత శీలపరీక్ష సాక్షీభూతాయతే నమో
బ్రహ్మ జ్యేష్ఠ పుత్రాయ దిక్పాలక శ్రేష్టాయ హుతాశనాయ నమో
నా ప్రతిగీతం ఒక సుప్రభాతం
నా భావావేశం జోగ్ జలపాతం
జీవధార ప్రవహిస్తుంది
ఆత్మఘోష నినదిస్తుంది
అనవరతం నామనోరథం కవనపథం
నవనవోన్మేషం నవరసభరితం ఎద ఎదకూ శుభసందేశం
1.ఉపమానాలు ఉత్పేక్షలు నాకు అపేక్షలు
పొంతనలేని ప్రతీకలు పునరుక్తులు నాకుపేక్షలు
అన్నిపాటలు అన్నిపూటలు నాకు విషమ పరీక్షలు
విద్యాబుద్ధులు గేయ సిద్ధులు వాగ్దేవి భిక్షలు
2.ఏ వస్తువు ఎదురైనా నోచేను నా ఆదరణ
ఏ విషయం పలకరించినా చేరున నాఅక్కున
మనోధర్మ మనుసరించి రూపొందును స్వరరచన
అనురాగం రంగరించగా రంజకమౌ నా కీర్తన
https://youtu.be/6MBRAUogQnY?si=AX2T2Fdnw-dD3hjC
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)
రాగం : ఉదయరవిచంద్రిక (శుద్ద ధన్యాసి )
లేనివాణ్ణి ఉన్నాడన్కొని
విన్నపాల నెన్నో వేడ్కొని
వలసినన్ని పేర్లతో పేర్కొని
నమ్మినాను సేవలే చేస్కొని
తెలుసుకో మనసా నీ సమయం హుళిక్కి
ఎరుగవే మనసా దొరికిందింతే బ్రతుక్కి
1.మంగళవారం గణపతి మారుతి నరహరి యని కొలిచి
బుధవారం వాణీ మణికంఠుల ప్రణుతించి
గురువారం సాయిబాబా శరణాగతి జొచ్చి
శుక్రవారం జగన్మాతనే యథోచితంగా కీర్తించి
ఖంగుతిన్నాను మనసా ఎంతగానో భ్రమించి
2.శనివారం వేంకటపతినే కొనియాడి
ఆదివారం ఆదిత్యుని శ్రీరాముని శ్రీకృష్ణుని పాడి
సోమవారం సదాశివునితో మొరలిడి
అహోరాత్రాలు దైవచింతనే తలపులనిడి
భంగపడినాను మనసా గుడ్డిగా బోల్తాపడి
జన్మదిన శుభవేళ శ్రీమతి Manjula Surya కు-
-డా.రాఖీ చిరుకానుక
పాలకడలి మథనాన క్షీరజ నీవై
మానస సరోవరాన నీరజ రూపై
ఆవిర్భవించితీవు నేడే మంజులమౌ మంజులా
పరిణమించె పరవశాన అవనియే మధువనిలా
శుభాకాంక్షలందుకో మంజుల సూర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మంజులా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ ఈశుభవేళా
1.మందహాసమే మణిహారం
మధుర భాషణే సుధారసం
దయార్ద్రమౌ వీక్షణే పూర్ణిమ శరత్తు
కపోలాల తీక్షణే గులాబీ తటిత్తు
ఎంత శ్రద్ధ కనబరచాడో నీ సృజనలొ బ్రహ్మ
చక్కగా ముడిపెట్టాడు సంజయ్ తో నీ జన్మ
శుభాకాంక్షలందుకో మంజుల సూర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మంజులా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ ఈశుభవేళా
2.విరులకున్న సౌందర్యం నీ సొత్తు
కవనంతో చేస్తావు చిత్తాలనే చిత్తు
గాత్రానికి చేయాలి న్యాయం కించిత్తు
ఆపత్తులొ సంపత్తులో వీడబోకు మైత్రి పొత్తు
సౌశీల్యం సౌహార్ద్రం సమపాళ్ళుగ నీకు సంపద
శతమానం భవతిగ వర్ధిల్లు ఆదర్శమూర్తివై సదా
శుభాకాంక్షలందుకో మంజుల సూర్యా
శుభాశీస్సులివిగో హృదయ ఔదార్యా
హ్యాపీ బర్త్ డే టూయూ మంజులా
విష్యూ హ్యాపీ బర్త్ డే టూయూ ఈశుభవేళా
చరమగీతం పాడుతోంది ధరణీతలం
మన నరజాతి సమస్తం మృత్యుదూత బాధితులం
తర్కించకు నేస్తమా మనం వెక్కుతున్న వెతలం
చితికిన బ్రతుకులతో చితికి చేరుకొనే కతలం
1.ఎటుచూడు కరోనా మృత్యు పాశమౌతోంది
ఏమరుపాటైతే మరణశాసనం రాస్తోంది
ఆరోగ్యవంతుణ్ణీ రోగిగా మారుస్తోంది
శుభ్రత పాటించకుంటే ప్రాణాల్ని కబళిస్తోంది
2.పదే పదే గుర్తు చేసినా ఏ మాత్రం చికాకుపడకు
అదే పనిగ హెచ్చరించినా బేఫికరుగ వ్యవహరించకు
కరోనా కోరల చిక్కక మూసుకోర ముక్కూమూతి
భౌతిక దూరం జరుగుతు తప్పించుక తిరుగర సుమతి
PIC courtesy:Agacharya Artist
Thursday, July 9, 2020
ఎన్ని కలాలు రాస్తాయో నిన్నుచూడగానే
కలలెన్నెన్ని వెలుస్తాయో నువ్వు చూడగానే
ఎలా వర్ణించాలో ఎప్పుడూ తికమకనే
కుదించి చెప్పడానికి గీతికైతె సతమతమే
1.కలువరేకులైతే నీ కన్నుల బోలు
కృష్ణవేణిపాయలే నీకురుల చేవ్రాలు
కనుబొమలు మాత్రం మన్మథుడి విల్లు
మేను మేనంతా వెన్నెలఝరి పరవళ్ళు
2.ఏ శిల్పి చెక్కాడో చక్కనైన నీ ముక్కు
ఎంతటివాడైనా నీ నవ్వుల వలలో చిక్కు
అనిమేషులమౌతామే నిశ్చలమై మాదృక్కు
చుబుకాన పుట్టుమచ్చా లాగుతుంది తనదిక్కు
వీడ్కోలు నేస్తమా
సెలవింక మిత్రమా
మన స్నేహం సాక్ష్యంగా
నీ సుఖమే లక్ష్యంగా
కడసారి ఈ గీతం నీకేలే అంకితం
నువులేక శూన్యమే మిగిలున్న జీవితం
1.పదేపదే ఇకనిన్ను విసిగించబోను
అదేపనిగ ఎప్పుడూ కల్లోల పర్చను
ఎలా వచ్చినానో అలా తప్పుకుంటాను
అగుపించిన మాదిరే మాయమైపోతాను
నాజ్ఞాపకాలు సైతం మదినుండి చెరిపెయ్యి
నాగురుతులేవైనా చెత్తబుట్ట పాలు చెయ్యి
2.వరదలో కొట్టుకవచ్చె పుల్లలుగా కలిసాము
క్షణకాలమైనా ఎందుకొ తోడుగా సాగాము
ఏజన్మ బంధమో ఆపాటిదైనా ఋణము
పదిలపరచుకుంటాను నీతో ఉన్న ప్రతిక్షణము
మన్నించు మనసారా ఎదగాయ పర్చానేమో
మరచిపో ఎప్పటికి నిన్ను ఏమార్చానేమో
గుండె ఉన్నవాళ్ళకే నొప్పి వస్తుంది
మనసు ఉన్నచోటనే ప్రేమ పుడుతుంది
బండారాయికేముంటుది ఆకారం అస్థిత్వం
చెక్కితే విగ్రహమై మొక్కబడుతుంది
తొక్కితే తొక్కుడు బండగ కడతేరుతుంది
1.అనుభూతులెన్నో పేర్చి నిర్మించా ప్రణయ సౌధం
స్వప్నాలను సమీకరించి ప్రకటించా అనురాగం
తుఫానులో చిక్కింది సహచర్య నావ
శిథిలమైపోయేలా బ్రతుకునే చేసినావ
ఆరాధన ఫలితం చివరకు ఆవేదనేనా
2.పరాచికమై పోయింది వలపు నీకు కేళి
చిరాకైపోతోంది నీ వ్యవహార సరళి
కాలరాచివేయకే మనవైన గురుతులను
నేలపాలు చేయకే మన భవితలను
మించిపోయిందిలేదు ఇకనైనా మేల్కొంటే
Wednesday, July 8, 2020
ప్రమద సామీప్యం కనులకు దేదీప్యం
సుదతి సావాసం మనసున మధుమాసం
అతివ సాన్నిధ్యం శుక్లపక్ష కార్తీకం
ముదిత సౌరభం జీవితానికే శుభం
కంజముఖిని కాంచగా మది రంజిస్తుంది
అలివేణి అగుపిస్తే దివే భువికి వస్తుంది
సుజఘనను చూడగా మతిచలించిపోతుంది
కలశస్తని కలికిని తిలకిస్తే శ్రుతిమించి రాగమౌతుంది
వనితే తలపున వెన్నెల్లో ఆడపిల్ల
మగువే కలలో మధురమైన రసగుల్ల
కోమలి ఊహల్లో ఎద ప్రియబాంధవి
తరుణే ఎదుటన జగములగను జనని సకల జగజ్జనని
గంగ కన్నా పరమ పునీతం
వజ్రాన్ని మించిన దృఢతరం
మన స్నేహితం అది శాశ్వతం
1.అశించుటకేమి లేనిది
పంచుకొనగ ఎంతో ఉన్నది
ఎద గానం కోరుకున్నది
మన మైత్రి అన్నది చితిదాటనున్నది
2.ప్రణాళికతొ సాధ్యపడనిది
అనూహ్యంగ ప్రాప్తమైనది
నిర్వచించ వీలుకానిది
మనదైన చెలిమి అదే మనకు కలిమి
3.కృతజ్ఞతను కాంక్షించనిది
మన్నింపును వాంఛించనిది
అభ్యర్థనలే అపేక్షించనిది
మన సౌరభం సదా సులభం
Monday, July 6, 2020
నా మనోనావ దిక్సూచికవో
విధి చేతి పాచికవో నా బ్రతుకు సంచికవో
అపురూప సాలభంజికవో
ఎన్నాళ్ళు నాకు ప్రతీక్ష ఎందుకే ప్రేమ పరీక్ష
లక్ష్యపెట్టట్టానికేల లలనా నీకీ వివక్ష
1.నింగి నీవు నేల నేను
దిక్చక్రమల్లె తోచే మన సంగమం
ఎండ నీవు వాన నేను
సింగిడినే తలపించే మన ప్రణయం
ఊహలకే పరిమితమైతే
మనుగడకు ఊతమేది
ఆశించుటె దోషమైతే
చితికి పోని జీవితమేది
2.ముంచవూ తేల్చవూ
వినోదిస్తావూ నే మునకలేస్తుంటే
ఔననవూ కాదనవూ
ఆనందిస్తావు నే సతమతమైపోతుంటే
ఒప్పుకుంటే ఇలయే నాకం
తప్పుకుంటె భవితే నరకం
కొట్టుమిట్టాడుతున్నా
నేనున్నది త్రిశంకు స్వర్గం
పరికించు ప్రకృతిని భువి దివియై దిసించదేల
అందనిదానికై అర్రులు సాచనేల
పరిసరాలు రమతిగా మలుచుకోవేల
1.ఎదుటివారుండరెపుడు నీకనుకూలంగా
పట్టువిడుపునీకుంటే ఆప్తులే జనమంతా
మార్చలేవు పరిస్థితులు నీకనుగుణంగా
పరివర్తన చెందగలవు నీవె తగిన విధంగా
2.స్పందించరెవరని వగపునీకెందుకు
పరుల ఎడల ప్రథమంగా నీవే చేయిసాచు
ఇతరులకీయగలదె ఆశించుట సబబు
ప్రశ్నించుట సరెగాని చెప్పెదవా జవాబు
Sunday, July 5, 2020
రాగం:రేవతి
నుతించినా గతిగానవైతివి గంగాధరా
నిందాస్తుతికైనను స్పందించవైతివి సతీవరా
ఎందరెన్ని తీరుల నిను మును కొనియాడిరో
ఎవ్వరేమి ఆశించి నిను మది ప్రణుతించిరో
నన్నేల సదాశివా చేరనీవు నీదరి
నాకేల మహాదేవ వేదనలీ మాదిరి
1.భగీరథుని మనోరథము నెరిగితివే
లంకేశుడహంకరించ ఒప్పితివే
పాశుపతమునర్థించ పార్థుని బ్రోచితివే
మార్కండేయుని మృత్యువు బాపితివే
నన్నేల సదాశివా చేరనీవు నీదరి
నాకేల మహాదేవ వేదనలీ మాదిరి
2.పావురాల పరిక్రమకు పరసౌఖ్యమా
శునకానికి శివరాత్రిన సాయుజ్యమా
కరినాగుల అర్చనకూ కైవల్యమా
కన్నప్ప మూఢభక్తి ముక్తిదాయమా
నన్నేల సదాశివా చేరనీవు నీదరి
నాకేల మహాదేవ వేదనలీ మాదిరి
https://youtu.be/J2JLOrauz4Q?si=_w77wlEFEa6o7XQ4
రచన,స్వరకల్పన&గానం:డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ
రాగం : మాయా మాళవ గౌళ
ఆది గురువు నీవే-పరమ గురువు నీవే
జగద్గురువు నీవే-సద్గురుడవు నీవే
గురు దక్షిణామూర్తియే నమః
ఓం శ్రీగురు దక్షిణామూర్తియే నమః
1.తొలి పలుకులు నేర్పించిన అమ్మరూపు నీవే
ఓనమాలు దిద్దించిన ప్రథమ గురువు నీవే
సందేహాలు తీర్చిన అధ్యాపకుడవు నీవే
బ్రతుకు తెఱువు చూపించిన మార్గదర్శి నీవే
గురు దక్షిణామూర్తియే నమః-ఓం శ్రీగురు దక్షిణామూర్తియే నమః
2.వేదవాఙ్మయ దాత వ్యాసుని ఆత్మనీవె
ఆదిశంకరునిగా జన్మించినదీ నీవే
గురు రాఘవేంద్రునిగా వెలసింది నీవే
మహావతార్ బాబావై ఉదయించినదీ నీవె
గురు దక్షిణామూర్తియే నమః-ఓం శ్రీగురు దక్షిణామూర్తియే నమః
3..అజ్ఞానము నెడబాపే ఆత్మగురువు నీవే
బ్రహ్మావిష్ణుమహేశ్వర స్వరూపుడవీవే
గురుదేవ దత్తుని మూల తత్వమీవే
సద్గురు సాయినాథ అవతారము నీవే
గురు దక్షిణామూర్తియే నమః-ఓం శ్రీగురు దక్షిణామూర్తియే నమః
Saturday, July 4, 2020
రాగం:మోహన
పరులకోసం బ్రతుకడ మన్నమాట అటుంచు
నీకోసమె నీకు నీవుగ ఇకనైనా జీవించు
కోల్పోతే తిరిగిరాదని తెలుసుగా సమయం
నీఎడల నీవే శ్రద్ధగా చేసుకో కాలాన్ని వినిమయం
1.ఎన్నాళ్ళైనదో నిలువుటద్దం ముందు నిలిచి
తేరిపార ఆసక్తిగా నిన్ను నీవే పరికించి చూచి
ఎన్నిమార్పులు చేర్పులో నీదైన దేహస్థితిలో
వన్నెలెన్ని తరిగెనో వడిగ సాగే కాలగతిలో
ఎపుడుతీరునొ బ్రతుకు పరుగున ఆయాసం
ఎపుడుదొరుకునొ నీది మాత్రమే ఐన నిమిషం
2.నీలొకి నీవే తొంగిచూసిన సందర్భమే లేదు
నీతొ నీవే గడుపగలిగిన క్షణమొక్కటైన లేదు
చల్లగాలిని చందమామను అనుభూతి చెందావా
వాన ధారను వాగు ఈతను ఆస్వాదించావా
సమయమేదను సాకును నీకోసమైనా మరచిపో
బాల్యమిత్రుల స్నేహితాన్ని ఇపుడైన అందిపుచ్చుకో
రాగం:కళ్యాణి
నిష్కామకర్మలే ఉత్కృష్టమైనవి
కర్మఫలాలేవైనా అన్నీ దైవానివి
కర్తవ్యపాలనయే కర్మానుష్ఠానము
నిస్పక్షపాతమే ఆచరించ శ్రేష్ఠము
వెంటాడును జన్మలు దాటి మన కర్మలు
వేధించును వ్యాధులతోని దుష్కర్మలు
1.యథాతథంగ స్వీకరించు జీవితం
అతిగా ఆశిస్తే అడియాసయె సంప్రాప్తం
వెతలన్నీ కతలేలే కలతల జతలేలే
అహమునొదల ఇహమున సుఖమేలే
వెంటాడును జన్మలు దాటి మన కర్మలు
వేధించును వ్యాధులతోని దుష్కర్మలు
2.సమర్పణ భావనే శిరోధార్యము
స్వీయాపాదనే ఫలితమందు వ్యర్థము
వికసించాలి ఎద ఎద ఔదార్యము
వసుధైక కుటుంబమే మనుగడ ఔషధము
వెంటాడును జన్మలు దాటి మన కర్మలు
వేధించును వ్యాధులతోని దుష్కర్మలు
Friday, July 3, 2020
మనసు విప్పాలనుంది మాట కలపాలనుంది
దాగుడుమూతలేల ధవళాంగి
గుండెలో గోప్యమేల కోమలాంగి
1.పొద్దుపొడుపు చూడగ నీ నుదుటిబొట్టు గుర్తొచ్చే
నింగిలో సింగిడి గాంచ నీ హంగులే స్ఫురించే
గోరింటాకు కనగ నీ అరిచేతుల ఎరుపు తోచె
సెలయేటి గలగలలే నీ నవ్వులు స్మృతికి దెచ్చె
ప్రకృతిలో ప్రతిదృశ్యం తలపించె నీ రూపం
ఓపలేను ఇక జాప్యం నీ దర్శనమవశ్యం
2.నా కోసం ఎంతగా ఎదిరిచూస్తున్నావో
మన ఎడబాటును ఎలా సహిస్తున్నావో
శుకమును చేరలేని శాపగ్రస్త శారికనే నేను
నా రాకను ప్రతీక్షించె అభిసారిక నీవైనావు
ఓర్వలేని విధి మనలను ఈ విధి వేధించే
జ్ఞాపకాలె కాలుతున్న విరహాగ్నిని చల్లార్చే
Thursday, July 2, 2020
"తస్మాత్ జాగ్రత జాగ్రత"
సాయీ అని పిలిచిచూడు
ఓయీ యని పలుకుతాడు
బాబా అని శరణు వేడూ
కంటికి రెప్పలా కాపాడుతాడు
సాయీ సాయీ సాయీ
బాబా బాబా బాబా
1.మనసారా సాయిని స్మరించు
తక్షణమే నీముందు అవతరించు
నోరారా బాబా యని భజించు
జన్మాంతర పాపాలూ అంతరించు
సాయి ధ్యాసయే ఒక యోగము
చేసుకో అనుక్షణం సద్వినియోగము
సాయీ సాయీ సాయీ
బాబా బాబా బాబా
2.సాయి సేవచేయుచూ తరించు
సకల భాగ్యాలు తాముగా వరించు
బాబా బోధలనే సదా ఆచరించు
బ్రతుకు నల్లేరు నడకయని గ్రహించు
సాయి సన్నిధే పరమ పెన్నిధి
బాబా అనుగ్రహమే జీవిత పరమావధి
సాయీ సాయీ సాయీ
బాబా బాబా బాబా
మొత్తుకున్నా పెడసెవిన మాట పెట్టవడ్తివి
రంగమ్మా నీ నంగనాచి నాటకాలు సాలుసాలు
నా గుండెకాయ నీదేనని తెల్సుకుంటె మేలుమేలు
మూణ్ణాళ్ళ ముచ్చటాయే ముద్దుమురిపాలు
నూరేళ్ళ పంటకదే అల్లుకుంటె మన బతుకులు
1.మోటబావికాడ నాకు సైగలేవొ జేస్తివి
సేనుగట్టుకాడ నీ సేయినాకు తగిలిస్తివి
ఏపసెట్టు నీడలోన నడుమొంపును సూపిస్తివి
మంచెమీద నీ పెయ్యిని మంచమల్లె పరిస్తివి
మూణ్ణాళ్ళ ముచ్చటాయే ముద్దుమురిపాలు
నూరేళ్ళ పంటకదే అల్లుకుంటె మన బతుకులు
2.మావితోపుకాడికైతె మరిమరి రమ్మంటివి
దాచుకున్న రెండు పళ్ళు నాకని తీసిస్తివి
ముద్దుగుమ్మ గుమ్మపాలు కమ్మగ తాపిస్తివి
సావకుండ సర్గమేంటో సవిసూపిస్తివి
మూణ్ణాళ్ళ ముచ్చటాయే ముద్దుమురిపాలు
నూరేళ్ళ పంటకదే అల్లుకుంటె మన బతుకులు
Wednesday, July 1, 2020
ముంగురులు చెప్పే ముచ్చట లేమిటో
ముసిముసి నవ్వులు పూసే ఘటనలు ఏవిటో
ఏ జ్ఞాపకాలు బుగ్గల సిగ్గుల నద్దేనో
ఏ వింతమైకాలు ఒంటిని కమ్మేనో
నీలో నీవే నేనుగా నాలో నేనూ నీవుగా
తడిసేము రేయి పగలు తలపులు ముంచగా
1.నీరెండ పోల్చుకుంది నీ మేని మెరుపుని
బొండుమల్లె తేల్చుకుంది తను కాస్త నలుపని
పచ్చదనం నినుమెచ్చి అలుముకుంది కోకగా
పసిడిగుణం తనువిచ్చి అల్లుకుంది అలవోకగా
నీలో నీవే నేనుగా నాలో నేనూ నీవుగా
నా ఊహల రూపం నీవేగా నీ కలల కల్పన నేనేగా
2.చిత్తరువయ్యాను నీ చిత్తరువు గని నేను
గమ్మత్తుగ చిత్తైనాను కించిత్తు స్పందిస్తేను
ఆషాఢ మాసాలు పడుచుజంటలకు శాపాలు
కరోనా అంతరాలు చేరనీవు మన తీరాలు
నీలో నీవే నేనుగా నాలో నేనూ నీవుగా
నన్నావరించే సౌగంధి నీవు నిన్నలరించే గాంధర్వం నేను
మరచిపోతే ఎలా నా చెలీ
నను విడిచిపోకే ఓ జాబిలీ
మగువకే సాధ్యమౌనేమో నిర్లక్ష్యము
పడతికే అలవాటేమో ఈ టక్కరితనము
కాలిబంతిలాగా నన్నాడుకుంటున్నావే
పూలచెండులాగా ననువాడుకుంటున్నావే
తగదెనీకు తుంటరితనము-మానవే నెరజాణతనము
నన్నుంచుకోవే నీ తలపులోనా-నన్నుండనీవే నీ గుండెలోనా
మదిలోన మంటలు రేపి జారుకుంటావు
బ్రతుకంతా అలజడిరేపి తుర్రుమంటావు
అనురాగం అన్నదే యోగం-మనలేనే నీ వియోగం
మృతివరకు నిన్నే నే కోరుకుంటా-చితి చేరినాగాని నినువదలనంటా
రాగం:రేవతి
ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం
చాతుర్మాస్యదీక్షకు ఈనాడే శ్రీకారం
అలసిన శ్రీహరి విశ్రమించు శుభతరుణం
పరిశుభ్రత శమదమ నియమ పాలన ఆచరణీయం
1.ఆరోగ్యానికే అగ్రతాంబూలం ఏకాదశి మర్మం
జాగరణ ఉపవాసం పండగ అంతరార్థం
చలవ పదార్థాల విస్మరించుటే పరమార్థం
వ్యాధులు ప్రబలకుండ చేపట్టే చర్యలసారం
2.విష్ణునామ సంకీర్తన శ్రేయోదాయకం
విష్ణుప్రియ కన్యను సేవించుట పుణ్యప్రదం
విష్ణుతత్వ జిజ్ఞాస చేర్చునులే పరమపదం
విష్ణు భక్తులమై పొందాలి జన్మసాఫల్యం
రాగం:మోహన
ప్రధాని పదవే వచ్చింది తానుగా వరించి
ఆర్థిక సంస్కర్తగ నవభారత విరించి
నేడు జగమెరిగిన పీవిగారి శతజయంతి
జేజేలు పలుకుతోంది తెలుగుజాతి గర్వించి
జయహో పాములపర్తి వేంకట నరసింహారావు
జోహార్ నీకిదే తొలి తెలుగు ప్రధానిగా మరపురావు
1.బహుభాషా ధురీణుడు అపర చాణక్యుడు
తెలంగాణ మాగాణి పుత్రుడు రాజకీయ పవిత్రుడు
కాంగ్రేస్ విశ్వసనీయుడు గాంధీ పరివార విధేయుడు
కవిగా పండిత ప్రకండునిగా పేరొందిన వరేణ్యుడు
జయహో పాములపర్తి వేంకట నరసింహారావు
జోహార్ నీకిదే తొలి తెలుగు ప్రధానిగా మరపురావు
2.నిదానమే ప్రధానమని ఆచరించినవాడు
ఆచితూచి అడుగేసిన మంత్రాంగ యోధుడు
ముభావమే సర్వదా భావ ప్రకటనైనవాడు
పక్కా నిర్ణయాలె ప్రతీతిగా కలిగినవాడు
జయహో పాములపర్తి వేంకట నరసింహారావు
జోహార్ నీకిదే తొలి తెలుగు ప్రధానిగా మరపురావు
3.నిరాడంబరుడు నిగర్వి తాను నిస్పక్షపాతి
ప్రపంచాన ఇనుమడింపగచేసె భరతఖ్యాతి
తెలంగాణ మకుటంలో పివి కలికితురాయి
భారతరత్నమై వెలుగొందుటె తరువాయి
జయహో పాములపర్తి వేంకట నరసింహారావు
జోహార్ నీకిదే తొలి తెలుగు ప్రధానిగా మరపురావు
Sunday, June 28, 2020
రాగం:శహనా
వందే విశ్వంభరా
నమోస్తుతే ఋతంబరా
ధన్యోహం దిగంబరా
దండంబులు గొనుమిదే హరా నిరాడంబరా
1.ఎలా నీకు తెలుపగలను కృతజ్ఞత
ఎలా ప్రకటించను నా విశ్వసనీయత
ఏవిధి ఎరుకపరుచగలను నా భక్తి ప్రపత్తత
ఏ రీతి మెప్పించను మార్కండేయవినుత
ధన్యోహం దిగంబరా
దండంబులు గొనుమిదే హరా నిరాడంబరా
2.ఉత్కృష్టమౌ ఈ నరజన్మ నిచ్చావు
ఆరోగ్యభాగ్యాలు నాకొసగినావు
చక్కని ధారా పుత్రుల దయచేసినావు
మిక్కిలి కవన ప్రతిభ వరమిచ్చినావు
ధన్యోహం దిగంబరా
దండంబులు గొనుమిదే హరా నిరాడంబరా
మల్లెలకెంత తొందర-నీ జళ్ళో మాలగా అలరొందాలని
వెన్నెలకెంత ఆత్రుత-నీ ఒళ్ళు ఒళ్ళంతా పరుచుకోవాలని
తుమ్మెద కెంత కోరిక-నీ ముఖకమలంపై వాలాలని
ముత్యాలకొకే వేడుక-నీ నగవుల జల్లుగా రాలాలని
1.కిన్నెరసాని నీ నడకచూసాకే-మెలికలు తిరిగింది
పెన్నానది నీ నడుము కనగానే-అలకను పూనింది
కృష్ణవేణి నీ కురుల నలుపుచూసి-తలవంచుక సాగింది
పాపికొండల గోదారి నీ గుండెల ఉన్నతికి-అచ్చెరువొందింది
2.నర్మదానది లోయనే లోతైన -నీ నాభిని తలపించింది
తపతీ నది అందమైన ప్రవాహమే-నీ నూగారును పోలింది
తుంగభద్ర సంగమించ నిను మెళకువలడిగింది
కావేరి నీమేని సోయగాలకే నిలువెల్లా నీరయ్యింది
ఆమె:
తనువుకే యవ్వనం ముసలితనం
అతను:
మనసన్నది ఎప్పుడూ అజరామరం
ఆమె:
అందాన్ని ఇనుమడించు హుందాతనం
అతను:
నిండైన కట్టుబొట్టు నెలతకు సింగారం
అతను:
1.అరమరికలే లేని అపురూప కాపురం
సాంగత్యమె నిత్యమైన సిసలైన దాంపత్యం
అలకలు కలనైన కనరాని సంసారం
అతివ చతురతతొ ఔతుంది గృహమే స్వర్గం
ఆమె:
2.కుటుంబమంతటి శ్రేయస్సే ఏకైక లక్ష్యం
సంతానపు ఔన్నత్యమే చేరిన శిఖరం
ఎదలోన అనురాగం ఎదుటేమో గంభీరం
మగధీరుడే మగనాలికి ఆరాధ్య దైవం
నీపదము తడిసింది స్వామి
నా అశ్రుధారతోని
గుడి మారుమ్రోగె వినవేమి
నా హృదయఘోష తోని
మిన్నకుందువేమి గోవిందా
నన్నుగానవేమీ ముకుందా
1.కన్నతండ్రివీవు చిన్నకొడుకునే నేను
చేయవైతివేల గారాబము
తప్పులెన్నబోకు గొప్పలేవిలేవు నాకు
మన్నించవేల నా అజ్ఞానము
పెంకెతనం మంకుతనం సహజమే కదా
మిన్నకుందువేమి గోవిందా
నన్నుగానవేమీ ముకుందా
2.శుంఠనై మిగిలాను మూఢునిగ మసిలాను
శ్రద్ధగా నీవే బుద్ధిగరపక
మొరవెట్టుకున్నాను నిన్ను తిట్టుకున్నాను
నా అవసరాలు నెరవేరక
సన్మార్గం చూపే బాధ్యత నీదే సదా
మిన్నకుందువేమి గోవిందా
నన్నుగానవేమీ ముకుందా
చలికాలమైనా మేనంతా చెమటలే
తానమాడినా గానీ తనువంతా మంటలే
వేగలేకపోతోంది అంగాగం నీవిరహం
తాళజాలకుంది తపన రేగి నాదేహం
రారా సఖా ప్రియ ప్రేమికా-నా పరువమే నీకు కానుకా
1.పిచ్చుకల జంటకాస్తా ఇచ్ఛ రెచ్చగొడుతోంది
కపోతాల జతసైతం రచ్చ రచ్చ చేసేస్తోంది
చిలుకాగోరింకల మిథునం కలకలం రేపుతోంది
అభిసారిక ఆవహించి కామార్తి బుసకొడుతోంది
రారా సఖా ప్రియ ప్రేమికా-నా పరువమే నీకు కానుకా
2.ఏకధార జలపాతం సరస్సులో దూకుతోంది
పుడమి చీల్చుకొంటూ మొలక వెలికి వచ్చింది
సెలయేటి కౌగిట కొండ ఒదిగిపోయింది
పదపడుతు నదితానే కడలితో సంగమించింది
రారా సఖా ప్రియ ప్రేమికా-నా పరువమే నీకు కానుకా
జీవితమే చింతల నాటకం
జీవితమే వింతల బూటకం
మనిషికి మనసుకి మధ్యన దొంగాటకం
మనిషికి మనిషికీ నడుమన పితలాటకం
1.రమణి చుట్టు తిరిగే రంగులరాట్నం
గొడ్డు చాకిరితో తిరిగే గానుగ చట్రం
కూపస్థ మండూకం తనలోకమె మైకం
జనన మరణ వలయంలో చిక్కిన జీవితం
2.భావానికి భాషణకు ఎంతటి అంతరం
కార్యానికి వచనానికి పొంతన బహుదూరం
సాటివారి సంక్షేమం మృగతృష్ణతొ సమానం
చిన్నారి నాబొజ్జకు శ్రీరామరక్షయే ప్రమాణం
Thursday, June 25, 2020
తిప్పలెన్నె నీతోటి చక్కని నా ప్రేయసి
కలుసుకోనీయి కలల ఇంటి తలుపు తీసి
మరపురాని ఆనుభూతులనే నాకందజేసీ
1. భాష అడ్డుకాబోదు మన కాపురాన
కులం మతం ప్రసక్తిరాదు ప్రేమ గోపురాన
పేద ధనిక భేదం లేదు ప్రణయపురాన
జాతి ప్రాంత వివక్షలేదు సంసార తీరాన
కలుసుకోనీయి కలల ఇంటి తలుపు తీసి
మరపురాని ఆనుభూతులనే నాకందజేసీ
2.ఆధిపత్య పోరు ఉండదు దాంపత్యాన
శంకకింక తావులేదు ఇరువురి మధ్యన
అలకలకు చోటేలేదు సరే అన్న మాట మినహా
అపోహలకు వీలులేదు ఒకే భావమైన తరహా
కలుసుకోనీయి కలల ఇంటి తలుపు తీసి
మరపురాని ఆనుభూతులనే నాకందజేసీ
OK
చెలియా చెలియా చేయకే గారడీ
లవ్ నే మార్చకే ప్యార్ కీ ప్యారెడీ
సయ్యంటే సయ్యంటూ దేనికైనా నేను రెడీ
సరదాల పేరిట కొట్టించకు నను బురిడీ
1.చాటింగ్ మీటింగ్ డేటింగ్ అన్నిటికీ నేనోకే
ఫైటింగ్ చీటింగ్ బ్రేకింగ్ అంటే మాత్రం చికాకే
షాపింగ్ చేసెయ్ టైమెంతైనా అవనీ హోటల్ బిల్లెంతైనా
బోర్ కొట్టే దూరాలకు ఎంతటి లాంగ్ రైడైనా
2.పబ్బుల్లో స్పెండ్ చేద్దాం లేట్ నైటైనా
పార్టీలలో ఎంజాయ్ చేద్దాం ఎంత ఖర్చైనా
వీకెండ్ రోజున రిసార్ట్స్ కెళ్ళి మజా మరాయిద్దాం ఇకపైన
మల్టీ ప్లెక్స్ కార్నర్ సీట్లలొ ఖుషీగ తిందాం పాప్ కార్నైనా
వందల మందిరాలు సాయీ నీకు
లక్షలాది భక్తజనాలు
దినమంతా పూజలూ అర్చనలు
రోజుకైదు నీరాజనాలు
నిత్యనైవేద్యాలూ భోజనాలు
ఐనా ఏమి పొందినాము బాబా ప్రయోజనాలు
1.రాసాను కీర్తిస్తూ ఎనలేని గీతాలు
నీ గుణ గానాలు నామ భజనలు
చేసాను దీనులకు సేవలు దానాలు
మోసాను నువ్వెక్కిన పల్లకీ పలుమార్లు
ధరించాను ధుని విభూతి అన్నిదినాలు
ఐనా ఏమి పొందినాము బాబా ప్రయోజనాలు
2.ముగించాను సచ్చరిత్ర పారాయణాలు
చేసాను షిర్డియాత్ర ప్రయాణాలు
కన్నాను కనులారా నీ సమాధి విభవాలు
స్పృశించాను నువు తిరిగిన ప్రదేశాలు
విన్నాను నువు తెలిపిన సూత్రాలు బోధనలు
ఐనా ఏమి పొందినాము బాబా ప్రయోజనాలు
పాట రాసేదే నీకోసం-నీవుంటే మధుమాసం
వరమీయి దరహాసం-తాళజాల నే మోసం
మెలితిరిగేను నిను చూసి నా మీసం
నిరంతం నీ సన్నిధిలో అంతులేని సంతసం
1.వంచాను అందుకో నీలాల ఆకసం
దించాను హరివిల్లు చేసుకో కైవసం
పెంచాను పూవనం కోసుకో సుమ మానసం
పోషించానీ గీతంలో ఆసాంతం సరసరసం
2.తారామణులను త్రెంచుకొచ్చి మెళ్ళోమాలవేస్తా
చందమామను తీసుకొచ్చి గుమ్మాన తగిలిస్తా
కీలుగుర్రం ఎక్కివచ్చి నిన్నెత్తుకొని వెళతా
దేవలోక సామ్రాజ్ఞిగా నీకే నే పట్టం కడతా
Wednesday, June 24, 2020
పిడికిట నొక్కినా ఉంటుంది గుప్పెడు
మంటబెట్టి మసిచేసినా కత్తిబెట్టి కోసేసినా
నీకోసమే కొట్టుకుంటోంది నా గుండె
నీ నామమే జపిస్తూ మిన్నకుండె
1.ఎవడుకనిపెట్టాడో గాని ప్రేమ అన్న ఈ పదాన్ని
ఎలా అంటగట్టాడో ఏమో లలనతో అనుబంధాన్ని
వ్యాపకాలన్నిటికీ తిలోదకాలిచ్చేలా
వ్యామోహపు వలలోనా పడిచచ్చేలా
మధురమైన ప్రణయానా ఈ మరణయాతన
తగదునీకు నెచ్చెలీ దూరమౌట జీవితాన
2.నారి మనసు మర్మమేదో హరికైనా తెలియదంట
పడతి యోచనేంటో పరమేశ్వరుడెరుగడంట
మాయలోడి ప్రాణం చిలుకలోనా
నా పంచప్రాణాలు నీ పలుకులోనా
ఔనని మననీయి నీపాద దాసునిగా
అందాల చేయందీయి పడిఉంటా బంధీగా