రాగం:చక్రవాకం
ఎన్ని రూపాలలో ఎదురౌతావు
నా కెన్నివిధాలుగా స్వామీ తోడౌతావు
విశ్వమంత నా కొరకే సృష్టించావు
వినోదించ నాతోనే నాటకాలాడేవు
పరంధామా పాహిపాహి శరణు
నీవే నావాడవైతె ఇంకేమి కోరను
1.అమ్మవు నీవయ్యీ కని పెంచావు
నాన్నవు నీవై నను పోషించావు
గురువుగాను మారి నను తీర్చిదిద్దావు
నేస్తానివై చేరి నన్ననుసరించేవు
అవసరాని కాదుకొనే దాతవైనావు
నా జీవిత గమనంలో ఊతమైనావు
పురుషోత్తమా పాహి శరణు శరణు
నా కొరకే నీవుంటే ఇంకేమి కోరను
2.సహధర్మచారిణిగా నన్నలరించేవు
నా సుందర నందునిగా సేవలు బడసేవు
నా జ్యేష్ట తనయుడివై ఆలంబన నిచ్చేవు
అనూజుల పాత్రల్లో అండదండవైనావు
నా సాటి మానవునిగా గుణ పాఠాలు నేర్పేవు
మమతతో మనగలిగేలా నాకు మనసునిచ్చావు
పరమాత్మా ప్రభో శరణు శరణు శరణు
నువ్వే నేనైనప్పుడు ఇంకేమి కోరను